అబలా సచ్చరిత్ర రత్నమాల/ఖడ్గతిక్కన భార్య

ఖడ్గతిక్కన భార్య

  • అమృతం సద్గుణాభార్యా.

ఈ యువతీరత్నముయొక్క నామథేయ మయినను తెలియనందువలన నీమె భర్తపేరిటనే యీమెను జనులు గుర్తించెదరు. 13 వ శతాబ్దమున సూర్యవంశపు రాజగు మనుమసిద్ధి నెల్లూరుమండలము పాలింపుచుండెను. ఆయన యాస్థానమునందున్న కవితిక్కన, కార్యతిక్కన, ఖడ్గతిక్కన యను సహోదరులలో బరాక్రమవంతుడగు ఖడ్గతిక్కన కీమె భార్య. ఈ ఖడ్గతిక్కన నియోగిబ్రాహ్మణుడు. ఈయన తన పరాక్రమమువలన రాజుచే మిగుల మన్నింపబడుచుండెను.

ఖడ్గతిక్కనభార్య విద్యావతియు, గుణవతియునై సదాపతి శ్రేయమునేకోరుచుండెను. ఆమె భర్త చేసినదంతయు మంచిపని యని యూరకుండక, యాతడేదేని కానికార్యము చేయదలచినయెడల, తన చాతుర్యమువలన నాతనిచే నట్టి కార్యము జరుగకుండ జేయుచుండెను. ఇందునకు నిదర్శనముగా నొకప్పుడామె చేసిన చాతుర్య మిం దుదహరించెదను.

ఒకానొక సమయమున రాజగు మనుమసిద్ధిపై శత్రురాజులు దండెత్తి వచ్చిరి. అపుడు కొంత సైన్యమును తోడిచ్చి రాజు ఖడ్గతిక్కనను శత్రువులతో యుద్ధమున కంపెను. ఖడ్గతిక్కన యెంతటి శౌర్యవంతుడయినను, వైరు లధికసైన్యసహితు


  • సద్గుణవతియగు భార్య అమృతమువలె హితకరురాలు. లగుటచే నీతని శౌర్య మేమియు వినియోగింపకుండెను. ఇట్లు కొంతవడి పోరాడి తనకు జయముకలుగునన్న యాస సున్నయగుటచే, ఖడ్గతిక్కన యుద్ధభూమినుండిపారి తన గృహమునకు వచ్చెను.

పరుల కోడి తనభర్త పారివచ్చుట విని మానవతియగు నాతని కాంత మిగుల చింతించి, సమయోచితబుద్ధిగలది యగుటచే పెనిమిటి వచ్చులోపల మరుగు స్థలమునందు స్నానజలముంచి నీళ్లబిందెకు పసపుముద్ద యంటించెను. ఇట్లు స్త్రీలు స్నానము చేయుటకు నావశ్యకమగు వస్తువు లచ్చట నుంచి యామె భర్తరాగానే యాదరింపక తిరస్కారముగా స్నానము చేయుడని చెప్పెను.

తిక్కన తనభార్య ముఖమునందలి తిరస్కారభావమును గని యపుడేమియు ననక, స్నానమున కరిగెను. అచట నాడువారి కుంచునట్లొకమంచ మడ్డముగానుంచి, నీళ్లబిందెకు పసుపు ముద్ద యద్దుట గని, తిక్కన యది తాను యుద్ధమునుండి పారివచ్చినందుకు భార్య తనను దిరస్కరించుటకై చేసిన పనియని తెలిసికొనెను. అయినను ఆయన యంతటితో నూరకుండక తన భార్యను బిలిచి యిది యేమియని యడిగెను. అంతనా వీరపత్ని యాతనికి పౌరుషము కలుగుటకై ఈ పద్యము జదివెను-

క. పగరకు వెన్నిచ్చినచో| నగరే నిను మగతనంపు నాయకులందున్ ?
   ముగురాడువారమైతిమి| వగ పేటికి జలకమాడ వచ్చినచోటన్ ?

ఇదివరకు అత్తకోడండ్ర మిద్దరమే యింట స్త్రీల ముంటిమి. ఇప్పుడు మీరు యుద్ధము వదలి పారివచ్చినందునస్త్రీ సమానులరయితిరి. గాన, నింట ముగ్గురు స్త్రీలమయినా మన్న యర్థముగల యీ వాక్యములు చెవిసోకిన వెంటనే ఖడ్గతిక్కన మిగుల లజ్జించి యపుడే మరల యుద్ధమున కరిగి మిగుల కీర్తి గాంచెను. కొంద రిది యంతయు దిక్కన తల్లియొక్కపని యనియెదరు. ఇట్లుపూర్వ మాంధ్రదేశమునందు పూజనీయలగు వీరపత్నులు, వీరమాతలు, వీరభగినులు అనేకు లుండుట వలననే ఆంధ్రదేశములోని బ్రాహ్మణులలోగూడ క్షాత్రతేజ మత్యంత ప్రబలమై యుండెనని చెప్పుటకు సందేహములేదు.


_______