మొల్ల

   కిం కులేన విశాలేన విద్యాహీనేన దేహినాం
   దుష్కులం చాపి విదుషో దేవైగపి సుపూజ్యతే*

మొల్ల యాత్మకూరి కేశయసెట్టి కూతురు. ఈమె కులాలవంశ సంభూతయని పరంపరగా వాడుక వచ్చుచున్నది. ఆంధ్రమునందు నీమె రామాయణము రచించినందున నీమెకీర్తి జగములో నజరామరమై యున్నది. ఈ యువతి 16 వ శతాబ్దారంభమున నున్న ట్లూహింపబడు చున్నది.

    ... ... ... ...గోప
    వరపు శ్రీకంఠమల్లేశు వరము చేత| నెఱి గవిత్వంబు చెప్పగ నేర్చినాను.

అని చెప్పుకొనుటచే, నీమె నివాసస్థలము నెల్లూరిమండలములోని గోపవరమన తెలియుచున్నది. ఈమె రామాయణము చదివినవారంద రీమెకు దెనుగున దత్యంత ప్రావీణ్యముండెనని యొప్పుకొనక మానరు. ఈమె కవిత్వము మృదు మధురమై, 'తేనె సోక నోరు తియ్యన యగురీతి, దోడ నర్థమెల్ల' దోచునదియై, 'గూడశబ్దవితతి కొట్లాట' లేనిదియై, ద్రాక్షాపాకమై యొప్పుచున్నది. గూడపదగుంభనముచే నర్థకాఠిన్యము సాధించి చదువరుల బాధపెట్టుట యామె కెంతమాత్రమును ఇష్టము


  • శ్రేష్ఠమైన కులములందు బుట్టివిద్య లేకుండిన నేమి లాభము? నీచకులమునందు బుట్టినను విద్యావంతులైనవారు అందరికి బూజ్యులు. అనగా కులము ప్రధానము గాదు; గుణమే ప్రధాన మన్నమాట. లేదు. కవిత్వధోరణి యెట్టులుండవలయునో యన్న విషయమై యీమె సుందరమైన మూడు పద్యములు వ్రాసియుంచినది. ఆ మూడు పద్యములు కవిత్వము జెప్పువారందరును తమతమ హృత్పటములమీద వ్రాసియుంచుకొనదగినవి. అవిఏవియన-

క. మును సంస్కృతంబు తేటగ | దెనిగించెడిచోట నేమి తెలియకయుండన్
   దనవిద్య మెఱయగ్రమ్మఱ| ఘనముగ సంస్కృతము చెప్పగా రుచియగునే?

గీ. తేనె సోక నోరు తియ్యన యగురీతి దోడనర్థ మెల్ల దోచకున్న
   గూడశబ్దవితతి కొట్లాటపని యెల్ల మూగచెవిటివారి ముచ్చటరయ

క. కందునమాటల సామెత లందముగా గూర్చి చెప్పనవితెనుగునకుం
   బొందై రుచియై వీనుల విందై మరి కానిపించు విబుధుల కెల్లన్.

మొల్లకు గవిత్వస్ఫూర్తి విశేషముగా నుండినందున నామె యాశుకవిత్వము సులభముగా జేయుచుండెను. మొల్ల తలయంటికొని స్నానముచేసిన పిదప రామాయణరచన కారంభమును చేసి తల వెంట్రుకలారులోపల నొక కాండమును ముగించెనని లోకవార్త గలదు. "అక్కడక్కడ గొన్ని వ్యాకరణదోషము లున్నను మొత్తముమీద నీమె కవిత్వము మిక్కిలి మృదువై; మధురమై రసవంతముగా నున్నది. ఈ రామాయణము గొంతకాలము క్రిందటివరకును వీధిబడులలో బాలురకు పాఠమునుగా జెప్పుచుండిరి. ఇది పురుషులు చెప్పిన గ్రంథములలో ననేకములకంటె మనోజ్ఞమై ప్రౌడమై యున్నది." అని కవిచరిత్రకారులీమె కవిత్వమును గురించి వ్రాసియున్నారు. మొల్లభక్తిపూర్వకముగా రచియించిన రామాయణము మొల్లరామాయణమను పేరిట నాంధ్ర దేశమునం దంతటను సువిఖ్యాతమే. ఈ రామాయణములోని కొంతభాగము ప్రవేశపరీక్షకు బఠనీయ గ్రంథముగా నప్పుడప్పుడు నియమింపబడియున్నది. ఇందువలన నీ రామాయణ మొక శ్రేష్ఠమైనకావ్యమని స్పష్టమగుచున్నది. ఈమె కవనధోరణి దెలుపుటకయి మొల్ల రామాయణమునందలి కొన్ని పద్యముల నిందుదాహరించెదను.

ఉ. రాజులు కాంతియందు రతిరాజులు రూపమునందు వాహినీ
   రాజులు దానమందు మృగరాజులు విక్రమ కేళియందు గో
   రాజులు భోగమందు దినరాజులు సంతత తేజమందు రా
   రాజులు మానమందు నగరంబున రాజకుమారు లందరున్.

ఉ. సాలముపొంత నిల్చి రఘు సత్తము డమ్మరివోసి శబ్దవి
   న్మూలము గాంగ విల్ దివిచి ముష్టియు దృష్టియు గూర్పి గోత్రభృ
   త్కూలము వజ్రపాతహతి గూలువిధంబున గూల నేసె న
   వ్వాలి బ్రతాపశాలి మృడువందనశీలి సురాలి మెచ్చంగన్.

ఉ. పున్నమచందరుం దెగడి పొల్పెసలారెడు మోముదమ్మియున్
   గన్నులు కల్వరేకులను గాంతి జయించకుం గాని రక్తిమన్
   జెన్ను దొలంగి యుండ వరచేతులు బాదములున్ దలంపం గా
   నున్నవి వర్ణముల్ గలిగి యెప్పు తొరంగదు రాఘవేశ్వరా.

ఈ మొల్ల కుమ్మరకులమునం దుద్భవించియు దన విద్య వలన నుచ్చవర్ణమువారిచే గూడ గౌరవింపబడ బాత్రురాలాయెను. ఇట్టివిద్య మా సోదరీమణుల కందరకును గలిగిన యెడల మనదేశ మితరదేశము లన్నిటికిని మాన్యస్థాన మగుననుట కెంతమాత్రమును సందియము లేదు.


________