అబద్ధాల వేట - నిజాల బాట/21వ శతాబ్దంలోకి పోబోయే ముందు మానవతావాదానికి మైనారిటీ తీరాలి
పోలీసులు ఉన్నారు గనుక మనం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నామనటం తప్పు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తే మనకూ సౌకర్యంగా ఉంటుందీ, ఇతరులకూ అనుకూలంగా ఉంటుందీ, సమాజం సాఫీగా నడుస్తుంది. మనిషి నీతిగా, రీతిగా హేతుబద్ధంగా ఉండటం మనకు, తోటివారికీ,సంఘానికి మంచిదని మానవతావాదం చెపుతుంది. మరణించిన తరువాత దేవుడు రక్షిస్తాడు గనుక, నరకంలో యమయాతనలు పడవలసి వస్తుంది గనుక అధమాధమ పునర్జన్మఎత్తవలసి వస్తుంది- తాము చెప్పిన నీతిని పాటించమని మత శాస్త్రాలూ,పురోహితవర్గాలు ఘోషించాయి. పదుగురాడు మాట పాటియై ధరజెల్లు అన్న గొర్రెలమంద ధోరణిని మూఢనమ్మకాలు ప్రోత్సహిస్తాయి. కొందరు అనుభవిస్తూ, ఇతరులను అణచివేస్తూ, అందుకు తగ్గట్టుగా, ధర్మం, కర్మం,దైవం అంటూ జనాన్ని మత్తులో అట్టిపెట్టి-కొత్తభావాలూ, ఆలోచనలూ తప్పు అని మతాలు చెబుతూ వచ్చాయి. ఇందుకు భిన్నంగా మానవతావాదం విజ్ఞాన పంధాను ఎంపిక చేసుకున్నది. ప్రవాహానికి ఎదురీదింది. దీని వలన సైంసు పుట్టింది. మానవ పురోగతికీ, నిరంతర అభ్యుదయానికి విజ్ఞానం తోడ్పడుతున్నది. ఎప్పటికప్పుడు విజ్ఞానాన్ని పక్కదారులు పట్టించడానికి మతం ప్రయత్నిస్తూనే ఉన్నది. ఆ ప్రయత్నంలో ఓడిపోయి ఇప్పుడిప్పుడే మతం కూడా విజ్ఞాన పంధాలను అనుసరించి ఆవిర్భవించిందని చెపుతున్నారు. ఇందులోని ప్రమాదాన్ని వారు గ్రహించలేదు. విజ్ఞానం స్థిరమైనది కాదు. శాశ్వతమైనది కాదు. ఎప్పటికప్పుడు కొత్తవి కనిపెడుతూ, వాటిలోని దోషాలు సవరించుకుంటూ, అనంతంగా పయనిస్తూ ఉంటుంది. మతం కొన్ని ప్రమాణాలను అంటిపెట్టుకొని, అవి ప్రశ్నించటానికి వీలులేనివనీ, అధికారికంగా చాటుతుంది. కనుక మతం శాస్త్రీయమంటే రుజువుకు నిలబడాలని, లేకుంటే తృణీకరించాలని అర్థం. మానవతావాదం మాత్రమే అందుకు సిద్ధపడగలదు.
వ్యక్తికీ, సమాజానికీ ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకొని మానవతావాదం కొన్ని విలువలనూ, ప్రమాణాలనూ రూపొందిస్తుంది. వాటిలో మార్పులు అవసరమైతే వెనుకాడదు. మతం దైవవిశ్వాసం పేరిట శాశ్వత విలువలనూ, ప్రమాణాలనూ బలవంతంగా మనుషులపై రుద్దుతుంది. మతస్తులు వాటిని మార్చుకోటానికి సిద్ధపడరు.
మానవతావాదం మనుషులను ఐక్యం చేస్తుంది. సహకరింపజేస్తుంది. స్వేచ్ఛకు విలువనిస్తుంది. మతం మనుషులను విభజిస్తుంది. ద్వేషాలను పెంచుతుంది. హింసను ప్రోత్సహిస్తుంది. ఇది చరిత్ర సత్యం. ఈ దృష్ట్యా మనదేశంలో మానవతావాదం ఎలా పరిణమించిందో దానికి అడ్డువచ్చిన శక్తులేమిటో పరిశీలిద్దాం.
మనదేశంలో క్రీస్తుపూర్వం 1500 సం॥కాలంనుండి ఆర్యుల రాకతో వేదాలు,ఉపనిషత్తులలో స్వేచ్ఛాపూరితమైన ఆలోచన సాగింది. వేదరచనలో ఇందుకు అనేక నిదర్శనాలు కనిపిస్తాయి. కాని ప్రప్రథమంగా శరీర రంగును బట్టి మనుషులను విభజించడం కూడా అప్పుడే ప్రారంభమైంది. ఆర్యులు ఉన్నతులనీ, క్షత్రియులు తక్కువవారనీ వాదన మొదలైంది. పురోహితవర్గం అనేక హక్కులను ఆపాదించుకొని మిగిలిన వారిని విచక్షణతో హీనంగా చూచారు. యజ్ఞం చేస్తే ఏ పాపమైనా పోతుందనీ, గోదానం చేస్తే మోక్షం లభిస్తుందని చెప్పారు. పురోహిత వర్గం శూద్రులను బానిసలుగా స్వీకరించారు. దేవుళ్ళను విభజించి, పురోహితులకు వేరే దేవుళ్ళూ, మిగిలిన వారికి వేరే దేవుళ్ళూ అని పేర్కొన్నారు. ఈ విధంగా వేదకాలంలో పురోహితవర్గం దేశంలో మానవులను విభజించింది. క్షత్రియులు ఇందుకు ఎదురు తిరిగారు. అప్పట్లో కులవ్యవస్థ నేడున్నంత స్పష్టంగా లేకపోయినా బ్రాహ్మణ,క్షత్రియ విభజన మాత్రం స్పష్టంగానే ఉన్నది. ఒక విధంగా వేదాలకు వ్యతిరేకంగా, అంటే పురోహితవర్గాలకు భిన్నంగా, క్షత్రియులు ఉపనిషత్తులను ప్రోత్సహించారంటారు.
వేదాలకు ప్రాధాన్యత ఇవ్వక తప్పలేదు. వాటిని అపౌరుషేయాలనీ, ప్రమాణాలనీ పేర్కొన్నారు. మతాన్ని సంస్కరించాలనే వారంతా వేదప్రమాణాన్ని అంగీకరించే ముందుకు సాగారు. కనుక మనదేశంలో మత-మానవతావాద చర్చకు వేదప్రాధాన్యతను గుర్తించక తప్పదు. వేదకాలంలో సహజ స్వభావ వాదాలకు నిదర్శనాలున్నవి. కాని ఆ వాదాలు ప్రామాణికుల పెత్తందారీతనంలో సమసిపోయాయి. కనుక వేదకాలంలో తలెత్తబోయిన మానవతావాదాన్ని మొగ్గలోనే తుంచివేసినందున మళ్ళీ అది ఏనాడూ బలపడలేకపోయింది. వేదకాలంలో పురోహితవర్గాలు తమలో తాము కలహించుకొని దేవుళ్లకు వాటిని ఆపాదించారు. తాము సృష్టించిన దేవుళ్లను శక్తివంతంగా అట్టిపెట్టాలని చేసిన ప్రయత్నాలలో ఇంద్రుడూ,వరుణుడు, అగ్నిరుద్రుడు, ప్రజాపతి పైకీ,క్రిందికీ స్థాన భ్రష్టం పొందుతూ రావడం ఈ పురోహితవర్గాల లీల మాత్రమే. కుక్కను చంపాలంటే పిచ్చెక్కినట్లు పేర్కొనాలి. మానవతను చంపాలంటే దైవం పేరు అడ్డం పెట్టుకోవాలి. వేదకాలంలో ఇదే జరిగింది. గార్గి, మైత్రేయి వంటి ఆలోచనాపరులు తార్కికంగా దైవాన్ని ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరించారు. వేదప్రమాణానికి విలువ అలాంటిది. ప్రమాణం అంటే ప్రశ్నించ వీలుకానిది. ఆధారరహితమైనది. అధికారానికి ఆయువుపట్టు. మన సంస్కృతికీ, విలువలకీ ప్రాచీనకాలంలో ఆ విధంగా దోషపూరిత పునాదులు పడ్డాయి. తరువాత నిర్మించిన మతశాఖలూ, వచ్చిన సంస్కరణలూ, అన్నీ ఈ అధికారిక ప్రమాణాన్ని అడ్డం పెట్టుకుని పుట్టుకొచ్చినవే. మానసికంగా మన వెనుకబడినతనానికి ప్రాతిపదికలు వేదకాలంలోనే జన్మించాయి. మానవతకు అక్కడే పురుగుపట్టింది. ఆ తరువాత పరిణామాలు ఎలా వచ్చాయో పరిశీలిద్దాం.
భారతదేశం ప్రాచీన కాలంలో యాజ్ఞవల్క్యునికి బదులు ఉద్దాలకుని అనుసరించినట్లయితే, దేశం వైజ్ఞానికంగా ముందుకు వెళ్లేదని ఒక భావన ఉన్నది. ఉద్దాలకుడు ప్రశ్నించమన్నాడు.యాజ్ఞవల్క్యుడు నమ్మమన్నాడు.
ఉపనిషత్తులు వేదాల అనంతరం వచ్చినవి. వాటిలో భిన్నత్వం గోచరిస్తుంది. షుమారు క్రీస్తుపూర్వం ఐదు వందల సంవత్సర ప్రాంతంలో అవి వ్రాసినట్టు చెప్పవచ్చు. ఉపనిషత్తులలో అక్కడక్కడా స్వేచ్చాపూరిత ఆలోచనకు నాంది పలికిన లక్షణాలు కనిపిస్తాయి. పోతే, ఉపనిషత్తులను వేదాలతో సమానంగా అందరూ స్వీకరించటం లేదు, దయానందుడు వాటిని స్పష్టంగా నిరాకరించారు.
భారతదేశంలో ప్రప్రథమంగా మానవతా దృక్పధానికి స్పష్టమైన ఆలోచన చేసింది చార్వాకులనవచ్చు. దీనినే లోకాయత అని కూడా అంటారు. ఈ ఆలోచనాస్రవంతిని ఖండిస్తూ భారతీయ మతాలూ, చింతనాపరులూ చాలా చోట్ల ప్రస్తావన తెచ్చారు. సర్వదర్శన సంగ్రహం, సర్వసిద్ధాంతసార సంగ్రహం, ప్రబోధ చంద్రోదయం మొదలైన వాటిలో లోకాయత ప్రస్తావనలున్నాయి. లోకాయత దృష్టిలో మానవులందరూ సమానం. నీతిగా ఉండటానికి దైవం అక్కరలేదు. యజ్ఞయాగాదులను తీవ్రంగా ఖండించారు. ఐతే పురోహితవర్గం ఈ వాదాన్ని ప్రచారంలోకి రానీయకుండా మట్టుపెట్టే వరకూ నిద్రపోలేదు. కనుక మానవతావాద వ్యాప్తి అక్కడే ఆగిపోయింది.
తరువాత పురోహిత వర్గానికి ఎదురు తిరిగి రాజుల అండతో, ప్రాపకంతో క్షత్రియులుగా జైన,బౌద్ధ సిద్ధాంతకర్తలు ప్రచారంలోకి వచ్చారు. జైనులు యజ్ఞయాగాదులను ఖండించినా,బ్రాహ్మణులను వ్యతిరేకించినా, కింది కులాలవారిని పట్టించుకోనే లేదు. స్త్రీలను పురుషులతో సమానంగా జైనతత్త్వం చూడలేకపోయింది. 1848లో అహమ్మదాబాదు వద్ద నిర్మించిన సేట్ హత్తిసింహ జైన దేవాలయంలో కుక్కలూ తక్కువ కులాలవారు ప్రవేశించరాదని బయట బోర్డు పెట్టారంటే, మానవుల పట్ల వారి ధోరణి అవగహన చేసుకోవచ్చు. జైనమతాన్ని అవలంబించి, పాటించే మార్వాడీ వర్తకులు చాలామంది ఆవుల్ని పోషిస్తూ, పూజిస్తూ, మనుషుల్ని చక్రవడ్డీలతో రక్తం పీలుస్తారంటారు.
బుద్ధుడు కుల విచక్షణను భిక్షువులు పాటించరాదన్నారు. ఐతే భిక్షువులుగా మారని వారిలోకులం కొనసాగటానికి బుద్ధుడు వ్యతిరేకించలేదు. బ్రాహ్మణులను తీవ్రంగా వ్యతిరేకించిన బుద్ధుడు క్షత్రియుల ప్రాపకంతో తన వాదాన్ని ప్రచారం చేసుకోగలిగాడంటారు. కులాన్ని ఒక వ్యవస్థగా అట్టిపెట్టరాదనీ, అది తొలగించాలనీ బుద్ధుడు చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు. అంతేకాక బుద్ధుడు కూడా స్త్రీల పట్ల చిన్నచూపే చూశారు. శౌక్యశాఖకు చెందిన మహాప్రజాపతి భిక్షులలో చేరటానికి అంగీకారం కుదరనప్పుడు అయిష్టంగానే బుద్ధుడు ఆమెను చేర్చుకున్నాడు. స్త్రీలను చేర్చుకుంటే తన వ్యవస్థ అట్టేకాలం ఉండదని కూడా అతను అభిప్రాయపడ్డాడు.
భగవద్గీత చాలా స్పష్టంగా కులాలు,వర్ణాలు,భగవంతుని సృష్టి అనీ,వ్యక్తి స్వభావాన్ని బట్టి, వృత్తిని బట్టి అవి వచ్చాయని పేర్కొన్నది. మహాభారతం నాటికి వర్ణాశ్రమ ధర్మాలు బాగా పాతుకపోయి కులాల హెచ్చుతగ్గులు అల్లుకుపోయాయి. ఎక్కడో చెదురుమదురుగా తప్ప కులవ్యవస్థను వ్యతిరేకించిన సూచనలు లేవు. ప్రతిదీ దైవానికి అంటగట్టి కులవ్యవస్థను సమర్ధించినందువలన మానవవిలువలు పూర్తిగా మృగ్యమైపోయాయి. ఆ తరువాత, అంతకుముందూకూడా వచ్చిన ధర్మశాస్త్రాలూ, సంహితలూ, శుక్రనీతిసారం, మొదలైనవన్నీ భగవంతుని పేరిట కులవ్యవస్థను, శిక్షలను బాగా కట్టుదిట్టం చేసి బిగించివేసాయి. కౌటిల్యుని అర్థశాస్త్రం కూడా హిట్లర్ నాజీయిజం, ముసోలినీ ఫాసిజానికి మించిపోయిన శిక్షలను పేర్కొన్నది. కులాంతర వివాహాలు నిషిద్ధం అన్నారు. కుల కట్టుబాట్లను దాటినవారినీ, వ్యతిరేకించిన వారినీ శిక్షించడానికి ఎన్నో ఆంక్షలు పెట్టారు. మొత్తం మీద దోపిడీవ్యవస్థ బలపడి కొందరు అగ్రకులాలుగానూ,మరికొందరు నీచకులాలుగానూ వర్గీకరణ పొందారు. ఛండాలులూ, అంటరానివారు అనే ఒక ప్రత్యేకమైన కులం కూడా మతం నుంచి పుట్టుకొచ్చింది. మనం ఈనాడు ఊరివెలుపల చూస్తున్న హరిజనులనేవారు మన ప్రాచీన ధర్మశాస్త్రాల, పవిత్రగ్రంథాల అగ్రవర్ణాల సృష్టి అని మరచిపోకూడదు. గ్రీకులు, రోమనులు తమ ప్రజాస్వామ్యాన్ని బానిసలకు విస్తరించకుండా, సంతలో పశువులవలె మనుషుల్ని అమ్మినట్లే, అంతకంటె నీచంగా తక్కువ కులాలవారినీ,అంటరానివారినీ చూచి బాధించి బానిసత్వాన్ని శాశ్వతం చేశారు. అక్కడే మానవతావాదం అడుగంటింది.
హిందూమతంలో హెచ్చుతగ్గులను కొంతవరకైనా వ్యతిరేకించిన బౌద్ధాన్ని శంకరుడు వచ్చి చంపేశాడు. ఆయన నిర్గుణ బ్రహ్మ సిద్ధాంతాన్నీ, అద్వైత వేదాంతాన్నీ ప్రబోధించినా వర్ణాశ్రమ ధర్మాలను మాత్రం కఠినంగా అమలుపరచాలన్నాడు. బ్రహ్మసూత్ర భాష్యంలో స్పష్టంగా వేదాన్ని వినే అధికారం శూద్రులకు లేదన్నాడు. ఉత్తరాదిలో వైష్ణవం, దక్షిణాదిలో శైవం వ్యాపించినప్పటికీ కులాన్ని మాత్రం ఎవరూ ఎదురుకోలేదు. శంకరుణ్ణి వ్యతిరేకించిన రామానుజాచార్యులు, వీరిద్దరినీ ఖండించిన మధ్వాచార్యులూ కులం జోలికి పోలేదు. ఆ తరువాత దేశంలో పెధ్దమార్పులు వచ్చాయి.
ముస్లిములు 10వ శతాబ్దం నుండి దేశంపై అనేక పర్యాయాలు దాడిచేసి దేవాలయాలను కొల్లగొట్టారు. దేవాలయాల జోలికిపోతే కళ్ళు పోతాయనీ మ్లేచ్చులు దైవాగ్రహానికి ఆహుతైపోతారనీ పురోహిత వర్గాలు చేసిన ప్రచారం అబద్దమని తేలిపోయింది. మనుషులు కట్టిన దేవాలయాలు, సృష్టించిన దేవుళ్లు చూస్తుండగానే ముస్లిముల ఆక్రమణకు గురయ్యారు. కొద్దిమంది విదేశాలనుండి దండయాత్ర చేసి ఇంతమంది హిందువులను జయించటానికి ఇక్కడవున్న కులాల చీలికలూ, మతం పేరిట కొట్లాటలూ, అమానుషమైన హెచ్చుతగ్గులూ కారణాలయ్యాయి. క్రమేణా తక్కువ కులాలలోని హిందువులు ముస్లిముల్లో చేరిపోయారు. ఇస్లాంలో కులాలు లేని మాట నిజమే. ప్రార్ధన సమయంలో అందరూ సమానమైన మాట నిజమే. కాని ఉత్తరోత్తరా ముస్లిముల్లో కూడా అంతస్తుబేధాలు, అనేక విధాలైన తారతమ్యాలు ఉన్నాయని బయటపడింది. దైవం పేరిట పాలకులూ, పురోహితవర్గాలూ ఇస్లాంలో మనుషుల్ని చిత్రహింస చేశారు. స్త్రీలను చిన్నచూపు చూశారు. ముస్లిములు కాని వారిని కాఫిర్లు అంటూ తక్కువగా చూచారు. మొత్తంమీద ముస్లింల దండయాత్ర వలన ఇండియాలో ఒక పెద్ద మైనారిటీవర్గం ఏర్పడి చరిత్రను మార్చివేసింది.
మధ్య యుగాలలో మతాన్ని మానవత్వంతో మార్చాలని అనేక మంది సంస్కర్తలు విఫల ప్రయత్నం చేశారు. బసవుడు కులాన్ని ఖండించాడు. కబీర్, నానక్, తుకారాం, జ్ఞానదేవ్, ఏక్ నాధ్, ధర్మానంద, చరణ్ దాస్, చైతన్య మొదలైన వారంతా గ్రామసీమల నుండి భక్తిప్రపత్తులతో పాటలు పాడుతూ జనాకర్షణ పద్ధతులు అవలంబించినప్పటికీ లోతుగా పాతుకుపోయిన కులాన్ని కదిలించలేకపోయారు. హెచ్చుతగ్గులను తొలగించలేకపోయారు. బ్రిటిషు పాలకులూ, యూరోపుదేశాల వారూ ఇండియాకి వచ్చిన తరువాత క్రైస్తవుల ప్రభావం వ్యాపించింది. ఈ మతానికి పాపాత్ములూ, పేదవారూ కావాలి. అప్పుడే వారి ప్రచారానికి ఆకర్షణ ఉంటుంది. అలాంటి అవకాశం భారతదేశంలో బాగా కనిపించింది. క్రైస్తవ ఫాదరీలు తక్కువ కులాల వారినీ, ముఖ్యంగా అంటరానివారిని ఆకర్షించి అపరిమితంగా మతం మార్పిడి చేశారు. విచిత్రమేమంటే అటు ముస్లిములూ, ఇటు క్రైస్తవులు కూడా కులాన్ని పోగొట్టలేకపోగా క్రమంగా కులాలను పాటించారు. హిందూ ఆచారాలను కొన్నిటిని స్వీకరించారు. అందువలన నేడు హిందువుల్లోని కులాలు ముస్లిముల్లోనూ, క్రైస్తవుల్లోనూ కనిపిస్తున్నాయి. మానవుల హెచ్చుతగ్గులు మతపరంగా పోవని తేలిపోయింది.
18,19 శతాబ్దాలలో భారతదేశాన్ని మార్చటానికి మత సంస్కర్తలు మళ్ళీ ప్రయత్నించారు. అందులో భాగంగానే ఆర్యసమాజ్ పంజాబ్ లోనూ, బ్రహ్మసమాజ్ బెంగాల్లోనూ, ప్రార్థనాసమాజ్ మహారాష్ట్రలోనూ, దివ్యజ్ఞానమతం మద్రాసులోనూ, రామకృష్ణ వివేకానంద మిషన్ మొదలైనవన్నీ చూస్తాం. మతాన్ని మార్చటానికి వీరు చేసిన ప్రయత్నంలో కొన్ని దోషాలు తొలగించగలిగారు. హిందువులు పాటించే అమానుషమైన సతీసహగమనాన్ని బ్రిటిషువారి సహాయంతో నిషేధించగలిగారు. కాని మౌలికంగా మార్పులు తేవడం సాధ్యపడలేదు. అంటరానితనం జోలికి పోలేకపోయారు. కులాల హెచ్చుతగ్గులను కదిలించలేకపోయారు. వీటిని సమర్ధించే ధర్మశాస్త్రాలను, పురాణ ఇతిహాసాలను ఖండించలేకపోయారు. అలా ఖండించిన ఆర్యసమాజం పరిమితంగానే ఉండిపోయింది. చివరకు ఆదిమ ఆచారాలనూ, విగ్రహారాధన సైతం తొలగించలేకపోయారు.
బెంగాల్లో హెన్రీలూయీ వివియస్ డిరోజియో(1809-31) కలకత్తాలో హిందూ కాలేజీలో లెక్చరర్ గా ఉంటూ మతసంప్రదాయాలూ, దురాచారాలపై దాడిచేసి బెంగాల్ యువకులను ప్రోత్సహించి, హేతువాదాన్ని ప్రబోధించాడు. బహుశ అతడు ఎక్కువకాలం బ్రతికిఉన్నా కొంత ప్రభావం కనిపించేదేమొ- కాని హిందూ కాలేజీ అతణ్ణి ఉద్యోగం లోంచి తీసివేసిన సంవత్సరానికి కలరాతో చనిపోయారు. ఆ విధంగా బెంగాల్లో ప్రారంభమైన మానవతావాదం 19వ శతాబ్దంలో ఆగిపోయింది. మహారాష్ట్రలో పండితరమాబాయి, పూలే ప్రారంభించిన హేతువాదం కూడ మతప్రభావం ముందు నిలువలేకపోయింది.
20వ శతాబ్దంలో జాతీయోద్యమం ఉప్పెన వలె వచ్చింది. అరబిందో, తిలక్,గాంధీ జిన్నా వంటి వారి చేతుల్లో ఈ ఉద్యమం ప్రజలను బ్రిటిషువారికి వ్యతిరేకంగా చైతన్యవంతులను చేసింది. ప్రప్రథమంగా మతాన్ని రాజకీయాలలోకి తీసుకవచ్చారు.అందువలన మతంలో మంచిని వెతకటానికి ప్రయంత్నించారు. ఒక చేతిలో బైబిల్, మరొక చేతిలో భగవధ్గీత, ఖురాన్ పట్టుకున్న గాంధీ, ఈశ్వర్ అల్లా తేరేనాం అంటూ ప్రార్థనలు చేస్తే అటు హిందువులు గానీ, ఇటు ముస్లిములు గానీ ఒప్పుకోలేదు. అంటరానితనంపై గాంధీ చేసిన ఉద్యమానికి రాజకీయాలు తోడ్పడలేదు. గాంధీలో అగ్రవర్ణాల హిందువును చూచిన అంబేద్కర్ బౌద్ధం ఒక్కటే అంటరానివారికి శరణ్యం అన్నారు. కాని మతం అంటరానితనాన్ని పోగొట్టలేదని మరొకమారు రుజువయింది. మాట అసహనం కారణంగా రాజకీయోద్యమంలో మానవతకు తావు లేకుండా పోయి, దేశవిభజన జరిగి, ఊచకోత కోసుకున్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో మనుషులందరినీ ఒకే తీరుగా చూడటానికి వీలైన తరుణంలో అధికారంలో ఉన్న నేహ్రూ దేశమంతటికీ యూనిఫారమ్ సివిల్ కోడ్ పెట్టలేకపోయారు. అంతటితో రాధాకృష్ణ సెక్యులరిజానికి విపరీత వాఖ్యానాలు చేసి మతానికి అధికారముద్ర సంపాదించగలిగారు. అన్ని మతాలూ సమానమనే పేరిట ప్రభుత్వం మతాలన్నిటినీ ప్రోత్సహిస్తూ ఓట్ల కోసం మత సంస్కృతిని కట్టుదిట్టం చేస్తూ వచ్చింది.
20వ శతాబ్దంలో భారతదేశానికి పునర్వికాసం కావాలనీ, గతాన్ని హేతుబద్ధంగా పరిశీలించి అవసరమైన మేరకే స్వీకరించాలనీ మానవతావాదులు కోరారు. ఎం.ఎన్.రాయ్ నాయకత్వంలో ఈ మానవతావాదుల ప్రభావం అల్పంగానే మిగిలిపోయింది. శాస్త్రీయ పద్ధతిలో సెక్యులరిజం తీసుకురావాలని ప్రయత్నించిన ఎ.బి.షా., సత్యశోధన మండల్ ప్రభావం కూడా అట్టేలేదని చెప్పవచ్చు. విజ్ఞానం, సాంకేతికం, విపరీత వేగంతో ప్రపంచంలో ముందుకు పోతుండగా మనదేశంలో వాటిని మాట అభివృద్ధికి వినియోగించుకుంటున్నారు. రాజకీయాలు ఈ విషయం తెలిసికూడా ఉదాసీనత వహిస్తున్నాయి. ప్రజలలో మానవతావాదాన్ని ప్రచారం చేయటానికి విద్యారంగం, టి.వి. రేడియో వంటి శక్తివంతమైన సాధనాలు ప్రభుత్వం చేతిలో ఉండి కూడా ఉపయోగించుకోలేక పోతున్నారు. శాస్త్రీయాభివృద్ధిని వెనక్కు తిప్పలేమని బ్రోనోస్కీ అన్నాడు. అది నిజమే కావచ్చు. అందుకు తగిన వైజ్ఞానిక మనస్తత్వం అభివృద్ధి కాకుండా మన పాలకులు తాత్కాలికంగా ఆపగలిగారు. మనం వెనుకబడి ఉండటానికి ఈ శాస్త్రీయ దృక్పధాన్ని మానవతా దృ క్పధాన్నీ అలవరచుకోపోవడమే కారణం.
మానావతావాదానికి మైనారిటీ తీరినప్పుడే భారతదేశం ప్రపంచంలోని అగ్రస్థాయి దేశాలతో దీటుగా పురోగమించగలదు. ఇందుకు చాలా కృషి అవసరం.