అబద్ధాల వేట - నిజాల బాట/హేతువాదుల కార్యరంగం
మనకు బ్రతికున్న దేవుళ్ళు, చనిపోయిన దేవుళ్ళు అని స్థూలంగా రెండు రకాలున్నరు. తిరుపతి వెంకటేశ్వరుడు, జీసస్ క్రైస్తు, మహమ్మదు మొదలైనవారంతా చనిపోయిన బాపతు. రెండవ వర్గంలో సాయిబాబా, రజనీష్, శివబాలయోగి, జిల్లెళ్ళమూడి అమ్మ యిత్యాదు లున్నారు. ఇంకా కొత్త దేవుళ్ళు వెలుస్తూనే వున్నారు. మనుషులు కొలుస్తూనే వున్నారు. మానవుడి దృష్టి అనంతం అనడానికి యిది కూడా ఒక నిదర్శనమే. రాజకీయ పార్టీలకు డబ్బు ఎంత యిచ్చినా, వారెంత వసూలు చేసినా దానికి చిట్టా, ఆవర్జా లేదు. ఆదాయపు పన్నులేదు. అడిగేవాడు లేడు. అలాగే మతానికీ, దేవాలయానికి, మసీదుకూ యిచ్చిన డబ్బుకు లెక్కలు లేవు.
కనుక దొంగడబ్బు సంపాదించాలన్నా, ఖర్చు పెట్టాలన్నా-రాజకీయ పార్టీ కావలి. లేదా గుడి, మతం, మఠం కావలి. ఇంకెక్కడన్నా అయితే పట్టుబడే అవకాశం వుంది. అప్పుడు కోర్టు, కేసు, పోలీసు, జైలు యిలాంటివి ఎన్నో రంగంలో ప్రవేశిస్తాయి. ఆదాయపు పన్నువారు, ఎక్సైజ్ శాఖవారు, పోలీసులు, రాజకీయాల్లోవారు 'మహాభక్తులు' గనుక మతం జోలికి పోరు.
ఆంధ్రప్రదేశ్ లో ఉదాహరణకు చూడండి : జిల్లావారీగా ఎందరు బాబాలు, మహాత్ములు, యోగులు, సన్యాసులు, మాతలు, అమ్మలు, దేవీ అవతారాలు వున్నారో లెక్కలు తెలియదు. మన రాష్ట్రంలో భిక్షగాళ్ళ వృత్తిపై నిషేధం వుంది. అమలు జరగని చట్టాలలో అదొకటి. కనీసం అలాంటిదైన యీ 'వర్గానికి' లేదు. కనుక వారు యధేచ్ఛగా తెగబడి, సంఘం మీద విరుచుకుపడి దోస్తున్నారు.
ఇటీవల వీరిలో కొందరు రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు. రాజమండ్రిలో రామలింగ సిద్ధాంతి కోసం సాక్షాత్తు ప్రస్తుత రాష్ట్రపతి అలనాడు హోమ్ మంత్రిగా ప్రత్యేక విమానంలో వచ్చారు. ఇక సాయిబాబా సంగతి చెప్పనక్కరలేదు. కొందరు చిట్ ఫండ్స్ వాళ్ళు డబ్బులు కాజేసి పారిపోయినట్లే, ఆశ్రమాలు పెట్టినవారు వున్నట్లే మాయం అవుతున్నారు. పూనాలో రజనీష్ అలాగే అమెరికాలో తేలాడు.
ఇదంతా ఎందుకు జరుగుతున్నది? ప్రభుత్వం అనుసరించే 'బూటకపు సెక్యులరిజం' వలన, అన్నిమతాలనూ సమానంగా చూడాలి అనే నెపంతో, అధికారంలో వున్నవారు ఎవరికిష్టమైన దానిని వారు భుజాన వేసుకొని మోస్తున్నారు. ముఖ్యమంత్రిగా అంజయ్య ఒక శంకరాచార్యుల మఠంలో గోపురానికి డబ్బు దానం చేశాడు. ముఖ్యమంత్రి కాబోయేవ్యక్తీ అయినవాడూ-అందరు తిరుపతి, యాదగిరి, అన్నవరం, సింహాచలం, మంత్రాలయం ప్రభుత్వ ఖర్చుపై వెళ్లి మొక్కుబడులు తీర్చుక వస్తుంటారు. వీరంతా ఎంత భక్తులంటే, ప్రార్థనలు చేయమని ఆదేశాలిస్తారు. యజ్ఞాలు చేయిస్తారు!!
దోపిడీ విపరీతంగా చేస్తే, మామూలు రాతికి బదులు పాలరాతితో గుడులు కట్టిస్తారు. హైదరాబాద్ లో బిర్లామందిర్ యిందుకు ఉదాహరణ. అయ్యప్ప భక్తులైతే పాపం చేసినట్లు ఒప్పుకొని ప్రాయశ్చిత్తం కోసం వేరే దుస్తులు వేసుకొని, కొన్నాళ్ళు కష్టిస్తారు. క్రైస్తవులు తమ పాపాలను ఫాదరీలకు చెప్పుకున్నట్లే వీరు అయ్యప్పను శరణు వేడతారు.
ఈ విధంగా భక్తి రోజురోజుకూ ముదిరి, అనేక విధాల వెల్లడై అప్పుడప్పుడు, ఆవేశం పట్టజాలక మతకలహంగా పరిణమిస్తుంటుంది. మసీదు పక్కగా, వూరేగింపు వాయిద్యంతో వెడితే మహమ్మదీయులు విజృంభిస్తారు. ఆవు జోలికి పోతే హిందువులు ఆగరు. ఎటొచ్చి విలువ లేనిది మనిషికే. అదీ మత సారాంశం.
ఏతా వాతా చెప్పొచ్చేదేమంటే, యీ మతాలను వాటి పేరిట దేవుళ్ళుగా వెలసే వారిని కని పెట్టి వుండడం అవసరం. సమాజంలో వారికి ప్రత్యేకత వుండరాదు. ఆశ్రమలు, బాబాలు, మాతలు, మసీదులు, దేవాలయాలకు సంబంధించిన ఆస్తి వివరాలు ఎప్పటికప్పుడు వెల్లడించ వలసిన అవసరం వున్నది. లేకుంటే సమాంతరంగా నల్ల డబ్బుతో వీరు 'రాజ్యం.' చేస్తున్నారు. వీరి ఆదాయం ఎక్కడిదో చెప్ప వలసి వున్నది. దానిపై అందరి మీద వేసినట్లు పన్ను వేయాలి.
తిరుపతి హుండీలో రహస్యంగా ముడుపూ వేసే పద్దతికి స్వస్తి పలకాలి. దొంగ డబ్బు సంపాదించిన వాడు, భయానికి లక్షల ధనం అర్పిస్తే మంచి పని చేశాడనడం వెర్రి అవుతుంది. నిజమైన భక్తుడికి భయం వుండ వలసిన పని లేదు గదా. లెక్క బెట్టి, ముడుపులు చెల్లించి, రసీదు పొందాలి. అంత డబ్బు ఎలా సంపాదించాడో చెప్పగలగాలి. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నాడా లేదా చూడాలి. భగవంతుడి సన్నిధిలో భయమెందుకు? ప్రభుత్వం కూడ మతాల ఆదాయాలకు ఏ విధమైన మినహాయింపులు యివ్వరాదు. అయితే కొందరు వాదిస్తున్నట్లు అటువంటి డబ్బు బడులకు, మందిరాలకు సద్వినియోగ మౌతుందిగా అని అనవచ్చు. ఆదాయపు పన్ను వేస్తే ప్రభుత్వానికే గదా డబ్బు చెందేది. ప్రభుత్వం ఖర్చు పెట్టేది కూడ ప్రజల సంక్షేమానికే గదా? పైగా దొంగ డబ్బు అరికట్టడం వలన, రూపాయి విలువ పెరిగి, ధరలు అదుపులోకి వచ్చి, ద్రవ్యోల్బణం తగ్గుతుంది కూడ. కాషాయ వస్త్రం వేసుకున్న ప్రతి గడ్డపు వాడికి, జుట్టు పెచుకున్న వారికీ, మినహాయింపులు ఇస్తుంటే, దోపిడీని ఎలా అరికడతారు? సమాజం నుండి పారిపోయి, బాధ్యత రహితంగా తిరిగే వాళ్ళంతా, దైవం పేరిట, మతం మాటతో మనుషుల్ని కాల్చుక తింటున్నారు. అలాంటి వాళ్ళ దగ్గర ఆత్మ శాంతి లభిస్తుందని భ్రమ పడు తున్నారు. కాని పాండిచ్చేరి అశ్రమం కట్టిన అరోవిల్ చూడండి. కొట్లాటలతో సతమతమౌతున్నారు. ఆస్తులున్న చోట యివి తప్పవు. మన దేవాలయాల ట్రస్తీల సంగతి చాణుక్యుడే చెప్పాడుగా. ఒక కంట కని పెట్టి వుండమని.
మతం వున్నంతా కాలం మనిషికి శాంతి వుండదు. చరిత్ర రుజువు చేసిన సత్యమిది. సమాజంలో యితర శాఖల్ని చూచినట్లే మతాన్ని చూడడం ప్రబుత్వ సెక్యులర్ విధి. ప్రజలు వీటణ్ణీటినీ ఒకపట్టాన అంగీకరించరు. ఎందుకంటే మతం నూరిపోసిన, పోస్తున్న అజ్ఞానం వారికి వంట బట్టి వున్నది గనుక. అది క్రమేణ పోగొట్టాలి. హేతు వాదులు ఈ ప్రచారం చేయాలి. చదువులో హేతు విధానం రావాలి. మతం పోతే అధ్యాత్మిక అమానుష నీతి పోతుంది. మానవ నీతి వస్తుంది. కనుక మతం లేకుంటే విలువలు పోయాయనడం ఘోర సూక్తి. అంట రాని తనాన్ని, మనుషుల్లో తార తమ్యాల్ని, మనస్సును ధ్యానం పేరిట తాకట్టు పెట్టించే విధానాన్ని అలోచనను చంపేసే రీతుల్ని మతం పెంచి పోషించింది. అంట రాని తనం పోవాలి అని కేకలేసే వారు దీని వెనుక మతం వున్నదని గ్రహిస్తే మంచిది. అలాగే కుటుంబ నియంత్రణ కావాలనే వారు, దీనిని మతం వ్యతిరేకిస్తున్నదని గ్రహిస్తే మేలుకుంటారు. ప్రభుత్వం తలపెట్టే ప్రతి అభ్యుదయ చర్యకూ మతం అడ్డొస్తుంది. కనుక మతాన్ని పోషిస్తూ సంక్షేమ రాజ్యం తేవడం కల్ల.
హేతువాదులకు సూచన:
మీ జిల్లలో, కనీసం ఒక ప్రాంతంలో వున్నా ఆశ్రమాన్ని, బాబాను, మాతను ఉదాహరణగా స్వీకరించి, వారి పుట్టుపూర్వోత్తరాలు సేకరించండి. ఆస్తుల వివరాలు తెలుసుకోండి. బాబా కుటుంబ వ్యవహారం, అతడి మానసిక ప్రవృత్తి వివరాలు నోట్ చేయండి. ఈ సమాచారం వలన విశ్లేషణ మొదలుపెట్టవచ్చు. ఇటువంటి పరిశోధన వైజ్ఞానిక పద్ధతిలో జరగాలి. ప్రభుత్వం వద్ద యిటువంటి సమాచారం వుండదు. పరిశోధనకు బాగా ఉపకరించే యీ విషయాలు, సమాజానికి ఎంతో తోడ్పడతాయి. ఏ రాజకీయ పార్టీ కూడా యీ పనికి పూనుకోదు. కనుక హేతువాదులకు పొటీలేని రంగం యిది.