అబద్ధాల వేట - నిజాల బాట/అయ్యప్పా, మనుషులే నీకు శరణం!
ప్రతి సంవత్సరం నవంబరు నుండి జనవరి వరకూ కేరళలోని శబరిమన కొండపైన అయ్యప్ప దర్శనార్ధం భక్తులు యాత్ర జరుపుకుంటారు. జనవరి 14న ఉత్సవానికి పరాకాష్ఠ, ఆఖరి రోజు కూడా ఆరోజు శబరిమల కొండకు పది కిలోమీటర్ల దూరానవున్న పొన్నంబల మేడు కొండపై సాయంత్రం ఆరున్నర నుండి ఆరు నలభై లోపు మూడు పర్యాయాలు మకరజ్యోతి వెలుగుతుంది. ఇది దైవికమనీ, మానవులకు ఈ ప్రదేశం అందుబాటులో ఉండదనీ చిరకాలంగా ఒక గాధ ప్రచారంలో ఉన్నది. ఆ వెలుగు కనిపించగానే భక్తులు గుండెలు బాదుకుంటూ, అయ్యప్పా శరణం అంటూ నినదిస్తారు.
ఈ జ్యోతి మానవులతో నిమిత్తం లేకుండా వెలుగుతున్నదా? అనేది హేతువాదులను కొంతకాలంగా వేధించిన సమస్య అయింది. పరిశోధన జరపాలని వారు కేరళలో తీవ్ర ప్రయత్నం చేశారు. ఇతే హేతువాదులను ఆ కొండపైకి పోకుండా పోలీసులు అటకాయించటమే కాక 1980లో లాఠీ చార్జీ కూడా చేశారు.
యుక్తివాది సంఘంవారు ఈ విషయ పరిశోధనకు సుకుమారన్ ధనువాచపురం, టి.యన్.బాబు అనే వారిని పురమాయించారు. వీరిద్దరకూ కొండపైకి ముందుగానే చేరుకున్నారు. వారికి పోలీసు జీపు కె.యల్.యఫ్.2676,కె.ఆర్.టి.2951 నంబరులో మరో జీపు, కేరళ విద్యుత్ బోర్డువారి జీపు కనిపించాయి. ఆ జీపులలో వచ్చిన వ్యక్తులు కొబ్బరికాయలు, అగరువత్తులు, కర్పూరపు పొట్లాలు పట్టుకొచ్చారు. దీనితో వెలుగు ఏ విధంగా వస్తున్నదీ తేలిపోయింది. దేవస్థానం అధికారులూ, పోలీసులూ, విద్యుత్ బోర్డువారూ కలిసి కొందరు వ్యక్తులను మాత్రమే ఈ ప్రదేశానికి పంపిస్తున్నారు. ఒక వ్యక్తి సరిగా సాయంత్రం ఆరున్నరకు ఒక పాత్ర నిండా కొన్ని కిలోల కర్పూరాన్ని నింపి వెలిగిస్తాడు. రెండు చేతులతో ఆ పాత్రను పైకి ఎత్తి మూడు పర్యాయాలు శబరిమలకొండవైపు చూపి దించివేస్తారు. ఇదే ఇన్నాళ్ళు భక్తులు దైవికమైన మకరజ్యోతిగా భావించి పూజిస్తున్న వ్యవహారం.
1983లో యుక్తివాద సంఘంవారు ప్రజలను మోసగిస్తున్న ఈ తీరు పట్ల అభ్యంతరం తెలుపుతూ కొండపైకి వెళ్ళటానికి ప్రయత్నించగా పోలీసులు లాఠిచార్జి చేశారు. అసెంబ్లీలో ఈ విషయం ప్రస్తావనకు రాగా కేరళ ప్రభుత్వం కంటితుడుపుగా విచారణ సంఘాన్ని నియమించింది. అప్పటి నుండి దేవస్థానం వారు మకరజ్యోతిని గురించి దైవికమని గాని, కాదనిగానీ చెప్పకుండా మౌనం వహించారు. ఐతే మకరజ్యోతిని ఫోటోలు తీయనీయరు. రహస్యం బయట పడకుండా అట్టిపెట్టటానికి ఇదొక ఎత్తుగడగా భావిస్తున్నారు.
ఈ దేవస్థానం నిధుల దుర్వినియాగం విషయమై చాలా ఫిర్యాదులున్నవి. 1965లో 342 మంది దేవస్థానం సిబ్బంది ఉండగా, 1986 నాటికి 1234 మంది అయ్యారు. ఈ నియామకాలు కూడా అరాచకత్వంతో కూడినవని విచారణ జరిపిన రెవెన్యూబోర్డు సభ్యుడు డా॥సి.ఆర్. కృష్ణమూర్తి తెలియపరచారు. ఈ సిబ్బందిలో చాలా మందికి నెలకు రు.50, వందరూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. సేవానిబంధనలు ఏర్పరచలేదు. అవినీతి విలయతాండవం చేస్తున్నదనీ, భక్తులిచ్చిన బంగారాన్ని అమ్ముకుంటున్నారని ఫిర్యాదులున్నవి.
భక్తులు విషయాన్ని విడమరచి తెలుసుకోరు గనుక వారి మూఢనమ్మకాలే శబరిమల దేవాలయానికి ఆదాయం తెచ్చిపెడుతున్నవి.