అనిరుద్ధచరిత్రము/ద్వితీయాశ్వాసము

శ్రీరస్తు

అనిరుద్ధచరిత్రము

ద్వితీయాశ్వాసము



రమణీహృదయంగమ
చారుతరశ్యామలాంగసమలంకృతమం
జీరకటకాంగుళీయక
హారాంగదవలయ మంగళాచలనిలయా.

1


తే.

అవధరింపుము శౌనకుండాదియైన, మునివరేణ్యులతోడ నిట్లనియె సూతుఁ
డాపరిక్షిన్మహారాజు నాదరమునఁ, జూచి విజ్ఞాననిధియైనశుకుఁడు పలికె.

2


మ.

పరిఖాగాధకబంధసంసృతమహాపాతాళభాగంబు గో
పురకంఠీరవరూపపాటనపరాభూతేంద్రనాగంబు భా
సురవిస్తారమణిప్రకీర్ణవరణాంశువ్యాప్తదిఙ్మండలం
బరిసంత్రాసకరంబు శోణపుర మొప్పారున్ ధరామండలిన్.

3


శా.

బాణుం డుద్ధత సత్వనిర్జితజగత్ప్రాణుండు సాతత్యశ
ర్వాణీవల్లభపాదపద్మభజనారంభప్రవీణుండు గీ
ర్వాణవ్రాతమనోభయంకరధనుర్బాణుండు సంగ్రామపా
రీణుం డప్పుర మేలుచుండు విజయశ్రీవైభవాక్షీణుఁడై.

4


తే.

తనసహస్రభుజాబలౌద్ధత్యమహిమ, నేఁచి ముల్లోకములయందు నెదురులేక
బలితనూభవుఁడైన యబ్బాణదైత్యుఁ, డుగ్రశాసనుఁడై యుండి యొక్కనాఁడు.

5


వ.

భవానీమనోహరుండగు హరుం డఖండతాండవకేళీరతుండై ముఖరితమృదంగంబును,
రణితోపాంగంబును, సంగీతప్రసంగంబును, బరితోషితాశేషభూతాంతరంగబును న
గునృత్యరంగంబున దశప్రాణాత్మకంబును, మూర్తిత్రయకళ రమ్యంబును, లఘుగు
రుప్లుతసమేతంబును, దకతకధికతకముఖశబ్దబంధురంబునగు ధ్రువమఠ్యరూపకఝం
పాత్రిపుటాటతాళైకతాళసింహానందచంచుపుటాదితాళంబుల జతులు కడకట్టుకై
మురికళాసికలద్రుతమధ్యవిళంబకాలపరిమాణంబుల దండలాపకకుండలిప్రేరణీప్ర
ముఖమార్గంబుల రంగరక్తులు వహింప నాట్యంబు సలుపునవసరంబున భరతకళాధురీణుం
డగు బాణుం డావజం బారజంబునం బుచ్చుకొని శ్రుతిప్రమాణంబు నిలిపి తకధిమికిట
శబ్దాక్షరసముచ్చారితముఖుం డగుచుఁ గరప్రహారంబులం జిత్త్రవిచిత్రంబులై చెలంగు
తాళవ్యాప్తులు ఘుమంఘుమాయమానంబై నాదబ్రహ్మంబు జనియింప హృదయారవిం

దంబున కానందసంపాదకంబై నెఱయమొరయించిన నప్పరమేశ్వరునాట్యంబు
జగన్మోహనంబై ప్రవర్తిల్లె నప్పుడు.

6


ఉ.

బాణునివాద్యవిద్యకు నపారముదంబునుఁ బొంది శాంకరీ
ప్రాణవిభుండు మెచ్చితి దయన్ వర మిచ్చెద వేఁడు మన్న గి
ర్వాణవిరోధి నానగిరివాకిటఁ బారిషదాళితోడ శ
ర్వాణియు నీవు భక్తజనవత్సల కావలియుండవే కృపన్.

7


తే.

అనుచు మ్రొక్కినఁ గరుణించి సాంబశివుఁడు, దానవేంద్రునిపట్టణద్వారమునను
గాపురంబుండె నిదె లఘుకార్య మనక, యెంతసులభుండు పార్వతీకాంతుఁ డహహ.

8


తే.

ఏమహాత్మునిమహిమ బ్రహేంద్రముఖ్యు, లెఱుఁగఁగాఁజాల రట్టిసర్వేశ్వరుండు
నిజపురద్వారపాలుఁ డై నిలువ మెలఁగె, నౌర వానిది గాక భాగ్యాతిశయము.

9


లఘుస్రగ్ధర.

ఆలీలం బూర్వదేవుం డతులదశశతోదగ్రదోర్దండహేతి
జ్వాలాదందహ్యమానస్వరధిపశిఖివైవస్వతక్రవ్యభుక్కీ
లాలాధ్యక్షాదిక్పాలకగణహృదయశ్లాఘ్యబైక్రమ్యలబ్ధ
త్రైలోక్యప్రాభవుండై తనరె భువనసాధారణస్ఫూర్తితోడన్.

10


క.

సురవైరి మఱియుఁ గొన్నా, ళ్లరుగఁగ నొకనాఁడు మదనహరుఁ బొడగని త
చ్చరణమునకు నతిభక్తిం, బరిణతు లొనరించి వినయభాషాపరుఁడై.

11


మ.

గిరిజామానసహంస హంసవరయోగిధ్యేయచిద్రూప రూ
పరుచిశ్రీజితముక్త ముక్తభుజదర్పవ్యాఘ్రదైత్యేంద్ర యిం
ద్రరమావల్లభమిత్ర మిత్రరజనీరాట్చక్ర చక్రాబ్జసుం
దరరేఖాకరపద్మ పద్మశరభావా శంకరా శంకరా.

12


వ.

అని బహుప్రకారంబుల స్తోత్రంబు గావించి యిట్లనియె.

13


క.

లోకములెల్ల జయించితి, సౌకర్యము గాఁగ సకలసౌభాగ్యంబుల్
చేకొంటిఁ గీర్తి నొందితి, నీకారుణ్యమునఁ జేసి నీలగ్రీవా.

14


ఉ.

ఆహవభూమి మామకసహస్రభుజాబలతీవ్రధాటికిన్
సాహసలీలతో నెదిరి శౌర్యముఁ జూపఁగఁ జాలినట్టియ
వ్యాహతవిక్రమాఢ్యుఁ డొకఁడైనను లేఁ డొకనీవుదక్క హా
లాహలలాంఛనాంచితగళాపరిరంభితసర్వమంగళా.

15


ఉ.

ఆతతవైరివీరసముదగ్రకరోద్ధృతహేతిభూతసం
ఘాతవిముక్తరక్తజలకాంతులు కంకణపద్మరాగసం
జాతమరీదులం గలయ సంగరకేళి ఘటింపఁజేసి నా
చేతులతీఁట కౌషధము సేయఁగదే రజతాద్రిమందిరా.

16


వ.

అని ప్రార్థించుచున్న యద్దోషాచరుభాషణంబులకు రోషించి శేషభూషణుం డి ట్లనియె.

17


క.

నాయంతవానితో నని, సేయంగలిగెడును నీదుచేతులబరువున్

క.

నాయంతవానితో నని, సేయంగలిగెడును నీదుచేతులబరువున్
బాయు భవదీయకేతన, మేయెడఁ ధర గూలు నపుడు హీనవివేకా.

18


వ.

నిర్విచారుండవై యుండు పొమ్మని యానతిచ్చిన బలినందనుండు డెందంబున నానందంబు
నొందుచు నందివాహనున కందంద వందనంబు లాచరించి మరలి నిజమందిరంబున కేతెంచి
యాత్మీయశ్రేయోహానిహేతుభూతంబైన కేతుపాతంబున కెదురుచూచుచు నీచాః
కలహ మిచ్ఛంతి యనువచనంబునకు నగ్రసాక్షియై యుండె నంత.

19


ఆ.

ఆతనికూర్మికూఁతు రందంపుబిత్తరి, ముద్దుగుమ్మ భువనమోహనాంగి
కుందనంపుబొమ్మ కుసుమకోమలి యుషా, కన్య యనఁగ నొప్పు కమలనయన.

20


ఉ.

ముద్దులమాటలున్ జిఱుతమోమున నున్ననిలేఁతచెక్కులున్
గొద్దిగనున్న నెన్నడుము కూఁకటి కందక ఫాలపట్టికన్
విద్దెము సేయుముంగురులు విప్పగు ఱెప్పల గొప్పకన్నులున్
బ్రొ ద్దొకవింతయై యమరెఁ బుష్పసుగంధికి బాల్యవేళలన్.

21


సీ.

అరవిందములు మన్మథాస్త్రంబు లైనట్లు వాలుఁగన్గొనల గ్రొవ్వాఁడి వొడమె
హరినీలములు పేరు లైనచందమున నించుక లైనకురులు పెన్ సోగలయ్యె
వీణాశ్రుతులు మేళవిం పైనవగ ముద్దుపలుకులు ప్రౌఢసంపద వహించెఁ
గనకంపుఁఁణిక కుందన మైనరీతిఁ జాయలమేను నిండుతేపల వహించె
మ్మపూపలు ముది ఫలమ్ములైన, గతిఁ జనుకుదుళ్లు నిగిడి పొంకము వహించె
బంధుజీవాధర యతీతబాల్య యగుచు, నిండుజవ్వనమున నొప్పుచుండు నపుడు.

22


మ.

కలవాక్కీరహయంబు గల్ల మకరీకస్తూరికాపత్రస
ల్లలితాంకంబు నితంబబింబపటులీలాచక్ర మాలోకనాం
చలబాణౌఘము భ్రూలతాయుగ మహాచాపంబు నై శోభిలెన్
జలజాతాననవిగ్రహంబు రతిరాజస్యందనప్రక్రియన్.

23


ఉ.

తేనియ లొల్కు మోవియును దియ్యనిమాటలుఁ బువ్వువంటి నె
మ్మేనును ముద్దుఁజెక్కులును మెచ్చులుఁ గుల్కెడు గుబ్బచన్నులున్
మీనులవంటికన్నులును మిక్కిలియైనపిఱుందు సన్నపుం
గౌను నొయారపున్నడపుఁ గల్గి వెలుంగు మనోహరాంగియై.

24


తే.

ఒఱపుగలచందురునిచందమోము మోము, నలర శైవాలలీలఁ జెన్నారు నారు
పరిమళము గుల్కు కపురంపుఁబలుకు పలుకు, కలికి రాజమరాళసంగతులు గతులు.

25


సీ.

ఘనసారమును సారఘనము నాక్షేపించుఁ గలికిపల్కులయింపు కచముసొంపు
పద్మరాగము రాగపద్మము నదలించు రమణంపుమోవి పాదములఠీవి
మృగమదంబును మదమృగమును హసియించుఁ గాయంపువలపు కన్దోయిమెలఁపు
వరనాగమును నాగవరముఁ జుల్కఁగఁజేయు నవకంపునూఁగారు నడలతీరు

చక్రసామ్యత వెలయు కుచంబులందు, సామ్యచక్రతఁ దగు వుక్కసపుఁబిఱుందు
రూఢి నారోహిణియు నవరోహిణియుఁగ, నెలఁతచెలువంబుసారె వర్ణింపఁదగును.

26


చ.

మలయజగంధి బిత్తరపుమాటలు వీనులు సోఁకినంతనే
చిలుకలు పల్కినట్లు విలసిల్లు వసంతపువేళఁ గోవెలల్
చెలఁగినయట్లు కిన్నరలు చిత్రవిధంబున మీటినట్లు వీ
ణెలు మొరయించినట్లు మదినిండుఁ బ్రమోదరసప్రవాహముల్.

27


ఆ.

ఇరులు సిరులు దొరలు కురులు తియ్యందనంపుఁ దీవి ఠీవి తావి కావి మోవి
కులుకులొలుకు పలుకు మెలఁకువసుమచాపు, తూపు రూపు మాపు చూపుకోపు.

28


చ.

కొలుకులకెంపుసొంపు రహి గుల్కెడు తారలనీలిమంబు క
న్బెళుకు మెఱుంగులుం గలసి పెంపమరెన్ హరిణాక్షిచూపు ల
వ్వలదొర ముజ్జగంబు గెలువన్ నవచూతదళంబు మేచకో
త్పల మరవింద మొక్క మొగిఁబట్టి ప్రయోగము సేయు కైవడిన్.

29


సీ.

మునుకారునను కారుకొని మీరు ఘనచారుతనుమారుకొనికేరుఁ దరుణికురులు
నలకుందములయందములచందములు మందములఁ నొందఁగాఁజేయుఁ జెలిరదాళి
తెగరానివగ మేనితొగరేని జిగిబూని తగుదానిసొగ సైననగుమొగంబు
వెల పెంపు వెలయింపు కళగుంపుఁ దులకింపులు కెంపుఁ దలపింపుఁ బణఁతిమోవి
సింగముల భంగముల నొందఁజేయునడుము, కీరముల దూరముల దొలఁగించుబలుకు
జక్కవలఁ దక్కువలఁ జేయుఁజన్నుదోయి, ముదితరూపంబు త్రిభువనమోహనంబు.

30


సీ.

ఇంపుసొంపుల గ్రుమ్మరింపుమాటలు వీణపలుకుల కక్షరాభ్యాస మొఁసగు
మందంపునడపులు మాయూరగతులకుఁ బలుమాఱు తిన్ననిఫణితిఁ జూపు
సరసంపునాసిక సంపెంగమొగ్గల కెక్కువతక్కువల్ చక్కదిద్దుఁ
జొక్కంపుగుబ్బలు జక్కవకవలకు దిట్టతనం బుపదేశ మిచ్చు
హొంతబాడుట వనవిహారోత్సవంబు, సలుపుటయుఁ బుష్పవితతివాసనలు గొనుట
నెఱిసరసిఁ గ్రీడలాడుట నెపములుగను, నతివసౌందర్య మింక నేమని వచింతు.

31


క.

ఇటువంటి యవయవంబుల, నెటువంటివిలాసవతుల నెనసేయఁగరా
నటువంటివగను రజనీ, విటువంటిమొగంబు గలిగి వెలఁదుక యొప్పెన్.

32


ఉ.

మేరుధనుష్కుదేవి స్వరమేళకళానిధి దత్తిలంబు భాం
డీరమ్ము కోహళియ్యకము నిగఁ గావ్యము నాటకం బలం
కారము శాస్త్రముల్ మొదలుగా మఱి యభ్యసనం బొనర్చె శృం
గారపువిద్య లద్దనుజకన్యకకున్ బరమానురక్తయై.

33


ఆ.

ఆడఁబాడ నేర్చియభినయింపఁగ నేర్చి, సరసకవిత చెప్పఁ జదువ నేర్చి
బాణదనుజపుత్రి బాలిక యయ్యును, సకలకళలయందు జాణ యయ్యె.

34

వ.

అంత నితాంతకాంతి కాంతవనాంతలతాంతపరిమళాక్రాంతదిశాంతంబైన వసం
తంబు ప్రవేశించె.

35


సీ.

శ్రీయుతారామరామాయౌవనప్రాప్తి సంభోగరతమనస్సౌఖ్యరాశి
యువనవోఢాత్రపాప్రవణకుట్టాకంబు సద్విజానీకవాంఛాఫలంబు
ప్రోషితభర్తృకాయోషిద్వ్యధామూల మనుపమయోగిధైర్యచ్ఛిదంబు
భాసురతరశరద్వాసరసారంబు జాతికళాసముచ్చాటనంబు
నగుచు వర్ణింప యోగ్యమై యతిశయిల్లె, వివిధసమబృందనిష్యందనవమరంద
బిందుసందోహపానమిళింద సుంద, రాగమం బైనయవ్వసంతాగమంబు.

36


తే.

దండి మీఱంగఁ దరువులనుండి మిగులఁ, బండి రాలి వనస్థలి నిండి దళము
లమరె వనలక్ష్మి మాధవాగమనవేళ, నడుగులకుఁ బఱపించినమడుఁగు లనఁగ.

37


చ.

వలపులవేల్పుకై దువులుపాంథజనంబులపాలియగ్నికీ
లలు చెలువొందు కోకిలకులంబున కాఁకటిపంట కొల్చురా
సులు వనలక్ష్మిమేనఁ బొడసూపెడు రాగరసాంకురంబు లిం
పలరెడుకాంతు లంగిసలయంబులు తోఁచె ననోకహఁబులన్.

38


క.

సుమనోవిరాజితంబై, యమరనగస్ఫూర్తిఁ దనరి యారామంబుల్
సుమనోవిరాజితంబగు, నమరనగస్ఫూర్తి దనరె నభిరామంబై.

39


తే.

సద్విజాళిప్రసంగంబు సరసతరము, ప్రణవవిస్ఫూర్జితము బీజబంధురంబు
పల్లవాలంకృతము ఫలప్రదము నైన, యాగమస్థితి నొప్పె సర్వాగమములు,

40


సీ.

అనిలోపదేశనాట్యక్రీడఁ దగు లతాబింబోష్ఠులకు సరిపెన లొసంగె
నింపుసొంపులఁ బాడు నెలతేఁటిబయకాఱులకు వన్నె మీఱు నీలము లొసంగెఁ
గైవారములు సేయుకలకంఠకులవంధిబలగంబునకును మావుల నొసంగె
ఫలరత్నముల నారతు లొసంగు భూజపురంధ్రీజనుల కంబరము లొసంగెఁ
దనవదాన్యచమత్కృతి జనులు పొగడఁ, దనవిలాసంబు భువనమోహనము గాఁగ
విభవసంపన్నుఁడై వనవిహృతి సలిపె, మాధవుండు వనీరమణీధవుండు.

41


తే.

శుకభరద్వాజముఖసద్విజకులరక్షఁ, దనరి సుమనస్సమూహవర్థన మొనర్చి
ఘనతరాగమవేద్యుఁ డై వినుతిఁ గాంచె, మహితవనవాసలీలల మాధవుండు.

42


వ.

అట్టివసంతకాలంబునందు.

43


క.

నాళీకముఖి యుషాంగన, యాళీజనసహిత యగుచు నలికోకిలకీ
రాళీనినాదశోభిత, కేళీవనవాటియందుఁ గ్రీడ యొనర్చెన్.

44


సీ.

చెలువంపుఁజిగురుటాకులు పాదములు గాఁగ ననకంపురంభ లూరువులు గాఁగ
సూనవాసనలు నెమ్మేనితావులు గాఁగ నొఱపైనలతలు బాహువులు గాఁగ
గజనిమ్మపండ్లు చొక్కపుఁగుచంబులు గాఁగఁ గలకంఠరుతులు వాక్యములు గాఁగ

తులలేనిమల్లెమొగ్గలు దంతములు గాఁగ సుమిళిందమాలికల్ చూపు గాఁగఁ
బల్లవితతమాలపాదపచ్ఛాయలు, సరసమైనవేణీభరము గాఁగ
నెన్నఁదగియె నప్పు డిందుబింబానన, యౌవనంబుఁ బోలి యవ్వనంబు.

45


సీ.

భూరుహావళుల శృంగారభావములు లోచనపఙ్క్తులకు వికాసంబు నెఱపఁ
గలకంఠశుకశారికాకలరావంబు రహి మించి కర్ణపర్వంబు సేయ
లలితచాంపేయపాటలకుందవాసనల్ నాసికంబునకు నానంద మొసఁగఁ
నమృతోపమానంబులగు ఫలరసములు వెలయ జిహ్వలకును విందు లొసఁగ
గమ్మతావులు పయిపయిఁ గ్రమ్మ విసరు, చలువతెమ్మెర మేనులయలఁతఁ దీర్ప
సొరిది పంచేంద్రియములకు సుఖము గాఁగ, వనవిహారంబు సలిపి రవ్వనజముఖులు.

46


సీ.

అధరబింబాపేక్ష నరుదెంచు చిలుక లద్దపుఁజెక్కులజవాదితావులకును
వదనాంబుజములకై కదియు భృంగంబు లుత్తంసచంపకసుగంధంబులకును
భుజమృణాళాస క్తిఁ బొదువు రథాంగముల్ సరసమందస్మేరచంద్రికలకు
హస్తపల్లవములకై డాయు కోయిఁలల్ ముద్రికాంకితరామమూర్తులకును
జకితగతిఁ జెంది చెదరఁగఁ జంద్రముఖులు, చతురతఁ జరించి రప్పుడు చారుచరణ
చలితచామీకరాంగదఝణఝణంఝ, ణంఝణధ్వని చెవుల కానంద మొసఁగ.

47


వ.

మఱియు నమ్మదవతీతిలకంబు కదంబకాంచనకదలీక్రముకకరవీరఖర్జూరనారికేళ
తమాలతిలకకురంటకమాధవీప్రముఖతరుషండంబులవలనం దిరుగుచు, వనమయూరం
బుల వెంబడి నరుగుచు, మహీరుహంబుల నామూలాగ్రంబుగాఁ బెనఁచి యల్లికొనియు
నేలాలవంగద్రాక్షాదిలతావితానడోలాజాలంబులఁ నుయ్యలలూఁగుచు, బొదరిండ్లఁ
డాఁగుచు, నసమంబులగు కుసుమరసవిసరంబులు వెసంగ్రోలి ఝంకారంబు సేయు మధు
కరనికరంబులం జోపుచుఁ, బ్రసూనఫలభరితలై యున్నకొమ్మలకు జేతులం జాఁపుచు,
స్వచ్ఛంబులైన కుసుమగుచ్ఛంబులును మార్దవనిలయంబులైన కిసలయంబులును మనో
రథఫలంబులైన ఫలంబులును గోయుచు, దోహదవిశేషంబులు సేయుచు, శారికాకీరకల
కంఠకపోతకలరవప్రముఖవిహంగనాదంబులకుం ప్రమోదించుచుఁ, గ్రీడావిశేషంబుల
వినోదించుచుఁ, గరకమలకలితకాంచనకంకణకాంచీకలాపఘంటికానికరనూపురసం
జనితఝణఝణరవంబువన దేవతామనోహరం బై చెలంగం జరియించుచుఁ దమలోన.

48


క.

చూతము చూతము సుదతీ, వ్రాతము రారమ్మ మధుకరవ్రజగీతో
పేతము సుమసౌరభవి, ఖ్యాతము విరహిహృదయాభిఘాతముఁ దలఁపన్.

49


క.

కాంచనవర్జ్యము కువలయ, సంచారము మాధవప్రసన్నతయును బా
లించుచు వానప్రస్థతఁ, గాంచు మధువ్రతకులంబుఁ గంటివె చెలియా.

50


తే.

పేరుగలజాతులకు నెల్లఁ బెంపు దఱుగ, సౌఖ్య మొదవెఁ గుజాతివిజాతులకును
గాలకుటిలంబుఁ జూడుమా కంబుకంఠి, మాన్ప నెవ్వరివశ మమ్మ మాధవాజ్ఞ.

51

చ.

పలుమఱు నీవు పంటఁ బగఁబట్టినకైవడి నిట్లు మొల్లమొ
గ్గలు చిదుమంగ నేల కసుగందనియీచిగురాకు లెల్లఁ జే
తుల కసిదీఱఁగాఁ గణఁగి త్రుంపఁగ నేటికి మానవమ్మ మొ
క్కలము వహించి యిందు కొడిగట్టినదానవు మాననేర్తువే.

52


వ.

అని యివ్విధంబున సరససల్లాపంబులు సేయుచుఁ జంద్రకాంతోపలప్రకల్పితసోపానస
ముదయకూలంకషమధురజలతరంగచ్ఛటాసంచలితపద్మకైరవకల్హారవనవిహరమాణమ
రాళచక్రవాకబకసారసద్విరేఫమిథునసంసారంబైన కాసారంబుఁ జేరి జలక్రీడాసక్త
చిత్తంబుల నమ్మత్తకాశినులు దత్తటంబున విహరించుచు.

53


చ.

జలములఁ జల్లులాడుచును సారసపఙ్క్తుల వ్రేటులాడుచున్
బలుమఱు నీఁదులాడుచును బక్షికదంబముఁ దోలియాడుచున్
జలదలిమాలికామధురఝంకరణధ్వనితోడ లియ్యమై
కలసి లయప్రమాణములఁ గంకణనిక్వణముల్ చెలంగఁగన్.

54


వ.

విహరించి రప్పుడు.

55


సీ.

శంపాలతాంగులచరణకాంతులు కుశేశయకదంబముతోడ సరసమాడఁ
దారుణ్యవతులముత్తఱులయందము తరంగావళితోడ సయ్యాటలాడ
విచికిలగంధులకుచపాటవము చక్రసంఘంబుతో నెకసక్కెమాడఁ
గలహంసగమనలకన్నులబెళుకులు మీనపఙ్క్తులతోడ మేలమాడ
రాజవదనలవేణీభరములసొలుగు, ప్రబలశైవాలలతలతోఁ బందెమాడ
బాలికాజాలజలకేళిలీలఁ జాల, శ్రీకరం బయ్యె నప్పయోజాకరంబు.

56


మ.

కుచకుంభస్థలపాటవంబు దనరన్ గ్రొమ్మించు దంతచ్ఛటా
రుచు లొప్పన్ గరపుష్కరాంతరసమారూఢాంబువుల్ మీఁదఁ జ
ల్లుచుఁ గ్రీడించిరి తత్సరోవరమునన్ లోలేక్షణల్ మందమం
దచలద్యానములన్ మదద్విరదయూథస్ఫూర్తి వర్తిల్లఁగన్.

57


వ.

అంత.

58


చ.

పొది వెడలించు మన్మథునిపుష్పశరంబులలీల నీలతో
యదము నతిక్రమించి పొలుపారెడు శంపలగుంపుసొంపుసం
పదఁ దెరవాసి వచ్చు జిగిబంగరుజంత్రపుబొమ్మ లట్లు స
మ్మదమున నెచ్చెలుల్ సరసిమధ్యము వెల్వడి రుజ్జ్వలాంగులై.

59


క.

కేళీవిహారచేష్టలు, చాలించి యుషాలతాంగి సరసాంబరభూ
పాలంకరణోజ్జ్వలమై, యాళీజనసహితముగ గృహంబున కరిగెన్.

60


వ.

ఇట్లు చనుదెంచి సరసాన్నపానగంధమాల్యాదిభోగంబులం బరితుష్టయై నాఁటిరాత్రి త
పనబింబోపమానతపనీయవిరచితకుడ్యంబును, మహేంద్రనీలోపలఖచితవృత్తస్తంచి

జృంభితంబును, వివిధవిచిత్రవాతాయనరేఖామనోహరంబును, గనకపంజరాంతరనివాసశు
కశారికానికరసరససంగీతసాహిత్యవిద్యాప్రసంగసంగతంబును, దాంబూలచందనప్రసూ
నదానాద్యుపచారప్రయోజనప్రవీణచైతన్యసూత్రవిచిత్రకాంచనపాంచాలికాలంకృతం
బును, గంధకర్పూరకస్తూరికాప్రముఖపరిమళవస్తుసంతానవాసనాఘుముఘుమాయమా
నంబును, నిబిడతమఃపటలపరిహరణచణమణిగణదీపికావిరాజితంబును, నగు నిజమంది
రంబునందుఁ దరవణుల దివిచిన వజ్రంబుకోళ్లును, గోళ్లయం దమరించిన హరినీలంబులపట్టి
యలును, బట్టియల నలవరించి యల్లిన పట్టుపట్టెడయును, బట్టెడపయిం బఱచిన హంస
తూలికాతల్పంబును, దల్పంబుపై శిరశ్చరణపార్శ్వదేశంబులకు నుపధానంబులుగా నుం
చిన సూర్యపుటంబుదిండులును, నుపరిభాగంబున నలంకరించిన చిత్రచిత్రాభిరామంబగు
చందువాపటంబునుం గలిగి మనోహరంబై వెలయు శయ్యాతలంబున శయనించి.

61


చ.

అలక లొకింత జాఱి నిటలాంతముఁ గ్రమ్మఁగఁ దానియూరుపున్
జలువలు చల్లఁగా మెయి నలందినగందము సన్నవల్పెదు
వ్వలువముసుంగుపై నిగిడి వాసన లీనగ లోచనాంబుజం
బులు ముకుళించి యమ్మగువ ముద్దువగన్ నిదురించుచుండఁగన్.

62


మ.

కలలో నొక్కత్రిలోకసుందరశుభాకారుండు మాణిక్యకుం
డలశోభాంచితమందహాసరసవత్సుస్నిగ్ధగల్లద్వయీ
లలితాస్యుండు సుగంధబంధురసుమాలంకారనీలోపలో
జ్జ్వలధమ్మిల్లుఁడు కామినీహృదయపాంచాలుండు లీలాగతిన్.

63


సీ.

తాంబూలరసరంజితంబైన కెమ్మోవి యానుచో మొనపంట నూనియూని
కుంకుమాంకితకుచకుంభముల్ గ్రహణంబు సేయుచో నఖపంక్తిఁ జెనకిచెనకి
మకరికాకలితకోమలగల్లములముఖం బునుచుచోఁ జుంబనం బొసఁగియొసఁగి
లలితభూషణచయాలంకృతాంగము నెద నలముచో మర్మంబు లంటియంటి
కుసుమసాయకశాస్త్రానుగుణవిచిత్ర, బంధనైపుణి సురతప్రపంచసౌఖ్య
లీలఁ దనుఁ జొక్కఁజేసి లాలించె ననుచుఁ, గలికి కలఁ గాంచె నాశ్చర్యకరము గాఁగ.

64


క.

ఈలీలం గలలోపల, నాలోకింపంగఁ బడినయతఁ డనిరుద్ధుం
డాలావణ్యనిధి న్మును, హేలావతి వినియుఁ గనియుఁ నెఱుఁగదు మదిలోన్.

65


వ.

ఇత్తెఱంగున నక్కురంగనయన స్వాప్నికసంభోగసంజనితానందపారవశ్యంబును, నిద్రా
పరవశత్వంబును నేకీభవింప సుఖశయనంబు గావించి కించిదవశిష్టయామినీచతుర్థయా
మసమయంబున శతపత్రంబులతోన నేత్రంబులు వికసింప నమ్మనోహ రాంగుండు తనకౌఁ
గిటనున్నవాఁడ కాఁ దలంచుచు మేలుకాంచి పొడగానక గుండియ జల్లుమన దిగ్గన లేచి
శయ్యాతలంబునం గూర్చుండి నిద్రాముద్రాయమానంబులగు విలోచనప్రభాజాలంబులు
లోలంబులై కొలుకుల నలంకరింప నలువంకలం గలయఁ బునఃపునరవలోకనంబు సేయుచు

విభ్రాంతియు విస్మయంబును విచారంబును విషాదంబును విరహంబును నంతరం
గంబునం బెనంగొన నంతకంతకు నతిశయంబు మోహావేశంబునఁ దదీయసౌందర్యసౌ
కుమార్యవిలాసహావభావంబులు పలుమాఱుఁ దలంచుచు నాజగదేకసుందరుండు తన
ముందరం బొడగట్టిన ట్లైనం బట్టరానితమకంబున బట్టబయలు కౌఁగిటంబట్టఁబోయి
భుజలతాయుగంబునకు నప్రాప్తంబైన డెందంబు చిందఱవందఱయై నయనారవిందం
బులం దొరంగు నశ్రుజలబిందుసందోహం బమందంబై ప్రవహింప సహింపనలవిగానిపరి
తాపంబున వేఁడినిట్టూర్పు లొదవించుచు నిట్లని తలంచు.

66


ఉ.

నిద్దురవోవుచున్నయెడ నిశ్చయమైనవిధంబు దోఁప న
న్నొద్దికఁ జేరికూడి సుఖ మొందఁగఁజేసి భ్రమించినట్టి యా
ముద్దులుగుల్కుజవ్వనపుముమ్మరపుంనెఱజాణ యెవ్వఁడో
పెద్దయు నాటె వానిపయిఁ బ్రేమ మనంబున నేమి సేయుదున్.

67


శా.

ఆచక్కందన మావచోమధురిమం బామందహాసామృతం
బాచాతుర్యము నావయోవిభవ మాహా మోహముం జేయదే
యేచంద్రాస్యలకైనఁ బొందఁగలదా యీమేనితో వానితో
నేచందంబున నామనోరథఫలం బీడేఱునో దైవమా.

68


వ.

అని చింతించుచు.

69


క.

లలనామణికూటమి లీ, లలనామణిభూషణాంగు లలిఁగలసిన యా
కలమాటలు నిక్కంబుగఁ, గలమాటలుగాఁ దలంచుఁ గడుభ్రమచేతన్.

70


సీ.

మొనపంటికొలఁది నొక్కిననొక్కుచేఁ గెంపుటధరంబు చిమచిమయనినయట్లు
చెలువారుగోళ్లనాటుల తేఁట చెక్కిళ్లపై నెలవంక లేర్పడినయట్లు
చెలరేఁగి యలమిన చేపట్టుబిగువుచే గబ్బిగుబ్బలు కసుఁగందినట్లు
కళల సొక్కొదవిచు గాటంపురతులఁ బూవంటిదేహము వసివాడినట్లు
భావమునఁ దోఁచు స్వప్నలబ్ధంబులైన, సౌఖ్యములు మిథ్యలయ్యు నిశ్చయముగాఁగఁ
బురుషసంగతి చేసినకరణి నపుడు, పద్మదళనేత్ర కరుణానుబంధమునను.

71


క.

అంత సఖీప్రేరితయై, సాంతత్యం బైనయట్టిసమయోచితముల్
స్వాంతమున నిచ్చ లేకయు, దంతావళయాన యొకవిధంబున నడపెన్.

72


సీ.

బింబోష్ఠి దర్పణబింబంబుఁ జూపుచోఁ జెలువునిముద్దుచెక్కులు దలంచి
కలకంఠి మృగమదతిలకంబు దిద్దుచో సరసునిమేనివాసనఁ దలంచి
కలికి ముక్తామాలిక లలంకరించుచో రమణునిమందహాసముఁ దలంచి
పొలఁతి నీలోత్సలంబులదండ లొసఁగుచో రామునిచికుడభారముఁ దలంచి
గంధగజయాన హృదయంబుకరిగి కరిగి, యసురసురమంచుఁ బారవశ్యంబు నొందు
నిగిడి పుంఖానుపుంఖంబు లగుచుఁ దాఁకు, దర్పకునిపువ్వుటమ్ములఁ దాళలేక.

73

వ.

మఱియును.

74


సీ.

విన్నఁదనంబుఁ గైకొన్ననెమ్మోమునఁ బొడమనిచిఱునవ్వుఁ బొందుకొలుపు
దీనభావంబు చెందినవాలుఁగన్నుల లేనివికాసంబుఁ బూనఁజేయు
గద్గదస్వరము సంగత మైనమాటల నొదవనిచాతుర్యయుక్తిఁ జూపు
నుల్లాసభంగ మైయున్నచిత్తంబునఁ గొలుపనియుత్సాహగుణము నెఱపు
ఘనవియోగవహ్నిఁ గ్రాఁగుచునుండియు, మఱుఁగుసేయు నితరు లెఱుఁగకుండ
సఖులు తెలిసిరేని సంశయింపుదురను, భయమువలనఁ గుముదబంధువదన.

75


సీ.

ఎలనాగ వీణె వాయించుచో నాహిరి ఘంటారవంబునఁ గలసి చెలఁగు
జలజాక్షి కావ్యంబుఁ జదువుచోఁ బాంచాలగతి చోట బాహాటక్రమము దొనఁకు
నెలఁత చిల్కకు మాట నేర్పుచో గీర్వాణభాషలోనఁ దెనుంగుఁబల్కు గలయుఁ
జెలియ పద్యంబు రచించుచో శృంగారరసముపై బీభత్సరసము నిల్పు
విరహవిభ్రాంతికతమున విద్రుమోష్ఠి, యొకటి సేయంగఁబోవ వేఱొకటి దోఁచు
నగ్గలపుఁజింత హృదయంబు నంటియున్న, నిట్టు లౌటకు మది సంశయింప నేల.

76


తే.

దర్పకుని బాణతీవ్రత దాళలేక, యంగనామణి శివశివా యని వచించుఁ
గలికి కోవెలరొదలచే నలసిసొలసి, రామ పలుమాఱు శ్రీరామరామ యనును.

77


క.

సెగలయ్యెఁ జలువవెన్నెల, పొగలయ్యెను గప్పురంపుఁబొడి కన్నులకుం
బగలయ్యెఁ జిలుకమాటలు, వగలయ్యెను సుఖము లెల్ల వనితామణికిన్.

78


చ.

కల కలగాక నిశ్చయముగా మదిఁ దోఁచిన నాఁటనుండి తా
గలకలకంఠకీరకులకంఠములం జనియించుదట్టపుం
గలకలము ల్చెవింబడఁగఁ గాయజునమ్ములగాయము ల్మదిం
గలకల నొంప యామములు కల్పములై చెలి యుండ ఖిన్నతన్.

79


వ.

ఆసమయంబున.

80


అమరారీశ్వరుఁ డైనబాణున కమాత్యశ్రేష్ఠుఁడై బాహు
క్రమకేళీవిజితాహితప్రకరుఁడై ప్రౌఢిం జతుష్టష్టితం
త్రమహామంత్రకలాపలక్ష్యపరుఁడై రాజిల్లు గుంభాండనా
ముమునం దైత్యవరేణ్యుఁ డొక్కరుఁ డసామాన్యప్రభావంబునన్.

81


ఆ.

వానియనుఁగుఁబట్టి వరసుందరాకార, రేఖ నొప్పుఁ జిత్రరేఖ యనఁగఁ
దండ్రివలన మంత్రతంత్రయోగక్రియ లభ్యసించియుండు సాంగముగను.

82


శా.

ఆనీలాలక బాణకన్యకకు బాహ్యప్రాణమోనాఁగ నెం
తేనేస్తం బొనరించియున్నదగుటం దీనాననాంభోజయై
గ్లానింబొందుచునున్న యారమణియాకారంబు వీక్షించి చిం
తానిర్మగ్నమనోంబుజాత యగుచుం దత్కార్య మూహించుచున్.

83

తే.

ఇంగితజ్ఞానియగుట నాయిందువదన, వలపుమర్మంబుగా మదిఁ దెలిసి యపుడు
పలికె నేకాంతమునఁ జేరి పడఁతితోడ, బడలికలు దీఱఁ జల్లనిభాషణముల.

84


ఉ.

ఎన్నఁడు లేనివిన్నఁదన మేల మొగంబున దోఁచెనమ్మ నీ
కెన్నఁడు లేనిచింత మది నెక్కడనుండి ఘటించె నమ్మ ముం
దెన్నఁడు లేని యీకృశత నేటికి దేహము చిక్కెనమ్మ నీ
యున్నవిధంబుఁ జూచి వగనొందెడు నాహృదయంబు కోమలీ.

85


సీ.

కమ్మనిచిగురాకుకెమ్మోవి కసుగందె నుసురసురని వెచ్చ నూర్చకమ్మ
కనకంపునెమ్మేను కాఁకచేతఁ గరంగె విరహానలంబుచే వేఁగకమ్మ
తళుకునిద్దంపుటద్దపుమోము కళ దప్పె వలవల కన్నీరు వడువకమ్మ
వెలిదమ్మికన్నులతెలివి మందము నొందెఁ దురుముమేఘము గ్రమ్మఁ బొరలకమ్మ
పలుకఁగదవమ్మ వేసట పడకవమ్మ, సొలయ నేలమ్మ మో మెత్తి చూడవమ్మ
యేలి చేసెదవమ్మ మ మ్మేటి కింత, జాలి పెట్టెదవమ్మ యోచంద్రవదన.

86


క.

పరిరంభణమృదుచుంబన, సరసాలాపాదిసురతసౌఖ్యంబులచే
గరఁగించువిభునిఁ బాసిన, విరహిణిచందంబు దోఁచె వెలఁదీ నీకున్.

87


శా.

బాలా నిన్ను మదీయజీవముగ నే భావింతు నెల్లప్పుడున్
జాలా నేఁ గలుగంగ నెంతపనికి న్సంతాపముం బొందఁగా
నేలా సిగ్గున గుట్టుఁ జేసి హృదయం బిం కిట్లు చింతించుటల్
మేలా దాఁపక తెల్పు నీతలఁపు నెమ్మిం బూని కావించెదన్.

88


వ.

అని యివ్విధంబునం జిత్రరేఖావధూటి పలికినఁ దద్వచనౌషధంబు ప్రియానుపానసహి
తంబై యాత్మీయహృదయసంజనితమదనజ్వరంబు శాంతిం బొందించుటయు సేదదేఱి
నిజాభిప్రాయమార్గనిరోధకంబైన లజ్జాప్రవాహంబు ధైర్యప్లవంబువలన నుత్తరించి
కించిద్గదళితశ్రుతి విపంచీపంచమస్వరోపమానంబగు గద్గదస్వరంబున నిట్లనియె.

89


తే.

పాన్పుపై నొక్కనాఁడు నేఁ బవ్వళించి, నిదురపోవంగ లావణ్యనిధి యొకండు
చేరి నాయౌవనంబెల్లఁ జూఱగొనియెఁ, గల యనుచుఁ దోఁచు నిక్కంబు గాఁగఁ దోఁచు.

90


సీ.

సొగసైనచెక్కిళ్ళు చుంబించి చుంబించి చేరి మోమున మోముఁ జేర్చి చేర్చి
కరమునఁ బాలిండ్లు గదియించి కదియించి యధరపల్లవరసం బాని యాని
కేలి మైఁ గౌఁగిటఁ గీలించి కీలించి గళమున నఖపఙ్క్తి నిలిపి నిలిపి
చెలఁగి గళధ్వను ల్చెలఁగించి చెలఁగించి నిద్దంపుఁబొక్కిలి నివిరి నివిరి
పోఁకముడి విచ్చి దేహంబు పులక లొదవ, నవయంబులు గదియంగ నదిమి యదిమి
యవల నేమేమొ చేసె నయ్యాగడంబు, నెట్లు చెప్పుదు సిగ్గు నోరెత్తనియదు.

91


చ.

అటువలె వానికౌఁగిట సుఖానుభవంబునఁ జొక్కియుండి యం
తటఁ గనువిచ్చి మేలుకొని తన్మహనీయవిలాసమూర్తి నా

దటఁ బొడగాననైతిఁ బరితాపభరంబున నాఁటనుండి నే
నిటువలె నున్నదానఁ గృశియించుచు జీవము వానిసొమ్ముగన్.

92


చ.

మదగజవైరివంటినడు మాకమలంబులవంటికన్ను లా
యదనశశాంకువంటి మొగ మాముకురంబులవంటిచెక్కు లా
మదనునివంటిచక్కఁదన మామధురాధర వానిరూపు నా
హృదయపటంబునందు లిఖియించినకైవడిఁ గాననయ్యెడున్.

93


తే.

ప్రాణసఖి వైననీకు దాపంగ నేల, విన్నవించితి నామది నున్నవిధము
వానిఁ గన్నులఁ జూపి జీవంబు నిలుపు, మనుచుఁ గన్నీరు దొరఁగ దైన్యంబు నొందె.

94


ఉ.

అయ్యలివేణి దైన్యమున కాత్మఁ గలంగుచు బాష్పబిందువుల్
పయ్యెదకొంగునం దుడిచి భక్తిమెయిన్ శిశిరోపచారముల్
సయ్యనఁ జేసి నెమ్మది విషాదము దీఱఁగ నూఱడించి తా
నయ్యెడఁ గొంతసేపుహృదయాబ్జమునం దలపోసి నేర్పునన్.

95


శా.

రంగుల్మీఱుపటంబున న్వివిధవర్ణద్రవ్యముల్ గూర్చి సా
రంగారంకానన వ్రాసె ముజ్జగములన్ రాజిల్లు రాజన్యులం
బంగారంపుమెఱుంగువ్రాతజిలుగుల్ పైపైఁగళ ల్దేఱఁగా
శృంగారంపురసంబు వెల్లివిరియం జిత్రక్రియావైఖరిన్.

96


చ.

కళలు సెలుంగుమోములు వికాసవిలాసముఁ జూపుకన్నులుం
జెలువము గుల్కుమేనులును జెక్కులపైఁ బ్రసరించునవ్వులున్
దళుకులు చల్లుభూషణవితానముఁ గల్గి సజీవచిత్రముల్
నిలిపినయట్లు వ్రాసె రమణీమణినేర్పు వచింప శక్యమే.

97


ఆ.

వ్రాఁత కజుఁడు గర్త సేఁతకుఁ దాఁ గర్త, యనుట కిది విరోధ మైన నేమి
సేఁత కజుఁడు గర్త వ్రాఁతకుఁ దాఁ గర్త, యనుచుఁ జిత్రరేఖ ననఁగవచ్చు.

98


వ.

ఇవ్విధంబునం ద్రిభువనంబులంగల్గు పురుషశ్రేష్ఠుల లిఖియంచిన యప్పటంబు నుషా
సుందరిముందట నుంచి యిట్లనియె.

99


చ.

త్రిభువనవాసులై వెలయు దేవమనుష్యభుజంగకోటిలోఁ
బ్రభుతయు రూపసంపదయుఁ బ్రాజ్ఞతయుం గలవారినెల్ల నే
ర్చి భగవతీమహామహిమచే లిఖియించితి నిప్పటంబునం
దభినవమూర్తియై తగినయాఘనుఁ డెవ్వఁడు వీరిలోపలన్.

100


వ.

అని మఱియు నిట్లని వివరింపందొడంగె.

101


ఉ.

దివ్యవిమానయానముల దివ్యసుగంధవిలేపనంబులన్
దివ్యలతాంతవాసనల దివ్యధునీజలకేళిలీలలన్

దివ్యవిలాసినీరతుల దివ్యశరీరములన్ సుఖాత్ములై
దివ్యపథంబున న్మెలఁగు దేవతల న్వివరించి పల్కెదన్.

102


శా.

ఆనందాకరవైభవానుభవు రంభాద్యప్సరోనాట్యలీ
లానిత్యోత్సవుఁ బారిజాతకుసుమాలంకారహారు న్సుర
స్థానావాససుఖోన్నతుం ద్రిభువనీసామ్రాజ్యసింహాసనా
సేను న్నిర్జరభర్తఁ జూడు మితని న్శీతాంశుబింబాననా.

103


ఉ.

ఆహవనీయదక్షిణసమాఖ్యలచేఁ జెలువంది మంత్రపూ
తాహుతుల న్సరోరుహభవాదులఁ దృప్తి వహింపఁజేసి యా
వ్యాహతలీల సాధకజనాళికి సౌఖ్యము లిచ్చుపుణ్యుఁ డు
త్సాహగుణాసమానుఁడు కృశానుఁ డితఁ డిటు చూడు కోమలీ.

104


వ.

అని తెలిపి వారియం దనాదరంబైన తదీయహృదయంబుఁ దెలిసి శేషించిన దిక్పాలక
దేవతాగణంబుల వేర్వేర వివరించెద ననుచు నిట్లనియె.

105


చ.

అతులితధర్మవంతుఁడు కృతాంతుఁ డనూనుఁడు యాతుధానుఁ డా
యతశుభుఁ డంబురాశివిభుఁ డంచితదేహుఁడు గంధవాహఁ డు
న్నతమతి గుహ్యకాధిపతి నాగధరుండు హరుండునుం జుమీ
యితఁడు నితం డితం డితఁడు నీతఁడు నీతఁడు సుందరీమణీ.

106


ఉ.

కామునిమించు సుందరము కంజవనాప్తుని గెల్చుతేజమున్
సోమునిఁ గేరునెమ్మొగము శోభిలువాఁ డలకల్పవృక్షచిం
తామణికామధేనుసహితంబగు సంపద లింట గల్గుసు
త్రామునికూర్మినందనుఁ డితండు జయంతుఁడు నీరజాననా.

107


శా.

భారాంతస్పృహు లైననిర్జరుల పైపైసోఁకి యెవ్వాని నిం
డారం బైకొను నర్తనాభినయభావారంభసంరంభరం
భారంభోరుముహుర్ముహుస్తరళితాపాంగచ్ఛటామాలికా
సారం బానలకూబరుం డితఁడు తత్సౌందర్య మీక్షించితే.

108


సీ.

కంబుకంధర వీరు కమనీయనిరతయౌవనమదోద్ధతులు గీర్వాణతతులు
సరసిజేక్షణ వీరు సంగీత నృత్యవిద్యాధురంధరులు గంధర్వవరులు
కుటిలకుంతల వీరు ఘుటికాంజనాదిక్రియాసుసాధకులు విద్యాధరేంద్రు
లమృతాంశుముఖి వీరు సుమహితాష్టవిశేషసిద్ధిప్రసిద్ధులు సిద్ధవిభులు
గరుడకిన్నరరుద్రకింపురుషసాధ్య, యక్షరక్షోభుజంగగుహ్యకులు వీరు
నీకటాక్షాంచలంబులు నిగుడఁజేసి కెలన వీక్షింపు మోరాజకీరవాణి.

109


వ.

అని పలికి యనంతరంబ పాతాళలోకనివాసుల వ్రాసిన పటంబుఁ జూపి యిట్లనియె.

110

మ.

భవనాలంకృతనూత్నరత్నరుచిసంపన్నంబు రాజీవకై
రవకల్హారమరందపానమధుపవ్రాతస్వనోదారభో
గవతీతీరమనోహరం బఖిలభాగ్యశ్రీనివాసంబు నై
ప్రవణంబొందినయట్టిలోకము గదా పాతాళ మబ్జాననా.

111


వ.

తద్భువననివాసు లైన నాగపుంగవుల వివరించెదం గనుంగొనుము.

112


శా.

పారావారవిహారియైనహరికిం బర్యంకమై ద్వీపశై
లారణ్యాంబు నిధిప్రయుక్తమహనీయక్షోణికి న్నిల్వనా
ధారంబై యురగేంద్రలోకమునకుం దా సార్వభౌమాంకుఁడై
శ్రీ రంజిల్లు ఫణాసహస్రకలితు న్శేషు న్విలోకింపుమా.

113


చ.

అతులసుధాపయోధిమధనావసరంబున మందరాద్రి క
ప్రతిహతలీల నావరణపాశలతాకృతిఁ దాల్చి దానవా
హితులకు వాంఛికంబు ఫలియింపఁగఁజేసిన కీర్తిశాలి భా
సితసితదీర్ఘదేహు ఫణిశేఖరు వాసుకిఁ జూడు మీతనిన్.

114


వ.

అని మఱియుం దక్షకకర్కోటకప్రముఖులైన చక్షుశవశ్రేష్ఠుల రూపనామంబు
లు చక్షుశ్శ్రవంబులకు గోచరంబులుగా దృష్టంబును శ్రుతంబును గావించిన దదీయ
రూపనామంబులు వేదాంతసిద్ధవచనప్రకారంబున నాత్మకు వేఱై యస్థిరం బగుటయుఁ
దదీయముఖచిహ్న౦బులవలనం దెలిసినదై తదనంతరంబ మధ్యమలోకపురుషపరివృఢులఁ
దెలుపందలంచి యిట్లనియె.

115


చ.

శుకపికశారికానినదశోభితకేళివనాంతరంబులన్
వికసితపద్మకైరవనవీనసుగంధసరోవరంబులం
బ్రకటసువర్ణగేహముల భద్రగజేంద్రతురంగమాదులన్
సకలసువస్తుసంపదల సౌఖ్యదమై తగుమర్త్య మంగనా.

116


వ.

ఏతద్భువనంబునం గలుగు రాజశేఖరుల నాలోకింపుము.

117


చ.

నిజగజనాథయూథపదనిర్ధళితోన్మదవైరిపార్థివ
వ్రజచతురంగసైన్యుఁడు విరాజితరత్నవిభూషణప్రభా
విజితవిభాకరుండు పరవీరభయంకరఖడ్గవిస్ఫుర
ద్భుజుఁడు కళింగభూభుజుఁడు తోయరుహానన వీఁడె చూడుమా.

118


చ.

లలితలవంగకోమలవిలాసలతాపరిణద్ధచందనా
మలమలయక్షమాభృదసమానసుగంధవిశేషశీతలా
నిలనిలసద్గవాక్షచయనిర్మితహర్మ్యవిహారి పాండ్యుఁ డీ
యలఘునిఁ జూడవమ్మ దరహాససుధారసరంజితాననా.

119

శా.

గంధేభేంద్రసమానయాన తెలియంగాఁ జూడు వీనిం జతు
ష్కంధిప్రావృతమేదినీవలయవిశ్రాంతప్రతాపాబ్జినీ
బంధుం యుద్ధకృశప్రసిద్ధబలవత్ప్రత్యర్థిరాజన్యని
ర్బంధుం సాంబశివార్చనానుగుణసంబంధుం జరాసంధునిన్.

120


శా.

చౌదంతి న్యుగదంతిగాఁ గొని సహస్రాక్షుండు యుగ్మాక్షుఁడై
మోదం బొప్ప ధర న్జరించుగతిఁ బెంపు న్సొంపు సంధిల్లగా
వేదండోత్తమవాహుఁడై వెలయు నీవీరుం బ్రభాభాసమా
నాదిత్యుం భగదత్తుఁ జూడుము నితంబాభోగహేమాంశుకా.

121


శా.

పూజ్యంబై తగుకౌరవాన్వయమునం బాల్పొంద జన్మించి సా
మ్రాజ్యం బేలుసుయోధనుం దెలివి మీఱం జూడు మొక్కింతది
వ్యజ్యోతిర్మయసాధను న్విహితబాహాదండకోదండదం
డజ్యానిర్యదఖండచండతరకాండప్రోద్భటాయోధనున్.

122


ఉ.

తోయజగంధి చూడుము విధూతతమోగుణదివ్యతేజుఁడై
ధీయుతమూర్తియై వసుమతి న్విహరించు పయోజబాంధవుం
డీయితఁ డంచు నెంచఁదగుఠీవి వెలుంగుచునున్నవాని రా
ధేయుని దానవైభవవిధేయుని వర్ణితభాగధేయునిన్.

123


సీ.

జయముచే ధర్మనిశ్చయముచే వైభవోదయముచేఁ దగువాఁడు ధర్మజుండు
దిటముచే భుజబలోత్కటముచే రణజయాగ్భటముచేఁ బెంపొందు పవనజుండు
యుక్తిచే విబుధానురక్తిచే వరబాణశక్తిచే నధికుండు సవ్యసాచి
బుద్ధిచే నతులప్రసిద్ధిచే భాగ్యాభివృద్ధిచేఁ బొగడొంది వెలయు నకులుఁ
డసమశరసమసుకుమారరసమనోహ, రావతారుండు సహదేవుఁ డంబుజాక్షి
వీర లేవురు పాండవవీరవరులు, పెంపు సొంపార నిటు విలోకింపవమ్మ.

124


చ.

సుమహితధాళధళ్యరుచిసుందరకోమలవిగ్రహంబుపై
నమలతరేంద్రనీలనికరాసితవర్ణఘనాంశుకంబుతో
నమరిన నీలమేఘరజతాచ రాజముఁ బోలు రేవతీ
రమణునిఁ జూడవమ్మ బలరామునిఁ గోమలపాటలాధరా.

125


సీ.

లలితరేఖాత్రయీకలితకంఠమువాఁడు ధవళవిస్తారనేత్రములవాఁడు
ఆజానులంబిబాహావిలాసమువాఁడు కమనీయనీలాలకములవాఁడు
హారశోభితవిశాలోరస్థలమువాఁడు తరుణారుణాంఘ్రిపద్మములవాఁడు
మహనీయనీలకోమలశరీరమువాఁడు నవదరస్మితసుధాననమువాఁడు
సరసకల్యాణగుణవిశేషములవాఁడు, మదనశతకోటిసౌందర్యమహిమవాఁడు
దేవకీనందనుఁడు కృష్ణదేవుఁ డితఁడు, వనిత గనుఁగొమ్ము నేత్రోత్సవంబు గాఁగ.

126

మ.

త్రిజగన్మోహనరూపవైభవుని సాంద్రీభూతకీర్తింబ్రతా
పజయార్కున్ రతికామినీకుచతటీపాటీరముద్రాకరాం
బుజునిం గంఠవిలంబమానవిలసన్ముక్తామణిమాలికా
వ్రజుని న్మారటకృష్ణమూర్తి యగునీప్రద్యుమ్ను నీక్షింపుమా.

127


ఉ.

చక్కనివారిలో మొదలిచక్కనివాడగుతండ్రికన్ననుం
జక్కనివాఁడు భవ్యగుణసంపదఁదాతను బోలువాఁడు పెం
పెక్కినకీర్తివాఁడు కమలేక్షణపౌత్రుఁడు శంబరారికిన్
మక్కువనందనుం డితఁడు మానవతీ యనిరుద్ధుఁ జూడుమా.

128


వ.

అని యివ్విధంబున నవ్వనిత యవ్విలాసినీతిలకంబునకు భూలోకపురుషపుంగవుల
వేర్వేఱ వివరించుచు ననిరుద్ధకుమారపర్యంతంబునుం జూపునప్పుడు.

129


సీ.

అంగవంగకళింగబంగాళనృపులపై సారంగగతులచేఁ జౌకళింప
గౌళనేపాళపాంచాలభూభుజులపై నవతటిల్లతరేఖ నవఘళించి
మగధమత్స్యమరాటమద్రనాయకులపై మత్స్యపుటంబులమహిమ నిగిడి
యాదవవృష్టిభోజాంధకశ్రేణిపై యలతేఁటిదాఁటులనెళవు చూపి
మఱియు గోపాలదేవమన్మథులమీఁద, బొట్టెకోలలగతి దాఁకి మిట్టి తిరిగి
వ్రాలి యనిరుద్ధునందుఁ గ్రొవ్వాఁడిచిలుకు, ములికియై నాటె కలకంఠి బెళుకుఁజూపు.

130


చ.

కనుగొనఁగానె జల్లుమనెఁ గైరవలోచనగుండె దేహమె
ల్లను బులకించెఁ గన్నుల జలంబులు జాలయి పాఱె మోమునం
బెనఁగొని దైన్యరేఖ నవనీతగతిం గరఁగె న్మనంబు ము
న్పనుపడియున్న తాపశిఖి ప్రజ్వలభావము నొందె వింతయై.

131


ఉ.

కన్నులఱెప్ప లాఁగనివికాసపుఁజూపును మౌనముద్రతో
నున్నమొగంబు నిశ్చలత నొప్పుశరీరముగాఁ బటంబుపై
నున్నతలీల వ్రాసినప్రియుం గని పొక్కునఁ దాను నట్లయై
చిన్నెలు దక్కియుండె సఖి చేసినజంత్రపుబొమ్మకైవడిన్.

132


తే.

అతనిలావణ్యసరసియం దతివచూపు, నిండుకొని బారులయ్యెను గండుమీలు
నుప్పతిలి గుంపులయ్యె నీలోత్పలములు, పాదుకొని మూఁకలయ్యెఁ బుష్పంధయములు.

133


ఉ.

చూచుఁ జలించి పైఁబడఁగఁ జూచుఁ గుచంబుల నొత్తిపట్టఁగాఁ
జూచు నఖాలి మైఁ జెనకఁ జూచు సుధాధరబింబ మానఁగాఁ
జూచుఁ గవుంగిటం బెనఁగఁజూచుఁ గపోలము ముద్దు పెట్టఁగాఁ
జూచు లతాంగి యమ్మదనసుందరరూపముఁ జూచి భ్రాంతితోన్.

134

వ.

ఇత్తెఱంగున నక్కోకకుచ తనరుచిరావలోకనంబులు పరమశాంతుని హృదయంబునం
బోలె దత్సౌందర్యలహరీమగ్నంబై యానందలహరిఁ దేలుచున్న నెట్టకేలకు మరలించి
కుంభాండకతనూభవ ముఖాంబుజంబున నిలిపి యిట్లనియె.

135


ఉ.

వీఁడు గదమ్మ నానిదురవేళ ఘటించినవాఁడు కోమలీ
వీఁడు గదమ్మ పంచశరవిద్యలు చూపినవాఁడు తొయ్యలీ
వీఁడు గదమ్మ నాహృదయవిత్తము నాచినవాఁడు యుగ్మలీ
వీఁడు గదమ్మ యీవిరహవేదనఁ గొల్పినవాఁడు నెచ్చెలీ.

136


క.

నిన్నుండి వీనిరూపముఁ, గన్నులఁ జూడంగఁగలిగెఁగా నేటికినో
క్రొన్ననఁ బోడిరొ నీఋణ, మెన్నిభవంబులకునైన నీఁగంగలనే.

137


వ.

మేఘాగమనంబునకు నెదురుచూచుచున్న మయూరంబువిధంబున, సంపూర్ణపూర్ణి
మాచంద్రబింబోదయంబుఁ గోరుచున్న చకోరంబుకైవడి, స్వాతివర్షంబు నపేక్షించు
చున్న మౌక్తికశుక్తిచందంబున, హృదయంగమాకారుండైన యీ రాజకుమారుతోడి
సంభోగంబునకు నాహృదయంబు నిరంతరవ్యాపారంబై యభిలషించుచున్నయది.
దురంతంబైన విరహపారావారంబు నీఁదవశంబు గాక మునుంగుచున్న నాకుం దెప్ప
విధంబున నాభాగ్యవశంబున నీవు సంఘడించితివి. ఏయుపాయంబుననైన నీతనిం
దెచ్చి మామకమనోరథం బీడేర్చి ప్రాణదానంబు సేయవలయు నిది యనుచితంబని విచా
రించెదవేని నాకర్ణింపుము.

138


సీ.

కలలోనఁ గన్నవార్తల కింతవలవంత కేమికారణమని యెంచుకొంటి
నాయున్కి గనుఁగొన్న నాసాటివారిలో నిది లాఘవంబని యెంచుకొంటి
మదిలోన నీ మాట మఱచియుండెదఁ గాక యెంత లేదని బుద్ధి పెంచుకొంటి
గుఱు తెఱుఁగనివానికూర్మి కాశించిన నేమిఫలంబని యెంచుకొంటి
నేమి సేయుదు వానికళామనోజ్ఞ, వదనపూర్ణేందుచంద్రికావ్యాప్తిఁ జంద్ర
కాంతరత్నంబుకైవడిఁ గరఁగియున్న, భావమున ధైర్య మింతైనఁ బాదుకొనదు.

139


ఉ.

కావునఁ బక్వబింబఫలకాంతులతోఁ దులఁదూఁగు వానికె
మ్మోవిసుధారసంబు మది మోహము దీఱఁగ నానకుండినన్
భావభవజ్వరజ్వలనబంధురతీవ్రశిఖాకలాపతా
పావహమైన నాదుహృదయవ్యధ దీఱునె యెన్నిభంగులన్.

140


మ.

కలికీ మాటలు వేయు నేమిటికి నీకాయంబుతో వానితోఁ
గలయ న్భాగ్యము గల్గకున్న విభునింగాఁ జేయుమీ వీని రాఁ
గలజన్మంబున నంచు బ్రహ్మకు నమస్కారంబుఁ గావించి య
వ్వల దేహాంతరతీవ్రలబ్ధి కుచితవ్యాపారముం జేసెదన్.

141

తే.

అనుచుఁ జెలి పల్కు ఖేదవాక్యములతోన, వేఁడినిట్టూర్పుగాడ్పు లావిర్భవించె
నూరుపులతోన కన్నీరు లేఱులయ్యె, నశ్రువులతోన పరవశంబయ్యె మేను.

142


తే.

అతివ దురవస్థఁ గనుఁగొని యాత్మ గలఁగి, యువతి వివశత దీఱంగ నుపచరించి
యనుగుణం బైనమధురవాక్యములమనసుఁ, జల్లజేయుచునుండె నాసమయమునను.

143


వ.

అని శుకుండు పలికె ననినఁ దదనంతరవృత్తాంతం బెట్లయ్యె నెఱింగింపుమనుటయు.

144


చ.

చతురవిహారహారమణిసాంద్రలసద్భుజమధ్య మధ్యని
ర్జితమృగరాజ రాజసరసీరుహమశ్రసునేత్ర నేత్రశో
భితవసుభద్ర భద్రగజభీతిహరాదనభావ భావజా
హితమతివాస వాసవమణీద్ధరుచిస్ఫుటకేశ కేశవా.

145


క.

దురితపరితాపపరిహర, చరితాభరితాదరాత్మశంకరహృదయ
స్మరితహరిదశ్వకోటీ, స్ఫురితాస్ఫురితారినినదసంశ్రుతివినుతా.

146


భుజంగప్రయాతము.

మహామంగళాకారమాస్నేహమోహా
వహాభూధరోత్సాహవారాహదేహా
గుహాత్మజ్ఞ సాంచిత్య ఘోరాఘదాహా
మహామంగళాద్రి ప్రమావత్సుగేహా.

147


గద్య.

ఇది శ్రీమంగళాచలనృసింహకృపాప్రసాదసంప్రాప్తవిద్యావైభవ కనుపర్తిరా
యనమంత్రితనూభవ సుజనహితకృత్య నిత్యాబ్బయామాత్య ప్రణీతంబైన యనిరుద్ధ
చరిత్రం బను మహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము.