అనిరుద్ధచరిత్రము/ప్రథమాశ్వాసము

శ్రీరామచన్ద్రాయ నమః

అనిరుద్ధచరిత్రము

పీఠిక




నిత్యోత్సవమందిరంబు లగులక్ష్మీమోహనాపాంగ వీ
క్షానీలోత్పలమాలికావళులు శృంగారంబుగా నంగపూ
జానైపథ్య మెలర్పఁ దత్తనులతాసంక్లిష్టకేళిం బ్రియా
నూనుండై తగుమంగళాచలనృసింహుం డిచ్చు మాకోరికల్.

1


చ.

సరసతఁ గౌఁగిలింప గిరిజాకుచపాళి నిజాంగలిప్తభా
సురభసితాంత మై కులుకుచున్ వెలిదామరమొగ్గజోడుసుం
దరత వహించుచుండ మమతం బలుమాఱును జూచి సొక్కుశం
కరుఁడు ప్రసన్నుఁడై యొసఁగుఁ గావుత మాకు నభీష్టసంపదల్.

2


మ.

అకలంకం బగుచిత్తశుద్ధికొఱకై యశ్రాంతమున్ మ్రొక్కెదన్
సకలస్థావరజంగమాత్మక జగత్సంసారనిర్మాణక
ర్తకు నానాదురితాపహర్తకు సమస్తామ్నాయసంధర్తకున్
బ్రకటస్మార్తమనోవిహర్తకును వాక్పద్మేక్షణాభర్తకున్.

3


చ.

కలిమికిఁ బుట్టినిల్లు సురకన్యల కేలికసాని ముజ్జగం
బులకును గన్నతల్లి కృతపుణ్యులకున్ ధనధాన్యరాశి వి
ద్యలచెలి కత్తగారు కలశాబ్ధికిఁ గూరిమిపట్టి శౌరికిన్
గులసతి యాదిలక్ష్మి దయదుల్కెడు చూపుల మమ్ముఁ బ్రోవుతన్.

4


శా.

శ్రీవిద్యాబగళాముఖీ భగవతీ చింతామణీ శ్యామలా
దేవీ వశ్యముఖీ సమాహ్వయములన్ దీవ్యన్మహా మంత్ర యం

త్రావిర్భూతనిజాంశ లాశ్రితుల కిష్టైశ్వర్యముల్ చేయఁ జి
ద్భావాకారత నొప్పు శాంభవి ననున్ బ్రహ్మజ్ఞాన్వితుం జేయుతన్.

5


చ.

రవరమణీయకీరసుకరంబు నభీష్టఫలోదయంబు మా
ర్దవసుమగంధయుక్తము సుధాసమవర్ణము గల్గి వర్ణనీ
యవిబుధలోకకల్పతరువై తగుపద్మజురాణి వర్తనో
త్సవము వహించుఁగాత నిరతంబును మద్రసనాంచలంబునన్.

6


ఉ.

అంబుజగర్భనిర్జరవరాదులచేత సపర్యలందు హే
రంబుఁ గృపావలంబు మునిరాణ్ణికురుంబమనోంబుజాతరో
లంబు దరస్మితాననకళాజితశారదచంద్రబింబు భూ
షాంబరుగ్విడంబు విజితారికదంబు భజింతు విద్యకై.

7


మ.

దీనరాట్తేజులఁ గాళిదాసు భవభూతిన్ దండి బాణున్ మయూ
రుని శ్రీహర్షుని సోముభారవిని జోరున్నన్నపన్ దిక్కశ
గ్మను శ్రీనాథుని సోము భీమకవి నెఱ్ఱాప్రెగ్గడన్ భాస్కరున్
వినుతింతున్ హరిభక్తినిష్ఠుల మహావిద్వత్కవిశ్రేష్ఠులన్.

8


చ.

చతురకవిత్వతత్వపటుసంపద యొక్కరిసొమ్ము గాదు భా
రతిదయ సౌధవార్ధికవిరాజుల మానసముల్ ఘటంబు లా
యతము కొలంది లబ్ధమగు నయ్యమృతం బటుగాఁ దలంచి య
ద్యతన కవీంద్రులార కృప దప్పక మత్కృతి నాదరింపుఁడీ.

9


తే.

కాళిదాసాదులకునైనఁ గలవు తప్పు
లనిరి పెద్దలు మాదృశు లనఁగ నెంత
తప్పు గల్గిన దిద్దుఁడీ యొప్పుగాను
బాలునకు బుద్ధి నేర్పినభంగిఁ గవులు.

10


తే.

భగవదర్పితకార్యంబుపట్ల నెరసు, లున్న దూషింపవలదు మాయన్నలార
ఘనకిరీటంబు ధరియించుకొనిన తలకు, సుళ్లు లెక్కలు వెట్టుట చొప్పు గాదు.

11


చ.

సుకవులసూక్తులందు సరసుల్ నెరసుల్ వెదుకంగఁబోరు మ
క్షికవితతుల్ వ్రణంబు పరికించుగతిం గొడవల్ గణించుటల్
కుకవుల నైజబుద్ధి తెరలో కథచొప్పున బొమ్మలాడఁగా
నొకకడ హాస్యపుంబ్రతిమ లుండవె పెక్కులు వెక్కిరించుచున్.

12


వ.

అని యిట్లు ప్రధానదేవతానమస్కరణంబును బురాతనాద్యతనసుకవిపురస్కరణం
బును గుకవితిరస్కరణంబును గావించి యనంతరంబ.

13


సీ.

శ్రీమంగళాద్రి లక్ష్మీనృసింహుల కటాక్షాంచలామృతవృష్టి నంకురించి
సంగీతసాహిత్యసరససౌష్ఠవయుక్తి శాఖోపశాఖలఁ జాలఁ బ్రబలి

రసికరాజన్యముఖ్యసమాజబహుమానసతతవసంతాభిరతిఁ జిగిర్చి
దైవనామాంకితస్తవమనోహరభావపదవాక్యసుమములఁ బరిమళించి
యభినవస్థితిఁ బెంపొందు నస్మదీయ, భాగధేయసారస్వతపారిజాత
తరువునకుఁ దగు సత్ఫలోదయము గాఁగ, సముచితంబుగ నొకప్రబంధము రచింతు.

14


క.

చదువులకు మేర యెయ్యది, చదివినమాత్రంబె చాలు సరసవచస్సం
పదఁ దా నేర్చిన కొలఁదిని, యదనఁగవితఁ జెప్పి హరికి నర్పింపఁదగున్.

15


మ.

అతిదాక్షిణ్యుఁ డతండు పూర్వక వికావ్యప్రౌఢవాచారసో
న్నతులం దేలినఁ దేలుఁగాక యెపుడున్ నావంటికిం చిద్జ్ఞుచే
గృతి విశ్వాస మెఱింగి చేకొనియెడున్ శృంగారపద్వల్ల వీ
రతులం జొక్కియుఁ గుబ్జమేను వగమీఱన్ దీర్చి చేపట్టఁడే.

16


క.

భగవంతుని సద్గుణములు, పొగడువివేకంబై తమ కపూర్వైశ్వర్యం
బగుట నరస్తుతి సేయరు, జగతిన్ సత్కవులు తుచ్ఛసంపదకొఱకై.

17


మ.

హరినామాంకితకావ్య మెట్టిదయిన న్నానందమై సజ్జనా
దరణీయం బగుఁ బుష్పమాలికలలో దారంబు చందంబునన్
నరనామాంకితమైనకావ్యము రసౌన్నత్యస్థ మయ్యు న్నిరా
కరణం బై చను హీనజాతిపురుషం గైకొన్న వేశ్యంబలెన్.

18


చ.

కృతులు నిజాంకితంబు లొనరించిన నిష్టధనంబు లిచ్చి స
మ్మతిఁ బ్రభువుల్ కవీశ్వరుల మన్ననసేయట కీర్తిఁ గోరి ని
శ్చితమతి దేవతాస్తుతియె సేయుకవీంద్రుల నాదరించి స
త్కృతి యొనరించు సత్ప్రభునికీర్తికిఁ గీర్తి ఘటింపకుండునే.

19


వ.

అని తలంచి యొక్కనాఁటిరాత్రియందు నాయిష్టదైవం బైన శ్రీమంగళాచలనృసింహ
దేవు దేవాలయంబునకుం జని వివిధమణిగణనిరాజితంబును, ప్రదీప్తహాటకమయం
బునునై నయనారవిందంబులకు నూతనంబైన యానందవికాసంబు సంపాదించుచున్న
గోపురప్రాకారశిఖరగర్భగృహాంతరాళికాముఖమండపప్రభాసౌభాగ్యంబు లవలోకించి
యాశ్చర్యంబు నొందుచుఁ బ్రదక్షిణంబులు చేసి స్వామిదర్శనంబు సేయుచు నుత్సాహం
బున నంతర్గృహంబున కరిగి యందు.

20


సీ.

సంపూర్ణపూర్ణి మాచంద్రబింబమువంటి మోమునఁ జిఱునవ్వు మొలక లెత్త
నంకపీఠమున సుఖాసీనమైయున్న కమలావిలాసవిభ్రమ మెసంగ
శంఖచక్రగదాబ్జసంశోభితములైన బాహాచతుష్టయప్రభలు నిగుడ
గ్రైవేయమకుటకంకణకుండలాంగదహారావళులు మేన నందగింప
బాలికాహస్తపంకజాలోలచారు, చామరానిలమోదితస్వాంతుఁ డగుచు
దివ్యసింహాసనంబునఁ దేజరిల్లు, మోహనాకారు నరసింహమూర్తిఁ గంటి.

21

క.

కని సాష్టాంగముగా వం, దనములు గావించి లేచి తత్సామీప్యం
బున నిలిచి కొలిచి యుండఁగ, ననుఁ జల్లనిచూడ్కిఁ జూచి నయముగఁ బలికెన్.

22


క.

బాలత్వమందె నీకు ద, యాళుఁడనై యొసఁగితి మదర్పితకవితా
ఖేలనమును మద్భజనా, శీలంబును దృఢముగాఁగఁ జేసితి వత్సా.

23


క.

అనిరుద్ధచరిత్రయుఁ జ, క్కని ముచ్చట విస్తరించి కణఁగి ప్రబంధం
బొనరింపుము శ్రేయోవ, ర్ధనమగు మాపేర నంకితము సేయుఁ దగన్.

24


వ.

అని పలికినఁ బరమానందభరితహృదయుండనై తద్వచనంబు మహాప్రసాదంబుగా నంగీ
కరించుకొని యిట్లంటి.

25


ఉ.

ఓ కమలామనోరమణ యో పరమేశ్వర యో జగత్పతీ
యో కరిరాజదైన్యహర యో శరణాగతవజ్రపంజరా
యో కరుణారసామృతపయోధి పునర్జననంబు మాన్పి సౌ
ఖ్యాకరమైనసత్పదము నందఁగఁజేసి కృతార్థుఁ జేయుమీ.

26


వ.

అని పునఃపునఃప్రణామంబులు చేసి తదనుజ్ఞ వడసి యందుండి మరలి గృహంబునకు
వచ్చితి నని యాదృశంబైన స్వప్నంబుఁ గాంచి మేల్కని యపరిమితప్రమోదరస
మగ్నాంతరంగుండనై కొంతదడవు తదీయదివ్యమంగళవిగ్రహంబు భావించుచుండితి
నివ్విధంబునఁ దదననుగ్రహంబు వడసినవాఁడనై యేతత్ప్రబంధరచనాక్రమంబునకు
నుపక్రమించి మద్వంశప్రకారంబు వర్ణించెద.

27


సీ.

శుభకరాపస్తంభసూత్రుండు కౌండిన్యగోత్రుండు నార్వేలకులపవిత్రుఁ
డగు బసవన మంత్రి కమరప్ప ముమ్మన పెద్దన యెల్లప్ప ప్రియతనూజు
లాకుమారచతుష్టయంబులో ముమ్మనామాత్యుండు సత్కీర్తిమండనుండు
తత్తనూజాతుఁ డుత్తమధర్మశీలుండు నిర్మలచరితుండు నిమ్మనాథుఁ
డతని నిజసాధ్వి యగుకొండమాంబ గర్భ, మందు జనియించె వినయవిద్యాచణుండు
హరిహరధ్యానసేవాపరాయణుండు, మహితరుచిహేలి యబ్బయామాత్యమౌళి.

28


ఉ.

నిండుమనంబు సత్యమును నీతియు శాంతము గల్గి కీర్తివం
తుండయి భోగభాగ్యములతోఁ జెలువొందుచుఁ గొండవీటి భూ
మండలనాయకుల్ మిగుల మన్నన సేయంగఁ బెంపుమీఱె స
త్పండితుఁ డబ్బమంత్రి కనుపర్తిపురాన్వయవార్ధిపూర్ణచం
ద్రుం డని లోకులందఱు నెఱుంగుటకున్ నుతిసేయ నేటికిన్.

29


తే.

అమ్మహాత్ముని గేహిని యైనపుణ్య, వతికి లక్ష్మాంబ కుదయించె సుతయుగంబు
మహితగుణశాలి రాయన మంత్రివరుఁడు, నిరుపమగుణోజ్జ్వలుం డగునిమ్మఘనుఁడు.

30


క.

ధీనిధి రాయనమంత్రికి, మానవతీమణికి నరసబాంబకు జననం
బైనార మిరువురమె యో, గానందుఁడు నబ్బనార్యుఁ డనఁదగు నేనున్.

31

క.

నరసింహపాదభక్తుఁడ, నరసింహకృపాప్రసాదనయలబ్ధమతిన్
నరసింహార్పితహృదయుఁడ, నరసింహునికరుణఁ జాలనమ్మినవాఁడన్.

32


వ.

ఇట్టి నాచేత విరచనీయంబగు నేతత్ప్రబంధసామ్రాజ్యంబునకు మూర్థాభిషిక్తుండగు
మహానుభావునిప్రభావంబు వర్ణించెద.

33


సీ.

శ్రీవైష్ణవాలయశ్రేణులందుఁ జెలంగు ద్రావిడగంధనాదములవలన
వరమహీసురయజ్ఞవాటికాంతరములఁ గొనరారుహోమధూమములవలన
విపణీవీథులయందు వినిహితంబైనట్టి ధనధాన్యముఖపదార్థములవలన
నేలాలవంగతాంబూలవల్లీచందనముఖశోభితవనాంతములవలనఁ
గమలకైరవకల్పాదకలితలలిత, విమలజలసాంద్రకాసారవితితివలన
భాసురంబగులక్ష్మీనివాస మగుచు, దివ్యతిరుపతిమంగళాద్రిస్థలంబు.

34


క.

తిరుపతులు నూటయెనిమిది, పురుషోత్తమశేషశైలములు మొదలుగ నా
తిరుపతులలోన మంగళ, గిరి విష్ణునిజస్థలంబు కేవల మరయన్.

35


మ.

జగదానందకరంబు మోక్షపదవీసోపానమార్గంబు యో
గిగణాకీర్ణగుహాంతరంబు శిఖరక్రీడావిలోలాప్సరో
మృగనేత్రాసుకరాంగుళీచలితతంత్రీవాతవీణారవా
నుగుణాంచత్పికనాద మద్రి చెలువొందున్ మంగళాభిఖ్యతన్.

36


ఉ.

ఆమహనీయశైలశిఖరాగ్రమునందు నృసింహమూర్తి తే
జోమయదివ్యవక్త్రమున శోభిలుచున్ నిజభక్తకోటి శ్ర
ద్ధామతిఁ జేయుపానకముఁ దా నెలమిన్ సగ మారగించి త
త్కామితముల్ ఫలింపఁగ సగంబుఁ దగన్ దయసేయు వారికిన్.

37


చ.

గిరిదిగువన్ వినూత్నమణికీలితమండపమధ్యభాగభా
సురతరపీఠమందు నతిసుందరమూర్తి ధరించి యిందిరా
తరుణియుఁ దాను నుండు నిరతంబు నృసింహుఁడు దివ్యహారనూ
పురకటకాంగుళీయకవిభూషణపుంజవిరాజమానుఁడై.

38


తే.

ఇట్టిమంగళగిరియందు నెగువదిగువ, తిరుపతుల రెంటిమధ్యప్రదేశమందు
శంకరుఁడు సర్వమంగళాసహితుఁ డగుచు, నుండు నెప్పుడు సహవాసయోగ్యుఁ డగుచు.

39


సీ.

కళ్యాణసరసిలోఁ గదిసి మజ్జనమాడి ధౌతవస్త్రంబు లందముగఁ దాల్చి
కుధరాగ్ర మెక్కి మార్కొండలక్ష్మి భజించి నరసింహునకు వందనములు చేసి
మిరియంటు లేలకుల్ మెదిపి చక్కెరతోడఁ గలిపి తియ్యనిపానకములు చేసి
స్వామి కర్పించి శేషం బైనసగమును భక్తుల కెల్లను బంచిపెట్టి
నగము దిగివచ్చి శివదర్శనంబు చేసి, దిగువనరసింహు నిందిరాదేవిఁ గొలిచి
భోగమోక్షంబు లనుభవింపుదురు జనులు, సత్య మిది మంగళాచలస్థలమునందు.

40

సీ.

వేంకటాచలమున వేసటనొందక వడలు భుజింపఁగాఁ బొడము దప్పి
శ్రీరంగమున నాసదీఱఁగఁ బొంగళ్లు భోజనం బొనరింపఁ బొడము దప్పి
కాంచీపురంబులోఁ గాంక్షకొద్దినిఁ జేరి యిడ్డెనల్ భక్షింప నెసఁగు దప్పి
యళగిరిస్థలమున నాపోఁవగా దోసె లారగించినఁ బుట్టినట్టి దప్పి
యర్చకస్తోమహస్తశంఖాగ్రముక్త, లలితగుడజలధారాఘళంఘళంఘ
ళాయమానపానీయమహిమచే నఁణచికొనుచు, జలజనాభుండు మంగళాచలమునందు.

41


ఉ.

ముంగిటికల్పభూరుహము మూలధనంబు నివేశనంబులో
బంగరువాన చేతికగపడ్డతలంపులమానికంబు ముం
గొంగుపసిండి భక్తులకుఁ గోర్కులపంట జగంబులందు న
మంగళశైలవల్లభుసమం బగుదైవము లేదు చూడఁగన్.

42

షష్ఠ్యంతములు

క.

ఈదృగ్విధకల్యాణగు, ణోదారప్రాభవునకు మద్యల్లీలా
సాదరకటాక్షవీక్షా, పాదితవిబుధేంద్రకమలభవవిభవునకున్.

43


క.

అతులితమతియుతనుతగుణ, యతికృతసుధ్యానగతనిరాకారునకున్
శ్రితకమలాసితకమలా, యతవిమలాంబకసుఖప్రదాకారునకున్.

44


క.

భూషాలంకారునకును, దోషాటభటచ్ఛటానుదోత్కటగజహృ
ద్భీషణకంఠీరవగళ, ఘోషితకృతపాంచజన్యఝాంకారునకున్.

45


క.

మందారకుందచందన, మందస్మితసుందరైకమందిరనయనా
నందవదనారవిందున, కుందామరసోద్భవాస్యకుముదేందునకున్.

46


క.

వరసుగుణభక్తజనకృత, సరసగుణాంభోర్ధపానసౌఖ్యునకు శుభా
కరమంగళాచలస్థల, నరసింహాఖ్యునకు సద్గుణశ్లాఘ్యునకున్.

47

కథాప్రారంభము

వ.

అంకితంబుగా నేరచియింపంబూనిన యనిరుద్ధచరిత్రంబునకుఁ గథాప్రకారం బెట్టిదనిన
భగవత్కథాసుధానుభవకుతూహలసాంద్రులగు శౌనకప్రముఖమునీంద్రులు సకలపు
రాణేతిహాసప్రసంగవచనచాతురివిఖ్యాతుండగు సూతునిం గనుంగొని యిట్లనిరి.

48


చ.

జలజభవాభవప్రముఖసంస్తవనీయశేషవిష్ణుని
ర్మలగుణకీర్తనామృతము మామకకర్ణరసాయనంబు గాఁ
బలుమఱు నీవు దెల్పుటకుఁ బాత్రులమైతిమి పూర్వపుణ్యముల్
ఫలితము నొందె నీవలన భవ్యగుణాగ్రణి రౌమహర్షణీ.

49


క.

అనిరుద్ధునిచారిత్రము, వినుటకు మాహృదయములను వేడుక పొడమెన్
వినుపింపు సవి స్తరముగ, వినుతబుధవ్రాతసూతవినయోపేతా.

50

వ.

అనిన విని యమ్మునీంద్రుల కతం డిట్లనియె.

51


క.

మీరడిగినసత్కథ వినఁ, గోరి పరిక్షిన్నృపాలకుంజరుఁ డడుగన్
ధీరుఁడు శుకయోగి సవి, స్తారంబుగఁ దెలుపఁదలఁచి తా నిట్లనియెన్.

52


సీ.

ప్రాకారగోపురప్రాసాదపద్మరాగప్రభాచుంబితగగనతలము
సంతతఫలపుష్పసాంద్రనానావిధోర్వీరుహకలితశృంగారవనము
చంద్రకాంతోపలసౌపానకలితశోభితజలపూర్ణవాపీవ్రజంబు
సరససౌందర్యలక్షణలక్షితాకారభామినీపురుషసౌభాగ్యకరము
గంధసింధురసైంధవబంధురంబు, సారసారససరసకాసారవిసర
మలఘుజలనిధి పరిఖాసమావృతంబు, పుణ్యనిలయంబు ద్వారకాపురవరంబు.

53


ఉ.

లోకములన్నియుం దనకులోనుగ నుండఁగఁ దన్ను లోనుగాఁ
బైకొనెఁ జక్రవాళ మని పావకసన్నిధిఁ దాఁ దపంబు ర
త్నాకరమాననగ్గిరితదావరణావృతిఁ జేసి నిల్పెనో
కాక యజుండు చుట్టుననఁగాఁ దగునబ్ధి యగడ్తరూపమై.

54


మ.

అల్లసుధాపయోధివపురంతరమౌ లవణాబ్ధియందు హృ
ద్వల్లభురాజధానియగు ద్వారకలో సుఖియించుచుండు సం
పల్లలితాంగి యెప్పుడును బాయక పుట్టినయిల్లు నత్తవా
రిల్లును నేకదేశమగునింతులవేడ్కలకుం గొఱంతయే.

55


మ.

అలకౌన్నత్యపురీవరావరణరేఖాగ్రప్రదేశంబులం
గలయన్ గొమ్మలసందు లేర్పఱిచి మార్గశ్రేణిఁ గల్పించుటన్
నలినీకైరవిణీమనోహరులయానంబుల్ నిరోధంబు లే
కలఘుస్ఫూర్తిఁ దదంతరంబులఁ బొసంగన్ నిర్గమించుంగదా.

56


క.

అగణితతారాగణచణ, గగనాంతము నిశలఁ దనరు ఘనలీలఁ బురిన్
దగఁ గోటకొనలఁ గట్టిన, వగజిగిముత్యములచందువాచందమునన్.

57


సీ.

సహచరీశంకాప్రసక్తామరీహూయమానకర్బురపుత్రికానుతములు
ఇనవాహహేషాప్రహేళితప్రతిబింబధారణతోణదర్పణములు
సామంతభభ్రాంతిసల్లాపకృత్తారకామిళద్వప్రముక్తాఫలములు
దైవతపారావతప్రతిస్వనసంభ్రమపదవిటవిటీమణితరవము
లంబుజకదంబశాత్రవబింబమధ్య, హరిణకబళితకుహనాతృణాంకురాయి
తస్ఫురద్గారుడోపలాతతవితర్ది, యూధముల సౌధముల పురి నొప్పుమీఱు.

58


చ.

ఉదయనగేంద్ర మెక్కి యినుఁ డున్నతమై గగనంబుఁ దాఁకు ద
త్సదమలహర్మ్యము ల్గని రథంబున కడ్డము నిల్చునంచుఁ దా

మదిఁ దలపోసి తిన్ననగుమార్గమునం జను డంతకంతకున్
జదలను నిక్కి యవ్వలదెసం దిగిపోవుచునుండు నిచ్చలున్.

59


మ.

పగలున్ రేయి సమప్రకాశతను జీవం జీవబంధుండు సొం
పగుము తతెంబులచేరుచుక్కగమియున్ వ్యాజంబునన్ జేరు చు
క్కగుమింగూడి యనేకరూపములతోఁ గన్పట్టెనా నొప్పగున్
నగరీహేమశిరోగృహాగ్రవిహరన్నారీముఖాంభోజముల్.

60


ఉ.

నిర్మలభర్మరత్నమయనిర్మితవిస్ఫుటహర్మ్యసంచయాం
తర్మదనాహవశ్రమగతప్రమదారమణచ్ఛటాతనూ
మర్మనివారియై వినతిఁ గాంచును పొంత నిలింపనిమ్న గా
హర్ముఖపద్మగంధవిభవానుభవాంచితగంధవాహముల్.

61


తే.

మీఁద నున్నట్టికుంభసింహాదికములు, తారకామండలంబునఁ దగిలియుండఁ
జంద్రబింబంబు నంటె నాసౌధరుచులు, సురపురముమీఁదఁ దనరుగోపురవిభాతి.

62


సీ.

అతనిజన్మస్థాన మగువిష్ణునాభికి నూర్ధ్వమౌ ముఖమున నుదయమైరి
అతఁడు నల్మొగముల నభ్యసించినయట్టి చదు వేకముఖమునఁ జదువుకొనిరి
అతనిరాజసగుణస్థితికంటె నుత్తమంబగు సాత్వికమున శుద్ధాత్ములైరి
అతఁడు మున్ జిరతపోగతిఁగన్నహరిని భావితతభక్తివరదుఁ గావించుకొనిరి
పెద్దపిన్నతనంబు రూపించుకొనిన, యధికు లనవచ్చు హంసవాహనునికంటె
సకలసౌజన్యగుణసుధాసారనిధులు, భూసురేంద్రులు గలరు తత్పురమునందు.

63


సీ.

సముదీర్ణచంద్రహాసకళావినోదముల్ ముఖములం దురణోన్ముఖములందు
ధర్మగుణానుసంధానతాచతురతల్ శయములందును హృదాశయములందు
బుధగురుచక్రావనధురీణచిహ్నంబు లాఖ్యలందు నిజాన్వయాఖ్యలందుఁ
బ్రకటపంచాననప్రక్రియావిభవముల్ భటులందు విక్రమార్భటులయందు
వెలయ వెలయుదురని వాక్యవీణ్యశౌర్య, ధైర్యగాంభీర్యసమధికౌదార్యతుర్య
ధుర్యులైనట్టి బాహుజవర్యు లెపుడు, సిరులఁ జెలువొందు నప్పురవరమునందు.

64


సీ.

తనలోనిరత్నసంతతు లధోగతిపాలు పంచుకోఁడేని సాగరుఁడు సాటి
తనమూలధనముకుఁ దగినలాభముఁ గూర్చుకొనెనేని ధననాయకుండు సాటి
తనకున్నబంగార మనువక్కరల కియ్యఁజాలినఁ గాంచనాచలము సాటి
తనమహత్వమునకు నెనయైనభోగానుభవ మందెనేనిఁ గల్పకము సాటి
గాని యితరులు తాదృశుల్ గా రనంగ, నర్థసంపదతోడ విఖ్యాతసుకృత
సంపద లనంతములు గాఁగ సంగ్రహించు, వైశ్యు లుండుదు రప్పురవరమునందు.

65


సీ.

జన్మస్థలంబు నిర్జరశిఖాకుసుమగంధావాసితంబైనహరిపదంబు
సైదోడు ప్రకటధూర్జటిజటామకుటరంగదభంగనిజభంగగగనగంగ

ప్రారంభ మఖిలవర్ణాశ్రమజసతిర్యగాదిజీవన మైనహాలికంబు
స్వాచార మిష్టకామ్యార్థసిద్ధిద మైనయనిరుద్ధమూర్తియభ్యర్చనంబు
బుద్ధి బ్రాహ్మణభక్తియు భూతదయయు, శాంతమును గల్గి చెలువొందు సత్పథంబు
గాఁగ సౌజన్యశీలురై కలిమి బలిమిఁ, గలిగి సుఖియింపుదురు శూద్రకులజు లందు.

66


సీ.

రంజితాధరసుధారససమేతంబులై ముఖచంద్రబింబముల్ ముద్దుగులుక
నవతంసకుసుమతారావళీయుతములై కచభారతమసముల్ గరిమఁ జూపఁ
గమనీయమణిమాలికాఝరాంచితములై కుచకుంభశైలముల్ కొమరుమిగులఁ
గంకణేంద్రోపలాంకమిళిందచణములై పాణిపద్మంబులు పరిఢవిల్లఁ
గలితమోహనరూపరేఖావిలాస, విభ్రమంబులు జగ మెల్ల వినుతి సేయ
నతులగతి వారశృంగారవతులు వేన, వేలు విహరింతు రెపుడు నవ్వీటియందు.

67


సీ.

పలువరుసలకుందములఁ జూడఁ బ్రియమయ్య వెలయింపుసొంపునఁ బలుకఁగదవె
వగఁజూపునల్ల ల్వలవినోదము తానె వలపుల ముంచె నవ్వారి గాఁగ
మేలుచేఁదమ్మిక్రొమ్మిన్నలు గుల్కెడు కూరిచి దయసేయుపేరు గాఁగఁ
బెంపొందె నాస సంపెఁగనిగన్నిగలచే ముద్దియ వేఁడెద మొగి నొసంగు
మనుచు ననుచు ముదంబున నంటి పల్కు, జాణలవచశ్చమత్కృతిసరణిఁ దెలిసి
తెలివిఁజీఱునవ్వు లొలయంగ నలరి యలరు, లమ్ముదురు పుష్పలావిక లప్పురమున.

68


మ.

పటుదంతఫ్రచురప్రభాప్రకటశంపాజాలముల్ ఘీంకృతా
ర్భటగర్జారవముల్ సమగ్రమదధారాసారవర్షంబు లు
త్కటధాటిన్ నటియింప భూవిహరణోద్యత్ప్రావృషేణ్యాంబుభృ
త్పటిమన్ దత్పుటభేదనద్విరదయూథంబొప్పు సక్రోధమై.

69


మ.

పురసీమన్ బురుషోత్తమానువహనస్ఫూర్తిన్ విడంబించుచున్
సిరికిన్ మూలము లై సుజీవనకళాస్నిగ్ధంబు లై సుందర
స్ఫురితావర్తము లై విలాఘనత నొప్పున్ వాహినీసంగతిన్
దిరమై సార్థకనామధేయగుణభాతిన్ సైంధవవ్రాతముల్.

70


చ.

అలఘునిజధ్వజాంచితపటాంచలజాతసమీరవారితా
మలగగనస్థలీయుతవిమానవిహారనిలింపదంపతీ
సలలితపంచబాణరససంజలితోరుపరిశ్రమంబు లై
యలరుం బురిన్ శతాంగము లుదగ్రవిరోధిచమూవిభంగముల్.

71


ఉ.

బాహుబలోద్ధతుల్ సమరభాగనటద్రిపుచాతురంగిక
వ్యూహవిభేదనక్రమసముజ్జ్వలవిక్రమవిస్ఫురన్మహా
సాహసికుల్ ధనుఃప్రముఖసాధనధారణకౌశలుల్ సము
త్సాహరసాకృతుల్ సుభటసంఘము లప్పురమం దసంఖ్యముల్.

72

వ.

మఱియు నన్నగరీలలామంబు వైకుంఠపురంబునుంబోలె నాగనగరంబువిధంబున ననంత
కళ్యాణగుణాభిరామంబై, నభోమండలంబుతెఱంగున సుకవికల్పితప్రబంధంబుచాడ్పు
నఁ గలితకవిరాజవిరాజితంబై, చంద్రబింబంబుపోలికఁ గుసుమితద్రుమంబులీల విరాజ
మానసాగరంబై, యలకాపురంబుభాతి జలజాకరంబురీతిఁ బద్మాలంకృతంబై, యధ్య
యనవిద్యావిశేషంబుకైవడి సంగీతరత్నాకరంబుచెలువున వర్ణక్రమప్రశస్తంబై, రామా
యణకావ్యంబుగతి భార్గవవంశంబుకరణి రామాభిరామంబై, మిత్రభావప్రకాశం
బయ్యును గువలయానందంబై, రాజాభ్యుదయంబయ్యును గమలాంచితంబై, హరివి
హారంబయ్యును బుణ్యజనరంజనంబై, విబుధవరవిరాజితంబయ్యును సమస్తగోత్రప్ర
చారంబై, గురుప్రదీప్తంబయ్యును గవిహితంబై, సంపదలకుం గొటారును, సౌభాగ్యం
బులకుఁ బుట్టినిల్లును, సౌఖ్యంబులకు నాలవాలంబును, సారస్యంబులకుఁ గాణయాచి
యు, సంతోషంబునకు నాటపట్టునునై వసుంధరాసుందరీనిటలతటసంఘటితముక్తా
లలామంబుసోలికఁ జతుర్ముఖనిర్మితప్రపంచాభరణంబై యొప్పుచుండు.

73


ఉ.

ఆపురలక్ష్మికిన్ రమణుఁడై విలసిల్లుచునుండు బ్రహ్మలీ
లాపరిపూర్ణమానుషవిలాసుఁడు భక్తగృహాంతదృశ్యని
క్షేపము రూపమోహనవశీకృతగోపవధూకదంబుఁ డు
ద్దీపితకీర్తిశాలి వసుదేవతనూజుఁడు కృష్ణుఁ డున్నతిన్.

74


సీ.

వరలీల దేవకీవసుదేవులకుఁ బుట్టి నందయశోద లున్నతిగఁ బెనుపఁ
బెరిగి దైతేయులఁ బెక్కండ్ర వధియించి యమునానదీతీరమందమంద
బృందావనక్రీడఁ బెంపొంద గోవులఁ బాలించి మురళీవిలోలుఁ డగుచు
వల్లవకాంతల వలపించుచు రమించి భక్తజనావనప్రౌఢి మెఱసి
రుక్మిణీసత్యలాదిగా రూపవతులఁ, జాలఁ బెండ్లాడి సంసారసౌఖ్యనిరతి
నెలమిఁ ద్రిభువనసామ్రాజ్య మేలుచుండెఁ, గృష్ణుఁ డంచితకీర్తివర్ధిష్ణుఁ డగుచు.

75


మ.

హరికిన్ రుక్మిణికిన్ దనూభవుఁడు మీనాంకుండు లోకైకసుం
దరలీలాసుకుమారమూర్తి రతికాంతాపద్మరాగోపమా
ధరసారామృతపానకేళిరతుఁ డుద్యద్విక్రమాటోపశం
బరసంహారుఁ డుదాత్తకీర్తి నమరున్ బ్రద్యుమ్ననామాంకుఁడై.

76


ఉ.

ఆరతివల్లభుండును శుభాంగి యనందగురుక్మికూఁతు నం
భోరుహనేత్రఁ గూడి కులభూషణుఁడైనకుమారుఁ గాంచె శృం
గారరసంబువిగ్రహముగా నొనరించినమాడ్కి నొప్పునొ
య్యారమువాని భాగ్యవిభవాదికలక్షణలక్షితాంగునిన్.

77


క.

అనిరుద్ధనామధేయుం, డనిరుద్ధవముఖ్యు లతని నరివీరులు డా
య నిరుద్ధతులన్ జేసెడి, యనిరుద్ధస్ఫుటపరాక్రమాఢ్యుండగుటన్.

78

వ.

మఱియు బ్రహ్మజ్ఞానసూచనా సమర్థుండు గాఁగలవాఁడని బ్రహ్మసూనామకుండును, ఋ
శ్యమృగచిహ్నితకేతుండు గాఁగలుగుటంజేసి ఋశ్యకేతుండును నని గురుజనంబులు నా
మనిర్దేశంబు చేసి రక్కుమారుండు శరత్సమయశుక్లపక్షసుధాకరుచందంబున నహర
హఃప్రవర్ధమానుండై క్రమంబున జననీజనకమనోరథసాఫల్యంబైన బాల్యంబును స్వ
బంధుజననయనానందశరీకసుకుమారం బైన కౌమారంబును నతిక్రమించిన యనంతరంబ.

79


సీ.

ముఖచంద్రమండలంబును నూఁగుమీసపుఁజాలు సహజలాంఛనము గాఁగ
నమరువక్షఃకవాటమునకు నేవళంబులు కుందనపుఁదీఁగె మోడి గాఁగఁ
జెక్కుటద్దములకుఁ జెలువంబు మీఱిన చిఱునవ్వు తేఁటక్రొంజికిలి గాఁగ
సరసమౌ కచనీలజలదంబునకు నవతంసదీధితి తటిద్వల్లి గాఁగ
నలజయంతునిచందంబు నలునిసొబగుఁ, జందురునిమేలుఁ గందర్పుచక్కఁదనముఁ
దనకు సరి సేయఁదగిన సౌందర్యమహిమ, నతఁడు చెలువారె నవయౌవనాగమమున.

80


సీ.

కనుమెఱుంగులు తళుక్కున నేమఱించుచూపులకు గుండియలు జల్ జల్లుమనంగ
నరుదుగా నాభిముఖ్యము నొందు మోముకు వాలుకన్గవలు దక్కోలుపడఁగ
జెలికాండ్రతో నాడు పలుకులచే వీను లొగి వశ్యమంత్రప్రయోగమందఁ
బ్రతిలేనిరూపసంపదఁ జిక్కి తలఁపులు సుడివడ్డగతిఁ జుట్టి చుట్టి తిరుగ
నందుకొనరానిమ్రానిపం డైనయతని, ప్రభుతచే నూర్పు లూష్మదీర్ఘత వహింపఁ
గొలువునకు వచ్చువారకన్యల కయోగ, విరహ ముదవించెఁ దద్రూపవిభ్రమంబు.

81


తే.

వాలుఁజూపులచేత నివాళు లొసఁగి, ప్రమదజలముల నర్ఘ్యదానము లొనర్చి
యెలమిభావంబు లుపహారములుగఁ జేసి, వనితలు భజింతు రిష్టదైవముగ నతని.

82


మ.

తరుణుల్ వానివిలాససంపదకు నాంతర్యంబునం జొక్కి త
త్పరిరంభానుభవఁబుఁ గోరుచు విధాతా వీని మజ్జీవితే
శ్వరుగా నేటికిఁ జేయవైతివనుచున్ సంతాపముం జెందు ను
స్సురుగాడ్పుల్ విధికంగ దాహ మొదటించున్ మండువేసంగియై.

83


ఉ.

బింబము మోవిసంకుప్రతిబింబము కంఠము తారకాధిరా
డ్బింబము మోము సన్ముకురబింబము లాదరహాసపుంగపో
లంబులు యక్షనందనకళానిధిముఖ్యులఁ జూతుమేకదా
శంబరవైరినందనునిసామ్యము గా వచియింపఁబోలునే.

84


ఉ.

సాహసధైర్యబాహుబలసంపదచేఁ జెలువొంది వాహనా
రోహణహేతిధారణనిరూఢిఁ దనర్చినచో విభూతిశే
షాహిగతిన్ జెలంగి జగదాదరణీయగుణాభిరాముఁడై
యాహరిపౌత్రుఁ డొప్పెఁ దనయభ్యుదయంబు సదాభివృద్ధిగాన్.

85


వ.

అంత.

86

చ.

అతనికి మేనమామసుతయై తగు రుక్మినృపాలపౌత్రి యం
చితసుమకోమలాంగి సరసీరుహపత్రవిశాలనేత్ర ని
ర్జితకలహంసయాన మదసింధురకుంభసమానవర్తులో
న్నతకుచ రుక్మలోచన యనంగ ననంగశరోపమానయై.

87


గీ.

బంధుజీవ మయ్యె బంధుజీవం బని, యధరమునకు బింబ మధర మయ్యెఁ
దమ్ము లయ్యె ననుచుఁ దమ్ములఁ గని కొమ్మ, యడుగులకును జిగురు లడుగు లయ్యె.

88


సీ.

కట్టిఁడివగను జేకట్లకు లోనయ్యె విరసభావంబు లై విద్రుమములు
ప్రత్యహంబును గళాభంగమయ్యను దామసప్రకాశతను నక్షత్రగణము
పగలుమించుట విదేశగతంబులయ్యె రాజావమానమున రథాంగకులము
కాఁక దెచ్చుక తుది లోఁకువై పలుమాఱుఁ బ్రహరణంబులఁ జెందెఁ బసిఁడికమ్మి
రమణియధరనఖస్తనాంగములతోడి, ప్రాతిపక్షికమున నివి భంగపడియె
వట్టియార్వేరమున బలవంతుతోడి, సాటికిఁ బెనంగు టెల్ల నిష్ఫలము గాదె.

89


సీ.

శాతకుంభమునకుఁ జాంపేయమునకుఁ దా ననుగుణంబగుఁ గాంచనాంగి యనుట
కంజాతమునకును గైరవంబునకుఁ బ్రియంవదంబు మహోత్పలాక్షి యనుట
శక్రోపలమునకు జలధరంబునకు వినయోక్తి ఘననీలవేణి యనుట
కలహంసమునకు శిఖావళంబునకు హితాలయ మండజయాన యనుట
యుభయభావంబు లతివయం దునికి సార్థ, కముగ నిట్లంట చతురత కల్పనాంశ
లందు వలసినయ ట్లందు రనఁగనిమ్ము, వారి కేమి నిరంకుశుల్ గారె కవులు.

90


వ.

ఇవ్విధంబునం బ్రభూతవయస్సమయమైయున్న రుక్మలోచనను వివాహంబు సేయ ను
ద్యోగించి తత్ప్రపితామహుండైన భీష్మకనృపాలుండును దక్కినవారలును సుహృజ్జను
లతో నాలోచించుచు.

91


ఉ.

ఈయలినీలకుంతలకు నీడును జోడును నైనవల్లభుం
డేయెడఁ గల్గునో యనుచు నెంతయునక్కఱతో విచారముల్
సేయుచునుండి బంధువులచే ననిరుద్ధుని రూపసద్గుణ
శ్రీయుతుఁ గా నెఱింగి తమచిత్తములం బ్రమదంబు నిండఁగన్.

92


క.

నెనరంటినచుట్టఱికం, బును గులమును గుణము రూపమును విద్య ధనం
బును బ్రాయము గలిగినవరుఁ, డొనఁగూడుట కన్యభాగ్యయోగమునఁగదా.

93


వ.

అని విచారించి ద్వారవతీపురంబునకుఁ దగువారలం బంపుచు.

94


క.

శ్రీమత్సమస్తసద్గుణ, ధామాంచితకీర్తి నెన్నఁదగువసుదేవ
స్వామికి భీష్మకభూప, గ్రామణి తా మ్రొక్కి చేయఁగలవిన్నపముల్.

95


క.

క్షేమం బిక్కడ మీపరి, ణామము వ్రాయంగవలయు నాపౌత్రుని పు
త్రీమణిని రుక్మనయనా, కోమలి ననిరుద్ధునకును గూర్పఁగవలయున్.

96

చ.

అని శుభలేఖ లంప విని హర్షము మాకు నవశ్య మంచుఁ గ్ర
క్కునఁ బ్రతిలేఖ లంపి యనుకూలపులగ్నము నిశ్చయించి చ
య్యన బలకృష్ణముఖ్యులు రయంబ సుహృచ్చతురంగయుక్తులై
యనుపమవాద్యఘోషము దిగంతములందుఁ బ్రపూరితంబుగాన్.

97


సీ.

కుండినపురికి నేఁగుటయు వైదర్భు లెదుర్కొని వారలఁ దోడి తెచ్చి
విడుదుల విడియించి వివిధవస్తువ్రాతసామగ్రి నడపించి సంభ్రమమున
లగ్నవేళకు మంగళస్నానయుతు లైన పెండ్లికొమార్తకుఁ బెండ్లికొడుకు
కెలమితో బాసికంబులు గట్టి కంకణబంధముల్ గావించి ప్రాజ్ఞులైన
విప్రముఖ్యులఖండోక్తవేదరవము, చెలఁగ నుచితప్రయోగముల్ సేయుచుండి
రపుడు తెరవట్టిచాటున కతివఁ దోఁడి, తెచ్చిరి పదాంగదధ్వను లచ్చుపడఁగ.

98


చ.

విచికిలగంధియున్ విభుఁడు వేడుకతోఁ దెరరెండువైపులన్
రుచిరకటాక్షపంక్తుల మెఱుంగులు నిండఁగ నిల్చి రయ్యెడన్
బ్రచురతరానురాగరసబంధురతం దెర చీరదూఱిపా
ఱుచు హృదయాబ్జముల్ మొగ మెఱుంగని చుట్టఱికంబు సేయఁగా.

99


క.

గ్రక్కునఁ దెరవాపుటయుఁ ద, ళుక్కున వెలుఁగొందె మృగవిలోచనముఖ స
మ్యక్కాంతి మెయిలుదొలఁగినఁ, జక్కఁగఁ జెలువొందుపూర్ణచంద్రుం డనఁగన్.

100


ఉ.

బంగరుపళ్లెరంబులను బ్రౌఢిగనించినముత్తియంబు లు
ప్పొంగుచు హస్తయుగ్మములఁ బూర్ణముగాఁ బలుమాఱు ముంచుచున్
రంగుగ నొక్కరొక్కరిశిరంబుపయిం దలఁబ్రాలు వోసి ర
య్యంగమరీచినవ్యమణు లై దిగుపాఱఁగ నవ్వధూవరుల్.

101


క.

ఈవిధమున సుముహూర్తము, గావించి వివాహవేదికాస్థలమునకున్
రావించి రపుడు పంచమ, హావాద్యధ్వనులు బహుళమై మొరయంగన్.

102


క.

చెలిపాదము చెలువుఁడు కర, జలజంబునఁ బట్టి నడపె సప్తపదంబుల్
పొలయలుక దీర్చునాఁటికి, యలవడునని వావియైనయతివలు నవ్వన్.

103


వ.

తదనంతరంబ ప్రధానహోమాదికంబులైన వైదికలౌకికప్రయోజనంబులు నడప వివిధ
విధభక్ష్యభోజ్యాదిపదార్థంబుల సకలజనసంతోషంబుగా భోజనోత్సవంబు గావించిరందు.

104


మ.

 పరమాన్నంబులుఁబిండివంటలును సూపంబుల్ గమాయించు పం
డ్లరసంబుల్ మధురామ్లశాకములు బెల్లం బాజ్యమున్ దేనె క
ప్పురపుందోయము మీఁగడల్ పెరుగు లుప్పుగాయలున్ మున్ను గాఁ
బరిపూర్ణంబుగ నారగించి రనువొప్పం బెండ్లివారందఱున్.

105


సీ.

చెలి పయోధరకుంభములు దాఁచుకొన నేల ఘనమయ్యెఁ దృష్ణ చేకొనఁగనిమ్ము
లతకూన మధురలీలాధరఫలరసంబులు చాలనభిలాషఁ బొడమఁజేసె

నలివేణి నీచేతియతిరసరుచి రసజ్ఞానందమయ్యె నేమనఁగవచ్చు
రాకేందుముఖి విను మాకార మంతచక్కని దెన్నఁ డెఱుఁగము కన్ను లాన
యనుచు భోజనసమయ౦బులందు భావ, గర్భితము లాడు సరసులకాంక్షకొల్ది
ననుభవింపుఁడు కొదవ లేదని సమర్మ, వక్త్రులై బోనకత్తెలు భుక్తులిడిరి.

106


శా.

తాంబూలంబులు నారికేళకదళీద్రాక్షాదినానాఫలౌ
ఘంబుల్ చంపకమల్లికాదిసుమనఃకస్తూరికాగంధసా
రంబుల్ శర్కర లిక్షుఖండములు వస్త్రంబుల్ సువర్ణంబు నె
య్యం బేపారఁగఁ బంచిపెట్టిరి జనం బానందమున్ బొందఁగాన్.

107


వ.

ఇవ్విధంబున.

108


భుజంగప్రయాతము.

వివాహప్రయత్నంబు విధ్యుక్తరీతిన్, నివర్తించి ప్రౌఢాబ్జనేత్రల్ నిషేకో
త్సవారంభమున్ బ్రేమ సంధిల్లఁజేయన్, నవోఢారతుల్ మోహనంబై చెలంగెన్.

109


తే.

గంధమాల్యాదివాసనల్ గ్రమ్ముకొనఁగఁ, దోఁడుకొనివచ్చి రప్పు డాతోయజాక్షి
సరసుఁ డున్నట్టికేళికాసదనమునకు, బలిమిచే నేర్పుచేతను బద్మముఖులు.

110


ఉ.

ఎవ్వరికోస మీవగల కేమి యిఁకన్ బదమంచు నెచ్చెలుల్
నవ్వుచుఁ ద్రోచిపోవుటయు నాథునిచెంగట నిల్చియుండెఁ దా
నివ్వలవ్వలన్ దొలఁగనియ్యక మన్మథుఁ డానవెట్టి న
ట్లవ్వనజాక్షి సిగ్గుబరువానినరీతి శిరంబు వాంచుచున్.

111


ఉ.

శయ్యకుఁ జేరఁదీసి పతి సారెకు నేఁడఁగ నించుకైన మో
మియ్యక గుబ్బ లంటుకొననియ్యక నిష్టరతిన్ రమింపఁగా
నియ్యక యెంత సేసె నలయించినపిమ్మట సౌఖ్యదాయకం
బయ్యెను నారికేళఫలపాకములౌఁగద కన్యకారతుల్.

112


తే.

విభునితమకంబుతో నిట్లు వెలఁది సిగ్గు, పోరు టెల్లను వట్టియార్వేరమయ్యెఁ
దుది నిలువలేక గొందులు దూఱియుండెఁ, గాన నబలాశ్రయమున భంగము ఘటించు.

113


వ.

తదనంతరంబ.

114


సీ.

అధికప్రయత్నసంశిథిలనీవీబంధ మభిముఖకుంచితాస్యాంబుజాత
మాలస్యకరగృహీతాంచితకుచకుంభ మనురాగరసనిగూఢాంతరంగ
మాయాసలబ్ధబాహులతౌపరిరంభ మాకుంచితభ్రూయుగాభిరామ
మామోదబాష్పధారాపూరితాంబక మలఘుసీత్కారమోహననినాద
మచిర సంభూతమదనతోయప్రవాహ, మనగతోష్ణంగజాతఘర్మాంబుకళిక
మాత్మపరవశజనితనిద్రాభిలాప, మగుచు నయ్యింతి ప్రథమసమాగమంబు.

115

క.

ఆమోదం బొనరింపఁగ, నామోదము విరియుఁ బోలె నైక్యస్థితితో
దామోదరపౌత్రుఁడు సు, ప్రేమోదయహృదయుఁ డగుచుఁ బెనఁగెన్ రతులన్.

116


వ.

తదనంతరంబ యాదవసమూహం బవ్వధూవరులం దోడ్కొని కతిపయప్రయాణంబుల
ద్వారవతీపురంబునకుంజని యథోచితసుఖంబు లనుభవించుచుండి రయ్యనిరుద్ధుండును.

117


చ.

విలసితలగ్నవేళఁ గడువేడుకతోడ గృహప్రవేశ మిం
పలరఁగఁ జేసి యవ్వనరుహాసనఁ గూడి యతండు ప్రేమచే
సలలితకేళికావనుల సారససారసరోవరంబులం
జెలువగురత్నగేహములఁ జిత్తము రంజిలఁ గారవించుచున్.

118


సీ.

కేల నంటఁగరానిగిలిగింతచే మాఱు పెనఁగుట లొకకొన్నిదినములందు
నేమి చేసినఁ గాని హితము చేసుక సమ్మతించుట లొకకొన్నిదినములందుఁ
జవుసీతిబంధవిశ్రాంతిమార్గములన్ని దెలిసికూడుట కొన్నిదినములందుఁ
దాన పైకొని సురతప్రౌఢిఁ దమిదీర నెనయుట లొకకొన్నిదినములందు


నగుచు నారుక్మనయనాసమాగమంబు, తనమనంబున కంతకంతకుఁ బ్రమోద
రసము కొలుపంగ గాఢానురక్తి నుండె, రసికశేఖరుఁ డారతిరాజసుతుఁడు.

119


క.

అని శుకుండు పలికె ననినం బ్రమోదహృదయులై శౌనకాదులు సూతుం గనుంగొని
యయ్యనిరుద్ధుని విహారం బెవ్విధంబుననుండె నటమీఁదటివృత్తాంతంబుఁ దేఁటపఱుపు
మనుటయు.

120


చ.

వరవరదానశీలమదవారణవారణకృజ్జలాటభీ
కరకరచక్రజన్మలయకారణకారణనైజలీలసా
దరదరహాసదుష్టరిపుదారుణ దారుణకోటితేజభూ
ధరధరదుగ్ధసాగరసుతానవతానవభోగసంగమా.

121


క.

నిలయీకృతవైకుంఠా, బలవద్రిపుభయదశౌర్యపటుతాకుంఠా
కలితరుచికంబుకంఠా, సలలితలక్ష్మీప్రసంగజనితోత్కంఠా.

122


మాలిని.

మునిహృదయనివేశా మోక్షదానప్రకాశా
వినుతగగనకేశా వీతసంసారపాశా
సనయనిజనిదేశా చారువక్షఃప్రదేశా
మనుజచరవినాశా మంగళాద్రిస్థలేశా.

123


గద్య.

ఇది శ్రీమంగళాచలనృసింహకృపాప్రసాదసంప్రాప్తవిద్యావైభవ కనుపర్తిరాయన
మంత్రినూభవ సుజనహితకృత్యనిత్య యబ్బయామాత్యప్రణీతంబైన యనిరుద్ధచరిత్రం
బనుమహాప్రబంధంబునందుఁ బ్రథమాశ్వాసము.