అంటువ్యాధులు/మూడవ ప్రకరణము


 
సూక్ష్మజీవుల జాతి భేదములు

పైని చెప్పినట్లెక్కడ శోధించినను కనబడు అపరిశుద్ధప్రదేశములలో నివసించు సూక్ష్మజీవులెట్టి యాకారము గలవి? వానియందలి భేదము లేవి? అవి యేమి తిని బ్రతుకును? ఈ విషయమును సంక్షేపముగా నాలోచింతము.

౧. కొన్ని జాతుల సూక్ష్మజీవులు మనవలెనే ప్రాణ వాయువుండుచోట్లగానీ జీవింపనేరవు. ఇందు కొన్నిపులులు, సింహములవలె ప్రాణముండు భాగములను మాత్రము తిని బ్రతుకును. మఱికొన్ని కాకులు కోళ్ళవలే ప్రాణములేక క్రుళ్లిపోవు భాగములనుకూడ తినును. తమనడవడికలలో సామాన్యముగా నీపై రెండుజాతులును జంతువులను బోలియుండుట చేత వీనికి సూక్ష్మ జంతువులు (Protozoa) అనిపేరు. వీని యాహారము కేవల జంత్వాహారము (Holozoic Nutrition)

౨. మఱికొన్ని జాతుల సూక్ష్మజీవులు కుక్కగొడుగుల వంటివి. ఇవి క్రుళ్లుచుండు పదార్థములలో మాత్రమే పెరుగును. సజీవములగు జంతువులనుగాని వృక్షములనుగాని యివి తినజాలవు. వీని యాహారము పూతికాహారము (SaproPhytic Nutrition) అనగా మురికి వీని తిండి. వీనికి శిలీంధములు (Fungi) అని పేరు. శిలీంధమనగా కుక్కగొడుగు.

౩. మఱి కొన్ని జాతుల సూక్ష్మజీవులు వృక్షముల వంటివి. ఇవిమనకంటి కగపడకపోయినను, ఆకుపచ్చగ నుండకపోయినను, చెట్లవలె బొగ్గుపులుసు గాలిని బొగ్గుక్రిందను, ప్రాణవాయువుక్రిందను విడదీసి, బొగ్గును తమ శరీరపుష్టికొర కుపయోగించుకొని ప్రాణవాయువును విడచివేయును. వీని యాహారము కేవలం వృక్షాహారము (Holophytic Nutrition).

కాని కొన్ని సూక్ష్మజీవులు కొంతయాహారమును జంతువులవలెను, కొంత యాహారమును వృక్షములవలెను, మరికొంత యాహారమును కుక్క గొడుగులవలెను కూడితినును. ఇట్టివాని యాహారము మిశ్రమాహారమని చెప్పవచ్చును. ఇట్టి వానికి బాక్టీరియములు (Bacteria) అని పేరు.

సూక్ష్మ జీవులలో ౧. సూక్ష్మ జంతువులు (Protozoa) ౨.శిలీంధములు (Fungi) ౩. బాక్టీరయములు (Bacteria) అను నీ మూడు ముఖ్య విభాగములను గూర్చి కొంతవరకు మనము తెలిసికొనవలెను.

౧. సూక్ష్మజంతువులు (Protozoa)

సూక్ష్మజంతువులనగా మిక్కిలిక్రిందితరగతి జంతువులు. సాధారణముగ ఇవి ఏకకణ ప్రాణులు. అనగా వీని శరీరమంతయు ఒక్కటె కణముగానుండును. ఇందు చుట్టునుండు భాగము స్వచ్ఛముగను నిర్మలముగనుండి మిలమిలలాడుచుండును. దీనికి మూలపదార్థము (Protoplasm) అనిపేరు. 7-వ పటము చూడుము. మధ్యనుండు భాగము కొంచెము దళముగనుండి కొంచె మస్వచ్ఛముగ నుండును. దీనికి జీవ

సూక్ష్మజంతువులు (Protozoa).

7-వ పటము.

అమీబా

పా—పాదము. జీ—జీవ స్థానము. అ. ప.—ఆహార పదార్థము

స్థానము(Nacleus) అనిపేరు. ఒకానొకప్పుడు ఏకకణ ప్రాణులు అనేకములు గుంపులు గుంపులుగాకూడి గుత్తులవలె ఒక చోటనంటియుండి అన్నియుజేరి ఒకప్రాణివలె జీవించును. ఈ సూక్ష్మజంతువులలో కొన్ని తమమూలపదార్థములో ఒకభాగమును పాదము (Psudopodium) గా సాచి దాని సహాయముతో ఆహారము నిమిడ్చుకొనును. ఇట్టిజంతువునకు (అమిబా Amoeba) వికారిణి అనగా ఆకారము నిరంతరము మార్చు కొనునది అని పేరు. 7-వ పటములోనిది యాహారమును పట్టుకొను విధమును చూడనగును. చలిజ్వరము (Malaria) అను జ్వరమును “అమీబిక్ డిసెంటరీ (Amoebic Dysentery) అను నొకతరహా జిగట విరేచనములను గలిగించు సూక్ష్మ జంతువులును ఈ జాతిలోనివియే. మరికొన్ని సూక్ష్మజంతువులు తోకలు కలిగి వాని సహాయముచే ఈదుచు ఆహారమునుతినుచు పరుగెత్తుచుండును. 8-వ పటము చూడుము:

8-వ పటము

మృ-రో.

మృదురోమములను తోకలుగలిగి వానిసాయముచే చలింపగల సూక్ష్మ జంతువు.

మృ. రో =మృదురోమములు.

జీ = జీవస్థానము. ఇందు అనేక జీవస్థానములు గలువు. సూక్ష్మజంతువులలో ననేకములు ఒక్కొక్కటి రెండేసిగాచీలి, రెండు నాలుగు, నాలుగు ఎనిమిది, ఎనిమిది పదహారు, ఇట్లు ముక్కలు ముక్కలయి ఒక్కొక్క ముక్క ఒక్కొక్కజంతువుగా పరిణమించును. 9-వ పటముచూడుము.

9-వ పటము

ఒక అమీబా రెండు అమీబాలుగా విభాగమగునపుడు గలుగు మార్పులు. ఒక అమీబాను అనేక ఖండములుగా సోకినప్పుడు ఏఖండము లందు జీవస్థానపు ముక్కలుండునో అవి బ్రతికి పెద్ద అమీబాలగును. జీవస్థానపుముక్క యేమాత్రమునులేనిఖండములు వచ్చును.

మరికొన్ని సూక్ష్మజంతువులలో ఆడది మొగది అను వివక్షత గలిగి ఒకదానితోనొకటి సంయోగము నొందుటచే సంతానవృద్ధియగును. చలిజ్వరపు పురుగులలో నిట్లేమగవియును ఆడవియునుకూడి సంధానమును పొందును. 10-వ పటమును చూడుము. 30

10 వ పటము....... చలి జ్వరము.


చలిజ్వరము పురుగులు







1.ఆడ పురుగు, మగ పురుగు అను భేదములేని చలి జ్వరపు పురుగు. 2, 3. మగ పురుగు యొక్క వివిధావస్థలు. 4, 5. ఆడ పురుగుల వివిధావస్థలు. 6. సంయోగము చెందిన తరువాత నేర్పడు రూపము. దాని గర్భము నిండ చలి జ్వరపు పురుగులుద్భవించు చున్నవి. 7. గర్భవతియగు తల్లి పురుగు కడుపు పగిలి దాని నుండి వేనవేలు పిల్ల పురుగులు బయలు పడు చున్నవి.

౨. శిలీంధములు (Fungi)

శిలీంధమనగా కుక్కగొడుగు. 11-వ పటముచూడుము. ఈ జాతిలోని సూక్ష్మజీవులు వర్ణరహితమయిన కణములచే నేర్పడునవి. ఇవిచెట్ల జాతిలోగాని, జంతువుల జాతిలోగాని చేరక మధ్యమస్థితిలో నుండునవి. ఒక కణముయొక్క కొస

11-వ పటము.

శిలీంధములు అనగా బూజుజాతి సూక్ష్మజీవులు.

A

B

A. B. కుక్క గొడుగులు. బూజుపోగులు త్రాళ్లవలెను వలలవలెను అల్లుకొనుటచే కుక్క గొడుగు లేర్పడును.

పొడుగుగా దారపు పోగువలె పెరుగుచు అనేకపోగులు వలవలె గాని త్రాడువలెగాని అల్లుకొనుటచే నీ ప్రాణుల ఆకారమువృద్ధి యగుచుండును. 11-వ పటములో ఎ చూడుము. వీనిపోగులు జీవములేనట్టిగానీ జీవించియున్నట్టి గాని జంతువులయొక్కయు వృక్షములయొక్కయు పై పొరలగుండ దొలుచుకొని పోగలవు. ఇవి సాధారణముగ కుళ్లుచుండు పదార్థములనుండి తమ ఆహారమునుతీసి కొనును. నిలవయుంచిన కొబ్బరిపెచ్చులమీదను, తడిసిన చెప్పుల జోళ్ళమీదను, ఊరగాయ కుండల లోను, పట్టుచుండు బూజు ఈ జాతిలోనిదే. మన చెవులలో గూడ నిట్టి బూజు పెరుగుట గలదు. ఆడువి మగవి అను విచక్షణలేకుండ ఈ పోగుల కొనయందు ఒక భాగము తెగిపోయి అట్లు తెగిపోయిన ముక్కలు గ్రుడ్లుగా నేర్పడుటచే నివి సంతాన వృత్తిజెందును. 12-వ పటమునుచూడుము. మఱి కొన్నిటియందేదో యొకభాగమున ఒక మొటిమపుట్టి ఆ మొటిమ తెగిపోయి వేరొక జంతువగును. కొన్ని జాతులయందు ఆడుపోగులు మగపోగులు వివక్షముగా నేర్పడి వాని రెంటి యెక్క సంయోగముచే సంతాన వృద్ధియగును. సాధారణముగ తామర శోభియని చెప్పబడు చిడుములు ఈ జాతిసూక్ష్మ జీవులవలన కలిగినవి. 13-వ పటముచూడుము.

12-వ పటము

పచ్చళ్లమీదబట్టు బూజును కొంచమెత్తుకొని అనేక రెట్లధికముగ జూప బడినది. ఇందలి తెల్లనిచుక్కలు విత్తనపుగుత్తులు.


13-వ పటము.

1, 2. తలవెండ్రుకల కుదుళ్ళ మీదితామర (Ringworm) విత్తనములు.
3. తామర తీగెల యల్లికలు.
4. శోభి: విత్తనపుగుత్తులను తీగెలును జూడనగును.

3

౩. బాక్టీరియములు (Bacteria)

మనకు తెలిసిన సూక్ష్మజీవులలో బాక్టీరియములు మిక్కిలి అధిక సంఖ్యగలవి. ఇందు అనేక జాతులును ఉపజాతులునుకలవు. ఇవి సాధారణముగ వృక్షజాతి లోనివి. ఇవియే మిక్కిలి సూక్ష్మమయినట్టి వృక్షములని చెప్పవచ్చును. వీనిని ఒక అంగుళము పొడుగునకు 8-వేలు మొదలు 75-వేలవరకు ఇముడ్చవచ్చును. ఇవి చుక్కలవలెను కణికలవలెను గుండ్రముగాగాని, మరమేకులవలె మెలిదిరిగిగాని యుండవచ్చును. మూడవ పటములో కనుపరిచిన జలదారినీటిలోని 1,2,3,4, అంకెలుగల చోట్లచూడుము. ఇవి యొకటొకటి కొంతవరకు పెరిగిన వెంటనే రెండు ముక్కలుగా విరిగి ప్రతిముక్కయు తిరిగి తల్లి సూక్ష్మజీవియగుటచే సంతానవృద్ధియగును. క్రింది పటము చూడుము. చీమును పుట్టించు సూక్ష్మజీవులు చుక్క వలె నుండును. పచ్చశగను పుట్టించు సూక్ష్మజీవులు

14-వ పటము.

జీడిగింజలవలెనుండి జంటలు జంటలుగా నుండును. 15-వ పటము చూడుము. క్షయను బుట్టించు సూక్ష్మజీవులు కొంచెము వంగిన కణికలవలె నుండును. దొమ్మను పుట్టించు సూక్ష్మజీవులు రూళ్ళ కర్రముక్కలవలెనుండును. కలరాను, కొఱుకు వ్యాధిని పుట్టించు సూక్ష్మజీవులు మరమేకులవలె మెలిదిరిగియుండును. ఈ బాక్టీరియములలో అనేక జాతులను గూర్చియు ఇతర విషయములను గూర్చియు ఇచ్చట వివరింప నెడము చాలదు.

16-వ పటము

బాక్టీరియము లనేకములు తోకలుకలిగి చురుకుగ చలించుచుండును 16-వ పటము చూడుము. మరికొన్నితోకలులేక యంతగా కదలలేక యుండును. ఈ కవచముయొక్క సహాయముచే నెంత యెండకును వేడికిని లెక్కచేయక చిరకాలము నిద్రావస్థలో నున్నట్టులుండి తరుణము వచ్చినపుడు తమ కవచమును విడిచి చురుకుగల బాక్టీరియములగును. ధాన్యపు గింజలు అయిదారు నెలలవరకు కళ్ళములందలి నెర సందులలో పడియుండి వర్షకాలము రాగానే మొలచుటకు సిద్ధముగ నున్నట్లే యివియును వానికి తగిన స్థలమును ఆహారాదులును దొరకినప్పుడు తిరిగి మొలచును. ఇట్లే పశువుల దొమ్మ, కలరా మొదలగు సూక్ష్మజీవుల గ్రుడ్లును తమ వృద్ధికి తగుకాలము వచ్చువరకు పడియుండి వర్షా కాలమురాగా తగిన తరుణము దొరికినదని మొలకరించి అతివేగముగ వృద్ధిజెందును. 17-వ పటము చూడుము.

17-వ పటము

దొమ్మ సూక్ష్మజీవులగ్రుడ్లు మొలకరింపక పూర్వముండు రూపము

క్రింది పటమునందు సూక్ష్మజీవుల గ్రుడ్లెట్లు మొకలరించి వృద్ధియగునో చూపబడియున్నది.

18-వ పటము.

పగలు 11 గంటల కొక సూక్ష్మజీవి గ్రుడ్డొక చుక్కవలెనున్నది.
12 గంటల కీ గ్రుడ్డు కొంచె ముబ్బియున్నది.
3-30 గంటలకు దీనినుండి చిన్న మొటిమ యొకటి పుట్టియున్నది.
6.గంటల కీమొటిమ పెద్దదై ప్రత్యేక సూక్ష్మజీవులుగా నేర్పడుటకుసిద్ధముగా నున్నది.
8.30 గంటలకు దీనినుండి అయిదు సూక్ష్మజీవుల యాకార మేర్పడియున్నది.
రాత్రి 12 గంటలకు 17 సూక్ష్మజీవులు పూర్ణముగ నేర్పడియున్నవి. త్వరలో నివియన్నియు విడిపోయి తిరిగి పిల్లలను పెట్టుటకు ప్రారంభించును.

సూక్ష్మజీవులు చేయు ఉపకారము

అనేక సూక్ష్మజీవులు కలిగించు హానినిగూర్చి ఇచ్చట వానిపేరులను బట్టియే మనము తెలిసికొనుచున్నను అందు

19-వ పటము

జనుము చిక్కుడు మొదలగు చెట్ల వేరులనంటియుండి భూమికి సారమిచ్చు సూక్ష్మజీవుల యిండ్లు ఉండలుగానున్నావి.

కొన్ని జాతులవి మనకుచేయు ఉపకారముగూడ కలదని మరవ గూడదు. దినదినమును చచ్చుచున్న అసంఖ్యాకములగు జంతువులయొక్కయు వృక్షముల యొక్కయు కళేబరములు

20-వ పటము

19-వ పటములోని కొన్ని యుండలలోనుండు సూక్ష్మజీవులు స్పష్టముగ చూపబడినవి. ఇవి గాలినుండి నత్రజనిని పీల్చి భూమికిచ్చి దానిని సారవంతముగ జేయును.

కుప్పలు కుప్పలుగా పడియుండి యీ ప్రపంచక మంతయు నావరించి కంపెత్తకుండ నీ సూక్ష్మజీవులు వానిని సశింపజేయుటయేగాక వానివలన భూమిని సారవంతముగ చేయుచు మన కుపకారులగుచున్నవి. కొన్ని సూక్ష్మజీవులు చిక్కుడు జనుము మొదలగు మొక్కలవేరుల నాశ్రయించియుండి భూమిని సారవంతముగ జేయును. 19, 20-వ పటములు చూడుము. సూక్ష్మజీవులు లేకయుండిన మనపాలు మజ్జిగకాదు. మనకు వెన్న రాదు, మినప రొట్టె పులియదు. మనకడుపులోకూడ ననేకజాతుల సూక్ష్మజీవులు పెరుగుచు మనకు పనికిమాలిన పదార్థములను తిని బ్రతుకుచుండును. ఈ పాకీవాండ్ర సహాయము లేకపోయిన మన మొక్కొకప్పుడు కడుపుబ్బి చావ వలసివచ్చును.

సూక్ష్మజీవుల కనుకూలమగుస్థితిగతులు

ఇవి వ్యాపింపజాలని స్థలములేదు. గాలియందు సముద్రముమీద, కొండలమీద, నీటియందు మంచునందు ఆకాశమునందు వీని యన్నిటియందును ఈ సూక్ష్మజీవులను కనిపెట్టియున్నారు. ఈ సూక్ష్మజీవులలో కొన్ని ప్రాణవాయువున్న చోట్లగాని జీవింపజాలవు. మరికొన్ని ప్రాణవాయువులేని చోట్ల గాని జీవింపజాలవు. కొన్ని ప్రాణవాయువుండినను లేకున్నను జీవింపగలవు. “టిటనస్” (Titanus) అను ధనుర్వాయువును కలుగజేయు సూక్ష్మజీవి ప్రాణవాయువు ఉండుచోట జీవింప జాలదు. “ఆంథ్రాక్సు” (Anthrax) అనుదొమ్మ వ్యాధిని పుట్టించు సూక్ష్మజీవి ప్రాణవాయు వుండినగాని జీవింపజాలదు.

సూక్ష్మజీవులు నివసించు ప్రదేశమునందుండు అహార పదార్థము ద్రవరూపముగ వాని నావరించియుండు పొరగుండ వాని శరీరములో ప్రవేశించి వానిని పోషించును. బాక్టీరియములలో కొన్ని జంతువులవలెనే బొగ్గుపులుసు గాలిని విడిచి వేయును. మరికొన్ని ఆకు పచ్చని రంగుకలిగి వృక్షములవలె బొగ్గుపులుసు గాలిని పీల్చుకొని ప్రాణవాయువును విడిచి వేయును. కొన్ని బాక్టీరియములు పై రెండు పటములలో చూపినట్లు కొన్ని మొక్కల వేళ్లను ఆశ్రయించియుండి గాలి నుండి నత్రజనిని తీసికొనును. అనేక బాక్టీరియములు పులిసిన ద్రావకములలో చచ్చును. కాని పైని చెప్పిన శిలీంధ జాతి లోని సూక్ష్మజీవులు వీనికి ప్రతిగా పులిసిన పదార్థములలో హెచ్చుగ పెరుగును. కలరా సూక్ష్మజీవి పుల్లని చల్లలో చచ్చును. పాలను చల్లజేయు సూక్ష్మజీవులు చల్ల పులిసిన కొలదిని హెచ్చుగ వృద్ధిజెందును. వీనిని మధుశిలీంధములందము, 21-వ పటము చూడుము. మినపపిండి మొదలగుపదార్థములు పులియుటకు సహకారులగు సూక్ష్మజీవులు శిలీంధముల జాతిలోనివే.

21-వ పటము

మధుశిలీంధములు (Yeast)

మినపపిండిని పులియబెట్టునట్టియు; కల్లును, చెరకు పానకమును సారాయిజేయునట్టియు శిలీంధములు.

అ—ఇందు ఇవి 250 రెట్లు చూపబడినవి.
ఇ—ఇందు 1500 ల రెట్లు చూపబడినవి. కణమునందు అక్కడక్కడ మొటిమలు (మొ) పుట్టి యవి తెగిపోయి క్రొత్త శీలీంధములు అగును.
ఉ—ఇందు మొటిమలకు పిల్ల మొటిమలు పుట్టి గొలుసుగా నేర్పడుచున్నవి. ఈ మధుశిలీంధములు చక్కెరను సారాయిగను బొగ్గు పులుసు గాలిగను మార్చును. బాక్టీరియములుకూడ తాము నివసించు పదార్థములలో ననేక మార్పులను కలుగ జేయును. ఇట్లె చీము పుట్టించు సూక్ష్మ జీవులు తమ చుట్టు ప్రక్కలనుండు కండ మొదలగు పదార్థములను కరగించి ద్రువరూపముగ జేసివేయును. మరికొన్ని సూక్ష్మ జీవులు కొన్ని విషపదార్థములను వెలిపరుచును. ఈ విషపదార్థములు కొన్ని సూక్ష్మజీవులనుండి పుట్టినవి పుట్టినచోటనే నిలిచి యుండును. మరికొన్నిటినుండి పుట్టు విషపదార్థములు శరీరమునందలి ద్రవపదార్థములగుండగాని, నరములగుండగానీ వ్యాపించును. ఇట్లే క్షయజాతి సూక్ష్మజీవుల విషము చాలా భాగము పుట్టినచోటనే యుండును. “టిటనస్” (Titanus) ధనుర్వాయు సూక్ష్మజీవులు మొదలగువాని విషము శరీర మెల్లెడలకు వ్యాపించును. కొన్ని సూక్ష్మజీవులు ప్రాణవాయు వేవైపుననుండిన ఆవైపునకు చలించును. మరికొన్ని సూక్ష్మ జీవులకు గాలితగిలినతోడనే చలనముపోవును. సామాన్యముగ అనేక సూక్ష్మజీవులు కొంతవేడిని భరించి ఆ వేడియందు మిక్కిలి శీఘ్రముగ వృద్ధిబొందును. అంతకంటె హెచ్చగు వేడిమియుండినయెడల చురుకుతనము తగ్గి క్రమముగ నశించును. కాన ఎంతవేడిమి తమవృద్ధికి మిక్కిలి అనుకూలముగ నుండునో అంతటి శరీరపు వేడిమిగల జంతువులలోనే ఆయాజాతిసూక్ష్మ జీవులు పెరిగి వ్యాధిని పుట్టించునుగాని తమకుతగిన శరీరపు వేడిమిలేని జంతువులలో నవి బ్రతుకజాలవు. అనగా మనుష్యులలో వ్యాధిని గలిగించు కొన్నిసూక్ష్మజీవులు చేపలు కప్పులు, మొదలగు నీటి జంతువులలో ఎట్టి వ్యాధిని గలిగింపనేరవు. మానవులకు వచ్చుకలరా వ్యాధి మన ఇండ్లలోనుండు కుక్కలకును, పిల్లులకును రాదు. కొన్ని వ్యాధులను గలిగించు సూక్ష్మ జీవులు ఎంత ఎండనైనను వేడినైనను భరించి సంవత్సరముల తరబడి బ్రతుకును. సూక్ష్మ జీవుల అయుర్దాయము ఆ యా జాతినిబట్టి యుండును. దొమ్మ “అంథ్రాక్సు” (Anthrax) సూక్ష్మజీవుల గ్రుడ్లు సీలుచేసిన గొట్టములలో ౨౨ సంవత్సరముల వరకు బ్రతికియుండెనని “పాస్‌టర్ ” (Pasteur) అను నతడు కనిపెట్టెను. క్షయ వ్యాధిని కలిగించు సూక్ష్మజీవులు ఎండిపోయిన కఫములో ౯౫ దినములు బ్రతికియుండి యటు పిమ్మట ఇతరులకు ఆ వ్యాధి నంటింప గలిగియుండెనని రుజువు పడినది. ఇట్టుగాక కలరా మొదలగు కొన్ని వ్యాధులను గలిగించు మరికొన్ని సూక్ష్మ జీవులు ఒకటిరెండు గంటల వేడికే తాళజాలక చచ్చిపోవును. అనేక సూక్ష్మజీవులను గుచ్చెత్తిన మిశ్రమ కషాయములో తమకు అనుకూలమగు స్థితిగతులుగల కొన్నియే బ్రతికి మరికొన్ని చచ్చిపోవును. కొన్ని సూక్ష్మ జీవులనుండి పుట్టు పదార్థములు మరికొన్ని సూక్ష్మజీవులకు విషములయి వానిని నశింపచేయును. టయిఫాయిడ్ (Typhoid) జ్వరమును కలుగజేయు సూక్ష్మజీవులు జిగటవిరేచనములను గలిగించు (B.Coil:) కోలైసూక్ష్మజీవులతో కలిపిపెంచినపుడు టయిఫాయిడ్ సూక్ష్మజీవులు చచ్చును. కాని టయిఫాయిడ్ సూక్ష్మజీవులు కురుపులయందు చీము పుట్టించు సూక్ష్మజీవులతో కలిసి చక్కగ పెంపొందును.

సూక్ష్మజీవులన్నియు పొడిచే ననగా ఆరబెట్టుటచేగాని వేడిచేగాని, మందులచేగాని, తమకిష్టములేనిజంతువుల శరీరములో ప్రవేశింపజేయుటచేగాని తమ బలమును పోగొట్టు కొనును. ఇట్లే కొన్నివ్యాధులకు విరుగుడు పదార్థములను తయారు చేయునపుడు సూక్ష్మజీవుల బలమును తగ్గింతురని ముందుతెలిసికొనగలరు. వెఱ్ఱికుక్కలయొక్క వెన్నెముకలోని పెద్దనరమును తీసి ముక్కలుచేసి కొన్నిముక్కలను ఒక దినమును, కొన్నిముక్కలను రెండుదినములను, కొన్నిముక్కలను మూడుదినములును ఇట్లే నాలుగు అయిదు ఆరుమొదలు పదునైదు దినములవరకు కొన్నిముక్కలను వేరువేరుగ అర బెట్టి ఆముక్కలనుండి రకరకములగు బలముగల టీకారసములను తయారుచేయుదురు. ఇందుపదునైదుదినములు ఆరబెట్టిన ముక్కతో చేయబడిన రసము మిక్కిలి బలహీనమయినది. ఎంత తక్కువ ఆరబెట్టిన ముక్కలతో చేయబడిన రసము అంత బలమయినది. సాధారణముగ అన్నిజాతుల సూక్ష్మజీవులును చీకటిలో చక్కగ పెరుగును. మిక్కిలిప్రకాశమయిన వెలుతురు వలన వాని వృద్ధితగ్గి అవి క్రమక్రమముగ నశించును. సూక్ష్మ జీవులకంటె వాని గ్రుడ్లు ఎండ వేడి తడి వెలుతురు మొదలగు వానిచే సులభముగ హాని జెందవు. మసలుచున్న నీళ్లలో తల్లిసూక్ష్మజీవులు చచ్చినను, వానిగ్రుడ్లు కొన్ని ౧౩౦ డిగ్రీల వేడివచ్చువరకు బ్రతికియండును. పశువులకు గాళ్ళు కలిగించు సూక్ష్మజీవులు పచ్చిక బైళ్లలోని పచ్చగడ్డి చాటుననుండు నీడలో అనేక సంవత్సరములు జీవింపగలవు.

సామాన్యముగ మనుష్యులకంటు వ్యాధులను పరిశీలించి చూడగ సూక్ష్మజంతువులు, శిలీంధములు, బాక్టీరియములు, ఈ మూటిలో బాక్టీరియములు ఎక్కవ వ్యాధిని కలుగజేయునని యీ క్రింది పట్టీని గమనించిన తెలియగలదు.

  1. సూక్ష్మ జంతువులచే గలుగు వ్యాధులు.
    1. నాలుగువిధములగు చలి జ్వరములు.(Malaria)
    2. అమీబిక్ డిసెంటరి (Amoebic Dysentery) ఒక విధమయిన రక్తగ్రహిణి.
  2. శిలీంధముచే గలుగువ్యాధులు. (Fungi)
    1. ఒక విధమైన నోటిపూత (Thrushi)
    2. ఒకవిధమైన సర్పి (Herpes)
    3. తామర (Ringworm)
  • (4)ఆక్టినోమైకోసిస్ అను నొకవిధమైనపుండు(Actinomycosis)
  • (5)ఒకవిధమైన కాలిపుండు (Madura Foot)
  • (6)శోభి (Tenia Versicolor )
  • (ఇ) బాక్టీరియములచే గలుగువ్యాధులు.
  • (1)క్షయ(Tuberculosis)
  • (2)న్యుమోనియా (Pneumonia)
  • (3)పచ్చశెగ (Gonorrhoea )
  • (4)టయిఫాయిడ్ జ్వరము (Typhoid)
  • (5)ధనుర్వాయువు-టిటనస్ (Titanus)
  • (6)కలరా (Cholera)
  • (7)ఇౝప్లు ఎంజ జ్వరము(Influenza)
  • (8)ప్లేగ్-మహామారి (Plague)
  • (9)సెరిబ్రోస్పయినల్ ఫీవర్ (Cerebrospinal Fever) కొత్త జ్వరము.
  • (10)చీము-నూతిక జ్వరము (Suppuration)
  • (11)సర్పి (Erysispelas)
  • (12)అడ్డగర్రలు పుట్టించు పుండు (Soft Chancre)
  • (13) కుష్ఠవ్యాధి (Leprosy)
  • (14)కొరుకు లేక సవాయి మేహము (Syphilis)
  • (15) దొమ్మ (Anthrax) ఇది పశువ్యాధి మానవులకు కూడ అంటవచ్చును.
  • (16) నోటిగాళ్లు; కాలి గాళ్లు (Foot and mouth disease) పశువ్యాధి. మానవులకుకూడ అంటవచ్చును.

పైని వివరించినవి గాక యింకను అసంఖ్యాకములగు వ్యాధులు బాక్టీరియములచే గలుగును. ఇంతవరకు మనకు తెలియనివి పెక్కుసూక్ష్మజీవులింకను గలవు.