అంటువ్యాధులు/రెండవ ప్రకరణము

రెండవ ప్రకరణము.

సూక్ష్మజీవు లెక్కడ నుండును.?

ఈ సూక్ష్మజీవు లెక్కడెక్కడుండునని మీరు అడిగినచో నవి సామాన్యముగా మన శరీరముమీదను, మన పేగుల లోపలను, మన ఇంటిలోపలను, వెలుపలను, గాలియందును, నీటియందును మనము ఎక్కడ శోధించినను అక్కడనుండునని చెప్పవచ్చును. తెలియనివారలకు, అవి యెట్టివియో, వానిని చూచు టెట్లో తెలియకపోవుటచేత అవి కానరావు. ఎక్కడెక్కడ అశుభ్రతయు, క్రుళ్లుచుండు పదార్థములును, హెచ్చుగనుండునో అక్కడ సూక్ష్మజీవు లధికముగ నుండును. మన ఇండ్లలో మన కాళ్లక్రిందపడి దొర్లుచుండు చీమలకును, కల్మషమును తిని బ్రతుకు ఈగలకును తెలిసిన కొన్ని విషయములు మనకు తెలిసినయెడల, ఎంత ప్రశస్తమైన నీళ్లు తెచ్చినను దాని నిండ పురుగులున్నవని మనము చెప్పుదుము. ౧, ౨, ౩ పటములను చూడుము, ఎంత శుభ్రమయిన దుస్తులు తెచ్చినను వానినిండ మైల ఉన్నదని త్రోసివేయుదుము. ఈగ కండ్లు మనము పెట్టుకొని ఇంటిప్రక్కను క్రుళ్లుచుండు ఆవుపేడను ఒక్కసారి చూచినచో ఆరునెలలవరకు మనకు అన్నహితవు చెడిపోవును. ౪-వ పటము చూడుము.

1-వ పటము

చెన్నపట్టణము కొళ్లాయిలోని నీటిబొట్టు.
సూక్ష్మజీవులు లేవుకాని నాచు సంబంధమైన ఆకుపచ్చని నలుసులు గలవు.

2-వ పటము

చెన్నపట్టణము, కచ్చాలీశ్వర ఆగ్రహారము కోనేటిలోని నీటిబొట్టు.


1. నీటియందలి పసరును పుట్టించు నాచునలుసులు.

2. వివిధా కారములుగల సూక్ష్మజీవులు.

3-వ పటము

వీధి ప్రక్కనుండు జలదారి నీటిబొట్టు.


1,2,3,4 సూక్ష్మజీవులు.
  1. చుక్కలవలెనున్నవి.
  2. జంట చుక్కలుగ నున్నవి
  3. కణికలవలెనున్నవి
  4. మెలితిరిగి యున్నవి
  5. శాకపదార్థము క్రుళ్లుచున్నది
  6. ఒకపురుగు గ్రుడ్డు

4-వ పటము

ఆవు పేడ కలిపిన నీటిబొట్టు.
 
  1. బూజు పోగులు.
  2. చుక్కలవలెనుండు సూక్ష్మ జీవులు.
  3. సూక్ష్మజీవుల గొలుసు.
  4. కణికవలెనుండు సూక్ష్మజీవి.
  5. పురుగుల కళేబరములు.
  6. క్రుళ్లుచుండు శాకపదార్థములు.

వాహనము ఈగ

మనమొక అయిదు నిమిషములు ఒక ఈగ చేయుపనులను పరీక్షించి నేర్చుకొనగల విషయము లనేకములుగలవు. సామాన్యముగా నేకాలమునందును మన దేశములో ఈగలకు కొదువయుండదు. కానితాటిపండ్లు, ఆవుపేడ మురుగుచుండు వానకాలములో అవి మెండుగ నుండును. దీనికి అశుభ్రతయే కారణము. ఒక గ్రామముగాని, ఒక ఇల్లుగాని శుభ్రముగా నున్నదా యని తెలిసికొనవలెనన్న అక్కడనుండు ఈగల జనాభాను ఎత్తుకొనిన చాలును. ఈగలు ఎంత తక్కువగ నున్న అంత పరిశుభ్రత గలదని చెప్పవచ్చును. గ్రామములలోని భూములను కొలుచుటకు గజముబద్దలును, ధాన్యములను కొలుచుటకు కుంచములను ఉపయోగించుట యెట్లో అట్లే ఒక గ్రామముయొక్క అరోగ్య స్థితిని కొలుచుటకు ఈగను కొలత పాత్రగా ఉపయోగింప వచ్చును. ఈ విషయమై యింకను చక్కగ మనస్సులో నాటుకొనుటకై ఒక నిదర్శనము చెప్పెదము. ఒక ఈగను కొంచెము సేపు పరీక్షించి చూచునెడల ‘ఎందుకురా యిది పనిలేకుండ నిట్లు గంతులు వేయుచున్నది.’ అని అనిపించును. ఇదికొంతసేపు మన చేతి మీదను, కొంత సేపు పిల్లుల కుక్కలమీదను, పిల్లల గజ్జిపుండ్లమీదను, కొంత సేపు వంటయింటిలోని తడినేల మీదను, మరికొంతసేపు పేడ కుప్పలమీదను, కొంత సేపు క్రుళ్లుచుండు జల దారులమీదను, నూతుల దగ్గరను, వంటి యింటి ప్రక్కలను, కాళ్ళు చేతులు కడుగు కొను చోట్ల బురబుర లాడు చుండు చల్లని నేలందును, ఇచ్చ వచ్చినట్లు ఆడి ఆడి తుదకు ఒక గడప మీదనో కిటికీ మీదనో వ్రాలును. ఇది ఇక్కడ ఏమి చేయునో చూడుము. అక్కడక్కడ గంతులు వేయుటకు పోయినప్పుడు ఇది సోమరి పోతుల వలె ఆడుకొనుటకు అక్కడుకు పోలేదు. ఇది తిరిగిన అన్ని చోట్లనుండి రెక్కలమీదను తలమీదను పెట్టుకొని మోయ గలిగినంత బరువును మోసికొని వచ్చినది. తెచ్చిన దానిని తినుటకై ఇది యిక్కడ చేరినది. ఇది తీరికగా వ్రాలిన తరువాతి దీని నడవడి శోధించిన అంతయు తెలిసి పోవును. ఇది తన నాలుగు ముందు కాళ్ల మీదను వంగి నిలుచుండి వెనుక ప్రక్కనుండు రెండు కాళ్ళతో రెక్కలను వీపును అనేక సార్లు మిక్కిలి శ్రద్ధ్యతో తుడుచును. ఇట్లు తుడిచి తుడిచి దీని వీపు మేద మోసికొని వచ్చిన సరకుల నన్నిటిని వెనుక కాళ్ళతో నెత్తి, దానిని తన ఆరుకాళ్లతో త్రొక్కి ముద్ద చేసి ముందరి రెండు కాళ్ళతో నోటిలో పెట్టుకొని మ్రింగి వేయును. ఇట్లే వెనుక ప్రక్క కాళ్ళ మీద నిలువబడి ముందరి కాళ్ళతో తల, మెడ మొదలగు ప్రదేశముల మీదనున్న సామా నంతయు దింపి చిన్న చిన్న ఉండలుగా జేసికొని మ్రింగును. ఈ ఉండలు సూక్ష్మజీవుల ముద్దలుగాని వేరుగావు. ఇవియే దీని కాహారమని యెరుగని వారీ యీగ కాళ్ళు చేతుల నెందుకు ఆడిచుచునదో తెలికొన జాలరు. శుభ్రము చేసికొనుటకు దులుపు కొనుచున్నదని వారు అను కొనవచ్చును. కాని ప్రయాణముచేసి వచ్చిన తరువాతను, అంతకు పూర్వమును, ఈ యీగ కాలి నొకదానిని సూక్ష్మదర్శని అను యంత్రములో పెట్టి పరీక్షించినయెడల రహస్యము తెలియగలదు. 5,6 పటములు చూడుము. ఈ యంత్రము ఒక దానిని వేయిరెట్లు పెద్దదిగా కనబర చు శక్తిగలది. ఈగ నొకదానిని, నీ మనసొప్పినయెడల, చంపి దాని పొట్టలోని పదార్థమును సూక్ష్మదర్శినిలో పెట్టి పరీక్షించి అందులో పుట్టలు పుట్టలుగానున్న సూక్ష్మ జీవులను చూచినయెడల నీ యంశ మింకను దృఢము కాగలదు. లేదా మనము తినబోవు అన్నముమీద అది వాలినప్పుడు ఏదేని ఒక అన్నపు మెతుకుమీద నల్లని చుక్కబొట్టు నొక దానిని పెట్టిపోవును. ఆబొట్టునెత్తి సూక్ష్మదర్శనితో పరీక్షించినయెడల రకరకముల సూక్ష్మజీవులు కనబడును. ఈ బొట్టే ఈగ విసర్జించు మలము. దానిని తెలిసియు తెలియకయు కూడ మనము తినుచున్నాము.

ఈప్రకారము ఈగలచే, చీమలచే, దోమలచేకూడ వ్వాపించు సూక్ష్మజీవు లెక్కడ గలవో యింకను వివరముగ తెలిసికొనవలె ననిన మీరు మిక్కిలి దూరము వెదుక నక్కర లేదు. మన కంటికి కనబడకుండ మనచుట్టును క్రుళ్లుచుండు అల్పజంతువుల కళేబరములును, మనము పారవేయు కాయ

5-వ పటము

ఈగకాలులో కొంతభాగము

ప్రక్క పటములో అడుగుభాగముననున్నగీటుక్రింద కనబడు భాగము మరింత హెచ్చుగ చూపబడినది. దానిమీదనుండు లెక్కలేని సూక్ష్మజీవులను చూడనగును.

6-వ పటము
గూరలతొక్కలు ఆకులు మొదలగు శాకపదార్థములును నిరంతరము సమృద్ధిగ సూక్ష్మజీవుల కాహార మొసగుచుండును. మన ఇండ్లలో సామాన్యముగ నశుభ్రత యెక్కడెక్కడుండునో ఆ స్థలముల నొక్కటొక్కటిగ పేర్కొనిన యెడల సూక్ష్మజీవుల యునికిపట్టు చక్కగ మీ మనస్సులందు నాటుకొనునని తలచి కొంతవరకు వివరించుచున్నాము.

వీధిగడప

వీధి గడప దగ్గరనుండి ప్రారంభించి చూచెదము. అరుగుమీదనుండిగాని, గడప మీదనుండిగాని, ఇంటిలోని వారలందరును భోజనమునకు పోక పూర్వమును, భోజనమయిన తరువాతను కాళ్లు చేతులు కడుగుదురు. ఆ నీళ్లు ధారాళముగా వీధి వెంబడి పోవుటకు తగినన్ని యుండకపోవుటచేత పోసినప్పుడెల్ల అక్కడనే నిలిచి ఇగిరి పోయి గడప ప్రక్కను బురద బురదగానుండును. చీడీలమీద నిలుచుండుటవలన మన కాళ్లకు బురద అంటదు గనుక అంతటితో మనము తృప్తిజెందుదుము. ఇక్కడనే చీమిడీ చీదుదుము. గొంతుకలోని కళ్లెను ఉమ్మి వేయుదుము. ఇది యంతయు బురదలోపడిక్రుళ్లును. సామాన్యముగా పల్లెటూళ్ళలో మండువాలో నుండి తూము కాలవ కూడ ఇక్కడకే వచ్చిచేరును. ఈ తేమ నాశ్రయించియుండు దోమలు పగలంతయు తూముకాలవలో నుండు చీకటిలో దాగియుండి రాత్రులయందు మండువా మార్గమున మన ఇండ్లలో ప్రవేశించును.

మండువా

పిల్లలు తిన్న మామిడిపండ్ల తొక్కలు టెంకలు, దాసీది మండువా చుట్టునుండి ఊడ్చుకొనివచ్చిన దుమ్ము, తుక్కు అంతయు అందులోనే చేరును. కొన్ని చోట్ల ఎలుకలు దూరునంత సందులుగల బల్లలతో కూర్చిన తలుపులు మండువాలోని రహస్యములను బయటకు కనబడ నీయవు. ఒక్కసారి దానిని తీసినయెడల గొద్దింకలు, కుమ్మరపురుగులు, నలుద్రిక్కుల క్రమ్ముకొనును.

పడకగది

పడకగది చూతము. ఇందు ఒక మూలమంచము; ఒక మూల బట్టలు వ్రేలాడు దండెము ; మరియొకమూల బోషాణము ; ఇవి ముఖ్యముగా నుండును. ఇవిగాక పెట్టెలు మొదలగు సామానులు క్రిక్కిరిసి యుండును. చదువుకొనిన వారిండ్లలో నొకవైపున బల్లమీద పుస్తకములును కాగితపు కట్టలును పరచియుండును. నెలలనాటిదో, సంవత్సరముల నాటిదో దుమ్ము పుస్తకముమీద కాకపోయినను సందుల యందైన నుండక మానదు. పుస్తకములలో చిమ్మెటలెగురు చుండుటయు, నల్లులు ప్రాకుచుండుటయు మన మెరుగనిది కాదు. ఇంక బోషాణము తెరచి చూతము. పాత కాగితముల దస్త్రములు, అక్కడక్కడ తాటాకుల పుస్తకములు, తాతలనాటినుండి చేరిన మకిలతో దళసరెక్కి బరువైన నిలువు చెంబులు, తప్పెలలు, నాజూకు తప్పిన సందుగ పెట్టెలు, కలందానులు, అడ కత్తెరలు, ఇత్తడి చిక్కంటెలు, బల్లులు, గొద్దింకలు, తేళ్లు ఇవి అవి అననేల ఒక్కొకపుడు పాములు గూడ ఆ బోషాణములో చేరియుండును. బోషాణము చాటున నుండు ఎలుకపెంటలను మరవకూడదు. ఇంక మంచముక్రింద క్రిక్కిరిసిన సామానులను, గంపలు, చాపలు, బుట్టలు, కాళ్లూడి పోయిన పీటలను, పీకిదానులనుగూర్చి మేము వ్రాయ నక్కర లేదు.

వంట ఇల్లు

పడకగదిలోనుండి వంటయింటిలోనికి పోవుదము. ఒక ప్రక్కను చద్ది అన్నములగూడు; ఈ గూటిలోనికి పిల్లులు కుక్కలు దూరకుండ చిన్నతలుపు; ఈ తలుపును తీసినతోడనే ఒకవిధమైన వాసన ముఖముమీదికి కొట్టును. ఈ గూటిలో చారు పులుసు మొదలగునవి అప్పుడప్పుడొలుకు చుండును. బాగుగ వెదకిన ఈ గూటిలో పదిదినములనాటి మెతుకులును, కూరముక్కలను, మూలలయందు క్రుళ్లు చుండునవి, ఒకటి రెండయినను కనబడక మానవు. ఈగూడును ఎన్నడును కడుగరు. బ్రాహ్మణుల యిల్లయినయెడల భోజనము చేయుస్థలము, పంక్తి పంక్తికిని ఆవుపేడ నీళ్లతో శుద్ధిచేయుట చేత నిరంతరము ఈగలు ముసురుచుండును. వానకాలములో బొత్తిగా ఆరుటకు వీలులేక కాలు జారుచుండుట వింతకాదు. ఇక్కడనుండి వంటగది; ఈ గదిలో ఒకమూల పాలదాలి; బూడిదకుప్ప అరగజము ఎత్తయినను పెరుగువరకు ప్రక్కనే యుండును. దానిప్రక్కను చిట్టటకబల్ల. దానిక్రిందనూనె డబ్బాను పెట్టుకొను గూడు లేక నూనెసీసాను తగిలించు చిలక కొయ్య, దీనినుండి నూనె కారికారి గూటి మైనము ఏర్పడును. ఆ బల్లవద్ద కంపు ప్రతిదినము అక్కడనుండువారి ముక్కులకు తెలియదు. క్రొత్తవార లక్కడకు వెళ్లిన యెడల దానినిభరింపజాలరు. మిరపకాయలగింజలు, ధనియాలు, మెంతులు, చింతపండు, ఇంగువ మొదలగునవి జిగురు జిగురుగా నుండు మట్టితోగూడి మిళితమై యీ చిట్టటకబల్ల నంటి యుండును. ఇప్పుడిప్పుడు గదుల పెట్టెలుగలవు. వానిలో నొక్కొక్క ఆరలోని సామానులమీద గొద్దింకలను, చిమ్మెటలును, పెంకి పురుగులును ఆడుకొనుచుండును. చిన్న పిల్లలను బూచి బూచి అని జడిపింపవలెనన్న నీగదుల పెట్టెను వారిముందర పెట్టి దాని మూత తటాలున తీసిన చాలును. వా రడిలి పోవుదురు. చిట్టటబల్లకు ఎదురు ప్రక్కన నీళ్ల బిందెలు పెట్టికొనుతిన్నె. ఇప్పుడిప్పుడు గచ్చు చేసిన అరుగులు కొన్ని ఇండ్లలోగలవు. కాని సామాన్యముగా నీళ్లబిందెల క్రిందనుండు నేల రెండు మూడడుగుల లోతువరకు బాగుగ నాని బందబందగానుండి చితచితలాడుచుండును. చెదలకును, తెల్లపురుగులకును, ఎఱ్ఱచీమలకును ఈ చల్లనినేల నివాసము. ఈ మూలను ఆ మూలనుండు ఎలుక కన్నములమాట చెప్పనక్కరలేదు. రెండువైపులు పోగా మూడవవైపున పొయిలును, పదినాళ్ళుసున్నమువేసినను దానినంతయు మ్రింగివేయు మసిగోడయును ఉండును. ఈ ప్రక్కనే ఒకటిరెండు వారములకు కావలసిన పిడకలు పుల్లలు ఒక మూలను, గడచిన దినమునాటిబూడిద బొగ్గులు మరియొక మూలను ఉండును. ఇక నాలుగవతట్టున గడ మంచెమీద బియ్యపుగంప లేక గంగాళమును, ఊరగాయలకుండలును, పప్పుప్పులును విస్తరాకులును, ఉండును. గడమంచెక్రింద చిల్లులుపడ్డ పాత్ర సామానులు, దినదినము ఉపయోగము లేని బలువైన పాత్రలు మొదలుగునవి ఉండును. వీనిచాటునపడియుండు పప్పుగింజలను ఏరుకొనుటకు జేరెడి పందికొక్కులకును ఎలుకలను మసలుటకు సందిచ్చి ఇవిమిక్కిలి సహ కారులగును. కొంచెము బద్ధకముగా నున్నప్పుడు కూరగాయల తొక్కలును మిరపకాయల తొడిమలను ఇంటివారలూడ్చివేయుట కీ సందు లనుకూలపడును.

వరసందు

ఇంతట వంటయిల్లు విడచి, దానిప్రక్కను చేతులు కడుగుకొనుటకును, గంజి పారబోసికొనుటకును ఉపయోగపడు చిన్నసందులోనికి పోవుదము. ఈ సందును కొందరు మడిసందనియు మరికొందరు వరసందనియు చెప్పుదురు. సామాన్యముగా ఈసందులోనికి వంటయింటిలోనుండియే

2 గంజి, కూరనీళ్లు, రాతిచిప్పలు కడిగిననీళ్లు వచ్చుటకు దారి ఉండును. లేదా వంటఅయిన తోడనే లోపలనుండి శ్రమపడి తెచ్చి యీ సందులో పారబోయుదురు. ఇక్కడనే రుబ్బు రోటికి స్థలము. ఈ సందులోనే యొక ప్రక్కన కుడితిగోలెముండును. నాలుగు నాళ్లవరకు గొడ్లవాడు తీసికొని పోక పోయినయెడల గోలెములోనుండు పుచ్చు వంకాయ ముక్కలు, గుమ్మడికాయలోని బొరుజు, ముదిరిపోయిన అనపకాయ బెండకాయ ముక్కలు నూరుచుండగా దాని రుచియు కంపును పశువులకే తెలియవలెను. ఈ సందులో ఎదురుగోడ దరిని సాధారణముగ బురదగనుండు నొకమూలనుండి వెలువడు కంపును వర్ణింప నలవికాదు. గంజి వాసనయా, కుడితి వాసనయా, పేడనీళ్లు వాసనయా, ఏదియో చెప్పలేము. కంచములు, కూరకుండలు కడుగునీళ్లు ఇక్కడనే చేరును. అలుకు గుడ్డయు చీపురుకట్టయు ఇక్కడ యెండుచుండును. చేతులు కడుగుకొనుటకు నీళ్లబిందెలును చెంబులును ఇక్కడ నుండును. ఈ సందులోనుండి నూతిదొడ్డిలోనికి పోవుదము.

నూతిదొడ్డి

ఇల్లంతయు గచ్చుచేయించిన వారిండ్లలోకూడ నూతి వద్దనుండు క్రుళ్లు తప్పదు. కుంకుడుకాయత్రొక్కులు, తల వెండ్రుకల చిక్కులు; ప్రాతగుడ్డ పేలికలు, చింకిరి చేదలు, పాత త్రాటి ముక్కలు వీని నన్నిటిని నూతిచుట్టును ఎల్లప్పుడు చూడవచ్చును. ఈ నూతిదగ్గరనే స్నానములు. తలంట్లనాడు పదిబిందెలనీళ్లతో స్నానము చేసినయెడల రెండు మూడు బిందెలకంటె ఎక్కువబయటికిపోవు. మిగిలినదానిలో సగమయినను తిరిగి నూతిలో చేరును. నూతిలోనినీళ్లన్నియు, తోడి పోసికొనినను మా నీరు మా నూతిలోనే చేరుచున్నదని కొందరు సంతోషింపవచ్చును. ఇక్కడనే కుమ్మరి పురుగులను, ఏలుగు పాములను, చక్కని ఎరుపురంగుగలిగి మిసమిసలాడు చుండు కుంకుడుకాయ పురుగులను మిక్కిలి తరుచుగచూడనగును. బురబురలాడు బురద స్నానము చేసినవారి కాలికంటి కొనకుండ అక్కడక్కడ అరగజమున కొకటిచొప్పున రాళ్లు గాని ఇటుక ముక్కలుగాని పరచియుండును. ఇక్కడ నుండి అప్పుడప్పుడు మించిపాకి పోవు బురుదనీరు వీధిని పడకుండ కట్టిన మురుగుకుండును చూడవలెను.

మురుగుకుండు

దాని పేరే దానిని వర్ణనాతీతముగ జేయుచున్నది. దానిమీద చీకిపోయిన పాతతలుపున్నను ఉండవచ్చును. దాని లోని నీటినెత్తి దినదినము పారబోసి, బురదమట్టి నెత్తివేసి శుభ్రపరచవలెనని దానిని కట్టినవారి యుద్దేశము. అది నిజముగ గజములోతున్న యెడల ముప్పాతికగజము వరకు కుళ్లు మట్టి దిమ్మ వేసికొనిపోయి యుండును. పైనుండు పాతికగజముతోని నీటిని ఎత్తువారులేక, గొయ్యి నిండిపోయి, వీధిని బడి పొర్లబారుచుండును. ఇక్కడ ననేక రకములగు దోమలుమొదలగు వేర్వేరు జాతుల పురుగులు, చల్లదనమునకును ఆహారమునకునుజేరును. ఇంకదొడ్డిలో రెండుచోట్లను మనము వెదుకవలసియున్నది.

పెంటగొయ్యి

ఒకటి పెంటగొయ్యి. పొలములోనికి మట్టి తోలుకొనుటకై యేమూలనో యొక మూల పెద్ద గొయ్యి నొక దానిని పెట్టుదురు. అది త్రవ్విన క్రొత్తరోజులలో నది పెద్దగుండముగా నుండును. వెడల్పుగా త్రవ్వుటకు దొడ్డిలో నంతగా చోటుండదు. వేసవి కాలములో ఇంటిలోని చెత్త, ఎంగిలి విస్తరాకులు, దొడ్లలో రాలిన ఆకులు, దుమ్ము మొదలగునదంతయు చేరి అర్ధసంవత్సరములోనే గొయ్యి రమారమి పూడిపోవును. ఇంతటవానవచ్చి గోతిని నింపివేయును. దీనియొక్క కంపును ఇప్పుడు చూడవలెను. ఒక కఱ్ఱతో ఈతుక్కును లేవనెత్తిన దానిలోపల ఆవిరెత్తుచు వేడిగ నుడుకుచుండును. దాని వాసనను చూచినవారు మరచిపోరు. పిమ్మట వర్షాకాలము రాగానే గొయ్యి నిండిపోయి పెంటకుప్ప నెలనెలకు నేలపై గజముచొప్పున పెరుగుచుండును. ఒకవేళ పశువులపేడ, పెంటయుకూడ ఇంటి దొడ్డిలోనే చేరవలసి యున్నయెడల అడుగ నక్కరలేదు.

మరుగుదొడ్డి

దొడ్డిలో శోధించుటకు ఇంకొకటి మిగిలియున్నదని చెప్పియున్నాము. అది అన్నిటికంటెను అసహ్యమైనది. అయినను చెప్పక తీరదు. ఒకవేళ గాదులు, పురులు మొదలగు చాటుస్థలము లున్నయెడల పల్లెటూళ్ళలోని అడువారును, బద్ధకస్తులగు మగవారునుకూడ అక్కడనే మలమూత్రములు విడుతురు. యూనియనులున్న గ్రామములలో తప్ప కట్టిన మరుగుదొడ్ల పద్దతిలేదు. ఆ పెంటను ఎవ్వరును శుభ్రపరచువారు లేక యే వానదేవుడో తీసికొనిపోవువరకు పెరుగుచునే యుండును. అందుకునుగూడ దారిలేనిచో, ఆ యేటి కాయేడు అక్కడనే నేలను బలపరుచుండును.

కోళ్లకు ఈగలకు మన ఇండ్లలో నాహారము చిక్కకుండ చూడవలెను

మా యిల్లు మిక్కిలి శుభ్రముగానున్న దనుకొను వారియిండ్లలోకూడ పైని జెప్పిన వానిలో ననేకములు సామాన్యముగా కానవచ్చును. కావున నింతగా వివరించినాము. ఒక కోడి వీధిలోని పెంటలమీద తన ఆహారమును వెదికికొని తినుచుండుట ఎప్పుడయినను చూచిన యెడల వారి కొక్క విషయము గోచరము కాక మానదు. కోడి ఏమియు లేని చోట కాళ్లతో గీరి, ఏదో యొక వస్తువును ముక్కుతో పట్టుకొనుచుండును. ‘దీనికి మంటిలో ధాన్యపు గింజలు దొరుకునా, తవుడు దొరుకునా ఏమియు లేదే, యెందుకిది వట్టిశ్రమపడుచున్న’దని తోచవచ్చును. ఒక్కపెంట మీద ఎన్నిదినములైనను ఇది పొట్ట పోసికొనగలదు. ఇది మన్నుతినదని మనకందరకు తెలియును. ఇది మనకంటికి కానరాని పురుగులని ఏరి తినును. దీనినిబట్టి మన కండ్లకంటె దాని కండ్లు మిక్కిలి తీక్ష్ణమైనవని మనకు తెలియగలదు. కావున మన కంటికి తెలియక, మనము మిక్కిలి శుభ్రముగా నున్నదని గర్వించుచున్న ఇంటిలో మనకుకానరాని సూక్ష్మజీవు లనేకములు మన చుట్టునున్నవని కోడినిచూచియు, ఈగను చూచియు, తెలిసికొని, ఈగలకు కోళ్లకుతగిన ఆహారము మన ఇండ్లలో చిక్కకుండ మనము కాపాడుకొనవలెను. ఈ యీగలే యొక ఇంటియొక్క శుభ్రతను కొలుచు పరిమాణములని పైని వ్రాసి యున్నాము. మీ ఇంటిలో ఈగలు ముసురుచున్నయెడల ఎక్కడనో మయిలయున్నది నిశ్చయముగా తెలిసికొనుము. వెంటనే శోధించి స్థలమును కనిపెట్టుము. నివారింపుము. ఈగ లన్నియు నశించిన యెడల అప్పుడు మీయింట సూక్ష్మజీవులు తగ్గి యున్నవని నమ్మవచ్చును.

ఇరుగుపొరుగులు

మీ యిల్లు శుభ్రముగనుంచుకొనినంత మాత్రమున సూక్ష్మజీవులవలని భయములేదనిన ప్రయోజనము లేదు. సూక్ష్మజీవులు మిక్కిలి అల్పమైనవి. గాలిలో నెగిరి పోగలవు. ప్రక్కవాని ఇల్లుగాని, ప్రక్కనుండు వీధిగాని మలినముగ నున్నయెడల మీ ఇల్లు శుభ్రముగనుండినను ఏమి ప్రయోజనము ? గాలివచ్చి యంతయు నేకము చేయును. కాబట్టి యిరుగు పొరుగు వారలకుగూడ నీకు తెలిసి నంతవరకు బోధించి వారి వారి ఆవరణములను, వీధులనుకూడ శుభ్రముగ నుంచుటకు సహాయపడుము.

తొమ్మిది సూత్రములు

అమెరికా దేశములో సర్కారుచే నియోగింపబడిన కొన్నిసామాన్య సూత్రములను చూచినయెడల ఈగలను రూపుమాపుటయందు వారికిగల శ్రద్ధ తెలియగలదు.

  1. రోగివద్దకు ఈగను రానియ్యవద్దు.
  2. ఈగ రోగి గదిలోనికి వచ్చినయెడల దానినివిడువక పట్టి చంపివేయుము. దానిని సులభముగ పట్టుటకు జిగురుకాగితములమ్మును.
  3. క్రుళ్లుచుండు పదార్థమును ఇంటిలోపలను, చుట్టు ప్రక్కలను చేరనీయకుము అనుమానముగల చోటులందెల్ల పొడిసున్నమునుగాని కిరసనాయిలునిగాని చల్లుము.
  4. ఆహార పదార్థములమీద యీగవ్రాలకుండ మూసి పెట్టుము. భోజనముకాగానే యెంగిలాకులను, కంచములను తెరచియుంచకుము. వెంటనే శుభ్రముచేయుము.
  1. పనికిరాని పదార్థముల నెప్పటికప్పుడు కాల్చివేయుము. లేదా పూడ్చి వేయుము.
  2. పశువుల పెంట నెప్పటికప్పుడు గోతులలో పూడ్చి పెట్టుము. లేదా గోతులకు తలుపులమర్చి మూసియుంచుము. లేదా కిరసనాయిల్ చల్లుచుండుము.
  3. బజారులలో అమ్మెడు ఆహారపదార్థముల నన్నిటిని కప్పియుంచుము. లేదా అద్దముల బీరువాలలో పెట్టి యుంచుము.
  4. ఈగను చూడగనే దాని పురిటిల్లు ఎక్కడనో దగ్గరనే పెంటలోనున్నదని జ్ఞాపకముంచుకొనుము. ప్రక్కనే తలుపుచాటునగాని, పెట్టెక్రిందగాని, గోడమీదగాని యీ పెంటయుండును.
  5. కల్మషములేనిచోట ఈగ యుండదని గట్టిగ నమ్ముము.