అంటువ్యాధులు/నాల్గవ ప్రకరణము

నాల్గవ ప్రకరణము

సూక్ష్మజీవు లెట్లు ప్రవేశించును? ఎట్లు విడుచును?

పైని వివరించిన అంటువ్యాధులలో కొన్ని ఒకరి నొకరు తాకుటచేతగాని, వ్యాధిగ్రస్తులుండుచోట్ల సహవాసముగా నివసించుటచేతగాని కలుగవచ్చును. ఇందు కొన్ని వ్యాధులను కలిగించు సూక్ష్మజీవులుగల ద్రవమును రోగి నుండి ఎత్తి గాయముగుండనైనను మరి యేవిధముచేతనయినను మరియొకరి శరీరములోని కెక్కించినయెడల రెండవ వారి కావ్యాధి పరిణమించును. మరికొన్ని అంటువ్యాధులు రోగు లుపయోగపరచిన నీళ్లు మొదలగు పదార్థముల మూలమున ఒకరినుండి మరియొకరిని జేరును. రోగులు విసర్జించు ఆహారపదార్థములు మలమూత్రాదులు బట్టలును, రోగులు తాకిన చెంబులు మొదలగు పదార్థములును, రోగుల వద్దనుండి సూక్ష్మజీవులను వాని గ్రుడ్లను ఇతరస్థలములకు జేర వేయుటకు సహాయపడును. ఇవిగాక కండ్లకలక మొదలగు మరికొన్ని అంటువ్యాధులు దోమలు ఈగలు నుసమలు మొదలగు జంతువుల మూలమున మనశరీరములో ప్రవేశించును. మరికొన్ని అంటువ్యాధులు రోగులుగలచోట్ల నివసించి నంతమాత్రముననే అంటుకొనును. మన శరీరములోని రక్త ములోనికిగాని, ఇతర ద్రవములలోనికిగాని సూక్ష్మజీవులు దిగువ నాలుగువిధముల ప్రవేశమగునని చెప్పవచ్చును.

  1. గాయముగుండ ప్రవేశించుట (Inoculation)
  2. పలుచని పొరలగుండ ఊరుట (Absorbtion)
  3. ఊపిరితో పీల్చుట (Inhalation)
  4. మ్రింగుట (Ingestion)

కొన్నివ్యాధు లిందొకమార్గముననే ప్రవేశించును. మరి కొన్ని వ్యాధులు పైనిచెప్పిన మార్గములలో రెండు మూడు మార్గముల ప్రవేశింపవచ్చును.

గాయముగుండ ప్రవేశించుట

కుక్క కాటువలన కలుగు వెర్రి, సుఖవ్యాధు లనబడు పచ్చసెగ, అడ్డగర్రల సంబంధమైన పుండు, కొరుకు లేక సవాయి, మేహము ఇవి యన్నియు శరీరముమీద నేర్పడు నేదోయొక గాయము మూలముననే తరుచుగ అంటుకొనును. చలిజ్వరపుపురుగులు దోమకాటువలన కలిగెడు గాయముగుండ నెత్తురులో ప్రవేశించును. దొమ్మ మొదలగు కొన్ని పశురోగములును, క్షయము మొదలగు వ్యాధులుకూడ అరుదుగ గాయముల మార్గమున మన శరీరములో ప్రవేశము గనుట కలదు. ధనుర్వాయువు అనగా దవడలు దగ్గరగా కరుచుకొని పోయి అతిశీఘ్రకాలములో చంపునొకవ్యాధియు నొక జాతి సూక్ష్మజీవులు గాయములోనికి మన్నుతోకూడ జేరుటచే గలుగుచున్నది. కురుపులలో చీము పుట్టించు సూక్ష్మజీవులు తరుచుగా గాయముల మూలముననే మన శరీరములో ప్రవేశించును.

౨. పలుచని పొరలగుండ ఊరుట

పైనిచెప్పిన పచ్చసెగ మొదలగు సుఖవ్యాధులు ఒకా నొకప్పుడు రోగుల అంగములమీద గాయములు లేకపోయినను ఆ యంగముల పైనుండు మృదువైన పలుచని పొరగుండ శరీరములోనికి సూక్ష్మజీవులు ఊరుటవలన కలుగవచ్చును. చీము పుట్టించు సూక్ష్మజీవులు గర్భకుహరములోనికి ప్రవేశించి నెత్తురులోనికి చేరుటచేతనే ప్రసవమైన స్త్రీలకు సూతిక జ్వరము గలుగుచున్నది. ఇదే ప్రకారము కన్నుల నావరించి యుండు పలుచని సూక్ష్మజీవులు ప్రవేశించి యవి కంటి నాశ్రయించి యుండుటచే కండ్లకలక కలుగుచున్నది. ముక్కులోని పొరను సూక్ష్మజీవులంటినపుడు పడిశమును, గొంతుకలోని గాని ఊపిరితిత్తులలోనిగాని పొరలను సూక్ష్మజీవు లంటినపుడు దగ్గును కఫమును కలుగుచున్నవి.

౩. ఊపిరితో పీల్చుట

ఆటలమ్మ, మశూచకము, వేపపువ్వు లేక చిన్నమ్మ, గవదలు, కోరింత దగ్గు, ఈ వ్యాధులు గాలితో పాటు ఆయా జాతుల సూక్ష్మజీవులను పీల్చుట చేతనే కలుగుచున్నవనుటకు సందేహము లేదు. ఊపిరితిత్తుల వాపును కఫమును

4

పుట్టించు న్యూమోనియా (Pneumonia) జ్వరము కూడ ఇట్లే ప్రవేశించుచున్నది.

దగ్గు పడిశము, కండలలోనూ కీళ్ళలోను నొప్పులు మొదలగువానితో కూడివచ్చు ఇంప్లూయంజా, డింగూ యను జ్వరములును ఆయా జాతి సూక్ష్మజీవులను మనము ఆఘ్రాణించుటచేతనే కలుగుచున్నవి. కలరా, సన్నిపాతజ్వరము, ఇవి యెన్నడో కాని, గాలిమూలమున వచ్చినట్లు కాన రాదు. ఇంతవరకు చలిజ్వరముకూడ మన్యపు గాలిని పీల్చుట వలన వచ్చునని తలచిరిగాని ఈవ్యాధిదోమకాటు మూలమున వ్యాపకమగుచున్నదని ఇప్పుడందరి వైద్యులకు నమ్మకము.

౪. మ్రింగుట

కలరా, సన్ని పాతజ్వరము, (౨౮ దినముల జ్వరము) రక్తగ్రహిణి, ఇవి మనముతిను ఆహారమునందును నీరునందును గల సూక్ష్మజీవులచే కలుగుచున్నవని చెప్పవచ్చును. అతిసార విరేచనములలోగూడ కొన్ని జాతులు ఆహారములోని సూక్ష్మజీవుల కారణముననే కలుగుచున్నవి. రోగులను తాకిన చేతులలో అన్నము తినుటచేతగాని, రోగుల మలమూత్రములతో కల్మషమైన చెరువులలోని నీటిని త్రాగుటచేత గాని ఈ వ్యాధులు వ్యాపించుచున్నవి. క్షయవ్యాధిగల ఆవులపాల గుండ చిన్నబిడ్డల కా క్షయవ్యాధి అంటుచుండును. దీనివలన క్షయసంబంధమైన అతిసారవిరేచనములు మొదలగునవి కలుగును. సూక్ష్మజీవులు చక్కగ పెరుగుటకు పాలకంటెవానికి తగిన ఆహారములేదు. పాలలోపడిన సూక్ష్మజీవులు మిక్కిలి త్వరితముగను యథేచ్ఛముగను వృద్ధిపొందును. సన్నిపాత జ్వరము, కలరా వ్యాధులుకూడ పాల మూలమున తరుచుగ వృద్ధిజెందును. క్షయవ్యాధి మొదలగు మరికొన్ని వ్యాధులు చక్కగ నుడకని జబ్బుమాంసము మూలమునకూడ వ్యాపింపవచ్చును.

జంతువులు

ఈగలు అంటువ్యాధులను వ్యాపించుటలో నెంత సహకారులగునో అందరకు తెలియదు. అవి చేయు అపకారమున కింతింతని మితిలేదు. దోమలమూలమున చలిజ్వరము ఎంత విచ్చలవిడిగ మనదేశములో వ్యాపించుచున్నదో మీకందరకు విదితమే. మన దుస్తులతో నొకయింటినుండి మరియొక యింటికి మనమెట్లు అంటువ్యాధులను జేరవేయుదుమో అంత కంటే అనేకరెట్లు కుక్కలును, పిల్లులును అంటువ్యాధులను ఇంటింటికి వాని శరీరములమీద జేరవేయును.

సూక్ష్మజీవులెట్లు మనలను విడచును?

అంటువ్యాధులను కలుగజేయు సూక్ష్మజీవులు మన శరీరమునుండి బయటకు ఎట్లు పోవునోకూడ నిప్పుడు సంగ్రహముగ తెలిసికొనుట యుక్తము.

౧. నోరు, కండ్లు, ముక్కు, ఊపిరితిత్తులు వీనిలోనుండి బయిటబడు ఉమ్మి, పుసి, చీమిడి, కఫము వీనిమూలమునను,
౨. విరేచనముల మూలమునను,
౩. మూత్రము మూలమునను,
౪. పుండ్లు, కురుపులు, మొదలగువానినుండి బయలు వెడలు రసి, చీము మూలమునను, వానినుండి ఎండి పడిపోవు పక్కులమూలమునను,

సూక్ష్మజీవులు మనశరీరములను విడిచి బయలువెడలును. ముఖ్యముగా ఆటలమ్మను కలిగించు సూక్ష్మజీవులు కొంచెము జలుబుతగ్గినతరువాత వెడలు కఫముగుండ బయలు వెడలి గాలిలోపోయి ఇతరులకు అంటుకొనునని జ్ఞాపక ముంచుకొనదగినది.

అంటువ్యాధులచే బాధింపబడు రోగులువిడుచు ఊపిరి గుండకూడ సూక్ష్మజీవులు బయలువెడలి, ఇతరులకు వ్యాధి కలిగించునేమోయను సందేహము కలదు. కాని ఆవిషయము నిశ్చయముగా తెలియదు.