హైందవ స్వరాజ్యము/ఇరువదియవ ప్రకరణము
ఇరువదియవ ప్రకరణము.
ఉపసంహారము.
చదువరి: మీయభిప్రాయములను బట్టిచూడగా మీరు మితవాదులు గాదు. జాతీయవాదులుం గాదు. మీది తృతీయ:పంథగా దోచుచున్నది.
సంపా: అది పొరబాటు. నా మానసమున మూడవపక్షము లేదు. అంద రొకేవిధమున నాలోచింతు మనుట వెఱ్ఱీ. మితవాదు లందరు చూచా తప్పక ఏకాభిప్రాయు లని చెప్పరాదు. అంతియ గాదు. సేవమాత్ర మాదర్శముగా కలవారికి కక్ష యేడిది ? మితవాదులు జాతీయవాదులు ఇరువురకుం గూడ నే సేవ యొనర్చువాడ. ఎచ్చట భేదాభిప్రాయము కల్గును అచ్చట దానిని వారికి నివేదించి నామార్గమున నేను సేవ చేయుచు పోదును.
చదువరి: అయిన ఈ రెండుకక్షలవారికి మీ రేమి యుపదేశింతురు.
సంపా: జాతీయవాదులకు నేను చెప్పున దిది. " మీరు భారతభూమికి స్వరాజ్యము కోరుట నే నెరుగుదును. అడిగి నంతమాత్రన మన కది రాదు. ప్రతివాడును దానిని సంపాదించవలసి యుండును. ఇతరులు నాకు సంపాదించిపెట్టునది స్వరాజ్యము కాదు. పర పరిపాలనము. కాబట్టి ఇంగ్లీషువారిని వెడలగొట్టినమాత్రాన మీరు స్వరాజ్యము సంపాదించినట్లెన్న రాదు. స్వరాజ్యముయొక్క నిశ్చయస్వరూప మిదివరలో మీకు వర్ణించితిని. దీనిని పశుబలముచేత ఎప్పుడును సంపాదింప వీలు లేదు. పశుబలము భారతభూమికి స్వభావ సిద్ధసాధనము కాదు. కాబట్టి ఆత్మశక్తిమీదనే మీర లాధారపడనలసి యుందురు. మనయుద్దేశము నెరవేర్చుటకు ఏ సందర్భమునను బలాత్కార మవసర మని మీ రెంచరాదు.
మితవాదుల కేనుబోధించున దిది. "వట్టియర్జీలు పంపు చుండుట మానహీనత. దానివలన మనము లోకువ యని మనమె యంగీకరించినవా రగుదుము. బ్రిటిషుపరిపాలన వీడ రా దనుట ఇంచుమించు దేవుడు లే దనుటయే. దైవ మొక్కడుదప్ప మరి యేమానవుడును ఏవస్తువును వీడరానిది కాదు. అంతేకాక, ఇంగ్లీషువారు భారతభూమిలో నే డుండి యే తీరవలె ననుట వారిని గర్విష్ఠుల జేయుటయె.
ఇంగ్లీషువారు మూటలు ముల్లెలు కట్టుకొని వెళ్లి పోదు రేని భారతభూమి విధవకాబోదు. వారుండగా శాంతము వహింపవలసినవారు వారు పోయినపిదప దేశసంరక్షణకు పోరాడవచ్చును. ఆకస్మికోద్భవమును నడంపరాదు. దానిని పరిణామ మందనిచ్చుటయె కార్యము. కాబట్టి మనము శాంతముగా జీవించుటకుముందు మనలోమనము కలహింపవలసి యుందుమేని అది సాగుటయే మేలు. బలహీనుల సంరక్షించుటకు మూడవవా రనవసరము. ఈ సంరక్షణయే మనలను పిరికివారి నొనర్చినది. ఇట్టి సంరక్షణ బలహీనులను నింకను నెక్కువ బలహీనుల గావించునుగాని వేరు కాదు. ఇది మనము గుర్తెరింగినం గాని మనకు స్వరాజ్యము లభింపదు. ఇంగ్లీషు మతాచార్యు డొకరు చెప్పినమాటలు వినుడు. స్వరాజ్యములోని అరాచకత్వము పరరాజ్యములోని సక్రమశాంతి జీవనమునకంటె లెస్స. ఆ మతాచార్యుడు స్వరాజ్యమునకు నే నిచ్చిన హైందవ స్వరాజ్యార్థము నియ్యలేదు. మనకు ఇంగ్లీషుపరిపాలన కానిండు, హైందవపరిపాలన కానిండు నిరంకుశత్వము అక్కర లేదు. ఇది మనము నేరువవలెను. ఇతరులకు నేర్పవలెను.
ఈ యభిప్రాయ మంగీకృత మైనయెడల మితవాదులు జాతీయవాదులు ఏకము కావచ్చును. ఒకరికొకరు భయమందుటకు గాని ఒకరినొకరు అనుమానించుటకు గాని యెడ ముండదు.
చదువరి: అయిన మీ రింగ్లీషువారి కేమి తెల్పుదురు.
సంపా: గౌరవభావముతో వారి కీమాట లందచేయుదును. "మీరు మాపరిపాలకు లనుట నే నంగీకరించెద. మీరు ఖడ్గబలముచే భారతభూమి నేలుచున్నా రా, నాయంగీ కారముచే నేలుచున్నా రా యనుప్రశ్నను విమర్శించుట యవసరము కాదు. మీరు మాదేశములో నుండుటకు నా కభ్యంతరము లేదు. పరిపాలకులు మీ రైనను ప్రజల సేవకులుగా మీ రిట నుండవలసి యుందురు. మీరు కోరునట్లుగా చేయవలసినవారము మేము గాము. మేము కోరినట్లుగా చేయవలసిన వారు మీరు. మీరు ఇటనుండి ఇదివరలో తీసికొనిపోయిన ద్రవ్యము నుంచుకొనుడి గాని ఇకముందు తీసికొనిపోకుడు. మా కిష్టమేని భారతభూమిసంరక్షణ మీ రుంచుకొనుడు. మానుండి వ్యాపారలాభము గడించు నభిప్రాయము మాత్రము మీరు మానవలసినది. మీరు ప్రోత్సహించు నాగరకము నిజముగా నాగరకవ్యతిరేక మని మావిశ్వాసము. మీ నాగరకమునకంటె మా నాగరకము వేయిరెట్లు మిన్న యని మా నమ్మకము. మీ రీ నిజ మెరుంగుదు రేని మీ కే లాభము. మో రెరుంగ రేని ఈ లోకోక్తులలో నొక్కదాని ననుసరించి మాభూమిలో మే మెట్లు నివసింతుమో అదేరీతిని మీరును నినసింపవలసి యుందురు. మామతములకు వ్యతి రేకముగా మీ రేమియుం జేయరాదు. పరిపాలకు లైనందున హిందువులయెడ మీధర్మము నెరవేర్చుటకుగా మీరలు ఎద్దు మాంసము మానవలెను. మహమ్మదీయులయెడ అదేధర్మమును నూనుటకు సూకరమాంసమును వీడవలెను. భీతచిత్తులమై యుండినందున మే మింతకాల మీమాట యెత్తలేదు. కాని మీ నడవడిచే మామానసమునకు వైక్లబ్యము కలుగ లే దని మాత్ర మనుకొనబోకుడు. స్వార్థముమై కాని భయముమై కాని మా యభిప్రాయముల వెలిబెట్టు చుండలేదు. ఇప్పుడు నిర్భయముగా తెలియపరచుట మా ధర్మము కావున తెలుపుచున్నాము. మా ప్రాచీనవిద్యాలయములు న్యాయ స్థానములు పునర్జీవితములు కావలెను. భారతభూమికి సామాన్యభాష హిందీ కాని ఇంగ్లీషు కాదు. మీర లందువలన దానిని నేర్చుకొనవలెను. మీతో మేము మా జాతీయభాషలోనే ఉత్తర ప్రత్యుత్తరములు జరుపగలము.
రైళ్లకు, సైన్యాలకు మీరు కర్చు పెట్టుచుండుట మా కసమ్మతము. రెంటికి అవసరము మాకు కానరాదు. రుష్యా వలన మీకు భయ ముండవచ్చును. మాకు లేదు. ఆజాతి పైబడివచ్చిన మేము చూచికొందుము. మీరు మాతో నప్పటికి నుందు రేని ఇరువురమును కలసి చూచుకొందము. యూరోపియను వస్త్రములు మా కక్కరలేదు. మా దేశమున సిద్ధ మయినవస్తువులతో, ఉత్పత్తులతో, సంతుష్టి నందుదుము. మీ రొకకన్ను మాంచెస్టరుమీద ఒక్క కన్ను భారతభూమిమీద పెట్టి యుంచకుడు. మన లాభాలాభము లేకము చేసికొనిననే మన మేకముగా నుండి పనిచేయవచ్చును.
దీనిని మేము మీకు చెప్పుట దంభపరత్వమున గాదు. మీకు గొప్ప సైనికబలము కలదు. మీ నావికబల మసా మాన్యము. మీతో సరిసమానముగా మీ మార్గమున పోట్లాడ నెంచుదుమేని మీకు నిలువజాలము. పై మేము తెలిపినకోరికలు మీకు సరిపడవేని మేము పాలితులుగా నుండము. మీ కిష్టమేని మమ్మును తునుకలక్రింద తరిగివేయుదురు గాక. ఫిరంగుల యెదుటనిడి తుత్తునియలుగా భేదింతురు గాక. మా సంకల్పమునకు వ్యతిరేకముగా మీరు ప్రవర్తించు నెడల మీకు మేము సహాయముచేయము. మా సహాయము లేక మీ రొకయడుగైనను పెట్టలే రనుటయు మే మెరుంగుదుము. గుదుము.
మీకు అధికారము కలదు. దానిమత్తుచే మీరు మమ్ము నవ్వుదురుకాబోలు. వెంటనే మీ మోహమును మేము పాపలేము. కాని మాయందు పౌరుషము కొరవడదేని అచిరకాలముననే మీ రెంతటి ఆత్మవినాశకమార్గము నవలంబించినచియు బుద్ధిపటిమలోపమున మము నవ్వినదియు మీకె యెరుకపడగలదు. మీరు ఆధ్యాత్మికజాతికి చెందినవా రని మా హృదయపూర్వకవిశ్వాసము. మా వసించుభూమి ఆధ్యాత్మిక సత్యములకు పుట్టిన యిల్లు. మన మెట్లు ఒక్కరికొక్కరు తటస్థించినదియు విమర్శింప నక్కర లేదు. కాని మన పరస్పర సంబంధములు పరస్పరలాభమునకు వినియోగించు కొనుట మాత్రము సాధ్యము. భారతభూమికి పయనమై వచ్చియుండు ఆంగ్లేయులు మీరు సరియైన ఆంగ్లజాతిప్రతినిధులు కారు. సగ మాంగ్లమై పోయిన మేమును సరియైన భారతజాతిప్రతినిధులము గాము. మీరు చేసినదంతయు ఇంగ్లీషుజాతికి తెలియునేని ఆజాతి అనేకవిషయములలో మీతో నేకీభవింపక పోవును. భారత జాతిలో నెక్కువభాగము మీతో నెక్కువసంబంధము పెట్టుకొనలేదు. మీ నాగరకమును కొంచ మావలపెట్టి మీ వేద గ్రంథములనే వెదుకుదు రేని మేము కోరునదంతయు న్యాయ మనుట మీ కందులోనే కానవచ్చును. మేము కోరేకోరిక లన్ని నెరవేరిననే మీ రిట నుండనగును. మీ రట్లుందురేని మీవద్ద మే మెన్ని యో విషయములు నేర్చుకొందుము. మీరును అట్లే మావద్ద నేర్చుకొనగలరు. అట్లు చేసినయెడల మనము పరస్పరము లాభ మందుదుము. లోకకల్యాణమునకును తోడ్పడుదుము. ఇదియంతయు మనసంబంధము అధ్యాత్మికబంధముచే కట్టబడినప్పుడే సాధ్యము.
చదువరి: మీరు జాతి కేమి చెప్పుదురు ?
సంపా: జాతియెవరు?
చదువరి: మన కార్యముల కేజాతి నింతసేపు ఆలోచించు చుంటిమో ఆజాతి, యూరోపియను నాగరకము నెవ్వరి నంటినదో, అట్టి మనము, స్వరాజ్య మెవ్వరము కోరుచున్నామో ఆమనము. సంపా: వీరికి నే చెప్పున దిది. నిజమైనప్రేమ స్వరూపము నెరింగినవాడు నిర్భీతుడై ఇంగ్లీషువారితో ముఖాముఖిని పైరీతిని వచింపగలడు. ఎవ్వరు భారతనాగరకమే ఉత్తమ మనియు యూరోపియను నాగరకము మూడునాళ్ల ముచ్చట యనియు మనఃపూర్వకముగా నమ్ముదురో వారే యీపనికి వలంతులు, ఇట్టి మూడునాళ్ల ముచ్చట నాగరకము లెన్ని యో కలిగినవి, గతించినవి, కలుగగలవు, గతింపగలవు. ఎవ్వరు ఆత్మబలమును తమంతట తా మెరింగి పశుబలమునెదుట జంకరో పశుబలము నెప్పుడును నుపయోగింపదలంపరో వార లే ఇందుకు సమర్థులు. ఇప్పటి విషమస్థితిని శల్యగతంబుగ ననుభవించి దీనిపై సంపూర్ణాసంతుష్టి ఎవ్వరు పొందినారో వారలే ఇందుకు సాధకులు.
అట్టివాడు ఒక్కడు భారతపుత్రు డున్నను అతడు పైరీతిని ఇంగ్లీషువారితో ప్రసంగించగలడు. వా రాతనిమాటలు విని తీరవలసి యుందురు.
ఈ కోరికలు మనము ప్రకటించుకోరిక లనుకొనరాదు. ఇవి మనమనస్థితిని ప్రకటించునట్టివియె. అడుగుటమాత్రాన మన కేదియు నమరదు. మనము సంపాదించవలసి యుందుము. అందుకు తగినశక్తి కావలెను. అది యెవ్వరికి కలదందురా ?- ఏవాడు (1) ఎప్పుడో తప్ప ఇంగ్లీషుభాషను ఉపయోగింపడో
(2) వకీలై యున్నచో తనవృత్తిని వదలి చేతిమగ్గమున కూర్చొనునో
(3) వకీలై యున్న , తనజ్ఞానమును కాలమును దేశప్రజకు ఆంగ్లేయులకు సంగతిసందర్భములను బోధించుటకు వ్యయ పరచునో
(4) వకీలైయున్న , కక్షిదారులకలహములతో జోక్యము పెట్టుకొనక కోర్టులను త్యజించి తనయనుభవ ములను చెప్పుట చేత ఇతరుల నదేమార్గమునకు త్రిప్పునో
(5) వకీలైయున్న, వకీలువృత్తి వదలునట్లే జడ్జిపదవిని కూడ త్యజించునో
(6) వైద్యుడైయున్న , వైద్యమును మాని దేహములకు చికిత్సలు చేయుటకన్న ఆత్మలకు చికిత్స చేయుట మే లని పని బూనునో
(7) వైద్యుడైయున్న, యూరోపియను వైద్యముపేరిట చేయబడు జంతుహింసమూలకమున రోగములు కుదుర్చుట కన్న శరీరములు రోగపీడితము లైనను తప్పు కా దని యెరుంగునో
(8) వైద్యుడైయున్నను, చేతిమగ్గమున పనికి దిగి రోగులు తనదగ్గరకు నచ్చినప్పుడు వారి రోగ కారణములను చెప్పి వారిని వృథామూలికలచే వేధించుటకన్న రోగకారణము పో ద్రోల ప్రయత్నించునో, మూలికలుతినక రోగి చచ్చినను లోక మంతము కాదు. రోగికిని నష్టములేదు. అని ఎరుంగునో
(9) ద్రవ్యవంతుడై యున్నను, ఆద్రవ్య ముండునా పోవునా యని మీనం మేషము లెక్కలువేసి భీతిచెందక మోమోటముదక్కి తనమానసమున నున్న దానిని పల్కునో,
(10) ద్రవ్యవంతుడైయున్నను, ద్రవ్యమును చేతిమగ్గములు పెట్టుటకు వినియోగించి తాను చేతి నేతవస్త్రములు ధరించుటచే ఇతరుల నామార్గమున ప్రోత్సహించునో
(11) ఇతర భారతపుత్రులవలె, ఈతరుణము, తనకును వ్రతములకు ఉపవాసములకు ప్రాయశ్చిత్తములకు కాల మనుటను నెరుంగునో
(12) ఇతర భారతపుత్రులవలెనే, ఇంగ్లీషువారిని దూరుట వ్యర్థ మనియు మనముకోరగా వారు వచ్చి రనియు మన ముంచుకొనుటవలన వా రున్నా రనియు మనము సంస్కారము కనబరచినప్పుడే వారు పోవుటయో తమ్మును సంస్కరించుకొనుటయో చేయుదు రనియు నెరుంగునో
(13) ఇతరులవలెనే, దుఃఖసమయమున సుఖానుభోగము లననుకరణీయము లనియు పతితులమై యుండు యుగమున కారాగారమున నుండుట ప్రవాసమున నుండుట ప్రశస్తము లనియు నెరుంగునో (14) ఇతరులవలెనే, ప్రజలమేలు నాలోచించుటకు మనము కారాగారప్రాప్తినుండి తప్పించుకొనవలె ననుట అంధాభిప్రాయ మని యెరుంగునో
(15) ఇతరులవలెనే, మాటకంటె పాటు మే లనియు, మనము నమ్మునది నేరుగా చెప్పి ఫల మనుభవించుట యుత్తమ మనియు, మనమాటల కప్పుడుగాని అర్ధ ముండదనియు నెరుంగునో
(16) ఇతరులవలెనే, మనము కష్టపడిననే స్వతంత్రుల మగుదు మనునది విశ్వసించునో
(17) ఇతరులవలెనే, పాశ్చాత్యనాగరకమును ప్రోత్సహించినందులకు అండమానుదీవులలో ఆజన్మప్రవాస మున్నను తగినప్రాయశ్చిత్తము కా దని తెలిసికొనునో
(18) ఇతరులవలెనే, ఏదేశజాతియు కష్టపడక అభివృద్ధి కాలే దనియు పశుబలయుద్ధముననే, నిజమైనశౌర్యము, ఇతరుని చంపుటకాక తాకష్టముల భరించుట యైనప్పుడు, సాత్త్వికనిరోధమున స్వార్థత్యాగమే ముఖ్యాంగ మనియు గురుతించునో
(19) ఇతరులవలెనే, ఇంకొకరు చేసిన మనము చేయుదు మనుట వ్యర్థులమాట యనియు, మనము న్యాయ మని నమ్మునది చేసినచో మార్గముం గని. ఇతరులు తప్పక చేయుదు రని యు, కన్పించిన, రుచికరవస్తువు మరియొకరు చవిచూచువరకు నిలుచుట స్వభావము కా దనియు జాతీయోద్యోమ మొనర్చుట తదర్థమై ఇడుమలవడుట రుచికరకార్యజాల మ్మనియు, నిర్బంధముచే కష్టపడుట కష్టము కాదనియు తల పెట్టునో
వానికే ఆశక్తి యలవడును.
చదువరి: ఇది గొప్పజాబితా యైనది. అందరును దీని నే నా డనుకరించుటో?
సంపా: పొరవడకుడు. ఇతరులతో మీకును నాకును సంబంధము లేదు. ప్రతివాడు తనధర్మనిర్వహణ మాలోచింప వలసినది. నాధర్మము నెరవేర్చి ఆరీతిని నాసేవనే చేసికొందునేని ఇతరుల సేవ సులభముగా చేయగలను. మీకు సెల వొసంగుటకుముందు మరల నొక్క పర్యాయము నా చెప్పినది జాపక పరచెద.
(1) నిజమైన స్వరాజ్యము స్వరాజ్యము అనగా స్వనిగ్రహము.
(2) దానికి మార్గము సత్యాగ్రహము అనగా ఆత్మశక్తి, ప్రేమశక్తి.
(3) ఈశక్తిని ప్రచారపెట్టుట కన్నిట స్వదేశి మూలా ధారము. (4) మనము చేయునట్టి పనియంతయు ఇంగ్లీషువారి నభ్యంతర పెట్టుదు మని కాని వారికి ప్రతిచేయవలె ననిగాని చేయరాదు. మనధర్మ మని చేయవలెను. ఇంగ్లీషువారు ఉప్పుపన్ను తీసివేసినా రనుకొందము. మనద్రవ్యము వెనుకకు మరల్చినా రనుకొందము. ఉత్తమోద్యో గములు భారత పుత్త్రుల కిచ్చినా రనుకొందము. ఇంగ్లీషుసైన్యములను తీసి వేసినా రనుకొందము. అప్పటికిని యంత్రనిర్మిత వస్తువులను వినియోగింపబోము. ఇంగ్లీషుభాష నుపయోగింపబోము. ఇంగ్లీషువారి పరిశ్రమలను ప్రోత్సహింపబోము. ఇవి సహజముగనే స్వభావసిద్ధముగనే దుష్టములు. కాబట్టి యివి మన కక్కర లేదు. ఇంగ్లీషువా రనిన నాకు వైరములేదు. వారి నాగరక మనిన నాకు వైరము. నాయభిప్రాయ మడిగితిరా ఇదివరలో మనము స్వరాజ్య మనుపదమున కర్థము తెలియక దాని నుపయోగించినాము. నా కర్థమయినంతవరకు దాని స్వరూపమును విశదపరచుటకు ప్రయత్నించినాను. ఆరూపమున దాని నారాధించుటయె ముందు నాజీవితమున ధర్మ మని నాయంతరాత్మ బోధించుచున్నది.
- __________