హలో...డాక్టర్/దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధి (Chronic Obstructive Pulmonary Disease)
15. దీర ్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధి (Chronic Obstructive Pulmonary Disease) ఇంటికి సెగనుం బెట్టరు
కంటికిఁ బొగబెట్టిరేని కారును జలముల్ పెంటా యూపిరితిత్తులు ? ?
మంటలఁ దెగఁ బాలుసేయ, మానక పొగలన్ ! ! శ్వాసక్రియ :
శరీరకణజాల జీవవ్యాపారములో ప్రాణవాయువు (Oxygen) గ్రహించబడి బొగ్గుపులుసువాయువు ( Carbon dioxide ) విడుదల అవుతుంది. వివిధ అవయవముల కణజాలమునకు రక్తము ద్వారా ప్రాణవాయువు అందించబడుతుంది. ఆయా కణజాలము నుంచి బొగ్గుపులుసువాయువు రక్తములోనికి చేరుతుంది. ఊపిరితిత్తులు ప్రాణవాయువుని రక్తమునకు అందించి రక్తము నుంచి బొగ్గుపొలుసువాయువుని గ్రహించి బయటకు విసర్జిస్తాయి. నిరంతరము ప్రాణవాయువును రక్త ము నకు చేర్చుటకు, బొగ్గుపులుసువాయువును విసర్జించుటకు ఊపిరితిత్తులలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో గాలి ప్రసరణ, ఊపిరితిత్తులకు రక్తప్రసరణ అవసరము. వాతావరణములో ఉన్న గాలి ముక్కు, గొంతుక స్వరపేటికల ద్వారా శ్వాసనాళమునకు (Trachea) చేరుతుంది. శ్వాసనాళము రెండు పుపుసనాళములుగా (Bronchi) చీలి రెండు ఊపిరితిత్తుల వాయుప్రసరణకు సహాయ పడుతుంది. ప్రతి ఊపిరితిత్తిలో పుపుసనాళము ద్వితీయ, తృతీయ, అంతిమ పుపుసనాళములుగా (secondary tertiary and terminal bronchi) శాఖలై పిదప శ్వాసనాళికలు (Respiratory bronchioles), పుపుసగోళనాళికలుగా (Alveolar ducts) చీలి చిట్టచివర పుపుసగోళములను (Alveoli) ధరిస్తాయి. ఈ పుపుసగోళములు, వాటి దరిని
- 169 :: ఉండు రక్తకేశనాళికల (Capillaries) మధ్య వాయువుల మార్పిడి
జరుగుతుంది. పుపుసగోళములలోని గాలినుంచి ప్రాణవాయువు కేశనాళికల లోని రక్తమునకు చేరి, కేశనాళికల రక్తములోని బొగ్గుపులుసువాయువు పుపుసగోళముల లోనికి చేరుతుంది. ఊపిరితిత్తులకు రక్తము పుపుసధమని (Pulmonary Artery) ద్వారా చేరి తిరిగి పువుససిరల (Pulmonary veins) ద్వారా హృదయమునకు చేరుకుంటుంది. దీర ్ఘకాలిక శ్వాసావరోధవ్యాధి : ( Chronic Obstructive Pulmonary Disease ) :
ఊపిరితిత్తులలో దీర్ఘకాలము పదేపదే తాపప్రక్రియ (irritation and inflammation) జరుగుటచే కలిగే విధ్వంసము వలన వాయుప్రసరణకు (ముఖ్యముగా నిశ్వాసమునకు) అవరోధము కలిగి దీర్ఘకాలిక శ్వాస అవరోధ వ్యాధి (Chronic Obstructive Pulmonary Disease - COPD) కలుగుతుంది. దీని వలన దగ్గు, కఫము, ఆయాసము కలుగుతాయి.
ఈ వ్యాధిలో ఊపిరితిత్తుల ఉబ్బుదల (Emphysema), దీర్ఘకాలిక పుపుస, శ్వాసనాళికల తాపము (Chronic Bronchitis), రెండు ప్రక్రియలను గమనిస్తాము. తాపప్రక్రియ వలన పుపుసగోళముల విధ్వంసము, సాగుకణజాలపు విధ్వంసము జరిగి శ్వాసవృక్షపు చివరలో గాలి ఎక్కువై ఉబ్బుదల కనిపిస్తుంది. కఫముతో కూడిన దగ్గు సంవత్సరములో మూడు నెలలు చాలా దినములు, వరుసగా రెండు సంవత్సరాలు ఉంటే దానిని దీర్ఘకాలిక పుపుసనాళికల తాపముగా (Chronic Bronchitis) నిర్ణయించవచ్చును. ఈ వ్యాధి క్రమ క్రమముగా తీవ్రము అవుతుంది. ఊపిరితిత్తులలో పుపుసగోళముల, పుపుసనాళికల, శ్వాసనాళికల విధ్వంసము, నష్టము శాశ్వతము అగుట వలన ఊపిరితిత్తుల వ్యాపారము సామాన్య స్థితికి తిరిగి రాదు. ఉబ్బసకు దీనికి అదే తేడా. వ్యాధికి కారణములు :
పుపుసనాళికలలో పరంపరలుగా తాప ప్రక్రియ జరుగుటకు ప్రధాన కారణము ధూమపానము. ధూమపానము సలిపే వారిలో 20 నుంచి 50
- 170 :: శాతపు మందిలో దీర్ఘకాలిక శ్వాస అవరోధవ్యాధి జీవితకాలములో
పొడచూపుతుంది. వయస్సు పెరిగిన కొలది వ్యాధిలక్షణములు హెచ్చవుతాయి. హానికరమైన యితర గాలులు, గాలి ప్రసరణ సరిగా లేని ఇళ్ళలో వంటపొయ్యిల నుంచి వచ్చే పొగవలన, బొగ్గుగనులు, బంగారు గనులలో ధూళి, పొగలు, రసాయనములు, హానికర యితర వాయువులు పీల్చుటవలన వాటిలో పనిచేసే కార్మికులకు ఈ వ్యాధి కలుగవచ్చును. పట్టణాలలో వాతావరణ కాలుష్యము ఈ వ్యాధికి దోహదకారి అవుతుంది.
జన్యు పరముగా వచ్చే ఆల్ఫా- 1 ఏంటిట్రిప్సిన్ లోపము (alpha-1 Antitripsin deficiency) వలన దీర్ఘకాలిక శ్వాస అవరోధక వ్యాధి పిన్నవయస్సులో రావచ్చును. ఈ వ్యాధి ఉన్నవారిలో ఆల్ఫా -1 ఏంటిట్రిప్సిన్ లోపము ఉన్నవారు 2 శాతము వఱకు ఉండవచ్చును. ఇతర కుటుంబ సభ్యులకు ఈ వ్యాధి ఉన్నా, 45 సంవత్సరముల వయస్సు లోపల ఈ వ్యాధి కనిపించినా, ఊపిరితిత్తుల క్రింద భాగములలో ఉబ్బుదల ఎక్కువగా ఉన్నా ఆల్ఫా- 1 ఏంటిట్రిప్సిన్ కు తప్పకుండా పరీక్ష చెయ్యాలి. వ్యాధిగతి :
దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధి ఊపిరితిత్తులలో పరంపరలుగా కలిగే తాపము (Inflammation), మాంసకృత్తు విచ్ఛేదనములు (Proteinases) మాంసకృత్తుల అవిచ్ఛేదనముల (Antiproteinases) మధ్య తారతమ్యములు, ఆమ్లజనీకరణము (Oxidation), కణజాలపు సహజమృతుల (Apoptosis) వలన పురోగమిస్తుంది. పుపుసనాళికలు పుపుసగోళములలో తాపము వలన వాపు, అధికముగా శ్లేష్మపు ఉత్పత్తి (mucous production), పుపుసగోళముల విధ్వంసము, తంతీకరణము (fibrosis), సాగుకణజాలపు (elastic tissue) విధ్వంసము జరిగి ఊపిరితిత్తుల ఉబ్బుదల (emphysema) కలుగజేస్తాయి. పుపుస రక్తనాళములపై కూడా ఈ తాప ప్రభావము ఉంటుంది. పై మార్పులు ఊపిరిపైన ఫలితము చూపిస్తాయి. నిశ్వాసము మంద గిస్తుంది. ఊపిరి వదలుట శ్రమతో కూడిన పని అవుతుంది. నిశ్వాస వాయు
- 171 :: ప్రసరణము తగ్గుతుంది. పుపుసగోళములలో గాలి ఎక్కువగా చేరుకొని
ఊపిరితిత్తులు ఉబ్బుతాయి. వాయుప్రసరణ తగ్గుటవలన, తాపము వలన, పుపుసగోళముల విధ్వంసము వలన పుపుసగోళములు రక్తకేశనాళికల మధ్య ప్రాణవాయువు బొగ్గుపులుసువాయువుల మార్పిడి మందగిస్తుంది. పుపుసధమనులలో రక్తపుపోటు కూడా హెచ్చవుతుంది (Pulmonary hypertension). అందువలన వ్యాధి బాగా ముదిరిన వారిలో హృదయపు కుడిజఠరికపై (Right ventricle) పనిభారము అధికమై హదయవైఫల్యమునకు (congestive heart failure) దారితీస్తుంది. వ్యాధి ప్రకోపించి చివరి దశలలో రక్తములో ప్రాణవాయువు పరిమాణము తగ్గి, బొగ్గుపులుసువాయువు పరిమాణము పెరిగి శ్వాసవైఫల్యము (Respiratory failure), రక్త ఆమ్లీకరణలకు (Respiratory acidosis) దారితీస్తుంది. శ్వాస అవరోధవ్యాధి కలవారిలో గుండెజబ్బులు, గుల్ల ఎముకలవ్యాధి (Osteoporosis), కండరముల నీరసము ఎక్కువగా కలుగుతాయి. వ్యాధి లక్షణములు :-
ఊపిరితిత్తుల వ్యాపారము బాగా దెబ్బతినే వఱకు (FEV1 50 శాతమునకు మించి క్షీణించే వఱకు) ఏ లక్షణములు పొడచూపవు. దీర్ఘకాలిక శ్వాస అవరోధవ్యాధి తీవ్రమయిన వారికి తఱచు దగ్గు, కఫము, ఆయాసము, ఊపిరి వదిలేటప్పుడు పిల్లికూతలు కలుగుతాయి. ప్రారంభ దశలో ఆయాసము పనిచేస్తున్నపుడు, శారీరకశ్రమ ఎక్కువయిన సమయములలో కలిగినా వ్యాధి ముదిరాక విశ్రాంత సమయములలో కూడా కలుగుతుంది. సూక్ష్మజీవులు, విషజీవాంశములు (viruses), హానికర వాయువులు వలన ఊపితిత్తులలో తాపము కలిగినపుడు, వ్యాధి లక్షణములు హెచ్చుగా కన్పిస్తాయి. ఆయాసము పెరిగినపుడు ఆందోళన కూడా కలుగుతుంది. కఫమునకు సాధారణ స్థితులలో రంగు ఉండదు. సూక్ష్మజీవుల వలన తాపము కలిగినప్పుడు కఫము చీమురంగులోను, పచ్చరంగులోను ఉంటుంది. రక్తములో బొగ్గుపులుసుగాలి పెరిగితే అతినిద్ర, అపస్మారక స్థితి కలుగవచ్చును. వీరిలో ఊపితిత్తుల ఉబ్బుదల వలన ఛాతి పీపా ఆకారములో ఉంటుంది.
- 172 :: ఛాతి ముందు నుంచి వెనుక ప్రమాణము ఎక్కువవుతుంది. ఆయాసము
ఉన్నవారిలో ఊపిరికొఱకు కంఠకండరముల వంటి అదనపు కండరములు కూడా శ్రమించుట గమనిస్తాము. వినికిడిగొట్టముతో విన్నపుడు ఛాతిలో ఊపిరిశబ్దములు మందకొడిగా ఉంటాయి. నిశ్వాసశబ్దముల నిడివి పెరుగుతుంది. పిల్లికూతలు (Wheezing) వినిపిస్తాయి. ఛాతిపై వేళ్ళుపెట్టి వానిని రెండవచేతి మధ్యవేలుతో కొడితే ప్రతిధ్వని మోత ఎక్కువగా ( hyper resonance) ఉంటుంది. వ్యాధి నిర్ణయము :
దీర్ఘకాలము పొగ త్రాగినవారిలోను, వృత్తిపరముగా హానికర వాయువులను, దుమ్ములను పీల్చే వారిలోను, గనులలో పనిచేసేవారిలోను దగ్గు, కఫము, ఆయాసము కలుగుతే శ్వాస వ్యాపార పరీక్షలు ( Pulmonary function tests), ఛాతికి ఎక్స్ - రేలు చేయుట వలన వ్యాధిని నిర్ణయించ వచ్చును. చాలా సంవత్సరాలు పొగ త్రాగినవారిలోను, తాప జనక వాయువులను పీల్చినవారిలోను వ్యాధి లక్షణములు పొడచూపక మునుపే శ్వాస వ్యాపార పరీక్షలు చేసి వ్యాధిని త్వరగా కనిపెట్టుట మంచిది. శ్వాస వ్యాపార పరీక్షలు ( Pulmonary Function Tests ):
శ్వాస వ్యాపార పరీక్షలు (Pulmonary function tests) శ్వాసకు అవరోధమును కనుగొనుటకు సహాయపడతాయి. శ్వాసమాపకము (Spirometer) అనే పరికరమును శ్వాసవ్యాపార పరీక్షలకై ఉపయోగిస్తారు. సుదీర్ఘ సంపూర్ణ ఉచ్ఛ్వాసము (forced inspiration), తదుపరి సత్వర సుదీర్ఘ నిశ్వాసములను (forced expiration) ఈ పరికరముతో కొలుస్తారు. బలమైన దీర్ఘ ఉచ్ఛ్వాసము తర్వాత బలమైన దీర్ఘ నిశ్వాసముతో వదిలే గాలి ఘనపరిమాణమును సంపూర్ణ శ్వాస ప్రమాణముగా (Forced Vital Capacity, FVC) పరిగణిస్తారు. బల ఉచ్ఛ్వాసముతో గాలి పీల్చిన పిదప బల నిశ్వాసముతో మొదటి సెకండులో వదిలే గాలి పరిమాణము (Forced Expiratory Volume - first second; FEV1),
- 173 :: /సంపూర్ణశ్వాస ప్రమాణము FEV1/FVC) నిష్పత్తిని ఉపయోగించి
అవరోధక పుపుసవ్యాధులను (Obstructive lung diseases), నిర్బంధ పుపుసవ్యాధులను (Restrictive lung diseases) వేఱుపఱచవచ్చును. అవరోధక పుపుసవ్యాధులు ( Obstructive pulmonary diseases) :-
అవరోధక శ్వాసవ్యాధులు (ఉబ్బస, దీర్ఖకాలిక శ్వాసావరోధము, ఊపిరితిత్తుల ఉబ్బుదల) ఉన్నవారిలో సంపూర్ణశ్వాస ప్రమాణము (FVC) కొంత తగ్గినా, బలనిశ్వాస వాయుపరిమాణము -1 (మొదటి సెకండులో బలముగా వదలగలిగే గాలి పరిమాణము FEV1) విశేషముగా (70 శాతముకంటె తక్కువగా) తగ్గుతుంది. శ్వాసనాళిక వ్యాకోచ చికిత్స అనంతరము (Post bronchodilator treatment) దీర్ఘకాలిక శ్వాసావరోధము గలవారిలో శ్వాస వ్యాపార పరీక్షలు కొద్దిగా మాత్రము మెఱుగవుతాయి. ఉబ్బస వ్యాధిగ్రస్ల థు లో శ్వాసనాళ వ్యాకోచ చికిత్సతో శ్వాస వ్యాపారము చాలా మెఱుగవుతుంది. మొదటి సెకండు నిశ్వాస వాయు పరిమాణము (FEV-1) విశేషముగా వృద్ధి చెందుతుంది. నిర్బంధ పుపుస వ్యాధులు ( Restrictive lung diseases ) :-
ఊపిరితిత్తులలో తంతీకరణము (Pulmonary Fibrosis), పుపుసవేష్టన వ్యాధులు (Diseases of Pleura) వలన ఉచ్ఛ్వాసమునకు అడ్డంకి కలిగినవారిలో సంపూర్ణ శ్వాసప్రమాణము (FVC), మొదటి సెకండులో నిశ్వాస ప్రమాణము (FEV1) సమాంతరముగా తగ్గుతాయి. ఈ వ్యాధులు లేనివారలలో శ్వాసవ్యాపార పరీక్షలు సాధారణ పరిమితిలో ఉంటాయి. బలనిశ్వాస వాయు ప్రమాణము-1 (FEV1) వయస్సు, ఎత్తు, బరువు, లింగముల బట్టి ఉండవలసిన విలువను అంచనా వేసి ఆ విలువ కంటె తగ్గుదల బట్టి దీర్ఘకాలిక శ్వాస అవరోధ తీవ్రతను నిర్ణయిస్తారు. వ్యాధి వర్గీకరణము :
FEV -1 అంచనాలో 80 % కంటె ఎక్కువగా ఉంటే మితము
- 174 :: FEV -1. అంచనాలో 50 - 79 % లో ఉంటే తీవ్రము
FEV-1 అంచనాలో 30- 49 % లో ఉంటే తీవ్రతరము
FEV-1 అంచనాలో 30 % కంటె తక్కువయితే తీవ్రతమము అని వ్యాధితీవ్రతను నిర్ణయిస్తారు.
ఊపిరితిత్తులలో కార్బన్ మోనాక్సైడు ప్రసరణ సామర్థ్యత (Diffusing capacity of the Lungs for carbon monoxide DLCO ఈ వ్యాధి ఉన్నవారిలో తగ్గుతుంది. ఈ పరీక్ష రక్తపు ప్రాణవాయువు సంగ్రహణ శక్తిని సూచిస్తుంది.
వ్యాధి తీవ్రముగా ఉన్నవారిలో రక్తములో బైకార్బొనేట్ (bicarbonate) విలువ పెరుగుతుంది. ఊపిరితిత్తులచే తగినంతగా విసర్జింపబడని బొగపు ్గ లుసు వాయువు (carbon dioxide) రక్తములో బైకార్బొనేట్ గా నిలువ అవుతుంది. మూత్రాంగములు (kidneys) యీ బైకార్బొనేట్ ను విసర్జించుటకు కృషి చేసినా ఆ కృషి చాలకపోవచ్చును.
శ్వాస అవరోధ వ్యాధి తీవ్రముగా ఉన్నవారిలో ధమని రక్తవాయువుల (Arterial Blood Gases) పరీక్ష అవసరము. ధమని రక్తములో ప్రాణవాయువు పీడనమును (PaO2), బొగ్గుపులుసువాయువు పీడనము (PaCO2) రక్తపు ph లను కొలిచి శ్వాసవైఫల్యమును (Respiratory failure) పసిగట్టవచ్చును. ఈ వ్యాధి గల వారిలో ఎఱ్ఱ రక్తకణముల సంఖ్య పెరుగవచ్చును. రక్తములో దీర్ఘకాలము ప్రాణవాయువు ప్రమాణము తగ్గుట వలన శరీరము ఎఱ్ఱకణముల ఉత్పత్తిని పెంచుట దీనికి కారణము.
ఛాతి ఎక్స్ రే చిత్రములలో ఊపిరితిత్తుల ఉబ్బుదలచే ఉదరవితానపు వంకలు తగ్గి సమతలముగా ఉండవచ్చును. ఛాతి ముందు - వెనుకల పరిమాణము పెరుగుతుంది. ఊపిరితిత్తులలో గాలి ఎక్కువగుట వలన పారదర్శకత పెరిగి, రక్కనాళముల గుర్తులు (vascular markings) తగ్గుతాయి. గాలి బుడగలు (bullae) కనిపించవచ్చును.
- 175 :: ఊపిరితిత్తుల తాపము (Pneumonitis), పుసవేష్టనములో వాయువు
(Pneumothorax), హృదయవైఫల్యము వలన ఊపిరితిత్తులలో నీరు పట్టుట (Pulmonary edema), కర్కటవ్రణములు (Cancers) వంటి ఇతర వ్యాధులను కనుగొనుటకు ఎక్స్ రేలు ఉపయోగపడుతాయి. ఛాతి గణనయంత్ర చిత్రీకరణములు (Cat scans) ఊపిరితిత్తులలో విపరీతముగా ఉబ్బిన భాగము తొలగించే శస్త్రచికిత్సలకు (Lung Volume Reduction Surgery) ముందు, ఊపిరితిత్తుల మార్పు శస్త్రచికిత్సలకు (Lung Transplantation) ముందు, కర్కటవ్రణములను (Cancers) కనుగొనుటకు వాడుతారు. వ్యాధి చికిత్స :-
దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధిలో ఊపిరితిత్తులలో కణజాల విధ్వంసము, నష్టము కలుగుట వలన వ్యాధికి ఉపశమనము చేకూర్చుట తప్ప వ్యాధిని సంపూర్ణముగా నయము చేయుట కుదరదు.
పొగత్రాగడము మానివేయుట, హానికర వాయువులు, దుమ్ము, ధూళులకు దూరముగా ఉండుట, ఊపిరితిత్తులను విషజీవాంశముల (viruses), సూక్ష్మజీవుల (bacteria) బారి నుంచి కాపాడుట వలన వ్యాధి పురోగమనమును మందగింప చేయవచ్చును. మధ్య మధ్యలో కలిగే వ్యాధి ఉద్రేకతలను అరికట్టవచ్చును. శ్వాసవ్యాధులు కలవారు ప్రతి ఐదు సంవత్సరములకు ఒకసారి ఊపిరితిత్తుల తాపము అరికట్టు టీకాను (Pneumonia vaccine) ప్రతి సంవత్సరము ఫ్లూ రాకుండా ఇన్ఫ్లుయెంజా టీకాను (Influenza vaccine) వేసుకోవాలి. ఔషధములు :శ్వాసనాళికా వ్యాకోచకములు :
ఈ వ్యాధిలో శ్వాసకు అవరోధమును తగ్గించుటకై పుపుస శ్వాస నాళికలలో ఉన్న మృదుకండరముల బిగుతును తగ్గించి ఆ నాళికలను
- 176 :: వ్యాకోచింపజేసే మందులను పీల్పువుల (Inhalers) ద్వారా గాని,
తుంపరులుగా శీకర యంత్రములతో (nebulizers) గాని వాడుకోవాలి. బీటా- 2 ఎడ్రినలిన్ గ్రాహక ఉత్తేజకములు ( Beta-2 adrenergic receptor agonists ) :
వ్యాధి ఉద్రేకించినపుడు తక్షణ ఉపశమనమునకు సత్వరముగ పనిచేసే బీటా 2- ఎడ్రినలిన్ గ్రాహక ఉత్తేజకములను (Short acting Beta2 adrenergic agonists SABA s) పీల్పువుల (Inhaler) ద్వారా వాడాలి. ఎక్కువ వాడకములో ఉండే ఔషధము ఆల్బుటెరాల్ (Albuterol) పీల్పువు. దీనిని రెండు పీల్పులు ప్రతి 4 - 6 గంటలకు లేక శీకరయంత్రము ద్వారా 2.5 మి. గ్రా.లు ప్రతి 6-8 గంటలకు తుంపరులుగా వాడవచ్చును. లీవాల్బుటెరాల్ (Levalbuterol) మరో మందు. దీనిని రెండు పీల్పులు ప్రతి 4-6 గంటలకు లేక శీకర యంత్రము ద్వారా 0.63 - 1.25 మి. గ్రా.లు ప్రతి 6-8 గంటలకు వాడవచ్చు. ఇవి పుపుస,శ్వాసనాళికల మృదుకండరములను సడలించి ఆ నాళికలను వ్యాకోచింపజేస్తాయి. అందు వలన గాలి బాగా ప్రసరిస్తుంది. పిర్ బ్యుటెరాల్ (Pirbuterol) మరో మందు, రెండు పీల్పులు ప్రతి 4-6 గంటలకు వాడుకొనవచ్చును.
ఎసిటై ల్ ఖొలీన్ అవరోధకములు (Anticholenergics - Muscarine Antagonists ) :-
ఇప్రట్రోపియమ్ బ్రోమైడును (Ipratropium bromide) పీల్పువు ద్వారా గాని, శీకరయంత్రము ద్వారా గాని ఆల్బుటరాల్ తోను, లేక లీవాల్బుటరాల్ తోను కలిపి, లేక ఒంటరిగాను అందించవచ్చును. ఇది పుపుస, శ్వాసనాళికల మృదుకండరములను సడలించి ఆ నాళికలను వ్యాకోచింప జేస్తుంది. ఇప్రట్రోపియమ్ మోతాదులు కొద్ది గంటలే పనిచేస్తాయి (Short acting Muscarine Antagonist SAMAs) కాబట్టి దీనిని
- 177 :: దినమునకు 2 పీల్పులు ప్రతి 4-6 గంటలకు లేక 0.5 మి.గ్రా.లు ప్రతి 6-8
గంటలకు శీకరయంత్రము ద్వారా గాని వాడాలి.
సాల్మెటరాల్ (Salmeterol), ఫార్మెటరాల్ (Formoterol), దీర్ఘకాలిక బీటా ఉత్తేజకములను (Long Acting Beta Agonists LABAs) విడిగా గాని, కార్టీకోస్టీరాయిడులతో (Fluticasone or Mometasone) కలిపి గాని పీల్పువులుగా ఉపయోగించవచ్చును. ఒలొడటెరాల్ (Olodaterol) రోజుకు రెండు పీల్పులుగా వాడాలి.
టియోట్రోపియమ్ (Tiotropium) దీర్ఘకాలిక ఎసిటైల్ ఖొలీన్ అవరోధకము (Long acting Muscarine Antagonist LAMA). దీనిని దినమునకు రెండు పీల్పులుగా వాడాలి. దీర్ఘకాలిక బీటా ఉత్తేజకము ఓలొడటెరాల్ తో (Olodaterol) కలిపి పీల్పువుగా కూడా టియోట్రోపియమ్ లభ్యము. యుమిక్లిడినియమ్ (Umeclidinium) దీర్ఘకాలము పనిచేసే ఎసిటైల్ ఖొలీన్ అవరోధకము (Long Acting Muscarine Antagonist LAMA ). దినమునకు ఒక మోతాదుని పీల్పువు ద్వారా వాడుకోవాలి.
కార్టికోస్టీరాయిడ్ పీల్పువులు (Inhaled corticosteroids.) పుపుస, శ్వాసనాళికలలో తాపమును తగ్గించి ఊపిరికి అడ్డంకిని తగ్గిస్తాయి. వ్యాధి తీవ్రతరము అయినపుడు, వ్యాధి ఉద్రేకించినపుడు వీని ప్రయోజనము కలదు. కాని ఇవి వ్యాధి నిరోధకశక్తిని తగ్గించుట వలన ఊపితిత్తులు సూక్ష్మజీవుల బారికి గుఱి అయే అవకాశములు పెరుగుతాయి. ఈ పీల్పువులను వాడిన పిమ్మట నోటిపూతలు కలుగకుండా ఉండుటకు నోటిని నీళ్ళతో పుక్కిలించాలి. థియాఫిలిన్ ( Theophylline ) :
థియాఫిలిన్ కు (Theophylline) పుపుస, శ్వాసనాళికలను వ్యాకోచింపజేసే గుణము కలదు. వ్యాధి లక్షణములు మిగిలిన మందులతో లొంగని వారికి థియోఫిలిన్ ను నెమ్మదిగా విడుదలయే బిళ్ళల రూపములో వాడవచ్చును. ఆందోళన, వణకు, గుండెదడ, కడుపులో వికారము, వాంతులు,
- 178 :: మూర్ఛ దీని వలన కలిగే అవాంఛిత ఫలితములు. థియాఫిలిన్ వాడేవారిలో
మధ్యమధ్యలో రక్తప్రమాణములను పరీక్షించాలి. కార్టి కోష్టీ రాయిడులు ( Corticosteroids ) :-
నోటిద్వారా గాని సిరలద్వారా గాని కార్టికోస్టీరాయిడులను వ్యాధి ఉద్రేకించినపుడు, తీవ్రతరమయినపుడు తాత్కాలికముగాను వీలయినంత తక్కువ మోతాదులలోను వాడుతారు. Alpha - 1 Antitrypsin లోపించినవారిలో దానిని వారమునకు ఒకసారి సిరలద్వారా యిస్తే ప్రయోజనము చేకూరుతుంది. ప్రాణవాయువు (oxygen):-
ధమని రక్తపు ప్రాణవాయువు సంపృక్తత (oxygen saturation) 88 శాతముకంటె తక్కువయిన వారికి ప్రాణవాయువును ముక్కు గొట్టముద్వారా అందించాలి.
రక్తములో బొగ్గుపులుసువాయువు ప్రమాణము పెరిగిన వారికి, శ్వాసవైఫల్యము ప్రారంభదశలో ఉన్నవారికి నిరంతర పీడనముతో గాని (Continual Positive airway pressure CPAP), ఉచ్ఛ్వాస నిశ్వాసములలో పీడనము మార్చి గాని (Bilevel positive airway pressure BiPAP) ప్రాణవాయువును ముక్కుపై కప్పుతో (mask) నిద్రలో ఉన్నపుడు, అవసరమయితే పగలు కొన్ని గంటలు అందిస్తారు. ఊపిరితిత్తు ల పరిమాణము తగ్గ ించే శస్త్రచికిత్స:(Lung Volume Reduction Surgery)
వాయువుల మార్పిడికి దోహదపడకుండా, పనిచేసే ఊపిరితిత్తుల భాగముల మీద పీడనము పెట్టి ఊపిరికి అంతరాయము కలిగించే ఉబ్బుదల భాగములను తొలగించు శస్త్రచికిత్స కొందఱికి ఉపయోగపడవచ్చును.
ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స (Lung Transplantation surgery) FEV-1 20 శాతము కంటె తక్కువగా ఉండి వ్యాధి తీవ్రతమ
- 179 :: మయినపుడు కొందఱికి అనుకూలము కావచ్చును.
వ్యాధి ఉద్రేకత (Acute exacerbations of COPD) :-
దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధి లక్షణములు అధికమయి ఆయాసము, దగ్గు అధికమయినపుడు వైద్యాలయములలో చేరిక అవసరము అవవచ్చును. సూక్ష్మాంగజీవులు (bacteria), విషజీవాంశములు (viruses), తాపజనకములు, వాతావరణ కల్మషముల వలన వ్యాధి ఉద్రేకించవచ్చును. అట్టి పరిస్థితులలో తఱచు పుపుస, శ్వాసనాళిక వ్యాకోచకములను (bronchodilators) అందించుటతో పాటు, సూక్ష్మజీవి నాశకములు (Antibiotics), కార్టికోస్టీరాయిడులు, ప్రాణవాయువులతో కూడా చికిత్స చేస్తారు. వ్యాధి తీవ్రతరమయితే ధమని రక్తమును వాయువులకు పరీక్షించి శ్వాసవైఫల్యము నిర్ధారణ అయితే కృత్రిమ శ్వాసలు అందించాలి. వ్యాధి నివారణ :-
దీర్ఘకాలిక శ్వాస అవరోధమునకు పొగత్రాగుట అధిక శాతములో
ప్రధాన కారణము. కావున వ్యాధిని నివారించాలన్నా అదుపులో ఉంచాలన్నా పొగత్రాగడము మానివేయుట చాలా ముఖ్యము. ఒక యత్నములో చాలా మంది పొగత్రాగుట మానలేరు. అందువలన పదే పదే పొగత్రాగుట మానుటకు యత్నించాలి. సలహా సహాయములు తీసుకోవాలి. అవసరము అనుకుంటే ధూమపానము మానుటకు మందులు ఉపయోగించవచ్చును. బొగ్గుగనులు, యితరగనులలో గాలి ప్రసరణ పెంచి, గాలిలో కల్మషములను, ధూళిని తొలగించి, కార్మికులకు పరిశుభ్రమైన గాలిని ముక్కు, నోటిపై అమరు మూతల (masks) ద్వారా అందించి నల్ల ఊపిరితిత్తుల వ్యాధిని (Black lung disease) అరికట్టే ప్రయత్నాలు చెయ్యాలి.
- 180 ::