హరివంశము/ఉత్తరభాగము - ద్వితీయాశ్వాసము
శ్రీరస్తు
హరివంశము
ఉత్తరభాగము - ద్వితీయాశ్వాసము
మాద్యదంధ్రదేశ
క్షేమదకరవాల సుజనకీర్తితగుణలో
లా మంజులవాగ్జాలా
వేమక్షితిపాల నిత్యవిజయవిశాలా.1
వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె నట్లు జరాసంధు పలాయనం
బాకర్ణించి జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె.2
సీ. అఖిలసైన్యములు సహాయులు గూడంగఁ గృష్ణుచే నపజయక్లేశ మొంది
యేమని తనవీటి కేఁగె నమ్మగధేశుఁ డకట యిమ్మెయినన మంతమేది
యవనీపతుల కెల్ల నగ్రణి యనిఁ బాఱిపోక కర్జంబుగఁ గైకొనంగఁ
జనునె శత్రులవెంట మునుఁ దాన గదలి యవ్వీరులు నెగువంగ వెన్నుసూపి
తే. పఱచు టెంతయు సిగ్గఱి బాముమాలి, యేమిటికిఁ గాక చెడుట దా నెఱుఁగఁ డొక్కొ
[1]యిట్లు వోయినపిమ్మట నెట్టు లయ్యె, నివ్విధం బెఱిఁగింపు మునీంద్రవంద్య.3
వ. అనిన వైశంపాయనుం డి ట్లనియె నట్లు పరాజయంబు నొంది చనిన జరాసంధుండు
లజ్జావనతవదనుం డగుచుఁ బురంబు సొచ్చి నిరుద్ధోరగంబుపోలికం బొరలి నిశ్వ
సింపుచు నశ్రాంతచింతాకులత్వంబునం జిత్తసమాధానంబు వడయ నేరక యొక్క
నాఁడు భూపతుల నందఱం బిలుపించి వారి కి ట్లనియె.4
మ. ప్రతికూలంబయి దైవ మెంతయును బాపం బాచరింపంగ ను
ధ్యతమైనప్పుడు పౌరుషం బతిసమర్థం బయ్యు నత్యంత దు
స్థితిఁ బొందెం గనుఁగొంటిరే మనమహోద్రేకం బనేకక్రమా
ద్భుతమై పేర్చియు నట్లు గోపశిశువుల్ దూలింపఁ దూలెం దుదిన్.5
వ. మన కిప్పు డైన తేజోహాని భూతసర్గంబు గల యంతకాలంబును శాశ్వతం బై
యుండు నిది యపనయింప నుపాయం బొం డెయ్యది యెయ్యనువున నైన
నయ్యాదవుల వధియించుట నాకుం గర్తవ్యంబు.6
క. దీనికిఁ దగ మీరును మీ, సేనాసముదయముతో విశృంఖలలీలం
బూని నడచి పగతుపురం, బైనమధుర పొదివి వైర మడఁపఁగ వలయున్.
జరాసంధుఁడు రెండవసారి మధురమీద దండెత్తివచ్చుట
తే. మనబలంబు లనంతంబు లనుపమములు, యాదవులు వీతసాధను లర్ధహీను
లేను బొదివి నిరోధింప నెల్లభంగిఁ, జెడుదు రొగి సందియము లేదు కడఁగుఁడోపి.8
వ. అనిన నందఱు నవ్విధంబున కియ్యకొనిరి జరాసంధుం డనతిచిరం బగు కాలంబున
సమస్తసైన్యసమన్వితుం డై కదలె గోత్రజులును సంబంధులును సుహృదులు నైన
రాజులును గోమంతశైలంబునం జాల భంగపడుట నభిమానంబు పూనినభూనా
థులు నతని ననుగమించిరి విశేషించి విష్ణుద్వేషు లైన పౌండ్ర కళింగ దంతవక్త్ర
శిశుపాల సాల్వ రుక్మి యవన వేణుధారి సౌవీర గాంధార త్రిగర్త భగదత్తు
లును మఱియు నంగ వంగ సుహ్మ విదేహ కాశ కరూశ దశార్ణ మద్ర పాండ్యదేశా
ధీశులు నుత్సాహంబునం బేర్చి తత్సహాయు లై చని రివ్విధంబున నిరువదియొక్క
యక్షౌహిణులతో నతండు కతిపయప్రయాణంబుల నరిగి మధురాపురోపవనం
బులు సన్నివేశంబులుగాఁ గైకొనిన.9
తే. విష్ణు మున్నిడుకొని యప్డు వృష్ణివరులు, కోటపై నుండి యా సైన్యకోటేఁ జూచి
యుగసమాప్తికాలంబున నుల్లసిల్లు, నుదధియో కాక యని వెఱగొందుచుండ.10
క. సీరిఁ గనుంగొని నవ్వుచు, శౌరి యనియె భూభరంబు సయ్యన మాన్పన్
గోరి యొకో విధి యిచ్చట, నీ రాజులనెల్ల నొకట నిటొలోడఁగూర్చెన్.11
వ. దుర్జనుం డగు నీజరాసంధునిమిత్తంబున వీరు లిందఱకుఁ బ్రాణాంతకారి యైన
యాపద సంప్రాప్తం బయ్యె నది య ట్లుండె ననేకదేశనివాసు లగు వసుధాధీశుల
యడియాలంబులతోడి గొడుగులుం బడగలుం జూడు మీకూడిన మూఁకలం
గ్రీడయపోలె దునుమాడవలయు సన్నాహసమేతుల మై వెడలుద మనియె
నంత.12
తే. యముననిడుపెల్ల విడిదల యై తలిర్ప, బలము విడియించి మగధభూపాలకుండు
మనుజనాథులఁ బిలుపించి మంతనమును, గార్యమంతయు నూహించి కడఁకమిగుల.13
క. అరుదుగ గాడ్పున కైనను, జొర [2]నెడయును లేక యుండఁ జుట్టును ముట్టం
ద్వరితముగ వలయు నీపురి, వెరవు ప్రయోగింపుఁ డిట్టి విధమునకుఁ దగన్.14
వ. అని పలికి తదనురూపంబుగా నవ్విభుండు.15
సీ. గుద్దండ్లనుం బెద్దగునపంబులను గోట యొండొండ త్రవ్వుట నుక్కుటులుల
రాకట్టనపుటెడల్ గైకొని నఱకుట యొనరుదంచనముల నొడిసెలలను
జాలంగ నెందును సవరించు టమ్ములఁ దోమరంబులను శక్తులను గదల
గగనంబు నీరంధ్రకంబుగాఁ బొదవి యం దెవ్వరిఁ దలసూపనీకయుండు
తే. టోలి కర్జంబుగా నెల్ల యోధులకును, జెప్పి నేఁడాదిగఁ బుగంబు సెఱుచుపనియ
సర్వకృతియు మీ కని సమాజ్ఞాపనం బొ, నర్చి మఱియు నానగరము నాల్గుదెసల.16
వ. గోమంతపర్వతంబున నెవ్వరి నేదిక్కున నిలువ నియమించె నట్లు వారి నయ్యై
విధంబులను నిలిపి లగ్గసేయం దొడంగిన.17
తే. ఉగ్రసేనాసమేతుఁడై యుగ్రసేను, నగ్రసరుఁగా నొనర్చి వీరాగ్రగణ్యుఁ
డచ్యుతుఁడు బలదేవసమన్వితముగ, నఖిలయదువర్గములఁ గొని యనికి వెడలె.18
చ. వెలలిన యాదవేంద్రు నతివిశ్రుతతేజునిఁ గాంచి భూమి భృ
ద్బలములు భీతివిహ్వలవిభావనఁ జేష్ట లడంగి చిత్రితం
బులక్రియఁ జూచుచుండె నరపుంగవకోటియుఁ జిత్తము ల్గడుం
గలఁగఁగ డొంకె నంత భుజగర్వము సర్వము దక్కి గ్రక్కునన్.19
క. తమ మొనలు గరము గొంచెము, లమేయములు వగఱమూఁక లని యేమియు ను
ల్లముల గణింపక యాదవ, సమితియు వెస గడఁగెఁ జక్రిశౌర్యము గలిమిన్.20
వ. అయ్యవసరంబున.21
చ. గరుడపతాకతోడిరథకల్పన మొప్పగఁ జక్రమాదిగాఁ
బరఁగిన కైదువు ల్వితతబాహువులన్ వెలుఁగొంద దివ్యతా
స్ఫురితశరీరుఁడై సకలభూతభయంకరవిక్రముండు పం
కరుహదళేక్షణుం డడరెఁ గంపముఁ బొందఁగ శత్రుసైన్యముల్.22
క. హలముసలచాపధరుఁ డై, బలుఁడును నిజదివ్యమూర్తి భాసిల్లఁ గడున్
వెలుఁగొంద రిఫులచూడ్కులు, ప్రళయవిభావసునిఁ గనినపరుసున మెఱయన్.23
వ. ఇట్లు సన్నద్ధు లై వసుదేవసూనులు సర్వసైన్యంబులం దలకడచి మహామకరం
బులు మకరాలయంబు దఱియు తెఱంగున విరోధివ్యూహంబు గలంగఁ దఱిసి
రప్పుడు కృష్ణు నంతంతం గని సేనాగ్రగామి యగు జరాసంధుండు నిజశంఖంబు
పూరించిన వారిజోదరుం డయ్యుత్సాహంబు సరకు నేయక పాంచజన్యనినాదం
బున భూదిగ్గగనమధ్యంబు సంభరితంబు గావించిన.24
తే. ఊర్ధ్వలోకనివాసుల యుల్లములును, నధికభయమోహవివశంబు లయ్యె ననిన
నల్ప ధారుణీనాథసైన్యములు గలఁగి, త్రిప్పుకొని తల్లడిల్లుట సెప్ప నేల.25
జరాసంధుఁ డుగ్రసేను నెదుర్కొని రూక్షాక్షరంబుగ నాక్షేపించుట
వ. అమ్మహాయోధవరులం దాఁకి మగధనాథుం డనేకబాణపరంపరలు పరఁగించుచుం
గదిసి తదీయపార్శ్వంబున వరరథంబునం దున్న యుగ్రసేనునిం గని యి ట్లనియె.26
సీ. భోజవంశమువారు [3]రాజు లై యుండంగ యాదవుల్ కింకరు లై చరింతు
రట్టియన్వయమునఁ బుట్టియుఁ గడుబాము మాలితి నీకంటెఁ బాలిశుండు
గలఁడె యెవ్వఁడు పుత్రుఁ బొలియించె నాకృష్ణుఁ డెక్కటి తద్రాజ్య మెల్లఁ దాన
కొని రిత్తపట్టంబు నినుఁ బూన్ప నతనిపెట్టెడు నన్నపిండంబు గుడిచె దకట
తే. యెట్లుగాఁ బెద్దవాఁడ వై తేమి బ్రతుకు, సిగ్గఱినభోగ మెట్లు రుచించె నీకు
హరికి బంటవు గాక నీ వవనిపతివె, యిట్టి రాజధర్మధ్వంసి నేను సైప.27
క. నినుఁ దొలుత ససైన్యముగా, ననిలోఁ దెగటార్చి పిదప యాదవుల జనా
ర్దనపూర్వజవూర్వకముగఁ, దునుముదు నీపీఁచమడఁగ దుర్దమశక్తిన్.28
వ. అనిన నమ్మాటలకుఁ గలుషించి కమలనాభుండు.29
ఉ. అక్కట యుగ్రసేనుని మహాత్మునిఁ బల్కుట సంగరంబునం
దెక్కుడు పౌరుషంబు వెలయించుటయే పలుకం దలంచినన్
స్రుక్కక నన్నుఁ బల్కుము విరోధి నొకండన కాన నాకు నీ
యుక్కివ మెన్నిచందముల నోర్వక పోవునె వేయు నేటికిన్.30
తే. నాఁడు గోమంతనగమున నన్ను నాజిఁ, గదిపి చూచినవాఁడవు గావె నీవు
నాఁటివాఁడవ నేనును నవ్వుఁబాటు, గాదె యిట్లంట యీ వితర్కంబు వలదు.31
ఉ. ఇమ్మెయి నిప్పు డగ్గమయి యెప్పటియట్టుల డాఁగురించి నీ
విమ్ములఁ బాఱిపోవ కొకయించుక నిల్చితి వేని నీదుకం
ఠమ్మవికుంఠితాస్త్రవికటప్రహతిం దునుమాడువాఁడ ని
క్క మ్మిది సూడు మస్మదవిఖండితగర్వము సర్వము న్నృపా.32
క. అని యిరువదేనుతూపుల, జనపతి [4]నైదింట నతనిసారథిఁ బ్రభుఁ డే
పున నొంచి కార్ముకముఁ గే, తనముఁ దునిమె రెండు సునిశితప్రదరములన్.33
వ. అట్టియెడఁ గౌశికచిత్రసేను లతిరయంబున నడ్డంబు సొచ్చి వాసుదేవుం బెల్లేసిరి
కౌశికుండు వేఱ మూఁ డమ్ములు హలాయుధు మేన గ్రుచ్చె నాతం డతని విల్లు
భల్లంబున నఱకి యుఱక మెఱుంగుటమ్ము లెమ్ములం గీలించినం దలంకక కోదం
డాంతరంబు ధరియించి మాగధసేనాపతి యమ్మాధవాగ్రజుతో నేట్లాడుచుండం
జిత్రసేనుండు దోడ్పడియె నంత.34
ఉ. ఒండొక విల్లుపుచ్చుకొని యుగ్రగతి న్మగధేశ్వరుండు దో
శ్చండిమ సూపెఁ గృష్ణునకు సైన్యపు లిద్దఱు భర్తఁ గూడి యొం
డొండ హరిన్ హలాయుధుని నొక్కట నేసిరి వారి మువ్వురన్
దండిమగండు పంకరుహనాభుఁడు నొంచె శరత్రయంబునన్.35
తే. ఉగ్రసేనుని మెయినాటె నుగ్రబాణ, మాజరాసంధుఁ డొకటి యయ్యవనిపతియు
డెబ్బదేను దొమ్మిదియును నిబ్బరంపు, టమ్ము లతనిపైఁ బరఁగించె నలుక మిగుల.36
క. మాధవమాతామహుతో, బాధకముగ దశసహస్రబాణంబుల నా
యోధనము సేసె మగధధ, రాధీశుఁడు చూచి ఖచరు లచ్చెరువందన్.37
వ. కంసజనకుండు ధనుర్దండఖండనం బొనర్చిన నొండువింట నతని డెందంబు గాఁడనేసి
రథ్యంబులు దెగటార్చి విల్లునుం బడగఁయుం బొడిసేసె నట్లు రామకృష్ణులు చూచు
చుండఁ బగతుచేత విరథుం డై యయ్యుగ్రసేనుండు తొలంగిపోయిన.38
సీ. చెలఁగి కౌశి చిత్రసేనులు దోడుగా నాబృహద్రథసూనుఁ డాహవమున
సీరిఁ జక్రిని గ్రూరశితసాయకత్రయమున నొంప హరియు [5]నాభూపవర్యు
నచ్చమూపతులను నంబకశతములఁ గప్పిన బలుపడిఁ గామపాలుఁ
డై దేసియమ్ముల [6]నందఱ నేసి యాచిత్రసేనునిధనుశ్ఛేదనంబు
తే. సేసి హయములఁ గూల్చెఁ జెచ్చెర నతండు, పరిఘపాణి యై కదియంగ బలుఁడు నతని
యుసుఱుగొనుటకు శరము లొండొండ పఱపఁ, ద్రుంచె నాతనివిలు మాగధుండు పేర్చి.39
వ. ఆలోన గదాహస్తుం డై యురికి తదీయరథ్యంబులం జదియ మోఁదిన నా
రాముండు భీమవేగంబున ముసలం బమర్చిన నడరి నట్లు జరాసంధ బలదేవు
లెక్కటిం దలపడం గడంగునెడ రెండుసైన్యంబులు భేరీమృదంగనిస్సాణారవం
బులు సింహనాదంబులు నంబరంబు వగులింప నయ్యిద్దఱ తలపాటునకు నంకిలి
యగునట్లుగా గ్రందుకొనం దఱిమిన.40
క. ఇరువురుఁ దొలంగి గ్రక్కున, నరదము లెక్కిరి బలంబు లన్నియు వీఁకం
బురికొల్పుచుఁ గడఁగిరి దొర, లురవడి నుత్సాహరససముత్కటకరణిన్.41
వ. శినియు ననావృష్టియు బభ్రుండును పవృథుండును లోనుగా బలదేవు మున్నిడి
కొని యొక్కదెస మోహరించిరి. దాశాపహుండును గంహుండును బృథుండును
శతద్యుమ్నుండును విదూరుండును నాదిగా వాసుదేవునిం బురిస్కరించికొని
యొక్కదిక్కునం బన్నిరి. సత్యకుండును సాత్యకియు శ్వఫల్గుండును శ్యాముం
డును సత్రాజితుండు నుగ్రసేనుండును నాదిగా మృగధరు నగ్రేసరుం జేసి యొక్క
వలన నిలిచి రిట్లు మూఁడొడ్డనంబు లై యదుసైన్యంబులు భీష్మకరుక్మిప్రముఖమహా
యోధరక్షితంబును బ్రాచ్యదాక్షిణాత్యబహుళంబును జరాసంధసనాథంబును
నగు మాగధసైన్యంటుం దలపడియె నట్టితాఁకుదల నశ్వారూఢు లశ్వారూఢులను
గజారోహకులు గజారోహకులను రధికులు రథికులను బదాతులు పదాతులను
దార్కొనిన నిరువాఁగునకు శూరజనహర్షజననంబును భీరునివహభయావహం
బును వైవస్వతపురవర్ధనంబు నగు యుద్ధంబు ప్రవర్తిల్లె నందుఁ గృష్ణుండు రుక్మిని
నుగ్రసేనుండు భీష్మకుని వసుదేవుండు క్రధుని బభ్రుండు కౌశికుని గదుండు చేది
నాథుని రంభుండు దంతవక్త్రుని సాత్యకి విందానువిందులను శతద్యుమ్నుం డేక
లవ్యుం దాఁకిరి జరాసంధుండు రామునితో సంగ్రామం బొనర్చు నాసమయంబున.42
రుక్మి శ్రీకృష్ణునితోడం దలపడి యుద్ధంబు చేసి పరాజితుం డై పోవుట
తే. ఇరువదేను ముప్పదిరెండు వరుసతోడ, నేసె నమ్ములు రుక్మిపై వాసుదేవుఁ
డస్త్రములు రెంట భోజరాజాత్మజుండు, మాధవుని నేసె వేఱొక్క మార్గణమున.43
క. ఆతని కార్ముకమౌర్వీ, నాతనమున కుత్సహింప శార్ఙ్గధరుండున్
శాతాంబకమున విశిఖో, పేతంబుగఁ ద్రుంచె నతని పెనువెల్లు వెసన్.44
ఉ. ఛిన్నధనుష్కుఁ డై రిపుడు శీఘ్రమ శక్తి యమర్చి వైచె నా
వెన్నునిదిక్కు శౌరియును విస్ఫుటభల్ల మొకంట దాని ను
త్సన్నము సేసి యోలిన గదాపరిఘంబులు లోనుగా నతం
డెన్నిటి నెత్తె నన్నియును నేపెసఁగ న్నుఱుమాడెఁ గైదువుల్.45
వ. అంత నిలువక కేతనంబు నఱకి రథ్యంబుల వధియించి సారథిం దెగటార్చి విర
థుండును వికలసాధనుండు నైన యతనిం జూచి త్రికాలవేది యగుట నవ్విష్ణుండు
భావి యగుతత్సోదరీపరిగ్రహంబున నయ్యెడు యదుబాంధవం బూహించి చంపక
పోవిడిచె నుగ్రసేనుండు భీష్మకునిం బంచవింశతివిశిఖంబుల నేసిన నతం డతని
ననేకశతసంఖ్యంబు లగు శరంబులం బొదువుటయు.46
ఆ. అలిగి కంసుతండ్రి యతని విల్లును బడ, గయును ద్రుంచి సూతు హయచయంబుఁ
గూల్చుటయును భీతిగూరి భీష్మకుఁడు [7]క, య్యంబు సేయు టుడిగి యరిగెఁ దొలఁగి.47
మ. క్రథుఁ డేడమ్ముల నొంచెఁ గృష్ణజనకున్ గర్వంబుతో నాతఁ డా
పృథుబాణాహతి లెక్కసేయక వడిం బెల్లేసి తోడ్తోన సా
రథి నశ్వంబులఁ గేతువున్ ధనువు రౌద్రస్ఫూర్తితోఁ ద్రుంపఁగాఁ
బృథివీనాథులు సూడఁ బాఱె నతఁడు భీతిం గడున్ దవ్వుగన్.48
వ. బభ్రుం డనేకబాణంబులం గౌశికునంగంబు నొప్పించిన నయ్యదువీరుని నాతండు
సాంద్రశరవృష్టిం దొప్ప [8]దోఁచుటయు నమ్మహాబాహుండు తద్బాణాసనంబు
నఱికిన నొండువి ల్లెత్తి యేయుసాయకంబులు మర్మంబులు దాఁకి నొచ్చిన
[9]నొవ్వుతోన యలుక నురవణించి.49
క. పరుష మగునర్ధశశిముఖ, శరమునఁ బగతునిశిరంబు చారుకిరీట
స్ఫురితమణిరుచులు పర్వఁగ, ధరణికి బలిగా నొనర్చి తడఁబడ నార్చెన్.50
తే. గదుఁడు చేదినాథునినొంప గదుని [10]నొంచెఁ, జేదినాథుండు బహుళాస్త్రమేదురాంధ
తమసనిర్మగ్న మయ్యె రోదసీతటంబు, సకలభూతావళియు భీతిచలిత మయ్యె.51
క. కొండొకవడికిం జైద్యుఁడు, కాండపరంపరల విరథుఁ గావింపఁగ భీ
తుండై యాదవుఁ డరిగె న, ఖండితశౌర్యుఁ డగుశౌరికడకు రయమునన్.52
క. శంభుఁడు భూరిభుజాసం, రంభంబున దంతవక్త్రుఁ బ్రకటశరసము
జ్జృంభణగోచరుఁ జేయఁగ, సంభరితాస్త్రములఁ బొదివె శాత్రవు నతఁడున్.53
సీ. సాత్యకి యత్యుగ్రశరముల విందానువిందుల వెసఁ బరివితతతనులఁ
జేయంగ నతనిపై నాయవంతీశులు వివిధాస్త్రజాలంబు వెల్లిగొలిపి
విలు ద్రెవ్వ [11]రథహయంబులు నొవ్వ సారథి దలరఁ బ్రస్ఫుటశక్తికలన సూపి
రతఁడు వేఱొళవింట ననువిందు విరథుఁగా నొనరింప నిద్దఱు నొక్కరథము
తే. నంద యుండ నత్తేరును నపహతముగ, నాచరించి గ్రక్కున నొక్కయక్కజంపు
గద యమర్చివైచినఁ దొలఁగంగనుఱికి, పోయి రోటమికోర్చి యబ్భూపసుతులు.54
వ. శతద్యమ్నుం డేకలవ్యుపై సప్తనారాచంబు లేసిన నమ్మేఁటిమగండు దానును
నన్నియ తూపు లతనిపై నాటించెఁ గ్రమంబున నేడింటను ముప్పదింటను
నతండును నాతండును నొండొరుల నొప్పించి యొకళ్లోకళ్లవలన విరథత్వంబు
నొంది గదాహస్తు లై యనేకమండలభ్రమణంబులం బరస్పరాంగంబులు పరిక్ష
తంబులు గావించి మెఱయుచుం బెద్దయుం బ్రొద్దు పోరునెడ యాదవుండు గ్రమం
బునఁ బ్రతిభటుని చేతికయిదువు విఱుగునట్లుగా వెరవుతోడి వ్రేటుగొనిన నతండు
గదాశకలంబు సయ్యన నురివి గాఢముష్టిం దద్భుజాంతరపీడనం బొనర్ప నవ్వీ
రుండును నవ్విధంబువాఁడ యై నిలిచె నట్లిరువురు బాహుయుద్ధంబునకుం దొడంగి
కిట్టియుం బట్టియుం బొడిచియు నడిచియుఁ ద్రోచియుఁ దాచియు డాసియు
వ్రేసియు జానుకూర్పరతలప్రహతుల బాహూరుపీడనంబులం గేశాకర్షణనఖదంత
[12]ఘాతంబులను సరిగాఁ బెనంగిరి కొండొకసేపునకుఁ గృష్ణబాంధవుండు జరాసంధ
బాంధవుని నతినిబిడబంధం బగు బంధురముష్టి నూరుసంధి యుఱక పొడిచినం
బగతుండు గన్ను దిరిగి నెత్తురు గ్రక్కుచు గ్రక్కున నొఱగి యంతలోనన సంబ
ళించుకొని యెగసి పోకు పోకు మని యార్చుచుం గడంగిన నద్దెసయోధు లతని
కడ్డంబు సొచ్చి రిద్దెసవార లతనిం గైకొని వారిం దలపడి రయ్యురవడిఁ గయ్యంబు
సందడి యగ్గలంబయ్యె నిత్తెఱంగున.55
క. ఎక్కటి పెనఁకువ లెన్నఁగఁ, బెక్కులు గడు నక్కజములు భీషణములు నై
యొక్కటఁ జెల్లగ ననిమిష, దృక్కౌతూహలము లధికతృప్తి వహించెన్.56
వ. అట్టి సంకులసమరంబును గులశక్తిసాహసంబులు నిరపోహంబులుగా నిర్వహించు
గర్వంబునం బెంపారు శూరులు గవిసి చిత్రసంప్రహారప్రౌఢి సూప నేపునం బోవక
పెనంగు తురంగమాతంగశతాంగపదాతివ్రాతంబుల వివిధనిపాతనంబులం బగిలిన
మోరల నొగిలిన కంధరంబులం దునిసిన తొండంబుల ముఱిసిన కొమ్ముల నొఱగిన
సారథుల విఱిసిన కేతువులఁ ద్రెస్సిన నడుముల వ్రస్సిన యురంబులం బ్రచురం బై
చెల్లం దోడ్తోన పెరుఁగు పెన్నెత్తురు మడువులు గాలువలు నై యొదవి యస్థి
చూర్ణసైకతంబుల బలలపంకంబులం బరఁగ మరలిన హారమణులం బడిన [13]తెల్ల
గొడుగుల సమరభూభాగంబు లుద్భిన్నతారకంబులు నుల్లసితశశాంకంబులు నగు
నాకాశప్రదేశంబుల ననుకరింప నాయతబాహుచ్ఛేదంబులు నారక్తకరచరణం
బులుం గలచోట్లు ప్రసుప్తభుజగంబులు ప్రస్ఫురితకోకనదంబులు నగు నెలవుల
చెలువు దీపింప నిర్జీవతానిశ్శబ్దంబు లగు శరీరసహస్రంబు లెడనెడం బడిన వీర
శంఖ పణవ దుందుభి కాంస్యకాహళాదులును సమానవ్యసనంబు లయి [14]మూకీ
భవించె నన నడంగి యుండ నొండొండ పేర్చు భూతబేతాళడాకినీశాకినీకల
కలంబులవలనం గేవలకుణపమయంబు లగు ఠావులం బునరుజ్జీవితదేహంబు లైన
పగిది నుత్ప్రేక్షణీయంబు లై వెలయ వియత్తలరంగంబు గైకొని కుంచియ వీచి
యాడునారదుచేత శిక్షితంబు లయ్యె ననం దగి గృహీతప్రహరణంబు లయి
నర్తించు కబంధంబులు రౌద్రాద్భుతరసంబులకుఁ బాత్రంబు లై మెఱయ నవ్వేళ
యాభీల యయ్యె [15]నాసమయంబున.57
బలరామ జరాసంధుల గదాయుద్ధ విజృంభణము
మ. తనతే రెందును నుల్లసిల్లఁగ బలోద్దాముండు రాముండు దీ
ప్తనిశాతాస్త్రపరంపర న్మగధయోధశ్రేణిఁ దూలించుచుం
జనుదేరం గని సైప కేపున జరాసంధుండు సంధుక్షితో
గ్రనిజక్రోధకృశాను నాతనికి వీఁకం జూపఁ గాంక్షింపుచున్.58
క. తే రభిముఖంబు సేయఁగ, సారథిఁ బనిచి పటుబాణజాలభయదవీ
రారంభుఁ డైనఁ దత్క్రియ, చీరికిఁ గైకొనక తాఁకె సీరియుఁ గడిమిన్.59
చ. ఇరువురు [16]నేచి తుల్యముగ నెంతయుఁ బ్రొద్దు పెనంగి రథ్యముల్
ధరఁ బడ సూతు లీల్గఁగఁ బతాకలు మ్రొగ్గఁగ వర్మబంధముల్
మురియఁగఁ జాపము ల్దునియ ముద్గరతోమరశక్తు లాదిగా
వరుస ననేకము ల్మడియ వావిరిఁ బోరి చలంబు పెంపునన్.60
తే. గదలు గొని మహితలముగ్రక్కదలనుఱికి, తుంగశృంగసమన్వితాద్రులునుబోలెఁ
గదియ రెండుసైన్యములును గదన ముడిగె, నమ్మహాద్వంద్వయుద్ధవీక్షాదరమున.61
వ. అట్లెల్లవా [17]రెల్లనుం జాల నెడగలిగి చూచుచుండ నంబరంబున ననిమిషసిద్ధవిద్యా
ధరప్రముఖులును నధికతాత్పర్యంబున నాలోకింప సంగరరంగంబు ప్రవేశించి.62
సీ. పేర్చి మదోద్రిక్తబృంహితరౌద్రంబు లగుషష్టిహాయనహస్తు లనఁగ
రోషభీషణరేఖ రొప్పుచు బీరంబు పొలివోనికడిఁదిబెబ్బులు లనంగ
వెలయుదర్పంబున మలసి రంకెలు వైచి పటుకు గ్రాలెడువృషభంబు లనఁగఁ
గ్రూరచేష్టితములఁ గూరి దుర్వారహుంకారంబు లగుమృగవైరు లనఁగ
తే. లాగువేగంబు సౌష్ఠవోల్లాసవిధము, గడఁకయునునుబ్బుఁ దుల్యత్వకరణి మెఱయ
ఘోరమూర్తులై సింహనాదారవంబు, లడరఁ దార్కొని రవ్వీరు లాగ్రహమున.63
వ. ఇవ్విధంబునం దలపడి యిద్దఱు నుద్దామరభసంబునం బెనంగునెడ జరాసంధుండు
సవ్యమండలభ్రమణంబున నభివేష్టింప ముష్టికాంతకుం డవ్వెరపు గణియింపక
దక్షిణమండలభ్రమణంబుం జుట్టికొని తిరుగ నిరువుర కయిదువులు నొండొంటిం
దాఁకి నిర్ఘాతపాతభీషణం జగు ఘోషంబు పుట్టింప బెట్టిదంబుగా బృహద్రథ
సూనుపై నయ్యదునందనుండు గద వీచివై చిన నతం డప్పాటు దప్పించుకొనిన
నది యుర్వీతలంబు సలియింపం బడిన నత్తెఱపి నుఱికి వ్రేసిన విపక్షువ్రేటు సైరించి
ధీరుం డగు సీరాయుధుం డమ్మహాయుధంబు నతిరయంబునం బుచ్చికొని చెచ్చెర
మాగధు నడిచిన నాతండును దీవ్రఘాతం బొనర్చె నట్లు దొడంగి యొకటి
రెండు మూఁడు నాలు గే ననుచు నెక్కించిన ట్లక్కజంబుగా నొండొరులం బర్యా
యప్రహారంబుల నొప్పింప నప్పటి చంక్రమణవేగం బలవడఁ బాదపీడిత యై సర్వం
సహాయుఁ జలింపఁ బెంపేది కుండలికూర్మవిభులశిరంబులు వీఁపును నొగుల దిగులు
పుట్టి దిగ్గజంబు లొరుగ నఖిలభువనవాసులు భువనంబులకు భద్రంబు గావుత మని
భయభ్రాంతు లై యాక్రోశింప వాసుదేవాగ్రజుం గదిసి యహితుం డురస్థలం
బతిగాఢప్రహతిం బగిల్చినం బెలుచ నెత్తురు గ్రక్కుచు గ్రక్కున నతండు పుడమిం
బడి పడుటయు నెఱుంగంబడకయుండ నంతన యెగసి పగతు[18]నడితల బెడిదంపుఁ
గడంక నడువఁ గర్ణనాసారంధ్రంబుల [19]మెదళులు దొరఁగఁ దూలి కూలినఁ
బ్రతిభటుండు వొలిసె ననుచు యాదవు లార్వ గర్వం బేది మేదినీపతిసేనలు
గలంగఁ గ్రమ్మరం దెలిసి మగధనాథుండు మాధవపూర్వజు నపూర్వహుంకారం
బున నందంద వ్రేయుటయు నమ్మహాబాహుండు సముత్సాహంబునఁ బ్రతికృతి
గావించె వార లన్యోన్యహననంబులం బ్రశతాఖిలకాయు లై రుధిరధారలం
దడిసి పుష్పితకింశుకంబులుంబోలెఁ బొలుపారి గగనచారులచూడికిం బరమో
త్సవం బాపాదించిరి తదనంతరంబ.64
తే. అలుక యంతంత కెక్కఁగ హలధరుండు, విమతుఁ బొరిగొందు నింకొక్కవ్రేటు వ్రేసి
యని తలంచుచుఁ బెనుగద హస్తతలము, నం దమర్చి యుగ్రపుదృష్టి నతనిఁ జూడ.65
వ. అంతరిక్షంబున నశరీరవాణి యి ట్లను నీమాగధుం డొరులచేతం జావఁడు వీని
మృత్యువు వేఱొక్కరుం డున్నవాఁ డనతిచిరం బగు కాలంబున నవ్విధంబు
సంపన్నంబయ్యెడు నీ విప్పు డాయాసంబుఁ బొంద వలవ దుడుగు మనిన విని
జరాసంధుండు విమనస్కుం డయ్యె. రాముండును సంగ్రామవిరామంబు నొందె
నారెండు దెఱంగులవారును నంత బో రుడిగి తిరిగిపోయిరి యాదవులు మరి
యునుం బ్రతిదినంబును సన్నద్ధు లై వెడలుమాగధులును సకలపార్థివసేనలతోడం
గూడి దొడరి పెనంగుదు రిట్టిక్రమంబున దీర్ఘకాలంబ యితరేతరక్షయకారి
యగు దారుణసంప్రహారంబు సెల్లుచుండ.66
జరాసంధుండు పరాజయంబు నొంది మరలి నిజపురంబునకుం జనుట
చ. అనుపమ దైవమానుషబలాధికు లాయదువంశసంప్రవ
ర్ధనులభుజ[20]ప్రభావపటుదర్పము లార్పఁగ రామి తెల్లఁగాఁ
గని పగతుండు గం డడఁగి కాతరభావము నెమ్మనంబునం
దనికిన సర్వయత్నములు దక్కి నృపాలసముత్కరంబుతోన్.67
వ. సేనాసముదయంబుల నెల్ల [21]దివియించుకొని నిస్తేజుం డై తనవచ్చినత్రోవన
మగిడె నప్పగిది మగధపతి బెగడి తొలంగి పోయిన.68
మ. విజయభ్రాజితు లై యదుప్రవరు లావిర్భూతసమ్మోదసం
ప్రజయస్వాంతత నచ్యుతున్ హలధరున్ భవ్యోక్తిఁ గీర్తించుచు
న్నిజభాగ్యోదయ మెల్లవారలును వర్ణింపంగఁ బూర్ణోన్నతిం
ద్రిజగద్రాజ్యము సేరినట్లు కడు నుద్దీపించి.69
ఉ. అందును బుద్ధియుక్త మగు యాదవవృద్ధగణ
స్పందయశోధికప్రకటభంగుల గెల్చియు గెల్పు [22]గెల్పుగా
డెందములందు సూడక కడిందిగ స్రుక్కియ యుండెఁ బెంపుసొం
పుం దనరార వానిబలముం జలమున్ గుఱిగా వెలుంగుటన్.70
సీ. అట్లు పలాయితుం డై చని యాజరాసంధుఁ డే మని చెప్పఁ జలము [23]మిగులఁ
దక్కక మఱియు నుద్దండత నెప్పటియట్లు మధురపయి నరుగుదెంచె
యాదవులును దొంటియట్టుల సమకట్టి వెడలి ఖేచరదృష్టి వెక్కసమున
మునుఁగంగఁ బోరి రిట్టెనసినపోరాట పదునెనిమిదిమాఱు లెదిరి రిపుఁడు
తే. భగ్నుఁడై పోయె నయ్యదుపతియుఁ దాను, శక్తుఁ డయ్యును బ్రతిపక్షుఁ జంపనొల్లఁ
డొరుఁడు వానికి మృత్యువై యునికి బుద్ధి, నింతయు [24]సునిశ్చితమ్ముగ నెఱుఁగుఁ గాన.71
వ. ఇత్తెఱంగున నాశ్రితశ్రీవిధాయి యైన యాశ్రీవిభుండు విజయశ్రీసమేతుం డై
సుఖంబున నుండె నయ్యదువీరు లిద్దఱు నమ్మహాసమరంబుల నాత్మీయదేవతా
రూపంబులం దక్కినయప్పుడు మానుషాకారంబులుం బచరించి నిజమాయా
ప్రభావంబు భావింప నెవ్వరికి నలవిగాక యతిశయిల్లుదు రంత నొక్కసమయం
బున బలదేవుండు.72
క. తమపిన్ననాఁటియాటల, క్రమమంతయుఁ దలఁచి వేడ్క గడలుకొనఁగఁ జి
త్తమునందు గోకులాలో, కమహోత్సవ మిచ్చగించి కర మిష్టమునన్.73
మ. జలజాతేక్షణుతోడఁ జెప్పి తదనుజ్ఞం దానొకండు సము
జ్జ్వలకాంతారవిహారయోగ్య మగువేషం బొప్ప వ్రేపల్లెకున్
లలిమై నేఁగినఁ దన్నివాసులు మహోల్లాసాత్ములై యమ్మహా
బలు నంతంత నెదుర్కొనంగ నతఁడున్ బంధుత్వధౌరేయతన్.74
క. కొందఱకు మ్రొక్కి తనకుం, గొందఱు మ్రొక్కంగ వరుసఁ గొందఱుఁ గుశలం
బందంద యడిగి కౌఁగిటఁ, గొందఱఁ గదియించి ప్రణయకోవిదుఁ డగుచున్.75
క. [25]గోపికలు పొదివికొనఁగాఁ, దీపారెడిచూడ్కితోడితిన్ననియుచితా
లాపములఁ బ్రియము సలుపుచు, నాపోవని యింపుసొంపు లభినవములుగన్.76
వ. ఉన్నంత [26]గోపవృద్ధు లందఱు నతనిఁ బరివేష్టించి యిష్టగోష్ఠిం దగిలి యి ట్లనిరి.77
క. స్వాగతమే యాదవకుల, రాగవివర్ధన మహాత్మ రామ సుఖశ్రీ
భాగి నిను నిపుడు గని సుఖ, భాగుల మే మైతి మెట్టిభాగ్యోదయమో.78
చ. తమతమ జన్మదేశముల తద్దయు రమ్యము లెల్లప్రాణిజా
తములకు నంట యిప్పుడు గదా నిజ మయ్యె జగత్ప్రసిద్ధవి
క్రముఁడవు నీవు నీపసులఁ గాచినచోటికి వచ్చి యిమ్మెయిన్
మముఁ గొనియాడ నింకఁ గడుమాన్యుల మైతిమి దేవతాలికిన్.79
సీ. చెనఁటిచాణూరముష్టికుల భంజించుట [27]కంసవిధ్వంసనకఠినలీలఁ
దనరుట శత్రునితండ్రిం బ్రతిష్ఠించు టబ్ధిలోఁ దిమితోడియాహవంబు
గోమంతనగమున శ్రీ మెఱయంగ నుదాత్తదివ్యాయుధావాప్తిమహిమ
భూమీశ్వరులతోడి భూరిసంగ్రామంబు కరవీరవిభుని సృగాలుఁ గూల్చు
తే. టర్థి మధుర కేతెంచుట యచటఁ జిత్ర, జయము గ్రమ్మఱఁ గొనుట యీసరణి నీవు
దమ్ముఁడును జరించిన యద్భుతంపుఁజరిత, మెన్నఁ గొనియాడ నెవ్వర మిప్పు డేము.80
క. ఈవసుమతి యంతయు నిటు, మీవలనఁ బ్రతిష్ఠవడసె మీవా రగువా
రేవారు వారు కల్యా, ణావాసులు [28]దార యగుట యరిదియె యనఘా.81
చ. అన విని రాముఁ డి ట్లనియె నక్కటయిం తన నేల మీరు గూ
ర్మి నెఱయఁ బెంపఁగాఁ బెరిఁగి మీచిరశిక్షఁ జరించి మీగృహం
బున సరసాన్నము ల్గుడిచి బుద్ధిఁ దనర్చినమాకు నెందు శో
భన మగు టేమి సందీయము బాంధవు లెవ్వరు మిమ్ముఁ బోలఁగన్.82
క. రాచసిరి యుండియును మది, యాచవికిం జొరదు నాకు హరికి నిచటిబా
ల్యాచరణముపై మక్కువ, యేచందంబులను మఱవ నెన్నఁడు రామిన్.83
వ. అన సంతసిల్లి వారందఱు నతని నభినందించి మాధుర్యహృద్యంబు లగు మద్యం
బులును సమధికాపేక్ష్యంబు లగు భక్ష్యంబులును భావానురూపంబు లగు నను
లేపంబులును తేజోవిలాసకల్యాణంబు లగు మాల్యంబులును ననేకంబు లాకల్యాణ
మూర్తికి సమర్పించినం బ్రీతుం డై వివిక్తంబును రమణీయంబు నగు ప్రదేశంబున.84
ఉ. గోపిక లందియీఁ బసిఁడికోర నుదారసుగంధిశీధు వి
చ్ఛాపరిపూర్తిగాఁ గొని వెసం గడు నుగ్గడువై [29]ముదంబు సం
వ్యాపకభంగి నంగము సమస్తము ఘూర్ణన మొందఁ జేయ ను
ద్దీపిత మైనమోహము మదిం బరతంత్రత యావహింపఁగన్.85
సీ. కనకపుమ్రోకునఁ దనరెడు సురదంతిమాడ్కి నుత్ఫుల్లదామమున నమరి
నిండువెన్నెల పర్వ నెఱయు కైలాసాద్రిలీలఁ జందనసాంద్రలిప్తి మెఱసి
చలదుల్క మగుశరజ్జలదంబు క్రియ నేకకుండలమణిదీప్తిఁ గొమరు మిగిలి
ఘనభోగియుక్తమై తనరుపటీరంబుగతిఁ జేతిహలమున నతిశయిల్లి
తే. దారకలలోఁ గలంకవిస్ఫారుఁ డగుచు, నలరుపూర్ణేందువిధమున నతివపిండు
నడుమ నీలాంబరద్యుతి బెడఁగు గాఁగ, నధికధవళాంగరుచి నొప్పె నవ్విభుండు.86
వ. అచ్చటికి ననతిదూరగామిని యైన కాళిందిదిక్కు మొగం బై.87
క. ఓయమునానది నీయం, దాయతముగ నాకు వలయు నవగాహంబున్
జేయఁగ [30]రావో తేవో, తోయము లని పిలిచె నెలుఁగు తొట్రిలఁ బెలుచన్.88
వ. పిలిచి యమ్మహాతరంగిణి యాత్మస్వభావంబునన యున్న యునికి దన్నుఁ గైకొన
మిగాఁ గొని యమ్మహాబాహుండు.89
బలరామదేవుండు కాళిందీభేదనంబు సేయుట
మ. అలుకం బేర్చి హలం బధోముఖముగా నచ్చోటికిం జాఁచి త
త్సలిలౌఘం బొకవ్రంతయై తనకునై సర్వంబు నొండొండ యి
మ్ముల రావింపఁ దొడంగె భూరిభయసమ్మోహంబునన్ ధాత్రి య
గ్గలపుంగంపము నొందఁ గ్రిందటిభుజంగవ్రాతముల్ భీతిలన్.90
వ. ఇవ్విధంబున సంకర్షణలాంగలాకర్షణంబునకు వశగత యై వికీర్ణశైవాలకేశియు
విలోలమానదృష్టిపాతయు విగ్రస్తఫేనదుకూలయు విహ్వలనిహంగరుతాక్రం
దయు వికలకలహంసగమనయు వికంపితకోకస్తనయుగ్మయు విషణ్ణసరోరుహ
వదనయు విభిన్నవీచీవళీవిలసనయు వికలితావర్తనాభియు నై విభుకరాకృష్య
మాణ యగువిముగ్ధయుం బోలె నరుగుదెంచి యాతటిని యాతని యెదుర
నాత్మీయదివ్యాకారంబు దాల్చి నిలిచి విరచితాంజలి యై యి ట్లనియె.91
క. శరణమ్ము గమ్ము నీదగు, చరణ మ్మిదె శిరముసోఁక సంప్రార్థన త
త్పరత నొనర్చెద హలధర, హరిపూర్వజ చక్కఁ జూడు నాతుర నన్నున్.92
క. స్వాభావికజాడ్యమున మ, హాభాగ భవన్నియుక్తి యాత్మ నెఱుఁగ కే
నీభంగి నైతి నలుగుదు, రే భామల కితరు లట్ల యిట్టి మహాత్ముల్.93
ఉ. జీవితభర్త యై పరఁగుసింధువుఁ గూడఁగఁ బాఱకుండ బృం
దావనమధ్యభూమికి నుదారుఁడు రాముఁడు గ్రమ్మఱించెఁ దా
నేవిధిఁ దప్పు సేయ కీటు లే లగు నిన్నది యంచు నింక ఫే
నావలిరోచుల న్నగుచు నార్వరె నన్ను సపత్ను లందఱున్.94
క. అపచారనిదర్శక మగు, విపరీతగతంబు నాకు విశ్వజగమునం
దపకీర్తికరం [31]బిది నీ, కృపగల్గినఁ జాలు [32]నింకఁ గిల్బిషభేదీ.95
వ. క్రమ్మఱ నేను బూర్వమార్గప్రవర్తిని నగునట్లుగా నానతిచ్చి పనుపు మిమ్మహా
సిరవిదారణరభసం బుపసంహరింపు మనిన నవ్వుచు నవ్విభుం డవ్వెలంది నాలో
కించి నీవు వేఁడికొనుటం జేసి వాఁడి యలుక యొకింత సైరణ సేసెదం గాని నీ
తప్పున కెప్పగిది దండచండతయుం జాల దది యట్లుండె నీ వింతట నిలిచి యెల్ల
కాలంబును నే నిచటికిం దిగిచిన యిప్పాయవలన బృందావనప్లావనం బొనర్పుము
నాకు ని ట్లయిన నత్యంతశాశ్వతం బగు యశంబు సిద్ధించు భవన్తుఖ్యప్రవాహంబు
వాహినీశ్వరగామి యగుం [33]గావుత మని యనుగ్రహించుటయు నిగ్రహవిముక్త
యై యయ్యగ్రతటిని యాత్మేచ్ఛం జనియెఁ గాళిందీభేదనప్రభావంబు గనుంగొని
గోపాలు రందఱు నచ్చెరువునొంది యయ్యమానుషసత్త్వశాలి ననేకవిధంబులం
బ్రస్తుతించి రవ్విధంబున నాశ్చర్యకర్మకలనాధౌరేయుం డైన యారౌహిణే
యుండు.96
బలరాముఁడు వ్రేపల్లెనుండి మధురాపురంబునకు వచ్చుట
క. వెండియుఁ గొన్నిదినంబు ల, ఖండితరాగమున గోపకప్రకరములో
నుండి హరిఁ దలఁచి కౌతుక, కండూలం బైన మనసు కడుఁ దమకింపన్.97
తే. వ్రజనివాసుల నెల్లను వరుసతోడ, వీడుకొని తన్ను నందఱు వేడ్క ననుప
మధుర కేతెంచి వ్రజములో మరిగి తాల్చి, యున్న[34]వేషంబ యెంతయు నొప్పు నొసఁగ.98
క. మును గోవిందునియింటికిఁ, జనుదెంచినఁ గాంచి యధికసంప్రీతి నెదు
ర్కొని తత్పదములకుఁ బ్రణతి, [35]యొనర్చి కావించె నాతఁ డుచితార్చనముల్.99
వ. అయ్యగ్రజుం డయ్యనుజసహితంబుగాఁ జని నిజజనకుం గని ప్రణతుం డైనం
దీవించి కౌఁగిలించి యవ్వసుదేవుండు గోకులంబు కుశలం బడుగ నాబలభద్రుండు
భద్రంబుగా నఖిలంబు నుపన్యసించె మఱియుం బుత్రు లిరువురు నుచితచిత్ర
కథావిన్యాసం బొనర్చి తండ్రిం బ్రముదితుం జేసి రట్టిప్రవర్తనంబునం గొంతకాలం
బరుగుటయు.100
క. ఒకనాఁడు సకలయాదవ, నికరసభాంతరమునందు నీరజనాభుం
డకుటిలమనస్కుఁ డిట్లని, ప్రకటార్థం బైనపలుకు పలికెం బ్రీతిన్.101
సీ. వినుఁడు యాదవకులవీరు లందఱు నవధానంబుతోడ మద్వాక్యసరణి
మనకు నీవాస మిమధుర యిప్పురిఁ బోలఁ బురి లేదు మనభూమిఁ బోల భూమి
యెందును బుట్ట దే మిప్పురంబునఁ బుట్టి పెంపార వ్రేపల్లెఁ బెరిగి వచ్చి
యిచ్చట నైశ్వర్య మిట్లు ప్రాపించితి మింతలోఁ బగ బలవంత మయ్యె
తే. సర్వపార్థివులును జరాసంధుఁ గూడి, యెంత లెంతలు చేసిరి యెఱుఁగ రెట్లు
మనము నొకభంగి నెడరెల్ల మఱచి యంత, నున్న వారము తుదిముట్టనునికి వ్రేఁగు.102
మ. చెలులుం జుట్టలు హేమరత్నములు హస్తిస్యందనాశ్వంబులున్
బలవద్యోధసముత్కరంబులును సంపన్నంబుగాఁ గల్గియున్
సెల వేమీ యిటు లంతకంత కహితశ్రేణీసమాఘాతసం
కలనం దూలి నశింప నిట్టి యభిషంగం బోర్వఁగా వచ్చునే.103
వ. కావున నింక నిక్కడ నివాసంబు నాకుం జూడఁ గర్తవ్యంబు గాదు వేఱొకచోటు
సంపాదించెద నయ్యెడకు నిందఱము నరిగి సుఖంబున నుండుద మిది మీ మనం
బులకు రుచియింపవలయు ననిన వారునుం దమలో విచారించి.104
ఉ. వైరి యవధ్యుఁ డాతనికి వారక యెన్నఁగ బెద్దసైన్యముల్
సారభుజోద్ధతిం దొడఁగి చంపుదు మేని ననేకవర్షవి
స్తారములందునుం దెగవు సంక్షయ [36]మొందును వారియస్మదీ
యోరుచమూసమూహ మిటు లూరక యేటికి నింద చావఁగన్.105
వ. ఇది సాపాయస్థలంబు పరిత్యజింప వలయు నమ్మహాపురుషుం డెట్లు పనిచె నట్ల
చేయుద మని తత్ప్రకారం బాకంసవైరితోడం దెలియఁ బలికిన నతండు ప్రీతుం
డయి యొక్కదుర్గమప్రదేశంబు దన మనంబునంద నిశ్చయించి సకలజనంబులకు
నిర్గమసన్నాహం బాజ్ఞాపించె నాలోనన.106
ఆ. కాలయవనుఁ డనఁగఁ గాలకల్పుఁడు శత్రుఁ, డేచి మధురమీఁద నెత్తుదేరఁ
గదిలె ననికి నపుడ యొదవి జరాసంధుఁ, డును గడంగె ననియు వినియె నొకట.107
క. విని తనవారల కెల్లను, ఘనభుజుఁ డెఱిఁగించి నేఁడ కదలుద మని శో
భన మగుదివసం బిది యని, యనుపమకల్యాణవిధిసమాచారముతోన్.108
వ. సకుటుంబు లగువృష్ణ్యంధకవీరులం దోడ్కొని సమస్తవస్తుసంపదలతోడ నడువ
ననంతదంతిరథతురంగబహులంబుగ బలంబుల నాయితంబు సేసికొని తానును
బలదేవుండును వసుదేవు నుగ్రసేనుని బురస్కరించుకొని పురంబు నిర్గమించి
పశ్చిమాభిముఖు లై ప్రతిదివసప్రయాణంబుల నరిగి పున్నాగనాగకేసరనాగల
తాక్రముకనారికేళకేతకీప్రముఖవనషండమండితం బగుసాగరానూపప్రదేశంబు
చేరి యందు సికతామలమృద్భూషితం బగుభూభాగంబు గని.109
సీ. ఇది వాహనములకు హిత మిది జనులకు నాయురారోగ్యవృద్ధ్యావహంబు
మధురమనోజ్ఞనిర్మలతోయసంపన్న మిది సర్వతరులతాభ్యుదయభూమి
యిది యిది మును ద్రోణుఁ డేకలవ్యునిచేత నర్చన గైకొన్నయన్నివాస
మిది మందరమువకు నెన యైనరైవతకాద్రి చేరువను నొ ప్పమరునట్టి
తీ. [37]దనుచుఁ దద్విశేషంబు లత్యాదరమున
నర్హకోటికిఁ జెప్పుచు నంబుజాక్షుఁ
డంతపట్టు వారలఁ దగ నచటు విడియఁ
బనిచెఁ దగుముహూర్తంబున మన మెలర్ప.110
వ. ద్వారవతినామకం బగుపురం బతిమనోహరంబుగా నిర్మించి పురవాస్తవ్యులు
బంధుమిత్రమంత్రిసేనాపతులు నాయంకులుం దగునెలవుల నిలువం దాను నభి
నవం బగు రాజమందిరంబున [38]వసియించె నవ్విధంబున నమ్మహాదుర్గంబు వడసి
యాదవులు శాత్రవులవలని భయంటు విడిచి పురుషోత్తముచేత నభిరక్షితు లై
పురుహూతసంరక్షణంబున నమరావతిం బ్రమోదించు నమరులకుం బాటి
యగుచుం బ్రకాశిల్లి రనిన జనమేజయుం డి ట్లనియె.111
చ. అతులితమధ్యదేశమున కంతటికిం దిలకం బనంగ నూ
ర్జితధనధాన్యసంపదలఁ జెన్ను వహించి ప్రసిద్ధసజ్జనా
న్విత [39]మయి యొప్పునమ్మధుర నెటొకొలా గ్రమ్మన నుజ్జగింపఁగా
మతి యటుపుట్టె శౌరి కరిమర్దన మేటిది యాత్మశక్తికిన్.112
వ. అదియునుం గాక కాలయవనుం డెవ్వని పుత్రుం డెంతటిలావు గలవా డతఁ డచ్యు
తునిదెస నెవ్విధం బొనర్చె నద్దేవుం డెట చని ద్వారకాపురం బేమితెఱుంగునం
గావించె మఱి యేమిపను లొనర్చె నంతయు వినవలతు ననిన వైశంపాయనుం
డతని కి ట్లనియె.113
వైశంపాయనుండు జనమేజయునకుఁ గాలయవనుని జననప్రకారం బెఱిఁగించుట
సీ. వినుము వృష్ణ్యంధకవితతి కాచార్యుండు గుణగరిష్ఠుండు [40]గర్గుండు నాఁగఁ
గలఁ డాతఁ డాజన్మకలితసమంచితబ్రహ్మచర్యంబునఁ బరఁగుచుండ
నయ్యూర్ధ్వరేతస్కు నన్యుఁ డొక్కఁడు వచ్చి యదుకోటిసన్నిధి నపహసించి
యీతఁ డాఁటది గాక యెన్నంగఁ బురుషుఁడే యని యెగ్గు పలుకంగ నవ్విధంబు
తే. వినియు నూరకుండిరి యదువీరు లతఁడు, ప్రకటరోషవిజృంభితభావుఁ డగుచు
[41]నడవి కేఁగి పండ్రెండేఁడు లధికనిష్ఠ, [42]లోహచూర్ణాశి యై నిర్విలోపబుద్ధి.114
వ. ఘోరవ్రతంబు నడపినం బ్రీతుం డై తోతెంచి పినాకి వరం బడుగు మనిన నతండు
వృష్ణ్యంధకభయావహుం డగు తనయుం(డు గావలయు నని) కోరుటయుం
ద్రిలోచనుం డట్ల యొసంగె నట్లు లబ్ధవరుం డగు నమ్మహాతుని తెఱం గెఱింగి
యవనేశ్వరుం డపుత్రకుం డగుట బుత్రార్థి యై యతనిం బ్రార్థించి తోడ్కొని
పోయి.115
తే. ఆలమందలో నునిచి నిత్యార్చనంబు, సేయుచుండంగ నప్పరస్త్రీ యొకర్తు
గోపకామినీరూపయై కొఱలి యతని, వలన గర్భంబు దాల్చె నీశ్వరునియాజ్ఞ.116
క. ఆగర్భంబునఁ బుట్టె మ, హాగురుతేజుండు కాలయవనుఁ [43]డనఁగ బా
హాగర్వవిజితవిమతో, ద్యోగుఁడు ధీగణ్యుఁ డధికదుర్దముఁ డెందున్.117
తే. అతనిఁ బుత్రుఁగాఁ గైకొని యవనవిభుఁడు, పెనిచె [44]నంతిపురంబునఁ బెనుపు మిగులఁ
దత్పరోక్షంబునం భూతలవిభుత్వ, మొంది యౌవనగర్వమహోగ్రుఁ డగుచు.118
వ. అతం డెవ్వరిం గైకొనక క్రాలుచుండి యొక్కనాఁడు నారదుం డరుగుదెంచిన
వినతుం డై వీరు లగువారి నడిగిన నమ్మునీంద్రుండు.119
క. యాదవు లుల్లోకభుజ, శ్రీదర్పసమగ్రు లని విశేషోక్తుల నా
వేదించినఁ దత్క్షణ మా, త్రోదిత మగుమత్సరమున నుల్లము వొదలన్.120
వ. [45]శకధరాపాలురును హిమశైలాశ్రితు లగు దస్యులుం దనకు విధేయులు గావున
నందఱం గూర్చి యప్రమేయగజవాజిఖరోష్ట్రంబులు గల నిరవధికసేనాసముద
యంబులతో మధురపైఁ దోతెంచు సమయంబున.121
మ. ధరణీచక్రము గ్రుంగి దిక్కరటిసంతానంబు పై డింద ని
ర్భరభారాతురభోగిరాట్ఫణతతుల్ మ్రగ్గంబడం గూర్మక
ర్పరభేదంబునఁ దూలి బిట్టు సక బ్రహ్మాండముం గంపముం
బొరయన్ దుస్స్థితి నొంద భీభరపరాభూతంబు లై భూతముల్.122
తే. అడవు లడఁచి కొండలమీఁద నడరి యఖిల, వారినిధులను బిండలివండు సేసి
కమలహితు మ్రింగి దెసలఁ జీఁకట్లు గొలిపి, పరఁగె యవనసైన్యోత్థితబహుళరజము.123
వ. అయ్యవనేశ్వరు విడిచలల నశ్వఖరోష్ట్రమూత్రపురీషస్రావంబులవలన సంభూత
యై యశ్విశకృత్తనుసరిత్తు సాగరంబు నధిగమించె న ట్లేతెంచు నభియాతి సైన్యం
బుల పెల్లును బగతుని యద్భుతజన్మంబును నూహించి యూహాపోహవిచక్షణుం
డగు పుండరీకాక్షుం డక్షణంబ బంధువుల నందఱ రావించి యత్తెఱం గెఱింగించి.124
క. ముక్కంటివరంబున మన, కెక్కుడుభయ మావహించె నీతఁ డవధ్యుం
డక్కజుఁడు పగతుఁ [46]డద్దెస, నెక్కొని [47]సిద్ధింప వెట్టి నెఱిఁ గర్జములున్.125
తే. సామదానకర్మములవశంబు సేయ, రాదు దుర్దాంతదోర్దర్పరభసశాలి
కడిఁది బిరుదు కయ్యమునక కాలుద్రవ్వు, నాతఁ డిది యేను నారదుచేత వింటి.126
వ. వీనికి నెదిర్చి పొడిచితిమేనియు జరాసంధుండు మనమీఁద బద్ధవైరుండు కంస
వధంబున నస్మద్విరోధు లగు రాజులందఱు వానివారై వృష్ణివీరులతోఁ బెక్కు
మాఱులు పెనంగినవారు వీరందఱును వచ్చి వీనిం గూడిన జయం బతిదుస్తరం
బగు ముందటి బవరంబునను మనవారు బలుమానుసులు పలువురు మడిసిసవా
రిప్పురంబునన యుండితి మేని నిర్వహింప శక్తులము గాము గావునం దొలంగి
పోవలయు నని నిశ్చయించి యందఱం గదల్చి యనంతరంబ.127
తే. కాలసర్పంబు నొక్కటిఁ గడవఁ బెట్టి, వాయి గట్టి ముద్రించి యవ్వాసుదేవుఁ
డొక్కదూతచే నిచ్చి యయ్యుగ్రరిపుని, పాలి కంతయునదురుగాఁ బనుచుటయును.128
క. చని [48]వాఁడు యవననాథునిఁ, గని ననుఁ బుత్తెంచె నధిప కమలోదరుఁ డా
ఘనతేజు వాక్య మొక్కటి, విను మేర్పడ సావధానవృత్తి యెలర్పన్.129
చ. మిడుతలపిండువోలెఁ గడుమిక్కిలిగా బలుమూఁకఁ గూర్చి యి
ట్లడరితి నీవు దావదహనాకృతిఁ గ్రాలెడుమత్ప్రతాప ము
గ్గడు వగు[49]చంద మేమియును గానవు కాలునికోఱ యూఁదఁగాఁ
దొడఁగుట గాదె నాకు భుజధుర్త సూపఁ గడంగు టెమ్మెయిన్.130
ఉ. ని న్నవలీలఁ బోలె నొకనేర్పునఁ జిత్రము గాఁగఁ ద్రుంచి యి
ట్లున్న భవద్బలౌఘమున నొప్పుగజాశ్వరథోత్తమంబులం
గ్రన్నన నేన యన్నియును గైకొని యేలెద నీసహాయులై
చెన్నెసలారువీరు గతచేష్టత నల్దెసఁ [50]దూలి పాఱఁగన్.131
వ. అనిచె నని పలికి దూత యతనిముందటఁ దనతెచ్చిన సర్పకుంభంబుఁ బెట్టి
కృష్ణుండు కృష్ణోరగదారుణుం డని రోషవిషంబు నిరౌషధం బివ్విధం బెఱుం
గుదో యెఱుంగవో యని దృష్టంబు గావించుటకై యాదవు లివ్విధంబున ఘటి
యించి పుత్తెంచి రనుటయుం గాలయవనుం డేమియు ననక నవ్వుచు.132
క. పెనుజీమలఁ బెక్కిటిఁ జ, య్యనఁ దేరఁగఁ బనిచి యమ్మహాహిఘటములో
నినిచి మగుడ నిజముద్రా, వినిబధ్ధము చేసి పుచ్చె విష్ణునికడకున్.133
వ. ఇత్తెఱం గాలోకించి యాలోకోత్తరవివేకుండు బలీయుం డయ్యు నొక్కరుం
డల్పులు వెక్కండ్రు వొదివినం జిక్కువడుటకు నిదర్శనంబుగాఁ బ్రతిపక్షుఁ
డొనర్చిన యుత్తరంబుగాఁ గైకొని తడయక మధురాపురంబు విడిచి చని.134
చ. జలనిధితీరకాననవిశాలతలంబులఁ బౌరబాంధవా
వళులఁ దగంగ నున్చి యనవద్యవిచారుఁడు పాదచారి యై
వెలయఁగ నొక్కఁడున్ రిపుని వీ డవిశంకతఁ జొచ్చె నమ్మహా
బలుని నిరాయుధుం గని విపక్షులు విస్మయమగ్నచిత్తు లై.135
తే. వీఁడె కృష్ణుఁడు కృష్ణుఁడు వెసఁ బొదువుఁడు
పట్టుఁ డని యెండుఁ గలఁగంగఁబడఁగఁ గాల
యవనుఁ డంతలోఁ దానును నపగతాయు
ధుఁడుఁ బదాతియు నై [51]సముద్ధురతఁ గడఁగె.136
క. చేయీక వాని మొనలకుఁ, బాయఁగ నెలయించి దవ్వు పఱచె నవధ్యో
[52]పాయుఁడు హరి యడుగడుగుం, జేయందినయట్ల యాససేయుచు వీఁకన్.137
వ. ఇ ట్లరిగి తొల్లి మాంధాతృనందనుండు ముచికుందుం డనువాఁడు దేవాసురసమ
రంబున నమరులకయి పెద్దకాలంబు కయ్యంబు సేసి జయం బొసంగి ప్రీతు లగు
నాదితేయులచేత నాత్మశ్రమాపనోదనార్ధంబు సుఖసుప్తిఁ గోరి నిద్రావిఘ్నం బొన
ర్చినవాఁడు తనచూడ్కిన సమయుట వరంబుగాఁ బడసి యొక్కపుణ్యశైల
గుహాంతరంబునం బరార్థ్యతల్పంబున నునికి యఖిలార్థవేది గావున నెఱింగి
యద్దేవుండు.138
తే. అట్టియా[53]లోన కడురయం బారఁ జొచ్చి
యొయ్యఁ దలయంపిదిక్కున నొదిఁగి యుండెఁ
బగతుఁడును వెనువెంటన పాఱుతెంచి
కనియె నిద్రాయమాణు నమ్మనుజనాథు.139
కాలయవనుండు ముచికుందుని రోషానలంబున భస్మీభూతుం డగుట
చ. కని కమలాక్షుగాఁ దలఁచి కైకొన కేపునఁ గాలఁ దన్ని చా
వునకుఁ దొలంగ నిట్టివెరవుం దలపోసి యడంగియున్నఁ బో
వునె వెస లెమ్ము యాదవ యవున్ భవదీయబలంబు గంటి మే
మని ప్రకటాట్టహాసకఠినాకృతితోడ నదల్చి నిల్చినన్.140
క. మేలుకని నిద్ర సెడుటకుఁ, జాలఁగ రోషము జనింప జనపాలుం డా
భీలాలోకనమున బి, ట్టాలోకించి యవనేశు నధికోద్వృత్తిన్.141
క. ఎఱమంట లెగయ నాతని, నెఱుచూ పటు నిలువునంద నీఱుగఁ దరువుం
జుఱవుచ్చుపిడుగుక్రియఁ గను, గిఱిపినయంతటన చేసెఁ గిల్బిషుఁ బగతున్.142
వ. ఇట్లు ముచికుందరోషాగ్నికీలంబునఁ గాలయవనుండు గాలిన నుత్తరక్షణంబున.143
చ. తనపొడ సూపి శౌరి యుచితంబుగ నాతనితోన నిట్లు నీ
యునికి నరేంద్ర మున్న వినియుండుదు నారదుచేత మత్ప్రయో
జన మఖిలంబు నీకతన సాధిత మయ్యెఁ బ్రియంబు నొందితిన్
జనియెద నొందు మీ వతులశాశ్వతశోభనసిద్ధి నావుడున్.144
వ. అమ్ముచికుందుండు మహాత్మా నీ వెవ్వ రిచ్చోటికి వచ్చిన పని యెయ్యది మదీయ
నిద్రకు నంతరాయం బొనర్చినవీఁ డేమి తెఱంగువాఁ డెఱింగింపు మెఱుంగుదేని
నానిద్రించినకాలం బెంత యదియునుం జెప్పు మనిన జనార్దనుం డా జనాధిపున
కి ట్లనియె.145
సీ. అమృతాంశునకు నెనయగ వాఁడు నహుషుఁ డాయనకు నందనుఁడు యయాతి యతని
యాత్మజు లేవుర కగ్రణి యదువు నా నధికప్రసిద్ధుఁ డయ్యతులతేజు
వంశంబునం దుద్భవం బైనపుణ్యుండు వసుదేవుఁ డనఁగ నివ్వసుధఁ బరఁగు
నతనికి దేవకియందు జనించితి రౌహిణేయుం డగురాముననుజుఁ
తే. డనఁగ నెగడుదు వాసుదేవాహ్వయుండ, దేవతాదత్తనరుఁడు మద్రిపుఁ డవధ్యుఁ
డబ్దశతములఁ జెడఁడు నీయలుకఁ గాలెఁ, గాలయవనుం డనంగ విఖ్యాతుఁ డితఁడు.146
వ. నీవు త్రేతాయుగసంభవుండ వగుటయు వింటి నిది కలియుగాసన్నం బగుకాలం
బనిన నతండు గుహాభ్యంతరంబు వెలువడి యల్పప్రమాణదేహులు నల్పవీ
ర్యులు నల్పోత్సాహులు నగునరులచేత నాకీర్ణ యైనబృథివి నాలోకించి
యాత్మీయవంశంబునం బెక్కుతరంబులు గడచనుట యూహించి రాజ్యభోగా
భిలాషం బుడిగి తపం బొనరించు తలంపునఁ బురుషోత్తముం గొనియాడి వీడుకొని
హిమశైలకాననంబు ప్రవేశించె నంత నిక్కడ.147
క. అహితు ననాయాసంబున, నిహతునిఁ గావించి మరలి నిరుపమసత్త్వుం
డహిరిపుకేతనుఁ డాతని, బహువిధసైన్యములమీఁదఁ బడి యవలీలన్.148
వ. ఆత్మేచ్ఛాసముపాగతంబు లైన దివ్యాయుధంబులఁ దదీయముఖ్యుల నెల్ల వధి
యించి యపరిమిత గజతురగరథసముదయంబులం గైకొని యవిలంబితగమనం
బునం జని.149
క. ఆవృత్తాంతము యదువీ, రావలి కెఱిఁగించి ప్రీతు లగువారల నా
నావిధమధురస్థిరవా, క్యావలిచేఁ బ్రియ మెలర్ప నర్చితుఁ డయ్యెన్.150
వ. తదనంతరంబ.151
సీ. కల్యాణదినమునఁ గమలాయతాక్షుండు బలదేవుఁ డాదిగాఁ గలుగు సర్వ
యాదవులను గూర్చి యవ్వసుదేవోగ్రసేనులతోఁ గూడ మాననీయ
భూసురప్రతతిచేఁ బుణ్యాహవాచనం బొనరింపఁ బంచి నెమ్మన మెలర్ప
నందఱుఁ దోడరా నమ్మహాదుర్గమదేశ మంతయుఁ దగఁ దిరిగి చూచి
తే. నిర్ణయించి వారలతోడ నెమ్మి యెసఁగ, నిట్టు లను నే నొనర్చెద [54]నిచటఁ బురము
మీరు దగియెడునెలవులు మెచ్చుగాఁగఁ, గైకొనుం డిష్టమందిరకరణమునకు.152
వ. ఏ నిప్పురంబునకు ద్వారవతి యను నామం బొనర్చితి నిప్పురికిం దగ నాలుగు
వాకిళ్లును సోమవహ్నివరుణేంద్రదైవతంబులు నతివిస్తీర్ణంబులు రాజమార్గ
సమ్ముఖంబులు గావలయు బ్రహవిష్ణుశంకర ప్రముఖదేవతాగారంబులుం జైత్యం
బులం బ్రపలు రమ్యంబులుగా రచియించవలయు రాజమందిరం బతిమనోహరం
బై యుండవలయు నని పలికి శిల్పాచార్యులం గర్మకరులను రావించి యివ్విధంబు
నిఖిలంబు నాజ్ఞాపించిన.153
చ. అనుపమసర్వసాధనసమగ్రతతో శుభవేళ వాస్తుపూ
జనబలిహోమతంత్రములు సద్విధిఁ జేయఁగ సూత్రహస్తు లై
మునుకొని కోవిదస్థపతిముఖ్యులు శిల్పము లుద్యమింప న
ప్పని [55]తనవేగిరంపుఁబ్రియభావనకుం దగి యుండకుండినన్.154
క. వెలివెడలనిజను లిటు దమ, నెలవు లుడిగి వచ్చి యిచట నిగ్రహపడఁగాఁ
దలఁపునకు మున్న యిండ్లున్, దలకొనఁగా వలదె యనుచుఁ దలపోసి తగన్.155
శ్రీకృష్ణుఁడు విశ్వకర్మను రావించి ద్వారవతియనుపురంబు నిర్మింపం బనుచుట
క. ఏకాగ్రచిత్తుఁ డై హరి, యాకమలోద్భవతనూజు నద్భుతవిజ్ఞా
నాకల్పు విశ్వకర్మఁ ద్రి, లోకీనుతు సుజనభజనలోలుఁ దలంచెన్.156
ఆ. తలఁపునకుఁ బ్రియంబు దనబుద్ధి [56]నెలకొన, నాక్షణంబ పంకజాక్షుపాలి
కరుగుదెంచి వినయ మలరార నిట్లని, దివిజశిల్పి పలికె దియ్య మెసఁగ.157
మ. నిను నుద్దామకుతూహలోత్తరునిఁగా నిక్కం బెదం గాంచి చ
య్యనఁ బుత్తెంచెఁ బురందరుం డధిప నాకద్వతాధీశ్వరుం
డును విశ్వేశ్వరుఁ డైనఫాలనయనుండున్ భక్తి నేభంగి న
ర్చనకుం బాత్రము లీవు నట్టుల కదా సంభావనాయుక్తికిన్.158
వ. ఎయ్యది కర్తవ్యం బానతి యిచ్చి పనుపు మనిన నవ్వాక్యం బభినందించి దేవకీ
నందనుం డతని నత్యాదరంబున నాలోకించి.159
చ. సురలకుఁ గల్పభూరుహము చొప్పునఁ గోరినకోర్కు లన్నియుం
గురియుదు వీవు నీతప మగోచర మిట్టి దనంగ నీకు నె
వ్వరు సరి సర్వశిల్పవిభవంబునయందు సమర్ధమెందున
చ్చెరువు భవత్ప్రభావము ప్రసిద్ధము గాదె సురేంద్రపూజితా.160
వ. అట్లు గావున.161
శా. నామాహాత్మ్యనిరూఢి కెంతయుఁ దగ న్నాకంబునం దింద్రువీ
డేమై నొప్పగు నట్లు భూతలమునం దెల్లం బ్రకాశిల్ల మ
త్సామర్థ్యంబునకుం ద్రిలోకములు నాశ్చర్యంబు నొందంగ ని
చ్చో [57]మాకొక్కపురం బొనర్పుము కళాసూత్రంబు చిత్రంబుగన్.162
చ. అనవుడు నాతఁ డిట్లను మహాత్మ భవత్ప్రియ మెట్టు లట్ల యే
ననుపమశిల్పకల్పన మనర్ఘ్యముగాఁ [58]బచరింప నోపుదు
న్విను మిటు లున్నయీజనుల [59]విప్పు గనుంగొన వచ్చినం బురం
బున కిచ టిమ్ము చాల దనుబుద్ధి జనించె గణించి చూడుమా.163
తే. జలధి యొక్కింత యెడయిచ్చి చనియెనేని, సర్వలోకాతిశాయిగా సంఘటింప
వచ్చుఁ బట్టణ మన విని వాసుదేవుఁ, డట్ల కాకని యాప్రొద్ద యధికనియతి.164
వ. ఆసరిన్నాథుఁ బ్రార్థించినం దతార్థనానురూపంబుగా నతం డతిబహుళపవనో
ద్ధూతసలిలుం డై నలుదెసలం బండ్రెండుయోజనంబులు గలుగ నెడయిచ్చి
పోయిన నవ్వారిజేక్షణునకు నవ్వారిరాశి చేసిన సత్కారంబునకుం బ్రియం
బందుచు [60]బృందారకవర్ధకి గోవర్ధనధరుచేత ననుజ్ఞాతుం డై యప్పుడ నిజవిద్యా
ప్రభావంబున.165
సీ. కనకంపుపెనుగోట వినువీథి గడవంగ మణిగోపురములు సమగ్రములుగ
బంధురప్రాసాదపఙ్క్తులు నుత్తుంగహర్మ్యరేఖలు మనోహరత నలర
రాజమార్గం బభిగ్రామంబుగాఁ బణ్యపదము లుజ్జ్వలశిల్పభంగి నమర
నమరసద్మములుఁ జైత్యంబులు సభలును బ్రపలు నపూర్వంపురచన మెఱయఁ
తే. దోరణాట్టాల[61]కంబులు తోరములుగఁ, గూపదీర్ఘికాసరసులు కొమరు మిగులఁ
గృతకపర్వతోద్యానంబు లతులములుగ, బరగుపురము నిర్మించె నచ్చెరువు గాఁగ.166
వ. ఇట్లు విశ్వకర్మచేత మానససృష్టి నుత్పాదిత యై ద్వారావతి యన మున్న
యన్నారాయణుచేత నాకారిత యై రమ్యాకార యగునమ్మహాపురి నభినవానేక
విచిత్రరచనాచతురం బగు రాజమందిరంబు నయ్యాదవేంద్రుం డధిష్ఠింప నఖిల
యాదవులు నుచితస్థానంబులు గైకొని నిలువం బ్రభూత[62]హస్త్యశ్వరథసంకీ
ర్ణయుఁ బ్రసిద్ధనరనారీ(సం)చరణ[63]శోభినియుఁ బ్రకృష్టకల్యాణక్రియాకల్యయుఁ
బ్రవృద్ధసంపక్సంపూర్తికలితయు నై శరత్సమయసముదితేందుతారక యగుగగన
వీథియు వసంతవిభవవిస్ఫుటోల్లాస యగు నుద్యానభూమియు జలదసమాగమో
త్తుంగతరంగసలిల యగు సలిలాశయశ్రీయును నుపమానపాత్రంబులుగా నుల్ల
సిల్లెఁ దదనంతరంబ.167
క. హరిచే నభిపూజితుఁడై, సురవర్ధకి దివికి నేఁగి సురపతి కాత్మా
చరణం బెఱిఁగించి తదా, దరమున నత్యంతధన్యతముఁ డై యుండెన్.168
వ. ఇక్కడఁ గమలనాభుం డొక్కనిశాసమయంబున నిజజనకుమందిరంబునం దుండి
యంతర్గతంబున.169
చ. తలఁచినయట్ల యెంతయు నుదాత్తతరం బగు [64]నాస్పదంబు పెం
పలరఁగ నిట్లు నాదగుజనావళికిన్ సమ[65]కూరె నింక ను
జ్జ్వలభవార్థసంపదల సంభరితం బగుజీవనంబు వీ
రల కొడఁగూర్తు నాదయినప్రాభవ మప్రతిమాన మై చనన్.170
వ. అని యూహించి శంఖనిధి నాహ్వానంబు చేసిన నది యాక్షణంబ నిజరూపంబుతో
నేతెంచి యద్దేవుముందటఁ బ్రాంజలి యై నిలిచి.171
క. పని యేమి కరుణతో ననుఁ, బనుపుము యదునాథ భువనబాంధవ నీ నె
మ్మనమునకు మెచ్చు పుట్టఁగ, నొనరించెద ననినఁ బ్రియరసోత్కటుఁ డగుచున్.172
వ. దేవకీనందనుం డన్నిధానదేవతం గనుంగొని.173
ఉ. ద్వారకలోనఁ గల్గుజనవర్గము లెల్లెడ సౌఖ్యపూరితా
గారములై యెలర్ప నిజగౌరవముం [66]బచరింపు మేను నా
వారలయందు దీనుఁ గృశవైభవు సౌఖ్యవిహీనుఁ జూడఁగా
నేర దరిద్రుఁడున్ మృతుఁడు [67]నిక్కము తుల్యుల కారె ధారుణిన్.174
తే. లేదు పెట్టవే యనుచును లేబరంపుఁ, బలుకు దనప్రజలో వినఁబడియె నేని
నింతకంటె మిక్కిలి ధరణీశ్వరులకు, నెద్ది యవమాన మది మాన్పు మిపుడు నీవు.175
చ. అనుడు [68]మహాప్రసాద మని యన్నిధి యప్పుడ యేఁగి తోడియ
య్యెనిమిదిపెన్నిధానముల కిం పెసలారఁగ దేవదేవుశా
సన మెఱిఁగించి వైశ్రవణుసమ్మతితోఁ జనుదెంచి విస్ఫుర
త్కనకపురాసు లై [69]యెసఁగెఁ గంసవిమర్దనుపట్టణంబునన్.176
ఉ. ఎక్కడఁ జూచినన్ సిరికి నిష్టవిహారపథంబుగాఁ గరం
బక్కజ మైన సంపదల నందిరి తత్పురవాసు లెల్ల నే
చక్కటి నిర్ధనత్వ మనుశబ్దము [70]లోనుగ మానె లోకము
ల్మిక్కిలి మెచ్చ నయ్యనుపమేయచరిత్రుని చిత్రకృత్యముల్.177
శ్రీకృష్ణుడు వాయుదేవునిచేత సుధర్మయను దేవసభ ద్వారకకుఁ దెప్పించుట
వ. అమ్మహాతుండు మఱియు నొక్కతఱిఁ దండ్రియింటికడన యుండి యేకాంతం
బునం దలంచి వాయుదేవు రావించి ప్రణతుం డగునతని నాలోకించి యి ట్లనియె.178
మ. బలధౌరేయతలందు నీకు సరి చెప్ప న్నీవ కా కెవ్వరుం
గలరే యన్యులు గంధవాహ భువనఖ్యాతంబు నీవిక్రమం
బలఘుస్ఫూర్తియుతుండ వట్లగుట నాయాజ్ఞ న్ముహూర్తంబులో
వలయుం జేయఁగ నొక్కకర్జ మతులవ్యాప్తి ప్రదీప్తోద్ధతిన్.179
వ. అది యెయ్యది యంటేని.180
సీ. యాదవు లధికధర్మాచారధీరులు భూరివైభవు లు[71]పభోగరతులు
కొలదివెట్టఁగ రానిబలగంబు గలవారు గావున వీర లొక్కట సుఖార్థ
మంచితగోష్ఠీవిహారంబు గామించి యుండెడునప్పటి కొండు తెఱఁగు
రచన లేవ్వయు[72]ను సురుచిరము ల్గా వద్రిఘాతికి నావిశ్వకర్మచేత
తే. నధికతపమున నిర్మిత యై సుధర్మ, యనఁగఁ బరఁగిన సభ నిర్జరాధినాథు
ననుమతంబున నస్మదీయాజ్ఞఁ జేసి, యనఘ కొనివచ్చి యిమ్ము నెయ్యమున మాకు.181
ఉ. నా విని యట్ల కా కని మనం బలరం బవమానుఁ డఫ్టు
వావలిపాలికిం జని బలానుజు పంపు బలాహితుండు సం
భావన చేసి చేకొన సుపర్వులు నెమ్మది సమ్మతింప వే
వే వసుధాతలంబునకు వేడుకఁ దెచ్చె సభానికేతమున్.182
వ. ఇట్లు తెచ్చి సుధర్మను ధార్మికపూజితుం డగుపయోజనాభున కిచ్చి సమీరుండు
నిజేచ్ఛం జనియె నమ్మహాసభవలన యాదవు లాదిత్యసములును యాద
వేంద్రుం డధరీకృతేంద్రుండును యదునివాసంబు సురావాసంబును నను
[73]ప్రశంసనంబు సమర్థం బై యుండె మఱియు.183
మ. భువిఁ బాతాళమున న్దివిన్ జలధుల న్భూభృత్తుల న్వెండియున్
వివిధస్థానముల న్శుభంబు లయి భావింపంగ నేమేమి వ
స్తువిశేషంబులు దోఁచె నయ్యఖిలమున్ సొంపారఁ దెప్పించి మా
ధవుఁ డర్థిం గయిసేయ నొప్పెఁ బురి కాంతాతుల్య యై యెంతయున్.184
వ. ఇట్లు నగరం బనన్యసామాన్యధన్యతావిభవంబు నొందించి బాంధవుల నసాధా
రణకారణగౌరవోదారులం గావించి యీవిశ్వేశ్వరుండు మఱియుం బ్రకృతు
లకును బౌరశ్రేణులకును సముచితంబుగా మర్యాదలు నిరూపించి బలాంగచతు
ష్టయప్రవర్ధనోపాయంబు లుపపాదించి బలాధ్యక్షుల నిర్ణయించి.185
సీ. రా జుగ్రసేనుఁ డై రాజిల్లఁ దాను దీర్పరితనం బెంతయుఁ బ్రభుతతోడ
నడపువాఁడయ్యె సన్మాన్యుఁ గాశ్యపుఁ డనువిప్రుఁ బురోధ గావించె మంత్రి
వరు వికద్రుం డనువానిఁ బ్రతిష్ఠించె యదువంశవరుల నత్యధికమతుల
నఖిలకార్యంబులయందుఁ బదుండ్రు వృద్ధుల నధికారదీప్తులుగ నునిచి
తే. నతిరథోత్తము దారుకు నాత్మరథము, గడప సారథిగాఁ జేసి కడిఁదివీరు
నస్త్రవిద్య ద్రోణాచార్యునంతవాని, [74]సకలయోధముఖ్యుఁడుగ సాత్యకి నొనర్చి.186
వ. ఇవ్విధంబున విధేయంబు లగు సంవిధానంబు లన్నియు నొక్కటం గొరంతవడక
యుండ నిర్వర్తించి తనశాసనంబున వృష్ణికులైశ్వర్యం బనపహార్యంబుగా
నమ్మహనీయతేజుం డపరాజితశౌర్యంబున విభ్రాజితుం డై సంతసిల్లె నని వైశం
పాయనుం డొనర్చిన యుపన్యాసంబు పరిస్ఫుటోల్లాసంబుగా.187
మందాక్రాంతవృత్తము. కాంతాశేషక్షితితలభుజాకాంతకాంతాజయంతా
చింతారత్నోదయసమగుణస్ఫీతసమ్యగ్వినీతా
దాంతానంతద్విజకులహితోదార్యగాంభీర్యధుర్యా
కాంతారాంతర్గమితవిమతక్ష్మాపదీప్తప్రతాపా.188
క. బహుజలధిద్వీపాంతర, మహీశ్వరప్రహీతకనకమణిమౌక్తికహ
స్తిహయాద్యర్పణసేవా, బహుమతమల్లరధినీశభక్తిప్రీతా.189
మాలిని. అగణితగుణరత్నా హారిధర్మప్రయత్నా
జగదభినుతభోగా సత్యనిత్యానురాగా
మృగపతిసమశౌర్యా మిత్రనేత్రాబ్జసూర్యా
విగణితభయలోభా విశ్రుతైశ్వర్యలాభా.190
గద్యము. ఇది శ్రీశంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానందసౌందర్య
ధుర్య శ్రీసూర్యసుకవిసంభవ శంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయనామధేయ
ప్రణీతం బైన హరివంశంబున నుత్తరభాగంబునందు ద్వితీయాశ్వాసము.
- ↑ యిట్లు వోయి పిమ్మట నాతఁ డెట్టు
- ↑ వెడలఁగరాక
- ↑ పూజ్యులై
- ↑ నేడింట
- ↑ సమ్భూప
- ↑ నడరంట
- ↑ కయ్యంపునేల విడిచి
- ↑ దోఁగుటయు
- ↑ నొప్పుతోన యలుక యొసంగిన
- ↑ దునిమె
- ↑ హయరథంబులు
- ↑ పాతనంబుల
- ↑ వెలి
- ↑ మూర్తీభవించె ననందగి
- ↑ సమ్ముఖంబున
- ↑ నొక్కబీరమున; నొక్కరూపమున.
- ↑ రెల్ల జాడల
- ↑ నడుతల
- ↑ మెదడులు
- ↑ ప్రభావములు
- ↑ నవియించు
- ↑ పాడిగా
- ↑ మిగిలి
- ↑ సువిశ్చితమ్ముగ
- ↑ గోపిక లొదవికొనంగా
- ↑ ఘోషవృద్ధు
- ↑ కంసునిఁ బరిమార్చి కరి నడంచి
- ↑ వార
- ↑ మదంబు
- ↑ వేగమ రావో
- ↑ బగు
- ↑ బాయుఁ
- ↑ గాక యని
- ↑ వేషము నెంతయు
- ↑ యొనరిచి
- ↑ మొందు నపారయస్మదీ
- ↑ యనుపమానవిశేషంబు లాదరమున
- ↑ నివసించె
- ↑ యగుచుండు
- ↑ గర్గుం డనంగ
- ↑ నడవి పండ్రెండేండ్లు నది
- ↑ లోహచూర్ణాశినిర్విషమోహబుద్ధి.........లోపబుద్ధి
- ↑ డుఘన
- ↑ నంతఃపురంబున
- ↑ శకదరదపారదులును (సం. ప్ర.)
- ↑ డట్టిఁడ
- ↑ సంధింప
- ↑ యతఁడు
- ↑ నంద మేమి
- ↑ జూచి
- ↑ యనుద్ధురత
- ↑ పాయంబున
- ↑ గోత్రగుహ రయమార; లాగ తగ రయమార.
- ↑ నీపురంబు
- ↑ గని
- ↑ కెలయంగ
- ↑ మాకు న్నగరం
- ↑ బ్రసరింపు
- ↑ వేగఁ గడుం బరికించినం
- ↑ దేవ
- ↑ కేతువుల్
- ↑ గజతురగ
- ↑ శోభిత
- ↑ నాలయంబు
- ↑ కూర్చితింక
- ↑ బ్రసరించు
- ↑ నిక్కమ
- ↑ అనిన
- ↑ యెలసె
- ↑ లారఁగ, లూనఁగ.
- ↑ సద్భోగ
- ↑ గావు రచిరంబుగా వృత్ర
- ↑ ప్రశంసనంబునకుఁ దగియుండె
- ↑ నఖిల