హరివంశము/ఉత్తరభాగము-ప్రథమాశ్వాసము

హరివంశము

ఉత్తరభాగము - ప్రథమాశ్వాసము

     పరిణతభుజవైభవ
     గోపాయితభువనజగదగోపాల ధరి
     త్రీపాలన నుతసద్గుణ
     నైపుణ [1]ధౌరేయ ధీర నాయకవేమా.1
వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె నట్లు మధుమధనండు మధురా
     పురంబున మధురం బగురాజభారంబు గైకొని గోకులనివాసవ్యాసంగం బంత
     రంగంబునకు వింతయై తోఁప నింపారుస్నేహబంధబంధురప్రవర్తనంబు కీర్తనీ
     యంబుగా నుల్లసిల్లె నాసమయంబున.2
ఉ. సింధురవైరిశౌర్యుఁడు ప్రసిద్ధయశః[2]పటికావృతాష్టది
     క్సింధురవక్త్రుఁ డిద్ధరణకృత్యుఁడు రాజగృహేశుఁ డాజరా
     సంధుఁ డరాతిరాజపరిషత్పరిసేవిత[3]బంధనుండు గ
     ర్వాంధుఁ డవంధ్యరోష[4]కుసుమాన్వితదర్ప మహీరుహుం డిలన్.3
వ. ఆస్తిప్రాస్తినామధేయ లయిన కంసభార్య లిద్దఱుఁ దనకూఁతులు గావున వారికి
     నైనవైధవ్యదైన్యంబు నత్యంతదుస్సహం బగుటయుఁ గృష్ణుపరాక్రమంబు
     సహింపక సర్వసర్వంసహాచక్రంబునం బరఁగు రాజుల నందఱం గూర్చి యిరువది
     యొక్క యక్షౌహిణులసంఖ్య గల సైన్యంబులతోడ మధురపై నెత్తి చనుదెంచి
     యమునాతీరంబున విడిసి.4

జరాసంధుఁడు మధురపై దండెత్తివచ్చి కృష్ణునొద్దకు దూతలఁ బంపుట

క. విందానువిందు లనఁగా, నెందును బేర్కనినవారి నిరువుర భూభృ
     న్నందనుల నవంతీశుల, నొందఁగ దూతలుగఁ గృష్ణునొద్దకుఁ బనిచెన్.5
వ. పనుచుటయు వారు నరుగుదెంచి యదుసభామధ్యంబున మహనీయనృపాసనా
     సీనుం డై యున్న యుగ్రసేనుం గని తత్పార్శ్వంబున బలభద్రసహితంబుగా
     నుచితపీఠోపరిదేశంబునఁ బొలుపారు పురుషోత్తముం గాంచి యి ట్లనిరి.6
మ. జననాథాగ్రణి సత్యసంధుఁడు జరాసంధుండు గోవింద ని
     న్ననుమానింపక యాడు మన్నతెఱఁ గే మారాజువాక్యంబుగా
     నొనరం బల్కెద మల్క లేక వినుమా యొక్కింత యీయుగ్రసే
     ననరేంద్రుండును సర్వయాదవవితానంబు వినం బెంపునన్.7

సీ. నీవును నన్నయు లావరులయి పేర్చి కంసుని దెసఁ జేయఁగలుగువారిఁ
     జంపి యాతని ననుజసమేతముగ సమయించితి రమ్మనుజేశ్వరుండు
     ఘనుఁడు నాయల్లుఁడు గాదిలికూఁతులు విధవలై శోకాగ్ని వేఁగుచుండ
     నింతకాలంబును నే నశక్తుఁడనుగా నుండితి బిడ్డలయొప్పుచూడ
తే. వలసి యాయితపడి యిదె వచ్చినాఁడ, మసఁగి నినుఁ గూల్ప కకట యిమ్మధురలోన
     జొరఁగవచ్చునె నీనిజపరికరంబు, కడఁక యొప్పొరఁ గొని వేగ వెడలు మనికి.8
క. నీకొండె బ్రతికియుండుట, నాకొండెం గాక గోపనందన విను మీ
     లోకంబున నిద్దఱకును, నేకసమమ వృత్తి [5]పొసఁగునే యిటమీఁదన్.9
తే. నిక్క మొకయాఁటరియు నొకనీరుదొత్త, యొక్కగాడిద యొకకోడి యొక్కగుఱ్ఱ
     మని తలంపకు నను విలుప్తారిగంధుఁ, డగుజరాసంధుఁడుగ నింక నరసికొనుము.10
మ. ఎదురై నిల్వఁగ నోపితేని సమరోదీర్ణస్ఫురద్బాహుసం
     పద సొంసారఁగ నన్నదమ్ముల మిముం బ్రాణంబులం బాపుదుం
     బదిలం బేది తొలంగితేని దివియుం బాతాళమున్ లోనుగాఁ
     దుది నీచొచ్చినచోటఁ జొచ్చి కృతకృత్యుం జేయుదున్ మృత్యువున్.11
క. దామోదర నిన్ను దక్కఁగ, నే మీయాదవులఁ గొందునే చీరికి నీ
     వేమియుఁ జెప్పకు వారల, సామర్థ్యంబును దదీయసాహాయ్యకమున్.12
మ. గురు నయ్యానకదుందుభిన్ సఖుని నక్రూరున్ భుజారంభసం
     భరితుం దమ్ముని సాత్యకిం బ్రియముతోఁ బాటించి నాచందముల్
     వరుసం దెల్లముగాఁగ నీ వడుగు మే వత్తున్ ససైన్యుండనై
     పురసంరోధ మొనర్ప రేప కడఁకం బూరింపు ముత్సాహమున్.13
వ. ఇవి తదీయవచనంబు లనిన విని కృష్ణుండు నవ్వుచు నవ్విందానువిందులతో మీరు
     సముచితంబుగా నతనిమాట లుగ్గడించితి రిప్పలుకులకు సంతసిల్లితి నే నిమ్మాటల
     వాఁడఁగాను నాపలు కొక్కటియ యది యతనితో ని ట్లనుఁడు.14
మ. తనయల్లుం బొరిగొన్నవాఁడ నిటమీఁదన్ సైతునే యుక్కునం
     దనుమర్దింపగ నేన రాఁ గడఁగుచోఁ దా వచ్చె మేలయ్యెఁ జ
     య్యన రానిమ్ము సగర్వదుర్విషహబాహాశక్తి మున్ రాక్షసాం
     గనచే నందదుకైనయయ్యొడలు చెక్కల్ వాపెదం గ్రమ్మఱన్ .15
తే. కంసుఁ బొరిగొని తద్రాజ్యఘనవిభూతి, యెట్టు లియ్యుగ్రసేనున కిచ్చినాఁడ
     నట్ల యిత్తు[6]ను సుతునక యతనిఁ గూల్చి, యధికమాగధరాజ్యసమగ్రగరిమ.16
క. అని యా రాజతనూజుల, ఘనతరసత్కారపూర్వకంబుగ వీడ్కొ
     ల్పినఁ బోయి యవ్విధము క్రమ, మునఁ జెప్పిరి వారు మగధభూపాలునకున్.17

వ. ఇక్కడ నఖిలయాదవులు నుగ్రసేనవాసుదేవసహితంబుగ జరాసంధభయార్తు
     లయి కార్యచింతనంబునకుఁ దొడంగునెడ నయ[7]కళానిర్నిద్రుం డగువికద్రుం
     డనుయదువృద్ధుండు వారల నందఱ వినుం డని కృష్ణున కి ట్లనియె.18
మ. యదువంశంబున నంబుజోదరమునం దా బ్రహ్మయుంబోలె నీ
     వుదయంబొంది సమ స్తయాదవభయవ్యుచ్ఛేదదక్షుండ వై
     త్రిదశేంద్రాదులమంతనంబులును బుద్ధిం గాంతు నీదృష్టి య
     భ్యుదయాపాదిని మాకు నీవసమ యీయుత్సాహసన్నాహముల్.19
క. అపరిమితనృపసహాయుఁడు, కపటోపాయుఁడు గఠోరకర్మనిపుణుఁ డా
     రిపుఁ డతని నీవ యనిమొన, నపజితుఁ గావించుటకు సమర్థుఁడ వనఘా.20
వ. కంసుండు బలగర్వితుం డై తనకు నెదురు లే దని యెవ్వరిం గైకొనక కోట పాటిం
     పమిం జేసి వప్రద్వారసంక్రమపరిఘాయంత్రాట్టాలకంబు లయ్యైప్రయత్నంబు లెడలి
     యసంస్కారంబు లై యాయుధంబులును ధనధాన్యాదులును సంగ్రహింపంబడక
     యిప్పురంబు దుర్గం బని నమ్మరాక యున్నది. అదిరిపాటున వచ్చి పగతుండునుం
     గదియవిడిసె నడరిపొదివె నని దిగులుసొచ్చి లోపలివా రెవ్వరుం దలసూపకున్న
     నిది గోలుపోయిన యదియ రాష్ట్రంబునుం ద్రొక్కుడువడి చెడిపోవు నింక
     నొక్కటి సెప్పెద.21
క. విను దక్షిణాపథంబున, వనజేక్షణ తనరు ఋక్షవంతము వింధ్యం
     బును సహ్యము ననఁగాఁ గల, యనుపమశైలములు బహుగహనసంకటముల్.22
వ. తొల్లి ముచికుందుండు పద్మవంతుండు సారసుండు హరితుం డను పేళ్లంగల యదు
     వంశభూపతులు నలువురు వైరిభయనివారణార్థంబుగా నమ్మహాగిరులయందుఁ
     గావించినదుర్గంబు లనేకంబులు గలవు పడమటిసముద్రంబులోని దీవులును బహు
     విధంబు లానలువురురాజులకుం బెద్దవాఁ డైనమాధవుం డీమధురాపురంబు
     పాలించినవాఁడు దీని నలవరించుట యివ్వేళకు లాగుపడ దిప్పటికి నవ్యదుర్గ
     సమాశ్రయంబు వలసినయది యేను గార్యంబుజాడ గొంత యెఱింగించితి దీనికిం
     దగిన తెఱంగు నీవును విచారించి యెయ్యది వెర వవ్విధంబు నిర్వహింపు మనిన
     వికద్రు వాక్యంబు లాకర్ణించి కృష్ణుం డి ట్లనియె.23
క. ఇది యట్టిద నీ చెప్పిన, సదభిమతోదారఫణితి సర్వము వింటిన్
     మదిలోనఁ గంటి దీనికి, నొదవంగ నుపాయ మొకటి యూహించి తగన్.24
ఉ. ఏనును నన్నయుం దడయ కిప్పురి వెల్వడి పోయి యాజరా
     సూనుఁడు దత్సహాయులును జూడఁగ దక్షిణదిక్కు వోవఁగాఁ

     బూనెద మేము లేకునికి పొల్పుగఁ గాంచి యతండు సేనయుం
     దానును గోట[8]ముట్టడము దక్కి వెసం జనుదెంచు మాబడిన్.25
తే. [9]వినుము విజయంబు గోరెడుమనుజవిభులు
     తమకుఁ బ్రతివీరుఁ డైనశాత్రవుఁడు దప్పి
     చనిన నతనిన కాని తజ్జనులఁ దొడర
     నొల్ల రఫలంపుఁ [10]బెనఁకువ యొప్ప కునికి.26

రామదామోదరులు మధురాపురంబు విడిచి జరాసంధుఁడు వెనుకొన దొలంగిపోవుట

వ. ఇట్టియుపాయంబున నేము నీ చెప్పిన వింధ్యాదిమహీధరంబుల మీఁదటిదుర్గం
     బులు గైకొని బలసి మగధపతి వచ్చినను లావు మెఱసి కయ్యంబు సేసెదము
     శాత్రవుండును జిత్రగహనాంతరంబులం జేయునది లేక చిక్కువడంగలవాఁడు
     నామతంబునఁ బురజవంబులుఁ గులంబువారును రాష్ట్రనివాసులు నలజడింబడక
     బ్రతికెద రనిన నివ్విధంబునకు నఖిలయాదవులు నియ్యకొనిన బలరామ
     దామోదరులు నిరాయుధహస్తు లై పురంబు నిర్గమించి యశంకితమతి నజ్జరా
     సంధుపాలికిం జని సమ్ముఖంబున నిలిచి.27
క. నానాదేశంబుల బలు, మానుసులం గూర్చి నీవు మగధేశ్వర యే
     పూనిక నిటవచ్చితి చెపు, మా నిక్కము నిర్వహింతు మప్పని యేమున్.28
చ. అనుటయు నన్నరేంద్రుడు మహాబలవంతులు గాఁగ నిద్దఱన్
     విని మిము నాజిలోఁ దొడరి విక్రమశౌండత సూపు టొక్కఁడుం
     బనియుఁగ నేను వచ్చితిని బద్ధసముద్యములై కడంగుఁ డిం
     క నిహతశత్రుఁడై మరలుఁగాక జరాసుతుఁ డూర కేగునే.29
క. అని పలికి సముద్ధతిఁ బటు, ధనువు రయం బెసఁగఁ గొని శితప్రదరంబుల్
     నినిచిన నిషంగ[11]యుగ్మం, బనువుగ ధరియించి కవచితాంగం బమరన్.30
వ. నిలిచిననయ్యోధపుంగవుం గనుంగొని సంభ్రమం బేమియు లేక తొలంగి
     యయ్యదుకుమారులు సమదమాతంగసమగమనంబున దక్షిణాభిముఖు లై చనం
     దొడంగి రిట్లు చని రాష్ట్రంబులు పురంబులుఁ బెక్కులు గడచి వింధ్యాటవీభాగంబు
     దఱిసి ఋక్షవత్కాననాంతరంబుల మెలంగి యట సహ్యశైలంబునడవులు
     సొచ్చి యందు.31
మహాస్రగ్ధర. కని రాపాతాళమూలక్షతశిఖరిశిఖాకల్పితోత్తుంగతీర
     ధ్వనితో[12]త్పన్నానుబద్ధోద్ధతబహులహరీదర్శనీయప్రవాహన్
     వనహస్తిధ్వస్తశాఖివ్రజగహనమహావ ప్రసంప్రాప్తభేద
     స్వన [13]దంతర్వాశ్శకుంతన్ వరతటినిఁ బటువ్యాప్తనిర్వేణ్యవేణ్యన్.32

సీ. అడవి యెల్లను దాన యైనది యన నమేయము లగు సంప్రరోహములు గలిగి
     యాకు లెల్లను దాన యైనది యన నెందుఁ బరఁగిన బహువిటపములు గలిగి
     యవని యెల్లను దాన యైనది యనఁ దన నీడ నొప్పారెడు నెలవు గలిగి
     యభ్ర మెల్లను దాన యైనది యన బహుపక్షిసంశ్రయ మైన పఱపు గలిగి
తే. పక్వఫలసాంద్రవర్ణసంపన్నిరంత, రంబు నిర్మేఘసురధనుర్వైభవంబుఁ
     జూపుచును నద్భుతోదయస్ఫురితమహిమఁ, దనరు నొక్కమహావటతరువుఁ గాంచి.33

శ్రీకృష్ణబలరాములు పరశురామునిం గని తమరాక యెఱింగించుట

వ. వివిధసంస్కారశోభితం బగు తదీయస్థలంబున ననేకద్రవ్యంబుల జంద్రార్ధశేఖరు
     నంబికానాథు నాదిదేవుం ద్రిలోచను నర్చించుచుఁ దదాసక్తచిత్తుం డై బహు
     పరిజనంబులు మనోజ్ఞవస్తువులం బరమబ్రాహ్మణసముదయంబుల కభిమతా
     హారంబు సంఘటింప నొక్కదెసం గట్టిన సవత్సయగు సుపుష్టహోమధేనువుం
     బార్శ్వంబులం బొలుపారు స్రుక్స్రువారణికమండలువులు నిత్యసత్కృతుల
     వెలుంగు హుతహుతాశనుండును నంతికస్థలంబుల మహాధనుస్తూణీరకృపాణ
     పరశ్వథాద్యాయుధంబులును నద్భుతంబు లై బెరసి బ్రహ్మక్షత్రమయం బగు
     తేజంబు దెలుప నుదయార్కబింబసుందరదేహుం డగు తనకు వికీర్ణకపిలజటా
     వళులు ప్రత్యగ్రమరీచు లయి రుచియింప జపావసానంబునం గర్ణావసక్తం
     బయిన యక్షుసూత్రంబును లలాటలసితంబు లగు భసితత్రిపుండ్రలిఖితంబులుం
     జంద్రాంశునిర్మలంబులగు యజ్ఞోపవీతంబులు నున్నతాంసగ్రథితం బగు మృగా
     జినోత్తరీయంబును ననవరతనియమకృశం బగు శరీరంబు భూషింపఁ గుశబ్రుసీ
     రూపం బగు దీపికాసనంబున నాసీనుం డై యున్న జామదగ్న్యమహాముని
     నంతంత నాలోకించి యయ్యిద్దఱు నాశ్చర్యభరితమానసు లగుచుఁ జేర నరిగి
     తదీయచరణంబులు దమశిరంబులు సోఁకం బ్రణామంబు లాచరించి కృష్ణుండు
     ప్రాంజలి యై యతని కి ట్లనియె.34
మ. [14]తగువిద్వద్గుణరూపశోభితునిఁ గా ధన్యంబు లై యెవ్వనిం
     బొగడున్ లోకము లట్టి సంయమికులాంభోరాశిపూర్ణేందునిన్
     నిగమైకేశ్వరు నే మెఱింగితిమి నిన్ శ్రీజామదగ్న్యుండుగా
     నగణీయంబులు నీప్రభావములు భవ్యంబుల్ సుధీసేవ్యముల్.35
క. అమ్ము మొన నబ్ధితరఁగలు, రమ్మన నెడగలుగఁ ద్రోచి [15]కాదే యిలుప
     ట్టిమ్ములఁ బడసితి యీస, హ్యమ్మునఁ బశ్చిమధరిత్రి యపరాంతమునన్.36
ఉ. పావనవిక్రమోదయవిభాసితశీలఁ గృతార్థబుద్ధివై
     నీ వొసఁగంగ సర్వధరణీవరర క్తజలోజ్జ్వలాంజలుల్

     ద్రావను డిగ్గఁద్రోవను మతం బొకఁ డేర్పఱుపంగనేరమిం
     దావకపూర్వవంశసముదాయ మెలర్పక యున్నె [16]నివ్వెఱన్.37
తే. మాతృ[17]కంధరాదళనసమర్థ మైన, పరశు వఖిలపార్థివవంశపాటనమునఁ
     బరఁగె నేమని[18]యెద నీప్రభావగరిమ, రైణుకేయ యౌదార్యసంగ్రహవిధేయ.38
వ. ఏము యమునానదీతీరగోచర యగు మధుర యను పురి నివాసంబుగా నుండు
     దుము యదువంశతిలకం బగు వసుదేవుపుత్రులము బలదేవవాసుదేవనామధేయు
     లము కంసభయంబున మాతండ్రి మముం బుట్టినయప్పుడ గోపకులంబునం బెంపం
     బెట్టనం బెరిఁగి చిక్కనివారమై [19]కంసునిం దునిమి తదీయరాజ్యం బతని జనకు
     నక యిచ్చితిమి కంసుం జంపినకతంబున జరాసంధుండు మామీఁద ననేక
     సైన్యంబులం గూర్చి యెత్తివచ్చినవాఁ డతం డెరుంగం బురంబు వెలువడి
     యకృతాస్త్రులము గావున నతని కెదుర [20]నలవిగాక చులుకనఁ గాల్నడ నింతదూ
     రంబు వచ్చితిమి మా కెయ్యది కర్తవ్యంబు వాఙ్మాత్రంబున నీకుం జేయ సుకరంబు
     నిన్నుఁ జేరితి మనుగ్రహించి పంపు మనిన నాభృగువంశ[21]వర్యుం డయ్యదు
     కులోత్తమున కి ట్లనియె.39
ఉ. కారణమానుషత్వమునఁ గంసుఁడు లోనుగ దుష్టదైత్యులం
     టే రడఁగించుపొంటె నిటు పృథ్వి జనించినవాని నాదిపం
     కేరుహనాథుఁగా నెఱిఁగి కృష్ణ యజస్రము నిన్నుఁ జూడఁగాఁ
     గోరుదు నేఁడు నాకు సమకూరె మనోరథసిద్ధి యంతయున్.40
క. వినుము జరాసంధుకతం, బున నిప్పుడు మీకు నైన పోరామియు మీ
     రనఘా యిట రాకయు మదిఁ, గని వచ్చితిఁ జూవె మేలు [22]గావించుటకున్.41
వ. భవదీయం బగు దక్షిణాపథయానం బెఱుంగుం గావునఁ బ్రత్యర్థియు మీవచ్చిన
     తెరువునన సర్వసహాయసమేతుం డై యేతెంచుఁ గయ్యం బవశ్యంబునుం గలుగు
     సృగాలవాసుదేవుం డనియెడువాని యేలెడుభూమి కరవీరపురం బనం దదీయ
     నివాసం బనతిదూరంబు మీ రియ్యెడ నుండవలవదు జరాసంధు జయింప నను వైన
     దుర్గం బొక్కటి గలదు మీకు నది యంతయుం జూపి మిమ్ము నచట నుంచి
     వచ్చెద నిది దత్ప్రకారంబు వినుఁడు.42
సీ. వేణ్యాభిధాన యై వెలసిన యిమ్మహా[23]తటిని యీరేవునం దాఁటిపోయి
     క్రూరకర్ములు మహాచోరులు, చక్రగిరి చూచి యొకవిభావరి ప్రియమున
     నచ్చోట వసియించి యవల ఖడ్గగ యను నేటితీరమున సమిధ్ధతపము
     గావించ మునుల నిష్కాముల దర్శించి యలక్రౌంచపురి గని యందుఁ జొరక
తే. యానరుహ మనుతీర్థమ్మునందు విడిసి, రేప కొంతద వ్వరిగి యుద్దీపితాగ్ర
     మైనగోమంత మనుశైల మనఘ కాంతు, మది మహాదుర్గ మేకశృంగాన్వితంబు.43

క. అమరుల కైనదురారో, హము కాంచనరత్నమయమహాతటముల న
     య్యరకమహీధరసమరుచి, నమరు నమేయప్రభావ మది మధుమథనా.44
సీ. అక్కజం బౌనట్టి యమ్మహానగము నుదగ్రశృంగముఁ బ్రాఁకి యచటనుండి
     చూచినఁ జంద్రుఁడు సూర్యుండుఁ దారలు నుదయాస్తమయముల నొందునెలవు
     లనతిదూరంబు లైనట్లుండు [24]బెరసి యంతర్ద్వీపసహితమై తగఁ బయోధి
     గానఁగ నగు నందుఁ గడువేడ్క మీ రుండఁ జనుదెంచి యాజరాసంధనృపతి
తే. శైలయుద్ధకోవిదులును సారబలులు, నయినమీతోడి పెనఁకువయందు వెరవు
     సాల [25]కపజితుఁ డై పోవు సర్వభంగి, నధికజయసిద్ధి యగు మీకు ననఘులార.45
వ. మఱియు నమ్మహాసమరంబునఁ జక్రశార్ఙ్గంబులు గౌమోదకి యను గదయు సౌనంద
     సంవర్తకంబు లను ముసలలాంగలంబులును సన్నిహితంబు లయ్యెడు నాత్మీయంబు
     లగు పురాణదివ్యరూపంబులు ధరియించి (మీరు) వైరులకు భయంకరు లయ్యె
     దరు యాదవులకు మాగధపురస్సరు లగు ధరణీపతుతోడ రణం బగు నని
     మున్ను దేవాదేశంబు గలదు. గావున భూభారావతరణంబునకుఁ గారణం బగు
     భారతరణంబు నీవ ప్రవర్తింపఁ గాలక్రమంబునం గాఁగలయది యనిన భృగు
     సూనుభాషితంబులకుఁ బరితోషంబు నొంది రమ్మహాతేజుండు [26]మున్నుగా మూఁ
     డగ్నులుంబోలెఁ బ్రదీప్తు లై కదలి కతిపయప్రయాణంబుల నరిగి ముందట.46

శ్రీకృష్ణబలరాములు పరశురామసహితంబుగా గోమంతంబుం జేరుట

క. ధీమంతు లంతఁ గాంచిరి, గోమంతము విపినకుసుమకుంచితశబరీ
     సీమంతము నిర్ఝరకణ, హేమంతము గనకమణిమహీమంతంబున్.47
క. [27]ఆమద్రీంద్రునిశిఖరం బాయతభుజావధికరయసమగ్రతఁ బక్షీం
     ద్రాయితగతి నెక్కి యొకమ, హీయస్స్థలి నెలవుగాఁగ నింపెసలారన్.48
వ. ఉన్నంత జమదగ్నినందనుండు గోవిందు ననేకవిధంబుల స్తుతించి యనంతరంబ
     యి ట్లనియె.49
క. ఇదె కొండ యిందు రమ్మని, ముదమున నొకనెపము పెట్టి మునిసుతు లగుమీ
     హృదయము వడసితిఁ గేశవ, యిది యించుక తలఁపుమయ్య యెప్పుడుఁ గరుణన్.50
మ. భువనక్షేమనియుక్తికై యదుకులాంభోరాశిపూర్ణేందువై
     భవ మొప్పార జనించి మానుషకృతిం బ్రచ్ఛన్నమై నైజభూ
     తివిశేషం బిల నల్పబుద్ధులకు బోధింపంగ [28].రా కిట్టు లు
     న్నవిభు న్నిన్ను భజించుధీరులు గడున్ ధన్యుల్ సరోజేక్షణా.51
తే. వైనతేయునిఁ దలఁపుము వాహనంబుఁ, [29]గేతువు నతండునై నీకుఁ బ్రీతిసలుపు
     నప్రమత్తుల రగుఁ డింక నావిపక్షుఁ, రాకఁ దెలిపెడు బహునిమిత్తాకలనము.52

వ. ఏను బోయి వచ్చెద నని పరశురాముండు పరమసౌహార్దలాభప్రముదితుం డై
     ప్రమోదమధురహృదయు లగు నాసదయశరీరులు సగౌరవంబుగా వీడ్కొలుప
     నిజస్థానంబునకుం జనియె నట్లు జామదగ్న్యుం డరిగిన యనంతరంబ.53
శా. శ్వేతశ్యామశరీరు లాబలుఁడు రాజీవాక్షుండుం దద్దయుం
     జేతోమోద మెలర్పఁ దన్నగమహాశృంగంబునన్ రిక్తపూ
     ర్ణాతివ్యక్తపయోధరద్వయమున ట్లయ్యైప్రదేశంబులన్
     జాతౌత్సుక్యమనస్కులై మెలఁగి రిచ్ఛాకల్పితక్రీడలన్.54
సీ. కిన్నరమిథునోపగీతకుంజంబులు పంచాస్యహుంకృతిస్ఫారగుహలు
     చారణద్వంద్వసంచారచారుస్టలంబులు మధుపాఘ్రాతపుష్పలతలు
     గంధర్వదంపతీక్రాంతనిర్ఝరసైకతములు మాద్యత్కుంభిదళితతరులు
     సిద్ధకుటుంబసంసేవ్యసానువులు సారసవధూభుక్తసరస్తటములు
తే. లోనుగాఁగ నపూర్వవిలోకనీయ, భూము లాలోకనీయవిస్ఫూర్తిఁ జేయ
     [30]నెలమి నయ్యిద్దఱును జరియించుచుండ, వరుసతోఁ గొన్నిదివసంబు లరుగుటయును.55
వ. ఒక్కనాఁడు బలదేవుం డొక్కరుండు నొక్కయెడ వనవిహారఖేదంబు నొంది
     ఘర్మాంతసమయసంపుల్లమంజుమంజరీకరందమదకకలరోలంబకదంబకం బగు కదంబ
     కంబు గని తదీయతటంబున.56
మ. సెలయేఱు ల్గడలొత్తం జేయుచు లతాసీమంతినీనర్తనం
     బులు గల్పించుచు మత్తబర్హిరుతముల్ పొల్పొందఁగా జేయుచున్
     వలనై కాననమారుతంబు దనకు వాంఛానురూపంబుగా
     నలఘుస్వేదవినోదనం బొసఁగఁగా నాసీనుఁడై యిమ్ములన్.57
తే. పెల్లుగాఁ దృష యొదవినఁ బెదవు లెండ, నమ్మహీరుహమధురసం బాత్మఁ గోరి
     కొమ్మ దిగువంగ నపుడు తత్కోటరమున, నధిక[31]దీప్తిగంధోత్కటవ్యాప్తి యగుచు.58
వ. కదంబజాత యగుటం గాదంబరి యనుపేర నతిమనోహర యగురసధార దొరఁగినం
     బ్రియంబు మిగుల నది యాస్వాదించి యమ్మహాప్రభావుండు.59
క, మద మొయ్యన యెక్కఁగఁ గెం, పొదవెడు[32]నేత్రములు ఘూర్ణితోజ్జ్వలములుగా
     బొదలఁగ నంగములు వివశ, హృదయుండై యున్నయెడ సమాహితభంగిన్.60
వ. మదిరాదేవి సాకారయై ముందర నిలిచి కేలు మొగిచి యి ట్లనియె.61
చ. అమృతముతోడఁ దొల్లి వరుణాత్మజనై జనియించి వారుణీ
     సముచితనామధేయమున సర్వమునం బెనుపొందు నాఁటికా
     లమునను నీకుఁ గాంతనయి మానితవిక్రమ నేఁడు దండ్రిపం
     పమరఁగఁ బూని యిచ్చటఁ బ్రియంబున నిన్ను వరింప వచ్చితిన్.62

మ. మధుమాసంబునఁ గేసరస్తబకసమ్యఙ్మాధవీమంజరీ
     మధునిష్యందము లాత్మగాఁ బరఁగి రమ్యం బైనమేఘాగమా
     వధి నుత్ఫుల్లకదంబగుచ్ఛతతు [33]లావాసంబుగాఁ బేర్చి స
     న్మధురామోదవికాసినై సరసతామౌగ్ధ్యంబునం గ్రాలుదున్.63
తే. తొంటిసంగతి దలఁచి నీతోడనాడు, [34]వేడ్క సుర్వితలంబున వెదకి వెదకి
     యిప్పుడు తృషనొంది యున్నని న్నెఱిఁగి కాంచి, నా తెఱం గెల్లఁ జెప్పితిఁ బ్రీతి నధిప.64
క. ననుఁ గైకొని నేఁ డాదిగ, ననురాగముతో సుఖింపు మటుగాకయు నొం
     డని త్రోచితేని విరహం, బున కేమియు నోర్వ నేను భూరివివేకా.65
వ. అనియె ననంతరంబ మఱియు నొక్క మానిని యమ్మహామనస్కునకుం బొడ
     సూపి వినతాంగి యై నిలిచి.66
మ. విను మేఁ గాంతి యనంగఁ జంద్రునికడన్ విఖ్యాతనై యుండుదున్
     నిను నాశీతమయూఖుకంటె ఘనుఁగా నిక్కంపు[35]జూ పొప్పఁగాఁ
     గని ప్రేమంబునఁ బొంద వచ్చితిఁ దగం గైకొమ్ము లోకాతిశా
     యిని నీయుజ్జ్వలమూర్తి నీకు నెనయే యెన్నంగ నేమూర్తులున్.67
క. అని పలుకఁగ వేఱొకకా, మిని గ్రక్కునఁ [36]దోఁచి కేల మిక్కిలికాంతిం
     దనరువనజదామం బా, యనయఱుత నమర్చి విరచితాంజలి యగుచున్.68
వ. దేవా యేను రత్నాకరతనూభవ నైన లక్ష్మిని నే నిప్పుడు సాక్షాత్పుండరీకాక్ష
     మూర్తి వైన నీపరిగ్రహం బపేక్షించి వచ్చితిం గారుణ్యంబున నన్ను ననుగ్ర
     హింపుము.69
సీ. బాలార్కమండలపరిభాసి యైనది యిదె రత్నమయసముదీర్ణమకుట
     ముజ్జ్వలవజ్రసమున్నతి నెంతయుఁ గొమరైనయవి మణికుండలములు
     కమనీయనీలతాకలితంబు లైనవి యివె నూత్నేకౌశేయకవసనములు
     ధవళమౌక్తికశోణతరళశోభిత యైనయది యిదె విస్ఫారహారయష్టి
తే. యబ్ధిజాతంబు లిన్నియు నాదియందు, ననఘ నీసొమ్ము లిప్పు డింపారువేడ్క
     నోలిఁ గైసేయవలసినవేళ గాన, యాచరించి భజింపు మత్ప్రార్థనమున.70
క. అన విని బలదేవుం డ, వ్వినుతద్రవ్యంబు లెల్ల వేర్వేఱ ప్రియం
     బునఁ గైకొని యమ్మువ్వురు, వనితలు దనమూర్తిఁ జెంది వశమున నిలువన్.71
వ. అత్యంతశోభాసమధికుం డై యాక్షణంబ కదలి కమలాక్షుపాలికిం జనియె
     నాసమయంబున.72
సీ. [37]అంభోధితో సుప్తుఁ డైననారాయణుదివ్యకిరీటంబు దితిజుఁ డొకఁడు
     వైరోచనుం డనువాఁ డెత్తుకొని[38]పోవఁ జొప్పునఁ జని మహాశూరవరుఁడు

     వైనతేయుఁడు వోరి వాని భంజించి యమ్మేటివస్తువు గొని మింటిమీఁదఁ
     జనుదెంచుచును [39]మహాశైలశృంగస్థితు నయ్యాదవేంద్రు నింపమరఁ గాంచి
తే. యతనిమౌళి యనాసాద మగుట సూచి, యాతఁ డేమి యీతం డేమి యనుచు భక్తి
     నొయ్య నది యం దమర్పఁగ నొప్పిదంబు, కరముమిగిలె నద్దేవు నాకారమునకు.73
వ. దానికి సంతసిల్లి సర్వార్థవేది యగు నయ్యారిమజన్ముం డగ్రజన్మునకుం దత్ప్ర
     కారం బెఱింగించి గరుడుని భక్తియుక్తికి నుపలాలించి యి ట్లనియె.74
శా. నీకు న్నాకు నలంక్రితక్రియాకలనముల్ నెమ్మిం బ్రయోగించి యు
     త్సేకం బిమ్మెయి నావహించు టరయన్ సిద్ధంబు కార్యార్థులై
     నాకావాసులు వేగిరించెదరు నానావైరిభూనాయకా
     నీకధ్వంస మొనర్చి మాన్పవలయున్ వేగంబ భూభారమున్.75
వ. ఇవ్విధంబున కనుకూలంబుగా నిప్పుడు.76
సీ. అదె పేర్చి వీతెంచె నంబుధరధ్వానశంఖారవోరునిస్సాణరవము
     లదె కాననయ్యెడు నతిసాంద్రసంధ్యాపిశంగసర్వంసహాచలితరేణు
     వవె యుల్లసిల్లెడు నాతపత్రదుకూలసం[40]చలితోజ్జ్వలోచ్ఛ్రయపతాక
     లవె క్రాలుచున్నవి వివిధసైనికకరాకల్పితాయుధమయూఖవ్రజంబు
తే, లాజరాసంధుఁ డస్మదీయానుపథము, నందు సకలభూనాథసైన్యప్రతతులఁ
     గొనుచు నిట వచ్చెఁ గ్రూరమై ఘోరమృత్యు, వకట పెక్కండ్రఁ గేరించునయ్య యిట్లు.77
క. మనమును సన్నద్ధులమై, పనివడి ప్రత్యర్థిచేత వార్చి నిలుత మిం
     దనుచుండ నొకముహూర్తం, బున మిన్నును దెసలు నొక్కమోతగఁ బెలుచన్.78

జరాసంధుఁడు సైన్యంబులతోడఁ గృష్ణబలరాము లెక్కిన పర్వతంబు చుట్టి విడియుట

మ. కరియూథాచలఘోటకోర్మి [41]రథకౌఘద్వీపయోధాంబుని
     ర్భరశస్త్రాస్త్రతిమింగిలప్రకరఘోరంబై నృపానీకసా
     గర ముప్పొంగి కడంగి వచ్చి సముదగ్రం బైనయాశైలముం
     బరివేష్టించెను మేరువుం బొదువుకల్పచ్ఛేది తోయంబనన్.79
వ. అమ్మోహరంబుల కన్నిటికి ముంగల యై జరాసంధుసేనాపతి యేకలవ్యుం డతి
     వ్యగ్రం బగు [42]సమరోత్సాహంబున నుగ్రుం డై యే నొక్కరుండన గోపాల
     బాలుర నిద్దఱం దునిమి తూఁటాడెద నెవ్వరు నేల యని యేలికముందటఁ బంతం
     బులు పలుకుచు నలఘుస్యందనంబునం దమందమార్గణబాణాసనకృపాణాదిపరి
     కరంబులు నతిశయిల్ల విజృంభించె నంత.80

తే. బలములన్నియు విడియంగఁ బనిచి జతన, పఱిచి విభ్రమించినఁ పదపడి నృపాలుఁ
     డఖలభూపాలవరులఁ బ్రియంబుతోడఁ, బిలిచి యుత్సాహవిభవగాంబీర్య మెసఁగ.81
వ. ఇ ట్లని యాజ్ఞాపనం బొనర్చె.82
సీ. ఎక్కుఁడు వలనైనయెడ లడ్డగించినచఱుల నుగ్గడఁపుఁడు సక్కఁ బ్రాఁక
     రానితిప్పలు [43]చొరఁ ద్రవ్వుఁ డీఱము లైనమ్రాఁకులు మట్టలు మ్రగ్గఁ బొడువుఁ
     డెదిరి పైకొని మీఁద నెవ్వఁడుఁ దలసూప[44]కుండంగ దివము బాణోత్కరములఁ
     గప్పుఁ డీఁటెల సెలకట్టియలను [45]వ్రేయుఁ డొడిసెలకాండ్రను నొడ్డుఁ డెందు
తే. నేల మన కింకఁ దడయఁగ నిన్నగమున, నున్నవారు యాదవు లని విన్నవార
     మిచటి మృగపక్షు లాదిగా నెల్ల మనకుఁ, బగఱ పొరిగొనుఁ డత్యుగ్రభంగి దోఁప.83
వ. మద్రపతియును గాళింగుండును జేకితానబాహ్లికులును గాశ్మీరవిభుం డగు
     [46]గోవర్ధనుండును గారూశుం డగు ద్రుముండును బార్వతేయులుం బర్వతపశ్చిమ
     దిగ్భాగం బెక్కువారు పౌండ్రుండును వేణుధారియు వైదర్భు డగు శ్రాముం
     డును భోజనాథుఁ డగు రుక్మియు దానవశ్రేష్ఠుం డగు సూర్యాక్షుండును
     బాంచాలేశ్వరుం డగు ద్రుపదుండును నవంతినాయకు లగువిందానువిందులును
     దంతవక్త్రపురమిత్రులును మాత్స్యుం డగు విరాటుండును గౌశాంబిమాళవులును
     భూరిశ్రవుండును ద్రిగర్తుండును గ్రథకైశికపంచజనులును శైలంబు నుత్తర
     పార్శ్వంబు బ్రాఁకువారు, కేరళుం డగు నులూకుండును నేకలవ్యుండును
     బృహత్క్షత్రజయద్రధులు నుత్తమోజుండును సాళ్వకౌశికులును విదిశాధీశుం
     డగు వామదేవుండును భూభృత్పూర్వప్రదేశం బాక్రమించువారు, దరదతుంది
     చేది రాజసమేతుండ నై యేను ధరణీధరంబు దక్షిణకటకంబు [47]తలద్రొక్కెద,
     వీరు వా రన వలవదు గదలను [48]గునపంబుల ముసలంబులం గొండఁ దుమురుసేసి
     నేఁడ కృతకార్యుల మై మరలుద మనిన జరాసంధువచనంబులు విని శిశుపాలుం
     డి ట్లనియె.84
మ. విపులోత్తుంగశిలావిటంకముల నావిర్భూతదుర్భేదపా
     దపగుల్మావలులన్ సురాదుల కసాధ్యం బిమ్మహాదుర్గ మీ
     నృపసింహు ల్బహువాహనంబులపయిన్ విశ్రాంతి వాటించువా
     రపథవ్యాప్తిఁ బదప్రచారములఁ జేయన్ శక్తులే యిగ్గిరిన్.85
క. పెక్కండ్రము గల మని యి, ట్లుక్కునఁ జొరఁబడుట నీతియు నుపాయముఁ గా
     దక్కజ మగు దైవబలం, బెక్కుడు బాలు రనవచ్చునే యాదవులన్.86
తే. [49]దుర్గ మొదవినయప్పుడు దురముచేఁత, కంటె రోధించి యుండుట కరము లెస్స
     తడవుగా నున్నపగతురు తమకుఁ దార, నిక్కముగఁ [50]జెడుదురు కూడు నీరు లేక.87

వ. ఇప్పటికి నొక్క వెరవు దోఁచినయది యిక్కొండచుట్టు నగ్ని దగిల్చి కాల్చుట
     మేలు సహాయవిరహితు లై యొందిలిపడి యునికింజేసి వసుదేవనూనులు దీనికిం
     బ్రతివిధానంబు నేరక యూరక చిక్కుపడుదు రనిన చేదిపతిమతంబు మహీపతుల
     కందఱకు సమ్మతం బగుటయు మగధపతియు నవ్విధంబున కియ్యకొనియె నంత.83

జరానంధుఁడు రామదామోదరు లెక్కిన పర్వతంబును గాల్చుట

ఉ. ఎండినమ్రాఁకులుం బొదలు నీఱపుఁగ్రంవలు దెచ్చి చిచ్చు లొం
     డొండ నమీరువచ్చుదెస నొడ్డినవంకగ వైచి పైపయిన్
     నిండఁగఁ గట్టెలుం గసపు నెక్కొనఁ ద్రోచుచు సైన్యచారు ల
     క్కొండ గలంతంయుం జిఱుతక్రోవితెఱంగునఁ గాల్పఁ జొచ్చినన్‌.84
వ. తోడ్తోన పేర్చి యుల్లసితార్చి యగు నర్చిష్మంతుండు కార్చిచ్చుజాడలఁ గలయం
     జమరుచు సర్జసల్లకీగుగ్గులుకోటరంబుల వెడలుచు సుగంధిధూమోద్గారంబు
     లొదవించుచుఁ గాంచనరజతతామ్రఖనుల బెరసి బహువర్ణస్యందంబులఁ
     బ్రవర్తింపుచు నిర్ఝరంబులు సోటి జలజజలచరజాతీయంబుల నెరియించుచు
     వప్రక్రియాపరిణతంబు లగు వారణంబుల నుదారదారుణవిస్ఫులింగసమువదయం
     బులఁ బొదువుచు నుజ్జ్వసలజ్వాలంబులు సటలు నుద్దీప్తాంగారకంబులు దంష్ట్రలు
     నుద్ధూతధూమంబులు కేసరంబులు [51]నుద్భాసితోల్కలు దృష్టిపాతంబులు నై
     యపూర్వమృగేంద్రునిచాడ్పునం జకితకేసరిత్యక్తంబు లగు కందరంబులు
     దూఱుచు లేలిహ్యమానంబు లగుచు ధరాధరంబున నాభీలవ్యాళంబులపోలిక
     నాలుకలు గ్రోయుచు నాయతశిఖల నఖిలశాఖాశిఖాసంచయంబులం బెనంనొని
     యెల్లతరువులకు నొక్కింతనేపు చందనద్రుమసామ్యంబు సంపాదింపుచు సానుస్థలం
     బులం దిరుగుజలధరంబులఁ గరంచి అదీయంబు లగు తొయశీకరంబుల నెడనెడ
     బొనుఁగుపడియుం బడక తదంతర్గతంబు లగు విద్యుదశనితేజంబులు దనలోనన
     కలపికొని ప్రబ్చి నిబ్బరంబుగాఁ బెరుఁగుచు ధరణీధరమణికటకంబులకుం జెంది
     యందుఁ బొదలు పావకునితోడి సాహచర్యంబున నతిధుర్యత్వంబు గని కలయ
     నశేషశిలాసంఘాతంబులు సితచూర్ణరాసు లై తొరుఁగ నిగుడుచు శరభపక్షం
     బులుం జమరవాలంబులు బర్హిబర్హంబులుం గమర శబరీకబరీభరంబులు భస్మకణ
     ధూనరంంబులు నేయుచు వివిక్తాసను లగు సంయమిజనులకు సమాధిబాధ యొన
     రించి తనరుచు విశృంఖలవిహారంబుల నేపారుసిద్ధవిద్యాధరమిథునంబుల నుద్వేగ
     విఘటితభ్రాంతవిద్రుతంబులం గావించుచు నెగయు పొగలు గగనక్రోడపీడనం
     బులు నై నిగుడ వైమానికమానినీవిలోచనంబులకు నశ్రుకాలుష్యంబు గలి

     గించుచు నధికభయదసంరంభంబున విజృంభించె నంత నెల్లదెసలను దందహ్యమా
     నంబు లగు వివిధజీవంబుల యాక్రోశనాదంబులుం బగిలి కూలుగండశైలంబుల
     చండధ్వనులు నార్ద్రశుష్కదారుగుల్మావలీవేణువలయంబుల చూత్కారచిమచి
     మాయితచ్ఛటచ్ఛటారావంబులు నుద్దామదాహదుర్లలితం బగు దహను పేర్మికిం
     జెలంగి యార్చుమహీశ్వరమహావ్యూహంబుల యుత్సాహకోలాహలంబు
     నూర్ధ్వాండంబులు నిండి యొండొండ సమస్తభువనరాసులకు సంత్రాసంబు
     పుట్టించె నాసమయంబున.90
ఆ. కాననంబు లెల్లఁ గాలిన ననిమిషేం, ద్రాస్త్రవహ్ని నెఱక లంతవట్టు
     మాఁడి మ్రోడువడినమాడ్కి [52]రూపఱెను గో, మంతపర్వతంబు మనుజనాథ. 91
క. పాతాళమునకు డిగి యీ, యాతతశైలంబు వ్రేళ్లు లన్నియు భస్మీ
     భూతములు సేయ కుడుగునె, యీత వ్రాగ్ని యని తలఁకి రెడఁదల సురలున్. 92
వ. అమ్మహాదహను దరికొల్పి దాహభయంబునం బార్థివబలంబు లన్నియు నర్థ
     క్రోశం బపక్రాంతంబులై చూచుచుండె నట్టియుపప్లవం బాలోకించి నీలాంబరుం
     డంబుజోదరున కి ట్లనియె.93
సీ. మాధవ చూచితే మనకారణంబున నిన్నగేంద్రున కెంత యెగ్గు వుట్టె
     గిరి కైనయాపద పరిహరింపఁగ లేక యివ్విధంబున నీవు నేను నూర
     కుండితి మేని నిం కొండెద్ది గల దింతకంటెను నపకీర్తికరము ధరణిఁ
     గానఁ బరార్థదుఃఖక్షముఁ డున్నతిశాలి యిమ్మహనీయశైలపతికి
ఆ. ఋణము నీగుపొంటె నిప్పుడ యీజరా, సంధుఁ గిట్టి పట్టి సమదబాహు
     బల మెలర్పఁ గష్టపఱిచెద నీకు మె, చ్చుగ నొనర్చువాఁడఁ జూడు నన్ను.94
మ. అనలం బిట్లు తగిల్చి తారు సమరప్రారంభసన్నాహులై
     జననాథుల్ బహుదేశవాసులు మహాసైన్యావళీకల్పనం
     బొనరం బేర్చినవారు నేఁడ విను మీయుర్వీతలం బెల్ల ని
     ర్మనుజేంద్రంబుగఁ జేయ కెట్లుడుగు నస్మత్కోపసంరంభముల్ .95

శ్రీకృష్ణబలరాములు గోమంతమునుండి సైన్యమధ్యంబునకు లంఘించుట

వ. అని పలికి యాక్షణంబ యాక్షిప్తమణికుండలుండును నాకంపితమణికిరీటుండును
     నాందోళితనీలాంబరుండును నాలోలవనమాలావలయుండును నగుచు వాసు
     దేవాగ్రజుం డన్నగాగ్రంబుననుండి రాజన్యమధ్యంబునకు లంఘించినం దోడన
     చూడారత్నరోచులు సెదరం బీతవాసోంచలంబు చలింప శ్రీవత్సలాంఛనశ్యామి
     కలు గడలొత్త నుదాత్త[53]స్మితమరీచు లుల్లసిల్ల నుత్ఫుల్లకమలనయనుం డగుచుఁ
     గమలనాభుండు నుఱికె నయ్యిద్దఱ బెట్టిదంపుఁ ద్రొక్కునం గ్రుంగఁబడి గోమంత

     మహీధరం బహీలోకగతం బగు సలిలంబు వెలిఁ బేర్చి తొప్పఁదోఁగె నివ్విశే
     షంబువలన విద్వేషికృతం బగు దహనోపప్లవంబు ప్రశాంతం బయ్యె నప్పుడు.96
తే. మందరాద్రులు రెం డొక్కమాటుపడిన, కొలఁది కగ్గలముగ బిట్టు గలఁగుజలధి
     పోల్కి రామకృష్ణాపాతభూరివేగ, సంక్షుభిక మయ్యెఁ బార్థివసైన్య మెల్ల.97
వ. అంత.98
క. బాహుప్రహరణు లై యతి, సాహసికులు యదుకిశోరసత్తములు రిపు
     వ్యూహశతంబుల నత్యు, త్సాహంబునఁ గూల్చు డద్భుతం బయ్యె నృపా.99
వ. ఆసమయంబున నమ్మహానుభావుల విక్రమంబుల కనుగుణంబులుగా నమరప్రేర
     ణంబున.100
మ. చనుదెంచెన్ దివినుండి యాయుధము లాశ్చర్యప్రభాధుర్యముల్
     ముని గీర్వాణపరంపరావిహితసమ్మోదంబు లున్మాదిహృ
     ద్దనుజేంద్రక్షతజార్ద్రరూపములు మాద్యద్భూతబేతాళకీ
     ర్తనకల్యాణవిధిప్రసిద్ధబహుసంగ్రామంబు లుద్దామముల్.101
వ. అమ్మహాసాధనంబులకుం దగునట్లుగా వారికిం బూర్వంబు లగు నిజదివ్యాకారం
     బులు నుదారంబు లై పొందె నప్పుడు సుదర్శనశార్ఙ్గకౌమోదకీనందకంబులు
     గోవిందుండును సౌనందసంవర్తకంబులు సబాణబాణాసనంబులుగా బ్రలంబ
     వైరియుం బరిగ్రహించి రనంతరంబ యనంతాంశసంభవుండు సంరంభవిజృంభితం
     బగు బాహుమండలంబు చండశస్త్రోజ్జ్వలం బై దంష్ట్రాకరాళం బగు [54]ఫణివక్త్రంబు
     కరణిం దేజరిల్లఁ గడంగి.102
ఉ. చీఁదఱ రేఁగినట్లు రిపుసేనల నెల్లను ముట్టి రోఁకట
     న్మోదుచు నాఁగటం దిగిచి నొంచుచుఁ గార్ముకముక్తబాణముల్
     పైఁ దొరఁగించి కూల్చుచును బొదహతి న్నలియంగ ద్రొక్కుచున్
     లోఁ దళుకొత్తు వీరరసలోలత మోమల[55]రం జరింపఁగన్.103
మ. హరియున్ శార్ఙ్గవినిర్గతాస్త్రహతి నుద్యచ్చక్రపాతంబులం
     గరవాలప్రవిదారణంబుల మహాకౌమోదకీఘాతని
     ర్భరతం గ్రౌర్యము సూపఁగాఁ గరము సంత్రాసంబునం దూలె మో
     హరముల్ రాజసమాజముల్ దిరిగె నత్యంతంబు సంభ్రాంతితోన్.104
వ. ఇట్లు సమరపరాఙ్ముఖు లయి తనవెనుక కొదిగినవారిం జూచి జరాసంధుం
     డి ట్లనియె.105
తే. వాహనము నెక్కి కైదువువలను మిగులఁ, బట్టి మొనతల నెంతయు భయరసంబు
     గదిరి [56]పట్రించు నృపులకుఁ గలుగు భ్రూణ, హత్యఁబోలుపాపం బని రాదిమునులు.106

క. గోపాలురు వీ రిరువురు, భూపాలురు పలువు రుగ్రభూతరబలా
     టోపసమగ్రులు మీ రీ, చాపలమున కోర్చి యొదుఁగఁజనునే [57]యిచటన్.107
ఉ. ఇంచుక నెమ్మనమ్ముల సహించి రణమ్మున [58]నిల్చి నన్ను వీ
     క్షించుచు నుండుఁ డేమియును గీడును బొందఁగ నేను మిమ్ము
     క్రించుల యాదవాన్వయులఁ గేలియపోలె ధనుర్విముక్తని
     ర్వంచితసాయకాగ్ని కనవద్యహవిస్సులు గా నొనర్చెదన్.108
వ. అనినం గలంక దేఱి యందఱుఁ గ్రమ్మఱ నుత్సాహంబు పాటించి
     మూఁకలం బ్రయత్నంబునం బురికొల్పి యాత్మీయంబు లగు వాహనశస్త్రాదుల
     నాయితంబుగా సమకట్టి కేతుచ్ఛత్రచామరప్రముఖలక్షణంబులు మెఱయ
     భేరీపణవాదివాదిత్రంబులమ్రోఁతతో బెరసి గజబ్బంహితంబులు రథనేమి నిర్ఘో
     షంబులుం దురంగహేషితంబులు భటసింహనాదంబులు రోదసీభేదనప్రచండంబు
     లుగా నుద్దండరభసంబున బలదేవవాసుదేవులం బొదివి.109
క. శరచక్రతోమరంబులు, [59]గురిసియుఁ గరవాలపరశుకుంతాదుల న
     చ్చెరువుగ వ్రేసియుఁ బొడిచియు, నరనాథులు ఘోరరణ మొనర్చిరి కడిమిన్.110
వ. అట్టి కోల్తల సైరించి కులగిరులపోలికి నప్రకంపు లై నిలిచి యదువీరులు దారుణ
     సంరంభంబునఁ గోపప్రతాపంబులు సూపి దీపించిన భూపసైన్యంబులయందు
     ముసలవిచ్ఛిన్నకుంభంబులు సీరదారితవంక్షణంబులు నై తూలుశుండాలంబులును,
     చక్ర[60]నికృత్తకంధరంబులుఁ గృపాణదళితదేహంబులు నై పొలియు హయంబు
     లును, నిపాతితరథికంబులు హతసారథికంబులు నై తెరలి పాఱుతేరులును,
     సాయకహతశరీరులు హుంకారస్ఫారస్ఫుటితమానసులు నై సొలయు పదాతులు
     నగుచుఁ బ్రత్యర్థిబలంబు కష్టదశం బొందం గీలాలజలాశయంబులం బలలకూట
     కృత్రిమాద్రుల మేదోనిచయతల్పంబుల నుజ్జ్వలాంత్రహారంబుల నాయత
     స్నాయుమేఖలలఁ గీకసవలయకంకణంబులఁ గపాలచషకంబుల గాత్రచ్ఛేదోప
     దంశంబుల మజ్జామదిరాపూరంబులఁ గంకాళవీణలఁ గబంధనటనంబుల గోమాయు
     విరుతగానంబుల నాజిరంగంబు జమునివిహారదేశంబును మండనస్థానంబు నాపాన
     భూమియు సంగీతస్థలంబును నను శంక నుత్పాదించుచుఁ గంకగృధ్రకలకలంబుల
     భూతబేతాళడాకినీవిహరణంబుల నతిరౌద్రం బయ్యె నిట్లు శాత్రవసహస్రంబులం
     బరిమార్చి నలుదెసల నొదుఁగురాజులం గనుంగొని కమలనాభుం డెలుంగెత్తి
     వారి కి ట్లనియె.111
ఉ. ఎక్కుడుఁ బేర్మి వాహనము లెక్కినవారు బలంబు పెక్కువం
     బెక్కురణంబులం గడిఁదిబీరము చూపఁగఁజాలువారు మీ

     రక్కట చన్నె యిట్లు వసుధాధిపులార పదప్రచారతం
     దక్కొని యున్నమ మ్మిచటఁ దార్కొనలేక తొలంగి తూలఁగన్.112
మ. [61]అనికిం దారికి తోడు తెచ్చుకొని మి మ్మడ్డంబుగా నొడ్డుచుం
     దన మై సోఁకక యుండఁగాఁ దిరిగెడున్ దవ్వై జరాసంధుఁ డి
     ట్లనిమిత్తంబు నశింప నేమిటికి మీ కారాజు నాత్తాపరా
     ధునిఁ బుత్తెం డిట నస్మదీయ[62]సుమహద్దోశ్శిక్ష లక్ష్యంబుగన్.113

జరాసంధుఁడు బలదేవవాసుదేవులతోడ యుద్ధంబు సేయుట

క. అని పలికెడు పల్కులు విని, మనమునఁ గిను కొదవ నుదరి మగధ విభుఁడు జో
     డునువిల్లు దేరు ఘనకే, తనమును గొని కడఁగె శార్ఙ్గధరుపై నొకఁడున్.114
వ. కడంగి యతండు నతనిం గని.115
శా. ఏ నుండంగ నరేంద్రసింహముల నీ వి ట్లేల సెగ్గించె ది
     చ్చో నుగ్రాటవిలోన నాఁ డటు పశుస్తోమంబులం గాచిన
     ట్లౌనే కేశవ లావుఁ జేవయును ధైర్యంబుం గలం డండ్రు ని
     న్నానేర్పిప్పుడు నాకు నెక్కినఁ గదా యత్యంతసిద్ధంబగున్.116
చ. అనితల నిట్టు [63]లగ్గలము లాడినయట్టులు గాదు సేఁత చొ
     ప్పనయము వ్రేఁ గొకింతపడి యాత్మఁ దిరంబుగ సైచి నిల్వుమా
     సునిశితమామకాస్త్రములసోన మునింగి పరేతభర్తతో
     నొనరఁగ నేఁడ చేసేద వనుత్తమసఖ్యవిశేషభద్రముల్.117
తే. అనినఁ జిఱునవ్వుతోడి యనాదరావ, లోకనము రక్తనేత్రాంకభీకరముగఁ
     గంసమథనుఁడు మగధభూకాంతుతోడ, నిట్టు లను ధరణీశ్వరు లెల్ల వినఁగ.118
క. నాలా వెఱిఁగెడునంతటి, [64]చాలిక నీ కొదవె నేని జనవర కడు మే
     లేలా తడయఁగ [65]నిదె నీ, యాలోకనగోచరుండ నై యున్నాఁడన్.119
తే. రిత్తమాటలు [66]సెల్లవ యుత్తము లగు, శూరులకు రజ్జు లొప్పునె సారబాహు
     లీల నెఱుపుట దక్కఁగ లెమ్ము కడిమి, సూపు వివిధాస్త్రశస్త్రవిస్ఫూర్తి యెసఁగ.120
వ. అని యాక్షణంబ యా జగదేకవీరుం డా రాజకుంజరు నెనిమిదియమ్ముల
     నొప్పించి సారథి నైదుబాణంబులను రథ్యంబుల ననేకబాణంబులను నొప్పించె
     ముసలాయుథుండు బాణాసనప్రౌఢి మోఱయ నతనివిల్లు నడిమికి నజ ఱకె నిట్లు
     కృచ్ఛ్రగతుం డైన యేలికం గని సేనాపతు లగు కౌశికచిత్రసేనులు రయంబున
     నడరి.121
క. బలదేవు మూఁడుశరముల, నలఘువిశిఖపంచకమున నబ్జాక్షుని న
     గ్గలిక యెసఁగ నేసి వియ, త్తల మద్రువఁగ నార్చుటయును దద్దయు నలుకన్.122

తే. కామపాలుఁ డర్ధేందుముఖప్రదీప్త, సాయకంబునఁ గౌశికుచాపయష్టి,
     ద్రుంచెఁ గృష్ణుండు నాలుగుతూపు లొకట, నేసి చేసె రథ్యంబుల నిలఁబడంగ.123
వ. ఇవ్విధంబున నిరథుం డై కౌశికుండు గదగొని హలాయుధుదెసకుఁ గవియ నా
     లోనన యతండు చిత్రసేనవధార్థంబు బాణవర్షంబు గురియుచుండ జరాసంధుండు.124
క. విలు ద్రుంచి పెక్కువిశిఖం, బులఁ బొడువఁగ బలుఁడు భూరిభుజబలుఁ డయ్యున్
     బలియుఁ డగుపగతువేఁడిమి, యొలయుట కత్యద్భుతంబు నొందుచుఁ బెనఁగెన్.125
వ. అంతఁ జిత్రసేనుండు గదాదండంబునఁ బ్రలంబవైరివక్షంబు ప్రక్షతంబు చేసి
     తొలంగ నుఱికె నప్పుడు.126
సీ. ఏను దొంబదియును నెనుబదియును నేడు సాయకంబుల జరాసంధుఁ డేచి
     నీరజోదరు మహానీలాశ్మసుందరసుకుమారదేహంబు శోణిశమున
     మునిఁగి సంధ్యారుణఘనమనోహర మగునట్లుగా నొనరింప నవ్విభుండు
     భల్ల మొక్కట వానివిల్లు ద్రుంచుటయును గదగొని ధరణి గ్రక్కదలఁ దేరు
తే. డిగ్గనుఱికి బార్హద్రధి యగ్గలంపు, వేగ మొప్పంగ డగ్గఱి విష్ణునురము
     వ్రేయుటయును నిర్భరమోహవివశుఁ డగుచు, వ్రాలె నగ్రజుఁ డళుకొంద వసుధ నతఁడు.127
వ. ఇట్లు వడుటయును.128
క. గోవిందుని నిహతునిఁగా, భావించి విరోధి ప్రమదభరితోత్కటచే
     తోవేగంబున సకలది, శావలయము వడఁక నక్కజంబుగ నార్చెన్.129
ఉ. దానికి సైప కుద్ధతిగ దాముసలంబులు రెండుసేతులం
     బూని హలాయుధుం డడరి భూవరువక్షము ఫాలముం బరి
     గ్లానముగా నొనర్చుటయు గాఢశరక్షతిఁ దూలి నేలపై
     జానులు మోపి మాగధుఁడు సత్త్వ మఱం బడి [67]సొమ్మవోయినన్.130
వ. రోహిణీనందనుండు సింహనాదంబు సేసె ననంతరంబ యమ్మనుజేశ్వరుండు.131
క. కొండొకసేపునకుఁ దెలిసి, చండగదాదండమున నసహ్యక్రోధో
     ద్దండత బలు వ్రేయఁగ నా, తం డాగద విఱుగవ్రేసెఁ దనగద వ్రేఁతన్.132
చ. జనవిభుఁ డాక్షణంబ యొకశక్తి యమర్చి జనార్దనాగ్రజ
     న్మునిదెస వైచి తోడన యమోఘగదం గొని వ్రేసి యంతఁ బో
     కనుపమముష్టి నొంచి మద మారఁ దలాహతిఁ ద్రోచి మూర్ఛలో
     మునుఁగఁగఁజేసి యార్చె దివి మూఁగినవేల్పులు భీతి నొందఁగన్.133

క. అంతఁ దెలిసి యసురద్విషుఁ, డెంతయు రభసమున శత్రు నెదిరి కదిసి దు
     ర్దాంతగతి వ్రేయఁగా మిసి, మింతుఁడు గా కాతఁ డొకసమిద్ధపుశక్తిన్.134
తే. అయ్యదూద్వహుపై వైవంగ నది వెరవున, నొడిసిపట్టి యాబలియుఁ డత్యుగ్రలీల
     మగుడ నతనిన వైచె నమ్మగధపతియు, సొలసి వ్రాలి యాలోనన తెలిసి నిలిచి.135
క. పరిఘము గొని మధురిపుపై , నురవడిఁ గవియంగ బాణ మొక్కటి యేసెన్
     హరిశార్ఙ్గము దెగనిండం, దిరముగఁ గొని దాన రిపుఁడు ధృతిసెడి నిలిచెన్.136
వ. అయ్యవసరంబున మూర్ఛదేఱి బలభద్రుండు భద్రగజంబు ధరణీరుహంబుదెసకుఁ
     గవియు విధంబున జరాసంధు నిప్పుడ యున్మూలుం జేయవలయు నని పలుకుచు
     నలుక యెసఁగం గవిసినం గని దరదుం డను భూవరుం డడ్డంబు సొచ్చి.137
ఆ. వరముపేర్మి నితఁ డవధ్యుం డెవ్వారికి, నతులశౌర్యధుర్యుఁ డధికధీరుఁ
     డెట్లు నీవు సంపె దే నుండఁగా నాదు, బలిమి రామ మున్ను దెలియ వెట్లు.138
వ. అని యదల్చినం గినిసి సంకర్షణుండు రిపుప్రాణాకర్షణం బగు తనలాంగలం
     బమర్చి వాని నెదిర్చినం బరిఘపాణి యై వాఁడునుం దాఁకె నయ్యిరువురకు
     నొక్కింతసేపు గజయూధపతులకుంబోలె నాభీలం బగు కలహంబు సెల్లె నంత.139
తే. స్కంధపీఠంబు మీద నాఁగలి దగిల్చి, కిట్టి పగతుని నిల బోరగిలఁ బడంగఁ
     గడిమిఁ దిగిచి మ్రోఁకాళులఁ గలయఁ గ్రుమ్మి, చదిపి నెత్తురు మెదడును జెదరఁ జంపె.140
క. మనుజేంద్రుఁడు మగధేశుఁడు, గనుగొనుచుండంగ నిట్లు గడుఘోరవిధం
     బునఁ బేర్చినబలునిబలం, బునకుఁ దలఁకి కలఁగె నఖిలభూపబలంబుల్.141

జరాసంధుఁడు సకలరాజ్యసమేతంబుగఁ బరాజితుఁడై పోవుట

వ. కృష్ణుండును గ్రోధరభసోద్దాముం డై కౌమోదకి యాయితంబుగాఁ బట్టి యిల
     చలింపంద్రొక్కుచు నక్కజంబుగా నడరి జరాసంధుసంధిబంధంబు బిట్టువ్రేసి
     బెడిదంపుఁ బిడికిటం బొడిచి యుఱక యఱచేతం జఱిచిన మ్రోఁకరిల్లఁబడి
     తూలుచు నతండు నేతిగద ప్రిదిలిపడ సశరం బగు శరాసనంబును సపరికరం
     బగు నరదంబును దిగవిడిచి యపసరణంబ శరణంబుగా సందడి నడంగిపోయినం
     గలంగి రాజన్యు లందఱు సమెటలు పెట్టి గుఱ్ఱంబులం దోలియు నంకుశంబు
     లూని యేనుంగులం దఱిమియుఁ జేరుకోలల నడచి రథ్యంబులం బఱపియు
     నత్యంతభయార్తు లై నలుదెసలం జనిరి సర్వసైన్యంబులుం జెల్లాచెద రై కన్నవి
     కన్నదెసలం బాఱె నట్లు నరేంద్రసహస్రసంత్యక్తం బై విగతసంగీతం బగు రంగ
     స్థలంబును గ్రేణిసేయు సంగరప్రదేశంబు గైకొని.142

చ. వరదుఁడు పాంచజన్యము ప్రవర్ధితగర్వనిరూఢి నొత్త న
     య్యురునినదంబు మేఘపద మొందుటయు న్విని సర్వదేవతా
     వరులును సిద్ధసాధ్యమునివర్యులు నార్చిరి లోకమంతయున్
     భరితవిరావ మయ్యెఁ దదుపాగతశబ్దవిమిశ్రణంబునన్.143
వ. సంకర్షణుండును బ్రహర్షోత్కర్షంబున సింహనాదంబున రోదసీకుహరపూరణం
     బొనర్చె నిట్లు విజయలక్ష్మీనిభాసితుం డై లక్ష్మీశ్వరుం డన్నయుం దానును
     మానుషరూపంబు లప్పుడు తమ్ము నొంద విశ్రమార్థంబు గోమంతగిరియంద
     కొన్నిదినంబు లుండునంత.144
సీ. ఆభంగి సమరపరాఙ్ముఖు లయి సర్వభూపాలురును బోవఁ బోక మగుడి
     చేదిభూనాథుండు శిశుపాలజనకుండు కారూశసైన్యయుక్తముగ నాత్మ
     బలముఁ దానును యదుప్రతతిదిక్కునఁ గలబాంధవ మెద నచ్చి పద్మనాభుఁ
     గానంగఁ జనుదెంచి కగుఁబ్రీతి నిట్లను ననఘ యేను మీకు మేనత్తమగఁడ
తే. వినుము దమఘోషుఁ డనువాఁడ వినయరహితుఁ, డగుజరాసంధుఁ బలుమాఱు ననునయించి
     వాసుదేవుతో వైరంబు వలవ దుడుగు, మయ్య యని చెప్పి విన కున్న నాత్మఁ దలఁకి.145
వ. అద్దురాత్ముం దొల్లి యెన్నఁడేనిఁ బరిత్యజించి యుండి నేఁ డతండు సంగరంబున
     భంగపడి చెడిపోయిన నంతరంగంబునం గని నాకుం గలవారిం దోడ్కొని
     నీవాఁడ నై వచ్చితిఁ బగవాఁడు బలవంతుం డింతన తెగి పోయెడివాఁడు గాఁ
     డీలోనన మగుడంబడి యెద్దియేనియుం గిల్బిషం బాపాదించు నివి నాకుఁ దోచిన
     తెఱంగు.146
చ. బహునరవాజివారణశవప్రకరంబులరక్తమాంససం
     స్పృహబహుయాతుధానచయభీకరగృధ్రవృకాదులన్ సుదు
     స్సహబహువిస్రగంధములఁ జాలఁగఁ గుత్సిత యైనయీసమి
     న్మహి మన కేల యొండెడకు మాధవ పోవుట లెస్స సయ్యనన్.147
వ. ఇచ్చటికిం బెద్ద దవ్వు లేదు కరవీరం బను పురంబు గల దందు సృగాలవాసుదేవుం
     డనువాఁడు గలఁడు. వాఁడు నీతోడ నెప్పుడు మచ్చరించు నతని నణంచుట
     యవశ్యకర్తవ్యంబు.148
క. ఇవె రెండు భవ్యరథములు, భవదర్థమ కా నొనర్పఁబడినవి చంచ
     జ్జవనహయాన్వితములు యో, ధవరా కైకొనుము నీవు దగ నగ్రజుఁడున్.149
వ. అనినం బ్రియంబు నొంది యదనందనుం డతని సబహుమానంబుగా
     నవలోకించి.150

ఉ. చుట్టఱికంబు ప్రేమమును జూపఁగ వచ్చిన వారికిన్ నిజం
     బిట్టిద యర్హ మైనయది యిప్డు భవద్వచనామృతంబునన్
     నెట్టన మామనోగతులు నిర్భరహర్షము [68]నొందె నింక నె
     ప్పట్టున నేము ధన్యులము ప్రాపును దాపును నీవు గల్గుటన్.151
క. ఇప్పటికయ్యంబు తెఱం, గొప్పుగఁ గనుఁగొంటి గాదె యోపుదు మేమీ
     చొప్పున నెన్నిరణంబులు, చొప్పడిన జయింప వానిఁ జూచెద వింకన్. 152
వ. ఈచక్రముసలంబుల ప్రసారంబునఁ బ్రతిపక్షుల బారి సమరుట మాకు నశ్రమంబు
     సర్వజగంబుల నస్మద్విక్రమంబు లద్భుతంబులుగాఁ జెప్పికొనునట్లు సేసెద మని
     పలికి యాప్రొద్ద యయ్యిరువురు నరదంబుల నెక్కి రథారూఢుం డైన దమ
     ఘోషుండు ముందట నడవఁ దత్సైన్యపరివృతు లై బలదేవకేశవులు రెండు
     విడిదలలు తెరువునం బుచ్చి మూఁడవనాఁడు రేపకడ కరవీరపురంబు పై విడిసి
     రపుడు.153
క. తమపేరు చెప్పి యుద్ధా, ర్థము వచ్చినవార మేము తడయక సంగ్రా
     మము మాకు నీవలయు నని, కమలాక్షుఁడు పలుక నచటి కావలివారల్.154
తే. కడు రయంబున నరిగి యప్పుడమిఱేని, కెఱుఁగఁ జెప్పినఁ గడుఁ గన్ను లెఱ్ఱసేసి
     యతఁడు విహితసన్నాహుఁడై యాక్షణంబ, యొంటిమెయి సైన్యముల నెల్ల నుడిపి కడిమి.155
వ. తొల్లి యాత్మీయనియమంబునకు మెచ్చి యాదిత్యుం డిచ్చిన యాదిత్యవర్ణం బై
     వెలుంగు హేమరత్నసుందరస్యందనంబు పిశంగతురంగంబుల యుద్ధాగమనంబున
     గగనగామియుంబోలె నుల్లసిల్లుచు హరివాహనం బగు మేఘవాహను నరదంబు
     చెలువు దీపింప నింపుమిగుల నెక్కి యక్కజంబు లగు ధనుస్తూణీరకృపాణాదు
     లమరఁ గమనీయకనకకవచచ్ఛన్నశరీరుం డై సాంధ్యజలధరపిహితం బగు మహా
     శైలంబుపోలిక నాభీలం బగు నొప్పిదంబుతోడం బురంబు వెలువడియె నంత.156
మ. లయకాలంబునఁ బ్రాణి[69]జాతము ననాలస్యంబుమై మ్రింగ నేఁ
     డి యుదగ్రోద్ధతిఁ దండధరుమాడ్కిన్ వచ్చుదుర్వారని
     శ్చయు నాశాత్రవు గాంచి కృష్ణుఁడు నిజస్వాంతంబు సంభ్రాంతి నెం
     తయుఁ బెంపారఁ దనర్చెఁ దాదృశుఁడ యై దర్పించెఁ దద్భ్రాతయున్.157
వ. చేదినాథుం డయ్యిరువుర యుత్సాహంబునకు ననపోహం బగు హర్షనిర్వాహంబు
     వహించె నవ్విష్ణుండు తన రథం బొక్కటి య ప్రతివీరునరదంబున కెదురుగా
     నడపింప నకంపితరభసంబున సృగాలుండును గడంగి కదిసి యతనిం దాఁకె
     న ట్లిరువురు వాసుదేవులకు దేవతలు మెచ్చు కయ్యం బయ్యె నంద.158

తే. శరము లొకలక్షఁ గరవీరపురవిభుండు
     యాదవేంద్రునిఁ బొదువంగ నతఁడు డెబ్బ
     దెనిమిదింటను నాతని నేసె మగుడ
     నేఁబదింటఁ గృష్ణుని నన్నరేశ్వరుండు.159
క. వారుణవాయవ్యంబుల, నారాయణుమీఁదఁ దొడిగె నరపతి శరముల్
     ఘోరశిఖివజ్రశరవి, స్ఫారతఁ దద్దీప్తి మాన్పెఁ బద్మేక్షణుఁడున్.160
క. జంబుకుఁ డేయఁగ యమరు, ద్రాంబకములు నిగిడి వడిఁ దదస్త్రములు విచి
     త్రంబుగ మాధవుచే నిమి, షంబున శమితంబు లయ్యె జగములు వొగడన్.161
చ. హరి గొనయంబు ద్రుంచుటకు నస్త్రవరంబు సృగాలుఁ డెంతయున్
     బరవస మొప్పఁ గైకొనినఁ బ్రాజ్ఞుఁడు శార్ఙ్గధరుండు తద్విధం
     బరుదుగ నాత్మలో నెఱిఁగి యాతనివి ల్లొక యర్ధచంద్రని
     ష్ఠురవిశిఖంబునం దునిమి సొంపఱ నంగము నొవ్వనేసినన్.162
క. వేఱొక విలుగొని విమతుఁడు, దూఱుఁగ హరిమేన నాటెఁ దొమ్మిది యమ్ముల్
     మా ఱెనుబదింటఁ బొదివెం, గాఱియగా మఱియుఁ బఱపె గమిగొనఁ దూపుల్.163
శా. కోపం బుత్కటమై ముకుందుఁడు గుణాఘోషంబు దిఙ్మండలా
     క్షేసక్షోభకఠోర మై నిగుడఁగా శీఘ్రాస్త్రపాతంబులం
     జాపంబుం దునుమాడె సూ హసనోత్సాహంబునం బేర్చి ధా
     త్రీపాలున్ బహుళోజ్జ్వలప్రదరపఙ్క్తిచ్ఛన్నుఁ గావించినన్.164
వ. సారథ్యచతురుండునుం దాన యై కడంగి.165
ఆ. అన్యచాపహస్తుఁ డై యతఁ డొకయమ్ముఁ, గేల [70]నమరఁ బట్టి కేళివోలె
     సమరరాగభరము సస్మితవక్త్రంబు, నందు మెఱయ నిట్టు లనియె హరికి.166
సీ. గోమంతగిరియందుఁ గొందఱురాజుల నొడిచితి నని మదం బడరి యిందు
     వచ్చితి కరవీరవల్లభుఁ దొడరంగ నల్పులు మూఢాత్ము లానృపాలు
     రిదె యొక్కరుండన యేను గయ్యమునకు నమరి నిల్చినవాఁడ నట్ల నీవు
     నేకాగ్రయోధివై యొసఁగితి ధర్మయుద్ధం బిది గీర్తివిధాయి మనకు
తే. నొక్క వాసుదేవుఁడ కాక యుర్విమీఁద, నెంద ఱిప్పుడు నిను వధియించి నాదు
     పేరు సుస్థిరస్థితి నెందుఁ బెంపు నొంద, నిలుపఁ గలవాఁడ నొక్కింత నిలువు మిచట.167
చ. అన విని దేవకీసుతుఁడు హాసవినిష్ఠురవక్త్రుఁ డై సృగా
     లునిదెసఁ జూచి నీమనసులో రణవాంఛ నరేంద్ర యిప్పుడుం

     బొనుపడదేని సాహసము వొంపిరివోవఁగ నిల్చి కైదువుల్
     విను కలయన్నిటం బెనఁగు విశ్రమ మేర్పడ నేను జూచెదన్.168
క. ఆవల నాచేయంగల, యావిధమును నున్నయదియ యది మునుముట్టన్
     వావిలి చెప్పఁగ నేలా, నావుడు నవ్విభుఁడు భీష్మణస్ఫురణమునన్.169
క. తఱుచుగఁ బఱపెఁ గడిఁదియం, పఱ తోమరచక్రపరశుపరిఘచయము లే
     డ్తెఱఁ బైఁ గురిసెఁ గృపాణము, లుఱక ప్రయోగించి వైచె నొక్కట శక్తుల్.170
వ. ఇట్లు వైరిప్రయుక్తం బగు వివిధాయుధాంధకారంబు నీరంధ్రం బై కవిసిన నిర్భర
     స్థితిం బొలుపారి దైత్యారి దారుణవిక్రమం బగు చక్రంబు చేతఁ గైకొని
     వాని నాలోకించి.171
ఉ. చేయఁగ నోపినంతయును జేసితి చూచితి నేను నీవిధం
     బాయతమద్భుజాకలిత మై యిదె వచ్చె మహోగ్రచక్ర మిం
     కేమది చెప్పుమా తెలియ నిప్పటికిం బరిరక్ష యంతక
     వ్యాయతదంష్ట్రలం దగులువాఁడవు గాక సృగాల యిచ్చటన్.172
వ. అని పలికి యమ్మహాచక్రం బతనిపయిం బ్రయోగించినఁ బ్రళయసమయనిర్ఘాత
     ఘోరం బయి యడరి యది తదీయశిరంబు రెండువ్రయ్యలు సేసి క్రమ్మఱి వచ్చి
     యాసరోజాక్షు దక్షిణహస్తం బలంకరించె నంత.173
సీ. పగతుచే నిమ్మాడ్కిఁ బడి మృతిఁ బొందినఁ గలఁగి వీ డక్కడక్కడఁ బడంగ
     నంతిపురంబున నతివలు విత్రస్తకురరీవిరావసంకులము గాఁగ
     నేడ్చుచు నచ్చటి కేతెంచి రం దగ్రసతి యాత్మసుతుని నాశక్రదేవు
     నవ్వాసుదేవుని యడుగుఁ గెందమ్ములమ్రోల మ్రొక్కించి సమ్మోహవివశ
తే. యగుచు విలపింపఁ గరుణించి యవ్విభుండు, మగువ నూరార్చి సకలసామంతమంత్రి
     పౌరముఖ్యపురోహితప్రతతిఁ బిలువఁ, బనిచి రాజ్యంబు నృపతనూజునకు నిచ్చె.174
వ, ఇట్లు కరవీరపతిం బరిమార్చి తత్పదంబునం దదీయసంతతిం బ్రతిష్ఠించి.175
క. మధుమథనుఁ డాక్షణంబున, మధురగుఱిచి కదలి మేనమామఁ దగఁ దదీ
     యధరిత్రికి వీడుకొలిపి, యధికప్రమదంబుతోడ నన్నయుఁ దానున్.176
వ. మార్గంబున నైదు దివసంబులు వసియించి యాఱవనాఁటిరేపకడ పురం బనతిదూరం
     బునం గని పాంచజన్యంబు పూరించిన.177
ఉ. స్యందన[71]యుగ్యనేమిరవసమ్మిళితంబుగఁ బేర్చి రోదసీ
     కందరపూర్ణమై తదభికల్పితనాదము వర్వె దాని కా

     నందముఁ బొంది యాదవులు నవ్యనిరూఢి నలంకృతాంగు లై
     ముందట నుగ్రసేను నిడి ముఖ్యపురోహితకపూర్వకంబుగన్.178
వ. అనేకదంతితురంగసుభటసహస్రంబుల సమకట్టి యుదగ్రకేతువులు నుజ్జ్వలాత
     పత్రంబులు నొక్కట శోభిల్లం బెల్లుగా మ్రోయుచు మంగళవాదిత్రంబులతో
     నమిత్రజైత్రు లగు నవ్వసుదేవపుత్రుల నెదుర్కొని వారును వారి నభినందించి
     వందిమాగధకీర్తనంబులు విప్రజనాశీర్వాదంబులుం బ్రకృతిప్రమోదవాక్యం
     బులు వీనులకు నింపుసొంపు సంపాదించ నకంపితవిభవంబునం బురంబు ప్రవేశించి
     రా సమయంబున.179
చ. అనిమిషకోటి గొల్వఁ బొలుపారు[72]పురందరుఁ బోలి యాదవుల్
     దనుఁ గొలుపంగఁ గృష్ణుఁడు ముదం బెసఁగన్ వసుదేవు నింటికిం
     జనుటయు నన్నతో నటులు సమ్యగుపాగతుఁ డైన కూర్మినం
     దనుఁ బ్రణతోత్తమాంగుఁ వగఁ దండ్రి కవుంగిటఁ జేర్చి యర్మిలిన్.180
వ. వేనవేలు దీవన లిచ్చి వేయివిధంబుల నుపలాలించె నమ్మహోత్సవంబున నప్పురంబు
     లోన నెవ్వండును దీనుండు మలినుండు ననలంకృతుం డసంతుష్టుం డనుత్సా
     హుండును లేఁడు సర్వజనంబులు బరమకల్యాణభరితు లయి రని వైశంపాయ
     నుండు చెప్పినకథ సవి పరంబుగ.181
ఉ. వాసవితుల్యవిక్రమ[73]వివాసితశత్రుభుజావిలాస ది
     గ్వాసనకారిసౌరభ [74]విభాసియశస్కర దానవిభ్రమో
     ద్భాసికరాబ్జభాసురవిభాసరసీరుహమిత్ర మానసా
     ధ్యాసిదయాసనాథతుహినాంశువిభూషణ సౌమ్యభూషణా.182
క. శ్రీమల్లచమూవల్లభ, సామాదికచతురుపాయసామర్థ్య నమ
     త్సామంతోజ్జ్వలవైభవ, సామగ్రీలబ్ధఫలసౌభ్రాత్రసుఖా.183
మాలిని. వినుతభువనవీతోద్వేగవిస్తీర్ణభాగా, వినరభరితవిశ్వావేక్ష్య[75]విద్వత్ప్రతీక్ష్యా
     ధనదసదృశదానోదాత్తదాక్షిణ్యచిత్తా, ధనికసుజనధర్మాధ్యక్షధన్యస్వపక్షా.184
గద్యము. ఇది శ్రీశంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానందసౌందర్య
     ధుర్య శ్రీ సూర్యనారాయణసుకవిసంభవ శంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయ
     నామధేయప్రణీతం బైన హరివంశంబు నుత్తరభాగంబునందుఁ బ్రథమా
     శ్వాసము.

  1. ధౌరీణ
  2. స్ఫటికా
  3. బంధుఁడార్యగ
  4. కుసుమార్చితదర్పహితాహితుం డిలన్
  5. నెసఁగు, నరుగు (పా)
  6. ను సుతుకుఁదన్నాజి
  7. కాల; నిత్య
  8. ముట్టడువు, ముట్టిడిపు.
  9. వినుఁడు
  10. దేఁకువ
  11. యుగళం
  12. చ్చేనాను
  13. నంత
  14. తగ నిర్నిర్గుణ; తగ నిన్నుం గుణ.
  15. ఘనమై యీప
  16. నెవ్వెఱన్
  17. కంధర
  18. పొగడ నీప్రాభవంబు
  19. కంసుం బుచ్చివైచి
  20. నలంగి; నలికి
  21. వరేణ్యుం
  22. గావింపంగన్
  23. నదిని
  24. వెలసి
  25. కపహతుఁడై
  26. మొదలుగా
  27. ఆయచలేంద్రుని
  28. నాకిట్లు; రాకెట్లు యాదవుల న్నిన్ను
  29. గేతువును నైనయాతఁడు సంప్రీతి
  30. నెలమి నయ్యరువురును జరించు
  31. దివ్య
  32. నయనములు ఘూర్ణ నో
  33. లన్ వాసంబుగా
  34. వేడుకను నుర్వితలమున
  35. బెంపొప్పఁగా
  36. దోఁచెఁ గెలన
  37. అంబుధిలో
  38. పోవుచెప్పున
  39. దుర్గ
  40. స్వరీతోధ్వజో
  41. రథపూగ
  42. సమరాగ్రంబున
  43. జొరఁ జేరుఁ డీయిరుమైన
  44. నొదవంగ
  45. వైవుఁ
  46. గోనందుండును (సం. ప్ర); గోనర్దుండు.
  47. పగులఁద్రొక్కెద
  48. గుదుపలు
  49. దుర్గములు వొదవినపుడు దురముసేఁత
  50. జేరుదురు
  51. ప్రదీప్తో
  52. రూపఱియె; రూపేదె.
  53. శీత
  54. ఫణాచక్రంబు
  55. రింప నొప్పుచున్; రింపఁగా వెసన్
  56. పట్టించు
  57. మీకున్
  58. నన్ను మీరు
  59. గురియుచు
  60. నికృంత
  61. అనికంబోరచి. (బ్రౌన్)
  62. సుమహాదోశ్శిక్ష
  63. లగ్గమయి యాడిన
  64. చాలుట
  65. నే నిదె
  66. సెలవులే దుత్తములగు
  67. సోమవోయినన్
  68. నొంద
  69. జాతముల
  70. నేర్చి
  71. నేమియుగ్య
  72. షడానను
  73. నివారిత
  74. విశాసి
  75. విద్యాప్రతీక్ష్యా