హంసవింశతి/రెండవ రాత్రి కథ

గలపనులంది గందవొడి గమ్మనఁ బూసి, నృపాలునింటికిన్
జెలియ చనం దలంచె రతిశిక్షకు రెండవనాఁటి మాపునన్. 143

తే. పోవుచో నమ్మరాళంబు పొంత నిల్వఁ
జెలియ పూనిన జిగినీటు కులుకుఁ జూచి
రాజహంసంబు వలికె, నో రాజవదన!
పోయెదవు గాని యుపమతోఁ బొసఁగి చనుము. 144

క. ఉపమ యెఱుంగని వారల
కపరిమితావస్థ లొందు నది యెట్లన న
య్యుపమ యెఱుంగక కాదే
చపలత మున్నొక్క నక్క సమసెన్ బెలుచన్. 145

వ. అనిన విని హేమావతి యిట్లనియె. 146

రెండవ రాత్రి కథ.

కక్కుఱితిబడి చచ్చిన నక్క

క. ఆకథ వినియెద నుడువు, సు
ధాకరకలు రాలఁ దేనె ధారలు చిలుకన్
లోకేశ తురంగమ! యన
నా కలికికి రాజహంస మపు డిట్లనియెన్. 147

క. వినవమ్మా! హేమావతి!
కనవమ్మా! స్థూలసూక్ష్మకార్యములు దగన్
మనవమ్మా! నన్నో చ
క్కని కొమ్మా! మెచ్చుకొమ్మ! కథ విని పొమ్మా! 148

క. విభ్రమమణిమండనమస
నభ్రంకషసౌధకేతనాంశుకజనితా
దభ్రానిలహతగతిజా
తాభ్రమణిహయశ్రమోద మప్పుర మమరున్. 149

క. ఆ పురవరమణిలో గుణ
దీపక నామమున భూమిదేవుం డలరున్
జూపట్టి వేదశాస్త్ర
వ్యాపారముచేత రెండవవిధాత యనన్. 150

సీ. అరఁగులసున్నపుటెఱమట్టి పట్టెలు
దీర్చిన గోడలు తేజరిల్ల
నిండుసున్నపుఁబూత నెఱచాలు బోదెలు
దిద్దిన దేవరమిద్దె దనర
నారికేళపుమట్టతీరుగా నలికిన
ముంగిలి మలెసాల ముద్దుగులుకఁ
బంచవన్నియ మ్రుగ్గు పద్మముల్ నించిన
బృందావనము లోఁగిలందె వెలయ
తే. నుదికిన మడుంగుదోవతు లుంచినట్టి
దండె మౌపాసనము సేయు కుండ మమరఁ
బడలిక లడంచు పసపాకు పంది రలర
నుండు నా బ్రాహ్మణుని గృహం బుత్పలాక్షి! 151

చ. అతనికిఁ జారుశీల యను నంబుజగంధసుగంధి యొప్పుఁ ద
త్సతి తనయుండు లేమిఁ బరితాపముతోఁ గడుఁ బుణ్యభూము లా
యతమతిఁ ద్రొక్కఁ బూర్వసుకృతాంశముచే నొకఁ డుద్భవించె సం
తతశుధాముఁ డప్రతిమధాముఁడు రామగుణాభిరాముఁడై. 152

బ్రాహ్మణ కుమారుని

చదువు సంధ్యలు — తీర్థయాత్ర

వ. అంత గర్భాదాన పుంసవన సీమంత జాతకర్మ నామకర ణాన్నప్రాశన చౌలోపనయన వివాహ ప్రాజాపత్య సౌమ్యాగ్నేయ వైశ్వదేవ గోదాన స్నాతక పితమేధంబులను షోడశకర్మంబు లెఱుంగంజేసి. 153

తే. వాని తలిదండ్రు లత్యంతవత్సలతను
బూఁటపూఁటకు గోముచేఁ బొసఁగఁ బెంచి
ప్రాభవం బొప్ప నసమానవైభవమున
ఘనత షోడశకర్మాధికారుఁ జేయ. 154

వ. అంత నత్యంతకుశలస్వాంతంబున నవ్వటుశిఖామమి వేదవేదాంగాది బ్రహ్మవిద్యాభ్యాసానంతరంబు గానంబును గవిత్వంబును గొక్కోకంబును జూదంబును దేశభాషల విజ్ఞానంబును లిపిలేఖనంబును జరాచరాన్యధాకరణంబును విలువిద్యయును సర్వజ్ఞానపరిజ్ఞానంబును శాకునంబును సాముద్రికంబును రత్నపరీక్షయు నరదంబుఁ బఱపుటయుఁ దురగారోహణంబును గజారోహణంబును మల్లశాస్త్రంబును బాకచమత్కారంబును దోహదప్రకారంబును ధాతుగంధరసఖనిజవాదంబులును గుట్టుపనుల వినోదంబు మహేంద్రజాలంబును జలాగ్నిఖడ్గస్తంభనంబును మొనకట్టును వాకట్టును రయస్తంభనంబును వశ్యాకర్షణమోహనంబులును విద్వేషణోచ్ఛాటనసంహరణంబులును గాలవంచనంబులును బక్షిగతిభేదంబులును యోగవాదంబులును వచనసిద్ధులును ఘుటికాసిద్ధులును బరకాయప్రవేశంబును నింద్రజాలంబును నంజనభేదంబులును ధ్వనివిశేషజ్ఞానంబులును దృష్టివంచనంబులును స్వరవంచనంబును మణిమంత్రక్రియలును జోరత్వంబును జిత్తరువు వ్రాయుటయు లోహకారకత్వంబును శిలాభేదకర్మంబును గులాలకర్మంబు రథకారకర్మం బును శూర్పకారకర్మంబును జోళ్ళు నిర్మించుటయుఁ బటకారకర్మంబును నదృశ్యకరణంబును దౌత్యకర్మంబును వేఁటసన్నాహంబును బేరంబును బాశుపాల్యంబును గృషియు మైరేయంబుఁ గూర్చుటయు లావుక కుక్కుట మేషాదుల పోరు హత్తించుటయు ననియెడు చౌషష్టివిద్యలమర్మంబు లెఱింగి యొప్పుచుండు. 155

క. ఈ రీతి సకలవిద్యల
నారూఢిగ నారితేఱి యవ్వటుఁడు సదా
చారస్థితి గంగాయా
త్రారంభవిజృంభమాణహర్షోదయుఁడై. 156

సీ. సకలాతు కుళ్ళాయి యొకయింత కాన్పింపఁ
జుట్టియుండిన పంచె సొంపు దనరఁ
బడెఁడు బియ్యము వండఁ బాటైన తపెల యుం
చిన చిన్నియసిమి దోస్సీమ వెలయ
ముంజిపైఁ గనుపట్ట ముద్దుగాఁ గట్టిన
యంగవస్త్రపుగుడ్డ చెంగులలర
మాంజిష్టి గలిపిన మంత్రాక్షతంబులు
పోసిన మారేడుబుఱ్ఱ యమర
తే. ధౌతశాటియుఁ బరిపాటి ధావళియును
వఱల వేదాంతశాస్త్రంబు వ్రాసినట్టి
తాళదళపుస్తకము చంకఁదనరఁ బూని
చనియె గడిదేఱి యా బ్రహ్మచారి మీఱి. 157

క. ఈ లీల సకలపురములు
శైలంబులు నదులు నిధులు శాఖిచయంబుల్
గాలువలుఁ బల్లె పట్టము
లాలోకింపుచును బోయి యవ్వటు వెదుటన్. 158

సీ. ప్రాలేయశైలాధిపాలకసంజాత
కర్పూరధౌతలోకప్రపూత
జలధినాయకుఁ డేలు సరసంపు టిల్లాలు
పటు భగీరథతపఃఫలము మేలు
తారాధ్వఘట్టనోద్ధతవేగకల్లోల
యఘమహారణ్యదావాగ్నికీల
చంద్రశేఖరశిరస్స్థలశుభ్రసుమదామ
చందనకుందేందుసదృశభామ
తే. రంగదుత్తుంగదీర్ఘతరంగసంఘ
ఘుమఘుమధ్వానమేఘనిర్ఘోషనృత్య
దహిభుగుద్వేలవాలాంశుయామనోర్మి
సంగమభ్రాంతి దాభంగ గంగఁ గనియె. 159

మ. కని యభ్యంచితదివ్యతీర్థములలోఁ గౌతూహలం బొప్పఁగా
ఘననిష్ఠారతి మీఱ భైరవున కర్ఘ్యం బిచ్చి సంకల్పమున్
వినతుల్ స్నాన మొనర్చి తత్తటమహోర్వీవాసవిద్యాతివృ
ద్ధనికాయం బొగిఁ దెల్ప జాహ్నవిమహత్త్వంబుల్ వినెన్ భక్తితోన్. 160

వ. అంత నాబ్రాహ్మణకుమారుండును దత్తీరవాసులకు నిజార్చితద్రవ్యంబులు వ్యయంబు చేసి గో భూ తిల హిరణ్యాజ్య వాసోధాన్య గుడ రౌప్య లవణంబులను దశదానంబులను దులాపురుష హిరణ్యగర్భ హిరణ్యరథ హేమహస్తి హేమలాంగూల పంచలాంగూల విశ్వచక్ర కల్పలతా సప్తసాగర రత్నధేను భూత సంఘట్టనంబులను షోడశమహాదానంబులు చేసి కాశికాపురంబున కరిగె నప్పుడు. 161

సీ. చిత్రకూటసమాన చిత్రకూటవిమాన
భాసురంబు విశిష్టభూసురంబు
వైజయంత వితాన వైజయంత వితాన
భూషణంబు నృపాల భీషణంబు
భాసమాన శశిప్రభాసమాన క్షౌమ
సుందరంబు కిరాటమందిరంబు
సుమనస్స్తుతోద్దామ సుమనస్స్తుతారామ
బంధురం బురుశూద్రసింధురంబు
తే. సతతబహువైభవాసదృశప్రభావ
కీర్తిరాజితకుండలీకృతసుధీర
వజ్రమణిదీప్తవప్రాంశువలయలలిత
గోపురంబై రహించుఁ గాశీపురంబు. 162

ఉ. ఆ పుటభేదనేంద్ర దృషదావళి కల్పితగోపురాశిపై
నేపున మాపు ఱేపుఁ జను నిందు దినేంద్రులఁ బర్వఁ దద్ద్యుతుల్
బాపురె! వీనికిన్ గ్రహణబాధ యపర్వములందు నేక్రియన్
బ్రాపిత మయ్యె నంచు మది భ్రాంతి వహింతురు తాంత్రికోత్తముల్. 163

తే. అట్టి పుణ్యస్థలంబున కరిగి వేడ్క
గడలుకొన మణికర్ణికాఘట్టమునను
నిలిచి జలకచ్ఛమున స్నాననిష్ఠఁ బూని
వెడి మాధ్యాహ్నికక్రియల్ వేగఁ దీర్చి. 164

క. మణికర్ణిక మణికర్ణిక
మణికర్ణిక యనుచు నుడువు మనుజుల కెల్లన్
గణనాతీతపు దోషము
లణఁగి శతక్రతుఫలంబు లగునని తలఁచెన్. 165

వ. అంతట నవ్వటుశిఖామణి నమకచమకంబుల రుద్రన్యాసయుక్తంబుగా విశ్వేశ్వరు నభిషిక్తుం జేసి పూజించి ప్రదక్షిణనమస్కారంబులు గావించి యిట్లని స్తుతియించె. 166 సీ. జయ భక్తమందార! జయ దుష్టజనదూర!
జయ జగదాధార! శరణు శరణు
జయ నిత్యకల్యాణ! జయ భృత్యసంత్రాణ!
జయ రమాధిపబాణ! శరణు శరణు
జయ గోత్రపుత్రీశ! జయ రక్షితసురేశ!
జయ పంచశరనాశ! శరణు శరణు
జయ శరద్ఘనగాత్ర! జయ పావనచరిత్ర!
జయ కేందుశిఖినేత్ర! శరణు శరణు
తే. జయ నిశితశూలసాధన! శరణు శరణు
జయ మఖామోఘనాశన! శరణు శరణు
జయ హయాకృతనందీశ! శరణు శరణు
జయ మహాదేవ! విశ్వేశ! శరణు శరణు. 167

సీ. శ్రీపార్వతీకుచశిఖరిస్థలవిహార!
హారాయమానమహాభుజంగ!
జంగమస్థావరసంచారసమభావ!
భావజరూపప్రభావహరణ!
రణరంగనిర్జితరౌద్రమహాసుర!
సురయక్షసేవితచరణయుగళ!
గళదరస్థాపితకాలకూటక్షీర!
క్షీరాబ్ధిపుత్రీశఘోరబాణ!
తే. బాణనామకరాక్షసత్రాణదక్ష!
దక్షకల్పితయాగవిదారణోగ్ర!
[1]యుగ్రభీమాదినామధేయప్రసిద్ధ!
సిద్ధబయభంగ! కాశి విశ్వేశలింగ! 168

క. అని సన్నుతించి వేడ్కలు
గొనలొత్తఁగ బ్రహ్మచారికుంజరుఁడు క్రమం



బున దేవతాధివాసము
లనువొందఁగఁ గాంచి భక్తి యలమిన మదితోన్. 169

క. డుంఠి గణాధ్యక్షుని శితి
కంఠుని భైరవునిఁ జండికన్ బటు విద్వ
త్కంఠీరవ మపుడు మహా
కుంఠితతాత్పర్యమునను గొలిచి భజించెన్. 170

వ. తదనంతరంబునఁ బంచక్రోశంబునం గల మహాదివ్యలింగంబుల సేవించి యచ్చోటు వాసి తైర్థికజనహితసమ్యగయగు గయకుఁ జని గదాధరుం గొనియాడి ప్రయాగ కరిగి త్రివేణీసంగమంబునం గృతస్నానదానాద్యనుష్ఠానుండై మాధవు నారాధించి సప్తపర్ణపటంబుం గనుంగొని త్రివేణీతీర్థంబులు నించిన కావడిఁ గైకొని పంచక్రోశంబున నొక్కమరకతలింగంబు సంగ్రహించి నిజస్థానగమనోన్ముఖుండై. 171

సీ. కావడిపై నంటఁగట్టిన యొక కావి
శాటి కంబళి యాత్రసంచి యలర
నేతి లడ్డిగ నీళ్ళు నించిన సొఱకాయ
బుఱ్ఱ లిర్వంకలఁ బొసఁగి యుండ
నెగనెత్తి కుఱుచగా బిగియఁగట్టిన పంచె
పై బిగించిన ప్రాఁతబట్ట యొప్ప
ముఖఘర్మములఁ డోసి మునుఁగఁ జుట్టిన పల్లె
కొనలు మారుత లౌల్యమున హరింప
తే. గమనజవమున నఱ్ఱాడు కావడదరి
కిఱ్ఱుకిఱ్ఱని భుజమునఁ గేళి సల్ప
గౌడరుద్రాక్షమాలికల్ కంఠసీమఁ
దనర వచ్చెను వేడ్క నత్తైర్థికుండు. 172

క. ఈ రీతిఁ దన గృహంబున
కారయఁ జనుదెంచి కావ డటు దించి మహా
ధీరుఁడు జననీ జనకుల
కారూఢిగ సంఘటించె సాష్టాంగమ్ముల్. 173

క. తత్సమయంబున వారలు
వత్సా! మఱి యాత్ర సలిపి వచ్చితె? యని యు
ద్యత్సంతోషంబునఁ దమ
వత్స స్థలిఁజేర్చి ప్రేమ వర్ధిలి చెలఁగన్. 174

తే. శిరము మూర్కొని వదనంబు చెమటఁ దుడిచి
యాయురారోగ్యపుత్రపౌత్రాభివృద్ధి
గాను దీవించి యత్యంతకరుణ మెఱయఁ
గొడుకు తోడను నిట్లని నుడివి రపుడు. 175

క. ఏ యే పుణ్యస్థానము
లే యే తీర్థస్థలంబు లేయే ద్వీపా
లేయే భూములు సూచితి
వాయా మహిమలు వచింపు మర్భక మాకున్. 176

క. అని యడిగిన తలిదండ్రుల
కనునయమునఁ గాశి గయ ప్రయాగము మొదలౌ
ఘన పుణ్యక్షేత్రంబులు
గని వచ్చితి, లింగ మిదిగొ! కౌతుక మమరన్. 177

క. ఈ పురవరమణి చెంగట
నీ పరమేశ్వరుఁ బ్రతిష్ఠ నెంతయుఁ జేతున్
దాఁపురము మోక్షలక్ష్మికిఁ
గాఁపుర మభివృద్ధిఁ బొందుఁగద మన కనియెన్. 178



తే. పుత్రకుని వాక్యవిస్ఫురద్బోధమునకుఁ
దల్లిదండ్రులు సంతోష ముల్లసిల్ల
నపుడు పాషాణభేదుల కర్థ మిచ్చి
ఠీవి నొక దేవళంబుఁ గట్టించి రపుడు. 179

సీ. డంబై న గర్భగృహం బంతరాశికం
బును ముఖమంటపంబును జెలంగ
గాలిమంటపము ప్రాకారంబు లోవలు
బోదెలు చుట్టలు పొందు పడఁగఁ
గప్పట చట్టముల్ ఘన గోపురమ్ములు
జగతియుఁ జప్పటల్ సొగసు గులుక
గచ్చుగోడలు ఱాతికంబముల్ పాలసు
న్నము సువర్ణము ద్వారసమితి వెలయ
తే. దృష్టిపాత్రపు బొమ్మలు తేజరిల్ల
నుఱుకు సింగంబు లరగూళ్ళు మెఱుఁగుఁ దోర
ణములు చిత్తర్వు క్రొంబనుల్ రమణ కెక్క
దేవళము మించె నత్యంతదివ్య మగుచు. 180

క. ఆ దేవళంబులోన మ
హాదేవుని నొక్క దివ్యమగు శుభవేళన్
బాదుగఁ బ్రతిష్ఠ చేసిరి
వేదాగమశాస్త్రరీతి వేడ్క దలిర్పన్. 181

సీ. చెఱఁగు దోవతి పైనిఁ జీరాడఁగా బోడి
తలచుట్టు ధౌతవస్త్రంబు మెఱయఁ
జెక్కులకును దిగి పిక్కటిల్లు విభూతి
పెండెకట్లు లలాటభిత్తి నమర
గళమున నులిగొన్న కావిదారముతోడి
రుద్రాక్షమాలికల్ రూఢిఁ దనర

మారేడు బుఱ్ఱలో మక్కళించిన సందిఁ
గట్టిన చంద్రశేఖరుఁడు వెలయఁ
తే. బెట్టె మూఁకుడు లోపల బిల్వపత్రి
మట్టి ధూపార్తి దీపముఁ బెట్టు చమురుఁ
బొందుపఱచుక మునిమాపు పూజసేయఁ
గ్రొత్త కాణాచి తంబళి హత్తుకొనియె. 182

క. ఈ తీరున నల తంబళి
భూతేశుని పూజ సేయఁ బుష్పంబుల సం
ఘాతముఁ గొని తేలేమని
యా తట్టున నొక్కతోఁట నమరఁగఁ జేసెన్. 183

సీ. సంపెఁగల్ మొల్లలు జాజులు గన్నేర్లు
విరజాజులును మంచి కురువకములు
పొద్దుదిరుగుడు పూల్ పొన్నలు మల్లెలు
పారిజాతములు సేవంతి విరులు
తామరల్ సూర్యకాంతమ్ములు కల్వలు
బొండుమల్లెల పొదల్ పొగడ తరువు
లల్లి పువ్వులుసు నంద్యావర్తములు వాడ
గన్నేరులు తురాయి గట్టిపూలు
తే. మాచిపత్తిరి గగ్గెర మరువము కురు
వేరు దవనమ్ములును వట్టివేళ్ల గుములు
బిల్వవృక్షము లాదిగాఁ బేరుగలవి
ప్రబల నొక తోఁట వేయించి బావిఁ ద్రవ్వె. 184

మ. అమితానర్ఘ్యనిబద్ధశుద్ధశశికాంతాయామసోపానసం
గమ, మంబుగ్రహణాగతోరుపథికాక్రాంతస్పురత్కుట్టిమం
బమలాంభోరుహషండపాండుకుముదాచ్ఛామోదసంవాసితం
బమృతప్రాయజలాభిపూర్ణ మగుచు న్నాబావి యొప్పుం గడున్. 185

క|| అబ్బావికిఁ జేయేతం
బుబ్బుచుఁ దంబళి యొనర్చి యుత్సాహంబున్
గుబ్బతిలఁ గొన్ని చెట్లకు
నిబ్బరమున జలములెత్తి నిస్త్రాణుండై. 186

తే॥ ఎలమి మఱికొన్ని చెట్టుల కెత్తి యెత్తి
యలసి ముంగిసమ్రానితో నానియుండఁ
గుండ నిండారఁగా ముంచి కూడుదినఁగ
నింటి కేఁగెను బడలిక లంటి పెనఁగ. 187

వ॥ అంత నొక్క బక్క నక్క గుక్కు మిక్కనుచు డొక్కం బిక్కటిల్లిన క్షుధానలంబున దందహ్యమానంభై డస్సి. 188

తే॥ పుట్టలను దిట్టలను జెట్లఁ బొట్ల గట్ల
వంకలను డొంక లను బీళ్లఁ బాళ్ల ఱాళ్ల
గుప్పలను దిప్పలను మళ్ల గుళ్ల నూళ్ల
దిరిగి యాహార మందక సొరిగి యరిగి. 189

సీ!! వాణికై పోరాడవచ్చి యెందఱు బ్రహ్మ
దేవుల మనువారు తీఱి చనిరి
పార్వతీ రతులకై బహుపోరి యెందఱు
రుద్రుల మనువారు రోసి చనిరి
సిరినిఁ జేపట్టఁగాఁ జేరి యెన్ని దశావ
తారముల్ కలహించి తీఱిపోయె
శచి మాఱుమనువు రచ్చలఁబెట్టి యెందఱే
నింద్రుల మనువార లేఁగి రహహ!
తే|| చూడ నవియెల్ల యుగచర్య సుద్దులయ్యె
బోయెఁగాలంబు పూర్వవిస్ఫురణ దప్పె



దార్ఘ్య మాలోచనము తెల్వి తగ్గుపడియె
నౌర! విధి నేఁటి కిట్లాయె ననుచు నడరి. 190

తే. ప్రాము జఠరాగ్నిచేఁ "గింకరోమి" యనుచు
నడరు వేదనచేఁ "గ్వ యాస్యామి" యనుచు
విస్మయపు మూర్ఛచే "నాహతొ౽స్మి" యసుచుఁ
బలుపరింపంగ సాగె సబ్బక్క నక్క. 191

వ. ఇట్లు క్షుధాతురత్వంబునఁ గంఠగతప్రాణంబై నోరం దడిలేక మాటిమాటికిఁ బొడము మూర్చల నలసి సొగయుచు మెత్తమెత్తగా వచ్చి తత్కూపతటస్థితద్రోణికాగ్రంబున నుస్న యల్పజలంబులం దన కంఠంబు దడిపికొని యయ్యేతంబు ముంగిసమ్రానికి వెదురునకు నంటఁగట్టిన వారు పరిమళం బాఘ్రాణించి దోనింబడి చని నేఁడీపశుకృత్తి రజ్జువున క్షుధాభరంబు హరించెద నని తలంచి, యుబ్బుచు నెక్కొను తమకంబును ముంగిసమ్రాని పైకిఁ జివుక్కున నెక్కి యబ్బక్క సక్క దారువేణు బంధనంబగు చర్మరజ్జువుం దెగం గొఱికిన. 192

తే. మ్రాను మీటుగ నెగయ గోమాయు పప్పు
డేకతాళప్రమాణ మట్లెగసి కూన
గుంతలోఁ బడి గుడ్లు వెల్కుఱుక నాల్క
నడుము గఱచుక నఱచుచు బెడసి మడిసె. 193

వ. అట్లు క్షుధాతురత్వంబున నాహారంబె చూచెఁ గాని తన చేటుఁ దెలియ దయ్యె. నీవా నక్క తెఱుంగున రాజసంయోగంబె చూచెదవు గాని యితరోపద్రవంబులు విచారింప వయిన నిత్తెఱంగునఁ జిత్తంబునఁ దత్తరంబు లేక తెలిసి మెలంగుమని హంసంబు నయోక్తులు పలుకు సమయంబున. 194

చ. అలమినవేడ్క ఘోష కనకాంగులు మజ్జిగఁ జిల్క, గాఁపుఁగూఁ
తులు తెలియావనాళములు ద్రొక్కఁగ జారగభీరనాయికల్

నిలయముఁ జేరఁ దస్కరులు నెక్కొను భీతిని దావులెక్కఁగాఁ
జెలఁగుచు వేగుఁజుక్క పొడిచెన్ బలసూదను దిక్తటంబునన్. 195

క. అంతట హేమావతి గే
హాంతరమున కేఁగి పార్థివాయత్తమతిన్
గంతు సుమకుంతదళిత
స్వాంతంబున నా దినాంతసంతమసమునన్. 196

చ. కలపము గబ్బిగుబ్బలను గమ్మను పూలసరాలు కొప్పునన్
గులికెడి చంద్రకావి నెఱికుచ్చెలఁ దీరినకోక శ్రోణినిన్
దిలకము మోమునన్ మణులఁ దీరిన సొమ్ములు మేన వేడుకన్
వెలయ నమర్చి మేల్ముసుగు వేసి నృపాలుని కేళిఁ దేలఁగన్. 197

మూడవ రాత్రి కథ


నాయకుని భార్య హేమరేఖ గుప్తగుణుఁడను వైద్యునిఁ గూడుట


క. కలహంసోజ్జ్వలరత్నశ
కలహంసకయుగము ఘల్లుఘల్లని మ్రోయన్
గలహంసగమన చనఁగాఁ
గలహంసము హేమవతిని గని యిట్లనియెన్. 198

ఉ. ఇంకొక గాథ కద్దు విను మింతటిలోఁబడి పాఱిపోవఁ డో
పంకరుహాయతాక్షి! యుపభర్తల హత్తుక తత్తరాన మీ
నాంకుని కేళిఁ దేలఁగఁ జనంగ నొకానొక మాటవచ్చినన్
బొంకఁగ “లేదు బంతి" యని బొంకవలెన్ గులటావధూటికిన్. 180

క. అని రాజహంసమణి ప
ల్కిన హేమావతి వినోదకేళిగతి గిరు

  1. యతిభంగము శోచనీయము