హంసవింశతి/మూడవ రాత్రి కథ

నిలయముఁ జేరఁ దస్కరులు నెక్కొను భీతిని దావులెక్కఁగాఁ
జెలఁగుచు వేగుఁజుక్క పొడిచెన్ బలసూదను దిక్తటంబునన్. 195

క. అంతట హేమావతి గే
హాంతరమున కేఁగి పార్థివాయత్తమతిన్
గంతు సుమకుంతదళిత
స్వాంతంబున నా దినాంతసంతమసమునన్. 196

చ. కలపము గబ్బిగుబ్బలను గమ్మను పూలసరాలు కొప్పునన్
గులికెడి చంద్రకావి నెఱికుచ్చెలఁ దీరినకోక శ్రోణినిన్
దిలకము మోమునన్ మణులఁ దీరిన సొమ్ములు మేన వేడుకన్
వెలయ నమర్చి మేల్ముసుగు వేసి నృపాలుని కేళిఁ దేలఁగన్. 197

మూడవ రాత్రి కథ


నాయకుని భార్య హేమరేఖ గుప్తగుణుఁడను వైద్యునిఁ గూడుట


క. కలహంసోజ్జ్వలరత్నశ
కలహంసకయుగము ఘల్లుఘల్లని మ్రోయన్
గలహంసగమన చనఁగాఁ
గలహంసము హేమవతిని గని యిట్లనియెన్. 198

ఉ. ఇంకొక గాథ కద్దు విను మింతటిలోఁబడి పాఱిపోవఁ డో
పంకరుహాయతాక్షి! యుపభర్తల హత్తుక తత్తరాన మీ
నాంకుని కేళిఁ దేలఁగఁ జనంగ నొకానొక మాటవచ్చినన్
బొంకఁగ “లేదు బంతి" యని బొంకవలెన్ గులటావధూటికిన్. 180

క. అని రాజహంసమణి ప
ల్కిన హేమావతి వినోదకేళిగతి గిరు

క్కున మరలివచ్చి యా కథ
వినియెద ననువొందఁ దెల్పు విహగోత్తంసా! 200

వ. అని యడిగిన హేమావతికి హంసం బిట్లనియె. 201

క. విను మనఁగా ననగా నొక
కనకోజ్జ్వలకూటఝాటఘనగోపురశో
భనకృతకదరీకృతనా
కనగరి మణిభద్రపురము గల దొక భూమిన్. 202

క. ఆ నగరము భోగప్రతి
భానగరిపుఁ డైన మానిభద్రుఁడు భద్రా
నూనచరిత్రుఁడు కాంతిసు
ధానిధి నృపు లెంచ శాశ్వతమ్ముగ నేలున్. 203

తే. అతని చెంగట నసహాయుఁ డనెడువాఁడు
చండదోర్దండమండితమండలాగ్ర
దండితారాతి, “రిపుతలగుండు గండఁ"
డనెడి బిరు దొంది తిరుగు నాయకులలోన. 204

నాయకుని ఆయుధములు, పరిశ్రమ


సీ. భిండిపాలాసి కోదండ భల్లాతక
నారాచ రోహణ నఖర వజ్ర
ముష్టిముద్గర శూల ముసల భుసుండిక
ప్రాస ప్రకూర్మ కర్పట కటారి
కాగ రాయోదండ కణయ కుంతాంతళ
పరశు తోమర చక్ర పరిఘ పట్టి
సములు వంకిణీకాది సబలంబు చివ్వీఁటె
సెలకట్టె యాదిగా నిల నుతింపఁ

తే. దనరు ముప్పది రెం డాయుధములు మఱియుఁ
జిఱుత చెయ్యమ్ము గండకత్తెర తుపాకి
గొరక నుసుగాలమును గ్రద్ధగోళ్లు బుట్టె
చూరి బాణా ధరించు న వ్వీరుఁ డెపుడు. 205

వ. వెండియు నవ్వీరుండు సమదండ, గజదండ, భృంగిదండ, యెడమ వరభృంగి, కుడి వరభృంగి, భృంగిపటలము, పయిసరపుదండ, సింగంపుదండ, పొదలికదండ, యడుగడుగు పొదలికదండ, మద్దెలసంచుదండ, కుక్కుటపుదండ మొదలుగా గల పదిరెండు దండల యఖండపాండిత్యంబుఁ దెలిసి యెడమడుగు పరువడి, కుడియడుగు పరువడి, కదలు పరువడి, దాఁటడుగు పరువడి, కోపు పరువడి, ఆంత్రటీక నాట్యము, ధారు ధాణు థోడ, ఉరుథోడ ఝాటుధాణు, కపాలు, ధారుక, ధారుక ధాకు, రాణుధాకు, ఝాటు నివి మొదలైన పదునాలుగు విసరుల మర్మంబులుం జూచి, కక్కి కొక్కిస డొక్కెర ముత్తైన డొక్కెరము కుమ్మరింపు బోడింపు సందు సీసంబును గొంతుమారును సమసంబును సురాటంబును జేవయుఁ గందనంబును గల్లంబును దొట్టును గిర్ణయుం బరిబొంచుటయు రొండివేటును ఫణంబును గన్నాతును భారంబును చొంగిణియుఁ బెట్లాగును దూణింపును సరిచిత్తరంబును లాగును విట్టాలయంబును దిణింగిణియుఁ బాదనివారణంబును బాదగళాప్తియు గళకతైరయుఁ గాసె నిల్కడయు నృసింహంబును నాదియగు ముప్పదిరెండు విన్నాణంబుల నాణెంబు పరీక్షించి, యొంటి యడుగు కత్తెర, సర్వబంధ కత్తెర, పొదలిక కత్తెర, చిట్టడుగు కత్తెర, పావుపావులు, జాగినపావు మొదలుగాఁగల పదిరెండు పరువళ్ల యగణ్యప్రావీణ్యం బెఱింగి, హరిగతి, గజగతి, వ్యాఘ్రగతి, మహిషగతి, జంబుకంబుగతి, మర్కటగతి, మార్జాలగతి, హరిణగతి, చటకగతి, పక్షిగతి, తాండవగతి, నరగతి మొదలైన పదిరెండుగతుల యవార్యచాతుర్యంబు నేర్చి, విష్ణుచక్రంబును రామబాణంబును నాగబంధనంబును దొలకరి మెఱుపును అల్లిమత్తును విస్సందును హస్తాభరణంబును బదఖండనంబును బరిత్రాడును లోబిత్తరి వెలిబిత్తరి సర్పాంకుశంబు మొదలుగాఁగల పదిరెండు కాయమానంబుల

భేదంబులు విచారించి లోమొన వెలిమొన యుసిమొన ఘుమ్మొన చతురమొన పుణ్యమొన పాపపుమొన చాటడుగుమొన కదలుమొన అరమీటుమొన నెఱమీటుమొన సరితాళంపుమొన యాదిగాఁగల పదిరెండుమొనల నాఱితేఱి లోవెలి గజ్జదుముకు చూరణనఱకు మొదలగు నఱుకుల దగులుం గనుంగొని దండనిల్కడ కదలు తుటుము కలయిక మెలఁకువ కింగళింపు దిశాపదిశలు పాదపుపారువ హస్తపుపారువ దేహపుపారువ నయనపుపారువ వివరాకడ ఎకసరపైసర భృంగిపటలము ఝంపు టెక్కు కరలాఘవంబు లాదియౌ షోడశోపవీతంబుల రీతులు నేర్చి భ్రాంతంబును ద్రాంతంబును ఆప్లుతంబును ఆవిష్కృతంబును ఆప్టికంబును ఆకరంబును అవికరంబును మిశ్రితంబును మానుషంబును నిర్మర్యాదయు విచిత్రంబును ఛిన్నంబును సవ్యజానువు ఆపసవ్యజానువు క్షిప్తంబును ధృతంబును గుడంబును లంబనంబును సవ్యబాహువు వినీతబాహువు త్రిబాహువు సవ్యోత్తరంబును ఉత్తరంబును తుంగబాహువు సవ్యకరంబును బ్రథితంబును యౌధికంబును అపృష్టప్రహారంబును వల్గితంబును స్వస్తికంబు లనెడి ద్వాత్రింశత్ప్రచారంబులు విచారించి యవక్రపరాక్రమంబున సాటి లేక మెలంగు మఱియును. 208

ఉ. సాదనమేలు, చెంపపయి జగ్గుగ వ్రేలు రుమాలు, మీసముల్
మీఁదను జీరుకేలు, జిగిమించఁగఁ గప్పినశాలు, వైరులన్
వాదులగెల్చువాలు, చెలువంబుగఁ దాల్చినపూలు నొప్పఁగా
నా దొరయొద్ద సంబళిక లందుచునుండు నతండు ధీరతన్. 207

తే. అతని కులభామ గుణధామ యలఘుకామ
యతులితారామ యసమరూపాభిరామ
వదనజితసోమ యధికలావణ్యసీమ
హేమరేఖాసనామయై యింతి వెలయు. 208

ఉ. కన్నులచందమున్ నగుమొగంబు విధంబును గల్కిపల్కులుం
జన్నులపొంకమున్ నడుముచక్కదనంబును బాహులందముం

బెన్నెఱిగుంపు సోయగము బిత్తరి యా చెలియందకాక యే
కన్నియలందుఁ గల్గిన మెగాదిగ చూడమె మూడులోకముల్! 209

సీ. జల్లి మాటలుగాక సరిచేయవచ్చునే
సవరంబు లీ శిరోజాతములకుఁ
మూఁతసుద్దులు గాక పోల్పంగవచ్చునే
చందనం బీ మేనిగంధమునకు
మాటమాత్రముగాక దీటుగావచ్చునే
గగన మీ నడుముసోయగమునకును
వదరుపల్కులుగాక తుదిసాటివచ్చునే
కిన్నెరకాయ లీ చనుఁగవకుఁ
తే. చక్కఁదనమెల్ల ముల్లెగా సంతరించి
బ్రహ్మదేవుండు తన నేర్పు ప్రౌఢిచేతఁ
దీర్చి సృజియించెఁగాఁబోలు దీని ననఁగ
వీఁటఁజరియించు నొక్కొక్కవేళ నదియు. 210

తే. దానిఁ దనివారఁ జూడని మానవుండు
చూచి తలయూఁచి మెచ్చని సుజనవరుఁడు
మెచ్చి విరహా ర్తినొందని మేటిఘనుఁడు
కలుగఁ డెందైన మూఁడులోకములయందు. 211

క. మదమొదవు కోడెవిటులకు
హృదయపుటాంతరములోన హేమాహేమిన్
బదివేల మన్మథులు పు
ట్టుదు రా సీమాటి కుచపటుత్వముఁ గన్నన్. 212

వ. అది మఱియును. 213

తే. బిడ్డపాపలఁ గని పెంచు జిడ్డులేక
తిండిచేఁ గండమెండైన దండికతన

నెసఁగు నసగూఁటి పిసవెఱ్ఱి కసరు రేఁగి
జారవాంఛావిహారంబు సలుపసాఁగె. 214

చ. విటులకుఁ గొంగుబంగరము, వేడుకకాండ్రకుఁ బట్టుగొన్ము యు
త్కటతరమన్మథార్తులకుఁ గల్పకుజంబు, భుజంగకోటికిన్
ఘటితనిధానసీమ, యుపకాంతుల చేరువపంట, జారస
త్పటలికిఁ బంచదార యను దానివిలాస మయారె! యారయన్. 215

సీ. కుఱుమాపు మైనున్న కఱలచీరటువిప్పి
చెలువైన సరిగంచు చీరఁ గట్టు
మెఱుఁగంచుకమ్మలు దొరయవం చటుడించి
మణుల రంజిల్లు కమ్మలు ధరించుఁ
[1]జిటి పొటి సొమ్ములు దీసి మెఱుంగు కట్టాణి
పూసల హారముల్ పొసఁగఁ దాల్చు
గుత్తంపు రవికఁ దా హత్తకుండఁగఁ జేసి
కలపంబు కులుకు గుబ్బలను బూయు
తే. నడర బెడఁగైన నిడువాలు జడ సడల్చి
కుప్పె గన్పడ సవరంపుఁ గొప్పుఁ బెట్టు
మరియు ముంగిట నిలుచుండి మొలకనగవు
లెసఁగ విటభాగ్యరేఖ యా హేమరేఖ. 216

చ. కిలకిల నవ్వు, మోవి పలుగెంటుల దీటుఁ గుచంబులోరఁగా
వెలువడఁ బైఁటవేయు, నెఱవింతగఁగేరు, మరుల్కొనంగ, బె
ళ్కులు గొనఁజూచు, లేని వగలుంగొని, మాటికిఁ గుల్కుఁ, గోటి చి
మ్ములు నొనరించు నవ్వెలఁది మోహపుఁబ్రాయమువానిఁ జూచినన్. 217

సీ. ఏటినీటి కటంచుఁ బాటిపంటెత్తుక
పలుమాఱు దిరుగు నిబ్బరముతోడ



రోలు రోఁకలికంచు రూఢిగా నిల్లీల్లు
దిరుగు నేప్రొద్దుఁ దత్తరముతోడఁ
గూరగాయల కంచుఁ గోరి తా బాజారు
కును మఱిమఱి నేఁగుఁ గొమరుతోడఁ
బరిలేని పనిజోలిఁ గొని వాడవాడలఁ
జరియించు సారె కచ్చెరువుతోడఁ
తే. బోలికల నెంచు వలరాచ పొగరు నిగుడఁ
గులుకుఁ బ్రాయంపు నెఱనీటు కోడెకాండ్ర
గమికిఁ దన జగ్గు జిగి సంచకార మొసఁగి
వలపు రెట్టింప మెలఁగు నవ్వనజగంధి.

క. తన కంటికిఁ బ్రియమయ్యెడు
ఘను నొక్కని వెంటనంటి కౌతుక మొప్పన్
మనసంటి కౌఁగిలింపక
చన దింటికి దాని బల్వ్యసన మేమంచున్!

సీ. ఆసువోసెడు దాని హస్తంబురీతిని
గుంచె దీసెడు దాని కొమరు మిగుల
జడ చిక్కు దయ్యంబు చందంబునను జెట్టు
విడిచిన భూతంబు కడఁక తోడ
మద్దెలలో నెల్క మర్యాద, నర్థార్జ
నాసక్తిఁ దిరుగు సన్న్యాసిమాడ్కి
వల్లంబు పోనాడు వైశ్యుని ఠేవను
గాలు గాలిన పిల్లి క్రమము దోఁపఁ
తే. గంతుమాయల నుమ్మెత్తకాయఁ దినిన
వెఱ్ఱితెఱఁగున వ్యసనంపు వెఱ్ఱి వొడమి
చికిలి నెఱ వన్నెకాండ్రకు సివములెత్త
నెవనసి చరియించు వీఁట నాహేమరేఖ.

క. ఈ లీలఁ బురము లోపల
మేలౌ ప్రాయంపు రూపు మీటగు బారిం
జాలి భయ లజ్జ లన్నియుఁ
దూలి చనన్ వెన్నుఁ జఱచి తొలఁగక కలయున్. 221

వ. ఇత్తెఱంగున. 222

చ. చవిఁగొని జారవీరరతిసౌఖ్యము దెప్పలఁదేల నెప్పుడున్
దివురుచు మోహవార్ధిని మునింగి యొకానొక కాలమందునన్
శివశివ! కాపురంబుపయిఁ జింత యొకింతయు లేక చిత్తసం
భపు నిజమాయ గప్పి కలఁపం దలవాకిట నుండు నెప్పుడున్. 223

శా. ఈ మర్యాదను గొన్నినాళ్ళు చనఁగా హెచ్చైన కార్యానకై
భూమీశుం డొకనాఁడు పొమ్మినినచో ఫూత్కారుఁడై యీగతిన్
“స్వామీ! కట్టడఁజేసితే” యనుచుఁ “జీ! జన్మం బిదే” లంచుఁ జిం
తామగ్నముఁ జెంది మందిరములోనం జేరి పెండ్లాముతోన్. 224

వ. అసహాయుం డిట్లనియె. 225

తే. భూవరుం డొక్క పయనంబు పొమ్మటన్న
మంచిదని వచ్చితిని సమ్మతించి నేడు
సంబళము, కంబళము, కత్తి, చద్ది, చల్ల
డంబు, కేడెండు, ధట్టి తెమ్మంబుజాక్షి! 226

క. అని పల్కరించి నప్పుడె
ఘనకుంతల “తొడుసువాసెఁ గదరా” యని యిం
పొనర నవి యిచ్చి పనిచినఁ
జనె నాతఁడు పయనమయి విచారముతోడన్. 227

వ. అట్లసహాయుం డరిగిన పిమ్మట. 228



క. ఆ హేమరేఖ మదిఁగల
మోహావేశమునఁ దోడి ముద్దియ తోడన్
బాహా బాహిఁ బెనంగెను
సాహోయని కంతు పాదుశహి రహిఁ గేరన్. 229

చ. పొలుపగు మావి లేఁజిగురు పొందక పోఁతపిరంగిలోన నె
క్కొలిపిన పుష్పగుచ్చమను గుండు పరాగపు మందునించి వె
గ్గలపుఁ బరాక్రమాగ్నిఁ గొని కంతుఁ డనేటి పరంగి భామగు
బ్బలనెడు దుర్గముల్ పగులు వాఱ గుభిళ్లున నేసి యార్చినన్. 230

క. అళుకుచు మూర్ఛిలి తెలుసుక
కళవళ పడి లేచి మనసు గాసిల్లంగా
భళిరా! యని వెలువడి తన
నెళవరులను జూచికొనుచు నిలుచున్నంతన్. 231

వైద్యుఁడు - వాని పరిశ్రమ


చ. మెలివడు తీఁగచుట్ల జిగిమించిన పాగ జినుంగు పచ్చడం
బలవడు చల్వదోవతి యొయారపు గందపుఁబూఁత డొల్లుపోఁ
గులు మణిముద్రికల్ వలపుగుల్కెడు వీడ్యము చలకవట్ర మం
ఘ్రులతుద ముచ్చెలున్ వెలయ గుప్తగుణుండను వైద్యుఁ డొప్పుగన్. 232

తే. వైద్య మాత్రంబునన కాదు, వజలునట్టి
నిరుపమాకారసౌష్ఠవస్ఫురణచేత
నాశ్వినేయులతో నైన నతఁడు వాదు
కెదిరి యోజింపకయె జవాబీయఁ గలఁడు. 288

వ. మఱియు నశ్వగంధాదిఘృతంబును నైలేయకఘృతంబును షట్పలఘృతంబును దూర్వాదిఘృతంబును బంచగవ్యఘృతంబును నార్ధ్రకఘృతంబుసు గదళీకందఘృతంబును గల్యాణఘృతంబును దండులీయక

ఘృతంబును గూశ్మాండఘృతంబును మొదలయిన ఘృతంబులు సేయు నేర్పునుఁ బంచాగ్నిచూర్ణంబును జిత్రకాదిచూర్ణంబును బడబానలచూర్ణంబును మాణిమండచూర్ణంబుసు మరీచ్యాదిచూర్ణంబును దాళిసచూర్ణంబును నేలాదిచూర్ణంబును దుంబురుచూర్ణంబును గర్పూరాదిచూర్ణంబును బంచబాణచూర్ణంబును భుగ్వాదిచూర్ణంబును నాదియైన చూర్ణంబు లొనరించుచు నుపమయుఁ జించిల్యాదిలేహ్యంబును క్షుద్రాభయాదిలేహ్యంబును జతుష్షష్టిమరీచ్యాదిలేహ్యంబును గుసుమార్దాదిలేహ్యంబును చిప్పల్యాదిలేహ్యంబును బిల్వాదిలేహ్యంబును గుండల్యాదిలేహ్యంబును మొదలుగా గల లేహ్యంబు లొనరించు నైపుణ్యంబును నారికేళాదిరసాయనంబును గుడనాగరాదిరసాయనంబును శిగ్రుపుష్పరసాయనంబును జూతఫలరసాయనంబును సుకుమారరసాయనంబును భల్లాతకీరసాయనంబును సుదర్శనరసాయనంబును వారాహీరసాయనంబును విళంగాదిరసాయనంబును నమృతరసాయనంబును నాదిగాఁగల రసాయనంబులు సేయు పొందిక లెఱుంగువిధంబును శరపుంఖాదితైలంబును లక్ష్మీనారాయణతైలంబును లావాడతైలంబును ధన్వంతరితైలంబును బంచార్కతైలంబును బాశ్చాత్యనింబతైలంబును విషముష్టితైలంబును కేతకీతైలంబును స్నేహార్కతైలంబును వాతాంతకతైలంబును బూతికాతైలంబును భూనాగతైలంబును భృంగామలకతైలంబును మొదలగు తైలంబుల పరిజ్ఞానంబును నారికేళాంజనంబును సౌవీరాంజనంబును వీరభద్రాంజనంబును నీలాంజనంబును గరుడాంజనంబును గపోతాంజనంబును గర్పూరాంజనంబును మొదలుగాగల యంజనభేదంబులఁ గూర్చు చమత్కారంబును నగ్నికుమారకము రాజమృగాంకము పూర్ణచంద్రోదయము వసంతకుసుమాకరము వాతరాక్షసము చంద్రహాసము చంద్రప్రభావతిరసము కందర్పాంకురరసము షణ్ముఖరసము కాలాగ్నిరుద్రరసము తాళకేశ్వరరసము ప్రతాపలంకేశ్వరము చాతుర్థికరామబాణము విష్ణుచక్రరసము విశ్వంభరరసము బడబానలరసము నారాయణరసము మదనభైరవరసము భార్గవరసము జ్వరాంకుశము స్వచ్ఛందభైరవము సంజీవనరసము రసభూపతిచింతామణి మొదలైన దివ్యరసౌషధంబుల గంధక రస నాభుల లక్షణంబు లెఱింగి విఱుచు ప్రావీణ్యంబును లోహభస్మ తామ్రభస్మ వంగభస్మ సీసభస్మ నాగభస్మ శంఖభస్మ సువర్ణభస్మంబులు సేయు మర్యాదయు శీతభంజి అరళ్యాది మాణిభద్ర తాళీస మాత్రలుగట్టు నవధానంబును క్షౌరద్రావక గుగ్గుళు పిష్టకషాయంబులు మూలికలు కైకర్ణికలు సేయు నౌచిత్యంబును సూత్రస్థాన శారీర నిదాన శాస్త్రంబుల పరిచితియును డెబ్బది రెండు నాడిభేదంబులును వాత పైత్య

శ్లేష్మంబుల నుల్బణంబులైన త్రిశతషష్టి రోగంబులకుఁ దత్తచ్చికిత్సలు చేయు చాతుర్యంబును గలిగి రెండవ ధన్వంతరి యనంబరగు నతఁడు. 234

తే. వీథివెంటను రాఁజూచి వెలఁది యనియె
నౌర! యిట్లుండ వలదె యొయార మహహ!
వీనిఁ జిక్కించికొని మారవిగ్రహమున
భంగపడఁజేయనిది యేటి ప్రౌఢతనము. 235

క. అని తన మనమున ననుకొను
చును నిలుచున్నంత దాని సొగసు నొయారం
బును గని మనసిజ సమ్మో
హనవిద్యను జొక్కి యాతఁ డంచుకు రాఁగన్. 236

ఉ. "ఎక్కడనుండి యెక్కడికి నేమి ప్రయోజనముండి వోయె, దీ
వక్కట! నామమే?" మనిన నన్నియుఁజెప్పి "పరోపకారిరా!
యిక్కలకంఠకంఠి" యని యెంతయు డగ్గరఁజేర మారుఁడున్
బ్రక్కలు నెక్కొనన్ బొడువఁ బై కొను మోహముచేత లేమయున్. 237

తే. అమల శశికాంతకాంత శుద్ధాంతకేళి
కా నిశాంతాంతరమ్మున ఘమ్ము రనెడు
పచ్చ బచ్చెన చిత్తరు పనుల మించు
ప్రతిమ సంఘట్టనల మంటపంబులోన. 238

చ. సకినెల కీలుకంఠమున జాయమెఱుంగుల సొంపుకెంపు ము
క్కుకొనల పచ్చకాచిలుకకోళ్లఁ దనర్చిన పట్టుపట్టె య
ల్లికపయి జాఫరాజినుఁగు లేపునఁజెందు పలంగుపోషు త
క్కికగల జాళువాగొలుసు గీల్కొను మంచముపై మహోన్నతిన్. 239

తే. అపుడు గుప్తగుణాహ్వయుం డనెడి వైద్యు
నెలమిఁ గూర్చుండఁబెట్టి యా హేమరేఖ
పండుటాకులు కప్రంపు భాగములను
వేడ్కతోడుత నిద్దఱు వేసికొనుచు. 340

మ. సరసాలుం జిఱునవ్వులున్ మురిపెముల్ సయ్యాటముల్ వింతలున్
గరఁగింతల్ వలపించుటల్ చతురతల్ కాంక్షల్ వినోదంబులున్
దరితీపుల్ వలపుల్ మిటారితనముల్ దాటింపులున్ దచ్చనల్
నెఱచిన్నెల్ మఱపించుటల్ సొగసులున్ నీటుల్ పచారింపుచున్. 241

సీ. ఆసక్తి దీఱని యాలింగనంబులు
నురువాంఛ దరుగని ఛురితవితతు
లనురక్తి వాయనియట్టి చుంబనములు
తమి వెలిగాని దంతక్షతంబు
లభిలాష లుడుగని యతిటపేటంబులు
తాత్పర్య మెడలని తాడనమ్ము
లాశలు మానని చౌశీతిబంధముల్
భావమూనని కళాస్పర్శనములు
తే. లలిత కలకంఠ కలహంస కలరవములు
పలుకు కివకివ కవకవ ప్రకట టకుట
కకుట కహకహ హసనముల్ గళరవములు
చెలఁగ నిద్దఱు రతికేళి సలుపునపుడు. 242

చ. తెమలను నిన్నుఁ బాసి సుదతీ! యని తీయని నీదుమోవి కా
యమృతరసోర్మియేని సమమా? యని మాయని మోహదాహ సం
భ్రమ మెదలోన నెంత తలఁపా? యని పాయని కూర్మితోడి నా
తమి పరభామలందుఁ గలదా? యని దా యని కౌఁగిలింపుచున్. 243

వ. ఇట్లన్యోన్యసరససల్లాపంబుల గుప్తగుణుండు సురతకేళికాలోలుఁడై హేమరేఖతోఁ బెనంగు సమయంబున. 244

సీ. కొప్పెరపెట్టుగాఁ గొమరొప్ప నొనరించి
పై రుమాలు బిగించి పచ్చడంబు
నాగవల్లీదళ పూగ పూరితమైన
యొడిలోన నిడికొన్న యడపమొకటి
చాయలఁ దనరారు సకలాతు నొరతోడి
పృథు భుజస్థలి నొప్పు పెద్దకత్తి
చీర్ణంపుఁబనిచేత జిగిమించు కరమున
సొంపైన సత్తు సున్నంపుఁగాయ
తే. పాదముల మెట్లు మొలఁదాల్పఁబడిన బాఁకు
చల్ది గట్టిన వస్త్రంబు చంకదుడ్డు
నమర గమన జవోద్భవ శ్రమముఁ జెంది
యప్పు డసహాయుఁ డింటికి నరుగుదెంచె. 245

క. అరుదెంచి పురుషుఁ డుండెడి
యరుదెంచి నిజప్రసిద్ది కందఱు నళికే
బిరుదెంచి రోషవశుఁడై
సరిదంచిత ఘోష భాషఁ జానను బిలిచెన్. 246

క. జడియక యిపుడా సతి యే
వడువున బొంకంగవలయు? వనరుహగంధీ!
యడుగుం దప్పినయప్పుడె
పిడుగుం దప్పునను మాట పేర్కొన వినవే! 247

వ. అని. 243

ఉ. ఈవిధి హంసలోకవిబుధేంద్రుఁడు ప్రశ్న మొనర్చి పల్క హే
మావతి కొంతకొంత యనుమానముతో బొటవ్రేల నేల రే
ఖావిధ మొప్ప వ్రాయఁ గుతుకంబున నీకిది తోఁచెనేని ను
ర్వీవరుఁ జేర నేఁగుమని వేఁడిన నప్పువుబోఁడి యిట్లనున్. 240

క. నినువంటి కతలకారిని
గని వినియెడివారి నడుగఁగావలెఁ గానీ
ననువంటి దాని నడిగిన
వినిపింతునె యెట్లు బొంక వివరింపఁగదే! 250

క. అని యడిగిన హేమావతి
కనురాగంబొప్ప రాజహంసకలాపం
బనియె, ససహాయుఁ డటువలె
ఘనరోషం బుట్టిపడఁగ ఘర్షించుటయున్. 261

తే. వైద్యుఁ డప్పుడు గడగడ వడఁకి నాకు
బుద్ధి యేమని పల్క నప్పువ్వుఁబోఁడి
వెఱవకు మటంచు దిట్టయై వెన్నుఁ జఱచి
సంచి విడిపించి యపుడు స్వస్వామి కనియె. 252

చ. కడుపున శూలయెత్తి వడిగాసిలి ప్రాణము లేఁగునట్లయై
తొడిఁబడ నీవులేమి ఘనదుఃఖముచే వెతఁబొంది యీ మహా
త్ముఁడు పురినేఁగఁ గావుమని తోడ్కొనివచ్చితి నీతఁడౌషధం
బిడుటను నేను జీవము వహించితిఁ గ్రమ్మఱ, నేమి సెప్పుదున్. 253

క. అని యుస్సు రస్సు రనుచును
నన్నతోదరరోగమునఁ బ్రియాంగన పొరలన్
గని కుస్తరించి వైద్యుని
మనమున రంజిల్లఁ జేసి మమత దలిర్పన్. 254

తే. నీఋణముఁ దీర్పఁగలవాఁడనే! యటంచుఁ
బచ్చడంబిడి బహుమానమెచ్చ వైద్యుఁ
బంపి సందేహమందక భార్యతోడ
నిండు వేడుక నుండె నో నీరజాక్షి! 255

వ. అని మరాళశేఖరంబు చెప్పిన నరాళకచ యగు హేమవతి తన మనంబున. 258

క. సురుచిర మణి తాటంక
స్ఫురితప్రభ చెక్కులందుఁ బొలయ శిరంబున్
మఱి త్రిప్పి పొగడె నహహా!
గరితలమిన్నదియకాక, కలదే పుడమిన్? 257

వ. ఆ సమయంబున. 258

తే. మై వియల్లక్ష్మి కస్తూరిమళ్ళ చీర
రేయిఁగట్టుక సడలించి రేపటికడ
నుదయరాగంబుఁ దాల్చిన యొఱపు దోఁప
దమము జాఱంగ సాంధ్యరాగము జనించె. 259

చ. పలపలనయ్యెఁ దారకలు పక్షులు కూయఁ దొడంగె, దీపముల్
దెలతెలఁబాఱె దిక్కులను దెల్వి బనించె, బిసప్రసూనముల్

దులదుల విచ్చెఁ దాపులకు దొందడిఁ జేరి జారచోరు లా
మలయసమీరణంబు కడుమందగతిన్ విహరించె నత్తఱిన్. 260

తే. తఱియను కళాదుఁ డుదయభూధర హసంతి
నరుణహేమంబునకు వన్నియలను నింప
గ్రాఁచి, నీరార్చ నెత్తిన కరడునాఁగ
సూర్యబింబంబు పొడిచె నవార్యగతిని. 261

క. మణిఘంటల మొలనూలున్
ఝణఝణ యని మ్రోయఁ గేళిశాలకుఁ జని య
య్యణుమధ్య నృపార్పితగుణ
గణయై వసియించె దినము కల్పముగాఁగన్. 262

వ. అని ప్రత్యుత్పన్నమతి చెప్పిన విని సంతోషించి నలుండు తరువాతి వృత్తాంతం బానతిమ్మని పలికిన. 263

మ. హర కోదండ విఖండన ప్రచుర బాహాదండ! దండాయుధా
ద్యురుధిక్పాల సురానివార్యతర బాహోర్దండ! దండాంకభి
ద్ధరిణాక్షీమణి జీవనాకృతి నిజాఖ్యాఖండ! ఖందాబ్జభృ
ద్భరసాభృద్రిపువాహ సన్నిభ యశోభాకాండ! కాండోదరా! 264

క. ధారాధర ఘృణివారా!
వారణ రాజన్య వైరివారణ ధీరా!
ధీరాజిత శుభకారా!
కారణ పురుషావతార! కరుణోదారా! 265

కలహంసోత్సాహ వృత్తము
కలుషదూర! భవవిదూర! కమలసారలోచనా!
కలితహార! వరవిచార! ఖరవిహారమోచనా!
లలితనీరనిధిగభీర! లసదుదార కీర్తిని
ర్దళిత హార శరపటీర దర సుధారసోత్కరా! 266

గద్యము.

ఇది శ్రీమత్కౌండిన్యసగోత్ర పవిత్రాయ్యలరాజాన్వయ సుధావార్ధి పూర్ణిమాచంద్ర నిస్సహాయ కవిత్వనిర్మాణ చాతుర్యనిస్తంద్ర శ్రీరామనామపారాయణ నారాయణామాత్యప్రణీతంబయిన హంసవింశతియను మహాప్రబంధంబునందుఁ బ్రథమాశ్వాసము.


——: O :——

  1. ఇచటి ఛందోనియమభంగము చింత్యము.