హంసవింశతి/పదునేనవ రాత్రి కథ



దీఁగను ననలు హత్తిన చందమున మేన
సొగసుగా రతనంపు సొమ్ము లలర
వదనచంద్రునిఁ గూడ వచ్చిన రోహిణి
మురువున ముత్తెంపు ముక్కరమర
మంచు గప్పిన గట్లసంచున వలిపెంపుఁ
బైఁటలో గబ్బిగుబ్బలు చెలంగఁ
తే. బరఁగు జగడాల పగడాల బరిణిలోనఁ
గ్రాలు మగరాల నిగరాల లీల వీడెపు
టరుణ రుచిఁ జిల్కు నోరఁ బల్వరుస మెఱయ
వచ్చి నిల్చిన యాహేమవతిని గాంచి. 120

క. జలజభవాశ్వం బిట్లనుఁ
జెలియా! యింకొక్క గాథ చిత్రతరంబై
చెలువొందెడిఁ జెప్పెద వినఁ
గలవే? యని యడుగ, వినెదఁ గాకని నిల్చెన్. 121

వ. హంసం బిట్లనియె. 122

పదునేనవరాత్రి కథ

రెడ్డిసాని యొక పగ లిద్దఱినిఁ గూడుట

మ. ఇతర ధ్యానముమాని నీవు వినుమీ హేమావతీ! ద్రావిడ
క్షితిలోఁ జిత్ర విచిత్ర వస్తువితతిన్ జెన్నారు కాంచీపురిన్
స్థితుఁడై కాపురముండు శూద్రుఁడొకఁడా శ్రీదృష్టికిం బాత్రమై
శ్రిత నానాజన భాగధేయమగుచున్ సీరాంక నామంబునన్. 128

కృషీవలునిల్లు, ధాన్యములు, కాయలు

సీ. ముంగిటఁ బులిజూదములు గీచియుండిన
రచ్చబండలు గొప్ప ప్రహరిగోడ

పంచతిన్నెలు చాలుపట్టెలు ముమ్మూల
గూండ్లు దీర్చిన యట్టి గోడ లలరు
దేవర చవికె, పందిరి కోళ్లగూఁడులు
గొఱ్ఱు గుంటక కాఁడి గొడ్డపల్పు
రిట్టువ గల కాఁడి కొట్టంబు పలుగాఁడి
కంపపాతిన లేఁగకదుపు దొడ్డి
తే. ప్రత్తి గూటంబు తొట్టియుఁ బలక పీఁట
బావి పిడుకల కుచ్చెల పసుల మేఁపు
మంగలము దాలి ఱో లిర్కు మ్రాని సందు
గలిగి విలసిల్లు నాతని నిలయ మెపుడు. 124

వ. అవియునుంగాక మఱియును. 125

తే. ముద్ద గిడ్డ జమిలిమార్పు ముసుగు పచ్చ
మార్పు జింకపురి పరంగి మల్లెమార్పు
పాల్పసర కొమ్మునూఁగూరి పైరజల్లి
మసర తెల్లెళ్లి జొన్న రమ్మంగఁ గలపు. 126

సి. జడకొఱ్ఱ కొఱ్ఱలు చామలు వెలిచామ
కుట్టారి కారిక కొండబరిగె
బరిగె సజ్జయు గిడ్డ గిరసజ్జ మజ్జపా
ల్గిడ్డచే న్పెద్ద రాగెయును యవయు
గోదుమ పెదనువ్వు కుఱునువ్వు తెలినువ్వు
కుసుమ తెల్లగిసెయు గోఁగు జనుము
చిటితోఁట వెలి పొద్ద చేపరంగి పేరాము
దము చక్కెర చిటాముదమును మఱియు
తే. మినుము నెఱ తెల్లకంది చిర్సెనగ సెనగ
పిచ్చ నలపిచ్చ కుఱుపిల్ల పెసరకాయ
మళ్లు నలసంద లుబ్బడాల్ నల్ల తెల్ల
యులవలు పటాణములు పుట్ల కొలఁది గలవు. 127



సీనమాలిక.
బంగారులుతీగల గంగాజలమ్ములు
కసూరినిగరాలు కటకసరులు
నిప్ప పూరాజనా లేనుంగు కొమ్ములు
మల్లె శ్రీ గంధులు మదనగంధు
లేలిక రాజనా లీశ్వరప్రియములు
రావిపూ రాజనాల్ రత్నసరులు
కుసుమపు రాజనాల్ గుత్తి బల్గుత్తులు
కస్తూరిపట్టెలు గంధసరులు
మందిగండ్రలు నాగమల్లెలు తీఁగమ
ల్లెలు కృష్ణనీలాలు వెలువడాలు
మన్మథబాణాలు మరువంపు మొలకలు
సన్న మఱింగెలు జున్నుబ్రాలు
పొన్ను శ్రీ రాజనాల్ పునుఁగు రాజనములు
ముద్దుఁ బ్రాలారళ్లు ముత్తుసరులు
సన్న సూదులు పచ్చగన్నేర్లు కోదండ
రామముల్ కేసర్లు రాయసర్లు
చంద్రవంకలు జీనిసరులు కాంభోజులు
వంగాకు బుడమలు పొంగుబ్రాలు
జిలకర రాజనాల్ చింతపువ్వులు గోరు
రాజనాల్ బూదప్రోల్ రాజనాలు
రామబాణాలు రెక్కాములు వెన్నము
ద్దలు జిల్మ బుడమెలు దాళువాలు
గొప్పకాయలు బలుగుత్తులు పాలమీఁ
గడలు శ్రీరంగాలు కామదార్లు
తెక్కపాలలు కాకిఱెక్కలు పుష్ప మం
జరులు సీతాభోగసరులు గౌరి
కుంకుమల్ రణబెండ్లికొడుకులు పిచ్చుక
గోళ్లు ప్రయాగలు గొజ్జుఁబ్రాలు.

గరుడసరుల్ పోతుగంట రాజనములు
మోదుగ తొడిమలు ముదుకసరులు
పచ్చసరుల్ రెడ్డిపాలవంకెలు సుఖ
భోగులు పచ్చకర్పూరసరులు
నివ్వరుల్ దెబ్బసల్ నీరుకావులు గాజు
కప్పెరల్ కురువడాల్ కంఠసరులు
సాలంక లలుగు రాజనములు సంభావు
లవసరదార్లు మోహనపు సరులు
మణిసరుల్ మసరులు మంకెనల్ పగడంపుఁ
దీఁగెలు మదిప్రాలు దేవసురులు
లత్తుకబొత్తులు లక్ష్మీ మనోహరాల్
భారతీసేసలు భాహుపురులు
వజ్రపుఁ దళుకులు వాసన రాజనాల్
జవ్వాదివంకెలు గవ్వసరులు
సంపంగి పూవడ్లు జాజి రాజనములు
గంబూర రాజనాల్ కన్నెసరులు
తమ్మిపూ రాజనా లమ్ముడు కొణిగెలు
జీనువ ముక్కులు చిలుకముక్కు
లేదుకఱ్ఱలు వంకె లిసుక రాజనములు
పులిగోళ్ల వంకెలు, బొగవసరులు
తే. జిలి తొగల రాజనములు నలవరులును
దెల్ల నల్ల చెన్నంగులు దీవసరులు
నాది యగు పేర్లు గలుగు వడ్లతని యింట
నుండు శతకోటి పుట్టు లొక్కొక్కదినుసు. 128

తే. దొండకాయ ములకకాయ తొట్లకాయ
జంబికాయయు నెఱ్ఱల సందకాయ
వెలయు నుస్తెకాయయు రామములుకకాయ
మేడికాయ కాకరకాయ గూడ నింక. 129

సీ. రామగుమ్మడి యోబరాజుగుమ్మడి చార
గుమ్మడి బూడిదగుమ్మడులును
గిండిసొఱయుఁ దీఁగెకిన్నెర సొఱయును
బీఱ సముద్రపు బీఱ నేతి
బీఱ పిచ్చుకపొట్ల పెద్దపొళ్ళేనుఁగు
దంతపుఁ బొళ్ళలు తంబలు వెలి
కాకర పొట్టికాకరలు మేఁకచెవి చి
క్కుడు పాలగణుపులు గోరుచిక్కు
తే. డులు సుగంధాలు బొంతనంటులు సురళులు
గంజి పందిటి కపురపొంకాయ తరులు
బూజుపచ్చ కురాసాని పుచ్చ పెద్ద
దోస నక్కదోసలు వాని తోఁటఁ గలవు. 130

ఆ. చేమ కంద గెనుసు చిఱిగోరు పెండ్లము
పొసఁగు తెల్లగెనుసు భూతగెనుసు
లల్ల ముల్లి పసుపు ముల్లంగి వెల్లుల్లి
గాజరయును మొదలుగాఁగఁ గలవు. 131

చ. గురుగెఱ బొద్ది చెంచలియుఁ గుచ్చలి చిఱ్ఱి తగిర్సి తుమ్మి దు
స్సరి బలుగూటి బొద్దినెలి చల్మిలి పల్లెరు రూక పాత్కె వె
ల్వరిగిసె మున్గ యెల్కచెవి పావిలి దొగ్గలి పొన్నగంటి దే
దరి నరవంజి చేతర సదాపయు గొండలి కొండపిండియున్. 132

తే. పాల వాయింట తక్కలి బచ్చలి కొయు
గూర చక్రవర్తము చిల్క కూర గోళి
కూర దుంపబచ్చలి తోటకూర కొతిమ
రాకు సోపు మెంతాకు చుక్కాకు గలదు. 133

సీ. పనస సీతాఫలాల్ చిననిమ్మ గజనిమ్మ
దూదినిమ్మయు నార మాది ఫలము

నారద ఖర్జూర నారికేళాదులు
రామ ఫలంబులు జామ ఫలము
లలరారు బొంత కిత్తళియుఁ బోకయుఁ బోక
పిప్పలి నేరేడు పెద్దవెలఁగ
రామావళియు గమరక జీడిమామిడి
బారంగి పెనురేఁగు పాలఫలము
తే. చెట్లు పండెడి తోఁటలు చిట్టిగొట్టు
చెఱకు రసదాళి చెఱ కెఱ్ఱచెఱకు నల్ల
చెఱకు తోఁటలు కలుజోడ్లు సీర్పిదినుసు
కారపాకాకు దోఁటలు గల వతనికి. 134

సీ. మామిడికాయయు మారేడుకాయయుఁ
గొండ ముక్కిడికాయ కొమ్మకొయ
గరగుకాయయు మొల్గకాయ యందుగుకాయ
యుసిరికకాయయు నుస్తెకాయ
యేకరక్కాయయు వాకల్మికాయయుఁ
జిణినెల్లికాయయుఁ జిల్లకాయ
కలబంద గజనిమ్మకాయ నార్దపుఁగాయ
చిన నిమ్మకాయయు జీడికాయ
తే. కొందెనపుకొమ్ము మామెనకొమ్ము బుడమ
కాయు యల్లము మిరియంపుఁగాయ బీఱ
కాయ కంబాలు కరివేఁపకాయ యాది
యైన యూరుఁగాయలు గల వతని యింట. 135

తే. పంట మోటాటి పెడకంటి పాకనాటి
యరవెలమ లాది కొండారె మొఱుసు గోన
కొణిదెకాఁపులు మొదలైన క్షోణి దనరు
కాఁపులకు నెల్ల మిన్న యక్కాఁపుకొడుకు. 136

తే. అతని కొక్క కులాంగన యగ్రమహిషి
చనిన పిమ్మట సత్యకేశిని యనేటి
పేరు గల్గిన చిన్నాలు బిసరుహాస్త్రుఁ
డేలు ప్రియురాలు నాఁగ సొంపెక్కి క్రాలు. 137

సీ. మెఱుఁగంచు కమ్మలు మెడనూలు గెఱల ము
క్కర యుడ్డబుగడలు కట్లసరులు
దండి తీరైన చింతాకు తీఁగెయు నాను
పల్లెరుపూవులు బన్నసరము
కుప్పెసౌరము మెచ్చికొన్న సూలలదండ
యందగించిన జోడు సందిబొందె
నిగరమైన సిరాజి పగడాల చేకట్లు
కాలికడెంబు లుంగరపుజోళ్లు
తే. గిలుకు మట్టెలు జంటీల జిలుఁగు ఱవిక
సన్నమౌ వేయుఁగన్నుల చలువచీర
పసిమిఁ జిల్కెడు ముంజేతి పచ్చలమర
దుడ్డెతనమునఁ దిరుగు నా రెడ్డిసాని. 138

క. ఆ చొక్కపు జిగి చర్గవ
నా చిక్కని మెఱుఁగుటారు నా మోమందం
బా చక్కని రూపము పస
చూచిన మరుఁడైన భ్రాంతి సొలయక యున్నే! 139

సీ. మేఘేందు కార్ముక మీన దర్పణ వజ్ర
కచ ముఖ భ్రూ నేత్ర గండ నాస
దరసుధా బింబకుంద శ్రీమణీ కర
గళ వాగధర దంతకర్ణ జిహ్వ
పద్మలతాధర భంగ భోగ మృగేంద్ర
కర భుజా కుచ వళి కక్ష మధ్య

బిల తుండ చక్ర కాహళ తార పల్లవ
నా భ్యూరు తటి జంఘ నఖర పాద
తే. ప్రసవ విద్రుమ చలదళ పత్ర కనక
కదళికాపర్ణ కౌముదీ గంధసార
మార్గ వాంగుళ్యనంగ సద్మరుచి చరమ
హాసివాసన యగుచు నయ్యబల మెఱయు. 140

క. మినమిన లీనెడు నునుమే
నున నొనరిన వనజనయన నూతన నలినా
ననమున ననువుగఁ గనుఁగొనఁ
దనరుఁ గనత్కనక వననిదాన స్ఫూర్తుల్. 141

సీ. పలుకులు కప్రంపుఁ బలుకుల వర్షించుఁ
జూపు మారుని తూపు రూపుమాపుఁ
గరములు బిసభీతికరములై సిరులొందు
జడజగ్గు లిరులను జడియఁజేయు
మందయానము హంస చందము నిరసించు
మించు మైనిగ్గు క్రొమ్మించు నొంచుఁ
గుచముల పసలు లికుచముల నిర్జించుఁ
జెక్కిళ్లు ముకురాలఁ జెక్కివైచుఁ
తే. దావి కెమ్మోవి యమృతంబు బావి ఠీవి
యారు చెన్నారు చీమలబారు దూఱు
నూరు లలరారు ననఁటులసౌరుఁ గేరుఁ
గాంత నగుఁ గాంత లతికాంతకుంతకాంత. 142

క. కమలంబులఁ గమలంబులఁ
గమలానన లోచనముల కాంతి జయించున్

బ్రమదాళులఁ బ్రమదాళుల
రమణీమణి వాలుఁజూపు రహి నిరసించున్. 143

తే. దాని బిగిగబ్బి సిబ్బెంపుఁ దళుకు టుబ్బు
గుబ్బ చన్నుల కౌఁగిలి కోరనట్టి
మానవాగ్రణి వసుమతీ స్థానమునను
వెదకి చూచిన లేఁడుపో! విద్రుమోష్ఠి! 144

తే. అది మనోజ్ఞములైన యాహారములను
గండ మెండైన మదముచేఁ గన్నుఁ గాన
కమిత పల్లవ రతికేళి కాస వొడమి
మీఱు చిత్తముతోడ నేఁకారఁ దొడఁగె. 145

సీ. పని వంటవార్పుల బాధలించుక లేక
తీరిన మంచి సంసార మొదవె
నత్తమామల పోరు నారు దూఱెఱుఁగక
పొందొంద నిచ్చఁ గాపురము దనరెఁ
గుడువఁగట్టను బూయఁ దొడుగ వస్తువులు య
థేచ్ఛముగా నుండు నిల్లు దొరకెఁ
బట్టి పల్లార్చ కేపట్టున దయఁ జిల్కు
మనసు గల్గిన యట్టి మగఁడు గలిగె
తే. నింత గల్గిననేమి నా హృదయ మెఱిఁగి
మనసు దీఱను బదివేలమంది మగలఁ
గలుగఁ జేయక చెడు దోసకారి బ్రహ్మ
యొకనిఁగాఁజేసె ననుచు నూరక తపించు. 146

క. ఆ పాపమేమి చెప్పుదుఁ
గాఁపుది మదమెత్తి కన్ను గానక పురిలోఁ
జూపరుల నెవరి నైనను
నేపున సంభోగకేళి నెనయం జూచున్. 147

చ. అటువలెఁ జూచువేళ నొకఁ డంగద నామకు దాయుధోప జీ
వటకుఁ బ్రయోజనార్థము రయంబున వచ్చిన వానిటెక్కు చొ
క్కటపు టొయారమారఁగని కాపుది మోహము నిల్పలేక మి
క్కుటపు రతిప్రయత్నమునకున్ గరఁగించెద నంచు నిట్లనున్. 148

తే. "ఎన్నఁడును రానివాఁడ వీవేమిపనికి
వచ్చినాఁడపు కూర్చుండు వన్నెకాఁడ!
మంచమదె తెచ్చి యింటిలో నుంచినా" న
టన్న విని వాఁడు “పోవలె" ననుచుఁ బలుక. 149

ఉ. “పోవలెనంటివా? రమణి మోమటు చూడక యీడనుండలే
వో? విడిపించు బిడ్డలకు నొయ్యనఁ జన్నిడి నిద్రఁబుచ్చఁ బోఁ
గావలెనో? భ్రమించు విటకత్తెల యల్కలు దీర్చబోయెదో?
శ్రీ విభవోత్తమా! యెఱఁగఁజెప్పు?" మటంచును రెట్టఁబట్టుకన్. 150

తే. కోళ్లు నిండారఁగా దొడ్డగొంగడపుడు
పఱచి యాతని మంచంబుపైకిఁ జేర్చి
వలచి వలపించి చిన్నెల వగలు చూపి
యెనసి రతికేళి నేలె నయ్యిగురుఁబోఁడి. 151

వ. ఇత్తెఱంగున. 152

క. అనిరుద్ద చేష్ట ఖేలన
మనివారిత దంతఘాత మతిచిత్రతరం
బనిదంపూర్వానందం
బనుపమ గురుసురతసౌఖ్య మబ్బినయంతన్. 153

క. ఈలాగు నిచ్చనిచ్చలు
మేలుగఁ గోరికలు దీఱ మిథునత నన్నున్

దేలింపు మనుచు ననిపినఁ
జాలన్ బాగుగ నతఁడటు సలుపుచునుండెన్. 154

క. అల కాఁపు వగల చిలుకల
కొలికికిఁ దమి యింతయైనఁ గోల్పడక మదం
బరిధారి యుండ నొకనాఁ
డెలమిని నయ్యూరి బేరి హితమలరారన్. 155

క. ముదుక రుమాలు గుడ్డ భుజమూలమునన్ గడితంబు మీఁదఁ బ్రాఁ
తదియగు దుప్పటంబు మొలఁద్రాసును గీసరలుండు తిత్తి స
న్నది నెలవంక నామము వినాయకు నుంగర మంగుళంబునం
బొదలఁగ రత్నగుప్తుఁడు సమున్నతి నింటికి రాఁ బ్రియంబునన్. 156

క. ఆ సత్యకేశినీసతి
నాసత్యసమాను వైశ్యనాయకు రూపం
బాసఁగొని చూచి మోహము
తో సరసము లాడుకొనుచుఁ దోషణ మొదవన్. 157

క. వక్కాకుఁ బొగాకిడుమని
చక్కటికిని బోయి పైఁట జాఱఁగ నెదుటన్
మొక్కనగ వొప్ప నిలఁబడి
"దక్కితి విఁక నెందుఁ బోయెదవురా! బావా!" 158

తే. అనుచుఁ దమినిల్పలేక[1] నయ్యంబుజాక్షి వలుఁద గుబ్బలఁ గౌఁగిఁట బలియఁబట్టి
సురతకేళినిఁ దేలించి చొక్కుచుండ
నపు డటకువచ్చి యయ్యంగ దాహ్వయుండు. 159

ఉ. “వచ్చితి రెడ్డిసాని! తరివాకిలిఁదీయు” మటంచుఁ బిల్వ లో
హెచ్చిన సాధ్వసాప్తి నపుడెంతయు వైశ్యుఁడు సంచలింపఁగా

నచ్చపలాక్షి వాని “భయమందకు" మంచొక గాదె లోపలం
జెచ్చెర నుంచి నాయకుని చెంతకుఁజేరి మహానురాగయై. 160

ఉ. వాకిలిఁ దీసి చొక్కటపు వాలుగ కన్నులఁ దేలఁజూచి నా
ళీకదళాక్షి కుందనపు లిబ్బులనేలెడు గుబ్బచన్మొనల్
సోఁకఁగఁ గౌఁగిలించి నెఱసొంపునఁ గేళిగృహంబు లోనికిం
దోకొనిపోయి వాని రతినూతన సంభవ పారవశ్యయై. 161

క. అలకాపుర సంపద లల
రల కాఁపువధూటి యాననాలంకృతి కా
ర్యలకా పుంజితయై వే
డ్కలఁ గాఁపుర మొప్పఁజేయు కాలము నందున్. 162

ఉ. నల్లనికమ్మి పచ్చడము నామముబొట్టును గుచ్చుటద్దముల్
తెల్లరుమాలువల్లె మొలఁదిత్తి కరంబునఁగోల వ్రేళ్ళ సం
ధిల్లిన వంకుటుంగరము తీరగుపూజల జంటగుండ్లు రం
జిల్లఁగవచ్చి రెడ్డి, తన చెల్వను వాకిలిఁ దీయఁ బిల్చినన్. 163

క. ఆయెడ నిద్దఱు మిండలఁ
బాయక రతిసల్పు కాఁపుపడఁతుక యెటులన్
మేయించి బొంక వలెఁ జెపు
మా! యని చక్రాంగ వంశమండన మనినన్. 164

చ. ఆ వచనంబు వేడ్క విని యౌదల యూఁచి నిడూర్పు పుచ్చి హే
మావతి పల్కె, “హంసవర ! మాటికి మాటికిఁ బృచ్ఛ యేల? నీ
వే వినిపింపుమా! వినెద! వింతసుమీ! తెలియంగరా డదె
ట్లో విశదంబుగా" ననిన నుత్పలగంథికి హంస యిట్లనున్. 165

చ. తన నిజనాయకుం డిటులఁ దల్పు సడల్పు మటంచుఁ బిల్చినన్
విని యల వన్నెకాఁడు భయవిహ్వలుఁ డైన 'వడంక వద్దురా'



యని నగి వీపుఁ దట్టి, “చనుమా! పగఁ జాటుచు, మళ్ళీ చూడ కే
మనకను రెడ్డి తోడ" నని యా సఖి పంచిన నాతఁ డంతటన్. 166

వ. "మంచి" దని యప్పుడు. 167

క. త్వరితమ్ముగఁ దల వాకిలిఁ
దెఱచుక బంట్రవుతు నోటి తీఁటయుఁ దీఱన్
బొరి పొరి వదరుచుఁ జనియెడి
తెఱఁగు నిరీక్షించి రెడ్డి తెగువన్ మగువన్. 168

తే. పిలిచి కోపారుణాక్షుఁడై పేర్చి పలికె
“నేమి బంట్రోతుగాఁ డిటు లెమ్మె మెఱసి
వచ్చినాఁ డదిగాక తా వదరుకొనుచుఁ
బోవుచున్నాఁడు సెప్పుమా! పువ్వుబోఁడి”. 169

క. అని పతి యడిగిన జడియక
“వినుమా!" యని రెడ్డిసాని వింతలు గులుకన్
నునునగ వొప్పఁగఁ జెప్పెను
“గనుమా! యీ సెట్టిగాని, ఘర్షణ మొదవన్. 170

తే. నగరివారలు పిల్చుచున్నా రటంచుఁ
దఱుముకొని రాగ నిలుఁజొరఁ దలుపువేయ
గోడతఁడు దూకి వచ్చి తోడ్కొనుచుఁ బోవ
‘రెడ్డి లేఁడు గదా’ యని యడ్డ పడితి. 171

ఉ. అంతట నీవు వచ్చితివ యాతఁడు నాగ్రహవృత్తిచేత న
న్నెంతయు దూఱుకొంచుఁ జనియెన్ మగఁడా !” యని చెప్పి వైశ్యునిన్
జెంతకుఁ జేరఁ బిల్చిన వసించు కుసూలము వెళ్ళి సాధ్వసా
క్రాంతశరీరుఁడై యెదురుకట్లకు వచ్చిన రెడ్డి యంతటన్. 172



తే. వాని దయఁ జూచి “నేనున్న వాఁడ నీవు
భయపడకు సెట్టిగా!" యని పల్కరించి
పొమ్మనిన మస్తకవిధూననమ్ము చేసి
యేఁగె నాతఁడు తనయింటి కేమి యనక. 173

ఉ. ఆవిధి బొంకనేర్చిన నృపాగ్రణి దగ్గర కేఁగుమన్న హే
మావతి నాసికాగ్రమున మాటికి వ్రేలిడి కర్ణపత్ర శో
భావళి చెక్కులన్ నటనమాడ శిరంబటులూఁచి మెచ్చుచున్
వేవినఁ జూచి యంత నిజవేశ్మముఁ జేరఁగ నేగె గొబ్బునన్. 174

క. ఈ గరిమను నిజగృహమున
కేగి ధరాధీశమోహ హృదయాంబుజయై
యా గజగామిని యొండొక
లాగున దినమెల్లఁ గడిపి లలి నిశియైనన్. 175

చ. ఘనశితికంఠకంఠ కలకంఠ ఘనాఘన నీలకంఠ కం
జనయన ఖంజరీట బలశాసన నీల తమాలమాలికా
ప్రణుత మృగేక్షణా చికురభార మృగీమద చంచరీక కా
ననకిట కొక కజ్జల వనద్విప సన్నిభమైన చీఁకటిన్. 176

ఉ. కొప్పున జాజిక్రొవ్విరులు కుంకుమగందపుఁబూత గుబ్బలన్
గొప్ప సుపాణి రాసరులు గోమలదేహ లతాంతవల్లికన్
గప్పెడు సొమ్ము పెన్సిరులు గన్నుల పండువు లాచరింపఁగా
నెప్పటియట్ల వచ్చి హరిణేక్షణ నిల్చెను హంస సన్నిధిన్. 177

ఆ. నిలువఁ గలువకంటి చెలువంబు వీక్షించి
దినము దినము నొక్క తెఱఁగు దోఁప
సొగసుఁ బూన నేర్చు సుందరాంగివి నీవె
యనుచు మెచ్చి హంస మనియె సతికి. 178

  1. ఈ కవి ద్రుతాంతముగనే వాడును