హంసవింశతి/పదునాల్గవ రాత్రి కథ
క. కని రాజహంసవరుఁ డి
ట్లను “భళి! మేల్జాణ వౌదువౌ సొగ సమరెన్
జననాథు నెనయఁ బోయేదొ
విని పొ మ్మొక కథ” యటన్న వెలఁ దిట్లనియెన్. 68
మ. “కలహంసాధిప! నీ స్వబుద్ధి నిటులన్ గల్పించెదో! కాక పె
ద్దలచేఁ బూర్వము విన్నవాఁడవొ! మహాదైవ ప్రసాదంబొ! విం
తలు సుమ్మట్లు వచింప నన్యులకు, మేధాశక్తి నిన్ బోలు వా
రలు లేరింక, బలారె; చెప్పు” మనుచున్ రాజాస్య ప్రార్థించినన్. 67
పదునాల్గవ రాత్రి కథ
కోమటిబోటి సుంకరి కొల్వుకానిఁ గూడుట
క. ఆ మానసౌక మభినవ
తామరస మరంద బిందు తత బృందంబుల్
నేమించి కురియు వాక్కుల
హేమావతి కనియె మోద మిగురొత్తంగన్. 68
చ. వినుము విదర్భ దేశమున విశ్రుతమై సిరులందు విహ్వలం
బన నొక పట్టణం బమరు, నచ్చట నొండొక వైశ్యుఁ డెంతయున్
దనరు హిరణ్యగుప్తుఁ డను నామముతోడఁ దదీయ భార్య హ
స్తిని యను పేరునన్ బరఁగుఁ జెప్ప నశక్యము దాని వైఖరుల్. 69
క. మిల మిల మను మెయి తళుకులు
పొల యలరుల వలపు గులుకు పొలుపగు నగవుల్
చిలుకల కదుపుల నదలుచు
చెలి సొలపుల పలుకు లలరుఁ జిలుకలకొలికీ! 70
క. విరులా! నగవులు, నీలపు
సరులా! కురు, లుబ్బు గబ్బిచన్నులు జాళ్వా
గిరులా! యూరు లనంటుల
సిరులా! యని జనులు మెచ్చఁ జెలువ చెలంగున్. 71
క. చిందం బనఁదగు గళమును
గుందమ్ముల తీరు రదన కోరక పంక్తుల్
మందమ్ములు గమనమ్ములు
చెందమ్ములు పొగడఁ దరమె? చెలువపదమ్ముల్. 72
ఆ. కలువ చెలువ చెలువుఁ గైకొను కన్నులు
జగ మెఱుంగు రంగు జగమెఱుంగుఁ
గులుకుఁ దొలుకు మొలక గుబ్బల పసగల
వనిత మేలు కొక్క వనిత మేలు. 73
సీ. బలితంపుఁ బులినంపు వెలఁ బెంపు జఘనంపు
బోఁడిమెన్నఁగ నొక్కనాడు పట్టు
విరితమ్ములను గ్రమ్ము సిరిఁజిమ్ము వదనమ్ము
చెలువమెంచుట కొక్క నెలయుఁ బట్టు
నిరు లెప్పుడును గుప్పు నెఱకప్పుగల కొప్పు
ప్రణుతింప నొక్క యబ్దంబు పట్టు
జిత జంభకరికుంభ తతడింభ కుచకుంభ
యుగమెన్నుటకు నొక్కయుగము పట్టు
తే. చొక్కటపు రిక్కగమి నిక్కు టెక్కు జక్కు
నఖముల నుతింపఁ గల్పకాంతంబు పట్టుఁ
గెంజిగురు సంజ కెంజాయ పుంజిఁ దెగడు
పదము లెన్నంగ బ్రహ్మకల్పంబు పట్టు. 74
క. ఘన జఘన స్తన యుగములు
వెనుకను దలమ్రోల నుద్దవిడి నొత్తంగా
మన లేక యారు మఱుఁగునఁ
బనుపడ దాఁగెననఁ గౌను భామకుఁ దనరున్. 75
సీ. విష్ణుపదం బంటె వేమఱు మేఘంబు
చంద్రుండు ముట్టె నీశ్వరు శిరంబు
తీర్థంబులోఁగొని ధృతినిల్చె శంఖంబు
కోరి ప్రసాదంబుఁ గొనె ఘటములు
దండనుండిన సాధుతరులఁ దాఁకెను లత
లతనుధర్మముల తోడనియె విరులు
పుణ్యనదీనదంబుల నిల్చెఁ బులినమ్ము
లల పితామహునాజ్ఞ నలరె నంచ
తే. కుంతలానన కంధర కుచ సుబాహు
నఖ కటి యాన పటు శోభనత వహించి
దీటు రాలేమటంచును దృఢ మనీషఁ
జెలియ యంగమ్ములకు బాస చేసినటుల. 76
ఆ. మొగము నిండియుండు మోహంపుఁ గన్గవ
యురము నిండియుండు నుబ్బుచనులు
వీపు నిండియుండు వేనలి జొంపంబు
దానిఁ బొగడఁదరమె! మానవులకు. 77
క. ఆ హస్తిని యౌవన ము
త్సాహమునన్ బిడ్డ పాప సందడి లేమిన్
మోహన తర విట వృషభ
వ్యూహములకు వల్లెత్రాటి యొఱపున మెఱయున్. 78
చ. మిడి మిడి గాని చేకటులు, మేలిమి సూలల దండ జోడుకా
ల్కడెములు సండిబొందె విడికమ్మల మించుల మించు మించులన్
నిడి బుగడల్ జరాసరి హొణీలఁ దనర్చిన కట్లదండ బే
గడ కుతికంట్లు సూసకము మల్లను మెట్టెలు పూని వీఁగుచున్. 79
క. అది గర గరనగు పురుషుం
డెదుటఁబడ వీఁడు జీవితేశ్వరుఁ డయినన్
మదిఁ గల దుఃఖం బెల్లను
దుదముట్టు నటంచు మోహ దుర్దశ నొందున్. 80
వ. అది మఱియును. 81
చ. ముదమునఁ బల్లెపట్రలకు మూఁటకు ముల్లెకటంచు నాథుఁ డిం
పొదవఁగ నేఁగ జారజనయూథహితప్రదభాగధేయమై
కదిసి చరించుఁ జిన్నెలను గాసిలఁ జేయుచు మోహకాంక్షతో
మదనుఁడు సానచిమ్ములు సుమాళము తోడుతఁ జిమ్ముచుండఁగన్. 82
వ. ఇట్లు సంచరించు నయ్యవసరంబున. 83
సీ. హేరాది యొడ్డాది భారాదులను వచ్చు
గోనెలు తణగాలు గోతములును
నూలాసు నగలు కంట్లాలు కంబడికట్లు
మూఁటలు చిక్కాలు బాట నుండు
వల లావణము పట్టి వార తుక్కోలును
సుంకము బీటికాసులును మగలు
కావలి దేవళ్లకాసులు కుప్ప బ
త్తెము విశేషము దోవ తీర్వ యర్థ
తే. మాన్యముల తఱుగు విడుపు మడుపు మణియ
కాఁడు కోల్కాఁడు బంట్రౌతు కరణములును
నారి వెట్టి బసివి గణాచారు లచటి
వారి లెక్కలు రాఁబట్టువాఁ డొకండు. 84
ఉ. సుంకరి కొల్వుకాఁడు సరసుండను పేరిఁటి వాఁడు చూడ నే
ణాంక వసంత కంతుల జయంతుని నెంతయుఁ బోలువాఁడు ని
శ్శంక నలంకరించుక హుశారున వీథికి వచ్చి యప్పుడా
పంకజలోచనం గని సెబాసని మెచ్చిన యంతలోపలన్. 85
చ. పొగడ హిజారు, చెంగలువబొందళ , మేలకిపువ్వుధట్టి, సం
పఁగి విరితేఁటి మేల్లనినపాగ, శిరీషపు గోషుపేషు, మేల్
జిగితొగడాలు, జాజిబరీచిం గొని చిల్కలవాజినెక్కి పెం
దెగువను గంతుపాదుష హదే! యని యార్చెద ఱొమ్ముఁ గ్రుమ్మినన్. 86
సీ. వ్రీడావహితప్రవేనోన్మదోగ్రరో
ష ప్రదోష వితర్క చపల దైన్య
పరుష సత్రాసక చరమ లీలాప ని
ర్వేదనాసూయ విషాదగర్వ
మోహాంచితాస్మృతి మోహనమాధుర్య
జడ గుప్తి ధృత్యపస్మార హైన్య
హర్ష విజ్ఞాన శంకాలస్య సుఖ నామ
ధేయముల్ గల్లి వర్తిల్లునట్టి
తే. ముప్పదియు మూఁడు సంచారములను మ్రగ్గి
స్వేద వైవర్ణ్య రోమాంచ విస్వరాశ్రు
కంపముల్ ప్రళయస్తంభకములనఁ జను
సాత్త్వికపు భావములచేత జడిసి తెలిసి. 87
సీ. సాక్షాత్కరించిన చంచలాలతికయో!
మాటాడ నేర్చిన మణిశలాకొ!
జీవంబు వచ్చిన చిత్తరు బొమ్మయో!
కడు రూపుఁదాల్చు శృంగారరసమొ!
చేష్టలు వెలయించు చివురుఁబూరెమ్మయో!
చెఱలాడు జాబిల్లి చిన్నికళయొ!
కలితరేఖ నటించు కమ్మనెత్తావియో!
మోహింపఁజేయు సమ్మోహనంబొ!
తే. కాకయుండిన నీతళ్కు, కాంతి, మురువు,
సొగ, సలంకృతి, కళయును, సురభిశుభద
విభ్రమంబులు గలవె? త్రివిష్టపముల
నిండి యున్నట్టి చక్కని నెలఁతలందు. 88
క. కరములు సుమలతికా శ్రీ
కరములు, చిఱునవ్వు లబ్జకరములు, పద్మా
కరములు నాభీరుచు, లా
కరములు సొగసులకుఁ జెలికిఁ గల యవయవముల్. 89
క. నారి కెన సఖులు లేరే!
లే రేదొరఁ దెగడు నిటలలీల లయారే!
యా రేపు మరు నారే
నా రేఖకుఁ దగు ఘనాళి నాఁగను మెఱయున్. 90
క. బాలా దృక్తతి వాలా?
వాలారుంగన్ను లతుల వనజశ్రీలా?
శ్రీలా? చెవుల సులీ, లా
[1]లీలావతి కంఠరవము లెరబాబాలా? 91
సీ. శశిరేఖ శశిరేఖ సత్కళా సౌందర్య
ములు మాయఁ జేయు నిచ్చెలువ తీరు
పద్మినీ పద్మినీ పరిమళ జాతుల
నలరింపుచుండు నిక్కలికి సౌరు
రేవతీ రేవతీ రేఖా విలాసముల్
తలకింపఁ జేయు ని త్తరుణి మురువు
వరహేమ వరహేమ సురుచిర లీలలు
గరఁగంగఁ జేయు నీకాంత హరువు
తే. తార తార నుదారను దారసించు
భద్ర భద్ర సుభద్రను బరిహసించు
నౌర! యిట్లుండవలదె? శృంగార మనుచు
మెచ్చి పల్మాఱు బలుమోహ మెచ్చి కెరలి. 92
క. మిణుకైన యీ కృశాంగీ
మణి నిప్పుడు మోహినీ సుమంత్ర జపాక
ర్షణకళ నాకర్షించుక
కణఁకం బలుగతుల రతులఁ గవిసెద ననుచున్. 93
క. మది నూహ చేసికొని తన
సదనంబున కపుడె వచ్చి చలమునఁ దన్నున్
మదనుం డేచఁగఁ దమిచే
నొదవిన యొక యమృతసిద్ధియోగము నందున్. 94
వశీకరణ మంత్ర ప్రయోగము
సీ. వైష్ణవి కౌమారి వారాహి చాముండ
బ్రాహ్మి మహేశ్వరి బగళ లలిత
కాత్యాయ నీంద్రాణి కాళరాత్రి భువనే
శ్వరి మహామాయి పంచదశి దుర్గి
భగవతి మాతంగి బాల మహాకాళి
కామేశ్వరియు భద్రకాళి శక్తి
మలహరి కృష్ణాక్షి మాధవి శాంభవి
శాకంభరియు లఘు శ్యామలాంబ
తే. మోహినీ కామరాజాఖ్య ముఖ్య దేవి
రాజరాజేశ్వరియు మంత్రరాజ రాజ
ముఖి విరూపిణి భైరవి ముఖ్య మూల
మంత్రములలోన మోహినీమంత్ర మరసి. 95
సీ. కడుభక్తి శుక్లపక్షమునఁ బుష్యార్కము
నాడు హస్తిని వీథి నడచు వేళఁ
గుడియడుగిడు మన్నుఁ గొనితెచ్చి శయనమం
దిరము గోమయమున నెఱయ నలికి
మధ్యమంబున నెఱ్ఱమంటి పట్టిడి పస
పున మ్రుగ్గొసఁగి మధ్యమునను మన్ను
నెఱపి యాపైని నన్నెలఁత రూపము వ్రాసి
చుట్టు యంత్రము గురుస్తుతి యొనర్చి
తే. మొదల నోం శ్రీం వినిర్మించి “మోహ మోహి
నీ ఫటు స్వాహ" యని మంత్రనియతిఁ దీర్చి
యందు దిగ్బంధన మొనర్చి యరుణగంధ
పుష్పదీపాదులను లెస్స పూజఁ జేసి. 96
ఆ. లక్షజపము చేసి లక్షణయుతముగఁ
దద్దళాంగము మధుతర్పణంబు
తద్దశాంశ మగుచుఁ దగు పలాశలతాంత
హోమవిధియుఁ దీర్చుచున్న యపుడు. 97
సీ. మినుకొప్పు నునుగొప్పు మినమినల్ దూలాడఁ
గన్నుల దళధళల్ మిన్నులాడ
బునుఁగిడ్డ నెఱపూత భుగభుగల్ చెఱలాడ
గుబ్బుల చకచకల్ దొబ్బులాడ
జిగిపూని తగుమేని ధగధగల్ దిరుగాడ
నగుమోము నిగనిగల్ నాట్యమాడ
గుమిగూడు విరిదండ ఘుమఘుమల్ పొరలాడ
నందెల ఝళఝళల్ చిందులాడ
తే. నెదుట సాక్షాత్కారించు మోహినికి నతఁడు
గరిమతో లేచి మొక్కినఁ గరుణఁ జూచి
తనకుఁ బూర్ణాహుతి యొనర్చి తప్పకుండఁ
దంత్రము ముగింపుమా! నీవు తలఁచి నట్టు. 98
క. వరమొసఁగెద నన, నటువలె
జరిపి 'మనోజాత పంచశక' యని యంత్రా
శరణముఁ దుడిచి మదీప్పిత
ము రయంబునఁ దీర్పు మనిన మోహిని యంతన్. 99
తే. మంచిదని యచ్చెలిని నావహించి శక్తి
తెచ్చి ముందట నిల్పి యదృశ్యయైన
సంభ్రమంబున సరసుండు సరసరతులఁ
బరవశత్వంబు నొందించి భ్రమముఁ గొల్ప. 100
చ. కనుఁగవ విప్పిచూచి యల కామిని, 'యెక్కడి దీ నిశాంత మీ
ఘనుఁ డితఁ డెవ్వఁ డిట్టి రతి గల్గుట యే' మని విస్మయంబుచే
మనమున నెన్ని 'యేమయిన మంచిదే! నామదిఁ గోర్కెఁ దీర్చెఁ బ్ర
బ్బిన మకరాంకు నింక ఘనభృత్యునిఁగాఁ బనిఁబూని యేలెదన్. 101
వ. అదియునుంగాక. 102
తే. భద్రుఁడన దత్తుఁ డనఁగను బరఁగు కూచి
మార పాంచాల విట పీఠమర్ధ నాగ
రిక విదూషక లనఁ బ్రౌఢరీతి మెలఁగు
నాయకులవంటి రసికుఁడీ నాయకుఁ’ డని. 103
చ. మనమున మెచ్చి, “నాయకుఁడ! మా నెఱజాణవు ప్రోడ వేక్రియన్
గొని రతినేలినాడ వనుకూలము నాకిది నిచ్చనిచ్చలున్
ననవిలుకాని కేళిక లనన్ వెలయించు" మటంచుఁ బల్కినన్
విని సరసుండు మంచిదని వేడుక నాతినిఁ బంపె నింటికిన్. 104
క. అది మొదలు చేసి హస్తిని
మది రంజిల సరసుమీఁది మమతను నిచ్చల్
మదనుని కేళికిఁ బిల్చును
దుదఁ దన గృహమునకు సందు దొరకిన యెడలన్. 105
వ. ఇట్లు విహరింపుచుండి యొక్కనాఁడు. 108
క. మధ్యాహ్నవేళ జనతా
రాధ్యుండగు సరసుఁడలరి రతిపతికేళీ
సాధ్యత "బుద్ధిమతాం కిమ
సాధ్య"మ్మని యావధూటి సదనమె చేరెన్. 107
తే. చేరినప్పటి సరసుని తీరుఁజూచి
భుజము లొప్పొంగి హస్తినీ పుష్పగంధి
కలయఁబడి మతి పన్నీటఁ గాళ్లు గడిగి
మేలమాడుచుఁ దోడ్తెచ్చె మెచ్చు హెచ్చి. 108
సీ. జీవదంతపు జగాజీని నఖాసు మే
ల్తళుకుటద్దపుబిళ్ల బెళుకు రవలు
వింత సంతనఁజేసి విప్పుగాఁ దాపిన
హురుమంజి పూసల మెఱుఁగు కుచ్చు
లునిచి తీర్చిన సొంపు మినుకైన కెంపురా
మొనముక్కులుండెడు ముద్దు గులుకు
కళుకుఁ గ్రొంబని పచ్చచిలుకలు రహిమించు
తొగ రా చలువరాల నెగడులోవ
తే. గల వగలనిండు పచ్చని జిలుఁగు ప్రతిమ
కళల నిరవొందు చిత్తర్వు కప్పురంపు
మెప్పు మేల్కట్ల చవికెలో మెఱయు హంస
తూలికాతల్పమునఁ జేర్చి తోయజాక్షి. 109
క. తొడరి నునుగబ్బిగుబ్బల
పొడవడఁగఁగఁ గౌఁగిలించి పొడమిన దార్ఢ్యం
బెడలంగ నీక మన్మథు
బెడిదపుదురమం దతనికిఁ బ్రియమొందించెన్. 110
తే. ఇత్తెఱంగున వారిద్ద ఱేపు రేఁగి
మిథునకార్యప్రవిష్టులై మెలఁగుచుండ
దాని పతి యింటి కరుదెంచి తలుపుఁ దెఱువు
మనిన నది యెట్లు బొంకంగఁ జనునొ చెపుమ? 111
తే. తెలిసెనా నీకు? హేమావతీ లతాంగి!
తెలియకుండినఁ జెప్పెదఁ దెలిసికొనుము.
విభుఁడటులఁ బిలిచిన విని విటుఁడు పడఁక
వెఱవకు మటంచు దైర్యంబుఁ గఱపి యపుడు. 112
చ. ముసుఁగిడి పండుకొమ్మనుచు మోహముతోడ వితర్ధిఁ జూపి తా
నుసురసురంచు ఖిన్నయయి యొయ్యన నేఁగి కవాట మవ్వలన్
బెసబెసఁద్రోచి మూటఁదల బెట్టుక వచ్చిన భర్త కింత సా
ధ్వస మొదవంగఁజెప్ప విని వాఁడు విభావిత “యేమి" యంచనెన్. 113
ప. అని హీనస్వరంబున, 114
క. అడిగిన పతితో నిట్లను
“దడవాయెను సుంకరీఁడు తమ లెక్కలకై
పడియున్నాఁ డిదె కను"మని
పడఁతి యతనిఁ జూచి భయ ముప్పొంగన్. 115
క. వెనుకడుగు లిడుచు నవ్వలఁ
దన పొరుగింటను విభుండు దాఁగినచో జా
రుని రతి తృపాస్థన్ వే
తనిపి వెడల ననిపి తరుణి ధవునిం బిల్చెన్.116
తే. పిలువ నతఁ డెప్పటట్లన ఖేదపడక
కూర్మితో నుండెఁ బతిదాను కుందరదన!
వింటివా? యిట్టి చాతుర్య విశదశక్తి
నీకుఁ గలిగినఁ బోవమ్మ! నృపతి నెనయ. 117
చ. అని కలహంస చెప్పఁగ మహాదరణంబుల నాలకించు నం
తనె తపనోదయ ప్రభలు తద్దయుఁ గన్పడ గేళికానికే
తనమున కేఁగి యచ్చట సుధాకరబింబనిభాస్య ప్రొద్దు గ్రుం
కిన దనుకా వియోగమునఁ గేవలమున్ వెతఁజెంది యుండుచున్. 118
క. కుముదమ్ములు కుముదమ్ములు
సముదమ్ములు గాఁగ మెఱయు సాయంబైనన్
రమణీమణి ఘనకచభా
రమణీమణి సిరులు నిరులు రంజిలువేళన్. 119
సీ. తారకావృత పయోదముమాడ్కి సుమదామ
పరివృతంబగు కొప్పు పరిఢవిల్లఁ
దీఁగను ననలు హత్తిన చందమున మేన
సొగసుగా రతనంపు సొమ్ము లలర
వదనచంద్రునిఁ గూడ వచ్చిన రోహిణి
మురువున ముత్తెంపు ముక్కరమర
మంచు గప్పిన గట్లసంచున వలిపెంపుఁ
బైఁటలో గబ్బిగుబ్బలు చెలంగఁ
తే. బరఁగు జగడాల పగడాల బరిణిలోనఁ
గ్రాలు మగరాల నిగరాల లీల వీడెపు
టరుణ రుచిఁ జిల్కు నోరఁ బల్వరుస మెఱయ
వచ్చి నిల్చిన యాహేమవతిని గాంచి. 120
క. జలజభవాశ్వం బిట్లనుఁ
జెలియా! యింకొక్క గాథ చిత్రతరంబై
చెలువొందెడిఁ జెప్పెద వినఁ
గలవే? యని యడుగ, వినెదఁ గాకని నిల్చెన్. 121
వ. హంసం బిట్లనియె. 122
పదునేనవరాత్రి కథ
రెడ్డిసాని యొక పగ లిద్దఱినిఁ గూడుట
మ. ఇతర ధ్యానముమాని నీవు వినుమీ హేమావతీ! ద్రావిడ
క్షితిలోఁ జిత్ర విచిత్ర వస్తువితతిన్ జెన్నారు కాంచీపురిన్
స్థితుఁడై కాపురముండు శూద్రుఁడొకఁడా శ్రీదృష్టికిం బాత్రమై
శ్రిత నానాజన భాగధేయమగుచున్ సీరాంక నామంబునన్. 128
కృషీవలునిల్లు, ధాన్యములు, కాయలు
సీ. ముంగిటఁ బులిజూదములు గీచియుండిన
రచ్చబండలు గొప్ప ప్రహరిగోడ
- ↑ ఈ చరణము చెడినది.