స్వప్న వాసవదత్తం/నాలుగవ అంకము
<poem>
నాలుగవ అంకం
(విదూషకుడు ప్రవేశిస్తాడు)
విదూషకుడు (ఆనందంతో) ఆహా! అందరూ ఇష్టపడి చేసిన ఉదయనుడి పెళ్ళిఘడియలు వచ్చాయి. చూసి అనందమైంది. ఆ వాసవదత్త, యౌగంధరాయణుడు చనిపోవడం, ఈ ఉదయనుడుకి మతిపోవడం, యుద్ధంలో ఓడిపోవడం, ఇలా కష్టాల సుడిగుండం లోంచి తిరిగి ఇలా బయటపడతామని కల్లోగూడా అనుకోలేదు. ఇప్పుడు హాయిగా మేడల్లో ఉంటున్నాం. అంతఃపురంలో సెలయేళ్ళల్లో స్నానాలు చేస్తున్నాం. మృదువైన తియ్యని లడ్డూలు తింటున్నాం. ఒక్క అప్సరసలే తక్కువ ఈ ఉత్తరకురుదేశంలో. ఒక్కటే ఇబ్బంది. నాకీభోజనం అరగటంలేదు. మంచిపరుపులున్న మంచాలిచ్చినా సుఖంగా నిద్రపోలేకపోతున్నా. వాతంచేసి, రక్తంగాని చెడిపోవటల్లేదుగదా! రోగం వస్తుందేమోనని భయపడుతూ తినవలసిన తిండితో సుఖమేమీలేదు.
(చేటి వస్తుంది)
చేటి (తనలో) ఈవసంతకుడు ఎక్కడకి వెళ్ళాడో? (వసంతకుడి శబ్దం విని) ఇక్కడే ఉన్నాడే! ( పైకి) అయ్యా వసంతకా! ఎంతకాలం వెతకను?
విదూషకుడు ఎందుకు?
చేటి మా రాణి అల్లుడి స్నానం అయిందా అని అడుగుతోంది.
విదూషకుడు ఎందుకు?
చేటి ఎందుకేమిటి? పువ్వులూ, అత్తర్లూ తేవాలి.
విదూషకుడు ఆ! చేసాడు. భోజనం తప్ప అన్నీ తేవచ్చు.
చేటి భోజనమెందుకు వద్దూ?
విదూషకుడు కోకిలకి కళ్ళు మారినట్టు, దౌర్భాగ్యుణ్ణైన నాకు కడుపులో మార్పులొచ్చాయి.
చేటి సరే.
విదూషకుడు ఇక నువ్వు వెళ్ళు. నేను కూడా రాజు దగ్గరికి వెళతాను. (ఇద్దరూ వెళ్ళిపోతారు)
(పద్మావతి, అవంతిక (వాసవదత్త) తోటలోకి ప్రవేశిస్తారు)
చేటి అమ్మా! ఏమిటిలా ప్రమదవనానికి వచ్చారు?
పద్మావతి శేఫాలికా లతలు పూస్తున్నాయేమోనని చూడ్డానికి వచ్చాను.
చేటి అవి పూసాయిగా! గుత్తులుగుత్తులుగా పూసాయి. చిగుళ్ళు వాటిని కప్పాయి. చూడ్డానికి ముత్యాలపేరుల్లా ఉన్నాయి. ఇక్కడ శిలావేదికమీద కూర్చోండి. ఇప్పుడే కోసుకొస్తా.
పద్మావతి (వాసవదత్తతో) అక్కడ కూర్చుందామా!
వాసవదత్త సరే.
(ఇద్దరూ కూర్చుంటారు)
చేటి చూడండి రాకుమారీ! నాగజిహ్విక (ఇది ఒక ఎర్రని ధాతువు) ముక్కల్లా నాదోసిట్లో నిండిన శేఫాలిక మొగ్గల్ని చూడండి.
పద్మావతి (చూచి) అహో! పువ్వులెంత విచిత్రంగా ఉన్నాయి. చూడు అవంతికా! చూడు.
వాసవదత్త అవును. పువ్వుల అందం చూచి తీరవలసిందే.
చేటి ఇంకా కోయనా?
పద్మావతి వద్దు, వద్దు.
వాసవదత్త ఎందుకొద్దంటున్నావు?
పద్మావతి ఆర్యపుత్రుడు వచ్చి ఈ పూలసంపదని చూసి నేనంటే ఇష్టపడాలి.
వాసవదత్త నీకాయనంటే అంత ఇష్టమా?
పద్మావతి ఏమో! తెలియదు. అతని విరహంలో నాకేమీ తెలియటల్లేదు.
వాసవదత్త (తనలో) నేనూ అంత కష్టాన్నీ అనుభవిస్తున్నా. ఈమె కూడా అదే అంటున్నది.
పద్మావతి నాకు ఒక్క సందేహం.
వాసవదత్త ఏమిటి?
పద్మావతి నాకు ఎంత ప్రియమైనవాడో, అలాగే వాసవదత్తకి కూడా కదా!
వాసవదత్త అంతకన్న ఎక్కువే!
పద్మావతి నీకెలా తెలుసు?
వాసవదత్త (తనలో) ఓహో, ఆర్యపుత్రునిమీదున్న ప్రేమవల్ల తప్పుగా మాట్లాడానే! (పైకి) తక్కువ ప్రేమేవుంటే ఇంట్లో అందర్నీ విడిచిపెట్టివచ్చి పెళ్ళిచేసుకోదుగా.
పద్మావతి ఔను.
చేటి అమ్మా! “నేను కూడా వీణ నేర్చుకుంటా” నని మీభర్తతో మీరుకూడా చెప్పండి.
పద్మావతి చెప్పడం అయింది.
వాసవదత్త అపుడేమన్నాడు?
పద్మావతి ఏమీ అనలేదు. ఒక పెద్దనిట్టూర్పు విడిచి ఊరుకున్నాడు.
వాసవదత్త దాన్ని నువ్వెలా అర్ధం చేసుకున్నావు?
పద్మావతి ఆ వాసవదత్త గుర్తుకు వచ్చిందనీ, నా మీద ప్రేమచేత నా ఎదుట దుఃఖించటల్లేదని అనుకున్నాను.
వాసవదత్త (తనలో) ఇదే నిజమైతే నేను ధన్యురాల్ని.
(విదూషకుడు, రాజు ప్రవేశిస్తారు.)
విదూషకుడు హీ! హీ! ఇక్కడ బోలెడు బంధూకపువ్వులు, చల్లనిగాలులు, మహా అందమైనది ఈ ప్రమదవనం. రా! ఇలా రా! మిత్రమా!
రాజు వస్తున్నా వసంతక! ఎప్పుడో, స్వేచ్ఛగా వాసవదత్తను చూచి మరువలేని స్థితిలో ఉన్నప్పుడు ఆమన్మధుడు తన ఐదుబాణాల్నీ నాపైన వేశాడు. ఆగాయం మానకుండానే మళ్ళీ కొట్టాడే! ఈ ఆరోబాణం ఎక్కడి నుంచి వచ్చింది?
విదూషకుడు ఈపద్మావతీదేవి ఎక్కడికి వెళ్ళింది? లతామండపానికి కాని వెళ్ళిందా? లేకపోతే, పులిచర్మం కప్పినట్టు జీవకపుష్పాల్తో నిండిన కొండ, అదే పర్వతతిలకం అంటారే, అక్కడికి చేరుకుందా? లేకపోతే, ఆఘాటువాసనలువేసే సప్తచ్ఛదవృక్షాల వనానికి వెళ్ళిందా? లేకపోతే,.. జంతువులు, పక్షుల బొమ్మలేసిన కొయ్యపర్వతం, అదే ఆ ఆటస్థలం లేదూ, అక్కడకెళ్ళిందా? (ఆకాశంలోకి చూసి) హహ్హ ..చూడు! చూడు! స్వచ్ఛంగా ఉన్న ఈ శరత్కాలపుటాకాశంలో, ఆ బెగ్గురపక్షుల్ని చూడు. అరే! చూస్తూండగానే చక్కగా ఒక కూర్పుగా మారిపోయాయి. ఆ కూర్పు బలరాముడి భుజాల్లా లేదూ?
రాజు చూస్తున్నా. పొడుగ్గా, వంకరల్లేకుండా, విడివిడిగా ఉన్నాయి. మలుపులొచ్చినప్పుడల్లా, సప్తర్షి మండలంలా ఎత్తుపల్లాల్తో ఉన్నాయి. విడుస్తున్న పాముకుబుసంలా స్వచ్ఛంగా ఉన్నాయి. ఆకాశాన్ని విభజిస్తున్న సరిహద్దురేఖల్లా ఉన్నాయి కదూ!
చేటి అమ్మా! ఎర్రని కమలాల గుంపులా ఎగురుతున్న బెగ్గురపక్షుల పంక్తిని చూడండి … (రాజుని చూసి తత్తరపడుతూ) అయ్యో! ప్రభువులు!…
పద్మావతి అరే! ప్రభువు! అవంతికా! నేను నీతోనే ఉండదలిచాను. మనం ప్రభువుకు కనిపించకుండా తప్పుకోవాలి. ఈ మాధవీమండపంలో దాక్కుందాం. రా!
వాసవదత్త అలాగే.
విదూషకుడు పద్మావతీదేవి ఇక్కడకు వచ్చివెళ్ళినట్టుంది.
రాజు నీకెలా తెలుసు?
విదూషకుడు ఈ శేఫాలిక పువ్వుల గుత్తుల్ని చూస్తే, ఇప్పుడే కోసినట్టు లేవూ?
రాజు వసంతకా! ఈ పువ్వులు ఎంతవిచిత్రమైనవి?
వాసవదత్త (తనలో) ఈ వసంతకుడి పేరు వింటూంటే మళ్ళీ ఉజ్జయినిలో ఉన్నట్టుంది మనసుకి.
రాజు వసంతకా! ఆ రాతిమీద కూర్చుని పద్మావతి కోసం ఎదురు చూద్దాం.
విదూషకుడు ఈ చుర్రుమంటున్న శరత్కాలపుటెండ మాడ్చేస్తోంది. తట్టుకోలేకుండా ఉన్నాను. ఆ మాధవీ మండపంలో కూర్చుందాం.
రాజు సరే. నడు.
పద్మావతి ఛ.. ఛ.. ఈ వసంతకుడు వ్యవహారమంతా అల్లకల్లోలం చేస్తున్నాడు. ఇప్పుడేం చేద్దాం?
చేటి దేవీ! నిండా తుమ్మెదలుపట్టి వేలాడుతున్న ఈ లత ఉందిగా! దీన్ని కదిలిస్తే, ప్రభువు ఇక్కడవరకూ రాలేడు.
పద్మావతి సరే
(చేటి లతని ఊపుతుంది)
విదూషకుడు హేయ్ హేయ్ కదలకు … నిలబడు .. ఈ మూర్ఖపు తుమ్మెదలు కుట్టి చంపుతున్నయ్.
రాజు భయపడకు. అరవకు. అలా చూడు. తేనెతాగి మత్తెక్కి మధురంగా అరుస్తున్న తుమ్మెదలు, వాటి ప్రియురాళ్ళని కౌగలించుకుని ఒళ్ళు తెలియకుండా మనకాళ్ళకింద పడి నలిగిపోతున్నాయి. అందువల్ల ముందుకెళ్ళద్దులే. ఇక్కడే నిలబడదాం.
(ఆగుతారు). ఇక్కడ నేలమీద పువ్వులు ఎవరో తొక్కినట్టుగా నలిగిపోయి ఉన్నాయి. ఇక్కడి శిలావేదిక వెచ్చగావుంది. ఖచ్చితంగా ఎవరో అమ్మాయి ఇక్కడ కూర్చుని, మనల్నిచూసి హడావుడిగా వెళ్ళిపోయి ఉండాలని నా అనుమానం.
చేటి దేవీ! మనం ఇరుకున పడ్డాం.
పద్మావతి హమ్మయ్య! ప్రభువు కూర్చున్నాడు.
వాసవదత్త హమ్మయ్య! ప్రభువు ఆరోగ్యంగానే ఉన్నాడు.
చేటి అరే! అవంతిక ఏడుస్తోందే?
వాసవదత్త ఏం లేదు. ఈ తుమ్మెదల అల్లరితో పుప్పొడి కంట్లో పడింది. అంతే.
విదూషకుడు ఈ ప్రమదవనంలో ఎవ్వరూ లేరుగదా. నిన్నొకటి అడగాలని అనుకుంటున్నా. అడుగుతా.
రాజు స్వేచ్ఛగా అడుగు.
విదూషకుడు నీకు ఎవరంటే ఇష్టం? అప్పటి వాసవదత్తా? ఇప్పటి పద్మావతా?
రాజు ఎందుకిప్పుడు ఇలాంటి ప్రశ్నల్తో ఇరకాటంలో పెడతావ్ ?
పద్మావతి భలే సంకట పరిస్థితిలో పడ్డాడే ప్రభువు!
వాసవదత్త (తనలో) దురదృష్టం. నేనూ అలాంటి స్థితిలోనే ఉన్నాను.
విదూషకుడు నిర్భయంగా చెప్పొచ్చు. ఒకావిడ మరణించింది. ఒకావిడ దగ్గర్లో లేదు. నేనెవ్వరికీ చెప్పన్లే.
రాజు నువ్వు ఉట్టి వాగుబోతువు.
పద్మావతి దీనితోనే తెలిసిపోతోందిగా ప్రభువు చెప్పదల్చుకున్నది!
విదూషకుడు అయ్యా! ఒట్టేసి చెబుతున్నా. ఎవ్వరికీ చెప్పను. ఇదిగో నాలిక కరిచి పట్టుకున్నా..
రాజు నాకు చెప్పడం ఇష్టం లేదు.
పద్మావతి ఏం పండితుడో! ఈ వసంతకుడికి ఈ మాత్రంకూడా అర్ధం కావటల్లేదు. ప్రభువు హృదయం ఆమాటల్లో తెలియటల్లేదూ?
విదూషకుడు ఎందుకు చెప్పవు? చెప్పకుండా ఒక్కడుగు ముందుకు వెయ్యలేవు. నిన్ను బంధించాను.
రాజు ఏం? బలవంతమా!
విదూషకుడు బలవంతమే.
రాజు అదీ చూద్దాం.
విదూషకుడు క్షమించు .. ఊరికే అన్నాన్లే …
రాజు సరే! నాకు పద్మావతంటే చాలా ఇష్టం ఉన్నా, అందం, గుణం, తియ్యని మాటలవల్ల ఆకట్టుకున్న వాసవదత్తని నామనసు విడవలేకపోతోంది. పద్మావతి వైపుకు తిరగనంటోంది.
వాసవదత్త (తనలో)నా శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. ఈ అజ్ఞాతవాసం కూడా ఉపయోగిస్తోంది.
చేటి దేవీ! ప్రభువు ఎంతటి కఠినుడు!
పద్మావతి అలా ఎందుకు అనుకోవాలి? ఇప్పటికీ వాసవదత్తని తలుచుకుంటున్నాడంటే దయగలవాడే.
వాసవదత్త బాగా చెప్పావు.
రాజు నావంతయింది. నీసంగతేమిటి? నీకెవరంటే ఇష్టం?
పద్మావతి ఇప్పుడు ప్రభువు వసంతకుడైపోయాడు.
విదూషకుడు నా పనిలేని వాగుడు నీకెందుకు? ఇద్దరూ ఇష్టమేలే.
రాజు మూర్ఖుడా! నాచేత బలవంతాన అన్నీ చెప్పించేసుకుని, ఇప్పుడిలా మాట్లాడతావేమిటి?
విదూషకుడు నాచేత బలవంతంగా చెప్పిస్తావా ఏమిటి?
రాజు ఆహా! బలవంతమే.
విదూషకుడు అయితే నేను చెప్పనుగాక చెప్పను.
రాజు ఓ మహా బ్రాహ్మణుడా! అనుగ్రహించి చెప్పవయ్యా!
విదూషకుడు నాకు వాసవదత్త అంటే చాలా ఇష్టం. అయితే పద్మావతీదేవి కూడా ఇష్టమే. ఆవిడ యువతి, అందమైనది, గర్వం లేదు. తియ్యగా మాట్లాడుతుంది, దయగలది. మంచి భోజనం పెడుతుంది. వాసవద్తౖతెతే మంచి భోజనం వండినప్పుడల్లా, “వసంతకుడేడీ? ఎక్కడికి వెళ్ళాడు?” అని అడిగి మరీ ఆహ్వానిస్తుంది. అది ఇంకో గొప్పగుణం ఆవిడలో.
వాసవదత్త (మనసులో) నన్ను అలాగే తలుచుకో వసంతకా! ఇప్పటికంతే మిగిలింది.
రాజు వాసవదత్త గురించి ఎంత చక్కగా చెప్పావు వసంతకా!
విదూషకుడు ఇంకెక్కడి వాసవదత్త? చనిపోయి చాలాకాలమయిందిగా.
రాజు అవును. (విషాదంగా) నీ సరదామాటల్తో నామనసు చాలాదూరం పోయింది. మాటలుకూడా అలవాటు చొప్పున ఆమె బ్రతికున్నట్లే వచ్చేస్తున్నాయి.
పద్మావతి క్రూరుడు. మాటల్ని ఎంత అందంగా మార్చి చెపుతున్నాడో!
వాసవదత్త (తనలో) నేను మాత్రం నమ్ముతున్నాను. పరోక్షంగా నన్ను పొగడడం వింటున్నా. అది ఎవరికి ఇష్టం ఉండదు?
విదూషకుడు బాధపడకు. విధి మనచేతుల్లో లేదుగా. జరగవలసిందేదో జరిగింది.
రాజు నా స్థితి నీకర్ధంకావటల్లేదు. చాలారోజుల పరిచయంవల్ల, పెరిగిన ప్రేమని మర్చిపోవడం కష్టంగావుంది. తల్చుకున్నకొద్దీ బాధ కలుగుతోంది. ఈ దుఃఖం కొత్తగావుంది. ఈ లోకంలో ఋణం తీర్చుకోలేనివాటిని తలుచుకుని కన్నీళ్ళు కార్చడం వల్లనే కదా కాస్త మనసు తేలికపడేది!
విదూషకుడు కన్నీళ్ళతో ముఖమంతా చారికలు పడ్డాయి. ముఖం కడుక్కోడానికి నీళ్ళు తెస్తానుండు.
పద్మావతి ప్రభువు బాధలో ఉన్నారు. మనం వెళ్ళిపోదాం. రా.
వాసవదత్త అలా మగణ్ణి విడిచిపెట్టడం సబబు కాదు. నువ్విక్కడే ఉండు. నేను వెళ్ళిపోతాను.
(వాసవదత్త వెళ్ళిపోతుంది. పద్మావతి రాజు దగ్గరకి బయల్దేరుతుంది)
విదూషకుడు (తామరాకులో నీటితో) ఇదిగో .. (పద్మావతిని చూసి) పద్మావతీదేవి!
పద్మావతి వసంతకా! ఏమైంది?
విదూషకుడు ఇదీ..ఇదీ.. (తడబడతాడు) గాలికి రెల్లుపువ్వుల పుప్పొడి రాజు కంట్లో పడింది. అంతే.
పద్మావతి ఆర్యపుత్రా! జయము!
రాజు (ఆశ్చర్యంగా) పద్మావతీ! నువ్వా! వసంతకా! ఏమిటిది?
(విదూషకుడు రాజు చెవిలో ఏదో చెపుతాడు)
రాజు (తనలో) నా కన్నీటికి అసలు కారణం తెలిస్తే బాధ పడుతుంది. అసలే కొత్తగా పెళ్ళయిన పిల్ల. సహజంగా ధైర్యం ఉన్నదే, కాని ఇలాంటి విషయాలు ఎవళ్ళకైనా బాధ కలిగిస్తాయి (పైకి) రెల్లు పుప్పొడి పడి కళ్ళ వెంట నీళ్ళొచ్చాయి..
విదూషకుడు ఈ మధ్యాహ్నం తమ స్నేహితుల్తో కలసి మగధరాజు దర్శకుడు నిన్ను సత్కరిస్తారుగదా మిత్రమా! రా! పోదాం.
రాజు నడు. గొప్పగుణమున్నవారూ లోకంలో ఉన్నారు. వాళ్ళను గౌరవించేవాళ్ళూ ఉన్నారు. కాని, ఈ రెండింటినీ తెలిసి గ్రహించగలిగేవాళ్ళు దొరకడం చాలా కష్టం.
(వెళ్ళిపోతారు). <poem>