స్వప్న వాసవదత్తం/ఐదవ అంకము
(పద్మనిక వస్తుంది)
పద్మనిక మధురికా! మధురికా! త్వరగా రా!
మధురిక వస్తున్నా (వచ్చి) ఏం చెయ్యాలి?
పద్మనిక పద్మావతీదేవి తలనొప్పితో బాధపడుతోంది. నీకు తెలియదా?
మధురిక అయ్యో!
పద్మనిక వెళ్ళు. త్వరగా అవంతికని పిలు. ఆవిడతో ఈ విషయం చెప్పు చాలు. ఆవిడ తనంతట తానే వస్తుంది.
మధురిక ఆవిడేం చెయ్యగలదు?
పద్మనిక ఇలాంటి సమయంలో, మంచి కధలు చెప్పి, నొప్పి మరచిపోయేలా చేస్తుంది.
మధురిక పద్మావతీదేవి ఎక్కడ పడుకుంది?
పద్మనిక : సముద్రగృహంలో. నువ్వెళ్ళు. నేను ప్రభువుకీ విషయం చెప్పాలి. ముందు వసంతకుణ్ణి వెతకాలి. ఎక్కడున్నాడో! ఏమో!
(విదూషకుడు వస్తాడు )
విదూషకుడు పాపం. వత్సరాజు ఇన్నాళ్ళూ వాసవదత్త వియోగంతో తెగ మధనపడ్డాడు.ఈ కొత్తపెళ్ళితో ఇప్పుడు మదనుడు తనమీద పడ్డాడు. ఈరోజు శోభనం.దాంతో ఇంకా జోరుమీదున్నాడు. (పద్మనికని చూసి) అరే! పద్మనికా! ఇక్కడెందుకున్నావు?
పద్మనిక పద్మావతీదేవి తలనొప్పితో బాధపడుతోంది. నీకు తెలియదా?
విదూషకుడు నాకు తెలియదు.
పద్మనిక అయితే ఈ విషయం ప్రభువుకి చెప్పు. నేను తలకిపట్టు వెయ్యడానికి పసరు పట్టుకుని అక్కడికి వస్తా.
విదూషకుడు : పద్మావతీదేవి ఎక్కడ పడుకుంది?
పద్మనిక : సముద్రగృహంలో.
(సరే అంటూ విదూషకుడు వెళ్ళిపోతాడు. పద్మనిక కూడా వెళ్ళి పోతుంది)
(రాజు ప్రవేశిస్తాడు)
రాజు : కాలి బూడిదైన వాసవదత్తని మంచులో కప్పబడ్డ పద్మలతలాగ భావిస్తున్నా.మళ్ళీ ఒక ఇంటివాణ్ణి అవుతున్నా.
(విదూషకుడు వస్తాడు)
విదూషకుడు నువ్వు త్వరపడు.
రాజు : ఎందుకు?
విదూషకుడు పద్మావతీదేవికి తలనొప్పిగా ఉందిట. సముద్రగృహంలో పడుకుని ఉందిట. పద్మనిక చెప్పింది.
రాజు : తోవ చూపు. వెడదాం. (తీసుకుని వెడతాడు.)
విదూషకుడు : ఇదిగో సముద్రగృహం. రా! (ప్రవేశించి) ఆగు ..అక్కడే ఆగు.
రాజు : ఎందుకు?
విడుషకుడు ఈ దీపాల వెలుగులో ఆ పాము కనబడటల్లేదూ? నేలమీద తిరుగుతోంది.
రాజు : మూర్ఖుడా! అది ద్వారానికి కట్టిన తోరణం. ఈ మలయమారుతం వల్ల నేలమీదపడి కదుల్తూంటే పామని భ్రమపడుతున్నావు.
విదూషకుడు అవును. నిజమే. పద్మావతీదేవి ఇక్కడకు వచ్చివెళ్ళివుంటుంది.
రాజు : ఇంకా వచ్చివుండకపోవచ్చు కూడా.
విదూషకుడు ఎలా?
రాజు : ఈ మాత్రానికేముంది? పరచిన పక్క వాడినట్లు దిగబడి లేదు. దుప్పటి రేగలేదు. తలనొప్పిమందుల్తో తలగడాలు మాసిలేవు. రోగం మర్చిపోయేందుకు మంచానికి అలంకారాలేమీ చెయ్యలేదు. పోనీ, కొద్దిసేపే మంచం వాడారేమో అనుకుందామంటే, అంత బాధపడుతున్న వాళ్ళెవరూ గబుక్కున వాడి వదిలేసి వెళ్ళరుగా.
విదూషకుడు అయితే ఇక్కడే కూర్చుని వేచి ఉంటే సరి.
రాజు : తప్పకుండా. నాకు విపరీతంగా నిద్రవస్తోంది. మంచి కధ చెప్పు.
విదూషకుడు నువ్వు “ఊఁ” కొడితే చెబుతా.
రాజు : ఊఁ.
విదూషకుడు ఉజ్జయినీ అనే ఒక నగరం.
రాజు : ఏమిటీ? ఉజ్జయినా?
విదూషకుడు ఈ కథ నచ్చకపోతే చెప్పు. మరొకటి చెబుతా.
రాజు : అహాఁ! కథ నచ్చకపోవడమేమీ కాదు. ఉజ్జయినిని వదిలేస్తున్నప్పుడు, తన వాళ్ళను తలచుకుని నా గుండెలపై ఏడ్చిన వాసవదత్త గుర్తుకొస్తోంది. నాదగ్గర వీణ నేర్చుకునేటప్పుడు, చాలాసార్లు వీణ జారిపోయినా గుర్తించకుండా, నావంకేచూస్తూ, గాలిలోనే వేళ్ళని మీటిన వాసవదత్త గుర్తుకొస్తోంది.
విదూషకుడు సర్లే. మరో కథ చెబుతా. బ్రహ్మదత్తం అనే నగరం. దాంట్లో కాంపిల్యుడు అనే రాజు.
రాజు : మూర్ఖుడా! కాంపిల్యం నగరం, బ్రహ్మదత్తుడు రాజు.
విదూషకుడు కాంపిల్యం నగరం, బ్రహ్మదత్తుడు రాజు, కాంపిల్యం నగరం, బ్రహ్మదత్తుడు రాజు (మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ అంటాడు.) అరే! అప్పుడే నిద్రపోయాడే. అవును చల్లగా ఉందిగా, నిద్ర పట్టేసి ఉంటుంది. (పై వస్త్రాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు).
(అవంతిక (వాసవదత్త), చేటి వస్తారు).
వాసవదత్త : పాపం. విరహంతో బాధపడుతున్న రాజుకి ఆనందం లేకుండా, ఈ పద్మావతికి అనారోగ్యమేమిటో!
(సముద్రగృహం ప్రవేశిస్తుంది.)
అరెరే! ఈ గుడ్డిదీపపు వెలుగులో పద్మావతిని వదిలేసి వెళ్ళిపోయారేమిటి వీళ్ళంతా? (ప్రక్కనే కూర్చుంటుంది.) ఈ రోజు ఈమెప్రక్కన కూర్చుంటే ఇంత ఆనందంగా ఉందేమిటి? ఈనిట్టూర్పులు చూస్తుంటే బాధ తగ్గినట్టుందే ఈవిడకి. సగం ఖాళీగానే ఉందిగా పడక, తనని కౌగలించుకుని పడుకోమనా ఈ సంఙ్ఞ? (పడుకుంటుంది).
రాజు : (కలగంటూ) వాసవదత్తా! (కలవరిస్తాడు).
వాసవదత్త : అరె! ప్రభువు. పద్మావతి కాదు! ఎవరూ చూళ్ళేదుగదా! నన్ను రాజు చూసాడంటే యౌగంధరాయణుడి ప్రతిఙ్ఞంతా గంగపాలవుతుంది.
రాజు : (కలగంటూ) వాసవదత్తా! (కలవరిస్తాడు).
వాసవదత్త : ప్రభువు కలగంటున్నాడు. కాస్సేపు ఇక్కడే నిలబడతా. మనసుకి ఆనందంగా ఉంది.
రాజు : ప్రియశిష్యురాలా! సమాధానం చెప్పవేం?
వాసవదత్త : మాట్లాడుతున్నా ప్రభూ..
రాజు : కోపం వచ్చిందా?
వాసవదత్త : కాదు. దుఃఖిస్తున్నాను.
రాజు : కోపం లేకపోతే ఎందుకు అలంకరించుకోలేదు?
వాసవదత్త : ఇంతకంటే ఏమిచెయ్యను?
రాజు : ఏం? విరచిక గుర్తొచ్చిందా?
వాసవదత్త : ఫో! ఇక్కడ కూడా ఆ విరచికే గుర్తొస్తోందా?
రాజు : అలా అయితే చెప్పు. విరచిక కోసం నిన్ను ప్రసన్నురాల్ని చేసుకుంటా.
వాసవదత్త : చాలాసేపు నిల్చున్నా. ఎవరైనా చూస్తారేమో. (మంచం మీద నుంచి లేచి క్రిందకి వేలాడుతున్న రాజు చేతిని తీసి, మంచమ్మీద పెట్టి వెళ్ళిపోతుంది.) రాజు : (గబుక్కున కంగారుగాలేచి) వాసవదత్తా! ఆగు. (ముందుకు పరిగెత్తి, తలుపు తగిలి మెలుకువలోకి వస్తాడు.) నిజంగా వాసవదత్తని చూశానా? నాకేం అర్ధం కావడంలేదు. (ఎదురుగా వస్తున్న విదూషకుడితో అంటాడు).
విదూషకుడు ఎక్కడి వాసవదత్త? ఎప్పుడో చనిపోయింది. ఏమిటి మిత్రమా? ఇలా వింతగా ప్రవర్తిస్తున్నావు?
రాజు : లేదు. పడుకున్న నన్ను లేపి వెళ్ళిపోయింది. వాసవదత్త చనిపోయిందని రుమణ్వంతుడు మనకి అబద్ధం చెప్పాడు.
విదూషకుడు నీ మంత్రులు నిన్ను మోసగించడమేమిటి? ఏం లేదు. ఉజ్జయినిని తలుచుకుని పడుకున్నావుగదా! అందుకని కలగన్నావేమో.
రాజు : అవును. కలే కన్నాను. కలే అయితే, మెలుకువ రాకుండా ఉండినా బాగుండేది. మతిభ్రమణమే అయితే నేనలాగే ఉండిపోయినా బాగుండేది.
విదూషకుడు మిత్రమా! అవంతీసుందరని ఒక యక్షిణి ఈ నగరంలో ఉంది. ఆవిణ్ణిగాని చూసావేమో.
రాజు : నా కలచివర, అంటే నేను మేల్కొనేముందు, కాటుకలేని కళ్ళతో, జడల్లుకోని జుట్టుతో, ఆమె ముఖం నాకు స్పష్టంగా కన్పించింది. భయంతో నా యీచేతిని పట్టుకుంది. చూడు. అప్పుడు నిక్కబొడుచుకున్న వెండ్రుకలు అలానే నిలబడి ఉన్నాయింకా.
(చేతిని చూపిస్తాడు).
విదూషకుడు అయ్యో! ఇలా అఖ్ఖర్లేని వాటన్నిటిని గురించి అలోచించి బుర్ర పాడుచేసుకోకు. అంతఃపురంలోకి పోదాం రా.
(కంచుకి ప్రవేశిస్తాడు.)
కంచుకి : జయము! జయము! ప్రభూ! మహారాజు దర్శకులు మిమ్మల్ని పిలుస్తున్నారు. మీమంత్రి రుమణ్వంతుడు పెద్దసైన్యంతో మీ శత్రువు అరుణిని ఓడించడానికి వచ్చారు. ఆయనకి సహాయంగా మా బలాల్నికూడా మహాహరాజు పంపుతున్నారు. సేనలు గంగదాటాయి. వత్సదేశం మీ సొంతమయింది. రండి.
రాజు : నడు. ఆ అరుణిని యుద్ధంలో నేనే చంపుతాను.
(అందరూ వెళ్ళి పోతారు.)