స్మృతికాలపు స్త్రీలు/ఏకాదశాధ్యాయము

స్మృతికాలపు స్త్రీలు

ఏకాదశాధ్యాయము

వివిధ విషయములు

వ్యభిచారము

వ్యభిచరింపకుండుట కంటెను నుత్కృష్టమగు ధర్మము స్త్రీ పురుషులకు లేదు.

    అన్యోన్యస్యావ్యభీచారో భవే దామరణాంతికః
    ఏషధర్మస్సమాసేన జ్ఞేయః స్త్రీపుంనయోః పరః
(మను. 9-101)

(భార్యాభర్తలు జీవితకాలములో నొకరినుండి యొకరు వ్యభిచరింపరాదు. మొత్తముమీద స్త్రీ పురుషుల కింతకంటెను గొప్ప ధర్మములేదు.)

అత్యంతము వ్యభిచరించు నగర్భిణియగు స్త్రీని ఱాయి కట్టి నీటిలో దింపవలెనని యాజ్ఞవల్క్యస్మృతి చెప్పుచున్నది.

    వివ్రదుష్టాంస్త్రియం భ్రూణపురుషఘ్నీ మగర్భిణీం
    సేతుభేదకరీం చాప్సుశిలాం బధ్వాప్రవేశయేత్
(యాజ్ఞ. 2-276)

గురుభార్యను పొందిన పురుషునకు గూడ మరణమే ప్రాయశ్చిత్తము. నూర్మీం జ్వలంతీం వాశ్లిష్యేన్మృత్యునాస విశుద్ధ్యతి

(మను. 11-89)

(గురు భార్యను పొందినవాడు కాలుచున్న స్తంభము నాలింగనము చేసికొనవలెను. వాడు మరణమువలన శుద్ధుడగును.)

బంధుత్వము దగ్గఱయిన కొలదియు వ్యభిచారమునకు దోషమెక్కువగ చెప్పబడినది.

    రేతస్సేకః స్వయోనీషు కుమారీష్వంతరాసుచ
    సఖ్యుః పుత్రన్యచస్త్రీషు గురుతల్ప సమంవిదుః
(మను 11-58)

(సోదరి, చండాలి, మిత్రుని భార్య, కోడలు-వీరితో వ్యభిచరించుట గురుపత్నీ గమనతుల్యము.)

నీచపు పురుషుని పొందుట స్త్రీ కత్యంతము పతన హేతువు.

    నీచాభిగమనం గర్భపాతనం భర్తృహింసనం
    విశేషపతనీయాని స్త్రీణామేతాన్యపిధ్రువం
(యాజ్ఞ 2-299)

వ్యభిచార మాత్రముననే స్త్రీ నింద్యురాలగుచున్నది.

    వ్యభిచారాత్తుభర్తుః స్త్రీలోకే ప్రాప్నోతినింద్యతాం
    సృగాలయోనించాప్నోతి పాపరోగైశ్చపీడ్యతే
(మను. 9-30)

'స్త్రీ వ్యభిచారమువలన నీ లోకములో నింద్యురాలగును. ఉత్తరజన్మమున నక్కయగును. మఱియు పాపరోగములచే పీడింపబడును'

వ్యభిచారమువలన గల్గిన సంతానము కూడ నింద్యమే యగుచున్నది. అనింద్యములగు వివాహముల వలన జనించిన వారే వంశము నిల బెట్టు పుత్రులని 'వివాహవిధాన' మను నధ్యాయమున చూచియుంటిమి. ఔరసులుకాని పుత్రులకు తండ్రియాస్తిలో భాగము రాదు కాని వారికి భరణ మీయవలెను.

    ఏకఏవౌరసఃపుత్రః ప్రిత్య్రస్యవసునః ప్రభుః
    శేషాణామానృశం స్యార్థం ప్రదద్యాత్తుప్రజీవనం.
(మను. 9-168)

వ్యభిచారమువలన గలిగిన పుత్రులు గూఢజుడు, కానీనుడు, సహోఢుడు, పౌనర్భవుడునని యయిదువిధములుగ నున్నారు.

    ఉత్పద్యతేగృహేయస్య నచజ్ఞాయేతకస్యసః
    సగృహేగూఢ ఉత్పన్నస్తస్యస్యాద్యస్యతల్పజః
(మను. 9-170)

(ఎవనికి జనించినాడో తెలియని పుత్రుడెవని యింట పుట్టుచున్నాడో యాతని పుత్రుడా తల్లికి భర్తయగువాని గూఢజపుత్రుడని చెప్పబడుచున్నాడు)

     పితృవేశ్మని కన్యాతు యం పుత్రంజనయేద్రహః
     తంకానీనం వదేన్నామ్నావోఢుః కన్యాసముద్భవం
(మను. 9-172)

(కన్యకు తండ్రియింట పుట్టిన పుత్రుడామెను వివాహ మాడినవాని కానీన పుత్రుడని చెప్పబడుచున్నాడు.)

    యాగర్భిణీసంస్క్రియతే జ్ఞాతా౽జ్ఞాతాపివాసతీ
    వోఢుస్సగర్భోభవతి నహోఢఇతి చోచ్యతే.
(మను. 9-178)

(గర్భిణిగా నున్న దానిని వివాహమాడువాని కాగర్భిణికి పుట్టినవాడు సహోఢుడను పుత్రుడగును.)

    యావత్యావా పరిత్యక్తా విధవావాస్వయేచ్ఛయా
    ఉత్పాదయేత్పు నర్భూత్వాసపౌనర్భవ ఉచ్యతే.
(మను. 9-176)

(పతిపరిత్యక్తగాని వితంతువుగాని మఱొకని పొంది కనిన పుత్రుడు పౌనర్భవుడు.)

ఇట్టిపుత్రులవలన పరలోకమున నేమియు లాభముండదని మనువు చెప్పుచున్నాడు.

    యాదృశం ఫలమాప్నోతికుప్ల వైస్సంతరన్ జలం
    తాదృశం ఫలమాప్నోతి కుపుత్రైస్సంతరం స్తమః
(మను. 9-161)

(సముద్రమును పనికిమాలిన దోనెతో దాటయత్నించుటవలన నెట్టిఫలముండునో పైన పేర్కొనబడిన కుపుత్రుల వలన పరలోక తమస్సును దాటయత్నించుటవలన నట్టిఫలముండును.)

స్వవీర్యమువలన జనింపని పుత్రుడిచ్చిన తిలోదకాదులు గూడ పురుషునకు ముట్టవనియు వా డెవనివీర్యమునకు జనించెనో వానికే యవి ముట్టుననియు నాపస్తంబుడు చెప్పుచున్నాడు.

    రేతోధాః పుత్రంనయతిపరేత్యయమసానే
    తస్మాద్భార్యాంగ్ రక్షంతిబిభ్యన్తివరరేతసః
(ఆ.ధ.సూ. 7-28-20)

(రేతస్సు నుంచినవాడు చనిపోయి యమలోకములో పుత్రునివలన లాభము నొందుచున్నాడు. కాన పర రేతస్సు నుండి భయపడి భార్యను రక్షించుకొందురు.)

వ్యభిచారమువలన గల్గిన కుమారుడు లౌకికవిషయములలో మాత్రము వ్యభిచరించిన పురుషునకు గాక యాస్త్రీ యొక్క భర్తకే చెందునని పై యంశమువలన తెలియుచున్నది. మనుస్మృతి మఱొక చోట నీయంశము నిట్లు స్పష్టపఱచుచున్నది.

    యదన్యగోషువృషభో వత్సానాంజన యేచ్ఛతం
    గోమినామేవ తేవత్సామోఘం న్కందితమార్షభం
    తథైవాక్షేత్రిణోబీజం పరక్షేత్రప్రవాపినః
    కుర్వంతిక్షేత్రిణామర్థం నబీజీ లభతేఫలం.
(మను. 9-51)

(ఎద్దు గోవులకు నూరుదూడలను పుట్టించినను నాదూడలు గోవులు కలవానివే యగును. వృషభము వ్యర్థముగనే రేతస్సును విడచినది. అట్లే పరక్షేత్రములో బీజమువేయువాని కాఫలము రాదు. ఆ ఫలము క్షేత్రముగల వానికే పోవును.)

వ్యభిచారము వలన జనించిన వారు పైన వివరింపబడిన యర్థములోనే పుత్రులగుచున్నారు. కాని మఱొక యర్థమున కాదు. వ్యభిచారమువలన స్వచ్ఛమైన సంతానము గలుగదని స్పష్టమగుచున్నది. వ్యభిచారమువలన వర్ణసంకరము కూడ నగును.

తత్సముత్థో హి లోకస్య జాయతే వర్ణసంకరః

(మను. 8-353)

వ్యభిచారమువలన వ్యభిచరించిన వారికంటె నావ్యభిచారమువలన గల్గిన సంతానమే యెక్కుడు పాపభూయిష్ఠమని స్మృతుల యభిప్రాయము. కనుకనే వ్యభిచరించినంత మాత్రమున స్త్రీని వదలివేయనక్కరలేదనియు పరునివలన గర్భము గల్గుచో నామెను వదలివేయవలెననియు చెప్పబడినది.

వ్యభిచారాదృతౌశుద్ధిర్గర్భేత్యాగో విధీయతే

(యాజ్ఞ. 1-73)

(వ్యభిచారము చేసిన స్త్రీకి ఋతుస్రావముతో శుద్ధియగును. గర్భము గల్గుచో నామెను వదలివేయవలెను.) ఒకసారి వ్యభిచరించిన దిక నెన్నిసారులైనను వ్యభిచరించునుగాన నకృద్వ్యభిచారిణిని గూడ వదలివేయవలెనని పరాశరుని మతము.

    బ్రాహ్మణీతుయదాగచ్ఛేత్పరం పుంసావిసర్జితా
    గత్వాపుంసశ్శతం యాతిత్యజేయుస్తాంతుగోత్రిణః
(9-35)

ఈ రజస్స్రానము చేత శుద్ధియగునది మానసిక వ్యభిచారమే కాని కాయికవ్యభిచారము కాదని కొన్ని స్మృతుల యభిప్రాయము.

రజసాస్త్రీ మనోదుష్టాసన్యాసేన ద్విజోత్తమః

(మను. 4-106)

(మానసిక వ్యభిచారము చేసిన స్త్రీరజస్సుచేతను ద్విజుడు సన్యాసము చేతను పరిశుద్ధులగుదురు)

తల్లి మానసిక వ్యభిచారమునకై కుమారునికి ప్రాయశ్చిత్తమున కక్కరకువచ్చు మంత్రము మనుస్మృతిలో చూపబడినది. ఈమంత్రమును బట్టి స్త్రీలు స్వభావముచే వ్యభిచారిణులని మనుస్మృతి చెప్పుచున్నది.

    యన్మేమాతాప్రలులుభే విచరంత్యపతివ్రతా
    తన్మేరేతః పితావృజ్త్కామిత్యస్యైతన్నిదర్శనం
(మను. 9-20)

('నాతల్లి యపతివ్రతయై మానసికముగ వ్యభిచరించి రజస్సున పరిశుద్ధము చేసికొనెనను నదేదికలదో దానిని నాతండ్రి బాగుచేయును గాక' యను మంత్రము స్త్రీలు మానసికముగ వ్యభిచరించువా రనుకొనుట కొక నిదర్సనము.)

    ధ్యాయత్యనిష్టం యత్కించిత్పాణిగ్రాహస్యచేతసా
    తస్యైషవ్యభిచారస్య నిహ్నవస్స మ్యగుచ్యతే
(మను. 9-21)

(స్త్రీ భర్తకేదైన యనిష్టము తలబెట్టుచో నావ్యభిచారమున కీ మంత్రము ప్రాయశ్చిత్తముగ చెప్పబడినది.)

ఇక స్త్రీలు స్వభావముచేత వ్యభిచారిణులను మను వాక్యమును చూతుము.

    నైతారూపం పరీక్షన్తే నాసాం వయసి సంస్థితిః
    సురూపం వా విరూపం వా పుమానిత్యేవభుంజతే
(మను. 9-14)

(ఈ స్త్రీలు రూపము చూడరు. వయస్సు విషయమై వీరికి పట్టుదల లేదు. సురూపుడైనను సరియే కురూపుడైనను సరియే పురుషుడైనంత మాత్రమున వీరనుభవింతురు)

    పౌంశ్చల్యాచ్చలచిత్తాచ్చ నై స్నేహాచ్చ స్వభావతః
    రక్షితా యత్నతో౽పీహ భర్తృష్వేతా వికుర్వతే
(మను. 9-15)

(స్త్రీలు పురుషుని చూడగనే చలించు స్వభావముగల వారు గావునను స్నేహభావము లేనివారు గావునను, మనస్సు నిలకడ లేనివారు గావునను వారి నెంతగరక్షించినను నింకను భర్తపట్ల తిన్నగ ప్రవర్తింపకుండగనే యుందురు.) స్త్రీల స్వభావమిట్టిది కావునను పురుషులకు కూడ నింద్రియజయము దుర్లభము కావునను స్త్రీపురుషులకు సంబంధము లేకుండ చేయవలెనని మనుస్మృతి యభిప్రాయము.

     ఏవంస్వభావం జ్ఞాత్వాసాం ప్రజాపతినిసర్గజం
     పరమం యత్న మాతిష్ఠేత్ పురుషోరక్షణంప్రతి
(మను. 9-16)

(బ్రహ్మ కల్పించిన స్త్రీ స్వభావమును గ్రహించి పురుషుడు స్త్రీని రక్షించుటకు గొప్ప ప్రయత్నము చేయవలెను.)

    మాత్రాన్వస్రాదుహిత్రావాన వివిక్తాననో భవేత్
    బలవానింద్రియగ్రామో విద్వాంసమపికర్షతి
(మను. 2-215)

(తల్లితోను, సోదరితోను, కుమార్తెలతోను గూడ నేకాంతప్రదేశమున నుండరాదు. బలవంతమగు నింద్రియ సమూహము విద్వాంసుని గూడ నాకర్షించును.)

భార్య చెడిపోవుటచే భర్తయొక్క యిహపరసుఖ మంతయు నశించుచున్నది. కావున నెట్టివాడయినను భార్యను రక్షించుకొనక తప్పదు. భార్యతోనే యిహపరసుఖ మున్నదను నంశము దాంపత్యమను నధ్యాయమున వివరింపబడినది.

    సూక్ష్మేభ్యోపి వ్రసంగేభ్యః స్త్రియారక్ష్యా విశేషతః
    ద్వయోర్హికులయోశ్శోకమావహే యురరక్షితాః
    ఇమం హి సర్వవర్ణానాం పశ్యన్తో ధర్మముత్తమం

    యతంతే రక్షితుం భార్యాం భర్తారోదుర్బలా అపి
    స్వాం ప్రనూతిం చరిత్రం చకులమాత్మాన మేవచ
    స్వం చ ధర్మం ప్రయత్నేన జాయాం రక్షన్ హిరక్షతి.
(మను. 9-5, 6, 7)

(స్వల్పములైన దుస్సంపర్కములనుండి కూడ స్త్రీలను విశేషముగ కాపాడవలెను. అట్లు కానిచో వారుభయకులములకును దు:ఖమును తెచ్చి పెట్టెదరు. ఈ సర్వవర్ణ సామాన్యమగు గొప్ప ధర్మము నాలోచించి దుర్బలులైన భర్తలుకూడ భార్యలను రక్షించుకొనుటకు యత్నించుచున్నారు. భార్యను పాపమునుండి రక్షించుచో సంతతిని, కులమును, తనను, తన ధర్మమును రక్షించుకొనినవాడే యగుచున్నాడు.)

పురుషుడు తానే పుత్రరూపమున జనించును గావున భార్య దుష్టురాలగుచో తా నా దుష్టక్షేత్రములో నుద్భవించుటచే తాను గూడ దుష్టుడే యగును. కాన భార్య నీతిని రక్షించుకొనవలెను. అంతేకాక పరుని బీజము భార్యయందు పడి ఫలించుచో తనను తన వంశమును గూడ చెడగొట్టుకొను వా డగుచున్నాడు.

    పతిర్భార్యాం సంప్రవిశ్యగర్భో భూత్వేహ జాయతే
    జాయా యాస్త ద్ధిజాయాత్వం యదస్యాం జాయతే పునః
(మను. 9-8)

(భర్త భార్యలో ప్రవేశించి గర్భమై పుట్టుచున్నాడు కాన భార్యకు 'జాయ' యను పేరు గల్గుచున్నది.) నిరంతరము బలాత్కారముగ స్త్రీలను కాపాడుట యసంభవమని మను వెఱుగును. వారి కేవో కొన్ని వ్యాపారములు కల్పించినచో కొంత రక్షణ యగునని యాతని తలంపు.

     నకశ్చిద్యోషితశ్శక్తః ప్రసహ్య పరిరక్షితుం
     ఏతైరుపాయ యోగైస్తు శక్యాస్తాః పరిరక్షితుం
     అర్థస్య సంగ్రహేచైనాం వ్యయే చైవనియోజయేత్
     శౌచేధర్మే౽న్నపంక్త్యాంచ పారీణహ్యస్యచేక్షణే
     అరక్షితా గృహేరుద్ధాః పురుషైరాప్తకారిభిః
     ఆత్మానమాత్మనాయాస్తు రక్షేయుస్తాస్సు రక్షితాః
(మను. 9-10, 11, 12)

(ఎవడును స్త్రీని బలవంతముగ రక్షింపజాలడు. ఈయుపాయములచే వారిని రక్షింపవచ్చును. ధనము గాపాడుట, వ్యయముచేయుట, గృహపారిశుద్ధ్యము గాపాడుట, ధర్మముల జేయుట, భోజనవిషయము చూచుట, గృహోపకరణములు కాపాడుట - అను వానిలో నామెను నియోగింపవలెను. పురుషులచే గృహములో నిర్భంధింపబడిన వారు రక్షింపబడని వారే. ఎవరు తమ్ముతామే కాపాడుకొనుచున్నారో వారే బాగుగ రక్షింపబడిన వారగుచున్నారు.)

ఆత్మరక్షణమే శ్రేష్ఠమని మను విట్లు చెప్పుచున్నను పురుషు డామెను గాపాడుటలోని యావశ్యకమును గూడ గుర్తించుచున్నాడు. భర్త భార్యను విడచియుండుటయే యామె చెడిపోవుట కొక హేతువనియు కాన సాధారణముగ భార్యాభర్త లొండొరులను వీడరాదనియు నాతడు చెఫ్ఫుచున్నాడు.

    తథానిత్యం యతేయాతాం స్త్రీపుంసౌతుకృతక్రియౌ
    యథానాభిచరేతాంతౌ వియుక్తావితరేతరం
(మను. 9-102)

(స్త్రీ పురుషు లెల్లపుడును కలసియుండి వారి కృత్యములను చేసికొను చుండవలెను. ఒకరినుండి యొకరు వియోగము చెంది వ్యభిచరింపకుండునట్లు కూడ యత్నింపవలెను.)

భర్తను విడచి యుండుటయు పొరుగిండ్ల వసించుటయు ముఖ్యముగ స్త్రీని పాడుచేయును.

    పానం దుర్జననంసర్గః పత్యాచవిరహోటనం
    స్వప్నోస్య గేహవాసశ్చ నారీసందోషణానిషట్
(మను. 9-13)

(మద్యపానము, దుర్జన సహవాసము, భర్తను విడచియుండుట, తిరుగుచుండుట, అతినిద్ర, యితరుని యింట నుండుట - యీ యాఱును స్త్రీని పాడుచేయును.)

ఏదైన కార్యములపై భర్త యెచటికైనను నివసింప వలసి వచ్చినచో భార్యకు తాను తిరిగి వచ్చువఱకు నన్న వస్త్రాదులకు లోటు లేకుండునట్లు చేసి పోవలెను. ఏమన: స్వతస్సిద్ధముగ మంచి స్త్రీయైనను గూడ నన్నవస్త్రములు లేనపుడు ధనమునకై పరపురుషుని పొందును.

    విధాయవృత్తిం భార్యాయాః ప్రవసేత్కార్యవాన్నరః
    అవృత్తికర్శితా హి స్త్రీ ప్రదుష్యేత్ స్థితిమత్యపి
(మను. 9-74)

భార్యను కాపాడుకొనుటకై భర్త యామెతో మాట్లాడకుండుటకై యితరపురుషుల నాజ్ఞాపింపవచ్చును. భర్తచేత నిషేధింపబడినను గూడ నెవడాతని భార్యతో మాట్లాడునో వానిని రాజు దండింపవలెను.

    నసంభాషాం పరస్త్రీభిః ప్రతిషిద్ధస్సమాచరేత్
    నిషిద్ధోభాషమాణస్తు సువర్ణం దండమర్హతి
(మను.8-361)

(నిషిద్ధుడై పరస్త్రీతో మాట్లాడరాదు. అట్లు మాట్లాడుచో సువర్ణదండమున కర్హుడు.)

భార్య మానమును విక్రయించి జీవించువారి భార్యలతోను చెడిపోయిన స్త్రీలతోను నిషిద్ధులై మాట్లాడిన వారికి స్వల్పముగ మాత్రమే దండనముండును.

    నైషచారణదారేషు విధిర్నాత్మోపజీవిషు
    సజ్జయంతి హి తే నారీర్ని గూఢాశ్చారయన్తిచ
    కించిదేవ తు దాప్యస్స్యాత్సంభాషాం తాభిరాచరన్
    ప్రైష్యాసు చైకభక్తాసు రహః ప్రవ్రజితాసుచ
(మను. 8-362-363)

ఈ పేజి వ్రాయబడి యున్నది.pdf/214 ఈ పేజి వ్రాయబడియున్నది.pdf/215 (గాయకుల భార్యల విషయమునను భార్య మానము వలన జీవించువారి భార్యల విషయమునను పై శిక్ష వర్తింపదు. ఏలన: అట్టి పురుషులు భార్యలను తార్చి రహస్యముగ వ్యభిచారములో ప్రవర్తింపజేయుచున్నారు. కాన నీ స్త్రీలతోను, దాసిలతోను, నొకని నుంచుకొనిన వారితోను, రహస్యముగ లేచిపొయిన వారితోను మాట్లాడుచో కొంచెము మాత్రమే సువర్ణదండ ముండును.)

ఇట్టి స్త్రీలే గాక వివాహములేక కేవలము వ్యభిచారమువలన జీవించు స్త్రీలు గూడ స్మృతులలో పేర్కొని యున్నారు. వ్యభిచారముచే వారార్జించు ధనము మిగిల పాపిష్ఠము కావుననే మనుస్మృతి వేశ్యల సొమ్ము తినువాడు స్వర్గాదిపుణ్యములోకముల నుండి దూరుడగునని చెప్పుచున్నది.

గణాన్నం గణికాన్నంచలోకేభ్యః పరికృంతతి

(మను. 4-219)

వేశ్యలను పొందినందులకు మాత్రము రాజదండన లేదు. అన్నిటికంటె హెచ్చు రాజదండన కన్యలను జెరచినందులకు నుత్తమజాతి స్త్రీని పొందినందులకును విధింపబడినది.

యో౽కామాందూషయేత్కన్యాం స సద్యోవధమర్హతి

(మను.8-364)
(తనను కామింపని కన్యను చెరచిన వానిని వెంటనే వధింపవలెను.)

    నజాతావుత్తమోదండ అనులోమ్యేనతు మధ్యమః
    ప్రాతిలోమ్యేనవధః పుంసాం నార్యాః కర్ణాదికర్తనం
(యాజ్ఞ. 2-284)

(సమానజాతికి చెందిన స్త్రీని పొందినచో నుత్తమ దండమును, తక్కువ వర్ణపు స్త్రీని పొందినచో మధ్యమదండమును, నెక్కువ వర్ణపు స్త్రీని పొందినచో మరణదండమును విధింపవలెను. తక్కువ వర్ణపు పురుషుని పొందిన స్త్రీకి నాసికాద్యవయములను ఖండింపవలెను.)

స్త్రీపురుషు లిరువురును గూడ మాట్లాడుటకు భర్తచే నిషేధింపబడి యున్నపిమ్మట గూడ మాట్లాడుచో వారు వ్యభిచరించినట్లే నిర్ణయించి వ్యభిచారమునకు వేయు శిక్షనే వారికి వేయవలెను.

    స్త్రీనిషేధేశతం దద్యాద్ద్విశతం తుదమః పుమాన్
    ప్రతిషేధేతయోర్దం డోయాథాసంగ్రహణేతథా
(యాజ్ఞ. 2-283)

వ్యభిచారము తఱచుగ ననుమేయమే యగుటచే కొన్ని చేష్టలను బట్టి స్త్రీ పురుషులు వ్యభిచరించి నట్లెంచవలెనని మనుస్మృతి చెప్పుచున్నది.

    ఉపచారక్రియాకేళిః స్పర్శో భూషణవాసనాం
    సహ ఖట్వాసనంచైవ సర్వం సంగ్రహణం స్మృతం.
(మను. 8-357)

(గంధపు పూత మున్నగు నుపచారములు, ఆటలు, ఆభరణములను, వస్త్రములను స్పృశించుట, ఒక యాసనము మీద కూర్చుండుట - ఇవి వ్యభిచార చిహ్నములు.)

ఒకని భార్య నొకడు హరించుచుచో నాహరించు వానిని చంపివేయవచ్చునని స్మృతులు చెప్పుచున్నవి. ఒకని భార్యను హరించువానికి 'ఆతతాయి' యని పేరు.

క్షేత్రదారహరశ్చైవషడేత ఆతతాయినః

(యాజ్ఞ. 3-16)

ఆతతాయి సమాయాన్తం హన్యాదేవా విచారయన్

(మను. 8-350)

(మీదికివచ్చు నాతతాయి నాలోచింపక చంపవలసినదే.)

పైన వివరింపబడిన విధములచే భార్యను వ్యభిచారాదులనుండి కాపాడు కొనకుండి వ్యభిచరించు భార్యను వదలి వేయనివాడు దోషియగుచున్నాడు. అట్టివాడు పజ్త్కిబాహ్యుడు 'మృష్యంతి ఛయేచోపపుతిం స్త్రీజితానాంచ సర్వశః' అను వాక్యము నిదివఱలో చూచియే యున్నాము.

భార్యయోని నితరు లనుభవించుటకు వీలుకానిదానిగా చేయుటకొక ప్రక్రియ ఆపస్తంబ గృహ్యసూత్రములో చెప్పబడినది. ఆప్రక్రియ యిట్లున్నది.

    
    అసంభవేప్సుః పరేషాగ్ స్థూలా
    ధారికా జీవచూర్ణాకార యిత్వాత్తరయా
    సుప్తాయాస్సమ్బాధ ఉపవపేత్
    సిద్ధ్యర్థేబభ్రు మూత్రేణ ప్రక్షాళయీత
(ఆ.గృ. 15-8-3, 4)

(ప్రవాసము వెళ్లువాడు తన భార్య యోనిలో పరుని రేతస్సు పడరాదని కోరుచో నాతడు శతచరణయను పేరుగల సరీసృప విశేషమును రాయి మున్నగు వానిచేత చంపించి దాని చూర్ణము చేయించి యాచూర్ణమును 'అవజ్యామి వధన్వనః' అను మంత్రము చెప్పి భార్య యోనియందు వేయవలెను, అట్లు చేయుచో యోని యనుభవానర్హ మగును. తాను భోగింపవలసి వచ్చినపుడు కపిల గోమూత్రముచే యోనిని కడిగినచో నది యనుభవార్హ మగును.)

స్త్రీకిష్టము లేకున్నను పురుషుడు బలాత్కారముగ నామె ననుభవించుచో స్త్రీ కెట్టి దోషమును లేదనియు నట్లు పరభుక్తయైన స్త్రీని భర్తవదలివేయ కూడదనియు స్మృతులు చెప్పుచున్నవి. కాని యట్టి బలాత్కార సంభోగముచే గర్భము గల్గుచో నాగర్భము దూషితమగును. సాధారణ వ్యభిచారముచేగల్గు గర్భమెట్టిదియో యాగర్భముగూడ నట్టిదే యగును.

    బలాత్కారోవభుక్తావా పరహస్త గతాపివా
    నత్యాజ్యాదూషితానారీ నాస్యాస్త్యా గోవిధీయతే
    పుష్పకాలముపాసీత ఋతుకాలే నశుద్ధ్యతి
(వశిష్ఠ. 28-33)

(బలాత్కారముగా ననుభవింప బడినట్టిగాని పరుల హస్తమున పడిపోయినట్టిగాని స్త్రీని వదలివేయరాదు. రజోదర్శనము వఱకు నిరీక్షింపవలెను. ఋతుకాలముచే నామె శుద్ధురాలగును.)

బలాత్కారముచే ననుభవింపబడిన స్త్రీకి గూడ పరాశరుడు ప్రాజాపత్యవ్రతమను ప్రాయశ్చిత్తము విధించు చున్నాడు. ఆ వ్రతానన్తరమగు ఋతుస్రావముచే నామె శుద్ధురాలగును.

    సకృద్భుక్తాతుయానారీ నేచ్ఛన్తీపాపకకర్మభిః
    ప్రజాపత్యేనశుద్ధేత ఋతుప్రస్రవణేనచ.
(పరాశర. 10-25)

( చాంద్రాయణ జావత్యాదివ్రతములలో శిరస్సునకు ముండనము చేయించుకొనవలెను. కాని స్త్రీలకు జుట్టుకొనను రెండంగుళములు కత్తిరించిన చాలును. పూర్తిగ ముండనము కూడదు.

     నర్వాన్కేశాన్న ముద్ధ్రత్యఛేద యేదం గుళద్వయం
     ఏవం నారీమారీణాం శిరశోముండనం స్మృతం.
(పరా. 9-54)

మిథున కర్మ

ఋతుకాలములో భర్తను కలయుట స్త్రీకి విధి.

    ఋతుస్నాతాతుయో నారీభర్తారం నోపసర్పతి
    సామృతానరకం యాతివైధవ్యం చపునఃపునః.

(ఋతుకాలములోనే స్త్రీ భర్తను పొందదో యామె నరకమునకు బోవును. ఉత్తర జన్మమున వితంతువగును.)

ఈ నియమమే భర్తృ పరముగ గూడ చెప్పబడినది.

    ఋతుస్నా తాంతుయో భార్యాం స్వస్థస్సన్నోప గచ్ఛతి
    ఘోరాయాంభ్రూణ హత్యాయాంయుజ్యతే నాత్రనంశయః
(పరాశర. 4-15)

(ఆరోగ్యముగ నుండియు గూడ ఋతుస్నాతయైన భార్యను పొందనివానికి భ్రూణహత్యా దోషము వచ్చును.)

ఋతుకాలమనగా రజోదర్శనమైనది మొదలు పదునారు రాత్రులు. అందు మొదటి నాల్గు రాత్రులును, అమావాస్యా పౌర్ణమాసులును చతుర్దశ్యష్టములును విసర్జింప వలసినవి.

    ఋతుస్స్వాభావిక స్త్రీణాం రాత్రయష్షోడశన్మృతాః
    చతుర్భిరితరైస్సార్థ మహోభిస్సద్వి గర్హితైః
    అమావాస్యా మష్టమీంచ పౌర్ణమాసీంచతుర్దశీం
    బ్రహ్మచారీ భవేన్నిత్య మప్యృతౌస్నాతకోద్విజః
(మను. 4-128)

    తాసామా ద్యాశ్చతన్రస్తు నిందితైకాదశీచయా
    త్రయోదశీ చశేషాస్తు ప్రశస్తా దశరాత్రయః
(మను. 3-47)

(ఋతుదినములలో మొదటి నాల్గు దినములును పదునొకండు పదమూడు దినములును నింద్యములు. మిగిలినవి ప్రశస్తములు.)

పైన పేర్కొనబడిన నింద్య రాత్రులను వదలుచో ఋతుకాలములోనే కాక యితర కాలములో గూడ సంగమము కూడునని గౌతముడు చెప్పుచున్నాడు.

ఋతావుపే యాదనృతౌచ పర్వవర్జం

(గౌ. 5-1)

ఋతుకాలములో నైనను శ్రాద్ధ భోజనముచేసి కాని శ్రాద్ధము పెట్టిగాని భార్యను పొంద రాదు.

    శ్రాద్ధందత్వాచభుక్త్వాచ మైథునం యోధిగచ్ఛతి
    భవంతి పితరస్తన్య తన్మానంతే రజోభుజః
(వసిష్ఠ. 10-37)

ఋతుకాలములోనైనను నారోగ్యము లేని భార్యను పొందరాదు.

నాకల్యాం నారీమభిరమయేత్

(గౌ. 9-29)

(స్వస్థురాలుకాని భార్యను పొందరాదు.)

రజస్వలయై యున్న స్త్రీని పొందకూడదని గౌతముడు ప్రత్యేకముగ చెప్పుచున్నాడు. నరజస్వలాం

(గౌ. 9-30)

ఆమె నాలింగనము కూడ చేసికొనరాదు.

నచైనాం శ్లిష్యేత్

(గౌ. 9-31)

భార్య నైనను గూడ ప్రధమ రజోదర్శనము కాకుండ పొంద గూడదని 'ఋతావుపేయాత్‌' అనుటను బట్టియే తేలుచున్నను నట్టి స్త్రీని పొందుట మిక్కిలి నిషిద్ధమని చెప్పుటకు గౌతముడు వేరుగానిట్లు చెప్పుచున్నాడు.

నకన్యాం

(గౌ. 9-32)

(రజస్వల కాని దానిని పొందరాదు)

కన్యాశబ్దమున కిచట 'అరజస్వల'యే కాని 'యవివాహిత' కాదను నంశము ప్రకరణమును బట్తి స్పష్టము. గృహస్థు భార్య నెపుడు పొందవలెననునదియే యిచటి ప్రకరణము.

రజస్వల

వేదకాలపు స్త్రీలలో వివరింపబడిన రజస్వలా నియమములన్నియు స్మృతులలో నున్నవి. తైత్తిరీయ సంహితలో (2-5-1) ని విషయమంతయు కొంచెమించుమించుగ నామాటలతో నే వసిష్ఠస్మృతిలో చెప్పబడినది. (వసిష్ఠ. 5-17, 18, 19, 20) ఆస్మృతివాక్యముల నిటవ్రాయుట పునరుక్తియేయగును గాన వదలివేయబడినవి. రజస్వలను గూర్చి యితరస్మృతులలో మఱికొన్ని వివరములు గూడ గలవు. ఏ హేతువుచేతనైన రజస్వలనుస్పృశించుచో స్నానము చేశుద్ధిగల్గును.

    దివాకర్తిముదక్యాంచ పతితంసూతికంతథా
    శసంతత్స్సృష్టినం చైవస్సృష్ట్వాస్నా నేనశుద్ధ్యతి.
(మను. 4-219)

రజస్వల లొకరినొకరు గూడ స్పృశింపరాదు.

    స్పృష్ట్వారజస్వలా న్యోన్యం బ్రాహ్మణీబ్రాహ్మణీంతధా
    తాపత్తిష్ఠీన్ని రాహారా త్రిరాత్రేణైవశుద్థ్యతి
(పరాశర. 7-14)

(బ్రాహ్మణ రజస్వల లొండొరుల స్పృశించుచో మూడునాళ్లుపవసించిన శుద్ధియగును.

రజఃకాలము మూడు దినములును నొకేవిధమగు నపరిశుద్ధత స్త్రీకుండదు. ఆమూడుదినములలోను నపరిశుద్ధత క్రమముగ నొకనాటికంటె నొకనాడు తగ్గుచుండును.

    ప్రథమేహని చండాలీ ద్వితీయే బ్రహ్మఘాతినీ
    తృతీయేరజకీ ప్రోక్తాచతుర్థేహనిశుద్ధ్యతి

(రజస్వల మొదటినాడు చండాలి. రెండవనాడు బ్రహ్మ ఘాతిని. మూడవనాడు చాకలిది. నాల్గవనాడు శుద్ధురాలగును.)

రజస్వల నాల్గవనాడు శుద్ధినొందును కాని రజస్స్రావమా నాటికి నిలిచిపోనిచో నామె భర్తచేయు దైవపిత్య్రాది

కర్మలలో పాల్గొనుటకు వీలులేదు. రజస్సు నిలిచిపోయిన పిమ్మటనే దైవపిత్య్రాది కర్మలను చేసికొనవలెను.

     స్నాతారజస్వలాయాతు చతుర్థే హనిశుద్ధ్యతి
     కుర్యాద్రజోనివృత్తౌతు దైవపిత్య్రాదికర్మచ
(పరాశర. 7-15)

రోగమువలన రజస్స్రావమగుచో దానివలన స్త్రీ యెన్నడును నపరిశుద్ధురాలు కాదు.

     రోగేణయద్రజః స్త్రీణామన్వహం హిప్రవర్తతే
     నాశుచిస్సాతతస్తేవ తత్స్యాద్వైకాలికంమతం
(పరాశర. 7-16)

నామము

స్త్రీలనామము గూర్చి 'వధూవరార్హత' లను నధ్యాయమున కొంతచూచియుంటిమి. అంతియే కాక:

    స్త్రీణాంసుఖోద్యమక్రూర మస్పష్టార్ధంమనోహరం
    మంగళ్యందీర్ఘవర్ణాన్తమా శీర్వాదాభిధానవత్.
(మను. 2-33)

(స్త్రీలనామము సుఖముగనుచ్చరింప తగినదిగను, క్రూరాక్షరములు లేనిదిగను, స్పష్టమైన యర్ధముగలదిగను, మనోహరమైనదిగను, మంగళార్థమైనదిగను, దీర్ఘ వర్ణము చివఱకలదిగను, నాశీర్వాదము తెల్పు శబ్దముకలదిగను, నుండవలెను.)

స్త్రీల నామములలోని యక్షరములు బేసి యంకెలో నుండవలెను. అయుజాక్షరం కుమార్యాః

(ఆ.గృ.సూ.15-11)

స్త్రీలను సాధారణముగ పేరు పెట్టి పిలువరాదనియు 'నుభగే' 'భగిని' మున్నగు గౌరవవాచకములచే సంబోధింప వలెననియు నిదివఱలో చూచియున్నాము. వారిని సమస్కరించునపుడు కూడ వారి పేరు చెప్పక 'మీకు' అను సర్వనామములతో నే నమస్కరింపవలెను.

సర్వనామ్నాస్త్రియః

(అ.ధ.సూ. 1-14-23)

దేవతా సంసర్గము

బాల్యములో స్త్రీని, చంద్రుడు, గంధర్వుడు, అగ్ని యనుభవించుచున్నారు.

    రోమదర్శనసంప్రాప్తేసోమో భుజ్త్కేథకన్యకాం
    రజోదృష్ట్వాతుగంధర్వఃకుచౌదృష్ట్వాతుపావకః
(యాజ్ఞ. 1-65)

(కన్యను రోమదర్శన మగుచుండగా సోముడును, రజోదర్శన మగుచుండగా గంధర్వుడును, కుచదర్శన మగుచుండగా నగ్నియు ననుభవింతురు.)

ఈ దేవతలలో నొక్కొక్క రీమె కొక్కొక్క గుణమును కలుగజేయు చున్నారు.

     సోమశ్శౌచందదౌస్త్రీణాం గంధర్వశ్చశుభాంగిరం
     పావకస్సర్వ మేధ్యత్వం మేధ్యావైయోషితోహ్యతః
(యాజ్ఞ. 1-75)

(సోముడు స్త్రీలకు శౌచమును, గంధర్వుడు శుభవాక్కును, అగ్ని సర్వపవిత్రతను గలుగజేయుదురు. కాన స్త్రీలు పవిత్రులు.)

కావుననే మనువు

నిత్యమాస్యం శుచిస్త్రీణాం

(మను.6-130)

(స్త్రీల ముఖమెప్పుడును పవిత్రమని చెప్పినాడు.)

పై శ్లోకమునుబట్టి రజోదర్శనమైన పిమ్మటనే కుచదర్శన మగునట్లు తేలుచున్నది. కాని కుచదర్శన మైనపిమ్మటనే రజోదర్శనమగుట లోకములో కాననగును. కాన నిచట రజస్సు వచ్చిన కన్యయనగా పరాశరుని నిర్వచనానుసారము పదేండ్లు దాటిన బాలికయని యర్థము చెప్పవలెను.

    అష్టవర్షాభవేద్గౌరీ నవవర్షాతు రోహిణీ
    దశవర్షాభవేత్కన్యా అతఊర్థ్వం రజస్వలా
(పరాశర. 1-4)

(ఎనిమిదేండ్ల పిల్లకు గౌరియనియు, తొమ్మిదేండ్ల దానికి కన్యయనియు, నాపై దానికి రజస్వల యనియు నామములు)

పతితత్వము

    నీచాభిగమనం గర్భపాతనం భర్తృహింసనం
    విశేషపతనీయాని స్త్రీణామేతాన్యపిధ్రువం

(నీచవర్ణపు పురుషుని పొందుట, గర్భము పోగొట్టు కొనుట, భర్తృహింస యనునవి స్త్రీ కత్యంతము పతన హేతువులు) పతితపురుషునకువలెనే పతితస్త్రీకి కూడ ఘటాశ్రాద్ధము చేయుటను స్మృతులు విధించుచున్నవి.

ఏతమేవవిధిం కుర్యాద్యోషిత్సుపతితాస్వపి

(మను. 11-188)

(వారు చనిపోయిన పిమ్మట నుత్తరక్రియలు నుద కాది దానము నుండదు.)

ఈ క్రిందివారి కుదక దాన మీయనక్కర లేదని మనుస్మృతి చెప్పుచున్నది.

    పాషాండమాశ్రితానాం చచరంతీనాం చకామతః
    గర్భభర్తృద్రుహాం చైవసురాపీనాం చయోషితః
(మను. 5-90)

(పాషండులను పొందినట్టియు, కామచారిణులైనట్టియు, గర్భమునకు భర్తకు ద్రోహము చేయునట్టియు, సురాపానము చేయునట్టియు స్త్రీల కుదక దానము లేదు.)

తఱచుగ భర్తృవాక్యము పాటింపని స్త్రీకూడ కామచారిణిగనే పరిగణింపబడినది. కాని యామెకు పతితత్వము లేదు. పజ్త్కిబాహ్యత యున్నది. ఆమె యన్నము నెవ్వరును తినకూడదు.

    భర్తృశాసనముల్లంఘ్యయాచ స్త్రీవిప్రవర్తతే
    తస్యాశ్చైవనభోక్తవ్యం విజ్ఞేయాకామచారిణీ

ప్రోషితభర్తృక

    క్రీడాం శరీరసంస్కారం సమాజోత్పవదర్శనం
    హాస్యం పరగృహయానం చత్యజేత్ప్రోషితభర్తృకా
(యాజ్ఞ.1-85)

(భర్త గ్రామములో లేనపుడు స్త్రీ యాటలను, నభ్యంగాది శరీరసంస్కారములను, నాటకములు, నుత్సవములు మున్నగు వానిని చూచుటను, హాస్యపుమాటలను, పరగృహమునకు వెళ్లుటను వదలివేయవలెను.)

భర్త ప్రవాసమునుండి చిరకాలమునకు తిరిగిరానిచో స్త్రీ యిల్లువిడచి యాతని వెదకుటకు పోవలెను. ఆతడు ధర్మకార్యమునకై వెళ్లి యుండినచో నెనిమిదేండ్లును, విద్యకై వెళ్లి యుండినచో నాఱేండ్లును, కామార్థమై వెళ్లినచో మూడేండ్లును నాతనికై నిరీక్షించి యనంతర మాతని వెదకుటకు పోవలెను.

    పోషితోధర్మకార్యార్ధం ప్రతీక్ష్యో౽ష్టౌ నరస్సమా:
    విద్యార్థం షడ్యశోర్థంవా కామార్థంత్రీంస్తు వత్సరాన్
(మను. 9-76)

వసిష్ఠు డిట్లు చెప్పుచున్నాడు.

    ప్రోషితపత్నీ పంచవర్షాణ్యుపాసీత ఊర్ధ్వం
    పతిసకాశం గచ్ఛేత్.
(వసిష్ఠ. 17-75, 76)

(ప్రవాసమునకు వెళ్లినవాని భార్య యయిదేండ్లు నిరీక్షించి పిమ్మట నాతనియొద్దకు పోవలెను.)

చూడరాని సమయములు

కొన్ని యవస్థలలో స్త్రీని చూడరాదు.

    నాశ్నీయాద్భార్యయాసార్థం నైనా మీక్షేతచాశ్నతః
    క్షువంతీం జృంభమాణాం వా నచాసీనాం యధాసుఖం
    నాంజయంతీం స్వకేనేత్రే న చాభ్యుక్తా మనావృతాం
    న పశ్యేత్ప్రసవంతీంచ తేజస్కామోద్విజోత్తమః
(మను.4 - 43, 44)

ననగ్నాంపర యోషితమీక్షేత

(గౌ. 9-49)

(భార్యతో కలసి యన్నము తినరాదు. ఆమె తినుచుండగా చూడరాదు, స్త్రీ తుమ్ముచుండగను, ఆవులించు చుండగను, సుఖముగ కూర్చుని యుండగను, నేత్రములకు కాటుక పెట్టుకొనుచుండగను, అభ్యంగనము చేయుచుండగను, ప్రసవించుచుండగను తేజస్కాముడగు ద్విజోత్తము డెవడును చూడరాదు. పరస్త్రీ గుడ్డవిప్పుకొని యుండగా చూడరాదు.)


సంపూర్ణము