సౌందర్యలహరి (వావిళ్ల, 1929)

శ్రీరస్తు.

శ్రీశంకరాచార్యకృత

సౌందర్యలహరి

టీకాతాత్పర్యసహితము



చెన్నపురి:

వావిళ్ల. రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారిచేఁ బ్రకటితము.

1929

ALL Right Reserved.

సౌందర్యలహరి

టీకాతాత్పర్యసహితము.

అవతారిక. తత్త్వవేది యగుశ్రీశంకరులు సమయయను చంద్రకళను పద్యశతముచేఁ బ్రస్తుతించుచున్నారు. —

శ్లో. శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
    న చేదేవం దేవో నఖలు కుశలః స్పన్దితుమపి,
    అతస్త్వామా రాథ్యాం హరిహరవిరిఞ్చాదిభిరపి
    ప్రణన్తుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి. 1

టీక. హేభగవతి = షడ్గుణైశ్వర్యసంపన్నురాలవగు ఓతల్లీ, శివః = సర్వమంగళోపేతుఁడైన సదాశివుఁడు, శక్త్యా =జగన్నిర్మాణశక్తిచేత, యుక్తః = కూడినవాఁడు, భవతియది = అగునేని, ప్రభవితుం= ప్రపంచనిర్మాణముకొఱకు, శక్తః = సమర్ధుఁడగును, ఏవమ్ = ఈలాగునశక్తియుక్తుఁడు, నచేత్ = కాఁడేని, స్పందితుమపి = కదలుటకును, కుశలః = నేర్పరి, నఖలు = కాఁడుగదా, అతః = ఇందువలన, హరిహరవిరిఞ్చాదిభిరసి = విష్ణుశంకరబ్రహ్మాదులచేతను, ఆరాధ్యామ్ = కొలువఁదగిన, త్వామ్ = నిన్ను , ప్రణంతుమ్ = మ్రొక్కుటకుగాని, స్తోతుంవా = పొగడుటకుగాని, అకృతపుణ్యః = చేయఁబడనిపుణ్యముగలవాఁడు, కథం = ఎట్లు, ప్రభవతి = సమర్థుఁడగును,

తాత్పర్యము. తల్లీ : ఈశ్వరుఁడును జగన్నిర్మాణశక్తితోఁగూడిననే జగముల నిర్మింపంజాలునుగాని యదిలేనియెడ కదలుటకు జాలఁడు. కనుక శివకేశవచతుర్ముఖాదులచేతను పరిచర్యచేయఁదగు నిన్ను పుణ్యలేశమైనఁ జేసి యెఱుఁగని నాబోటివాఁడు మ్రొక్కుటకొఱకుగాని పొగడుటకొఱకుగాని యె ట్లర్హుఁ డగును.

తనీయాంసం పాంసుం తప చరణపఙ్కేరుహభవం
విరిఞ్చిస్సఞ్చిన్వన్ విరచయతి లోకానవికలమ్,
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
హరస్పఙ్క్షుద్యైనం భజతి భసితోద్ధూళనవిధిమ్. 2

టీ. హేభగవతి = ఓతల్లీ, విరంచిః = బ్రహ్మ, తవ = నీయొక్క, చరణ పంకేరుహభవమ్ = పాదకమలమునఁ బుట్టిన, తనీయాంసమ్ = సూక్ష్మమైన, పాంసుమ్ = పరాగమును, సంచిన్వన్ = గ్రహించుచున్నవాఁడై, లోకాన్ = జగములను. అవికలమ్ = సమగ్రముగా, విరచయతి = నిర్మించుచున్నాఁడు. శౌరిః = విష్ణువు, ఏనమ్ = ఈపరాగకణమును, శిరసామ్ = తలలయొక్క , సహస్రేణ = వేయింటిచే, వహతి = మోయుచున్నాఁడు, హరః = శర్వుఁడు, ఏనమ్ = దీనిని, సంక్షుద్య = చక్కఁగామెదిసి, భసితోద్దూళనవిధిమ్ = భస్మధారణవ్యాపారమును, భజతి = పొందుచున్నాఁడు.

తా. తల్లీ, బ్రహ్మ నీపాదరేణు వొకింతసంపాదించి లోకములనిర్మించుచున్నాఁడు. ఆపరాగకణమునే విష్ణువు మిగుల నాయాసముతో వేయితలలచే మోయుచున్నాఁడు. దానినే యీశ్వరుఁ డంగరాగమునుగా సుపయోగించు కొనుచున్నాఁడు.

అవ. ఆపరాగమునే స్తుతించుచున్నారు —

అవిద్యానామన్తస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తబకమకరన్దసృతిఝరీ,
దరిద్రాణాం చిన్తామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. 3

టీ. హేభగవతి = ఓతల్లీ, ఏషః = ఈనీపాదరేణువు, అవిద్యానాం = అజ్ఞానులకు, అంతస్తిమిరమిద్వీపనగరీ-అంతః = లోపలనున్న, తిమిర = అజ్ఞానమునకు, మిహిరద్వీపనగరీ = సూర్యుఁడుదయించెడు ద్వీపమునకు నెలవైనది, జడానాం = మూఢులకు, చైతన్యస్తబకమకరందసృతిఝరీ-చైతన్య = ఆగతానాగతపరిజ్ఞానప్రదమగుచైతన్యమనెడు, స్తబక = పూగుత్తియొక్క, మకరంద-పూఁదేనియయొక్క, సృతి = స్రవణముయొక్క, ఝరీ = జాలు, దరిద్రాణాం = దీనులకు, చింతామణిగుణనికా-చింతామణి = చింతారత్నముయొక్క, గుణనికా = గుణములప్రోవు, జన్మజలధౌ = సంసారార్ణవమున, నిమగ్నానాం =మునిఁగినవారికి, మురరిపువరాహస్య = వరాహరూపుఁడగు విష్ణువుయొక్క, దంష్ట్రా = కోరయు, భవతి = అగుచున్నది.

తా. తల్లీ, నీపాదరేణువు అజ్ఞానులయొక్క యజ్ఞానమునకు సముద్రాంతర్గతసూర్యోదయద్వీపమున కాశ్రయ మైనది. (అనఁగా నజ్ఞానతిరస్కారకము) మూర్ఖులకు ఆగతానాగతపరిజ్ఞానరూపచైతన్యమనెడు కల్పవృక్షపుష్పగుళుచ్ఛముయొక్క తేనెజాలు, దరిద్రులకు చింతామణిగుణసమూహము, సంసారసాగరమున మునుగువారలకు వరాహదంష్ట్రయు ననుట.

త్వదన్యః పాణీభ్యామభయవరదో దైవతగణ
స్త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా,
భయాత్త్రాతుం దాతుం ఫలమపి చ వాఞ్ఛాసమధికం
శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ. 4

టీ. లోకానాం = లోకములకు, శరణ్యే = రక్షకురాలవగు, హేభగవతి = ఓతల్లీ, త్వదన్యః = నీకంటెవేఱైన, దైవతగణ్య = దేవసముదాయము, పాణిభ్యాం = చేతులతో, అభయవరదః = అభయవరముద్రలను ధరించుచున్నది. ఏకా = (ఒక) ముఖ్యురాలగు, త్వమేవ = నీవుమాత్రమే, పాణిభ్యాం = హస్తములచేత, ప్రకటితవరాభీత్యభినయా-ప్రకటిత = వెల్లడింపఁబడిన, వరాభీత్యభినయా = వరాభయవ్యంజకముద్రలను ధరించుదానవు, నైవాసి = కావుగదా, హి = ఇట్లని, తవ = నీయొక్క, చరణావేవ = పాదములే, భయాత్ = భయమునుండి, త్రాతుం = కాపాడుటకొఱకున్ను, వాంఛాసమధికం = కోర్కె కెక్కువైన, ఫలం = ఇష్టలాభమును, దాతుం = ఇచ్చుటకును, నిపుణౌ = నేర్చినవి.

తా. తల్లీ, ముఖ్యురాలవగు నీకంటె వేఱైన దేవతలందఱు హస్తములచే నభయపరముద్రలఁ దాల్చుటయునీవు మాత్రము పూనకుండుటయుఁ గాంచి నీపాదములే భయమునుండి తొలగించుటకును కోరినదానికంటె యెక్కువగా నిచ్చుటకును నేర్చియున్నవి. గాన నీవు ముద్రలఁ బూనుట వ్యర్థము.

హరిస్త్వామారాధ్య ప్రణతజనసౌభాగ్యజననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్,
స్మరో౽పి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా
మునీనామప్యన్తః ప్రభవతి హి మోహాయ జగతామ్. 5

టీ. హేభగవతి = ఓతల్లీ, హరిః = శ్రీవిష్ణువు, ప్రణతజనసౌభాగ్యజననీం-ప్రణత = నమ్రులైన, జన = లోకులకు, సౌభాగ్యజననీం = ఐశ్వర్యప్రదురాలవగు, త్వాం = నిన్ను, ఆరాధ్య = పూజించి, పురా = పూర్వము, నారీభూత్వా = ఆఁడుదిగానయి, పురరిపుమపి = ఈశ్వరునిఁగూడ, క్షోభం = కలఁతను, అనయత్ = పొందించెను. స్మరో౽పి = మన్మథుఁడును, త్వాం = నిన్నుఁగూర్చి, నత్వా = ప్రణమిల్లి, రతినయనలేహ్యేన-రతి = రతీదేవియొక్క, నయన = కన్నులచే, లేహ్యేన = ఆస్వాదించఁదగిన, వపుషా = ఒడలితో, మునీనామపి = మననశీలురగు మహాత్ములయొక్కయు, అన్తః = మనస్సును, మోహాయ = మోహింపఁజేయుకొఱకు, ప్రభవతిహి = సమర్థుఁడగుచున్నాఁడుగదా.

తా. తల్లీ, విష్ణువు భక్తవరదురాలును శ్రీచక్రరూపిణి యగునిన్ను గొల్చి పూర్వ మొకయాఁడుదిగా నయి యీశ్వరునిఁగూడ మోహపెట్టెను. అట్లే మదనుఁడును నిన్ను సేవించి త్రిలోకసుందరుఁడయి మునిమనములను సయితము మోహింపఁజేయునుగదా. అవ. మన్మథునకు దేవీప్రసాదమునఁ గలిగినమహిమను జెప్పి దీనిలో నాతఁ డనంగవిద్యలో మన్మథప్రస్తారమునకు ఋషియౌటచేఁ గలిగిననేర్పరితనమును జెప్పుచున్నారు.-

ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పఞ్చ విశిఖా
వసన్తస్సామన్తో మలయమరుదాయోధనరథః,
తథావ్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృపా
మపాఙ్గ్తాతే లబ్ధ్వా జగదిదమనఙ్గో విజయతే. 6

టీ. హిమగిరిసుతే = పార్వతీ, ధనుః = విల్లు, పౌష్పం = పూవులచేఁ జేయఁబడినది, మౌర్వీ-అల్లెత్రాఁడు, మధుకరమయీ = తేంట్లచేఁజేయఁబడినది, విశిఖాః = తూఁపులు, పఞ్చ = అయిదు, సామంతః = సచివుఁడు, వసంతః = వసంతకాలము, మలయమరుత్ = దక్షిణపుగాలి, అయోధనరథః = యుద్ధరథము, తథాపి = ఆలాగైనను, అనఙ్గః = మన్మథుఁడు, ఏకః =ఒక్కఁడే, తే = నీయొక్క, అపాంగాత్ = క్రేగన్నువలన, కామపి = చెప్పనలవిగాని, కృపాం = దయను, లబ్ధ్వా = పొంది, ఇదం = ఈ, జగత్ = లోకమును, సర్వం = అంతను, విజయతే = జయించుచున్నాఁడు.

తా. తల్లీ, విల్లా పూవులు (మృదువులౌటవలన తాఁకినఁ గందిపోవునవి గాన వంచుటకుగాని లాగుటకుగాని వీలుగానివనుట), అల్లెత్రాడు తుమ్మెదలు (ఒకటికొకటి పొందిక లేనందున త్రాడగుటకుఁ దగవనుట), అయిదు బాణములు (అవి ఖర్చుపడిన నిఁకగతిలేదనుట అవియును పూవులు గనుక బాణములుగాఁ దగవు). వసంతర్తువు సహాయము (అచేతనమగు కాలము మంత్రియగుటకుఁ దగదు). మలయమారుతము యుద్ధమునందలిరథము (ఇది యెప్పుడు నుండదు ఉన్నప్పుడేని స్థిరముగాదు అయినను రూపములేదు), ఇట్టి పనికిమాలిన పరికరములుగలిగియు మన్మథుఁ డేకవీరుఁడై నీదయతోడికటాక్షములఁ బ్రబలి ముల్లోకములను నేలకుఁ గోలకుఁ దెచ్చుచున్నాఁడు. అవ. మణిపూరమునఁ బొడకట్టు భగవతిరూపమును స్తుతించుచున్నారు.-

క్వణత్కాఞ్చీదామా కరికలభకుమ్భస్తననతా
పరిక్షుణ్ణా మధ్యే పరిణతశరచ్చన్ద్రవదనా,
ధనుర్భాణాన్పాశం సృణిమపి దథానా కరతలైః
పురస్తాదాస్తాం నః పురమధితురాహోపురుషికా. 7

టీ. క్వణత్కాంచీదామా-క్వణత్ = మొరయుచున్న, కాంచీదామా = గజ్జెలమొలనూలుగలదియు, కరికలభకుంభస్తననతా-కరికలభ = ఏనుఁగుగున్నయొక్క, కుంభ = కుంభములవంటి, స్తన = చనులచేత, నతా = కొంచెమువంగినదియు, మధ్యే = నడుమునందు, పరిక్షుణ్ణా = కృశించినదియు, పరిణతశరచ్చంద్రవదనా- పరిణత = కళలునిండిన, శరత్ = శరత్కాలమందలి, చంద్ర = చంద్రునివంటి, వదనా = మోముగలదియు, కరతలైః = చేతులచేత, ధనుః = చెఱకు వింటిని, బాణాన్ = పూబాణములను, పాశము = మోకును, సృణిమపి = అంకుశము, దధనా = ధరించిన, పురమధితుః = త్రిపురాంతకుఁడగు నీశ్వరునియొక్క, ఆహోపురుషికా = అహంకారరూపురాలగుదేవి, నః = మాయొక్క, పురస్తాత్ = ఎదుట, ఆస్తాం = వెలయుఁగాత.

తా. మ్రోయుచున్న చిఱుగంటల మొలనూలుగలదియు, గజకుంభములవంటి స్తనములుగలదియు, కృశించినడుముగలదియు, పూర్ణచంద్రునివంటి మోముగల త్రిపురాంతకుని సుందరి హస్తములచే ధనుర్బాణపాశాంకుశములఁ బూని మాయెదురఁ బ్రసన్నతతోఁ గనుపట్టుంగాక.

సుథాసిన్ధోర్మధ్యే సురవిటపివాటీపరివృతే
మణిద్వీపే నీపోపవనవతి చిన్తామణిగృహే,
శివాకారే మఞ్చే పరమశివపర్యఙ్కనిలయాం
భజన్తి త్వాం ధన్యాః కతిచన చిదానన్దలహరీమ్. 8

టీ. సుధాసింధోః = అమృతసముద్రముయొక్క, మధ్యే = నడుమ, సురవిటపివాటీపరివృతే-సురవిటడి = కల్పవృక్షములయొక్క, వాటీ = తోఁటలచేత, పరివృతే = కమ్ముకొనఁబడిన, మణిద్వీపే = మణిమయమగులంకయందు, నీపోపవనవతి-నీప = కడిమచెట్లచేత, ఉపవనవతి = ఉద్యానముగలిగిన, చింతామణి గృహే = చింతారత్నములయింటియందు, శివాకారే = శివశక్తిరూపమగు, మంచే = మంచమున, పరమశివపర్యంకనిలయామ్-పరమశివ = శదాశివునియొక్క, పర్యంక = ఉత్సంగ (తొడ) మే, నిలయాం = నెలవుగాఁగలిగిన, చిదానందలహరీం-చిత్ = జ్ఞానరూపమగు, ఆనంద = నిరతిశయసుఖముయొక్క, లహరీం = తరంగరూపమగు, త్వాం = నిన్ను, కతిచన = కొందఱు, ధన్యాః = కృతార్థులు, భజంతి = సేవించుదురు.

తా. తల్లీ, అమృతసముద్రమున కల్పవృక్షములతోఁపులచేఁ జుట్టఁబడిన రత్నపులంకలో కడిమిచెట్లతోఁటలుగల చింతామణులచేఁ గట్టినయింటిలో త్రికోణరూపమగు తల్పమున సదాశివుని తొడయందున్న జ్ఞానానందతరంగ మగు నిన్ను ధన్యులు కొందఱు సేవింతురు.

శ్లో. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం
    స్థితం స్వాధిష్ఠానే హృది మరుతమాకాశముపరి,
    మనో౽పి భ్రూమధ్యే సకలమపి భిత్వాకులపథం
    సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసి. 9

టీ. హేభగవతి = ఓతల్లీ, త్వమ్ = నీవు, మూలాధారే = మూలాధారచక్రమందు (అన్నిటికి నాధారము గనుక యీపేరుగలిగెను), స్థితమ్ = ఉన్న, మహీం = పృథివీతత్వమును, మణిపూరే = మణిపూరచక్రమందున్న (ఇచటనుండి దేవి మణులచే నీచోటును నిండించుఁగాన దీని కీ పేరుగలిగె), ఇందుచే సమయాచారపరు లాంతరపూజ సేయువేళ మూఁడవకమలమున దేవికి నానారత్న ఖచితభూషణము సమర్పణము సేయవలయునని సూచితము. కమపి = ఉదకతత్వమును, స్వాధిష్ఠానే = స్వాధిష్ఠానచక్రముననున్న (ఇచ్చట కుండలిని యధిష్ఠించి ముడివేసికొని కూర్చుండునుగాన దీని కీపేరుగలిగె), హుతవహమ్ = అగ్నితత్వమును, హృది = అనాహతమనఁబడు హృదయాకాశమునున్న (కొట్టఁబడని నాదస్థానముగలదిగాన ననాహత మనఁబడెను), మరుతం = వాయుతత్వమును, ఉపరి = అన్నిటికిమీఁదనున్న విశుద్ధచక్రమున నున్న (శుద్ధస్ఫటికమువలె నుండుటచే విశుద్ధమనఁబడు), ఆకాశం = వ్యోమతత్వమును, భ్రూమధ్యే = ఆజ్ఞాచక్రముననున్న (ఆజ్ఞయన నీషద్ జ్ఞానము. దీనియందు దేవి క్షణకాలము మెఱుపువలె మెఱయఁగా సమాధితోఁ జూచు నుపాసకులకు బ్రహ్మగ్రంథిభేద మయి కొంచెముగాఁ బొడకట్టునుగాన నిది యాజ్ఞాచక్ర మనఁబడును), మనోపి = మనస్తత్వమును, సకలమపి = ఈసమస్తమగు, కులపథం = సుషుమ్నామార్గమును, భిత్వా = భేదించి, సహస్రారే = సహస్రారమను, పద్మే = కమల (చక్ర) మందు, పత్యాసహ = ఈశ్వరుఁడగు సదాశివునితోఁగలసి, విహరసి = క్రీడింతువు.

తా. తల్లీ, నీవుమూలాధారస్వాధిష్ఠానమణిపూరకానాహతవిశుద్ధాజ్ఞారూప షట్చక్రములయందున్న పృథివ్యగ్నిజలపవనాకాశ మనస్తత్వములను దాఁటి భర్తయగు సదాశివునితోఁగలసి సహస్రారమనుకమలమునవిహరింతువు. అనఁగా దేవిచతుర్వింశతితత్వములను దాఁటి పంచవింశుండగు సదాశివుతోఁగూడి షడ్వింశతితత్వరూపయైపరమాత్మయని వ్యవహరింపఁబడునని భావము.

శ్లో. సుధాధారాసారైశ్చరణయుగళాన్తర్విగళితైః
    ప్రపఞ్చం సిఞ్చన్తీ పునరపి రసామ్నాయమహనః,
    అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్ఠవలయం
    స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుణ్డే కుహరిణి 10

టీ. హేభగవతీ = ఓతల్లీ, చరణయుగళాన్తర్విగళితైః-చరణ = పాదములయొక్క, యుగళ = జంటయొక్క, అంతః = నడుమనుండి, నిగళితైః = స్రవించిన, సుధాధారాసారైః-సుధా = అమృతముయొక్క, ధారా = ధారలయొక్క, ఆసారైః = వర్షములచేత, ప్రపంచం = డెబ్బదిరెండువేలనాడులను, సించన్తీ = తడుపుచున్న దానవై, రసామ్నాయమహనః-రస = అమృతముయొక్క, ఆమ్నాయ = అతిశయరూపమైన, మహసః = కాంతిగల చంద్రునివలన, స్వాం = స్వకీయమైన, భూమిం = మూలాధారచక్రమును, పునః = మఱల, అవాప్య = పొంది, భుజగనిభమ్-భుజగ = పాముతోటి, నిభమ్ = సమానమగు, అధ్యుష్ఠవలయమ్-అధ్యుష్ఠ = అధిష్ఠింపఁబడిన, వలయమ్ = కుండలిగలిగిన, స్వమ్ = తనదగు, ఆత్మానం = రూపమును, కృత్వా = చేసి (ధరించి), కుహరిణి = తామరబొడ్డుయందలిబెజ్జమువంటి బెజ్జముగల, కులకుణ్దే-కుల = పృథివీతత్వము లయమునొందు సుషుమ్నామూలమందలి, కుండే = కమలకందరూపమైనయాధారచక్రమందు, స్వపిషి = నిద్రింతువు.

తా. తల్లీ, నీవు పాదములవలనఁబుట్టిన యమృతవర్షముచే నాడీసమూహమును దడిపి చంద్రునివలన మఱల స్వస్థానమునుబొంది పామువలెచుట్టుకొనియున్న నిజరూపము మాని సూక్ష్మరంధ్రముగలిగిన సుషుమ్నామూలమందలి యాధారచక్రమందు నిదురించెదవు. ఆధారకుండమునడుమనున్న రంధ్రమున తామరదారపుపాటి యాకృతిగల కుండలినీశక్తి యుండునని భావము.

శ్లో. చతుర్భిశ్శ్రీకణ్ఠై శ్శివయువతిభిః పఞ్చభిరపి
    ప్రభిన్నాభిశ్శమ్భోర్నవభిరపి మూలప్రకృతిభిః,
    చతుశ్చత్వారింశద్వసుదళకళాశ్రత్రివలయ
    త్రిరేఖాభిస్సార్ధం తవ శరణకోణాః పరిణతాః. 11

టీ. హేభగవతి = ఓతల్లీ, చతుర్భిః = నలువురగు శ్రీకంఠైః = శివునిచేతను, శంభోః = ఈశ్వరునికంటె, ప్రభిన్నాభిః = వేఱైన, పంచభిరపి = ఏవురగు, శివయువతిభిః = శివశక్తులచేతను, నవభిరపి = తొమ్మిదగు, మూలప్రకృతిభిః = మూలకారణముచేతను, తవ = నీయొక్క, శరణకోణాః-శరణ = నిలయమగుశ్రీచక్రముయొక్క, కోణాః = కోణములు, వసుదళకళాశ్రత్రివలయత్రిరేఖాభిస్సార్థమ్ - వసుదళ = అష్టదళములచేతను, కళాశ్ర = షోడశదళములచేతను, త్రివలయ = త్రిమేఖలలచేతను, త్రిరేఖాభిస్సార్థమ్ = త్రిభూపురములచేతను, పరిణతాస్సంతః = పరిణామమునుబొందినవై, చతుశ్చత్వారింశత్ = నలువదినాలుగుగా నగుచున్నవి. తా. తల్లీ, నలువురురుద్రులచేతను శివునికంటె వేఱైనయేవురుశివశక్తులచేతను, తొమ్మిదిమూలప్రకృతులచేతను అష్టదళషోడశదళత్రివలయరేఖలచేతను నీకు నిలయమైన శ్రీచక్రము నలువదినాలుగంచులుగలది. శ్రీచక్రము త్రికోణాష్టకోణద్వయచతుర్దశకోణము లనియెడు నైదు శక్తి చక్రములచేతను, బిందువు అష్టదళము షోడశదళము చతురశ్రము అనునాలుగుశివచక్రములతోడను గలిగి నవచక్రాత్మకమై శివశక్త్యుభయరూపముగా వెలయుచుండునని తాత్పర్యము.

శ్లో. త్వదీయం సౌన్దర్యం తుహినగిరికన్యే తులయితుం
    కవీన్ద్రాః కల్పన్తే కథమపి విరిఞ్చిప్రభృతయః,
    యదాలోక్యౌత్సుక్యాదమరలలనా యాన్తి మనసా
    తపోభిర్దుష్ప్రాపామపి గిరిశసాయుజ్యపదవీమ్. 12

టీ. హేతుహినగిరికన్యే = హిమవంతునికూఁతురగు ఓపార్వతీ, త్వదీయమ్ = నీదగు, సౌన్దర్యమ్ = సొబగును, తులయితుమ్ = మఱియొకదానితో పోల్చుటకొఱకు విరించిప్రభృతయః-విరించి = బ్రహ్మయే, ప్రభృతయః = మొదలుగాఁగల, కవీంద్రాః = కవివరులు, కధమపి = ఎటులైనను కల్పన్తే = సమర్థులగుదురా? కారు. యత్ = ఏకారణమువలన, అమరలలనాః = అచ్చరమచ్చకంటులు, ఆలోక్యౌత్సుక్యాత్-ఆలోక్య = చూడఁదగిననీసొబగునుచూచుటయందలి, ఔత్సుక్యాత్ = వేడుకవలన, తపోభిః = తపములచే, దుష్ప్రాపామపి = పొందరానిదైనను, గిరిశసాయుజ్యపదవీమ్-గిరిశ = శివునియొక్క, సాయుజ్య = సహయోగముయొక్క, పదవీమ్ = స్థానమును, మనసా = మనస్సు చేతనే, యాన్తి = పొందుచున్నారో.

తా. తల్లీ, అప్సరసలును నీసౌందర్యలేశమున కోట్యంశముననైనను సామ్యమును గనఁజాలక సదాశివమాత్రగోచరమగు నీవిలాసమును జూడఁగోరి మనస్సుచేతనే దుష్ప్రాపమగు శివసాయుజ్యమును పొందుచుండిరి. ఇట్లెల్లలోకములలో నీకీడగువస్తువులభింపమి బ్రహ్మాదులును నీసొబగును పోల్చివర్ణింపఁజాలరైరి.

శ్లో. నరం వర్షీయాంసం నయనవిరసం నర్మసు జడం
    తవాపాఙ్గాలోకే పతితమనుధావన్తి శతశః,



గళద్వేణీబన్ధాః కుచకలశవిస్రస్తసిచయా
హఠాత్త్రుట్యత్కాఞ్చ్యో విగిళితదుకూలా యువతయః. 13

టీ. హేభగవతి = ఓతల్లీ, వర్షీయాంసమ్ = ముదిసినవాఁడైనను, నయనవిరసం-నయన = కన్నులచేత, విరసమ్ = వికారరూపుఁడైనను, నర్మసు = రతిక్రీడలయందు, జడమ్ = మోటువాఁడైనను, తవ = నీయొక్క, అపాఙ్గాలోకే = క్రేగంటిచూపుయందు, పతితమ్ = పడిన, నరమ్ = మనుష్యమాత్రుని, యువతయః = జవ్వనులు, గళద్వేణీబన్థాః-గళత్ = జాఱుచున్న, వేణీ = జడలయొక్క, బన్థాః = ముళ్లుగలవారై, కుచకలశవిప్రస్తసిచయాః-కుచకలశ = కుండలవంటిచనులయందు, విస్రస్త = జాఱిపోయిన, సిచయాః = పైఁటకొంగులుగలవారై, హఠాత్ = ఆకస్మికముగా, త్రుట్యత్కాఞ్చ్యః-త్రుట్యత్ = తెగిన, కాఞ్చ్యః = మొలనూళ్లుగలవారై, విగళితదుకూలాః-విగళిత = వీడిపోయిన, దుకూలాః = పోకముడిగలవారై, అనుధావన్తి = వెంబడించి పరుగులిడుదురు.

తా. తల్లీ, నీచల్లనిచూడ్కులకు పాల్పడినవాఁ డెట్టిమోటువాఁడైనను, యెంతముసలివాఁడైనను, ఎంతవిరూపియైనను వానినే మన్మథుఁడని తలంచి వలచి విలాసవతులు తమకొప్పులు వీడంగా, పైఁట జాఱఁగా, మొలనూళ్లు తెగఁగా, కోకలు వీడఁగా వెంబడించి పరుగులిడుదురు.

శ్లో. క్షితౌ షట్పఞ్చాశద్ద్విసమధికపఞ్చాశుదుదకే
    హుతాశేద్వాషష్టిశ్చతురధికపఞ్చాశదనిలే,
    దివి ద్విష్షట్త్రింశన్మనసి చ చతుష్షష్టిరితి యే
    మయూఖాస్తేషామప్యుపరి తవ పాదామ్బుజయుగమ్. 14

టీ. హేభగవతి = ఓతల్లీ, క్షితౌ = పృథివీతత్వముతోఁగలసినమూలాధారమందు, షట్పఞ్చాశత్ = ఏఁబదియాఱును, ఉదకే = అప్తత్వముతోఁగూడిన మణిపూరమందు, ద్విసమధికపఞ్చాశత్ = ఏఁబదిరెండును, హుతాశే = అగ్నితత్వయుక్తమైన స్వాధిష్ఠానమున, ద్వాషష్టీః = అఱువదిరెండును, అనిలే = వాయుతత్వయుతమగు అనాహతచక్రమందు, తతురధికపఞ్చాశత్ = ఏఁబదినాలుగును, దివి = ఆకాశతత్వయుతమైనవిశుదచక్రమందు, ద్విఃషట్త్రింశత్ = డెబ్బదిరెండును, మనసిచ = మనస్తత్వయుతమగునాజ్ఞాచక్రమందు, చతుష్షష్టిః = అఱువదినాలుగును, ఇతి = ఈలాగున, యే = ఏ, మయూఖాః = జ్వాలలు (కలవో), తేషామపి = వానికంటె, ఉపరి = మీఁద (సహస్రదళకమలమందలి చంద్రబింబమువంటిదగు బైందవమను పేరఁబరఁగునమృతసముద్రమునందు), తవ = నీయొక్క, పాదామ్బుజయుగమ్-పాదామ్బుజ = పాదకమలములయొక్క, యుగమ్ = జంట, వర్తతే = ఉండును.

తా. తల్లీ, నీపాదములజంట భూ, జ, లాగ్ని, వా, య్వాకాశ, మనస్తత్వాత్మకము లగు మూలాధార, మణిపూరక, స్వాధిష్ఠా, నానాహత, విశుద్ధాజ్ఞాచక్రములయందున్న యోగిగమ్యములైన తేజస్సులకంటె పై సహస్రారమందు చంద్రబింబమువలె నుండు బైందవమను నమృతసముద్రమున నుండునని తా.

శ్లో. శరజ్జ్యోత్స్నాశుద్ధాం శశియుతజటాజూటమకుటాం
    వరత్రాసత్రాణస్ఫటికఘుటికాపుస్తకకరామ్,
    సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిదధతే
    మధుక్షీరద్రాక్షామధురిమధురీణాః ఫణితయః. 15

టీ. హేభగవతి = తల్లీ, శరజ్జ్యోత్స్నాశుద్ధామ్-శరత్ = శరత్కాలమందలి, జ్యోత్స్నా = వెన్నెలవలె, శుద్ధాం = నిర్మలమైనదియు, శశియుతజటాజూటమకుటాం-శశి = చంద్రునితోడ, యుత = కూడుకొనిన, జటాజూట = కేశకలాపమే, మకుటాం = శిరోభూషణముగాఁగలదియు, వరత్రాసత్రాణస్ఫటికఘుటికాపుస్తకకరాం-వర వరదానముద్రయు, త్రాసత్రాణ = అభయముద్రయు, స్ఫటికఘుటికా = స్ఫటికములచే నిర్మింపఁబడిన జపమాలయు, పుస్తక = పుస్తకమున్ను, కరాం = హస్తమునఁగల, త్వా = నిన్నుగూర్చి, సకృత్ =ఒక్కమాఱేని, నత్వా = నమస్కరించి, సతాం = సజ్జనులకు, మధుక్షీరద్రాక్షామధురిమధురీణాః-మధు = తేనెయొక్కయు, క్షీర = పాలయొక్కయు, ద్రాక్షా = ద్రాక్షపండ్లయొక్కయు, మధురిమ = తియ్యఁదనమునకు, ధురీణాః = భారవాహకములై, ఫణితయః = వాక్కులు, కథమివ = ఎట్లు, న సన్నిదధతే = ఆవిర్భవించవు, ఆవిర్భవించునని భావము.

తా. తల్లీ, శరత్కాలమందలివెన్నెలవలె తెల్లనైనదానవును, చంద్రునితోఁగూడిన కేశకలాపమే కిరీటముగాఁగలదానవును, వరాభయాక్షమాలాపుస్తకాాధారిణియునగు నిన్నొక్కమాఱేని మ్రొక్కినకవులకు తేనె పాలు ద్రాక్షపండ్లు మొదలగువానివలె మధురములైనవాక్కులు నిరర్గళముగాఁ గలుగును.

శ్లో. కవీన్ద్రాణాం చేతఃకమలవనబాలాతపరుచిం
    భజన్తే యే సన్తః కతిచిదరుణామేవ భవతీమ్,
    విరిఞ్చిప్రేయస్యాస్తరుణతరశృఙ్గారలహరీ
    గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాం రఞ్జనమమీ. 16

టీ. హేభగవతి = తల్లీ, కవీన్ద్రాణాం = కవులయొక్క, చేతఃకమలవనబాలాతపరుచిం - చేతః = చిత్తమను, కమలవన = తామరతోఁటకు, బాలాతప = లేయెండయొక్క, రుచిం = కాంతివంటిదగు, అరుణామేవ = అరుణయను పేరుగల(ఎఱ్ఱనికాంతిగల), భవతీం = నిన్ను, కతిచిత్ = కొందఱగు, యే = ఏ, సన్తః = సజ్జనులు, భజన్తి = సేవించెదరో, తే = ఆ, అమీ = వీరు, విరిఞ్చిప్రేయస్యాః-విరిఞ్చి = బ్రహ్మయొక్క, ప్రేయస్యాః = ప్రియురాలగు సరస్వతీదేవియొక్క, తరుణతరశృఙ్గారలహరీగభీరాభిః-తరుణకర = ఉద్రిక్తమైన, శృఙ్గార = శృంగారరసముయొక్క, లహరీ = ప్రవాహములచేత, గభీరాభిః = అగాధములైన, వాగ్భిః = వాక్కులచేత, సతాం = సజ్జనులయొక్క, రఞ్జనం = ఆహ్లాదమును, విదధతి = చేయుదురు.

తా. తల్లీ, కమలములకుఁ లేఁతయెండవలె కవిచిత్తములకు వికాసప్రదురాలవగు ఎఱ్ఱనికాంతిగల నిన్ను ఏపుణ్యాత్ములు నమస్కరింతురో వారు సరస్వతీ ప్రసాదలబ్థమైన శృంగారరసపూరితములైన సుభాషితములచేత సకలసజ్జనహృదయానందమును చేయఁగలుగుదురని తా.

శ్లో. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభఙ్గరుచిభి
    ర్వశిన్యాద్యాభిస్త్వాం సహ జనని సఞ్చిన్తయతి యః,
    సకర్తా కావ్యానాం భవతి మహతాం భఙ్గిరుచిభి
    ర్వచోభిర్వాగ్దేవీవదనకమలామోదమధురైః. 17

టీ. హేజనని = ఓతల్లీ, వాచాం = పలుకులకు, సవిత్రీభిః = జనకములై శశిమణిశిలాఙ్గరుచిభిః-శశిమణిశిలా = చంద్రకాంతపుఱాలయొక్క, భఙ్గ = ముక్కలయొక్క, రుచిభిః = కాంతివంటికాంతిగల, పశిన్యాద్యాభిస్సహ = పశిని మొదలగుశక్తులతోఁగూడ, త్వాం = నిన్ను, యః = ఎవఁడు సఞ్చిన్తయతి = చక్కగా ధ్యానించునో, సః = వాఁడు, మహతాం = వాల్మీకిమున్నగుమహా కవులయొక్క, భఙ్గిరుచిభిః-భఙ్గి = రచనలయొక్క, రుచిభిః = చవులుగలిగినవియు, వాగ్దేవీవదనకమలామోదమధురైః-వాగ్దేవీ = సరస్వతియొక్క, వదనకమల = కమలమువంటి ముఖమందలి, ఆమోద = మరిమళముచేత, మధురైః = తీపులైన, వచోభిః = సుభాషితములచేత, కావ్యానాం = కబ్బములకు, కర్తా = చేయువాఁడుగా, భవతి = అగుచున్నాఁడు.

తా. తల్లీ, నిన్ను కవిత్వమునిచ్చునట్టి వశిన్యాదిశక్తులతోఁగూడ ధ్యానముచేయువాఁడు వ్యాసవాల్మీకి ప్రభృతులకవనమువలె మధురమై శ్రవణరమణీయమైన వాక్కులుగలిగి పురుషరూపముదాల్చినవాణియో యనునట్లు రసవత్కావ్యములకుఁ గర్త యగును.

శ్లో. తనుచ్ఛాయాభిస్తే తరుణతరణిశ్రీసరణిభి
    ర్దివం సర్వాముర్వీమరుణిమనిమగ్నాం స్మరతి యః,
    భవన్త్యస్యత్రస్యద్వనహరిణశాలీననయనా
    స్సహోర్వశ్యా వశ్యాః కతికతి న గీర్వాణగణికాః. 18

టీ. హేభగవతి = ఓతల్లీ, తరుణతరణిశ్రీసరణిభిః-తరుణ = లేఁతవాఁడగు, తరణి = సూర్యునియొక్క, శ్రీసరణిభిః = సౌభాగ్యమునుబోలుసౌభాగ్యముగల, తే = నీయొక్క, తనుచ్ఛాయాభిః = శరీరకాంతులచేత, దివం = ఆకాశమును, సర్వాం సమస్తమగు, ఉర్వీం = భూమిని, అరుణిమనిమగ్నాం-అరుణిమ = ఎఱుపులో, నిమగ్నా = మునిఁగినదానిఁగా, యః = ఎవఁడు, స్మరతి = ధ్యానించునో, అస్య = వీనికి, త్రస్యద్వనహరిణశాలీననయనాః-త్రస్యత్ = బెదరుచున్న, వనహరిణ = అడవిలేళ్లకువలె, శాలీన = అందములైన, నయనాః = కన్నులుగల, గీర్వాణవనితాః = అచ్చరలు, ఊర్వశ్యా సహ = ఊర్వశితోఁగూడ, కతికతి = ఎందఱెందఱు, వశ్యాః = లోఁబడినవారలు, న భవన్తి = కారు, అందఱును వశంపద లగుదురనుట.

తా. తల్లీ ఎవఁ డీమిన్నును మన్నునుగూడ నీయొక్క మేనిరంగులచే నెఱ్ఱనైనదానినిగా భావించునో యట్టివానికి ఊర్వశితోఁగూడ ఎందఱెందఱు చకితహరిణీనేత్ర లగునచ్చరమచ్చకంటులు వశముగారు? ఎల్లరు నగుదురు.

శ్లో. ముఖం బిన్దుం కృత్వా కుచయుగమధస్తస్య తదధో
    హరార్ధం ధ్యాయేద్యో హరమహిషి తే మన్మథకలామ్,
    న సద్యస్సఙ్క్షోభం నయతి వనితా ఇత్యతిలఘు
    త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీన్దుస్తనయుగామ్. 19

టీ. హరమహిషి = శివునిపట్టపురాణివగు వోతల్లీ, ముఖమ్ = మొగమును, బిన్దుం = బిందురూపమును, కృత్వా = చేసి, తస్య = దానికి, అధః = క్రింద, కుచయుగం = చంటిజంటను, కృత్వా = చేసి, తదధః = దానిక్రింద, హరార్ధం = శక్తిరూపమును (త్రికోణమును), కృత్వా = ఉంచి, తత్ర = అచ్చట, తే = నీయొక్క, మన్మధకలాం = కామబీజమును, యః = ఎవఁడు, ధ్యాయేత్ = ధ్యానించునో, సః = ఆయుపాసకుఁడు, సద్యః = అప్పుడే, వనితా = జవ్వనులను, సంక్షోభం = కలవరమును, నయతీతియత్ = పొందించుననుట యేదికలదో, తత్ = అది, అతిలఘు = మిగులస్వల్పము, రవీన్దుస్తనయుగాం-రవీన్దు = సూర్యచంద్రులే, స్తనయుగాం = కుచద్వయముగాఁగల, త్రిలోకమపి = ముల్లోకములను, ఆశు = శీఘ్రముగా, భ్రమయతి = మోహపెట్టుచున్నాఁడు.

తా. తల్లీ, ముఖమును బిందువునుగాఁ దలఁచి, దానిక్రింద పాలిండ్లను కల్పించి, యాక్రింద త్రికోణమును ధ్యానించి యచట నీమదనబీజము నెవఁడు ధ్యానించునో యాయుపాసకప్రవరుఁ డెల్లపల్లవాధరలను భ్రమపెట్టు నననేల? ముల్లోకముల నొక్కపెట్టున మోహింపఁజేయఁగలఁడు. సూర్యచంద్రులు స్తనము లనుటచేత స్త్రీయని ధ్వని.

    కిరన్తీమఙ్గేభ్యః కిరణనికురుమ్బామృతరసం
    హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివ యః,
    స సర్పాణాం దర్పం శమయతి శకున్తాధిప ఇవ
    జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారసిరయా. 20

టీ. హేదేవి = ఓతల్లీ, యః = ఎవఁడు, అఙ్గేభ్యః = అవయవములవలన, కిరణనికురుమ్బామృతరసమ్-కిరణ = కాంతులయొక్క, నికురుమ్బ = సమూహమువలనఁ గలిగిన, అమృతరసం = అమృతద్రవమును, కిరస్తిం = కురియుచున్న, హిమకరశిలామూర్తిమివ = చంద్రకాంతమణివలె, హృది = నెమ్మనమున, త్వాం = నిన్ను, ఆధత్తే = నిలుపుచున్నాఁడో, సః = వాఁడు, శకున్తాధిపఇవ = పులుఁగులఱేఁడగు గరుడునివలె, సర్పాణాం = చిలువలయొక్క, దర్పం = పొగరును, శమయతి = మాపుచున్నాఁడు, సుధాధారసిరయా = అమృతనాడియగు, దృష్ట్యా = చూపుచేత, జ్వరప్లుష్టాన్ = జ్వరముచేఁ గ్రాఁగినవారలను, సుఖయతి = సుఖింపఁజేయుచున్నాఁడు.

తా. తల్లీ, సర్వావయవములచే నమృతమును గురియుచున్ననిన్ను చంద్రకాంతమణివలె హృదయమున ధ్యానించువాఁడు సర్పములను గరుడునివలె రూపుమాపును. ఒక్కసారి చూచినంతమాత్రమున నెట్టి జ్వరపీడితుల సంతాపమును బోఁగొట్టఁగలఁడు.

    తటిల్లేఖాతన్వీం తపనశశివైశ్వానరమయీం
    నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలామ్,
    మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా
    మహాన్తః పశ్యన్తో దధతి పరమానన్దలహరీమ్. 21

టీ. భగవతి = తల్లీ, తటిల్లేఖాతన్వీం-తటిల్లేఖా = మెఱుపుతీఁగవలె, తన్వీం = సూక్ష్మమై దీర్ఘమై క్షణవిలసనముగలదియు, తపనశశివైశ్వానరమయీం = సూర్యచంద్రాగ్నిరూపముగలదియు, షణ్ణాం = ఆఱగు, కమలానాం = చక్రములయొక్క, ఉపరి = మీఁద, మహాపద్మాటవ్యాం = గొప్పతామరతోఁటయందు (సహస్రారమందు), నిషణ్ణాం = కూర్చున్న, తవ = నీయొక్క, కలాం = సాదాఖ్యకళను, మృదితమలమాయేన - మృదిత = పోకార్చఁబడిన, మలమాయేన = కామాదిమలములు - అవిద్యాస్మితాహంకారాదులుగల, మనసా = మనస్సుతో, పశ్యన్తః = చూచుచున్న, మహాన్తః = సజ్జనులు, పరమానన్దలహరీం = ఉత్తమమైన యానంద్రప్రవాహమును, దధతి = పొందుచున్నారు.

తా. తల్లీ, షట్పద్మములమీఁద సహస్రారమందున్న సూర్యచంద్రాగ్నిరూపమైన మెఱుపుతీగెవంటిదగు నీకళను కామాదిమలములు మాయ వీనిచే విడువఁబడినచిత్తముతో ధ్యానింతురేని వారు మహదానందప్రవాహమున నోలలాడుదురు.

భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణా
మితి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః,
తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్యపదవీం
ముకున్దబ్రహ్మేంద్రస్ఫుటమకుటనీరాజితపదామ్. 22

టీ. భవాని = ఈశ్వరీ, త్వం = నీవు, దాసే = కింకరుఁడనగు, మయి = నాయందు, సకరుణాం = దయతోఁగూడిన, దృష్టిం = చూపును, వితర = ఇమ్ము, ఇతి = ఇట్లు, యః = ఎవఁడు, స్తోతుం = పొగడుటకొఱకు, వాంఛన్ = ఇచ్చగించువాఁడై, భవానిత్వమితి = భవానిత్వం అని, కథయతి = నుడువునో, తస్మై = వానికొఱకు, త్వం = నీవు, తదైవ = అప్పుడే (మాటముగియకముందే), ముకున్దబ్రహ్మేన్ద్రమకుటనీరాజితపదాం-ముకున్ద = విష్ణువుయొక్కయు, బ్రహ్మ = బ్రహ్మయొక్కయు, ఇంద్ర = ఇంద్రునియొక్కయు, స్ఫుట = వెలుఁగుచున్న, మకుట = కిరీటములచేత, నీరాజిత = ఆర తెత్తబడిన, పదాం = అడుగులు గల, నిజసాయుజ్యపదవీమ్-నిజ = స్వకీయమైన, సాయుజ్యపదవీమ్ = తాదాత్మ్యమును, దిశసి = ఇచ్చెదవు.

తా. తల్లీ, నిన్నెవఁడేని 'అమ్మా సేవకుఁడగు నాయందు దయతోడి కటాక్షమును జిమ్ము' మని వేడఁబోయి సగముమాట జెప్పునంతలోన హరిబ్రహ్మేంద్రప్రార్థనీయమగు నీసాయుజ్యము నీయఁగలవు.

త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా
శరీరార్ధం శమ్భోరపరమపి శఙ్కే హృతమభూత్,
యదేతత్త్వద్రూపం సకలమరుణాభం త్రినయనం
కుచాభ్యామానమ్రం కుటిలశశిచూడాలమకుటమ్. 23

టీ. హేభగవతి = ఓతల్లీ, త్వయా = నీచేత, శంభోః = శివునియొక్క, వామం = ఎడమదగు, వపుః = మేనిసగమును, హృత్వా = హరించి, అపరితృప్తేన = తనివారని, మనసా = చిత్తముచేత, అపరమపి = కుడిదగు, శరీరార్ధమ్ = మేని సగమును, హృతం = హరింపఁబడినదని, శఙ్కే = తలఁచెదను, యత్ = ఏకారణమువలన, ఏతత్ = ఈ, త్వద్రూపమ్ = నీయాకారము, సకలం = అంతయు, అరుణాభమ్ = ఎఱ్ఱనికాంతిగలదియు, త్రినయనమ్ = మూఁడుకన్నులు గలదియు, కుచాభ్యామ్ = స్తనములచేత, ఆనమ్రమ్ = వంగినదియు, కుటిలశశిచూడాలమకుటమ్-కుటిల = వక్రమైన, శశి = చంద్రఖండముచేత, చూడాల = శిరోభూషణముగలదైన, మకుటమ్ = కిరీటముగలదో.

తా. తల్లీ, నీయొడలంతయు నెఱ్ఱనికాంతిగలదై మూఁడుకన్నులుగలదై స్తనభారనమ్రమయి చంద్రశకలమును ధరించియుండుటఁజూడ తొలుత నీవు ఈశ్వరుని శరీరవామార్ధమును హరించి యంతటితోఁ దనివినొందక మిగిలినసగమునుగూడ హరించితివిగాఁబోలునని శంకవొడముచున్నది.

జగత్సూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే
తిరస్కుర్వన్నేతత్స్వమపి వపురీశస్తిరయతి,
సదాపూర్వస్సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివ
స్తవాజ్ఞా మాలమ్బ్య క్షణచలితయోర్భ్రూలతిలకయోః. 24

టీ. హేభగవతి = ఓతల్లీ, ధాతా = బ్రహ్మ, జగత్ = లోకమును, సూతే = పుట్టించుచున్నాఁడు, హరిః = విష్ణువు, జగత్ = లోకమును, అవతి = రక్షించుచున్నాఁడు, రుద్రః = శివుఁడు, జగత్ = లోకమును, క్షపయతే = నశింపఁజేయుచున్నాఁడు, ఈశః = ఈశ్వరుఁడు, ఏతత్ = ఈహరిహరబ్రహ్మాత్మకమైన మూఁటిని, తిరస్కుర్వన్ = తిరస్కరించువాఁడై, స్వమపి = తనదగు, వపుః = శరీరమును, తిరయతి = అంతర్ధానమును బొందించుచున్నాఁడు, సదాపూర్వః = సదాశబ్దము ముందుగల, శివః = సదాశివుఁడు, తదిదమ్ = ఆయీధాతృహరిహర ఈశరూపమైన తత్త్వచతుష్టయమును, క్షణచలితయోః = క్షణవికాసముగల, తవ = నీయొక్క, భ్రూలతికయోః = కనుబొమలయొక్క, ఆజ్ఞామ్ = ముదలను, అవలమ్బ్య = పొంది, అనుగృహ్ణాతి = అనుగ్రహించుచున్నాఁడు. అనఁగా మఱల సృజించునని భావము.

తా. తల్లీ, బ్రహ్మ లోకములను సృజించును, విష్ణువు రక్షించును, శివుఁడు లయింపఁజేయును. ఈశ్వరుఁడుఈముగ్గురను తనశరీరముతోడ లయము నొందించును. సదాశివుఁడు నీకటాక్షమాత్రమును సహాయముగాఁ బడసి యీతత్త్వచతుష్టయమును మఱల నుద్ధరించుచున్నాఁడు. అనఁగా ననేకకోటి బ్రహ్మాండములను సృజించుటయందును లయించుటయందును నీభ్రూవిక్షేపమే సదాశివునకు సహాయమొనర్చునని తా.

త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే
భవేత్పూజా పూజా తవ చరణయోర్యా విరచితా,
తథాహి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే
స్థితా హ్యేతే శశ్వన్ముకుళితకరోత్తంసమకుటాః. 25

టీ. హే శివే = ఓదేవీ, త్రిగుణజనితానామ్ = సత్వరజస్తమోగుణములవలనఁ బుట్టిన, త్రయాణాం = మువ్వురగు, దేవానాం = హరిహరబ్రహ్మలకు, తవ = నీయొక్క, చరణయోః = పాదములయందు, యాపూజా = ఏపూజ, విరచితా = చేయఁబడినదో, సైవ = అదియే, పూజా = పూజయనఁబడును. తథాహి = ఆలాగేకదా, హి = ఏకారణమువలన, ఏతే = వీరలు, త్వత్పాదోద్వహనమణి పీఠస్య = నీపాదములను మోయుచున్నపలకయొక్క, నికటే = చెంతను, శశ్వత్ =మాటిమాటికి, ముకుళితకరోత్తంసమకుటాః-ముకుళిత = అంజలిబద్ధములైన, కర = చేతులే, ఉత్తంస = శిరోభూషణములుగాఁగల, మకుటాః = ఔదలలుగలవారై, స్థితాః = ఉందురో.

తా. తల్లీ, సత్త్వరజస్తమోగుణజనితులైన హరిహరబ్రహ్మలకు నీకుఁ జేయఁబడుపూజయే పూజయనఁబడును, ఏకారణమువలన వీరలెప్పుడును, నీపాదసమ్ముఖమున నిలచియుందురో.

విరిఞ్చిః పంచత్వం ప్రజతి హరిరాప్నోతి విరతిం
వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనమ్,
వితంద్రీ మాహేన్ద్రీవితతిరపి సమ్మీలితదృశా
మహాసంసారే౽స్మిన్విరహతి సతి త్వత్పతిరసౌ. 26

టీ. విరఞ్చిః = బ్రహ్మ, పఞ్చత్వం = మరణమును, వ్రజతి = పొందుచున్నాఁడు, హరిః = విష్ణువు, విరతిం = ఉపరతిని, ఆప్నోతి = పొందుచున్నాఁడు, కీనాశః = జముఁడు, వినాశం = నాశమును, భజతి = పొందుచున్నాఁడు, ధనదః = కుబేరుఁడు, నిధనం = మరణమును, యాతి = పొందుచున్నాఁడు, మహేన్ద్రీ = ఇంద్రులసంబంధమైన, వితతిరపి = సమూహమున్ను, సమ్మీలితదృశా = మూయఁబడినకనులతో, వితన్ద్రీ = విహ్వలమగుచున్నది, అస్మి౯ = ఈ, మహాసంసారే = గొప్పసంసారమందు, సతి = దేవీ, అసౌ = ఈ, త్వత్పతిః = నీప్రియుఁడగు సదాశివుఁడు, విహరతి = క్రీడించుచున్నాఁడు.

తా. తల్లీ, బ్రహ్మాదులకును మరణమును గలిగించు నీమహాసంసారమున నీప్రియుఁడగు సదాశివుఁడొకఁడుమాత్రము చలనములేక కనులుమూసికొని వేడుకతోఁ గ్రీడించుచుండును.

జపో జల్పశ్శిల్పం సకలమపి ముద్రావిరచనా
గతిః ప్రాదక్షిణ్యక్రమణమశనాద్యాహుతివిధిః,
ప్రణామస్సంవేశః సుఖమఖిలమాత్మార్పణదృశా
సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం. 27

టీ. హేభగవతి = ఓతల్లీ, ఆత్మార్పణదృశా = బ్రహ్మార్పణబుద్ధిచేత, జల్పః = నోటికొలఁదివాఁగుట, జపః = మంత్రజపము, సకలమపి = అంతయు, శిల్పం = చిత్రలేఖనము మున్నగుచేతిపనియు, ముద్రావిరచనా-ముద్రా = సంక్షోభణవిద్రావణాదిముద్రలయొక్క, విరచనా = చేయుటయు, గతిః = స్వేచ్ఛగాఁ దిరుగుటయు, ప్రాదక్షిణ్యక్రమణం = ప్రదక్షిణము దిరుగుట, అశనాది = ఏదేని తినుట మొదలైనదియు, ఆహుతివిధిః = ఇష్టదైవమునుగూర్చి హవిస్సు నర్పించుటయు, ప్రణామః = మ్రొక్కుటయు, సంవేశః = క్రిందఁబడి దొర్లుటయు, సుఖం = శబ్ధస్పర్శాదికమగు సుఖమున్ను, అఖిలం = ఈచెప్పిన వానికంటె వేఱైన (ఒడలువిఱుచుట, కనులుమూయుట మొదలగు) సమస్తకార్యమును, ఆత్మార్పణదృశా = బ్రహ్మార్పణబుద్ధిచేత, తవ = నీకు, సపర్యాపర్యాయః = పూజకు మాఱుగా, భవన్తు = అగుఁగాక.

తా. తల్లీ, మనోవాక్కాయములచేత బ్రహ్మార్పణబుద్ధితో నేఁజేయు నెల్లపనులును నీకు పూజలేయగుఁగాక.

సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం
విపద్యన్తే విశ్వే విధిశతమఖాద్యా దివిషదః,
కరాళం యత్క్ష్వేళం కబళితవతః కాలకలనా
న శమ్భోస్తన్మూలం తవ జనని తాటఙ్కమహిమా. 28

టీ. హేజనని = ఓతల్లీ, విశ్వే = ఎల్ల రగు, విధిశతమఖాద్యాః = బ్రహ్మేంద్రాదులైన, దివిషదః = స్వర్గవాసులైనదేవతలు, ప్రతిభయజరామృత్యుహరిణీమ్-ప్రతిభయ = భయంకరములైన, జరా = ముదిమిని, మృత్యు = చావును, హరిణీం = పోఁగొట్టునట్టి, సుధాం = అమృతమును, ఆస్వాద్యాసి = త్రాగియు, విపదన్తే = మరణించుచున్నారు, కరాళం = భయంకరమగు, క్ష్వేళం = విషమును, కబళితవతః = మ్రింగిన, శంభోః =ఈశ్వరునకు, కాలకలనా = నాశము, నాస్తీతియత్ = లేదనుట యేదికలదో, తన్మూలం = దానికికారణము, తవ = నీయొక్క, తాటఙ్కమహిమా-తాటఙ్క = కమ్మలయొక్క, మహిమా = సామర్థ్యము. తా. తల్లీ, జరామరణములను బోఁగొట్టు నమృతమును ద్రాగియు బ్రహ్మేంద్రాదిసురులు విపత్తిని జెందుదురు. వీరలఁబోలి తానును కాలవశగుఁడు గావలసినవాఁడయ్యు శివుఁ డట్లుకాఁడు. దీనికి నీకర్ణపూరములే కారణము. కాలముయొక్క జననస్థితిలయములు తాటంకములచేతనే గలుగును గాన కాలప్రభావ మాతాటంకసన్నిధిలో నాఁగదు. అవి లేనియెడ నీశ్వరుఁడును విపన్నుఁ డగునని తా.

కిరీటం వైరిఞ్చం పరిహర పురః కైటభభిదః
కఠోరే కోటీరే స్ఖలసి జహి జమ్భారిమకుటమ్,
ప్రణమ్రేష్వేతేషు ప్రసభముపయాతస్య భవనం
భవస్యాభ్యుత్థానే తవ పరిజనో క్తిర్విజయతే. 29

టీ. హేభగవతి = ఓతల్లీ, పురః = ఎదుట, వైరిఞ్చం = బ్రహ్మదేవునిదగు, కిరీటం = మకుటమును, పరిహర = తొలఁగఁజేయుము, కైటభభిదః = విష్ణువుయొక్క, కఠోరే = కఠినమగు, కోటీరే = కిరీటమందు, స్ఖలసి = జాఱెదవు, జమ్భారిమకుటం = ఇంద్రకిరీటమును, జహి = దాఁటిరమ్ము, ఇతి = ఈలాగున, ఏతేషు = ఈబ్రహ్మాదులు, ప్రణమ్రేషుసత్సు = మ్రొక్కువారగుచుండఁగా, భవనం = గృహమునుగూర్చి, ఉపయాతస్య = వచ్చిన, భవస్య = శర్వునియొక్క, ప్రసభం = తొందరగా, తవ = నీయొక్క, అభ్యుత్థానే = ఎరుర్కొనుటయందు, పరిజనోక్తిః = చెలులమాట, విజయతే = వెలయుచున్నది.

తా. తల్లీ, నీకు బ్రహ్మేంద్రాదులు మ్రొక్కుచుండఁగా నీభర్తయింటికి వచ్చుసమయమున నీవెదురేఁగుటలో నీచెలులు నీకు దారిచూపుచు అమ్మా యిదిబ్రహ్మకిరీటము చూచిరమ్ము. ఇది విష్ణువుయొక్క గఱుకుకిరీటము తాఁకునేమో చూడుము. ఇది యింద్రునికిరీటము చూడుమని తెలుపుచుందురు.

స్వదేహోద్భూతాభిర్ఘృణిభిరణిమాద్యాభిరభితో
నిషేవే నిత్యే త్వామహమితి సదా భావయతి యః,
కిమాశ్చర్యం తస్య త్రిణయనసమృద్ధిం తృణయతో
మహాసంవర్తాగ్నిర్విరచయతి నీరాజనవిధిమ్. 30

టీ. హేనిత్యే = నిత్యురాలగు ఓభగవతీ, స్వదేహోద్భూతాభిః-స్వ = నీయొక్క, దేహ = దేహైకదేశమగు చరణమువలన, ఉద్భూతాభిః = పుట్టిన, ఘృణిభిః = కాంతులచేతను, అణిమాద్యాభిః = అణిమాదిశక్తులచేతను, అభితః = అంతటను, (పరివృతాం = చుట్టుకోఁబడిన) త్వాం = నిన్ను, అహం = నేను, నిషేవే = సేవించెదను, ఇతి = ఇట్లు, యః = ఏయుపాసకుఁడు, సదా = ఎల్లపుడు, భావయతి = ధ్యానించునో, త్రిణయనసమృద్ధిం-త్రిణయన = సాంబమూర్తియొక్క, సమృద్ధి = సంపదను, తృణయతః = గడ్డిపోఁచఁగాఁ దలంచుచున్న, తస్య = వానికి, మహాసంవర్తాగ్నిః = ప్రళయాగ్ని, నీరాజనవిధిం = ఆరతెత్తుటను, విరచయతి = చేయుచున్నది, (అత్ర = ఇట్లనుటయందు,) కిమాశ్చర్యం = ఏమియబ్బురము?

తా. తల్లీ, నిత్యురాలగు నిన్ను వెలుఁగుచున్న నీచరణకాంతులతోడను అణిమాదిశక్తులతోడను గూడినదానినిగా నిరంతరధ్యానముచేయువానికి శివుని యైశ్వర్యమే తృణప్రాయముదోఁచఁగా నిఁక వానికి ప్రళయాగ్ని యారతివలె నగుచున్న దనుటలో నేమివింత గలదు? ఏమియు లేదనుట.

చతుష్షష్ట్యా తన్త్రై స్సకలమతిసన్ధాయ భువనం
స్థితస్తత్తత్సిద్ధిప్రసవపరతన్త్రైః పశుపతిః,
పున స్త్వన్నిర్బన్ధా దఖిలపురుషార్థైకఘటనా
స్వతన్త్రం తే తన్త్రం క్షితితలమవాతీతరదిదమ్. 31

టీ. హేభగవతి = ఓతల్లీ, పశుపతిః = శివుఁడు, సకలభువనం = ఎల్లలోకమును, తత్తత్సిద్ధిప్రసవపరతంత్రైః-తత్తత్సిద్ధి = ఆయాసిద్ధులయొక్క, ప్రసవ = ఉత్పత్తియందు, పరతన్త్రైః = పూనికగల, చతుష్షష్ట్యా = అఱువదినాలుగు, తన్త్రైః = మహామాయాశంబరాదిసిద్ధాంతములచేత, అతిసంధాయ = కప్పి (మోసపుచ్చి), స్థితః = ఊరకుండెను, పునః = మఱల, త్వన్నిర్బంధాత్-త్వత్ = నీయొక్క, నిర్బంధాత్ = బలాత్కారమువలన, అఖిలపురుషార్థైకఘటనాస్వతంత్రం-అఖిల = అన్నియు, పురుషార్థ = పురుషార్థములయొక్క, ఘటనా = కూర్చుట యందు, స్వతన్త్రం = శక్తమగు, తే = నీయొక్క, ఇదం = ఈ, తన్త్రం = సిద్ధాంతము, క్షితితలం = భూతలమునుగూర్చి, అవాతీతరత్ = దిగెను.

తా. తల్లీ, ఈశ్వరుఁడుఆయాసిద్ధుల కనుగుణములగు అఱువదినాలుగు మాయాశంబరాదితంత్రములచే లోకమును వంచించి వశపఱచికొని క్రీడించుచుండెను. అంత మఱల నీబలాత్కారమువలన చతుష్షష్టితంత్రములలోఁ జెప్పఁబడిన యెల్లసిద్ధాంతముల యాకారముగల సర్వపురుషార్థసాధనహేతువగు నీయీతంత్రము ఈశ్వరునిచేఁ జేయఁబడి నీచే నుపదేశమును బొంది భూతలమునకుఁ దేబడియెను.

అవ. ఆసకలపురుషార్థసాధక నూతనతంత్రమును వివరించుచున్నారు. -

శివశ్శక్తిః కామః క్షితిరథ రవిశ్శీతకిరణః
స్మరో హంసశ్శక్రః తదను చ పరామారహరయః,
అమీ హృల్లేఖాభిస్త్రిసృభిరవసానేషు ఘటితా
భజన్తే వర్ణాస్తే తవ జనని నామావయవతామ్. 32

టీ. హేజనని = ఓతల్లీ, శివః = కకారము, శక్తిః = ఏకారము, కామః = ఈకారము, క్షితిః = లకారము, అథ =తరువాత, రవిః = హకారము, శీతకిరణః = సకారము, స్మరః = కకారము, హంసః = హకారము, శక్రః = లకారము, తదనుచ = అటుపిమ్మట, పరామారహరయః-పరా = సకారము, మార = కకారము, హరయః = లకారము, అమీ = ఈ, వర్ణాః = వర్ణములు, త్రిసృభిః = మూఁడగు, హృల్లేఖాభిః = హ్రీంకారములచేత, అవసానేషు = మూఁడుచివరలయందు, ఘటితాః = కూర్చఁబడినవై, తవ = నీయొక్క, నామావయవతామ్-నామ = నామధేయమునకు, అవయవతాం = అంగములగుటను, భజన్తే = పొందుచున్నవి.

(క ఏ ఈ లహ్రీం, హసకహలహ్రీం, సకలహ్రీం, ఇదియె దేవీనామాత్మక నూతనతంత్రము.)

స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనో
ర్నిథాయైకే నిత్యే నిరవధిమహాభోగరసికాః,
భజన్తి త్వాం చిన్తామణిగుణనిబద్ధాక్షవలయాః
శివాగ్నౌ జుహ్వన్తః సురభిఘృతథారాహుతిశతైః 33

టీ. హేనిత్యే = మొదలుతుదలులేని యోతల్లీ, తవ = నీయొక్క, మనోః = మంత్రమునకు, ఆదౌ = మొదట, స్మరం = కామరాజబీజమును, యోనిమ్ = భువనేశ్వరీబీజమును, లక్ష్మీం = శ్రీబీజమును, నిధాయ = చేర్చి, నిరవధిమహాభోగరసికాః-నిరవధి = ఎడలేని, మహాభోగ = నిత్యానుభవమునకు, రసికాః = రుచిదెలిసిన, ఏకే = కొందఱు సమయాచారపరులు, చింతామణీగుణనిబద్ధాక్షవలయాః- చింతామణి = చింతారత్నములయొక్క, గుణ = సరములచేత, నిబద్ధ = కట్టఁబడిన, అక్షవలయా = జపమాలికలు గలవారై, శివాగ్నౌ = త్రికోణనిలయమగు సంస్కృతాగ్నియందు (జాతకర్మాదిషోడశసంస్కారములు చేయఁబడినది శివాగ్ని యనఁబడును), త్వాం = నిన్ను, సురభిఘృతధారాహుతిశతైః-సురభి = కామధేనువుయొక్క, ఘృత = నేతియొక్క, ధారా = ధారలచేతనైన, ఆహుతి = ఆహుతులయొక్క, శతైః = అనేకములచేత, జుహ్వన్తః = వేల్చువారై, భజన్తి = సేవించెదరు.

తా. తల్లీ, అనుభజ్ఞులైన కొందఱు సమయాచారపరులు నీమంత్రమునకు ముందు విం హ్రీం శ్రీం బీజములకు జేర్చి చింతామణుల జపమాలికలఁ బూని కామధేనువుయొక్క ఆజ్యధారలచేత త్రికోణమగు బిందుస్థానమున నిన్నునిచి నీకు హోమముచేయుచు నిన్ను సేవింతురు.

అవ. 'తవాజ్ఞాచక్రం' అనునది మొదలాఱుశ్లోకములచే సమయాచారమతమును దెలుపఁదలఁచి, ముందు దానికిఁ గావలసినదగుటచే పూర్వమని ఉత్తరమని ద్వివిధమగు కౌల మతమును రెండుశ్లోకములచేఁ జెప్పుచున్నారు.-

శరీరం త్వం శమ్భోశ్శశిమిహిరవక్షోరుహయుగం
తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘమ్,

అతశ్శేషశ్శేషీత్యయముభయసాధారణతయా
స్థితస్సమ్బన్ధో వాం సమరసపరానన్దపరయోః. 34

టీ. హేభగవతి = ఓతల్లీ, (పుట్టుట, చచ్చుట, వచ్చుట, పోవుట, విద్య, అవిద్య వీని నెఱిఁగియుండుట భగము, ఇది గలదిగనుక భగవతి) శమ్భోః = (ఆనందభైరవుఁడగు) ఈశ్వరునకు, త్వం = నీవు (మహాభైరవి), శశిమిహిరవక్షోరుహయుగమ్ = సూర్యచంద్రులే స్తనములుగాఁగల, శరీరం = మేనుగా, (భవసి = అగుదువు,) తవ = నీయొక్క, ఆత్మానం = స్వరూపమును, అనఘం = పాపములేని, నవాత్మానం = నవవ్యూహాత్మకమైన యానందభైరవాకృతినిగా, మన్యే = తలఁచెదను, అతః = ఇందువలన, శేషః = అప్రధానము, శేషీ = ప్రధానము, ఇతి = ఇట్టి, అయమ్ = ఈ, సమ్బన్ధః = శేషశేషిభావరూప సంబంధము, సమరసపరానన్దపరయోః-సమరస = సామరస్యముతోఁగూడిన, పరానన్ద = ఆనందభైరవుఁడు (ఆనందభైరవి) యనుసమానాకారములు, పరయోః = ప్రధానములుగాఁగల, వాం = మీయిరువురకు, ఉభయసాధారణతయా = ఇద్దఱకుఁ జెల్లునదిగా, స్థితః = ఉన్నది.

తా. తల్లీ, సూర్యచంద్రులు స్తనములు గాఁగల నీవు (ఆనందభైరవీరూపచిచ్భక్తికళ) ఆనందభైరవునకు నొడలుగాఁ గనుపట్టుదువు, ఆయానందభైరవునిరూపము నీరూపముగాఁ దోఁచును, ఇందువలన విచారింపఁగా శేషశేషిభావరూపసంబంధము మీయిద్దఱకు సమానమని తోఁచెడివి.

మనస్త్వం వ్యోమ త్వం మరుదసి మరుత్సారథిరసి
త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం న హి పరం,
త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా
చిదానన్దాకారం శివయువతి భావేన బిభృషే. 35

టీ. హేభగవతి = దేవీ, త్వం = నీవు, మనః = ఆజ్ఞాచక్రమందలి మనస్తత్వము, అసి = అయితివి, వ్యోమ = విశుద్ధచక్రమందలియాకాశతత్వము, అసి = అయితివి, మరుత్ = అనాహతమందలి వాయుతత్వము, అసి = అయితివి, మరుత్సారథిః = స్వాధిష్ఠానమందలి యగ్నితత్వము, అసి = అయితివి, త్వం = నీవు, అపః = మణిపూరమందలి జలతత్వము, అసి = అయితివి, త్వం = నీవు, భూమిః = మూలాధారమందలి పృథివీతత్త్వము, అసి = అయితివి, త్వయి = నీవు, పరిణతాయాం = తాదాత్మ్యమును బొందినదానవగుచుండఁగా, పరం = ఇంతకన్న వేఱయినది, నహి = లేదు, త్వమేవ = నీవే, స్వాత్మానం = నీస్వరూపమును, విశ్వవపుషా = జగదాకారముతోడ, పరిణమయితుం = తాదాత్మ్యమును పొందించుటకు, హేశివయువతి = ఓయీశ్వరి, భావేన = చిత్తముతో, చిదానందాకారం = చిచ్ఛక్తియొక్కయు ఆనందభైరవునియొక్కయు రూపమును, బిభృషే = భరించెదవు.

తా. తల్లీ, షట్చక్రములయందున్న పృథివ్యాదితత్వములునీవే, నీవు ప్రపంచమున వ్యాపించియుండఁగా వేఱొకటిలేదు. నీవే నీరూపమును ప్రపంచముతోఁ జేర్చి యొక్కటిగాఁ జేయుటకొఱకు చిచ్ఛక్తియొక్కయు, ఆనందభైరవునియొక్కయు, రూపమును చిత్తమున ధ్యానించెదవు.

తవాజ్ఞాచక్రస్థం తపనశశికోటిద్యుతిధరం
పరం శమ్భుం వన్దే పరిమిళితపార్శ్వం పరచితా,
యమారాధ్యన్భక్త్యా రవిశశిశుచీనామవిషయే
నిరాలోకే౽లోకే నివసతి హి భాలోకభువనే. 36

టీ. హేభగవతి = ఓతల్లీ, తవ = నీయొక్క, (తవ యనుటచే సాధకుని భ్రూమధ్యగతమగు చక్రచతుష్టయము పేర్కొనఁబడును), ఆజ్ఞాచక్రస్థమ్ = ఆజ్ఞాచక్రమందున్న, తపనశశికోటిద్యుతిధరం-తపనశశి = సూర్యచంద్రులయొక్క, కోటి = అనేకకోటులయొక్క, ద్యుతి = కాంతివంటికాంతిని, ధరం = ధరించిన, పరచితా = పరాకారజ్ఞానముచేత, పరిమిళితపార్శ్వం-పరిమిళిత = ఆవరింపఁబడిన, పార్శ్వం = ఇరుప్రక్కలుగల, పరం = పరుఁడగు, శమ్భుం = శివునిగూర్చి, వన్దే = నమస్కరించెదను, యం = ఏదేవుని, భక్త్యా = పూజ్యానురాగముతోడ, ఆరాధ్యన్ = పూజించువాఁడు, రవిశశిశుచీనాం = సూర్యచంద్రాగ్నులకును, ఆవిషయే = గోచరముకానిది గనుకనే, నిరాలోకే = దృగ్గోచరముకాని, ఆలోకే = విజనమగు, భాలోకభువనే = వెన్నెలగల లోకమందు (సహస్రారమున), నిపసతిహి = ఉండునో.

తా. తల్లీ, సూర్యచంద్రులకోటుల గ్రేణిసేయఁజాలు పరాకారజ్ఞానసంపన్నుఁడైన నీకు నిలయమగు నాజ్ఞాచక్రమందున్న పరమశివునకు మ్రొక్కెదను. ఏదేవుని భక్తితోఁ బూజించువాఁడు, సూర్యచంద్రాగ్నులకు నగోచరమగు దృగ్గోచరముగాని యేకాంతమగు జ్యోత్స్నాప్రచురమగు లోకమందు వసించియుండునో.

విశుద్ధౌ తే శుద్ధస్ఫటికవిశదం వ్యోమజనకం
శివం సేవే దేవీమపి శివసమానవ్యవసితామ్,
యయోః కాన్త్యా యాన్త్యాశ్శశికిరణసారూప్యసరణే
ర్విధూతా న్తర్ధ్వాన్తా విలసతి చకోరీవ జగతీ. 37

టీ. హేభగవతి = ఓతల్లీ, తే = నీయొక్క, విశుద్ధౌ = విశుద్ధచక్రమందు, శుద్ధస్ఫటికవిశదం-శుద్ధ = మలినములేని, స్ఫటిక = స్ఫటికమణివలె, విశదం = శుభ్రమైన, వ్యోమజనకం-వ్యోమ = ఆకాశతత్వమునకు, జనకం = ఉత్పాదకమగు, (అనఁగా ఆజ్ఞాచక్రమందు ఆత్మతత్వమున్నట్లు చెప్పఁబడినది. దానివలన నాకాశతత్వ ముదయించుననుట.) శివం = శివతత్వమును, శివసమానవ్యవసితాం-శివ = శివునితో, సమాన = తుల్యమగు, వ్యవసితాం = ప్రయత్నముగల, దేవీమపి = దేవీతత్వమును, నీవే = పరిచరించెదను, యయోః = ఏశివాశివులయొక్క, యాన్త్యాః = వెలుఁగుచున్న, శశికిరణసారూప్యసరణేః-శశికిరణ = చంద్రకాంతులయొక్క, సారూప్య = పోలికయొక్క, సరణేః = సరిపాటిగల, కాన్త్యాః = కాంతివలన, జగతీ = లోకము, విధూతాన్తర్ధ్వాన్తా-విధూత = పోకార్చఁబడిన, అన్తర్ధ్వాన్తా = అజ్ఞానముగలదై, చకోరీవ = వెన్నెలపులుఁగువలె, విలసతి = ప్రకాశించుచున్నదో.

తా. తల్లీ, నీవిశుద్ధచక్రమందు స్ఫటికమణివలె నిర్మలమైన ఆకాశజనకమగు శివతత్వమును అట్టిదయగు దేవీతత్వమును సేవించెదను. వెలుఁగుచున్న యేశివాశివులయొక్క వెన్నెలనుబోలుకాంతిచేత లోకమునశించిన యజ్ఞానముగలదై చకోరపక్షివలె నానందించుచున్నదో.

సమున్మీలత్సంవిత్కమలమకరన్దైకరసికం
భజే హంసద్వన్ద్వం కిమపి మహతాం మానసచరమ్,
యదాలాపాదష్టాదశగుణితవిద్యాపరిణతి
ర్యదాదత్తే దోషాద్గుణమఖిలమద్భ్యః పయ ఇవ. 38

టీ. హేభగవతి = ఓతల్లీ, సమున్మీలత్సంవిత్కమలమకరన్దైకరసికం-సమున్మీలత్ = వికసించిన, సంవిత్ = (అనాహత) జ్ఞానమను, కమల = తామరపూవునందలి, మకరన్ద = పూఁదేనెయందు, ఏకరసికం = ఒక్కటియై తవిలియున్న, మహతాం = యోగీశ్వరులయొక్క, మానసచరం = మనస్సనే మానససరస్సుయందు మెలఁగెడు, కిమపి = ఇట్టిదని రూపింప నలవిగాని, హంసద్వన్ద్వం = హంసమిథునమును, (అనాహచక్రమందు అగ్నిజ్వాలారూపుఁడై శిఖినియనుతనశక్తితోఁగూడి దీపాంకురమువలె వెలుఁగువానిని), భజే = సేవింతును, యదాలాపాత్-యత్ = ఏ యంచకవయొక్క, ఆలాపాత్ = కూయివలన, అష్టాదశగుణితవిద్యాపరిణతిః-అష్టాదశగుణిత = పదునెనిమిదింట లెక్కగొనఁబడిన, విద్యా = చదువులయొక్క, పరిణతిః = పరిణామము (కలుగునో), యత్ = ఏయంచజోడు, దోషాత్ = దోషసమూహమువలన, అఖిలం = సమస్తమగు, గుణం = గుణమును, అద్భ్యః = నీళులనుండి, పయఇవ = పాలను వలెనే, ఆదత్తె = గ్రహించుచున్నదో.

తా. తల్లీ, ఏ మిథునము పలికిన పలుకులన్నియు నష్టాదశవిద్యలుగా మారుచున్నవో ఏజంటదోషములనుండి గుణమును నీటినుండి పాలనువలెగ్రహించునో వికసించినజ్ఞాన మనెడికమలమందలి మకరందములు గ్రోలి మైమఱచియున్న యోగులహృదయమను మానససరస్సున నున్న యనిర్వాచ్యమహిమగల శివశివాత్మకమనెడు హంసమిథునమును నే సేవింతును.

తవ స్వాధిష్ఠానే హుతవహమధిష్ఠాయ నిరతం
తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయామ్,
యదాలోకే లోకాన్ దహతి మహసి క్రోధకలితే
దయార్ద్రాయా దృష్టిశ్శిశిరముపచారం రచయతి. 39

టీ. హేభగవతి = ఓతల్లీ, తవ = నీయొక్క, స్వాధిష్ఠానే = స్వాధిష్ఠానచక్రమందు, తంసవర్తంహుతవహం = ఆప్రళయాగ్నిని, అధిష్ఠాయ = ఆశ్రయించి, నిరతం = ఎల్లవేళలను, ఈడే = స్తుతించెదను, మహతీం = మహతియనఁబడు, తాం = ఆసంవర్తాగ్నిరూపమైన, సమయాం = సమయయనుకళను, ఈడే = స్తుతించెదను, మహసి = తేజోరూపమగు, క్రోధకలితే = రోషరూషితమయిన, యదాలోకే-యత్ = ఏకళయొక్క, ఆలోకే = దృష్టి, లోకాన్ = జగములను, దహతిసతి = కాల్చుచుండఁగా, దయార్ద్రా = కృపచేఁ జెమ్మగిలిన, యా = ఏ, దృష్టిః = చూపు, శిశిరం = చల్లని, ఉపచారం = సేవను, రచయతి = కల్పించుచున్నదో.

తా. ఏశక్తియొక్క క్రోధయుతమగుచూపు లోకములను దహింపఁగా కరుణాకల్పితమైన యాచూపే మఱల చల్లఁబఱచుచుండునో అనాహతచక్రగతమైన యగ్ని నాశ్రయించిన ప్రళయానలజ్వాలారూపమైన యాశివశక్తిని సేవించెదను.

తటిత్వన్తం శక్త్యా తిమిరపరిపన్థిస్ఫురణయా
స్ఫురన్నానారత్నాభరణపరిణద్ధేన్ద్రధనుషం,
తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం
నిషేవేవర్షన్తం హరమిహిరతప్తం త్రిభువనమ్. 40

టీ. హేభగవతి = ఓతల్లీ, తవ = నీయొక్క, మణిపూరైకశరణం-మణిపూర = మణిపూరచక్రమై, ఏక = ముఖ్యమైన, శరణం = నెలవుగాఁగల, (మణి యనఁగా విల్లు దానిచేఁ బూరింపఁబడునదిమణిపూరము) తిమిరపరిపంథిస్ఫురణయా-తిమిర = మణిపూరమందలి చీఁకటికి, పరిపంథి = విరోధియగు, స్ఫురణ యా = విలసనముగల, శక్త్యా = తటిద్రూపశక్తిచేత, తటిత్వన్తం = మెఱపులుగల, స్ఫురన్నానారత్నాభరణపరిణద్ధేన్ద్రధనుషమ్-స్ఫురత్ = మెఱయుచున్న, నానారత్న = పలురత్నములచే నిర్మించఁబడిన, ఆభరణ = సొమ్ములచేత, పరిణద్ధ = కూర్చఁబడిన, ఇన్ద్రధనుషమ్ = ఇంద్రచాపముగల, శ్యామం = నల్లనిమేఘమువలెనున్న, హరమిహిరతప్తమ్-హర = ఈశ్వరుఁడనే, మిహిర = సూర్యుని (ప్రళయానలము)చేత, తప్తమ్ = క్రాంచఁబడిన, త్రిభువనమ్ = ముల్లోకములను, వర్షన్తమ్ = తడుపుచున్న, కమని = ఇట్టిదట్టిదనరాని, మేఘమ్ = మొయిలును, నిషేవే = సేవించెదను.

తా. తల్లీ, నీమణిపూరచక్రముననుండి యందలిచీఁకటిని బాపఁగల విద్యుద్రూపశక్తితోఁ గూడి, పలుచెఱఁగుల రత్నపుసొమ్ములచేఁ గల్పింపఁబడిన యింద్రదనుస్సు గలిగియున్న శివుఁడనేప్రళయానలముచేఁ గాల్చఁబడినజగత్తును తడిపి చల్లఁబఱచుచున్న యనిర్వాచ్యమహిమగలవార్షుకమేఘమును (సదాశివుని) సేవించెదను.

తవాథారే మూలే సహ సమయయా లాస్యపరయా
నవాత్మానం మన్యే నవరసమహాతాణ్డవనటమ్,
ఉభాభ్యామేతాభ్యాముదయవిధిముద్దిశ్య దయయా
సనాథాభ్యాం జజ్ఞే జనకజననీనుజ్జగదిదమ్. 41

టీ. హేభగవతి = ఓదేవీ, తవ = నీయొక్క, మూలేఆధారే = మూలాధారచక్రమందు, లాస్యపరయా = ఆడఁగోరికగల (స్త్రీనృత్యము లాస్యమునఁబడు), సమయయాసహ = సమయయనుకళతోఁ గూడ, నవరసమహాతాణ్డవనటమ్-నవ = తొమ్మిదగు, రస = శృంగారాదిరసములచేతనైన, తాణ్డవ = ఆట యందు, (పురుషనృత్తము తాండవమనఁబడు.) నటమ్ = ఆటకాఁడగువానిని, నవాత్మానమ్ = ఆనందభైరవునిఁగా, మన్యే = తలఁచెదను, ఉదయవిధిమ్ = అభ్యుదయవ్యాపారమును, ఉద్దిశ్య = నిశ్చయించి, దయయా = కాలినలోకము నుజ్జీవింపఁజేయుకరుణచేత, సనాధాభ్యాం = ఒకటిగాఁగలసిన, ఏతాభ్యామ్ = ఈయానందభైరవి భైరవులచేత, ఇదమ్ = ఈ, జగత్ = లోకము, జనకజననీమత్ = తల్లిదండ్రులుగలదిగా, జిజ్ఞే = అయ్యెను. తా. తల్లీ, నీమూలాధారచక్రమందు నృత్యవశగురాలగు సమయకళతోఁగూడి నవరసనృత్యమందు దవిలియున్నవానిని యానందభైరవునిగాఁ దలంచెదను. దయచేత కాలినలోకమును ప్రోదిసేయ నొకటిగాఁ గలసిన యీయానందభైరవీభైరవులచేత నీయెల్లలోకములు తల్లియుఁ దండ్రియుఁ గలవిగా నైనవి.

గతైర్మాణిక్యత్వం గగనమణిభిస్సాన్ద్రఘటితం
కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః,
స నీడేయచ్ఛాయాచ్ఛురణశబలం చన్ద్రశకలం
ధనుశ్శౌనాసీరం కిమితి ననిబధ్నాతి ధిషణామ్. 42

టీ. హేహిమగిరిసుతే = ఓపార్వతీ, మాణిక్యత్వం = తొమ్మిది మానికములగుటను, గతైః = పొందిన, గగనమణిభిః = సూర్యులచేత, సాన్ద్రఘటితం = చిక్కనగాగూర్చఁబడిన, హైమం = బంగారపుదైన, తే = నీయొక్క, కిరీటం = మకుటమును, యః = ఎవఁడు, కీర్తయతి = వర్ణించునో, సః = ఆకవిపుంగవుఁడు, నీడేయచ్ఛాయాచ్ఛురణశబలం-నీడేయ = కుదుళ్లయందు బిగింపఁబడిన నానారత్నములయొక్క, ఛాయా = కాంతులయొక్క, ఛురణ = ప్రసారముచేత, శబలమ్ = చిత్రవర్ణముగల, చన్ద్రశకలం = చంద్రఖండమును, శౌనాసీరం = ఇంద్రునిదగు, ధనురితి = విల్లుని, ధిషణాం = ఊహను, కింననిబధ్నాతి = ఎందుకు చేయఁడు? చేయుననుట.

తా. తల్లీ, ద్వాదశాదిత్యుల లనెడుమణులచేత చిక్కనగాఁ జెక్కఁబడిన నీబంగారపుఁగిరీటము నెవఁడు భావనచేసి వర్ణింపఁజూచునో వాఁడు గాఁడులు దీసికట్టఁబడిన రత్నకాంతులచే పలువన్నెలుగల నీయౌదలనున్న చంద్రశకలమును జూచి యింద్రధనస్సని భ్రమజెందఁడా? చెందుననుట.

ధునోతు ధ్వాన్తం నస్తులితదళితేన్దీవరవనం
ఘనస్నిగ్ధశ్లక్ష్ణం చికురనికురుంబం తవ శివే,
యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో
వసన్త్యస్మిన్మన్యే వలమథనవాటీవిటపినామ్. 43

టీ. హేశివే = ఓపార్వతీ, తులితదళితేన్దీవరవనమ్-తులిత = పోల్చఁబడిన, దళిత = వికసించిన, ఇందీవరవనమ్ = నల్లకలువలతోఁటగల, ఘనస్నిగ్ధశ్లక్ష్ణమ్-ఘన = చిక్కనైన, స్నిగ్ధ = మెఱుఁగైన, శ్లక్ష్ణమ్ = మృదుల (సుకుమార) మైన, తవ = నీయొక్క, చికురనికురుమ్బమ్ = కేశకలాపము, నః = మాయొక్క, ధ్వాన్తమ్ = మూలాజ్ఞానమును, ధునోతు = పోఁగొట్టుఁగాక, యదీయమ్ = ఏకురులదగు, సహజమ్ = స్వాభావికమగు, సౌరభ్యమ్ = సువాసనను, ఉపలబ్ధుమ్ = పొందుటకొఱకు, ఆస్మిన్ = ఈకేశకలాపమందు, వలమథనవాటీవిటపినామ్-వలమథన = ఇంద్రునియొక్క, వాటీ = నందనోద్యానమందలి, విటపినామ్ = కల్పవృక్షములయొక్క, సుమనసః = పూవులు, వసన్తి = ఉన్నవో, ఇతి = ఈలాగున, మన్యే = తలంచెదను. ఉత్ప్రేక్ష.

తా. తల్లీ, నల్లకలువలఁబోలి చిక్కవై మెఱుఁగై నునుపుగల నీకురుల కొప్పు మాయజ్ఞానమును బోఁగొట్టుఁగాక. నందనవనమందలి కల్పవృక్షకుసుమములు నైజమైన నీకురుల పరిమళమునుబొందుటకై యెల్లపుడును ఏనీకేశముల నాశ్రయించుచున్నవో (కల్పవృక్షపుష్పములచే నలంకరింపఁబడినవనుట).

తనోతు క్షేమం నస్తవ వదనసౌన్దర్యలహరీ
పరీవాహ స్రోతస్సరణిరివ సీమన్తసరణిః,
వహన్తీ సిన్దూరం ప్రబలకబరీభారతిమిర
ద్విషాం బృన్దైర్బన్దీకృతమివ నవీనార్కకిరణమ్. 44

టీ. హేభగవతి = ఓయమ్మా, తవ = నీయొక్క, వదనసౌన్దర్యలహరీపరీవాహస్రోతస్సరణిరివ-వదన = ముఖముయొక్క, సౌన్దర్య = అందముయొక్క, లహరీ = ప్రవాహముయొక్క, పరీవాహ = కలుఁజుయొక్క, స్రోతః = జాలుయొక్క, సరణిరివ = త్రోవవలెనున్న, సీమన్తసరణిః = పాపటత్రోవ, ప్రబలకబరీభారతిమిరద్విషామ్-ప్రబల = బలవంతులైన, కబరీభార = కేశపాశము (పాయలు) ల సమూహములనే, తిమిర = చీఁకటులనే, ద్విషామ్ = వైరులయొక్క, బృన్దైః = పదువులచేత, బన్దీకృతమ్ = చెఱఁబెట్టఁబడిన, నవీనార్కకిరణమివ-నవీన = లేఁతవాఁడగు, అర్క = సూర్యునియొక్క, కిరణమివ = అంశువువలెనున్న, సిన్దూరమ్ = చెందిరపుఁజుక్కను, వహన్తీ = ధరించుచున్నదై, నః = మాకు, క్షేమమ్ = శుభమును, తనోతు = ప్రబలఁజేయుఁగాత.

తా. తల్లీ, కేశపాశములనే చీఁకటులచేఁ జెఱఁఁబెట్టఁబడిన బాలసూర్యకిరణమోయన కుంకుమబొట్టుఁదాల్చిన మొగమందలి యందముయొక్క జాలువలెనున్న నీ పాపట మాకెల్ల శుభముల నొసఁగుగాక.

అరాళైస్స్వాభావ్యాదళికలభసశ్రీభిరలకైః
పరీతం తే వక్త్రం పరిహసతి పఙ్కేరుహరుచిమ్,
దరస్మేరే యస్మిన్ దశనరుచికిఞ్జల్కరుచిరే
సుగన్ధౌ మాద్యన్తి స్మరమథనచక్షుర్మధులిహః. 45

టీ. హేభగవతి = ఓతల్లీ, స్వాభావ్యాత్ = నైజమువలననే, అరాళైః = వంకరలైన, అళికలభసశ్రీభిః-అళకలభ = తేఁటికొదమలకు, సశ్రీభిః = సమానకాంతులుగల, అలకైః = ముంగురులచేత, పరీతమ్ = కమ్మఁబడిన, తే = నీయొక్క, వక్త్రమ్ = మొగము, పఙ్కేరుహరుచిమ్ = కమలపుసొబగును, పరిహసతి = గేలిసేయుచున్నది, దరస్మేరే = చిఱునగవుగల, దశనరుచికిఞ్జల్కరుచిరే-దశనరుచి = పంటితుళుకులనే, కిఞ్జల్క = అకరువులచేత, రుచిరే = అందమైన, సుగన్దౌ = కమ్మనివాసనగల, యస్మిన్ = ఏ మొగమందు, స్మరమథనచక్షుర్మధులిహః-స్మరమథన = మన్మథునిజయించిన శివునియొక్క, చక్షుః = చూడ్కులనే, మధులిహః = తుమ్మెదలు, మాద్యన్తి = మోహపడుచున్నవో.

తా. తల్లీ, చిఱునగవుఁదొలఁకుచున్న దంతపుతళుకులనే కేసరములు గలపరిమళముగల దేనియందు మన్మథునిజయించినవాఁడైనను యీశ్వరుని చూడ్కులనుతుమ్మెదలు దవులుచున్నవో నైజముననే వంకరలైన కొదమ తుమ్మెదలఁబోలుముంగురులచే నావరింపఁబడిన నీమొగము కమలముయొక్క యందమును పరిహసించెడిది. ఇది వింతగాదు.

లలాటం లావణ్యద్యుతివిమలమాభాతి తవ య
ద్ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చన్ద్రశకలమ్,

విపర్యాసన్యాసాదుభయమపి సమ్భూయ చ మిథ
స్సుధాలేపస్యూతిః పరిణమతి రాకాహిమకరః. 46

టీ. హేభగవతి = ఓతల్లీ, తవ = నీయొక్క, లావణ్యద్యుతివిమలం-లావణ్య = నిగనిగలాడుకాంతియనే, ద్యుతి = వెన్నెలచేత, విమలమ్ = నిర్మలమైన, యత్ లలాటమ్ = ఏనొసలుగలదో, తత్ = దానిని, మకుటఘటితమ్ = ఔదలఁదాల్పఁబడిన, ద్వితీయమ్ = రెండవదగు, చన్ద్రశకలమ్ = జాబిల్లితునుకఁగా, మన్యే = ఊహించెదను, యత్ = ఏకారణమువలన, ఉభయమసి = రెండును, విపర్యాసన్యాసాత్ = తలక్రిందులుగా (నాలుగుకొమ్ములు గలియునట్లు) నుంచుటవలన, మిథః = ఒకటినొకటి, సమ్భూయచ = కలసికొని, సుధాలేపస్యూతిః = అమృతపుఁబూతఁగలిగిన, రాకాహిమకరః = పూర్ణిమాచంద్రుఁడుగా, పరిణమతి = మాఱుచున్నదో.

తా. తల్లీ, నిగారపుఁదళుకులచే నందమైననొసలు తలయందుఁ దాల్చఁబడినదానికంటె వేఱైనచంద్రుని రెండవతునకయనియే నానమ్మకము. కాదేని యీరెంటిని నాలుగుమూలలు కలియునట్లు సరిగా నదికినయెడల పండువెన్నెలతోనిండిన నిండుజాబిల్లికానేల? నొసలర్ధచంద్రునివంటిదనిభావము.

భ్రువౌ భుగ్నే కించిద్భువనభయభఙ్గవ్యసనిని
త్వదీయే నేత్రాభ్యాం మధుకరరుచిభ్యాం ధృతగుణమ్,
ధనుర్మన్యే సవ్యేతరకరగృహీతం రతిపతేః
ప్రకోష్టే ముష్టౌ చ స్థగయతి నిగూఢాన్తరముమే. 47

టీ. హేభువనభయభఙ్గవ్యసనిని = లోకముల కీడుబాప నాసగొనిన యోతల్లీ, త్వదీయే = నీవగు, కించిద్భుగ్నే = కొంచెముగావంగిన, భ్రువౌ = కనుబొమలను, మధుకరరుచిభ్యామ్ = తుమ్మెదలవంటి కాంతిగల, నేత్రాభ్యామ్ = కనులచేత, ధృతగుణమ్-ధృత = కట్టఁబడిన, గుణమ్ = అల్లెత్రాడుగల, రతిపతేః = మన్మథునియొక్క, సవ్యేతరకరగృహీతమ్ = కుడిచేతఁ బట్టుకోఁబడిన (కుడిచేయి యనుటచే నెప్పుడు నొకచేతనే పూనఁబడినది యిది బాణప్ర యోగముకొఱకు గాదని సూచన), ప్రకోష్ఠే = ముంజేయియు, ముష్టౌచ = పిడికిలియు, స్థగయతిసతి = కప్పుచుండఁగా, నిగూఢాన్తరమ్-నిగూఢ = కప్పఁబడిన, అన్తరమ్ = నడుముగల, ధనుః = వింటినిగా, మన్యే = తలఁచెదను.

తా. జగములకీడు బాపఁజూచునోయమ్మా, కొంచెముగావంగిన నీకనుబొమలను, తుమ్మెదలబారులై చూడనొప్పు నీకనులే యల్లెత్రాడుగాఁగలదియు కుడిచేతఁ బట్టుకోఁబడినదియు పిడికిటను ముంజేతిచాటునను మాటువడిన మధ్యదేశముగల మన్మథుని దాఁపుడుధనుస్సుగా నెన్నెదను. (నాసికయు నొసలును ముంజేతితోను పిడికిలితోను బోల్పబడెను. బొమలు వింటితోఁ బోల్పఁబడియెను.)

అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా
త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయా,
తృతీయా తే దృష్టిర్దరదళితహేమామ్బుజరుచి
స్సమాధత్తే సన్ధ్యాం దివసనిశయోరన్తరచరీమ్ 48

టీ. హేభగవతి = ఓపార్వతీ, తే = నీయొక్క, సవ్యం = ఎడమదగు, నయనం = కన్ను, అర్కాత్మకతయా = సూర్యరూపమగుటచేత, అహః = పగటిని, సూతే = కలిగించుచున్నది, వామం = ఎడమదగు, నయనం = కన్ను, రజనీనాయకతయా = చంద్రుఁడగుటచేత, త్రియామాం = రాత్రిని, సృజతి = కలిగించుచున్నది, దరదళితహేమామ్బుజరుచిః = కొంచెముగాఁ బూచినబంగారుకమలమువంటిదగు, తే = నీయొక్క, తృతీయా = మూఁడవదగు, దృష్టిః = కన్ను, దివసనిశయోః = దివారాత్రులమొక్క, అన్తరచరీం = నడిమిదగు; సంధ్యాం = ప్రాతస్సాయంరూపమగు సంధ్యను, సమాధత్తే = చక్కఁగాఁ జేయుచున్నది.

తా. తల్లీ, నీకుడికన్ను సూర్యుఁడుగనుక పగ లొనర్చుచున్నది నీయెడమకన్ను చంద్రుఁ డగుటచేత రాత్రిని జేయుచున్నది. అరవీడిన బంగారు తామరవలె నుండు నీఫాలముననుండు మూఁడవకన్ను (అగ్ని నేత్రము) ప్రాతస్సాయసంధ్యలను జేయుచున్నది. ఇచ్చట రాత్రి పవలు సంధ్య యనువాని చే పక్షమాసర్తుయుగకల్పాదిరూపకాలోత్పత్తిఁ జెప్పుటచే దేవినేత్రములచేత సర్వకాలోత్పత్తి యగుటవలన, శక్తికి కాలబాధ్యత్వము లేదనుట.

విశాలా కల్యాణీ స్ఫుటరుచిరయోధ్యా కువలయైః
కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా,
అవన్తీ దృష్టిస్తేబహునగరవిస్తారవిజయా
ధ్రువం తత్తన్నామవ్యవహరణయోగ్యా విజయతే. 49

టీ. హేభగవతి = ఓతల్లీ, తే = నీయొక్క, దృష్టిః = చూపు, విశాలా = విపులమై, కల్యాణీ = మంగళకరమై, స్ఫుటరుచిః = చక్కనికాంతిగలదై, అయోధ్యా = పోరనలవికానిదై, కువలయైః = కలువలచేత, కృపాధారాధారా = కరుణాప్రవాహనిలయమై, కిమపి మధురా = అవ్యక్త (చెప్పనలవికాని) మధురమై, భోగవతికా = లోపలవిశాలముగలదై, అవంతీ = కాపాడునదియై, బహునగరవిస్తారవిజయా-బహు = అనేకములైన, నగర = పట్టణములయొక్క, విస్తార = సమూహముయొక్క, విజయా = విజయముగలదై, ధ్రువం = నిజముగా, తత్తన్నామవ్యవహరణయోగ్యా-తత్తన్నామ = (విశాల, కల్యాణి, అయోధ్య, ధార, మధుర, భోగవతి, అవంతి, విజయ అను) నానగర నామములచే, వ్యవహరణ = వాడుటకు, యోగ్యా = తగినదై, విజయతే = వెలయుచున్నది. (విశాలమొదలు విజయవఱకు నెనిమిదినగరములు గలవు. అట్లే యెనిమిదివిధములదృష్టులుగలవు. వీనిలో విశాలాదృష్టి లోపల వికాసముగలది, కల్యాణీదృష్టి విస్మయముగలది, అయోధ్యాదృష్టి తెఱవఁబడిన నల్లగ్రుడ్లుగలది, ధారాదృష్టి అలసమైనది, మధురాదృష్టి చంచలమైనది, భోగవతీదృష్టి మసృణమైనది, అవంతీదృష్టి ముగ్ధమైనది, విజయాదృష్టి చెంతలఁ జేరిన నల్లగ్రుడ్లుగలది, ఆకేకరలను నివి యందఱు వనితలకుఁఁ దుల్యములే. దేవియం దివి క్రమముగా సంక్షోభ, ణాకర్షణ, దావ, ణోన్మాదన, వ, శ్యోచ్చాటన, విద్వేషణ, మారణక్రియలను జేయును. దేవి యెచ్చటనుండి విజయను నాకేకరదృష్టిచే శత్రువుల సమయించెనో యది విజయాపట్టము. ఎచ్చటనిలిచి యంతర్వికాసముగలవిశాలాదృష్టిచే జనసంక్షోభమును గావించెనో యది విశాలానగరి. ఇట్లే మిగిలినది యూహింపఁదగును.

తా. తల్లీ, నీచూపు విపులమై కల్యాణియై, దుర్జయమై, దయారసపూరితమై, అవ్యక్తమధురమై, లోపలవెడదయై, రక్షకమై, విజయకరమై వెలయుటచేత నాయాపుణ్యనగరములపేళ్లచేఁ బిలువఁదగినదియై యొప్పుచుండును.

కవీనాం సన్దర్భస్తబకమకరన్దైకరసికం
కటాక్షవ్యాక్షేపభ్రమరకలభౌ కర్ణయుగళమ్,
అముఞ్చన్తౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళా
వసూయాసంసర్గాదళికనయనం కిఞ్చిదరుణమ్. 50

టీ. హేభగవతి = ఓతల్లీ, కవీనామ్ = కవులయొక్క, సందర్భస్తబకమకరందైకరసికం-సందర్భ = కావ్యరచనలనే, స్తబక = పూగుత్తులయందలి, మకరంద = పూఁదేనెయందు, ఏకరసికమ్ = ఒకతీరుగాఁ దవిలియున్న కర్ణయుగళమ్ = శ్రోత్రద్వయమును, అముఞ్చన్తౌ = విడువకనంటియున్నవియు, నవరసాస్వాదతరళా-నవ = తొమ్మిదగు, రస = శృంగారాదిరసములయొక్క, ఆస్వాద = క్రోలుటయందు, తరళౌ = ఆసక్తములైన, కటాక్షవ్యాక్షేపభ్రమమరకలభౌ-కటాక్ష = క్రేగంటిచూపులనే, వ్యాక్షేప = వ్యాజముతోనున్న, భ్రమరకలభౌ = తుమ్మెదకొదమలను, దృష్ట్వా = చూచి, అసూయాసంసర్గాత్-అసూయా = ఈర్ష్యయొక్క, సంసర్గాత్ = సంబంధమువలన, అళికనయనమ్ = ఫాలనేత్రము, కించిత్ = కొంచెము, అరుణం = ఎఱ్ఱవారినది.

తా. తల్లీ, కవుల కావ్యరసములఁగ్రోలు కర్ణయుగళితోఁ జెలిమిచేసి వానియందలి నవరసములను గ్రోలుటయందు తనివిదీరకయున్న నీకటాక్షవ్యాజముతోనున్న తుమ్మెదజంటను జూచి నీఫాలనేత్రము అసూయచే కొంచె మెఱ్ఱబారియున్నది. కను లాకర్ణాంతము వ్యాపించి నల్లనై తుమ్మెదలవలె పొదలుచున్నవని తా.

శివే శృఙ్గా రార్ద్రా తదితరజనే కుత్సవపరా
సరోషా గఙ్గాయాం గిరిశనయనే విస్మయవతీ,

హరాహిభ్యో భీతా సరసిరుహసౌభాగ్యజయినీ
సఖీషు స్మేరా తే మయి జనని దృష్టిస్సకరుణా.    51

టీ. హేజనని = ఓతల్లీ, తే = నీయొక్క, దృష్టిః = చూపు, శివే = భర్తయగుసదాశివునియందు, శృఙ్గారార్ద్రా-శృఙ్గార = శృంగారరసముచేత, ఆర్ద్రా = తడిసినది, తదితరజనే = ఆశివునికంటె వేఱైన ప్రాకృతజనమందు, కుత్సనపరా = ఏవగింపుగలది, (సపత్న్యాం = సవతియగు,) గఙ్గాయాం = గంగయందు, సరోషా = కోపముతోఁగూడినది, గిరిశనయనే-గిరిశ = శివునియొక్క, నయనే = ఫాలనేత్రమందు, విస్మయవతీ = ఆశ్చర్యముగలది, హరాహిభ్యః-హర = శివునియొక్క, అహిభ్యః = సొమ్ములగు పాములవలన, భీతా = భయమొందినది, సరసిరుహసౌభాగ్యజయినీ-సరసిరుహ = కమలముయొక్క, సౌభాగ్య = సౌందర్యమును, జయినీ = జయించునది, సఖీషు = చెలులయందు, స్మేరా = వికాసముగలది, మయి = నాయందు, సకరుణా = దయతోఁగూడినది.

తా. తల్లీ, నీచూపు శివునియందు శృంగారముగలదై, ఇతరజనముయెడ బీభత్సముగలదై, గంగయందు కోపము (రౌద్రరసము) గలదై, శివునిఫాలనేత్రమందు అద్భుతరసముగలదై, శివుని యొడలి సర్పములయందు భయానకరసముగలదై, ఎఱ్ఱని కాంతిగలిగి కమలశోభను జయించునదియై (వీరరసముగలదై), చెలికత్తియలయందు హాస్యరసముగలదై, నాయందు కరుణారసముగలదై, యిట్లు సర్వరసాత్మకమై వెలయుచుండును.

గతే కర్ణాభ్యర్ణం గరుతి ఇవ పక్ష్మాణి దధతీ
పురాం భేత్తుశ్చిత్తప్రశమరసవిద్రావణఫలే,
ఇమే నేత్రే గోత్రాధరపతికులోత్తంసకలికే
తవాకర్ణాకృష్టస్మరశరవిలాసం కలయతః.      52

టీ. హేగోత్రాధరపతికులోత్తంసకలికే = కొండలకురాజగు హిమవంతునివంశమునకు శిరోభూషణమగు మొగ్గయగు నోదేవీ, తవ = నీయొక్క, ఇమే = ఈ నాహృదయమందుఁ బొడకట్టుచున్న, నేత్రే = కనులు, కర్ణాభ్యర్ణం = చెవులచెంతను, గతే = పొందినవై, గరుతఇవ = ఈఁకలవలె,పక్ష్మాణి = ఱెప్పవెండ్రుకలను, దథతీ = ధరించుచున్నవై, పురాంభేత్తుః = త్రిపురనాశకుఁడైన యీశ్వరునియొక్క, చిత్తప్రశమరసవిద్రావణఫలే-చిత్త = మనస్సునందలి, ప్రశమరస = శాంతరసముయొక్క, విద్రావణ = చీల్చి నాశమొందించుటయే, ఫలే = ప్రయోజనముగాఁగలవై, (ఇనుపములుకులుగలవనిధ్వని) ఆకర్ణాకృష్టస్మరశరవిలాసమ్-ఆకర్ణ = చెవికొనలవఱకు, ఆకృష్ట = లాగఁబడిన, స్మరశర = మదనబాణములయొక్క, విలాసమ్ = సొబగును, కలయతః = అనుకరించుచున్నవి.

తా. వలిమలకూఁతురగు నోదేవీ, నాహృదయమునఁదోఁచు నీయీకనులు చెవికొనలనుబొంది ఈకెలవలె ఱెప్పవెండ్రుకలనుదాల్చి, శివునిశాంతమును బాడొనర్చి శృంగారమును మొలిపించినవై చెవికొనలదనుక లాగఁబడిన బాణములసౌరు ననుకరించుచున్నవి.

విభక్తత్రైవర్ణ్యం వ్యతికలితలీలాఞ్జనతయా
విభాతి త్వన్నేత్రత్రితయమిదమీశానదయితే,
పునస్స్రష్టుం దేవాన్ ద్రుహిణహరిరుద్రానుపరతాన్
రజస్సత్వం బిభ్రత్తమ ఇతి గుణానాం త్రయమివ. 53

టీ. హే ఈశానదయితే = శివునిప్రియురాలగు ఓదేవీ, ఇదం = ఈ, త్వన్నేత్రత్రితయం- త్వత్ = నీయొక్క, నేత్ర = కనులయొక్క, త్రితయం = తీగ, వ్యతికలితలీలాఞ్జనతయా -వ్యతికలిత = పెట్టఁబడిన, లీలా = సొగసుకొఱకైన, అఞ్జనతయా = కాటుకగలదగుటచేత, విభక్తత్రైవర్ణ్యం-విభక్త = వేఱుచేయఁబడిన, త్రైవర్ణ్యం = (తెలుపు, నలుపు, ఎఱుపు) మూఁడురంగులుగలిగినదై, ఉపరతాన్ = ఆత్మయందు లీనులైన, దేవాన్ = క్రీడించు స్వభావముగల, ద్రుహిణహరిరుద్రాన్ = బ్రహ్మవిష్ణుమహేశ్వరులను, పునః = మఱల, స్రష్టుం = సృజించుటకొఱకు, రజఃసత్వంతమఇతి = రజస్సు, సత్వము, తమస్సు అనెడు, గుణానాం = గుణములయొక్క, త్రయం = మూఁటిని, బిభ్రదివ = భరించుచున్నదివలె, విభాతి = మెఱయుచున్నది. తా. శివుని పట్టపురాణివగునోతల్లీ, ఈనీమూఁడుకనులు కాటుకబెట్టఁబడినవి గనుక వేఱుగా నగపడు తెలుపు నలుపు ఎఱుపు రంగుగలిగి మహాప్రళయమందు పరమాత్మయందు లీనులైన బ్రహ్మవిష్ణురుద్రులను తిరిగి పుట్టించుటకొఱకు ధరింపఁబడిన సత్వరజస్తమోగుణములా యనునట్లు ప్రకాశించుచున్నవి.

అవ. దీనినే మఱల నుత్ప్రేక్షించుచున్నాఁడు -

పవిత్రీకర్తుం నః పశుపతిపరాధీనహృదయే
దయామిత్రైర్నేత్రైరరుణధవళశ్యామరుచిభిః,
నదశ్శోణో గఙ్గా తవనతనయేతి ధ్రువమయం
త్రయాణాం తీర్థానాముపనయసి సమ్భేదమనఘమ్ 54

టీ. హేపశుపతిపరాధీనహృదయే = సదాశివలగ్నహృదయముగల యోతల్లీ, దయామిత్రైః = దయతోఁగూడిన, అరుణధవళశ్యామరుచిభిః = ఎఱ్ఱని తెల్లని నల్లనికాంతులుగల, నేత్రైః = కనులచే, శోణఃనదః = ఎఱ్ఱనిశోణనదియు, గఙ్గా = తెల్లనిభాగీరథియు, తపనతనయా = నల్లనియమునయు, ఇతి = ఈలాగున, త్రయాణామ్ = మూఁడగు, తీర్థానామ్ = తీర్థములయొక్క, అనఘమ్ = పాపహరమైన, సమ్భేదమ్ = సంగమమును, నః = మమ్ము, పవిత్రీకర్తుమ్ = పునీతులఁజేయుటకొఱకు, ఉపనయసి = తెచ్చుచున్నావు, ధ్రువమ్ = నిజము.

తా. శివాసక్తచిత్తయగు నోతల్లీ, దయామయములై ఎఱుపు తెలుపు నలుపురంగులు గల కనులతో పాపాత్ములగు మమ్ము పావనముజేయుటకొఱకు శోణ గంగ యమున యను మూఁడునదులయొక్క పుణ్యమగు సంగమమును తెచ్చెదవు. ఇది నిజము.

నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతీ
తవేత్యాహుస్సన్తో ధరణిధర రాజన్యతనయే,
త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయతః
పరిత్రాతుం శఙ్కే పరిహృతినిమేషాస్తవ దృశః. 55

టీ. హేధరణిధరరాజన్యతనయే = ఓపార్వతీ, తవ = నీయొక్క, నిమేషోన్మేషాభ్యామ్ = కనులు మూయుటచేతను తెఱచుటచేతను, జగతీ = లోకము, ప్రళయమ్ = నాశమును, ఉదయమ్ = మఱల పుట్టుకను, యాతి = పొందుచున్నది. ఇతి = ఈలాగున, సంతః = యోగులు (దృష్టిసృష్టివాదులగు శ్రీశంకరులు), అహుః = చెప్పుదురు. త్వదున్మేషాత్ = నీకనులు తెఱచుటవలననే, జాతమ్ = పుట్టిన, ఇదమ్ = ఈ, అశేషమ్ = సర్వమగు, జగత్ = లోకమును, ప్రళయతః = ప్రళయమువలన, పరిత్రాతుమ్ = రక్షించుటకొఱకు, తవ = నీయొక్క, దృశః = చూపులు, పరిహృతనిమేషాః-పరిహృత = చాలింపఁబడిన, నిమేషాః = ఱెప్పవాల్పులుగలవి, ఇతి = అని, శఙ్కే = తలఁచెదను.

తా. గట్టుఱేనికూఁతురగు తల్లీ, నీవు కనులుమూయుట తెఱచుటవలన లోకములకు సంహారోత్పత్తులు గలుగునని పెద్ద లనియెదరు. నీవు కనులు తెఱచుటవలన పుట్టిన యీయెల్లప్రపంచమును ప్రళయమున నశింపకుండఁ గాపాడుటకై నీ వెప్పుడు కనులు తెఱచియుందువు. దేవతాసామాన్యమైన యనిమేషత ని ట్లుత్ప్రేక్షించిరి.

తవాపర్ణే కర్ణేజపనయనపైశున్యచకితా
నిలీయన్తే తోయే నియతమనిమేషాశ్శఫరికాః,
ఇయం చ శ్రీర్బద్ధచ్ఛదపుటకవాటం కువలయం
జహాతి ప్రత్యూషే నిశి చ విఘటయ్య ప్రవిశతి. 56

టీ. హేఅపర్ణే = ఓదేవీ (పర్ణభక్షణమునులేక తప మొనర్చినది), తవ = నీయొక్క, కర్ణేజపనయనపైశున్యచకితాః-కర్ణేజప = చెవులచెంతనున్న (కొండెమునుజెప్పు నైజముగల), నయన = కనులచేతనైన, పైశున్య = గుట్టుబయలు పఱచుటవలన, చకితాః = భయమొందినవై, అనిమేషాః = ఱెప్పపాటులులేని, శఫరికాః = చేఁపలు, తోయే = నీటియందు, నిలీయన్తే = దాఁగుచున్నవి, నియతమ్ = నిజము, కించ = మఱియు, ఇయంచశ్రీః = ఈయగపడు నీనేత్రలక్ష్మి, బద్ధచ్ఛదపుటకవాటమ్-బద్ధ = మూయఁబడిన, ఛద = దళములయొక్క, పుట = పొరటలనే, కవాటం = తలుపుగలిగిన, కువలయం = కలువను, ప్రత్యూషే = ప్రాతఃకాలమున, జహాతి = విడుచుచున్నది, నిశిచ = రాత్రియందు, విఘటయ్య = తెఱచి, ప్రవిశతి = లోపలఁజేరుచున్నది. (పగలు దేవికనులయందు రాత్రి కలువయందు లక్ష్మి వసించును, చేఁపలుమున్నగునవి లక్ష్మికి చదురులు గావుగనుక నేత్రసామ్యమునకుఁ దగవు.)

తా. తల్లీ, చెవులవఱకు నల్లుకొని యనిమేషతగల నీకనులు తనగుట్టు బయలుచేయునని జడిసి చేఁపలు నీళ్లలో దాఁగినవి (దేవీ నేత్రములయందలి యనిమేషత తమకడనుండుటచే దొంగతనముఁబెట్టునేమో యని భయము) నీనేత్రలక్ష్మి రాత్రియంతయు కలువయందుండి యుదయముననే దానిని దళములతో మూసివచ్చి పగలంతయు నీకన్నులలోనుండి మఱల రాత్రి దళముల తలుపుదెఱచికొని కలువలోఁ జేరుచున్నది. ఇఁక నీనేత్రములకీడగు వస్తువే లేదని తా.

దృశా ద్రాఘీయస్యా దరదళితనీలోత్పలరుచా
దవీయాసం దీనం స్నపయ కృపయా మామపి శివే,
అనేనాయం ధన్యో భవతి న చ తే హానిరియతా
వనేవా హర్మ్యేవా సమకరనిపాతో హిమకరః. 57

టీ. హేశివే = ఓతల్లీ, ద్రాఘీయస్యా = మిగులనిడుపగు, దరదళితనీలోత్పలరుచా-దర = కొంచెము, దళిత = పూఁచిన, నీలోత్పల = నల్లకలువయొక్క, రుచా = కాంతివంటికాంతిగల, దృశా = చూపుచేత, దవీయాసమ్ = దూరముననున్న, దీనమ్ = నిరుపేదయగు, మామపి = నన్నును, కృపయా = దయతోడ, స్నపయ = తడుపుము, అనేన = ఈమాత్రముచేత, అయమ్ = వీఁడు (నేను), ధన్యః = కృతార్థుఁడు, భవతి = అగును, ఇయతా = ఇంతమాత్రముచేతనే, తే = నీకు, హానిః = ముప్పు, నచ = లేదు, హిమకరః = చంద్రుఁడు, వనేవా =అడవియందైనను, హర్మ్యేవా =మేడయందైనను, సమకరనిపాతః-సమ = తుల్యమగు, కర = వెలుగులయొక్క, నిపాతః = ప్రసారముగలవాఁడుగదా.

తా. తల్లీ, దీర్ఘమయి అరవీడినకలువవలె నందమైన నీచల్లనిచూపుచే దూరమునఁబడియున్న నన్నొకసారి దయచేసిచూడుము. ఈమాత్రముకృపఁజూపిన నేధన్యుఁడనగుదును. ఇంతలో నీకేమియుబాధలేదు. చంద్రుఁ డడవి నైనను ఊరనైనను ఒక్కతీరుననే వెన్నెలలఁ గాయుచుండునుగదా. దీనివలన నాతనికేమైన ముప్పుగలదా లేదు.

అరాళం తే పాళీయుగళమగరాజన్యతనయే
న కేషామాధత్తే కుసుమశరకోదణ్డకుతుకమ్,
తిరశ్చీనో యత్ర శ్రవణపథముల్లఙ్ఘ్య విలస
న్నపాఙ్గవ్యాసఙ్గో దిశతి శరసన్ధానధిషణామ్. 58

టీ. హే అగరాజన్యతనయే = ఓపార్వతీ, అరాళమ్ = వంకరయైన, తే = నీయొక్క, పాళీయుగళమ్-పాళీ = చెవితమ్మెలయొక్క, యుగళమ్ = జంట, కుసుమశరకోదణ్డకుతుకం-కుసుమశర = మన్మథునియొక్క, కోదండ = ధనుస్సుయందలి, కుతుకం = సౌభాగ్యమును, కేషాం = ఎవరికి, నాధత్తే = తోఁపఁజేయదు, యత్ర = ఏపాళీయుగమందు, తిరశ్చీనః = అడ్డముగాఁదిరిగిన, తవ = నీయొక్క, అపాఙ్గవ్యాసఙ్గః-అపాఙ్గ = కనుగొనలయొక్క, వ్యాసఙ్గః = ప్రచారము, శ్రవణపథం = చెవిత్రోవను, ఉల్లఙ్ఘ్య = దాఁటి, విలసన్ = మెఱయుచున్నదై, శరసన్ధానధిషణాం-శర = బాణములయొక్క, సన్ధాన = బారుచేయుటయందలి, ధిషణాం = ఊహను, కరోతి = కలిగించుచున్నది.

తా. తల్లీ, వంకరలైన చెవితమ్మెలనుజూచి యందు నీనేత్రములు అడ్డమయి చెవులనుగూడ దాఁటిపోవుచుండుటచే వాని నందఱును బాణములని తలఁచి, నీచెవితమ్మెలను పూవిలుకానివిండ్లని బ్రమయుదురు.

స్ఫురద్గణ్డాభోగప్రతిఫలితతాటఙ్కయుగళం
చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథమ్,
యమారుహ్య ద్రుహ్యత్యవనిరథమర్కేన్దుచరణం
మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే. 59

టీ. హేభగవతి = ఓదేవీ, స్ఫురద్గణ్డాభోగప్రతిఫలితతాటఙ్కయుగళం-స్ఫురత్ = నిగనిగమెఱయుచున్న, గణ్డ = చెక్కిళ్లయొక్క, ఆభోగ = విశాలదేశములయందు, ప్రతిఫలిత = ప్రతిబింబించిన, తాటఙ్క = కర్ణపూరములయొక్క, యుగళం = జంటగల, ఇదం = ఈ, తవ = నీయొక్క, ముఖం = మొగమును, చతుశ్చక్రం = నాలుగుగాండ్లుగల, మన్మథరథం = మదమనితేరునుగా, మన్యే = తలచెదను. మారః = మన్మథుఁడు, యం = ఏరథమును, ఆరుహ్య = ఎక్కి, మహావీరస్సన్ = గొప్పవిలుకాఁడై, అర్కేన్దుచరణం-అర్కేన్దు = సూర్యచంద్రులే, చరణం = గాండ్లుగాఁగల, అవనిరథం = భూమియనురథమును, సజ్జతవతే = పూన్చికొనియున్న, ప్రమథపతయే = ప్రమథగణములకు ప్రభువగు (గొప్పసైన్యముగల) నీశ్వరునికొఱకు, ద్రుహ్యతి = చెట్టఁజేయుచున్నాఁడు.

తా. తల్లీ, నీమెఱుఁగు చెక్కిళులయందు ప్రతిఫలించి నాలుగుగాఁ దోఁచుచున్న రెండుకమ్మలుగల యీనీముఖమునుజూచి యిదినాలుగుగాండ్లు గల మన్మథునితేరుగాఁ దలంచెదను. దేని నెక్కి మన్మథుఁడు సూర్యచంద్రులుగాండ్లుగాఁగల భూమియను రథమునెక్కిగొప్పప్రమథసైన్యమును వెంటఁ దీసికొనివచ్చిన యీశ్వరునితో నళుకులేక ప్రతిఘటించుచున్నాఁడో.

సరస్వత్యాస్సూక్తీరమృతలహరీకౌశలహరీః
పిబన్త్యాశ్శర్వాణి శ్రవణచుళుకాభ్యామవిరళమ్,
చమత్కారశ్లాఘాచలితశిరసః కుణ్డలగణో
ఝణత్కారైస్తారైః ప్రతివచనమాచష్ట ఇవ తౌ. 60.

టీ. హేశర్వాణి = ఓదేవీ, అమృతలహరీకౌశలహరీః-అమృత = అమృతముయొక్క, లహరీ = ప్రవాహపుపొర్లికలయొక్క, కౌశల = సొంపును, హరీః = హరించుచున్న, తే = నీయొక్క, సూక్తీః = తేనెపలుకులను, శ్రవణచుళుకాభ్యాం-శ్రవణ = చెవులనే, చుళుకాభ్యాం = పుడిసిళ్ళచేత, ఆవిరళం = తెఱిపిలేకుండఁగా, పిబన్త్యాః = జుఱ్ఱుచున్న, చమత్కారశ్లాఘాచలితశిరసః-చమత్కార = పాటయందలి యందమును, శ్లాఘా = మెచ్చుకొనుటయందు, చలిత = ఊఁగించఁబడిన, శిరసః = తలగలిగిన, సరస్వత్యాః = సరస్వతీదేవియొక్క, కుణ్డలగణః-కుణ్డల = కర్ణపూరములయొక్క, గణః = సమూహము, తారైః = గొప్పవగు, ఝణత్కారైః = ఝణంఝణధ్వనులచేత, ప్రతివచనం = మాఱుమాటలను, ఆచష్టఇవ = చెప్పుచున్నట్టు లున్నది.

తా. తల్లీ, తేనెలొలుకు నీజిలిబిలిపాటలను వినుచున్న సరస్వతియొక్క తలయూఁపులయందలి కమ్మల ఝణంఝణ యనుమ్రోఁత ఆమె నీపలుకులను ప్రశంసించురీతిని దోఁపఁజేయుచున్నది.

అసౌ నాసావంశస్తుహినగిరివంశధ్వజపటే
త్వదీయో నేదీయః ఫలతు ఫలమస్మాకముచితమ్,
వహత్యన్తర్ముక్తాశ్శిశిరకరనిశ్వాసగళితా
స్సమృద్ధ్యా యస్తాసాం బహిరపి స ముక్తామణిధరః. 61

టీ. హేతుహినగిరివంశధ్వజపటే = హిమవంతునివంశమునకుఁ గీర్తిని దెచ్చు జండావలెనైనయోదేవీ, త్వదీయః = నీదగు, అసౌ = ఈ, నాసావంశః = నాసికయనువెదురు, అస్మాకం = మాకు, నేదీయః = సమీపించినదై, ఫలం = ఇష్టలాభమును, ఉచితం = తగినట్లుగా, ఫలతు = ఫలించుగాక, సః = ఆనాసా వేణువు, అంతః = లోపల, శిశిరకరనిశ్వాసగళితాః-శిశిరకరనిశ్వాస = ఎడమదగుచంద్రనాడియందలి యూర్పువలన, గళితాః = జాఱిన, ముక్తాః = ముత్తియములను, వహతి = భరించుచున్నది. యః = ఏనాసాదండము, తాసాం = ఆముత్యములయొక్క, సమృద్ధ్యా = పరిపూర్తిచే, బహిరపి = వెలుపలనుగూడ, ముక్తామణిధరః = ముత్యమునుదాల్చినదో.

తా. హిమవంతునికులమును బ్రకాశింపఁజేయనుదయించినయోయమ్మా, నీనాసావేణువు సన్నిహితమై మాకిష్టఫలమునిచ్చుగాక. అదిలోపలముత్తెములను దాల్చునుగదా. అట్లు లోపల ముత్యములనుదాల్చును గనుకనే వెలుపలను గూడ వామనాసాగ్రమందు చంద్రనాడీరూపమైన వామనాసికయందలి యూర్పుచే జాఱివచ్చిన ముత్యమును ధరించుచున్నది యని తా.

ప్రకృత్యారక్తాయా స్తవ సుదతి దన్తచ్ఛదరుచేః
ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా,

న బిమ్బం తద్బింబప్రతిఫలనరాగాదరుణితం
తులామధ్యారోఢుం కథమివ న లజ్జేత కలయా. 62

టీ. హేసుదతి = చక్కనిపలువరుసగలయోదేవీ, ప్రకృత్యారక్తాయాః-ప్రకృతి = స్వభావముచేతనే, ఆరక్తాయాః = అంతటఎఱ్ఱనైన, తవ = నీయొక్క, దన్తచ్ఛదరుచేః-దన్తచ్ఛద = పెదవులయొక్క, రుచేః = కాన్తికి, సాదృశ్యం = పోలికను, వక్ష్యే = చెప్పెదను, విద్రుమలతా = పవడపుఁదీఁగ, ఫలం = పండును, జనయతు = కాచుఁగాక, బిమ్బంపునః = దొండపండైతే, తద్బిమ్బప్రతిఫలనరాగాత్-తత్ = ఆ పెదవులయొక్క, బిమ్బ = ఆకారముయొక్క, ప్రతిఫలన = ప్రతిబింబించుటచేతనైన, రాగాత్ = ఎఱుపువలన, అరుణితం = ఎఱ్ఱగాఁ జేయఁబడినదై, కలయాపి = పదునాఱవపాలుచేనైనను, తులాం = సామ్యమును, అధ్యారోఢుం = పొందుటకొఱకు, కథం = ఎట్లు, నలజ్జేత = సిగ్గుపడకుండేని.

తా. తల్లీ, నీస్వభావరక్తమైన పెదవికి పోలికను జెప్పెదను. దానికి సామ్యముగావలెననినపవడపుఁదీఁగె పండుబండెనేని యదితగునుగాని మఱియేదియుఁజాలదు. వట్టిపగడముఁజాలదు. దానిపండుకావలె, అదియైనచో మిగుల యెఱ్ఱగానుండును. అంతయెఱ్ఱగానుండవుగాన నిఁకయేతీఁగల పండులును తగవు. ఇకఁ దొండపండన్ననో పెదవులరూపము ప్రతిఫలించినందున నెఱ్ఱగాఁ గానుపించును. కాదేని దానిని బింబ (ప్రతిఫలించినరూప) మన నేల అందువలన నది పదునాఱవపాలును బోలఁజాలదు.

స్మితజ్యోత్స్నాజాలం తవ వదనచన్ద్రస్య పిబతాం
చకోరాణామాసీదతిరసతయా చఞ్చుజడిమా,
అతస్తే శీతాంశోరమృతలహరీమామ్లరుచయః
పిబన్తి స్వచ్ఛన్దం నిశి నిశి భృశం కాఞ్జికధియా. 63

టీ. హేభగవతి = ఓ పార్వతీ, తవ = నీయొక్క, వదనచన్ద్రస్య = మోము జాబిల్లియొక్క, స్మితజ్యోత్స్నాజాలం-స్మిత = చిఱునగవనెడు, జ్యోత్స్నా = వెన్నెలలయొక్క, జాలం = బృందమును, పిబతాం = త్రాగుచున్న, చకోరాణాం = వెన్నెలపులుఁగులకు, అతిరసతయా = ఎక్కువ మధురమగుటచే, చఞ్చుజడిమా-చఞ్చు = ముక్కులయందు, జడిమా = అరుచి, ఆసీత్ = కలిగెను, అతః = ఇందువలన, తే = ఆపిట్టలు, ఆమ్లరుచయః = పుల్లనిరుచిగల, శీతాంశోః = చంద్రునియొక్క, అమృతలహరీం = అమృతప్రవాహమును, కాంజికథియా = పులికడుగనుతలంపుతో, స్వచ్ఛన్దం = ఇచ్చకొలఁది, నిశినిశి = ప్రతిరాత్రియందును, జ్యోత్స్నాసు = వెన్నెలలయందు, భృశం = తనివారఁగా, పిబన్తి = త్రాగుచున్నవి.

తా. తల్లీ, చకోరపక్షులు నీముఖచంద్రుని యందలి చిఱునగవులనెడి వెన్నెలలనుద్రావి యవి యతిమధురమగుటచే నోరు చవిచెడ నింతకంటె పుల్లనైన చంద్రునివెన్నెలను పుల్లని కడుగునీ ళ్లనుభ్రమచే ప్రతిరాత్రియందును కడుపారఁ ద్రావి వెగటును బాపుకొనుచున్నవి.

అవిశ్రాన్తం వత్యుర్గుణగణకథామ్రేడనజపా
జపాపుష్పచ్ఛాయా తవ జనని జిహ్వా జయతి సా,
యదగ్రాసీనాయాః స్ఫటికదృషదచ్ఛచ్ఛవిమయీ
సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా. 64

టీ. హేజనని = ఓయమ్మా, జపాపుష్పచ్ఛాయా-జపాపుష్ప = దాసనపూవుయొక్క, ఛాయా = రంగువంటి రంగుగల, తవ = నీయొక్క, సా = ఆ, జిహ్వా = నాలుక, అవిశ్రాన్తం = తెఱిపిలేనట్లు, పత్యుః = భర్తయగు నీశ్వరునియొక్క, గుణగణకథామ్రేడనజపా-గుణ = త్రిపురములఁ గాల్చుట మున్నగు గుణములయొక్క, గణ = సమూహములయొక్క, కథా = గాథలయొక్క, ఆమ్రేడన = పలుమాఱువర్ణించుటయే, జపా = జపముగాఁగలదై, జయతి = అన్నిటికి మిన్నయైయున్నది, యదగ్రాసీనాయాః = ఏ నాలుక యెదురఁగూర్చున్న, సరస్వత్యాః = పలుకుఁజెలియొక్క, స్ఫటికదృషదచ్ఛచ్ఛవిమయీ = స్ఫటికమువలె తెల్లనికాంతిగల, మూర్తిః = ఆకారము, మాణిక్యవపుషా-మాణిక్య = పద్మరాగముయొక్క, వపుషా = రూపముతో, పరిణమతి = మాఱుచున్నదో. తా. తల్లీ, నీ యానాలుక జపాపుష్పమువలె నెఱ్ఱనిదై యెల్లపుడు భర్తగుణములను బొగడుచు వెలయుచున్నది. ఏనాలుకముందరఁ గూర్చున్న సరస్వతి తెల్లనిమే నెఱ్ఱనై పోవుచున్నదో, తా నెఱ్ఱగానుండుటగాక దగ్గఱనున్నవానినిఁగూడ ఎఱ్ఱబఱచునంతటి యెఱుపుగలదని తా.

రణే జిత్వా దై త్యానపహృతశిరస్త్రైః కవచిభి
ర్నివృత్తైశ్చణ్డాంశత్రిపురహరనిర్మాల్యవిముఖైః,
విశాఖేన్ద్రోవేన్ద్రైశ్శశివిశదకర్పూరశకలా
విలీయన్తే మాతస్తవ వదనతామ్బూలకబళాః. 65

టీ. హేమాతః = ఓతల్లీ, రణే = యుద్ధమందు, దైత్యాన్ = రక్కసులను, జిత్వా = జయించి, అపహృతశిరస్త్రైః-అపహృత = మ్రొక్కుటకై తీయఁబడిన, శిరస్త్రైః = పాగాలుగలిగిన, కవచిభిః = జీరాలుగలిగిన, నివృత్తైః = యుద్ధమునుండిమరలిన, చండాంశత్రిపురహరనిర్మాల్యవిముఖైః-చండాంశ = చండేశ్వరునిభాగమగు, త్రిపురహర = శివునియొక్క, నిర్మాల్య = పూజించి పరిహరించిన వస్తువులయందు, విముఖైః = పరాఙ్ముఖులైన, విశాఖేన్ద్రోపేన్ద్రైః = కుమారస్వామి ఇంద్రుఁడు విష్ణువు వీరలచేత, శశివిశదకర్పూరశకలాః-శశి = చంద్రునివలె, విశద = తెల్లనైన, కర్పూర = కప్పురముయొక్క, శకలాః = ముక్కలుగలిగిన, తవ = నీయొక్క, వదనతాంబూలకబళాః-వదన = ముఖమందలి, తాంబూల = విడియముయొక్క, కబళాః = పిడచలు, విలీయన్తే = సమసిపోవుచున్నవి.

తా. తల్లీ, కలన నసురులఁ గెల్చివచ్చి పాగాలు వీడఁదీసి నీకుమ్రొక్కుచున్న కవచధరులైన చండేశ్వరునిచే ననుభవింపఁదగినశివనిర్మాల్యము నొల్లనికుమార విష్ణుదేవేంద్రులచేత, తెల్లనికర్పూరపు తునుకలచేఁ గూడిన నీ సగము నమిలిన విడియములు ఖర్చుచేయఁబడుచున్నవో, అనఁగా దేవియనుగ్రహముచే విజయమును గాంచి వచ్చినవీరల కవి తా నిచ్చునని తా.

విపఞ్చ్యా గాయన్తీ వివిధమపదానం పశుపతే
స్త్వయారబ్థే వక్తుం చలితశిరసా సాధువచనే,
త్వదీయైర్మాధుర్యైరపలపితతన్త్రీకలరవాం
నిజాం వీణాం వాణీ నిచుళయతి చోళేన నిభృతమ్. 66

టీ. హేభగవతి = ఓపార్వతీ, వాణీ = సరస్వతీదేవి, పశుపతేః = ఈశ్వరునియొక్క, వివిధం = పలువిధములుగల, అపదానం = త్రిపురవిజయము మొదలగు పూర్వచరితములను, విపఞ్చ్యా = వీణచేత, గాయన్తీ = పాడుచున్నదై, చలితశిరసా-చలిత = ఆనందముచే నూఁచఁబడిన, శిరసా = ఔదలగలది, త్వయా = నీచేత, సాధువచనే = ప్రశంసావాక్యము, వక్తుం = పలుకుటకొఱకు, అరబ్థేసతి = మొదలిడఁబడుచుండఁగా, త్వదీయైః = నీవాక్కులయందుగల, మాధుర్యైః = మధురగుణములచేత, అపలపితతన్త్రీకలరవా-అపలపిత = పరిహసింపఁబడిన, తన్త్రీ = వీణతీఁగెలయొక్క, కలరవా = అవ్యక్త మధురశబ్దములు గల, నిజాం = తనదగు, వీణాణ్ = వీణను, చోళేన = గవిసెనచేత, నిభృతం = గూఢముగా, నిచుళయతి = కప్పుచున్నది.

తా. తల్లీ, సరస్వతీదేవి వీణ శ్రుతి జేసి నీయెదుట యీశ్వరునిచరితములఁ బాడుచుండి నీవు వాని కలరి శిరఃకంపముఁజేయుచు ప్రశంసావచనముల ననఁబోవుచుండఁగానే నీవాఙ్మాధుర్యముచేఁ దిరస్కరింపఁబడిన వీణాధ్వని గలదై తనవీణెకు గవిసెనను దొడుగుచున్నది.

కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా
గిరీశేనోదస్తం ముహురధరపానాకులతయా,
కరగ్రాహ్యం శమ్భోర్ముఖముకురవృన్తం గిరిసుతే
కథంకారం బ్రూమస్తవ చుబుకమౌపమ్యరహితమ్. 67

టీ. హేగిరిసుతే = ఓపార్వతీ, వత్సలతయా = పుత్రీప్రేమగలవాఁడుగుటచేత, తుహినగిరిణా = మంచుకొండచేత, కరాగ్రేణ-కర = చేతియొక్క, అగ్రేణ = కొసచేత, స్పృష్టం = పుణుకఁబడినదియు, అధరపానాకులతయా - అధర పాన = అధరోష్ఠము నొక్కుటయందు, ఆకులతయా = తడఁబడినవాఁడగుటచే, గిరీశేన = శివునిచేత, ముహుః = మాటిమాటికి, ఉదస్తం = పైకెత్తఁబడినదియు, శమ్భోః = శివునకు, కరగ్రాహ్యం = చేతఁబట్టుకోఁదగిన, ముఖముకురవృన్తం-ముఖ = ముఖమను, ముకుర = అద్దముయొక్క, వృన్తం = పిడియగు, ఔపమ్యరహితం = తులలేని, తవ = నీయొక్క, చుబుకం = గడ్డమును, కథంకారం = ఎట్లు, బ్రూమః = వర్ణింపఁగలము.

తా. తల్లీ, వాత్సల్యముచే నీతండ్రిచేఁ బుణుకఁబడినదియు, నధరపానమునఁ దడబాటుగల నీప్రియునిచేత మాటికి నెత్తఁబడినదియు, నీముఖదర్పణమును చూచుకొనుటయం దీశ్వరునికి నద్దపుఁబిడిగానైన యీడులేని నీగడ్డమును దేనితోఁబోల్చి వర్ణింతుము. దానికీడైనవస్తువే లోకమున లేదు.

భుజాశ్లేషాన్నిత్యం పురదమయితుః కణ్టకవతీ
తవ గ్రీవా ధత్తే ముఖకమలనాళశ్రియమియమ్,
స్వతశ్శ్వేతా కాలాగరుబహుళజమ్బాలమలినా
మృణాళీలాలిత్యం వహతి యదధో హారలతికా. 68

టీ. హేభగవతి = ఓదేవీ, పురదమయితుః = ఈశ్వరునియొక్క, భుజాశ్లేషాత్-భుజ = బాహువులచేతనైన, అశ్లేషాత్ = కౌఁగిలింతవలన, నిత్యం = ఎల్లపుడును, కణ్టకవతీ = గగుర్పాటుగల, తవ = నీయొక్క, ఇయం = ఈ, గ్రీవా = మెడ, ముఖకమలనాళశ్రియమ్-ముఖ = ముఖమనెడు, కమల = కమలముయొక్క, నాళ = కాఁడయొక్క, శ్రియమ్ = సొబగును, ధత్తే = తాల్చుచున్నది, యత్ = ఏకారణమువలన, అధః = దానిక్రింద, స్వతః = స్వభావముననే, శ్వేతా = తెల్లనైనదియు, కాలాగరుబహుళజమ్బాలమలినా-కాలాగరు = కృష్ణాగరువనే, బహుళ = విస్తారమైన, జమ్బాల = బురదచేత, మలినా = మాసిన, హారలతికా = తీఁగవంటిహారము, మృణాళీలాలిత్యమ్-మృణాళీ = తామరతీఁగయొక్క, లాలిత్యమ్ = అందమును, వహతి = భరించుచున్నదో.

తా. తల్లీ! శివుని కౌఁగిలింతలచే గగుర్పాటునొందిన నీ మెడ ముఖమను తామరపూవుయొక్క కాఁడవలెనున్నది. యెందువలన దానిక్రింద తెల్లనై కృష్ణాగరువను బురదచే మాసినకంఠహారము తామరతూఁడుయొక్క సొంపును పొందియున్నదో.

గళే రేఖాస్తిస్రో గతిగమకగీతైకనిపుణే
వివాహవ్యానద్ధప్రగుణగుణసఙ్ఖ్యాప్రతిభువః,
విరాజన్తే నానావిధమధురరాగాకరభువాం
త్రయాణాం గ్రామాణాం స్థితినియమసీమాన ఇవ తే. 69

టీ. గతిగమకగీతైకనిపుణే-గతి = సంగీతగతియొక్క, గమక = మార్గదేశికగమకములయొక్క, గీత = పాడుటయందు, ఏకనిపుణే = ముఖ్యరసికురాలగునోతల్లీ, వివాహవ్యానద్ధప్రగుణగుణసఙ్ఖ్యాప్రతిభువః-వివాహ = పెండ్లియందు, వ్యానద్ధ = (మంగళసూత్రమునుగట్టినవెనుక దానివెంబడి) చక్కఁగాఁ గట్టఁబడిన, ప్రగుణ = చాలపేటలచేఁబేనఁబడిన, గుణ = మూఁడుదారములయొక్క, సఙ్ఖ్యా = లెక్కకు, ప్రతిభునః = జ్ఞాపకములైన, తే = నీయొక్క, గళే = మెడయందలి, రేఖాః = (మూఁడు) మడతలు, నానావిధమధురరాగాకరభువామ్-నానావిధ = పలుదెఱఁగులగు, మధుర = మనోహరములైన, రాగ = రాగములయొక్క, ఆకర = గనుల(మేళకర్తల)కు, భువామ్ = నిలయములగు, త్రయాణాం = మూఁడగు, గ్రామాణాం = షడ్జమధ్యమగాంధారగ్రామములయొక్క, స్థితినియమసీమానఇవ-స్థితి = ఉనికియొక్క, నియమ = కదలకుండుటకై చేయఁబడిన, సీమానఇవ = హద్దులవలె, విరాజన్తే = ప్రకాశించుచున్నవి.

తా. సంగీతరసజ్ఞురాలగు తల్లీ, పెండ్లిలో మంగళసూత్రమువెంబడి, కట్టఁబడిన మూఁడుదారములయొక్క గుఱుతులా యనునట్లున్ననీమెడయందలిమూఁడు మడతలు, నీమెడనుండివెడలుచున్న సర్వరాగములకు హేతువులైన షడ్జమధ్యమగాంధారగ్రామములు ఒకటితోనొకటి కలియకుండఁ జేయబఁడిన హద్దులా యనునట్లున్నవి. (వివాహ కాలమందు మంగళసూత్రముఁ గట్టినపిదప వధువుయొక్క యెడమచేతియం దొకపేటగలసూత్రమును, మెడయందు మూఁడుపేటలుగల సూత్రమునుగట్టుట గృహ్యకారసమ్మతమై కొన్నిదేశములయందు జరుగుచున్నది.)

మృణాళీమృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం
చతుర్భిస్సౌన్దర్యం సరసిజభవస్స్తౌతి వదనైః,
నఖేభ్యస్సన్త్రస్యన్ ప్రథమమథనాదంధకరిపో
శ్చతుర్ణాం శీర్షాణాం సమమభయహస్తార్పణధియా. 70

టీ. హేభగవతి = ఓదేవి, సరసిజభవః = బ్రహ్మ, ప్రథమమథనాత్ = పూర్వము తలనుగోయుటవలన, అంధకరిపోః = శివునియొక్క, నఖేభ్యః = గోళ్లవలన, సంత్రస్యన్ = భయమొందినవాఁడై, చతుర్ణాం = నాలుగగు, శీర్షాణాం = తలలకు, సమం = ఒక్కమాఱే, అభయహస్తార్పణధియా = అభయహస్తములనిచ్చునను తలఁపుచేత, చతుర్భిః = నాలుగు, వదనైః = నోరులచేత, మృణాళీమృద్వీనామ్-మృణాళీ = తామరకాఁడలవలె, మృద్వీనాం = సుకుమారములైన, చతసృణాం = నాలుగగు, తవ = నీయొక్క, భుజలతానాం = తీఁగెలవంటి బాహువులయొక్క, సౌన్దర్యం = సొబగును, స్తౌతి = పొగడుచున్నాఁడు.

తా. తల్లీ, బ్రహ్మదేవుఁడు పూర్వము తలద్రెంపిన శివునిగోళ్లకు భయపడి తననాలుగుతలలకు నొక్కమాఱే యభయమును గొనఁదలఁచి నాలుగు మోములచేతను, నీబాహువులయందమును వర్ణించుచున్నాఁడు.

నఖానాముద్యోతైర్నవనళినరాగం విహసతాం
కరాణాం తే కాన్తిం కథయ కథయామః కథముమే,
కయాచిద్వా సామ్యం భజతు కలయా హన్త కమలం
యది క్రీడల్లక్ష్మీచరణతలలాక్షారసచణమ్. 71

టీ. హేఉమే = ఓపార్వతీ, నఖానాం = గోళ్లయొక్క, ఉద్యోతైః = వెలుఁగులచేత, నవనళినరాగమ్-నవ = అప్పుడుపూఁచిన, నళిన = కమలములయొక్క, రాగం = రంగును, విహసతాం = గేలిసేయుచున్న, తే = నీయొక్క, కరాణాం = చేతులయొక్క, కాన్తిం = శోభను, కథం = ఎట్లు, కథయామః = వర్ణింతుము, కథయ = చెప్పుము. కమలం = తామరపూవు, కయాచిద్వాకలయా = ఏలే శముచేతనైనను, సామ్యం = పోలికను, భజతు = పొందునా, హన్త = అయ్యో, క్రీడల్లక్ష్మీచరణతలలాక్షారసచణమ్-క్రీడత్ = విహారించుచున్న, లక్ష్మీ = లక్ష్మీదేవియొక్క, చరణతల = పాదములయందలి, లాక్షారస = లత్తుకతోడ, చణం = కూడినదేని, సామ్యం = పోలికను, భజతి = పొందునేమోగదా.

తా. తల్లీ, గోళ్లరంగులచేత అప్పుడువిచ్చిన కమలమునుసైతము తిరస్కరించుచున్న నీ చేతులను అయ్యో! కమల మేపాలుచేతనైనఁ బోలునా, పోలదు. అక్కడమెలఁగెడులక్ష్మి యొక్క కాళ్ల యందలిలత్తుక కొంత దగిలెనేని యప్పుడు కొంతసాటియగునేమో చెప్పఁజాలము.

సమం దేవి స్కన్దద్విపవదనపీతం స్తనయుగం
తవేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుతముఖమ్,
యదాలోక్యా శఙ్కాకులితహృదయో హాసజనకః
స్వకుమ్భౌ హేరమ్బః పరిమృశతి హస్తేన ఝటితి 72

టీ. హేదేవి = ఆటలయందు ప్రీతిగల యోయమ్మా, సమం = ఒక్కమాఱుగా, స్కన్దద్విపవదనపీతం-స్కన్ద = కుమారస్వామిచేతను, ద్విపవదన = విఘ్నేశ్వరునిచేతను, పీతం = కుడువఁబడిన, తవ = నీయొక్క, ఇదం = ఈ, స్తనయుగం = కుచద్వందము, సతతం = ఎల్లప్పుడును, నః = మాయొక్క, ఖేదం = దుఃఖమును, హరతు = సమయించుఁగాక, ప్రస్నుతముఖం-ప్రస్నుత = పాలుకారుచున్న, ముఖం = ముక్కు(చూచుకము)లుగల, యత్ = ఏపాలిండ్లజతను, ఆలోక్య = చూచి, హేరమ్బః = విఘ్నేశ్వరుఁడు, ఆశఙ్కాకులితహృదయః-ఆశఙ్కా = (తమయమ్మ తనకుంభములను తీసికొన్నదేమోయను) బెదురుచేత, ఆకులిత = కలఁతవడిన, హృదయః = చిత్తముగలవాఁడై, హాసజనకః = నవ్వునుగలిగించువాఁడై, హస్తేన = చేతితో, ఝటితి = వేగముగా, స్వకుమ్భౌ = తనకుంభస్థలములను, పరిమృశతి = తడవుకొనుచున్నాఁడో.

తా. తల్లీ! కుమారస్వామిచేతను, విఘ్నేశ్వరునిచేతను ఒక్కమాఱే త్రాగఁబడుచున్న నీకుచద్వయము మాకష్టముల నణఁచి మేలునిచ్చుగాక, ముక్కుల పాలుగారుచున్న యేచంటిజంటనుజూచి విఘ్నేశ్వరుఁడు చిన్నతనమువలననైన యవివేకముచే నవి తనకుంభములనుకొని తమయమ్మ వాని నపహరించెనేమోయని తలంచి తనకుంభము లున్నవో లేవో యని చేతులచేఁ దడవికొని ముద్దుఁజూపుచుఁ దల్లిదండ్రులగు మిమ్ము నవ్వించునో.

అమూ తే వక్షో జావమృతరసమాణిక్యకుతుపౌ
న సన్దేహస్పన్దో నగపతిపతాకే మనసి నః,
పిబన్తౌ తౌ యస్మాదవిదితవధూసఙ్గరసికౌ
కుమారావద్యాపి ద్విరదవదనక్రౌఞ్చదళనౌ. 73

టీ. హేనగపతిపతాకే = హిమవంతునివిజయధ్వజమగు తల్లీ, అమూ = ఈయగపడుచున్న, తే = నీయొక్క, వక్షోజౌ = చనులు, అమృతరసమాణిక్యకుతుపౌ-అమృతరస = అమృతముచేనిండిన, మాణిక్యకుతుపౌ = కెంపులచేఁ జేయఁబడినసిద్దెలు, నః = మాయొక్క, మనసి = చిత్తమున, సన్దేహస్పన్దః = సంశయలేశమున్ను, న = లేదు, యస్మాత్ = ఏకారణమువలన, తౌ = ఆ స్తనములను, పిబన్తౌ = త్రాగిన, ద్విరదవదనక్రౌఞ్చదళనౌ = విఘ్నేశ్వరకుమారస్వాములు, అవిదితవధూసఙ్గరసికౌ-అవిదిత = తెలియని, వధూసఙ్గ = తరుణులకూటమి యందలి, రసికౌ = రుచిగలవారై, అద్యాపి = ఇప్పటికిని, కుమారౌ = బాలురుగా నుందురో.

తా. తల్లీ, నీయీస్తనములు కెంపులతోఁ జేయఁబడిన యమృతపు గుండిగలే, ఇందు మాకేసందియమునులేదు. కాకున్న వీనియందలి స్తన్యమును గ్రోలిన విఘ్నేశ్వరుఁడును కుమారస్వామియు ఇప్పటికిని బాలురై వధూసంగమును గోరకుందురా!

వహత్యమ్బ స్తమ్బేరమదనుజకుమ్భపకృతిభిః
సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికామ్,
కుచాభోగో బిమ్బాధరరుచిభిరన్తశ్శబలితాం
ప్రతాపవ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివ తే. 74

టీ. హేఅమ్బ = ఓయమ్మా, తే = నీయొక్క, కుచాభోగః-కుచ = స్తనములయొక్క, ఆభోగః = విస్తారము, స్తమ్బేరమదనుజకుమ్భప్రకృతిభిః-స్తమ్బేరమదనుజ = గజాసురునియొక్క, కుమ్భ = కుంభములే, ప్రకృతిభిః = పుట్టుకగాఁగల, ముక్తామణిభిః = ముత్యములచేత, సమారబ్ధాం = కూర్పఁబడినదియు, అమలాం = త్రాసాదిమణిదోషములు లేక విమలమైనదియు, బిమ్బాధరరుచిభిః-బిమ్బాధర = దొండపండువంటియధరముయొక్క, రుచిభిః = రంగులచేత, అన్తః = లోపల, శబలితాం = చిత్రవర్ణముగలదిగాఁజేయఁబడిన, హారలతికాం = తీఁగెవంటి హారమును, పురదమయితుః = ఈశ్వరునియొక్క, ప్రతాపవ్యామిశ్రాం = పరాక్రమముతోఁగూడిన, కీర్తిమివ = కీర్తినివలె, వహతి = తాల్చుచున్నది.

తా. అమ్మా, గజాసురుని కుమ్భములయందలి ముత్యములచేఁ గూర్చఁబడిన నీ మెడయందలి తెల్లనిహారము నీ యధరకాంతులచే లోపలనెఱ్ఱవాఱినదై ఎఱ్ఱని ప్రతాపముతోఁగలిసినయీశ్వరుని తెల్లనికీర్తివలె నున్నది.

తవ స్తన్యం మన్యే ధరణిధరకన్యే హృదయతః
పయఃపారావారం పరివహతి సారస్వతమివ,
దయావత్యా దత్తం ద్రవిడశిశురాస్వాద్య తవ య
త్కవీనాం ప్రౌఢానామజని కమనీయః కవయితా. 75

టీ. హేధరణిధరకన్యే = హిమవంతునిపట్టియగు నోదేవీ, అహం = నేను, తవ = నీయొక్క, స్తన్యమ్ = చనుఁబాలను, హృదయతః = హృదయమువలనఁబుట్టిన, పయఃపారావారమ్ = పాలకడలి, సారస్వతమివ = వాఙ్మయ విలాసమువలె, పరివహతి = మాఱిపారుచున్నది, ఇతి = అని, మన్యే = తలఁచెదను, యత్ = ఏకారణమువలన, దయావత్యా = ప్రేమగలనీచేత, దత్తం = ఈయఁబడిన, తవ = నీయొక్క, స్తన్యం = స్తన్యమును, అస్వాద్య = త్రావి, ద్రవిడశిశుః = అఱవకుఱ్ఱఁడు (శ్రీశంకరులు), ప్రౌఢానాం = గడుసరులగు, కవీనామ్ = కవులనడుమ, కమనీయిః = సర్వజగన్మోహకుఁడైన, కవయితా = కవిగా, అజని = ఆయెనో. తా. తల్లీ, నీచనుఁబాలను చూచి నేను నీహృదయమందలి పాలకడలిపైకి కావ్యనాటకాదిరూపమై ప్రవహించుచున్న వాఙ్మయమునుగా నెన్నెదను. కాదేని నీవిచ్చిన చనుఁబాలనుద్రావి యీయఱవబాలుఁడు గడుసుకవులందఱిలో నొకరంజకుఁడగు మహాకవి గానేల?

హరక్రోధజ్వాలావళిభిరవలీఢేన వపుషా
గభీరే తే నాభీసరసి కృతసఙ్గో మనసిజః,
సముత్తస్థౌ తస్మాదచలతనయే ధూమలతికా
జనస్తాం జానీతే జనని తవ రోమావళిరితి. 76

టీ. హేఅచలతనయే = ఓపార్వతీ, మనసిజః = మన్మథుఁడు, హరక్రోధజ్వాలావళిభిః-హర = రుద్రునియొక్క, క్రోధ = కోపాగ్నియొక్క, జ్వాలా = మంటలయొక్క, అవళిభిః = పంక్తులచేత, అవలీఢేన = చుట్టఁబడిన, వపుషా = మేనితోడ, గభీరే = లోఁతగు, తే = నీయొక్క, నాభీసరసి = బొడ్డు మడుపున, కృతసఙ్గః-కృత = చేయఁబడిన, సఙ్గః = వసతిగలవాఁడాయెను. తస్మాత్ = ఆకాలుచున్నమన్మథునిశరీరమునుండి, ధూమలతికా = పొగతీఁగె, సముత్తస్థౌ = లేచెను, హేజనని = ఓయమ్మా, జనః = లోకము, తాం = ఆపొగ జాలును, తవ = నీయొక్క, రోమావళిరితి = నూఁగారని, జానీతే = తెలియుచున్నది.

తా. తల్లీ, హరునికోపాగ్నిచే యొడలునుండి మదనుఁడు ప్రాణముల గాచుకోఁదలఁచి లోఁతైన నీబొడ్డుమడువులో దుమికి యొడలుదాఁచికొనెను. వానియొడలినుండి వెడలిన యీపొగనే పామరజనము నీనూఁగారని చెప్పుచున్నది.

యదేతత్కాళిన్దీతనుతరతరఙ్గాకృతి శివే
కృశే మధ్యే కిఞ్చిత్తవ జనని యద్భాతి సుధియాం,
విమర్దాదన్యోన్యం కుచకలశయో రన్తరగతం
తనూభూతం వ్యోమ ప్రవిశదివ నాభిం కుహరిణీమ్. 77

టీ. హేజననిశివే = ఓయమ్మపార్వతీ, తవ = నీయొక్క, కృశే = సన్నగిలిన, మధ్యే = నడుమునందు, యదేతత్ = ఏయీ, కాళిన్దీతనుతరతరఙ్గాకృతి-కాళిన్దీ = యమునానదియొక్క, తనుతర = మిగులచిన్నదగు, తరఙ్గ = అలయొక్క, ఆకృతి = రూపమువంటిరూపముగల, యత్ = ఏ, కించిత్ = రోమాళియనునొక చిన్నవస్తువు, సుధియాం = విమర్శించిచూచువారలకు, భాతి = కనుపట్టుచున్నదో, కుచకలశయోః = బిందెలవంటి స్తనములయొక్క, అన్తరగతం = మధ్యనున్న, వ్యోమ = ఆకాశము, అన్యోన్యం = ఒకటితోనొకటి, విమర్దాత్ = ఒఱియుటవలన, తనూభూతం = సన్ననైనదై, కుహరిణీం = గుహగల, నాభిం = బొడ్డును, ప్రవిశ దివ = దూరినదానివలె, ఆభాతి = తోఁచుచున్నది.

తా. అమ్మా, యమునాతరంగమువలె నల్లనై సన్ననైన నీనడుమునందగపడుఆరను నీసూక్ష్మవస్తు వెద్దియని యోజింపఁగా నీస్తనమధ్యనున్న యాకాశము (ఎడము) ఆరెండును కాలక్రమముచే నొకటినొకటియొఱయుచుండఁగాఁ దన కచటచోటుచాలక లక్కవలె క్రిందికిజాఱి గుహవలెనున్న బొడ్డులోదూరిన యాకసమా యనునట్లున్నది. ఆకసమునకు నొకరూపము గలిగి నల్లనై యుండుట లోకవిదితము.

స్థిరో గఙ్గావర్తస్స్తనముకుళరోమావళిలతా
కళావాలం కుణ్డం కుసుమశరతేజోహుతభుజః,
రతేర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే
బిలద్వారం సిద్ధేర్గిరిశనయనానాం విజయతే. 78

టీ. హేగిరిసుతే = ఓపార్వతీ, తవ = నీయొక్క, నాభిః = బొడ్డు, స్థిరః = చలనమునొందని, గఙ్గావర్తః-గఙ్గా = గంగానదియొక్క, ఆవర్తః = నీటి సుడి, స్తనముకుళరోమావళిలతాకళావాలం-స్తన = పాలిండ్లనే, ముకుళ = పూమొగ్గలకాధారమైన, రోమావళిలతా = రోమరాజియను తీఁగెయొక్క, కళా = రేఖకు, ఆవాలం = పాదు, కుసుమశరతేజోహుతభుకః-కుసుమశర = మన్మథునియొక్క, తేజః = ప్రకాశమనెడు, హుతభుజః =అగ్నికి, కుణ్డం = హోమగుండము, రతేః = రతీదేవికి, లీలాగారం = విహారగృహము, గిరిశనయనానాం-గిరీశ = ఈశ్వరునియొక్క, నయనానాం = కనులయొక్క, సిద్ధేః = సిద్ధికి, గుహాద్వారమ్ = గుహాముఖము, కిమపి = ఏమనివర్ణించుటకు వీలుగానిదై, విజయతే = దెన్నుమీఱుచున్నది,

తా. తల్లీ, నీబొడ్డు కదలనిగంగసుడి, స్తనములనే పూ మొగ్గలకునాధారమైన రోమరాజి యగుతీఁగెకుపాదు, మదనాగ్నికి గుండము, రతికి విలాస గృహము, ఈశ్వరునినేత్రములసిద్ధికి గుహ, ఏమనివర్ణించుటకు నలవిగాదు.

నిసర్గక్షీణస్య స్తనతటభరేణ క్లమజుషో
నమన్మూర్తేర్నారీతిలక శనకైస్తృట్యత ఇవ
చిరం తే మధ్యస్య తృటితతటినీతీరతరుణా
సమావస్థాన్థేమ్నో భవతు కుశలం శైలతనయే. 79

టీ. నారీతిలక = స్త్రీరత్నమ, హేశైలతనయే = ఓపార్వతీ, నిసర్గక్షీణస్య-నిసర్గ = స్వభావముచేతనే, క్షీణస్య = కృశించినదియు, స్తనతటభరేణ-స్తనతట = కుచదేశముయొక్క, భరేణ = వ్రేఁగుచేత, క్లమజుషః = బడలినదియు, నమన్మూర్తేః-నమత్ = వంగిన, మూర్తేః = ఆకారముగలదియు, శనకైః = మెల్లగా, తృట్యతఇవ = తెగుచున్నదో యనునట్లున్నదియు, తృటితతటినీతీరతరుణా-తృటిత = ఒడ్డువిఱిగిన, తటినీ = ఏఱుయొక్క, తీర = దరియందలి, తరుణా = చెట్టుతోడ, సమానస్థాన్థేమ్నః-సమా = తుల్యమైన, అవస్థా =ఉనికియందు, న్థేమ్నః = నిలకడగల, తే = నీయొక్క, మధ్యస్య = నడుమునకు, చిరమ్ = కలకాలము, కుశలమ్ = క్షేమము, భవతు = అగుగాక.

తా. తల్లీ, స్వభావముననేకృశించినదియు, స్తనభారముచేసడలినదియు వంగినదియు, మెల్లగాఁదెగిపోవుచున్నట్లున్నదియు, తెగినయేటిగట్టుననున్న చెట్టువలె నూఁగుచున్న నీనడుమునకు కలకాలము శుభమగుగాక.

కుచౌ సద్యస్స్విద్యత్తటఘటితకూర్పాసభిదురౌ
కషన్తౌ దోర్మూలే కనకకలశాభౌ కలయతః,

తవ త్రాతుం భఙ్గాదలమితి వలగ్నం తనుభువా
త్రిథా నద్ధం దేవి త్రివళి లవలీవల్లిభిరివ. 80

టీ. హేదేవి = ఓపార్వతీ, సద్యః = ఎప్పటికప్పుడే, స్విద్యత్తటఘటితకూర్పాసభిదురౌ-స్విద్యత్ = (అనుక్షణము ఈశ్వరునిధ్యానించుటచేతఁ) జెమర్చిన, తట = ప్రక్కలయందు, ఘటిత = తొడగఁబడిన, కూర్పాస = రవికెను, భిదురా = పిగుల్చుచున్నవియు, దోర్మూలే = చంకలను, కషన్తౌ = ఒఱియుచున్న, కనకకలశాభౌ = బంగారుకుండలవంటి, కుచౌ = స్తనములను, కలయతః = నిర్మించుచున్న, తనుభువా = మన్మథునిచేత, (ఇట్టి మనోహరస్తనములను సృజించుటలో ముసలివాఁడును అరసికుఁడునుగనుక బ్రహ్మకు శక్తిచాలదు) భఙ్గాత్ = అపాయమువలన, త్రాతుం = కాపాడుకొఱకు, అలమితి = చాలునని, తవ = నీయొక్క, వలగ్నం = నడుము, త్రివళిలవళీవల్లిభిః-త్రివళి = మూఁడు ముడుతలనే, లవలీవల్లిభిః = ఒకదినుసుతెల్లనితీఁగలచేత, త్రిథా = మూఁడు పేటలుగా, నద్ధమివ =కట్టఁబడినదో యనునట్లున్నది.

తా. తల్లీ, తేపకుఁ జెంతలయందుఁజెమర్చిరవికనుబిగుల్చుచున్నవియు బాహుమూలములనొఱయుచున్నవియునగు బంగారుకుండలవంటి నీస్తనములను నిర్మించుమన్మథునిచేత ఈస్తనములబరువునకునడుమపాయ మొందకుండుటకై, తెల్లనితీఁగలతో మూఁడుకట్లు గట్టెనోయని యూహ వొడముచున్నది.

గురుత్వం విస్తారం క్షితిధరపతిః పార్వతి నిజా
న్నితమ్బాదాచ్ఛిద్య త్వయి హరణరూపేణ నిదధే,
అతస్తే విస్తీర్ణో గురు రయ మశేషాం వసుమతీం
నితమ్బప్రాగ్భారః స్థగయతి లఘుత్వం నయతి చ. 81

టీ. హేపార్వతి = ఓహిమవంతునికూఁతురా, క్షితిధరపతిః = నీతండ్రియగుహిమవంతుఁడు, గురుత్వం = భారమును, విస్తారం = వైశాల్యమును, నిజాత్ = తనదగు, నితమ్బాత్ = చఱియనుండి, అచ్ఛిద్య = తీసి, త్వయి = నీయందు, హరణరూపేణ = అరణమను నాకృతిచే, నిచధే = ఉంచెను, అతః = ఇందు వలన, అయం = ఈ, గురుః = గొప్పదైన, విస్తీర్ణః = వెడఁదయైన, నితమ్బప్రాగ్భారః-నితమ్బ = మొలవెనుకపట్టుయొక్క (పిఱుఁదులు), ప్రాగ్భారః = అతిశయము, అశేషాం = సర్వమగు, వసుమతీం = భూమిని, స్థగయతి = కప్పుచున్న, లఘుత్వమ్ = చులకనను, నయతిచ = పొందించుచున్నది.

తా. పార్వతీ, నీతండ్రి హిమవంతుఁడు తనయందలిబరువును వెడఁదతనమును నీ కరణముగానిచ్చెను. కనుకనే బరువై గొప్పతగు నీనితంబము ఈ సమస్తభూమిని కప్పి తేలికగాఁ జేయుచున్నది.

అవ. తొడలను మోఁకాళ్లను ఒక్కమాఱే వర్ణించుచున్నారు. -

కరీన్ద్రాణాం శుణ్డాన్ కనకకదళీకాణ్డపటలీ
ముభాభ్యామూరుభ్యాముభయమపి నిర్జిత్య భవతీ,
సువృత్తాభ్యాం పత్యుః ప్రణతికఠినాభ్యాం గిరిసుతే
విధిజ్ఞే జానుభ్యాం విబుధకరికుమ్భద్వయమసి. 82

టీ. విధిజ్ఞే = శాస్త్రార్థమునెఱింగిన, హేగిరిసుతే = ఓపార్వతీ, భవతీ = నీవు, కరీంద్రాణామ్ = ఏనుఁగులయొక్క, శుండాన్ = తుండములను, కనకకదళీకాణ్డపటలీం-కనకకదళీ = బంగా రరఁటిచెట్లయొక్క, కాణ్డ = స్తంభములయొక్క, పటలీం = సమూహమును, ఉభాభ్యాం = రెండగు, ఊరుభ్యాం = తొడలచేత, ఉభయమపి = రెంటిని, నిర్జిత్య = ఓడించి, సువృత్తాభ్యాం = చక్కనై వట్రువలైన, పత్యుః = భర్తయొక్క, ప్రణతికఠినాభ్యామ్-ప్రణతి = మ్రొక్కుటచేత, కఠినాభ్యాం = గట్టిపడిన, జానుభ్యాం = మోఁకాళ్ళచేత, విబుధకరికుంభద్వయమసి-విబుధకరి = దిగ్గజములయొక్క, కుమ్భ = కుంభములయొక్క, ద్వయమపి = రెంటిని, నిర్జిత్య = జయించి, అసి = ఉంటివి.

తా. తల్లీ, నీవు నీవట్రువలైనచక్కనితొడలచే నొక్కమాఱే ఏనుఁగు తుండములను అరఁటికంబములను జయించి విధిననుసరించి భర్తకు మ్రొక్కుటచే భూస్పర్శమున బిరుసువారినమోఁకాళ్లచేత ఏనుఁగుకుంభములనుగూడ నోడించుచున్నావు. తొడలు గుండ్రములై యాదోఁక గలిగియున్నవి. మోకాళ్లు గొప్పవై కఠినములైనవి.

పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే
నిషఙ్గా జఙ్ఘే తే విషమవిశిఖో బాఢమకృత,
యదగ్రే దృశ్యన్తే దశశరఫలాః పాదయుగళీ
నఖాగ్రచ్ఛద్మానస్సురమకుటశాణైకనికషాః 83

టీ. హేగిరిసుతే = ఓపార్వతీ, విషమవిశిఖః = బేసి (ఐదు) బాణములుగలమన్మథుఁడు, రుద్రం = ఈశ్వరుని, పరాజేతుం = గెలుచుటకొఱకు, తే = నీయొక్క, జఙ్ఘే = పిక్కలను, ద్విగుణశరగర్భౌ-ద్విగుణ = ఇబ్బడి (పది) యగు, శర = బాణములే, గర్భౌ = నడుమఁగల, నిషంగౌ = అమ్ములపొదలనుగా, అకృత = చేసెను. బాఢం = నిజము, యదగ్రే = ఏపిక్కలతుదను, పాదయుగళీనఖాగ్రచ్ఛద్మానః-పాదయుగళీ = చరణద్వంద్వమందలి, నఖ = గోళ్ళయొక్క, అగ్ర = కొనలచే, ఛద్మానః = వ్యాజముగల, సురమకుటశాణైకనిషాః-సుర = దేవతలయొక్క, మకుట = రత్నకిరీటములనే, శాణ = ఆకురాళ్ళచేత, ఏకనికషాః = ముఖ్యముగాఁ బదునుపెట్టఁబడిన, దశ = పదియగు, శరఫలాః = భాణపుటలుగులు, దృశ్యన్తే = కనఁబడుచున్నవో?

తా. తల్లీ, మన్మథుఁడు శివునిజయించుటకొఱకు పదిబాణములు లోపలఁబెట్టి పిక్కలనుపేరుతో అమ్ములపొదులనుజేసి యుంచికొనెను. కనుకనే యీపిక్కలచివరలయందు కాలిగోళ్ళనేవ్యాజముతో ఎప్పుడు దేవకిరీటములచే వాడిచేయఁబడిన బాణపుటలుగులుపది యగపడుచున్నవి. జంఘలు వట్రువలై యమ్ములపొదులవలె నున్నవి. ఎప్పుడును ఇంద్రాదులు పాదములకడఁ బడి యుందురని తా.

శ్రుతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా
మమాప్యేతౌ మాతశ్శిరసి దయయా ధేహి చరణౌ,
యయోః పాద్యం పాథః పశుపతిజటాజూటతటినీ,
యయోర్లాక్షాలక్ష్మీరరుణహరిచూడామణిరుచిః 84

టీ. హేజనని = ఓతల్లీ, తవ = నీయొక్క, యౌ = ఏ, చరణౌ = పాదములను, శ్రుతీనామ్ = వేదములయొక్క, మూర్ధానః = శిరస్సులు(ఉపనిషత్తులు), శేఖరతయా = శిరోభూషణములుగా, దధతి = ధరించుచున్నవో, హేమాతః = ఓతల్లీ, ఏతౌ = ఈపాదములను, మమాపి = నాయొక్కయు, శిరసి = తలయందు, దయయా = కృపతోడ, ధేహి = ఉంచుము, యయోః = ఏపాదములయొక్క, పాద్యమ్ = కాళ్లుగడుగుటకుఁదగిన, పాథః = ఉదకము, పశుపతిజటాజూటతటినీ-పశుపతి = శివునియొక్క, జటాజూట = కపర్దమందలి, తటినీ = నదియో, యయోః = ఏపాదములయొక్క, లక్షాలక్ష్మీః-లక్షా = లత్తుకయొక్క, లక్ష్మీః = శోభ, అరుణహరిచూడామణిరుచిః-అరుణ = ఎఱ్ఱనైన, హరి = విష్ణువుయొక్క, చూడామణి = తలమానికమగు కౌస్తుభముయొక్క, రుచిః = ఎఱుపో.

తా. తల్లీ, ఏపాదములకొఱకైన నీళ్లే శివునిశిరస్సుననుండునదియో, ఏపాదముల యెఱుపే విష్ణువుతలయందలి కౌస్తుభరత్నముయొక్కరంగో, ఉపనిషత్తులచే వర్ణింపఁబడినయా నీపాదములను నాతలయం దునిచి నన్ను బవిత్రుని చేయుము.

నమోవాకం బ్రూమో నయనరమణీయాయ పదయో
స్స్తవాస్మై ద్వన్ద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే,
అసూయత్యత్యన్తం యదభిహననాయ స్పృహయతే
పశూనామీశానః ప్రమదవనకఙ్కేళితరవే. 85

టీ. హేభగవతి = ఓపార్వతీ, తవ = నీయొక్క, నయనరమణీయాయ = కనులకింపైన, స్ఫుటరుచిరసాలక్తకవతే-స్ఫుట = మెఱయుచున్న, రుచి = కాంతిగలదియు, రసాలక్తకవతే = తడిలత్తుకగల, అస్మై = ఈ, పదయోః = పాదములయొక్క, ద్వన్ద్వాయ = జంటకొఱకు, నమోవాకమ్ = ప్రణామవాక్యమును, బ్రూమః = పలికెదము. పశూనామ్-ఈశానః = పశుపతియగుశివుఁడు, యదభిహనవాయ = దేనితాఁకునకు, స్పృహయతే = కోరుచున్న, ప్రమదవనకఙ్కేళితరవే-ప్రమదవన = ఆటతోఁటయందలి, కఙ్కేళితరవే = అశోకవృక్షముకొఱకు, (ప్రణ యకలహమందు బ్రతిమాలఁబోయి తానుమాత్రమే అనుభవించి యితరదుర్లభమైనతాఁపు అచేతనమగు వృక్షమునకు కలిగినందున) అత్యన్తం = మిగుల, అసూయతి = కోపపడుచున్నాఁడో.

తా. తల్లీ, తడిలత్తుకతోఁగూడి చక్కగాఁ బ్రకాశించుచు చూడసొబగైనయీనీచరణ ద్వయమునకు మ్రొక్కెదము. దోహదముకొఱకు ఏ పాదములతాఁపును గోరుచున్న క్రీడోద్యానమందలి యశోకమును జూచి శివుఁడు కోపమొందుచున్నాఁడో.

మృషా కృత్వా గోత్రస్ఖలనమథ వైలక్ష్యనమితం
లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే,
చిరాదన్తశ్శల్యం దహనకృతమున్మూలితవతా
తులాకోటిక్వాణైః కిలికిలితమీశానరిపుణా. 86

టీ. హేభగవతి = ఓదేవీ, మృషా = ఆకస్మికముగా, గోత్రస్ఖలనమ్ = (పొరపడి) మాఱు పేరునఁబిలుచుటను, కృత్వా = చేసి, అధ = పిదప, వైలక్ష్యనమితం-వైలక్ష్య = వెల్లఁబాఱుటచే, నమితమ్ = లొంగిన, భర్తారం = మగని(సదాశివుని), తే = నీయొక్క, చరణకమలే = అడుగుఁదామర, లలాటే = నుదుట, తాడయతి = తన్నినదగుచుండఁగా (తనయెదుర తనశత్రువుకు నవమానముగలుగఁగా), చిరాత్ = చాలకాలమునుండి, దహనకృతం-దహన = ఫాలాగ్నిచే, కృతం = చేయఁబడిన, అంతశ్శల్యమ్ = హృదయతాపమును, ఉన్మూలితవతా = మాపుకొనిన, ఈశానరిపుణా = ఈశ్వరునిశత్రువగుమన్మథునిచేత, తులాకోటిక్వాణైః-తులాకోటి = అంచెయొక్క, క్వాణైః = ధ్వనులచేత, కిలికిలితం = కిలకిల నవ్వఁబడెను.

తా. తల్లీ, ఏకాంతమందు నిన్నుసవతి పేరునఁబిలిచిన నీభర్తయగు శివుని నీవు కాలితో ఫాలమునఁ దన్నగాఁ జూచి, మన్మథుఁడు చాలకాలము నుండి ఫాలాగ్ని చేసినయవమానమును బాసి, కాలియందెచప్పుడుచేత నవ్వు

హిమానీహన్తవ్యం హిమగిరినివాసైకచతురౌ
నిశాయాం నిద్రాణం నిశి చరమభాగే చ విశదౌ,
వరం లక్ష్మీపాత్రం శ్రియమతిసృజన్తౌ సమయినాం
సరోజం త్వత్పాదౌ జనని జయతశ్చిత్రమిహ కిమ్. 87

టీ. హేజనని = ఓయమ్మా, హిమగిరినివాసైకచతురౌ-హిమగిరి = మంచుకొండయందు, నివాస = ఉండుటయందు, ఏకచతురౌ = మిగుల నేర్పరులైన, నిశి = రాత్రి యందును, చరమభాగేచ = రాత్రి చివరభాగమందును, విశదౌ = నిర్మలములైనవియు, సమయినాం = సమయాచారపరులకు, శ్రియం = సంపదను, అతిసృజన్తౌ = ఇచ్చుచున్న, త్వత్పాదౌ = నీచరణములు, హిమానీ హస్తవ్యమ్-హిమానీ = మంచుగడ్డచేత, హంతవ్యం = నశింపఁజేయఁదగినదియు, నిశాయాం = రాత్రియందు, నిద్రాణం = ముకుళించుచున్న, వరం = కొంచెముగా, లక్ష్మీపాత్రం = లక్ష్మీనివాసమైన, సరోజం = కమలమును, విజయత = జయించుచున్నవి. ఇహ = దీనియందు, కించిత్రం = ఏమి వింత?

తా. తల్లీ, నీపాదములు మంచుకొండయం దుండనేర్చినవై, రాత్రియందును ప్రకాశముగలవై, సమయాచారపరులకు తాము సంపదనిచ్చునవియై, మంచుదగిలిన మాడిపోవునదియు, రాత్రియందు ముకుళించునదియు, కొంచెము కాలము లక్ష్మికి నివాసమైనకమలమును జయించుచున్నవి. దీనిలో నేమిచిత్రము గలదు? ఏమియు లేదు.

పదం తేకీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం
కథం నీతం సద్భిః కఠినకమఠీకర్పరతులామ్,
కథం వా పాణిభ్యాముపయమనకాలే పురభిదా
యదాదాయ న్యస్తం దృషది దయమానేన మనసా. 88

టీ. హేదేవి = క్రీడించునిచ్ఛగలయోపార్వతీ, కీర్తీనాం = యశములకు, పదం = నెలవైనదియు, విపదాం =ముప్పులకు, ఆపదం = తావుగాను, తే = నీయొక్క, ప్రపదం = కాలిచివర, సద్భిః = యోగ్యులైనకవులచేత, కఠినకమఠీకర్పర తులాం-కఠిన = బిరుసైన, కమఠీ = తాఁబేలుయొక్క, కర్పర = వీఁపుబొచ్చెతోడ, తులాం = పోలికను, కథం = ఏలాగున, నీతం = పొందించఁబడినది, ఉపయమనకాలే = వివాహకాలమున, పురభిదా = ఈశ్వరునిచేత, యత్ = ఏపాదము, దయమానేన = దయగల, మనసా = చిత్తముతో, ఉభాభ్యామ్ = రెండగు, పాణిభ్యాం = చేతులతో, అదాయ = ఎత్తి, దృషది = సన్నెకంటియందు, కథంవా = ఎటులు, న్యస్తం = ఉంచఁబడినది.

తా. తల్లీ, కీర్తికినెలవై సంకటములను బారఁదోలు కుసుమసుకుమారమగు నీపాదమును మహాకవులు క్రూరముగా తాఁబేటిబొచ్చెతో నెట్లుపోల్చిరో తెలియదు. వివాహకాలమందు శంకరుఁడు తాను దయగలవాఁడయ్యు రెండుచేతులతోఁబట్టి యెట్లుసన్నెకంటి (నూఱుడుఱాయి) ని నొక్కించెనో తెలియదు. ఈరెండును కఠినపుఁబనులే యని భావము.

నఖైర్నాకస్త్రీణాం కరకమలసఙ్కోచశశిభి
స్తరూణాం దివ్యానాం హసత ఇవ తే చణ్డి చరణౌ
ఫలాని స్వస్స్థేభ్యః కిసలయకరాగ్రేణ దధతాం
దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ. 89

టీ. హేచణ్డి = ఓపార్వతీ, దరిద్రేభ్యః = బీదలకొఱకు, భద్రాం = పుష్కలమైన, శ్రియం = లక్ష్మిని, అనిశం = ఎల్లపుడు, అహ్నాయ = శీఘ్రముగా, దక్షతౌ = ఇచ్చుచున్న, తే = నీయొక్క, చరణౌ = పాదములు, నాకస్త్రీణాం = దేవవనితలయొక్క, కరకమలసఙ్కోచశశిభిః-కర = హస్తముల నే, కమల = తామరపూవులయొక్క, సఙ్కోచ = ముకుళింపఁజేయుటయందు, శశిభిః = చంద్రులైన (దేవిపాదదర్శనమైనతోడనే దేవాంగనలు అంజలి ఘటింతురు), నఖైః = గోళ్ల చేత, స్వస్స్థేభ్యః = స్వర్గమందున్న (సర్వసంపత్సమృద్ధిగల) దేవతలకొఱకు, ఫలాని = కోరినవస్తువులను, కిసలయకరాగ్రేణ-కిసలయ = చిగురుటాకులనే, కర = హస్తములయొక్క, అగ్రేణ = కొనలచేత, దదతాం = ఇచ్చుచున్న, దివ్యా నామ్ = స్వర్గమందున్న, తరూణాం = కల్పవృక్షములకు, హసతఇవ = నవ్వుచున్నవో యననున్నవి.

తా. తల్లీ, బీదలకు గొప్పసంపదలను కోరినవెంటనే మాటిమాటికి నిచ్చుచున్న నీ పాదములు సంపన్నులగుదేవతలకు సంపదనిచ్చు కల్పవృక్షములను దేవతాస్త్రీలహస్తములను కమలములను ముకుళింపఁజేయుచంద్రులైన నఖములచేత నవ్వుచున్నవో యనునట్లున్నవి.

దదానే దీనేభ్యః శ్రియమనిశమాశాసుసదృశీ
మమన్దం సౌందర్యప్రకరమకరన్దం వికిరతి,
తవాస్మిన్ మన్దార స్తబకసుభగే యాతు చరణే
నిమజ్జన్మజ్జీవః కరణచరణైష్షట్చరణతామ్. 90

టీ. హే భగవతి = ఓదేవీ, దీనేభ్యః = దరిద్రులకొఱకు, అశాసుసదృశీం = కోర్కికనుగుణమైన, శ్రియం = సంపదను, అనిశం = ఎల్లపుడు, దదానే = ఇచ్చుచున్నదియు, అమన్దం = పూర్ణమైన, సౌన్దర్యప్రకరమకరన్దం-సౌన్దర్య = సొబగుయొక్క, ప్రకర = సమూహమనే, మకరన్దం = పూఁదేనెను, వికిరతి = చిలుకుచున్న, మన్దారస్తబకసుభగేః = కల్పవృక్షపుఁబూగుత్తివలె నందమైన, తవ = నీయొక్క, అస్మిన్ = ఈ, చరణే = పాదమందు, నిమజ్జన్ మునిఁగిన, మజ్జీవః - నేననేజీవుఁడు, కరణచరణైః = (మనస్సుతోఁగూడిన త్వక్చక్షుశ్శ్రోత్రజిహ్వాఘ్రాణములను) నాఱింద్రియములచేత, షట్చారణతాం = (ఆఱుకాళ్లుగల) తుమ్మెదయగుటను, యాతు = పొందుఁగాక.

తా. తల్లీ, బీదల కెల్లపుడు మహదైశ్వర్యము నిచ్చుచున్నదియు, సౌందర్యమనుపూఁదేనె జిలుకునట్టిదియు, కల్పవృక్షముయొక్క పూఁగుత్తివలెనున్న నీపాదమందు ఆఱింద్రియములతోఁగూడిన నేను తుమ్మెద (షట్పదము) నగుదునుగాక.

పదన్యాసక్రీడాపరిచయ మివారబ్ధుమనసః
స్ఖలన్తస్తే ఖేలం భవనకలహంసా న జహతి,

అత స్తేషాం శిక్షాం సుభగమణిమఞ్జీరరణిత
చ్ఛలాదాచక్షాణం చరణకమలం చారుచరితే. 91

టీ. హేచారుచరితే = ఇంపైనకథగల యోయమ్మా, తే = నీయొక్క, భవనకలహంసాః-భవన = ఇంటియందలి, కలహంసాః = పెంపుడుహంసలు, పదన్యాసక్రీడాపరిచయం-పదన్యాస = చక్కగా అడుగు లిడుటయనే, క్రీడా = ఆటయందలి, పరిచయం = అభ్యాసమును, అరబ్ధుమనసఇవ = నేర్చికొన మొదలిడఁగోరినవివలె, స్ఖలన్తః = (తప్పి) జాఱుచున్న నడకలుగలవై, ఖేలం = విలాసగమనమును, నజహాతి = విడువవు, అతః = ఇందువలన, చరణకమలం = నీయడుగుఁదామర, సుభగమణిమఞ్జీరరణితచ్ఛలాత్-సుభగ = అందమైన, మణిమఞ్జీర = రతనపుటందెయొక్క, రణిత = మ్రోఁతలను, ఛలాత్ = వ్యాజమువలన, తేషాం = ఆహంసలకు, శిక్షాం = పాఠమును, ఆచక్షాణం = చెప్పుచున్నదో యననున్నది.

తా. తల్లీ, నీపెంపుడుహంసలు నీనడకతీరును నేర్చికొనఁగోరి నడక తప్పిపోవుచున్నను విడువక నీకాలివెంటఁ దిరుగుచున్నవి. నీపాదమున్ను అందెచప్పుడుచే వానికి శిక్షఁజెప్పుచున్నదో యననున్నది. దేవి పెంపుడు హంసలు వెంటఁదిరుగఁగా విలాసముతోఁ గ్రీడించుచుండును.

ఆవ. ఇట్లు కిరీటముమొదలు పాదములవఱకు వర్ణించి మరల స్వరూపమును బొగడుచున్నారు:-

గతాస్తే మఞ్చత్వం ద్రుహిణహరిరుద్రేశ్వరభృతః
శివస్స్వచ్ఛచ్ఛాయాకపటఘటితప్రచ్ఛదపటః,
త్వదీయానాం భాసాం ప్రతిఫలనరాగారుణతయా
శరీరీ శృఙ్గారో రస ఇవ దృశాం దోగ్ధి కుతుకమ్. 92

టీ. హేభగవతి = ఓపార్వతీ, ద్రుహిణహరిరుద్రేశ్వరభృతః-ద్రుహిణ = బ్రహ్మయొక్కయు, హరి = విష్ణువుయొక్కయు, రుద్ర = శివునియొక్కయు, ఈశ్వరునియొక్కయు, భృతః = అధికారములనుపొందిన బ్రహ్మవిష్ణురుద్రేశ్వరులు, తే = నీకు, మంచత్వం = మంచమగుటను, గతాః = పొందిరి. (సన్నికృష్టసేవకొఱకు వారునలువురు నాలుగుకోళ్లై మంచమును మోయుచున్నారు.) శివః = శివతత్వాత్మకు డగు అధికారి, స్వచ్ఛచ్ఛాయాకపటఘటితప్రచ్ఛదపటః-స్వచ్ఛ = తెల్లనైన, ఛాయా = కాంతియనే, కపట = వ్యాజముచేత, ఘటిత = చేయఁబడిన, ప్రచ్ఛదపటః = కప్పుడుదుప్పటియై, త్వదీయానాం = నీసంబంధములైన, భాసాం = ఎఱ్ఱనికాంతులయొక్క, ప్రతిఫలనరాగారుణతయా-ప్రతిఫలన = ప్రతిబింబించుటచేతనైన, రాగ = రంగుచేత, అరుణతయా = ఎఱ్ఱనివాఁడగుటచేత, శరీరీ = తనువునుదాల్చిన, శృఙ్గారఃరసఇవ = శృంగారరసమువలె (శృంగారరస మెఱ్ఱనిదని కవిసమయము), కుతుకం = వేడుకను,దోగ్థి = కలుగఁజేయుచున్నాఁడు.

తా. తల్లీ, బ్రహ్మవిష్ణురుద్రమహేశ్వరులు నలువురు నీమంచమునకు నాలుగుకోళ్లై నిన్ను సేవించుచున్నారు. శివుఁడు తెల్లనికాంతి యనుమిషతో నిన్నావరించి నీకుఁ గప్పుడుబట్టయై నీయెఱ్ఱనిమేనికాంతులచే తానును ఎఱ్ఱనై మూర్తీభవించిన శృంగారమువలె నున్నాఁడు.

అరాళా కేశేషు ప్రకృతిసరళా మందహసితే
శిరీషాభా చిత్తే దృషదుపలశోభా కుచతటే,
భృశం తన్వీ మధ్యే పృథురురసిజారోహవిషయే
జగత్త్రాతుం శమ్భోర్జయతి కరుణా కాచిదరుణా. 93

టీ. హేభగవతి = ఓదేవీ, కేశేషు = తలవెండ్రుకలయందు, అరాళా = వంకరయైనదియు, మన్దహసితే = చిఱునగవునందు, ప్రకృతిసరళా-ప్రకృతి = నైజముచేతనే, సరళా = సుకుమారమైనదియు, చిత్తే = మనస్సున, శిరీషాభా = దిరిసెనపూవువలె మృదునైనదియు, కుచతటే = స్తనప్రాంతమున, దృషదుపలశోభా = సన్నెకంటివంటిదియు, మధ్యే = నడుమునందు, భృశం = మిక్కిలి, తన్వీ = కృశించినదియు, ఉరసిజారోహ విషయే = కుచదేశమునను, పిఱుఁదుల యందును, పృథుః = మిగులగొప్పదియు, అరుణా = ఒడలెల్ల ఎఱ్ఱనైన, కాచిత్ = అనిర్వాచ్యరూపముగల, శమ్భోః = సదాశివునియొక్క, కరుణా = దయ (కరుణారూపశక్తి), జగత్ = లోకమును, త్రాతుం = కాపాడుకొఱకై, విజయతే = అన్నిటికి మిన్నయై వెలయుచున్నవి.

తా. తల్లీ, కేశములయందు వంకరయై నవ్వునందు సుకుమారమై మనముగ మృదులమై స్తనప్రాంతమున కఠినమై నడుమున కృశించినదై, స్తనముల యందును పిఱుఁదులయందును మిగుల గొప్పదై యెఱ్ఱనైన శివునికరుణారూప మైన యొక యనిర్వాచ్యమహిమగలశక్తి వెలయుచున్నది.

కళఙ్కః కస్తూరీ రజనికరబిమ్బం జలమయం
కళాభిః కర్పూరైర్మరకతకరణ్డం నిబిడితమ్,
అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం
విధిర్భూయోభూయో నిబడయతి నూనం తవ కృతే. 94

టీ. హేభగవతి = ఓదేవీ, కళఙ్కః = చిహ్నము, కస్తూరీ = మృగమదము, రజనికరబిమ్బం = చంద్రబింబము, జలమయం = ఉదకస్వరూపమై, కళాభిః = కిరణములనే, కర్పూరైః = కప్పురములతోడ, నిబిడితం = నిండించఁబడిన, మరకతకరణ్డం = మరకత (మొసలినోటినుండిపుట్టిన) మణులతోఁ జేయఁబడినపెట్టె, అతః = ఇందువలన, ప్రతిదినం = అనుదినము, త్వద్భోగేన = నీవు వాడుకొనుటచేత, రిక్తకుహరం-రిక్త = వట్టిపోయిన, కుహరం = అంతరము గలిగిన, ఇదం = ఈపెట్టియను, విధిః = బ్రహ్మ, భూయోభూయః = మాటిమాటికి, తవకృతే = నీకొఱకయి, నిబిడయతి = పూరించుచుండును, నూనం = నిజము.

తా. తల్లీ, ఈయగపడునది కళంకముగాదు కస్తూరి. ఇది చంద్రుని బింబముగాదు ఉదకము, ఈతెల్లనివి కిరణములుగావు కర్పూరసమూహముచే నింపఁబడినపెట్టె. దీనియందలివస్తువులను నీవు దినదినము వాడుకొందువు గనుకనే బ్రహ్మ యెప్పుడును దీనిని మరల ఈ వస్తువులచే నింపుచుండును.

పురారాతేరన్తఃపురమసి తతస్త్వచ్చరణయో
స్సపర్యామర్యాదా తరళకరణానామసులభా,
తథా హ్యేతే నీతాశ్శతమఖముఖాస్సిద్ధిమతులాం
తవ ద్వారోపాన్తస్థితిభిరణిమాద్యాభిరమరాః. 95

టీ. హేభగవతి = ఓయంబా, త్వం = నీవు, పురారాతేః = శివునకు, అన్తఃపురం = అంతఃపురము (పట్టపుదేవివి), అసి = అయితివి. తతః = అందువలన, త్వచ్చరణయోః = నీపాదములయొక్క, సపర్యామర్యాదా = పూజావిధి, తరళకరణానామ్ = చపలచిత్తులకు, అసులభా = సులభముగాదొరకునదికాదు, తథాహి = అదియట్లేగదా, ఏతే = ఈ, శతమఖముఖాః = ఇంద్రుఁడు లోనగు, అమరాః = దేవతలు, తవ = నీయొక్క, ద్వారోపాన్తస్థితిభిః-ద్వార = వాఁకిలియొక్క, ఉపాంత = చెంతను, స్థితిభిః = ఉనికిగల, అణిమాద్యాభిః = అణిమాదిసిద్ధులచేతనే, అతులామ్ = తులలేని, సిద్ధిమ్ = మనోరథసిద్ధిని, నీతాః = పొందింపఁబడిరి.

తా. తల్లీ, నీవు శివునిపట్టపురాణివిగనుక నీపాదసేవ కొంచెముతో దొరకునదికాదు. అందువల్లనే యింద్రాది దేవతలు నీవాఁకిట కావలియున్న యణిమాదిసిద్ధులచేతనే తృప్తినొందుచున్నారు. చంచలచిత్తులు గనుక సిద్ధులతోనే తృప్తినొంది శాశ్వతమగు పరమపదమును గోరరు.

కళత్రం వైధాత్రం కతికతి భజన్తే న కవయః
శ్రియో దేవ్యాః కోవా న భవతి పతిః కైరపి ధనైః,
మహాదేవం హిత్వాః తవ సతి సతీనామచరమే
కుచాభ్యామాసఙ్గః కురవకతరోరవ్యసులభః. 96

టీ. హేసతి = ఓపార్వతీ, వైధాత్రమ్ = బ్రహ్మసంబంధమైన, కళత్రం = భార్యయగు సరస్వతిని, కతికతి = ఎందఱెందరు, కవయః = కవులు, నభజన్తే = సేవించరు (సేవింతురు), కోవా = ఏపురుషుఁడైనను, కైరపి = కొన్నియగు, ధనైః = ధనములచేత, శ్రియః దేవ్యాః = లక్ష్మీదేవికి, పతిః = అధిపతి, నభవతి = కాఁడు (అగును). సతీనామ్ = పతివ్రతలగుయువతులలో, అచరమే = మొదటిదానవగు ఓపార్వతీ, మహాదేవమ్ = ఈశ్వరుని, హిత్వా = విడచి, తవ = నీయొక్క, కుచాభ్యాం = స్తనములచేతనైన, అసఙ్గః = సంపర్కము (కౌఁగిలింత), కురపకతరోరపి = అచేతనమగు గోరింటచెట్టునకును, అసులభః = సులభముకాదు. (స్త్రీలకుచములతోడికౌఁగిలింత గోరింటకు దోహదము).

తా. పార్వతీ, సరస్వతీప్రసాదముగల కవులందఱును సరస్వతీపతులే, కొంచెముధనముగలవాఁ డెల్ల లక్ష్మీపతియే, ఓపతివ్రతాతిలకమా, నీకథమాత్ర మట్లుగాదు. నీకుచసంగ మొకయీశ్వరునకుఁదక్క దోహదమను పేర నచేతనమగు గోరింటాకుఁగూడ దొరకుట యరిది.

గిరామాహుర్దేవీం దృహిణగృహిణీమాగమవిదో
హరేః పత్నీం పద్మాం హరసహచరీమద్రితనయామ్,
తురీయా కాపి త్వం దురధిగమనిస్సీమమహిమా
మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషి. 97

టీ. హేపరబ్రహ్మమహిషి = పరమాత్మ యగుసదాశివునిరాణి యగుతల్లీ, ఆగమవిదః = వేదములఁదెలిసిన సర్వజ్ఞులు, త్వాం = నిన్ను, దృహిణగృహిణీఁ = బ్రహ్మభార్యయగు, గిరాందేవీం = సరస్వతినిగా, ఆహుః = చెప్పుదురు. త్వామేవ = నిన్నే, హరేః = విష్ణువుయొక్క, పత్నీం = ప్రియురాలగు, పద్మాం = లక్ష్మినిగా, ఆహుః = చెప్పుదురు. త్వామేవ = నిన్నే, హరసహచరీం = రుద్రభార్యయగు, అద్రితనయాం = పార్వతినిగా, ఆహుః = చెప్పుదురు. త్వం = నీవు, తురీయా = ఈమువ్వురు గాక నాలవదానవై, కాపి = చెప్పనలవికానిదానవై, దురధిగమనిస్సీమమహిమా-దురధిగమ = పొందరాని, నిస్సీమ = (దేశకాలవస్తువుల) అవధిలేని, మహిమా = సామర్థ్యముగల, మహామాయా = గొప్పమాయ (మూలప్రకృతి) యై, విశ్వం = సర్వప్రపంచమును, భ్రమయసి = మోహింపఁజేయుచున్నదానవు. సాదాఖ్యచంద్రకళయను పేరుగల శ్రీవిద్యయగునిన్నే పలువురు పలువిధముల నూహసేయుదురు. తా. ఆగమవిదులు నిన్నే సరస్వతి లక్ష్మి పార్వతి యనియెదరు. ఈమువ్వురికంటె వేఱైన పరబ్రహ్మరూపుఁడగు సదాశివునిదేవివగు చంద్రకళయని వాడఁబడు శ్రీవిద్య యగునీవు మహామాయవై ఊహింపనలవికాని దేశకాల వస్తువులచే పరిచ్ఛేదింపరాని మహిమగలదానవై వెలయుదువు. తెలిసినవారలు ఒకనిన్నే యిన్ని పేరులతో వాడుదురుగాని నీవెప్పుడును ఒక్కదానవే.

కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం
పిబేయం విద్యార్థీ తవ చరణనిర్ణేజనజలమ్,
ప్రకృత్యా మూకానామపిచ కవితాకారణతయా
కదా ధత్తే వాణీముఖకమలతామ్బూలరసతామ్. 98

టీ. హేమాతః = ఓయమ్మా, విద్యార్థీ = బ్రహ్మజ్ఞానమునభిలషించునేను, కలితాలక్తకరసం-కలిత = కలుపఁబడిన, అలక్తకరసం = లత్తుకద్రవముగల, తవ = నీయొక్క, చరణనిర్ణేజనజలం = కాళ్లుగడిగిన నీటిని, కదాకాలే = ఎప్పుడు, పిబేయం = త్రాగుదును. (తత్ = అది,) ప్రకృత్యా = స్వభావముననే, మూకానామపిచ = పలుకుటకు వినుటకుఁ దెలియనివారికిఁగూడ, కవితాకారణతయా = కవనమునకు హేతువగుటచేత, వాణీముఖకమలతామ్బూలరసతాం-వాణీ = సరస్వతియొక్క, ముఖకమల = మోముదమ్మియందలి, తామ్బూల = తమ్ములముయొక్క, రసతాం = సారస్యమును, కదా = ఎప్పుడు, ధత్తే = స్వీకరించునో.

తా. తల్లీ, బ్రహ్మజ్ఞానమును గోరుచున్న నేను లత్తుకచే నెఱ్ఱనైననీపాదోదకమును ఎప్పుడు క్రోలుదునో, కవనహేతువు గనుక అది సరస్వతీ దేవియొక్క తామ్బూలరసముయొక్క సొంపుగల దెప్పు డగునో.

అవ. మొదలిడిన స్తోత్రమును ముగించుచు షట్కమలభేద సిద్ధాంతమును జెప్పుచున్నారు:-

సరస్వత్యా లక్ష్మ్యా విధిహరిసపత్నో విహరతే
రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా,

చిరం జీవన్నేవ క్షపితపశుపాశవ్యతికరః
పరానన్దాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్. 99

టీ. హేభగవతి = ఓపార్వతీ, త్వద్భజనవాన్ = నీసేవగలవాఁడు, సరస్వత్యా = సరస్వతి(చదువు)చేతను, లక్ష్మ్యా = లక్ష్మీ(సంపద)చేతను, విధిహరిసపత్నః = బ్రహ్మకును విష్ణువునకును శత్రువుగా, విహరతే = క్రీడించును, (స్వాధీనము చేసికొనినలక్ష్మీ సరస్వతులు గలవాఁడు గనుక వారిభర్తకు కోపము) రమ్యేణ = చూడసొగసైన, వపుషా = శరీరముతోడ, రతేః = రతీదేవియొక్క, పాతివ్రత్యం = (మఱియొకపురుషునిబొందఁ గూడదను) నియమమును, శిథిలయతి = నశింపఁజేయుచున్నాఁడు. చిరం = తడవుగా, జీవన్నేవ = బ్రదికియుండినవాఁడై, క్షపితపశుపాశవ్యతికరః-క్షపిత = విదళింపఁబడిన, పశుపాశ = జీవావిద్యలయొక్క, వ్యతికరః = సంబంధముగలవాఁడై (సదాశివస్వరూపముచేనున్నవాఁడై), పరానందాభిఖ్యం = బ్రహ్మానందమనఁబడు, రసం = సుఖమును, రసయతి = ఆస్వాదించుచున్నాఁడు. ఇట్లు సాదాఖ్యకళ నుపాసించువారికి ఐహికాముష్మికములు రెండును గలవని భావము.

తా. తల్లీ, ఇట్లు నిన్ను (సమయాఖ్యచంద్రకళ) నుపాసించినవాఁడు, లక్ష్మీసరస్వతులకు చోటై బ్రహ్మకు విష్ణువునకు విద్వేషి యగును. జీవావిద్యాసంబంధమును బాపికొని ఎప్పుడును బ్రదికియుండి, పరానందరసమును గ్రోలును.

ప్రదీపజ్వాలాభిర్థివసకరనీరాజనవిధి
స్సుధాసూతేశ్చన్ద్రోపలజలలవైరర్ఘ్యరచనా,
స్వకీయైరమ్భోభిస్సలిలనిధిసౌహిత్యకరణం
త్వదీయాభిర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియమ్. 100

టీ. హేజనని = ఓయంబా, త్వదీయాభిః = నీసంబంధములైన, వాగ్భిః = వాక్కులచేత, తవ = నీయొక్క, వాచాం = వాక్కులయొక్క, ఇయం = ఈ, స్తుతిః = స్తోత్రము, ప్రదీపజ్వాలాభిః = దివిటీలవెలుతురు చేత, దివసకరనీరాజనవిధిః-దివసకర = సూర్యునికి, నీరాజనవిధిః = ఆరతెత్తుట, సుధాసూతేః = (అమృతవర్షకిరణములుగల) చంద్రునకు, చన్ద్రోపల జలలవైః = చంద్రకాంతపుఱాలయం దూరినయుదకములచేత, అర్ఘ్యరచనా = అర్ఘ్యమిచ్చుట, స్వకీయైః = తనవగు, అమ్భోభిః = ఉదకములచేత, సలిలనిధి సౌహిత్యకరణం = సముద్రుని తృప్తునిఁజేయుట.

తా. ఎల్లలోకములకు తల్లియగునోయంబా! నీవాక్కులచే నిన్నుబొగడుట కొఱవితో సూర్యునివెలిగింపఁజేయుటవంటిది. చంద్రకాంతపుఱాలలో నూరిననీళ్లతో చంద్రున కర్ఘ్యమెత్తుటవంటిది, తనయుదకములచేతనే సముద్రుని తృప్తిపఱచుటవంటిది. స్తోత్రము, స్తోత, స్తోత్రము చేయఁదగినది అన్నియు నీవేయని తాత్పర్యము.


సౌందర్యలహరి

సమాప్తము.



★ ★ ★


This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.