సుప్రసిద్ధుల జీవిత విశేషాలు/సి.పి.బ్రౌన్

ఆంధ్రులకు చిరస్మరణీయుడైన ఆంగ్లేయుడు

సి.పి. బ్రౌన్ (1798 - 1884)

భారత దేశ చరిత్రలో ఆంగ్లపాలనా కాలం అనటం కంటే ఆంగ్లపాలకుల దోపిడీ కాలం అనటం సమంజసంగా వుంటుంది. రాజకీయ బలాన్ని మరింత లాభములకు వినియోగింపవలెనన్నదే నాటి కంపెనీ ప్రభుత్వ లక్ష్యం. మరుభూములలో మంచినీటి బావులవలె కొందరు ఆంగ్లేయులు భారతీయ సంస్కృతిని నాగరికతను అర్థం చేసుకొని మనకు మహోపకారం చేశారు. వారిలో తెలుగు ప్రజలకు సంబంధించినంతవరకు చిరస్మరణీయులు నలుగురు.

ఆనాడు దత్తమండలాలుగా పేరుగాంచిన రాయలసీమ జిల్లాల మొదటి కలెక్టరుగా, యీ ప్రాంతంలో శాంతిభద్రతలను నెలకొల్పి, పాళెగాళ్ల అరాచకాలను అణచివేసి, 'మండ్రోలయ్య' గా ప్రజల మన్ననలందుకున్న వాడు సర్ థామస్ మన్రో.

మన దేశ చరిత్రకు కావలసిన ముడి సరుకును కైఫియత్తుల రూపంలో అందించిన మహనీయుడు కల్నల్ కాలిన్స్ మెకెంజీ.

అపారమైన గోదావరీ జలాలకు అడ్డంగా ఆనకట్ట నిర్మింపజేసి తెలుగు ప్రజలకు అన్నదాతగా విఖ్యాతుడైనవాడు సర్ ఆర్థర్ కాటన్.

మినుకు మినుకు మంటున్న తెలుగు వాజ్మయదీపాన్ని స్నేహసిక్తం చేసి ప్రజ్వలింప చేసిన ఆంధ్ర భాషోద్ధారకుడు సి.పి. బ్రౌన్.

ఈ నలుగురు కారుమేఘాల్లో మెరుపుల్లాంటి మహనీయులు.

ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తండ్రి రెవరెండ్ డేవిడ్ బ్రౌన్ క్రైస్తవ మత ప్రచారకుడిగా 1786 లో కలకత్తా వచ్చాడు. హిందూ మతాచారాలను అవగతం చేసుకొనే లక్ష్యంతో భారతీయ భాషలను నేర్చుకున్నాడు. ప్రాచ్య భాషా సంస్కృతులపట్ల ఆదరాభిమానాలు కలవాడు డేవిడ్ బ్రౌన్.

డేవిడ్ బ్రౌన్, కౌలే దంపతుల రెండవ కుమారుడిగా సి.పి.బ్రౌన్ 1798 నవంబరు 10వ తేదీన కలకత్తాలో జన్మించాడు. తండ్రి మరణం తర్వాత బ్రౌన్ కుటుంబం ఇంగ్లాండుకు వెళ్ళిపోయింది. ఇండియాలో, ఈస్టిండియా కంపెనీ ఉద్యోగానికి మొదటి మెట్టుగా బ్రౌన్ ను లండన్ (హెర్ట్‌ఫర్డ్) లోని హెయిల్ బరీ కాలేజీలో చేర్పించారు. ఈ కాలేజీలో సంస్కృతం బోధించేవారు. సంస్కృతం లో ఉత్తీర్ణులైన విద్యార్ధులకు 'బంగారు పతకాలు' యిచ్చేవారు. ఆ పతకం అంచు చుట్టూ "తత్ సుఖ సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం" అన్న సంస్కృత సూక్తి ఒకవైపు, మరోవైపు 'శ్రీవిద్యా వరాహ' అని చెక్కబడి వుండేది. ఆవిధంగా బ్రౌన్ సంస్కృతాభ్యాసం సాగించి బంగారు పతకం పొందాడు.

కంపెనీ ప్రభుత్వం బ్రౌన్ సోదరులిద్దరినీ ఎన్నుకొని బెంగాల్ సర్వీసుకు, మద్రాసు సర్వీసుకు ఎంపిక చేసింది. తెలుగు వారి అదృష్టం కొద్దీ సి.పి. బ్రౌన్ మద్రాసుకు కేటాయింపబడ్డాడు.

1817లో ఆగస్టు 4వ తేదీన బ్రౌన్ మద్రాసులో కాలుపెట్టాడు. అప్పటికి ప్రపంచంలో తెలుగు భాష ఒకటి వుంది, అనేది కూడా అతనికి తెలియదు. అప్పటికతని వయసు పందొమ్మిదేళ్ళు. ఫోర్ట్‌సెంట్ జార్జి కాలేజీలో శిక్షణ కోసం చేరాడు. వెలగపూడి కోదండరామ పంతులు వద్ద తెలుగు అక్షరాలు నేర్చుకొన్నాడు. పదహారు నెలల్లో తెలుగులో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. తెలుగు నేర్పే పండితులకు ఇంగ్లీషు బొత్తిగా తెలియని రోజులవి.

1820లో సర్ థామస్ మన్రో మద్రాసు గవర్నరుగా చేరాడు. కంపెనీ ఉద్యోగులందరూ దేశ భాషలలో ప్రావీణ్యం సంపాదించాలనీ, ప్రజల భాషలోనే ప్రభుత్వ వ్యవహారాలను సాగించాలని ఆదేశించాడు. మన్రో తన 'కాన్వొకేషన్' ఉపన్యాసంలో చేసిన ప్రబోధం బ్రౌన్ మనసులో మంత్రోపదేశంగా నాటుకొన్నది.

1820 ఆగస్టులో బ్రౌన్ కడపలో ఉద్యోగజీవితం ప్రారంభించాడు. కడప కలెక్టరుకు అసిస్టెంటుగా వుండేవాడు. అప్పటి కలెక్టరు హన్‌బరి తెలుగులో అనర్గళంగా మాట్లాడేవాడు. అయనలాగా మాట్లాడాలని నిశ్చయించుకున్నాడు బ్రౌన్.

1820-22 చివరి వరకు కడపలో పనిచేశాడు. కొంతకాలం మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునల్వేలి మున్నగు చోట్ల పనిచేశాడు. 1826-29 మధ్య కడపలో మరోసారి ఉద్యోగం చేశాడు.

తెలుగు సాహిత్యానికి సుక్షేత్రమైన కడపలో ప్రధాన కార్యస్థానాన్ని నెలకొల్పాడు. ఆయన పలు చోట్ల పని చేసినా ఎక్కడా స్థిరాస్తి సంపాదించలేదు. కడపలో పెద్ద బంగళా, తోట కొన్నాడు. అప్పట్లో అతని వేతనం 5-6 వందలకు మించదు. బంగాళాలో పెద్ద గ్రంథాలయం నెలకొల్పాడు. సొంత డబ్బుతో పండితులను నియమించాడు. బంగళాను 'సాహిత్య కర్మాగారం'గా రూపొందించాడు.

అవిద్య అకాండతాండవం చేస్తున్న కాలమది. చదువుకొన్న తెలుగు యువకులు చాలా అరుదుగా వున్న కాలమది. 1821లో కడపలో రెండు బళ్ళు పెట్టాడు. ఉచితంగా తెలుగు, హిందూస్తానీలలో చదువు చెప్పించాడు. ఆ బళ్ళలో దేశీయ ఉపాధ్యాయులను నియమించాడు. విద్యార్థులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించాడు.

కడపలోని బంగళా, తోట వ్యవహారాలన్నింటినీ బ్రౌన్‌కు అత్యంత విశ్వాస పాత్రుడైన అయోధ్యాపురం కృష్ణారెడ్డి చూచుకొనేవాడు. బ్రౌన్ ఎక్కడ పనిచేస్తున్నా కడపలోని బంగళా, తోట, గ్రంథ పరిష్కరణ, గ్రంథ సేకరణ మున్నగు విషయాలను అయోధ్యపురం కృష్ణారెడ్డి ద్వారా జాబుల మూలంగా తెలుసుకొనేవాడు.

మచిలీపట్నంలో కూడా రెండు పాఠశాలలను ప్రారంభించాడు. అక్కడ కూడా ఉచిత భోజన వసతి కల్పించాడు.

1824లో అబేదుబాయ్ వ్రాసిన"హిందూ మేనర్స్, కస్టమ్స్ అండ్ సెర్మనీస్"పుస్తకం చదువుతుండగా వేమన ప్రస్తావన కన్పించింది. వేమన పట్ల శ్రద్ధ పెరిగింది. వేమన పద్యాలు గల తాటాకు ప్రతులెన్నో తెప్పించాడు. మచిలీపట్నం కోర్టు పండితుడు తిప్పాభట్ల వెంకట శివశాస్త్రి, వఠ్యం అద్వైత బ్రహ్మశాస్త్రి ఆ దశలో సాహిత్య విద్యా గురువులయ్యారు. వేమన పద్యాలకు అర్థతాత్పర్యాలు బోధించారు. తెలుగు వ్యాకరణ, ఛందస్సూత్రాలు నేర్చుకొన్నాడు బ్రౌన్. 1825లో రాజమండ్రికి బదిలీ అయి ఆంధ్ర మహాభారతం చదవసాగాడు. అప్పకవీయం, కవిజనాశ్రయం మున్నగు వాటిని జీర్ణించుకున్నాడు. తెలుగు భాషా సాహిత్యాల అధ్యయనం ముమ్మరంగా సాగించాడు. అగ్గి పురుగులకు ఆహుతి కానున్న తెలుగు కావ్యాల వ్రాత ప్రతులను సేకరించాడు. కొంత డబ్బుతో పండితులను, వ్రాయసగాళ్ళను పెట్టి కావ్య పరిష్కరణ, శుద్ధప్రతులు తయారు చేయించాడు. ఆంధ్ర మహాభారతాన్ని, భాగవతాన్ని పరిష్కరింప చేసి అచ్చు వేయించినవాడు బ్రౌన్. 'నిలువ నీడ లేకుండా పోయిన తెలుగు సరస్వతిని ఆహ్వానించి, తన బంగళాలో ఒక సాహిత్య పర్ణశాల ఏర్పరచి, ఆ వాగ్దేవిని నిండు ముత్తైదువ లాగా నడయాడేటట్లు చేయగలిగాడు బ్రౌన్' అన్నాడు పరిశోధక సాహసి బంగోరె.

తెలుగుదేశాన్ని ముఖ్యంగా రాయలసీమను కృంగదీసిన కరువులెన్నో వచ్చాయి. వాటిలో ధాత కరువు (1876-77) అంతకు ముందు వచ్చిన నందన కరువు (1832-33) మహాఘోరమైనవి. నందన కరువునే ’గుంటూరు కరువు’గా చరిత్రకారులు చిత్రించారు. కరువు పరిస్థితులను గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వ్రాసిన జాబులోని పదజాలం ప్రభుత్వానికి నచ్చలేదు. కరువు (ఫ్యామిన్) అన్న పదానికి బదులుగా 'కొరత' అని వ్రాయమన్నారు. బ్రౌన్‍ను ప్రభుత్వం మందలించింది. కరువు కాలంలో గుంటూరు జిల్లాలో ఎన్నో గంజి కేంద్రాలు ఏర్పాటు చేయించి ప్రజలను ఆదుకొన్నాడు.

1835-38 మధ్య సెలవు పై లండన్ వెళ్ళాడు. అక్కడ కూడా విశ్రాంతి లేకుండా తెలుగు భాష కొరకు శ్రమించాడు. 'ఇండియ హౌస్ లైబ్రరి'లో గుట్టలుగా పడివుండిన దక్షిణ భారత భాషల గ్రంథాలు (లిఖిత ప్రతులు) 2106ను మద్రాసు గ్రంథాలయానికి పంపాడు. తిరిగి వచ్చిన తరువాత వసుచరిత్ర- మనుచరిత్రలకు వ్యాఖ్యలు వ్రాయించాడు. కళాపూర్ణోదయం, పల్నాటి వీర చరిత్ర మున్నగు 25 ప్రబంధాలను పరిష్కరింపజేశాడు. సంస్కృత గ్రంథాల సేకరణ, పరిష్కరణ చేశాడు.

దాదాపు 2వేల వేమన పద్యాలను సేకరించి వాటిలో 693 పద్యాలను ఇంగ్లీషులోకి అనువాదం చేసి అచ్చు వేయించాడు. అలా వేమన పద్యాలకు ప్రపంచంలో విసృత ప్రచారం కావించాడు.

ఇదంతా పండిత భాషకు సంబంధించిన కృషి. ప్రజా భాషకు మరింత ఎక్కువ కృషి చేశాడు. ప్రజల నోళ్ళలో నానుతూ వచ్చిన చాటువులను, సామెతలను, కథలు, గాథలు, పలుకుబడులను సేకరించాడు. తెలుగు నేర్చుకోదలచిన ఆంగ్లేయుల కోసం ఎన్నో వాచకాలు, వ్యాకరణ గ్రంథాలు వ్రాశాడు. అన్నిటి కన్నా మిన్నగా చెప్పవలసిన పని, నిఘంటువు నిర్మాణం. తెనుగు-ఇంగ్లీషు, ఇంగ్లీష్ తెనుగు నిఘంటువులు వ్రాశాడు. ఈనాటికీ అవి ప్రామాణికంగా వున్నాయి. జిల్లా నిఘంటువు వ్రాశాడు. తెలుగు సాహిత్యం గురించి శిల్పము, జ్యోతిష్యము, కలిశకం, హిజరి, మున్నగు వాటిపై పెక్కు వ్యాసాలు వ్రాశాడు. రాజుల యుద్ధము అను అనంతపురం చరిత్ర తాతాచారి కథలు, పంచతంత్ర కథలు యిలా ఎన్నో రచనలు చేశాడు.
దస్త్రం:SuprasiddulaJeevithaVisheshalu Page 9 Image 1.png

బ్రౌన్‌కు ఆనాటి పండితులు, యితరులు వ్రాసిన జాబుల సంపుటాలు 20కి పైగా వున్నాయి. ఇవన్నీ మద్రాసు ఓరియంటల్ మేనుస్క్రిప్టు లైబ్రరీలో వున్నాయి. వీటిలో విలువైన చారిత్రక విషయాలున్నాయి.

ప్రతి పైసాను కూడబెట్టి తన కింద పనిచేసే పండితులకు నెలనెలా జీతాలిచ్చేవాడు. ఆర్థికంగా కటకటలాడుతున్నా పుస్తకాల సేకరణ, ప్రచురణ పథకాలను నెలనెలా వందలు ఖర్చు చేసేవాడు. చివరికి 60వేల రూపాయలు అప్పులు చేశాడు. ఇందులో సగం వడ్డీ- ఇదంతా తెలుగు భాషోద్ధరణ కోసమే. చివరి దశలో అప్పులన్నీ తీర్చాడు.

బ్రౌన్ మానవతావాది. ప్రతి నెలా 100 - 130 మంది గుడ్డి, కుంటి వారికి సాయం చేసేవాడు. అప్పులు చేసి జైలుపాలైన పదకొండు మందికి 355 రూపాయలిచ్చి విడిపించాడు. ఒక దశలో నెలకు సగటున 500 రూపాయలు దానధర్మాలకు ఖర్చు చేసేవాడు. కడపలో జరగనున్న సహగమనాన్ని ఆపు చేయించాడు.

ఆంధ్ర సాహిత్యాన్ని ప్రజ్వలింపచేసిన బ్రౌన్ దొర సేవను ప్రశంసిస్తూ, నాటి పండితుడు అద్వైత బ్రహ్మశాస్త్రి యిలా అన్నాడు.

"సరస్వతికి ప్రస్తుతమందు తమరు ఒకరే నివాసస్థానముగా కనబడుతున్నారు. ఎక్కడ ఏ ఏ విద్యలు దాచబడి వున్నవో అవి అన్నీ తమంతట తామే తమ సన్నిధికి వస్తూ వున్నవి ... తమరు పుచ్చుకున్న ప్రయాసల వల్ల తేలిన పరిష్కారగ్రంథములు అకల్పాంతమున్ను తమ యొక్క కీర్తిని విస్తరిస్తూ వుంటవి."

ఆంధ్ర భాషోద్ధరణ కోసం జీవితం అంకితం చేసిన బ్రౌన్ స్మృతి చిహ్నంగా కడపలో ఆయన నివసించి సాహిత్య యజ్ఞం చేసిన స్థలంలో గ్రంథాలయ భవన నిర్మాణం పూర్తి అయింది. బ్రౌన్ బంగళా శిథిలాలున్న స్థలాన్ని శ్రీ సి. కె. సంపత్ కుమార్ సి.పి. బ్రౌన్ మెమోరియల్ ట్రస్టుకు ఉచితంగా యిచ్చారు. ప్రజా విరాళంగా రు. 3-20 లక్షలు, ప్రభుత్వం నుండి రు.4-50 లక్షలు ఖర్చు చేసి విశాలమైన గ్రంథాలయ భవనం నిర్మింపబడింది. శ్రీ పోలేపల్లి వెంగన్న శ్రేష్టి తమ సొంత గ్రంథాలయంలోని మూడువేల పుస్తకాలు. డా. పుట్టపర్తి వారు వంద విలువైన పుస్తకాలు యీ గ్రంథాలయానికి యిచ్చారు. ఈ గ్రంథాలయానికి ఇచ్చే విరాళాలపై ఆదాయపు పన్ను రాయితీ ఇవ్వబడుతుంది. తి.తి.దేవస్థానం, తెలుగు అకాడమి, తెలుగు విశ్వవిద్యాలయం, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఆచార్య చల్లా రాధాకృష్ణ శర్మ, డా. బెజవాడ గోపాలరెడ్డి, డా.కె. జగ్గయ్య మున్నగువారు పెక్కు గ్రంథాలను ఇచ్చారు. ఇప్పుడు ఈ గ్రంథాలయంలో 11 వేల గ్రంథాలున్నాయి.

తెలుగు భాషా సాహిత్యాల సముద్ధరణ కోసం నిర్విరామంగా కృషి చేసిన సి.పి.బ్రౌన్ 1854లో పదవీ విరమణ చేసి లండన్‌లో స్థిరపడ్డారు. లండన్ యుూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్ గా కొంతకాలం పనిచేసి 1884 డిసెంబర్ 12న ఎనభై ఏడవ ఏట కన్ను మూశాడు.

క॥నూరార్లు లెక్క సేయక
పేర్లందిన విబుధ జనుల బిలిపించుచు వే
మార్లర్థ మిచ్చు వితరిణి
చార్లేసు ఫిలిప్స్ బ్రౌన్ సాహెబు కరుణన్

అని నివాళులందుకున్నాడు.