సుప్రసిద్ధుల జీవిత విశేషాలు/బళ్ళారి రాఘవ

ఆంధ్రులకు గర్వకారణమైన మహానటుడు

బళ్ళారి రాఘవ

పాత్రల మనస్తత్వాలను బాగా అర్థం చేసుకుని, భావసంఘర్షణను ప్రదర్శిస్తూ నటనకు వెలుగు బాటలు వేసిన బళ్ళారి రాఘవ ఆంధ్రులకు చిరస్మరణీయుడు.

ఆధునిక ఆంధ్రనాటకరంగం బళ్ళారి రాఘవ పుట్టుకతోనే ప్రారంభమైంది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నాటక సమాజాలు ఆంధ్రదేశంలో పలుచోట్ల ప్రదర్శనలిస్తూవుండేవి. ఆ నాటకాల ప్రభావంతో ఆంధ్రదేశంలో కూడా నాటక సమాజాలు వెలిసాయి.

బారెడు రాగాలు, తబలామోతలు లేకుండా భావ ప్రధానమైన అభినయంతో ప్రేక్షకులను రంజింపజేసినవాడు బళ్ళారి రాఘవ.

స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలని చాటి చెప్పి, విద్యాధికులైన స్త్రీలను రంగస్థలమెక్కించి వాస్తవికతకు పట్టం కట్టిన విప్లవ నటుడు బళ్ళారి రాఘవ.

జాతి ప్రగతికి, మూఢాచారాల నిర్మూలనకు నాటకరంగం అత్యంత ప్రధానమైనదని ప్రకటించి, ప్రతి పట్టణంలోను అన్ని హంగులూ కల నాటకరంగం స్థాపించాలని ఎలుగెత్తి చాటిన ప్రజానటుడు బళ్ళారి రాఘవ.

బళ్ళారి రాఘవ 1880 ఆగస్టు 2 వ తేదీన తాడిపత్రిలో జన్మించాడు. తండ్రి నరసింహాచార్యులుగారు బళ్ళారి మునిసిపల్ హైస్కూలులో తెలుగు పండితులు. మేనమామ ఆంధ్ర నాటక పితామహ ధర్మవరం రామకృష్ణమాచార్యులుగారు బళ్ళారిలో న్యాయవాదిగా వుండేవారు.

బళ్ళారి మునిసిపల్ హైస్కూలునుండి మెట్రిక్యులేషన్ పరీక్ష పాసైన రాఘవ మద్రాసులో పట్టభద్రులయ్యారు. బాల్యం నుండి నాటకాలంటే ఎంతో ఆసక్తికల రాఘవ మద్రాసులో, పెక్కు ఇంగ్లీషు నాటకాల్లో పాల్గొన్నాడు. ప్రముఖ ఆంగ్లనటుల మెప్పులందుకున్నాడు. మద్రాసులో బి.యల్. పరీక్ష పాసయ్యాడు.

మద్రాసు నుండి వచ్చిన తర్వాత మేనమామ వద్ద జూనియ‍ర్‍గా వుంటూ నాటకాల్లో అభినయించేవాడు. ధర్మవరం రామకృష్ణమాచార్యుల వారి సరసవినోదినీ సభలోనూ, కోలాచలంవారి సుమనోరమ సభలోను అభినయించేవాడు. ఈ సమాజాలు బళ్ళారిలోనే కాక మద్రాసు, హైదరాబాదు, విజయవాడ,బెంగుళూరు నగరాల్లో ప్రదర్శనలిస్తుండేవి.

రాఘవకు పౌరాణిక నాటకాలకంటే చారిత్రక, సాంఘిక నాటకాలపట్ల ఎక్కువ అభిరుచి వుండేది.

కోలాచలం వారు రచించిన 'విజయనగర పతనము'లో రాఘవ పఠాన్ రుస్తుం అభినయం అత్యద్భుతంగా వుండేది. ఈ నాటక ప్రదర్శనవల్ల హిందూ ముస్లిమ్ సఖ్యతకు భంగం కలుగుతుందన్న అనుమానంతో మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శనను నిషేధించింది.

చాణక్య పాత్రధారిగా రాఘవ మహానటుడని ప్రశంసింపబడ్డాడు. నవరసాలు ఒకటి తర్వాత ఒకటి తరుముకొని వస్తున్నాయా అనిపించేదాయన నటనలో.

రామదాసు పాత్రలో భక్తిభావాన్ని చాలాగొప్పగా చూపేవాడాయన. నాటకంలో స్వయంగా కొన్ని సన్నివేశాలను కల్పించి ప్రదర్శించేవారు. రచనలో కూడా సమయానుకూలంగా మార్పులు చేసేవారు.

తానీషా, రాముణ్ణి నాకు కూడా చూపీంచమని రామదాసును నిర్బంధిస్తాడు. అపుడు రామదాసు, "పిచ్చివాడా, ఎవరి రాముడు వారిలో వుంటాడు - దేవుడొక్కడే. భక్తుల విశ్వాసాలకు తగినట్లు రూపం ధరిస్తాడు. రామ్-రహీమ్, క్రీస్తు, బుద్ధుడు-ఇవన్నీ ఆయన రూపాలు" అంటు మతసామరస్యాన్ని ప్రదర్శించేవారు.

జాతీయోద్యమం ముమ్మరంగా సాగుతున్న కాలమది. రామదాసు జైలులో వుంటూ 'ఆత్మసిద్ధి పొందడానికి కారాగృహవాసమే ప్రథమ సోపానం' అంటాడు.

తానీషా ఆదేశం మేరకు భటులు రామదాసును జైలుకు తీసుకొని వెళ్ళారు. వెళ్ళేముందు భార్య కమలాంబ భర్త నుదుట కుంకుమ పెడుతుంది. ఖద్దరు శాలువా కప్పి, తెల్లని టోపీ అతని తలపై పెట్టి హారతి యిస్తుంది. ఆ కాలంలో గాంధీటోపీ వుండేదో లేదో కాని, రాఘవ యీ సన్నివేశాన్ని కల్పించారు. సత్యాగ్రహం చేసి, జైలుకు వెళ్తున్న ఆకాలంలో ఈ సన్నివేశం ఎంతో ఉత్తేజంగా ఉండేది.

1919 జనవరిలో బెంగుళూరులో జరిగిన ఫెస్టివల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో రాఘవ పఠాన్ రుస్తుంగా ప్రదర్శించిన అభినయాన్ని రవీంద్రనాథ్‍టాగూర్ ఎంతగానో మెచ్చుకున్నాడు.

1927లో గాంధీజీ బెంగుళూరు సమీపంలోని ’నందీహిల్స్’లో విశ్రాంతి తీసుకుంటున్నారు. పండిత్ తారానాథ్ (రాఘవ ఆధ్యాత్మిక గురువు) రచించిన హిందీ నాటకం 'దీనబంధు కబీర్ ' నాటకాన్ని చూడవలసిందిగ, గాంధీజీని బెంగుళూరుకు ఆహ్వానించారు. కొన్ని నిముషాలు చూద్దామనుకొన్నాడు గాంధీజీ. గంట అయినా నాటకాన్ని చూస్తూనే వున్నాడు గాంధీజీ. కార్యదర్శిగా వుండిన రాజాజి, 'ప్రార్థనకు వేళైంది' అని గుర్తు చేశాడు. ’మనం ప్రార్థనలోనే వున్నాం కదా?’ అంటూ గాంధీజీ రాఘవ నటన అద్భుతం అన్నాడు. '’రాఘవ మహరాజ్‍కీజై'’ అన్నాడు గాంధీజీ.

1921 - 24 మధ్య రాఘవ ఆంధ్రప్రాంతంలోని పలునగరాలలో ప్రదర్శనలిచ్చాడు. 1927లో రంగూన్‍లో కూడా ప్రదర్శనలిచ్చి పేరుగాంచాడు.

1928 మే 8వ తేదీన రాఘవ ఇంగ్లండుకు బయలుదేరాడు. లండన్‍లో పెక్కు నాటకాలను చూచి, ఆంగ్లనటుల పరిచయం సంపాదించుకొన్నాడు. విఖ్యాత నాటకకర్త, కళావిమర్శకుడు జార్జి బెర్నార్డ్ షాతో రాఘవ కళల గురించి విశ్లేషణ జరిపాడు. కళల గురించి తెలుసుకోవడానికి మీరు ఇక్కడికెందుకు వచ్చారు? మేమే ప్రాచ్య దేశాలకు రావాలి! అన్నాడు షా. "మీరు దురదృష్టం కొద్ది భారతదేశంలో పుట్టారు. ఇంగ్లండులో పుట్టివుంటే షేక్‍స్పియర్ అంత గొప్పవారై వుండేవారు అన్నాడు.

రాఘవ మిత్రుల వత్తిడిపై 1936లో సినిమా రంగంలో ప్రవేశించాడు. హెచ్.ఎం. రెడ్డిగారి 'ద్రౌపదీ మాన సంరక్షణము'లో దుర్యోధనుడుగా నటించారు. గూడవల్లి రామబ్రహ్మంగారి 'రైతుబిడ్డ'లోను, రాజరాజేశ్వరివారి 'చండిక'లోను నటించాడు. సహజ స్వతంత్రనటుడైన రాఘవ సినీ రంగంలో ఇమడలేకపోయాడు.

రాఘవ సమయస్ఫూర్తి చాలగొప్పది. ఒకసారి 'చంద్రగుప్త' నాటకం విజయవాడ దుర్గాకళామందిరంలో ప్రదర్శింపబడుతూవుంది. చాణక్య పాత్రధారి రాఘవ ప్రళయకాల రుద్రునివలె నందులపై ప్రతీకారంకోసం తపిస్తున్నాడు. స్మశానరంగం అది. అంతలో ఆకస్మికంగా ఒకకుక్క రంగస్థలంమీదికి వచ్చింది. రాఘవ ఏమాత్రం చలించక కుక్కను చూస్తూ 'శునక రాజమా, నీకు కూడా నేను లోకువయ్యానా?' అన్నాడు. కుక్క కాసేపు వుండి వెళ్ళిపోయింది. ప్రేక్షకుల సంభ్రమాశ్చర్యాలతో రంగమందిరం దద్దరిల్లింది.

రాఘవ వృత్తిరీత్యా న్యాయవాది. తాను నమ్మిన సిద్ధాంతాలమేరకు న్యాయంగా వున్న కేసులను మాత్రమే చేపట్టేవాడు. క్రిమినల్ లాయర్‍గా బాగా పేరుతోపాటు ధనాన్ని ఆర్జించాడు. కాని ఆయన మిగుల్చుకున్నదేమీలేదు. నాటక కళాభివృద్ధికే వినియోగించాడు. న్యాయవాదిగ, కళాకారుడుగ పేరు పొందిన రాఘవను 1933లో కొందరు మిత్రులు బళ్ళారి మునిసిపల్‍కౌన్సిల్ కు పోటీ చేయమని ఒత్తిడి చేశారు. రాఘవ, మరి కొందరు మిత్రులు, ప్రముఖ వ్యాపారి ముల్లంగి కరిబసప్ప మున్నగు వారు చాకలి వీధిలో ప్రచారానికి వెళ్ళారు. మిత్రులు ఓటర్లకు రాఘవను పరిచయం చేసి వారికి ఓటు వేయమని కోరారు. ఓటర్లు మౌనంగా వుండి పోవడంతో కరిబసప్ప గారికి కోపం వచ్చి ఓటర్లను తిట్టారు. రాఘవ మనస్సు చివుక్కుమన్నది. వెంటనే ఇంటికి వచ్చి తమ నామినేషన్ పత్రాన్ని ఉపసంహరించుకొన్నారు. వారు ఆనాటి నుండి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైనారు.

రాఘవ కవి పండితులకు అత్యంతాప్తుడు. ఆయన ఇంట్లో సాయంకాలం బళ్ళారిలోని కవి పండితులు సమావేశమై కళ, నాటకం వగైరాల పఠన లేదా చర్చలలో గడిపేవారు. సరసులు అందరినీ ఎంతో ప్రేమతో పలుకరించే వారు.

బళ్ళారి టీచర్స్ ట్రెయినింగ్ స్కూలులో వున్నపుడు, మా పెదనాన్న భాస్కరాచార్య రామచంద్రస్వామి (కవి, పండితుడు) గారితో పాటు రాఘవ గారిని పలుమార్లు కలుసుకొనే అదృష్టం నాకు కలిగింది. వారు నటించిన నాటకంలో చిన్న పాత్రధారిని నేను.

కులమతాల సంకుచితత్వాలకు అతీతుడాయన. హరిజన బాలుర కోసం సొంత ఖర్చుతో బడిని పెట్టించాడు. పండుగ రోజుల్లో హరిజన విద్యార్థులందరికీ తన ఇంట్లో విందు చేసేవాడు.

కళల కోసం ఎంతో ఉదారంగా పైకం ఖర్చు చేసిన రాఘవ పెళ్ళిళ్ళ పేరిట జరిపే దుబారా ఖర్చులకు దూరంగా వుండే వాడు. పెళ్ళికి రూ.250 మించి ఖర్చుచేయరాదనేవాడు. ఆహ్వాన పత్రికలు చేతివ్రాతలో పంపేవాడు.

రాఘవ స్మృతి చిహ్నంగా బళ్ళారిలో కళామందిరం నిర్మింపబడింది. కేంద్ర ప్రభుత్వం, ఆయన శతజయంతిని పురస్కరించుకొని 'పోస్టల్ స్టాంపు' విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యిటీవల టాంక్‍బండ్‍పై రాఘవ విగ్రహాన్ని నెలకొల్పింది.

నాటక కళాభివృద్ధికి రాఘవ చేసిన సూచనలు కార్యరూపం దాల్చినపుడే ఆయనకు నిజమైన స్మృతి చిహ్నం ఏర్పడగలదు.