సింహాసనద్వాత్రింశిక/సప్తమాశ్వాసము

శ్రీరస్తు

సింహాసన ద్వాత్రింశిక

సప్తమాశ్వాసము

క.

శ్రీ సంపన్నకుబేర
ప్రాసాదోపవనపవనపానస్ఫురదు
ల్లాసఫణీంద్ర ఫణామణి
భాసురనిజమూర్తిఁ బరమపావనకీర్తి.

1


క.

మదిలోపలఁ దలఁచుచు న
భ్యుదయం బగునట్టిలగ్నమున గద్దియపై
బదమిడునెడ వారించుచుఁ
బదియాఱవబొమ్మ భోజపతి కిట్లయెన్.

2


పదాఱవబొమ్మ చెప్పినకథ

క.

అతిశయముగ నుజ్జయినీ
క్షితిపతిక్రియ దానగుణము సిద్ధింపక సం
గతిమాలినచేఁతల సుర
పతిసింహాసనముమీఁదఁ బదమిడఁ దరమే.

3


వ.

నావుడు నతనియతిశయగుణజాలం బెట్టి దనిన.

4


మ.

వినుమీ భోజధరాతలేంద్ర! త్రిజగద్విఖ్యాతకీర్తిప్రియుం
డనుకూలక్షితిపాలరక్షణకళాయత్తప్రతాపుండు స
జ్జనచిత్తాంబుజమిత్రుఁ డిష్టవనితాసంభోగపంచాయుధుం
డనఘుం డుజ్జయినీవిభుండు నిజరాజ్యం బింపుతో నేలఁగన్.

5

శా.

ఆరాజన్యశిరోమణిం గొలువ నెయ్యం బొప్పఁగా నింపు పెం
పారం దక్కినభూమిపాలురు మహాయత్నంబుతో రత్నము
ల్నారీరత్నములుం గురంగములును న్నాగంబులు న్మున్నుగా
జేర న్వచ్చి వనంబులో విడిసి రాసీమావిభాగంబులన్.

6


ఉ.

ఇంతులమానభంగము మహీరుహపంక్తులదర్పమూల మ
త్యంతమహోత్సవంబులవిహారము జాణలభోగభాగ్య మా
కంతుని ప్రాపు కోకిలశుకంబుల వాచవిపంట నాఁ బ్రజల్
సంతసమంద నంతట వసంతము వచ్చె వనాంతభూమికిన్.

7


మ.

మొదలఁ దక్షిణమారుతంబు వనభూము ల్సోఁకుచు న్వీఁక ను
న్మదపంచాయుధవహ్నిచిహ్న మగు ధూమంబో యన న్వీవఁగాఁ
దుద లొక్కించుక యెండఁ గందు వెడలం ద్రోచెం గడల్ స్రుక్కఁగాఁ
బద నింకెన్ బిరు సయ్యెఁ బండె బడియెం బర్ణంబు లుర్వీస్థలిన్.

8


క.

కాకులలోఁ గోకిలములు
కాకులఁ బడలేక కులము గలయఁగఁ బవనుం
డాకులపా టొనరింపగ
సాకులపా టయ్యె విరహు లగులోకులకున్.

9


క.

శీలము వదలని పథికుల
తాలిమిఁ దూలించు మారుతముపెల్లున నా
భీలం బగుమదనాగ్ని
జ్వాలలక్రియ బాలపల్లవము. లొప్పారెన్.

10


శా.

ఏచెం గ్రొన్నన మాధవీలతలపై నింపెక్కి సంపెంగలుం
బూచె న్మావులుఁ బొన్నలుం బొగడలుం బొల్పొందె రాచిల్కలు
న్వాచాలత్వము సూపెఁ బుప్పొడి దిశ ల్వాసింప సొంపారఁగా
వీచెం గమ్మనితెమ్మెర ల్మరునకు న్వీచోపులై ప్రాపులై.

11

శా.

కాయం జొచ్చె రసాలము ల్విరహు లాకంపింపఁగాఁ గోయిల
ల్గూయం జొచ్చె మనోజదిగ్విజయ మాఘోషించుచుం దుమ్మెదల్
మ్రోయం జొచ్చె నవీనపుష్పశరము ల్మొత్తంబుగాఁ జిత్తజుం
డేయం జొచ్చె సతు ల్మదిం గలఁగఁగా నెచ్చోటులుం దానయై.

12


సీ.

గంధ బంధురుఁ డైన గంధవాహుండు ము.
        న్నేర్చినపట్టపుటేనుఁ[1] గనఁగఁ
బచ్చపక్కెరలట్లు పక్షంబు లొప్పారు
        వరకీరములు వారువము లనంగఁ
బదహతిఁ బుప్పొళ్ళు పర్వఁగా నేతెంచు
        నలులమూఁకలు కాలిబలము లనఁగఁ
బంచమస్వరములఁ బరిణమింపగఁజేయు
        పికములు కీర్తిగాయకు లనంగ


ఆ.

నేచియున్న మావు లెల్ల గొల్లెన లన
లలిత మైనరాజ్యలక్ష్మి మెఱసి
యితరనృపులభంగి ఋతుచక్రవర్తియు
నతనిఁ గొల్వవచ్చి యచట విడిసె.

13


క.

ఆవృత్తాంతము దెలియం
గా విని సచివేంద్రుఁ డచట గందర్పసఖున్
భూవరులను సక్రియ సం
భావింపఁ దలంచి సార్వభౌమున కనియెన్.

14


ఆ.

ధరణిపాలు రెల్ల ధరణీశ మిముగొల్వ
వచ్చియున్నవారు వనములోన

గౌరవంబు మెఱసి వారల కవసరం
బిచ్చి కరుణఁ జూడ నిచ్చగింపు.

14


క.

ఇంతియకాదు నరేశ్వర
యింతుల తొలువేఁట[2] ఋతువు లేలెడుఘనుఁ డా
కంతుని ప్రాణసఖుండు వ
సంతుం డున్నాడు కొలువఁ జనఁగావలయున్.

15


క.

"కాలో వసంత" యను వా
క్యాలంకృతి నన్నిఋతువులం దధికుడు త
త్కాలోచితపూజలచేఁ
గాలాత్మకుఁ డైనవిభుఁడు కడుఁ బ్రియ మందున్.

16


ఆ.

పూజ్యులైనవారిఁ బూజింపకున్నచో
మేలు దొలఁగునండ్రు మేదినీశ
యష్టసిద్ధు లాది నగపడ్డ వనక నేఁ
డవ్వసంతపూజ కరుగవలయు.

17


క.

అనవుడు నౌఁగా కనినం
జని యుపవనమధ్యమున వసంతోత్సవఖే
లనమునకుఁ దగినవస్తువు
లొనగూర్చి యమాత్యచంద్రుఁ డొయ్యన మగిడెన్.

18


వ.

ఇట్లు మగిడి.

19


ఉ.

పంచశరాధిదేవతలపట్టులుగా మణివేదిపంక్తి ని
ర్మించితి రత్నమండపము మించులబట్టల మేలుకట్లు గ

ట్టించితిం గాంతి దిక్కుల నటింపఁగఁ గాంచనతోరణంబు లె
త్తించితి విన్నవింప నరుదెంచితి రాఁ గరుణించు భూవరా.

20


సీ.

అని విన్నవించిన జనవల్లభుండును
        జతురంగబలములు సరస నడువ
భేరులు శంఖము ల్పెద్దగౌరులు మ్రోయ
        దిక్కుల నినదంబు పిక్కటిలఁగఁ
గవిరాజగాయకస్తవములు నిగుడంగ
        శూరులు ధీరులుఁ జేరికొల్వ
నమ్మహోత్సవమున కాభరణంబులౌ
        నంగనారత్నంబు లరుగు దేరఁ


ఆ.

బ్రజల కెల్లను గన్నులపండు గౌచు
వాయువేగ మనుత్తమాశ్వంబు నెక్కి
గతులఁ ద్రిక్కించి మెఱయుచు గవని వెడలి
యరిగె నుద్యానవనములో నవనివిభుఁడు.

21


ఉ.

అప్పుడు చేరవచ్చి సమయం బిది దర్శనయోగ్యమంచు న
వ్వొప్పెడు కాంతలుం దురగయూథము రత్నచయంబు మున్నుగాఁ
గప్పము లెల్లఁ దెచ్చి మది గప్పెడుభీతి దొలంగ నమ్రులై
యొప్పన చేసి రానృపతు లుజ్జయినీపతికిం గ్రమంబునన్.

22


సీ.

అంగాధిపతి వీఁడె వంగాధిపతి వాఁడె
        నేపాళపతి వాఁడె భూపతిలక
కర్ణాటపతి వీఁడె కాంభోజపతి వాఁడె
        సౌవీరపతి వాఁడె సౌర్వభౌమ
గూర్జరపతి వీఁడె కోంకణపతి వాఁడె
        కుంతలపతివాఁడె కంతురూప

బర్బరపతి వీఁడె పాంచాలపతి వాడె
        మత్స్యాధిపతి వాఁడె మానవేంద్ర


ఆ.

యనుచు వేఱువేఱ నందఱ నెఱిఁగించి
యధిపుచేతఁ గుశల మడుగఁజేసి
వీడియముల గారవింపించె నీతిస్వ
తంత్రబుద్ధి యైన మంత్రివరుఁడు.

24


క.

అజ్ఞనపతు లందఱుఁ దన
పజ్జం జనుదేర మండపములోనికి వి
ద్వజ్జనచింతామణి యగు
నుజ్జయినీధరణిపాలుఁ డొయ్యనఁ జనియెన్.

25


ఉ.

అందు వసంతుని న్రతి ననంగుని లక్ష్మి నుపేంద్రు గౌరి న
య్యిందుకళాధరు న్శచి సురేంద్రుఁ గ్రమంబునఁ బూజచేయఁగా
దుందుభిమర్దళప్రముఖతూర్యరవంబులు నిండ నేర్పున
న్సుందరు లాటపాటల వినోదము సూపిరి తీపులంటఁగన్.

26


వ.

అప్పుడు కర్పూరాదిసుగంధద్రవ్యంబులు వసంతచాలనం బొనర్చెడివారిలోనుండి కలహకంటకుం డను రాచలెంక వెడలి వచ్చుచుఁ దనమీసములను నంటిన సుగంధంబు విదిర్చికొనుచుఁ జూచిన నెదుర నున్న యేకాంగవీరుం డను నంగపతిలెంక తనదు దురభిమానంబునం గనలి.

27


క.

ఏరా ముందఱ గానక
నేరమి పైఁ దెచ్చుకొనుచు నీమీసలు నా
చేరువ వడిపెట్టెద విది
యోరీ యేకాంగవీరుఁ డుంట యెఱుఁగవే.

28


క.

నావుడుఁ బరిమాళించెద
నీ వుండుట యెఱిఁగి కాదె యిది వ్రేటుగ నేఁ

గావించెదఁ బేరికిఁ దగు
లా వించుక కలిగె నేని లటపట లేలా.

29


వ.

అనినం దివియు మనుచు నయ్యిద్దఱుం గప్పిన దుప్పట్లు తొలంగవైచి జిఱ్ఱునం గఠాగంబులు డుస్సిన డగ్గఱంగల తలవరు లెడసొచ్చి పట్టి తొలంగం దిగిచి యీమహోత్సవంబులో నిట్టిగలబలు సేయ మీయట్టిబలుబంట్లకు సందిక్రంతలజగడంబులు వలదని తోడ్కొని చని రత్నమండపముఖశాల యైన కొల్వుమండపంబులో నున్న గోవిందచంద్రుం డనుపడవాలుముందటం బెట్టి యీకలహకంటకుం డంగాధిపతిలెంకతోఁ బోట్లాడఁగ డగ్గఱునెడ మానిపించి యిద్దఱం దోడితెచ్చితి మవధరింపు మనిన నతండును.

30


క.

తగునోయి కలహకంటక
జగడంబులు సేయ నొండు సమయము లేదే
పగపాటి నీకు నితనికిఁ
దగిలిన దీవిందుతో వితండము గలదే.

31


ఆ.

అనుచు నతని దూఱి యాతనిదెసఁ జూచి
యితనితోడ జగడ మేల యయ్యె
ననుడు నతఁడు వలికే నను నితఁ డిప్పుడు
వేసెఁగాన నిట్టివివర మయ్యె[3].

32


క.

ఆపడవాలును దమభటుఁ
గోపించుచుఁ గవుల బాఠకుల శూరుల నా
లోపలఁ గూర్చుండఁగ నిడి
యాపొడి దగంగఁ దీర్పుఁ డని నియమించెన్.

33


సీ.

వారలు నేకాంగవీరుఁడ వ్రేటున
        కైతగిలినవాఁడ వనుచుఁ జూచి

కలహకంటక యేల కలహంబు గైకొంటి
        వనుడుఁ బోట్లాడ వేడ్కయ్యె ననుడు
మఱి ఠావు లేదె యీమర్మ మేర్పడఁ జెప్పు
        మనపుడు వ్రేయుట యది నిజంబు
నామీసములసుగంధము విదిర్చికొనంగ
        నితఁడు నే నుండుట యెఱుఁగ వనిన


ఆ.

మాటమీఁద నదియె వ్రేటుగాఁ జేసితిఁ
బిఱికి వీఁడు బురుకపిట్టయంత
గాని లేఁడు వీనిఁ గైకొందునా నేను
జెండి పాఱవైతు భండనమున.

34


వ.

అని పలికినఁ గలహకంటకుం గోపించి తుచ్ఛపుంబలుకులు పలుకుదురె పగవాని ఘనతచేసినఁ దనదొడ్డతనం బెక్కుడగు నతని హీనంబుగాఁ బలికిన సరిపూనికెం దానును హీనుం డగు నింతియ కాదు విక్రమార్కుండును నంగాధిపతియును మిత్రులు వారికన్నులం బుట్టిన కొడుకులు మీలో జగడంబు వలవదు.

35


క.

మగతనము నెఱపఁ బూనియుఁ
బగ యేమియు లేనిచోటఁ [4]బరిమాళింపం
దగ దతనికి నది నీకును
దిగులువడ న్నిలువనాడఁ దగ దాతనితోన్.

36


గీ.

అనఁ గలహకంటకుం డను నల్ల నవ్వి
పంతమౌ మీరెఱుంగని పాడిగలదె
గుడికొలువుబంటు మల్లనికొలఁది పంత
మయ్యె నిచ్చట నదియెట్టు లంటిరేని.

37

వ.

ఒకఁడు దేవరభాండాగారంబు నింటికడం బాలెము వడం గొలిచి పళ్లెరంబులఁ బ్రసాదంబు దినుచుఁ బోతుక్రియ నుండ నొకనాఁడు దేవర దర్శింపవచ్చి వారిసందడిలో నొక్కయీడిగ తనకాలు దొక్కినం గోపించి యేమిరా బంటుమల్లు న న్నెఱుంగవా తన్నితి వనిన నతండు నే నేఱుంగన యీసందడిలోఁ గాలు దాఁకె ననిన నెరయం దన్ని యెఱుంగ ననినం బోనిచ్చెదనా యనుచు నందంద దట్టించిన నయ్యీడిగ డాకేలి కటారి వలకేల సందుకొని తన్నినాఁడ నేమనియెదవురా యనిన నతని బిఱుసు చూచి బంటుమల్లండు స్రుక్కి యేమియు నే మనియెద దేవర కూడిగంపుబంటుం గాన దోస మనియెద ననియెం గావున.

38


క.

ఆపంతము గాకుండఁగ
నా పేరును నతని పేరు నాణెంబులుగా
మీపిన్నవాండ్ర మమ్మును
జేపట్టి యొకింతవేడ్క సేయింపఁదగున్.

39


వ.

అని మ్రొక్కిన నట యంగపతిభటుండు.

40


ఆ.

మీకుఁ బిన్నవాఁడ నేకాంగవీరుండ
ఱంకెవైచిన నడబింక మైన
నగినఁ గేరడించిన న్మీసలంటినఁ
[5]బట్టి తివియ నాకుఁ బాడిగాదె.

41


ఆ.

నృపులు గవులు భటులుఁ గృపణులు శూరులు
నొక్కచోటఁ గూడియున్నవారు
వీరు మెచ్చ మమ్ము విడిచి మన్నించుట
ఘనత యిదియు మీకు ననుచు మ్రొక్కె.

42

క.

అమ్మాటలు విని పెద్దలు
మమ్మిట మన్నించి మీరు మాకిట జగడం
బిమ్మనినఁ గలహకంటకుఁ
డెమ్మెయి మెయికొనక యున్న నిరవడనిమతిన్.

43


వ.

మీర లిద్దఱు రాచలెంకలు గావున నారాజులు సూడంగఁ బోట్లాడవలయు నాయితపడి రం డనిన మాకు నిదియ యాయితంబు బంటువానికిం గటారి చేత నున్నంజాలదె యనుడు నేమియు బంటుతనంబునకుఁ గొఱఁత గాదు రాజు వెడలివచ్చునంతకుం బోయి రండని యొండొండ యనిపినం జని రనంతరంబ.

44


సీ.

కఱకంచువలిపెంబు గట్టిగాఁ గాసించి
        చెలిత్రాడు కాసెపై బలియఁజుట్టి
దేహంబు కప్పుగా లోహకంచుకలీల
        జిగిబిగిగల నల్లజిగు రమర్చి
వక్షఃస్థలంబున రక్షపూసలపేరు
        దండతాయెతులును దగ ధరించి
తిలకంబు దళముగాఁ దీర్చి చుంగులపాగ
        తలముడితోఁ జొళ్ళె మలవరించి


ఆ.

కేలఁ బుల్లతియును నీలి నూలునఁ బూని
కేలిగతిఁ గటారికోల వట్టి
సంగడీలు గొల్వఁ జనుదెంచె నొకమత్త
గజముఖంగి కలహకంటకుండు.

45


వ.

అటఁ గొందఱు సంగడీలం గూడి.

46


క.

నగుమొగ మలరఁగఁ గస్తురి
తిగురు మెయి న్నలఁది గాసె దిటమై మెఱయన్

మగతనముఁ గటారియుఁ దో
డుగ నయ్యేకాంగవీరుఁడుం జనుదెంచెన్.

47


సీ.

అపుడు చుక్కలలోన నమృతాంశుగతి దోఁప
        రాజులు గొలువంగ రాజు వెడలి
వచ్చినఁ దత్పరివారసమేతుఁడై
        పడవాలు డగ్గఱి భటులఁ జూపి
వారివైరముఁ బరివారంబుఁ దగవును
        మున్నుగా నన్నియు విన్నవించె
దనలెంకఁ దిట్టి యిద్దఱ నొక్కటిగఁ జేయ
        భట్టి నంగాధిపుం బాలుపెట్టె


ఆ.

వారు మాకు సెలవుగా రెండుమాటలు
విడువుఁడనియు నృపునివెఱపు సూపఁ
బనిచెఁ గర్త గాన బంటుతనమునకు
విడుతురయ్య. .......

48


క.

నావుడు నిద్దఱుఁ జని పృ
థ్వీవరునకు వాండ్రచలము వినిపించిన నే
నీవీరుల నొప్పించుట
భావం బొడఁబడ దటంచుఁ బతి చింతించెన్.

49


క.

ఆవేళ నమాత్యుండు మ
హీవర నీమాట సేయ రేమనవచ్చున్
లావరులై లెంకల మని
కావరమున నున్నవారు గైకొన రొరులన్.

50


ఆ.

పసుల కుయ్యి గాదు బ్రాహ్మణు చెఱ గాదు
స్వామి హితము గాదు వ్రతము గాదు

లోకహితముగాని యేకాంగిపోరునఁ
జచ్చువాని కేమి స్వర్గమౌనె.

51


వ.

నావుడు వీరకులోత్తముం డగు వీరకులోత్తముండు.

52


ఆ.

మానభంగ మైనమరణంబు శూరుల .
కదియ చూడ నాత్మహత్య గాదె
యాత్యహత్య పాప మది నీవ యెఱుఁగుదు
పాప మొందకున్న బ్రదుకు బ్రదుకు.

53


వ.

వ్రేసినవ్రేటును గాఁడినమాటయును లేకయుండుటది మహావ్రతంబు.

54


క.

బొంకుట సుర సేవించుట
బొంకమి వేయశ్వమేధములఫలము భటుం
డంకమున సత్యమునకై
శంకింపక వచ్చెనేని స్వర్గము గాదే.

55


క.

అది యెట్లనినను మిత్రుఁడు
మదిఁ గలఁగెడుననియు వీండ్రు మడిసెదరనియుం
గొదికెడు నామన మనవుఁడు
నిదియెంత ప్రసంగమనుచు హితమతిఁ బలికెన్.

56


క.

[6]అంగాధిపతియు నేనును
ముంగల నిరుదెసల నిల్చి మొనయుకఠారుల్
ఖంగనఁగఁ బట్టి బంట్లకు
భంగము గాకుండ మనసుఁ బట్టెద మనఘా.

57


క.

అనునెడ నిద్దఱు బంటులుఁ
జనుదెంచి కడంక మొక్కి జనవర మముఁ జూ

డ నవధరించియు విడుమా
యనవుడుఁ బంతముల కొలఁదు లడిగె న్వారిన్.

58


వ.

అప్పు డొక్కదండనె పోట్లాడంబూని యేకాంగవీరుండు.

59


సీ.

పుల్లతి వెట్టిన భూమికిఁ గొసరిన
        నెదిరిపోటునకుఁ జేయొదుఁగుచున్న
దండకై దప్పినఁ దప్పుగ్రే ళ్లురికిన
        బంతంబు గొన్నఁ జౌబళము గొన్న
దాణికిఁ జొచ్చిన దాఁచిన మానిన
        సరువనొడ్డిన బయలాసపడినఁ
జాఁగఁబొడువకున్న లాఁగంబునకుఁగొన్న
        మడమగెంటినవ్రేళ్ళు మగుడబడిన


ఆ.

దాఱుమాఱులైనఁ దలవంచి పొడిచిన
బారుగా దలంచు పంతమిదియె
కదిసి యొక్కపోటు పదిముఖంబులుగాగఁ
బొడుచువాఁడ దేవరడుగులాన.

60


వ.

అను నంతకమున్న వానిపంతంబుల కొలందిం బుల్లతిమున్నగా నన్నియుం గొని యున్న కలహకంటకుండు.

61


సీ.

మతిఁ గాకదృష్టి నేమఱక రక్షించుచు
        సూకరదృష్టిమై ఢాక గొలిపి
గర్జన సేయక మార్జాలదృష్టిమైఁ
        దరలక పరుజించి తాఁకఁబూని
భల్లూకదృష్టి నపాంగసంగతి గని
        కపిదృష్టి వంచించి కాపుసూపి
చేష్ట దప్పక గృధ్రదృష్టి గనుంగొని
        యొయ్యన ఫణిదృష్టి నొడియఁజూచి

ఆ.

మనసుదేఱఁజూచియును జూడకున్నట్లు
దృఢముగాఁగఁ జోరదృష్టి నడఁగి
జంకిమీఁద నొడిసి శార్దూలదృష్టిఁ బై
బడుట సురియకాండ్ర పంతమిదియ.

62


క.

తొమ్మిదిదృష్టులలో నా
యిమ్మగు పులిదృష్టిఁ జొచ్చి యెదుఱొమ్ము కఠా
రమ్మున నది తొలుపోటుగ
గ్రుమ్మెద నేనొండు లేక కుంభినిఁ గూలన్.

63


వ.

అనుడు వింతపంతంబుల కచ్చెరు వంది పొందుగాఁ జూచి విడువుం డన భట్టియు నంగాధీశ్వరుండును నిలువంబడి విస్తారంబు గలుగ వైహాళి దీర్చి యెల్లజనులం గూర్చుండనిడి గలబపుట్టకుండ నెడ నెడం దలవరుల నిలిపి పట్టెడువారల మాటమాటలలోనఁ బట్టుం డని నియమించి నలువురుబంట్లనడుమనిడి కఠారంబు లొక్కకొలందిగాఁ గొలిచి నిమ్మపండ్ల దొడసి యెడగలుగ బంట్లచేతి కిచ్చినం బమ్ముకొని యవ్వీరులు చూచువారిచూపుగముల కెల్లఁ దార లక్ష్యంబు లగుచు ధీరధీరంబుగఁ జొచ్చి.

64


క.

మ్రింగెడు కృష్ణోరగముల
భంగి న్బెబ్బులులక్రియ నిభంబులకరణిన్
సింగములభాతి నలవడు
సంగతితోఁ గదిసి రెల్లజనులుం బొగడన్.

65


వ.

కదియుచుం గలహకంటకుండు తెలిసి పొడువు మోయన్న యని తెలుపుచు ఘాత గొనంగ నోహో చాలుం బట్టుం డని యిద్దఱం బట్టించి భట్టి నృపునిదగ్గఱం దెచ్చి వీరిజగడంబులు సంతసపడియె[7] ననిన.

66

క.

విను కలహకంటకుఁడ గ్ర
క్కున నాతని గౌఁగిలించుకొను మనవుడు నే
మని సంతసపడుదు మొకటి
యును వీడము పోటులాట యుడిపితిరేలా.

67


గీ.

అనుడు దెలిసి పొడువుమ మాయన్న యంటి
యన్నదమ్ముల కొకకలహంబు గలదె
యనిన దక్కలపడుచు నెట్లాడిరేని
నేమి దప్పగు ననుడు మంత్రీశ్వరుండు.

68


క.

ఓకలహకంటకుడ యిది
నీకొఱకై కాదు శత్రునిన్ డగ్గఱుచుఁన్
రాకొట్టి పిలిచి మది ను
ద్రేకము పుట్టించి పోటు దెలుపఁగవలయున్.

69


ఆ.

కవులు పొగడువేళఁ గాంతలు రతివేళ
సుతులు ముద్దువేళ శూరవరులు
రణము సేయువేళ రాకొట్టి పిలుచుట
పాడి యిదియ మిగుల భజన కెక్కు.

70


వ.

వెండియు నీ వెంత చలంబు గొన్నను గారణంబు లేనిజగడంబు గావున భగవతియు బేతాళుండును నట్లాడించి రింకఁ బాడిగాని చేతలకుం జొరక రమ్మని డగ్గఱం దిగిచిన నప్పుడ రాజులుం బరివారంబును బ్రజలు నిదియ పంతంబనం గలహకంటకుండును నేకాంగవీరుండును గౌఁగిలించుకొని యొడయని యడుగులం బడిన.

71


మ.

ధరణీనాయకుఁ డిద్దఱ న్సమముగా దాంబూలజాంబూనదాం
బరభూషాదుల నాదరించి వరుసం బార్శ్వంబుల న్రాజులుం

బరివారంబుఁ గవీంద్రులుం గొలువఁగా భద్రాసనాసీనుఁడై
సరసాలాపకథానుకర్జనముల న్సంప్రీతితో నుండఁగన్.

72


క.

ధనహీనుం డొకవిప్రుం
డనువగుచోఁ బెండ్లి సేయ నర్థము వేడం
దనయచెయి పట్టుకొనుచుం
జనుదెంచెన్ దైన్యవృత్తి జనపతికడకున్.

73


చ.

దినకరతేజుఁడౌ జనపతిం గని దీవన లిచ్చి విప్రుఁ డి
ట్లనియె నృపాలశేఖర దయాపరిపూర్ణ మదీయభాగ్యజీ
వన యిది నాతనూభవ వివాహము సాగదు నేఁడు మేరగా
నెనిమిదియేఁడు లయ్యె ధనహీనుఁడఁ గావున వేఁడవచ్చితిన్.

74


సీ.

రాజ్యంబు వదలక రసికత్వ మెడలక
        జయశీల ముడుగక నయము చెడక
దీనులఁ జంపక దేశంబు నొంపక
        నిజ ముజ్జగింపక నేర్పు గలిగి
విపులఁ జుట్టాల వెన్ను సొచ్చినయట్టి
        వారిని గొల్చినవారిఁ బ్రజల
హర్షంబుతోఁ గాచి యన్యాయ ముడుపుచు
        మున్ను చెప్పినరీతిఁ జెన్ను మీఱి


ఆ.

చేత లొండు లేక ప్రాఁతల విడువక
యశము కలిమి దమకు వశముగాఁగ
వసుధయేలు రాజవర్గంబులోన న
య్యాదివిష్ణుమూర్తి వండ్రు నిన్ను.

75


వ.

ఈసీసపద్యంబులో గీతసహితంబుగా నాఱుపాదంబుల మొదలియక్షరంబులు, నందర్థంబుల మొదలియక్షరంబులుఁ గ్రమంబునం గూడుకొనంగ

నైన నా విన్నపం బవధరింపు మనిన నచ్చెరు వంది క్రమ్మఱం జదివించి మొదళ్ళ నర్ధంబులఁ బండ్రెండక్షరంబుల నిడుకొని “రాజ దీని వివాహము చేయవయ్యా" యని యున్న బంధకవిత్వంబున కతివిస్మితుండై తద్దైన్యం బుడుపం బూని.

76


క.

జననాయకుండు విప్రున
కెనిమిదికో ట్లర్థ మిచ్చి యెల్లనరేంద్రుల్
తనుఁ గొల్చి నడువఁగా నొ
య్యనఁ బురి కరుదెంచె వైభవాఢ్యత మెఱయన్.

77


క.

కావున నీ వాతని సరి
కావు నృపా మగిడిచనుట కార్యం బనినన్,
భావమునఁ దద్గుణము సం
భావించుచు భోజవిభుఁడు మగుడంజనియెన్.

78


వ.

మఱియుఁ గొన్నిదినంబు లరిగినఁ బదియేడవవాకిటం జనం జూచి.

79


పదునేడవబొమ్మ కథ

క.

నీలాంబరసోదరు రజ
నీలాంఛనదివసచిహ్ననేత్రవిలాసున్
నీలగ్రీవప్రియసఖు
నీలోత్పలనీలవర్ణు నీలారమణున్.

80


శా.

తాత్పర్యంబున సంస్తుతించుచుఁ బ్రశస్తం బైనలగ్నంబునన్
సత్పాత్రప్రదిపాదితార్థుఁడయి భోజక్షోణిపాలుండు సం
పత్పూర్ణంబగు వైభవంబు మెఱయ న్భద్రాసనం బెక్కఁగాఁ
దత్పాంచాలిక నిల్వు నిల్వు మని తంత్రస్ఫూర్తిగా నిట్లనున్.

81


క.

నృపరత్న మైనయుజ్ఞయి
నిపతిక్రియ సాహసాదినిపుణత్వము న

త్యుపకారంబును గలుగక
చపలమతీ దీని నెక్కఁ జనునే నీకున్.

82


క.

ఉర్వీనాయకుఁ డయ్యును
నిర్వాణుల మీఱి యర్థనిస్పృహుఁ డగునా
సర్వజ్ఞుని సద్గుణములు
నిర్వచనముగాఁగ వినుము నే వినిపింతున్.

83


క.

మాటలయం దెఱిఁగెద వే
నాఁటను ముంజేతికంకణంబున కద్దం
బేటికి వితరణగుణమునఁ
బాటిల్లెడి గుణము లెల్లఁబ్రభువుల కుర్విన్.

84


క.

మతిగలిగి చదువుఁ జిలుకలు
[8]హతమందంగాను బోటులాడుం బశువుల్
వితరణ మెవ్వనిగుణమగుఁ
జతురుఁడు శూరుండు నతఁడె జనులం దెల్లన్.

85


ఆ.

విక్రమార్కుబాహువిక్రమం బుర్విలో
నరులచేతనెల్ల నరులు గొనఁగఁ
గీర్తనియ మైన కీర్తిఁ గీర్తించుచు
నర్థు లర్థములఁ గృతార్థు లైరి.

86


సీ.

ఆదివసముల వర్షాత్యయోచితముగా
        దలమైన వానలు వెలుచునంతఁ
దెల్లవాఱినయట్టితెఱఁగున నావేళఁ
        దనమేళనం బెల్లజనులు వొగడ

హంసనాదములు కాహళలు గాఁ దత్ఫక్ష
        లఘుతాడనములు తాళములు గాఁగ
మదములఁ గ్రోలు తుమ్మెదల ఝుంకారమ్ము
        లమరినవీణాస్వరములొ యనఁగ


ఆ.

యోగనిద్రఁ జెందియున్నవిష్ణుని మేలు
కోటుపఁగడగు గాయకుం డనంగ
బంధుజీవహర్షపర మౌచుఁ దద్రాగ
మయముగా శరత్సమయ మొనర్చె.

87


క.

శరదాగమమున నంభో
ధరపటలము విచ్చి చనిన దపనుండు మహా
కరి తెరవెల్వడు క్రియఁ బు
ష్కరవిలసన మలరఁ జెలఁగెఁ గరసత్వమునన్.

88


క.

పంకంబు లాఱె నేఱుల
పొంకంబులు డిగ్గి ఱెల్లు పూచెను భువి ని
శ్శంకముగ నంచపిండు కొ
లంకుల విహరించె నట జలమ్ములు దేఱెన్.

89


ఉ.

దీప్రముఖంబు లౌచు నలుదిక్కులు నేర్పడ దుగ్ధసింధుపూ
రపభ నొప్పువెన్నెలలు రాత్రి దివాకృతిఁ దేజరిల్ల లో
కప్రియుఁ డైనచంద్రు సమకక్ష్యలఁ జుక్కలు నిక్కఁగాఁ దదీ
యప్రతిబింబలీలఁ గుముదావళి వొల్చె సరోవరంబులన్.

90


ఉ.

తెల్లనిరాజహంసలను దెల్లనికల్వలఁ దెల్లఁదమ్ములం
దెల్లని ఱెల్లుఁబువ్వులను దెల్లనిశీతమరీచిరోచులం
దెల్లనిచుక్కలన్ జగము తెల్లనయై యమృతాబ్ధి మీఱినం
దెల్లనికన్నుదోయిగల దేవర వచ్చె శరత్తు చూడఁగన్.

91

క.

జడి గాక వెట్ట గాకయు
వడ గాకయుఁ జలియుఁ గాక వఱపిది యనియే
ర్పడక యిలుఁ బసిమిపండఁగ
బడుగులు ప్రియమంది రనఁగఁ బ్రభులకుఁ దగదే.

92


చ.

అవని నవంతిభూమివరుఁ డాదిగఁ బార్థివు లెల్ల లక్ష్మియు
త్సవములు మున్నుగాఁ గడుఁబ్రశస్తములౌ సమయంబులందు స
త్కవులను బాఠకోత్తముల గాయకుల న్నటుల న్వితీర్ణివై
భవములఁ దన్పఁజొచ్చిరి ప్రభావసమృద్ధుల నిండు పుట్టఁగన్.

93


ఉ.

అట్టిదినంబుల న్నృపకులాగ్రణిదానసమృద్ధి యొక్కెడన్
బట్టు నుతింపఁగాఁ బరనృపాలకు లచ్చెరువంది మెచ్చ నా
యట్టిమహీశుఁ డర్థులఁ గృతార్థులఁ జేయుచుఁ గీర్తిచేకుఱం
బెట్టెడు నట్టిసద్గుణముపెంపున నాతని మీఱనోపఁడా.

94


క.

అని యడిగిన నాబ ట్టొ
య్యన నవ్వుచు నోనృపాల హరునిప్రసాదం
బున సిద్ధపురుషుఁ డగు నా
జననాథుఁడు గుణములందు సామాన్యుండే.

95


ఉ.

దానక్షాత్రంబులు నా
మానవపతియందకాని మఱి యొండుదెసం
గానము విను మాతని సరి
వూనెద మనఁ దరమె తరణిపుత్రునకైనన్.

96


మ.

అనినం జిత్తములోన లజ్జయు వృథాహంకారముం బుట్టఁగాఁ
దనలోఁ దాన యడంచికొంచు మృదువస్త్రస్వర్ణభూషాదు లా
తని కింపొందఁగ నిచ్చి పుచ్చి పిదపన్ దానంబున న్విక్రమా
ర్కునిసాదృశ్యము నొందఁగోరుమతి నాక్షోణీశ్వరుం డుండఁగన్.

97

సీ.

ఒకనాఁడు కొల్వులోనికి సిద్ధుఁ డొకరుండు
        చనుదెంచి సుఖగోష్ఠి జరపునపుడు
తాపసోత్తమ నాకు దానగుణంబున
        విక్రమార్కుని మీఱ వెరవు గలదె
యనవుడు సాహసహవనంబు చేసిన
        సిద్ధించు నందుల చేఁత వినుము
యోగనీచక్రంబు నొందుకుండములోన
        నొక లక్ష గోఘృతాహుతులఁ బోసి


ఆ.

పొదలఁజేసి మేను పూర్ణాహుతిగ వేల్చి
వెనుకఁ దత్ప్రసాదముననె బ్రదికి
దానవిభవమునకుఁ దగినంత వేఁడుము
మెఱసి సాహసాంకు మీఱవచ్చు.

98


చ.

అనవుఁడు నుత్సహించి నృపుఁ డాతని వీడ్కొని రాత్రి సర్వయో
గినులఁ దలంచుచుం జని సకీలకమంత్రజపంబుతోఁ దదీ
యనిలయవహ్నికుండమున నాహుతు లన్నియుఁ బోసి తెంపునం
దనువును వేల్చె నిత్యమగు దానము దేహముకంటెఁ దీపిగాన్.

99


క.

ఆయెడ యోగిను లాజన
నాయకు బ్రదికించి నిలిపి నరనాథ! మము
న్నీయత్నంబునకుం దగ
నేయిష్టంబైన నడుగు మిచ్చెద మనుడున్.

100


క.

దండాకృతిగా జనపా
లుండును ధరఁ జాఁగి నిచ్చలును ధనములు నా
భాండాగారము లేడును
నిండం గరుణింపుఁ డనిన నేర్పున వారున్.

101

క.

నిచ్చలు నీవిటు చేసిన
నిచ్చెద మీకొలఁది నిండు లేడును నిండ
న్వెచ్చించుకొమ్ము నావుడు
నచ్చట నృపుఁ డియ్య కొని గృహంబున కరిగెన్.

102


ఉ.

ప్రొద్దున లేచి యిండ్లు ధనపూర్ణము లౌట యెఱింగి యాత్మలోఁ
దద్దయు సంతసిల్లి వసుధావరుఁ డుజ్జయినీశు మీఱుచుం
బెద్దల నంధులన్ హితులఁ బేదల నందఱఁ గూర్చి యర్థముల్
దొద్దలు చేసే దాననిరతుం డనఁ బైకము చిక్కకుండఁగన్.

103


క.

ఈగతి ననుదినమును భాం
డాగారములెల్ల రిత్తలైనం దనువ
య్యోగినులకు నాహుతిగ ని
యోగించుచు నిచ్చ ధనము లొసఁగుచునుండున్.

104


ఉ.

ఈక్రియఁ బర్వుకీర్తి నుతియించుచు యాచకు లెల్లఁ జెప్పఁగా
నాక్రమ మేర్పడ న్విని ప్రియంబును జోద్యము నగ్గలింపఁగా
విక్రమభూషణుఁడు మునివేషముతో నట కేగి యోగినీ
చక్రగృహంబులో నతనిసత్త్వముఁ జూడఁ దలంచి యుండఁగన్.

105


ఉ.

ఆనగరంబులోని నృపుఁ డల్లన రే యరుదెంచి మంత్రని
స్ఠానిరతాత్ముఁడై జపము సల్పి ఘృతాహుతులిచ్చి యగ్నిలో
మేనును వేల్చి యోగినులమెచ్చున దొల్లిటిరూపు దాల్చి యా
పూనిక నర్థము ల్వడసి పోయి భజించె వితీర్ణిఁ గర్ణుఁడై.

106


క.

మఱునాఁటిరాత్రి మునుకడఁ
దఱి యెఱిఁగి యవంతివిభుఁడు దయదైవాఱం
గొఱఁతపడకుండ వెరవుగ
నెఱమంటలకుండ మున్న యెడ కరుదెంచెన్.

107

క.

ఆ హోమకుండమునఁ దన
దేహము వేల్వంగ నచటి దేవత లెలమి
న్సాహసము మానుపుచు నీ
యీహిత మేదేని వేఁడు మిచ్చెద మనినన్.

108


ఆ.

ఇచటి భూమిపాలుఁ డీక్రియ నిచ్చలు
మిడుకునగ్నిలోనఁ బడక మున్న
యతనియిండు లెపుడు నర్థంబుచే నిండి
యుండునట్లుగ వర మిండు చాలు.

109


క.

అనవుడుఁ గొనియాడుచు న
ట్లొనరించెద మనుచుఁ బలికి యోగిను లంతం
జనిరి నిగూఢుండై నృపుఁ
డు నవంతికి మగిడె నొక్కఁడును బెంపెక్కన్.

110


సీ.

తదనంతరంబ యాతఁడు తొంటిక్రియ వచ్చి
        యాగంబు సేయఁగా యోగమాత
లరుదెంచి నృపుని ప్రయాసంబునకు నడ్డ
        మై విక్రమార్కధాత్రీవిభుండు
తనమేను వేల్వఁ గైకొని మమ్ము మెచ్చించి
        నీయిండ్లు ధనమున నిండఁజేసె
నిచ్చలుఁ జావక విచ్చలవిడి ధన
        మెంతైన నర్థుల కిచ్చికొమ్ము


ఆ.

నావుడు నతండు దురభిమానంబు విడిచి
విస్మయంబును లజ్జయు విస్తరిల్ల
మీజఁ జూచటు తనుమీఱి మెఱసినట్టి
యతనిఁ బొగడుచు నగరికి నరిగెఁగాన.

111

క.

నీవును నాక్రియ నింటికిఁ
బోవుట మే లనుచుఁ గనకపుత్రిక వలుకం
గా విని యాతఁడు నుజ్జే
నీవల్లభు కృపయుఁ దెంపు నేర్పునఁ బొగడెన్.

112


క.

లగ్నము దప్పినచొప్పుల
భగ్నంబగు యత్నమునకుఁ బౌరులు మది ను
ద్విగ్ను లయి చనఁగ లజ్జా
మగ్నుండై భోజరాజు మగుడం జనియెన్.

113


పదునెనిమిదవ బొమ్మకథ

వ.

తదనంతరంబ యొకదినంబున నష్టాదశద్వారంబునం బ్రవేశోన్ముఖుండై.

114


క.

వెలిపట్టును బులితోలును
మలయజమును బూదిపూఁత మణులున్ ఫణులుం
దిలకము నెఱగన్నుం గల
వెలఁదియు మగవాఁడునైన వేల్పుఁ దలంతున్.

115


మ.

అని భోజక్షితినాయకుం డమరపీఠారోహణవ్యగ్రుఁడై
చనుదేరం గని బొమ్మ వల్కె ధరణీశా విక్రమాదిత్యు చా
డ్పున వేడ్కన్ ఘనధైర్యము న్వితరణంబు న్లేక నీ కీమహా
సన మెక్కం దర మౌనె యాతని మహోత్సాహంబు సామాన్యమే.

116


క.

జనవర నిర్వచనముగా
విను ముజ్జయినీవిభుండు విష్ణునిక్రియఁ బా
లనశక్తి మెఱసి మనుజుల
మన మలరఁగ మనుపుచుండి మహి యేలంగన్.

117


ఉ.

క్రూరుఁడు నీరసాత్ముఁడును గుచ్చితబుద్ధియు దూషకుండు నా
దారవిహీనుఁడున్ ఖలుఁడు సత్యవిదూరుఁడు దుర్నయాఢ్యుఁడుం

జోరుఁడు నస్థిరుండు నలసుండును దుర్బలుఁడు న్మదాంధుఁడు
న్మారవికారకష్టుఁడును మందుఁడు మందునకైన లేఁ డిలన్.

118


క.

ఆదివసంబులలో నొక
వైదేశికుఁ డరుగుదెంచి వసుధాపతిచే
నాదృతుఁడై యతనికి నా
నాదేశస్థితులు నేర్ఫునం జెప్పంగన్.

119


ఆ.

మాటలందె యతని మహియెల్లఁ దిరిగిన
మనుని సిద్ధపురుషుఁగా నెఱింగి
మిగుల నాదరించి జగతీవరుండు త
త్కథలు వినుచు మఱియుఁ గౌతుకమున.

120


క.

నిశ్చయముగ భువిఁ దీర్థపు
రశ్చరణాసక్తి నుత్తరము దక్షిణముం
బశ్చిమముఁ దూర్పుఁ దిరిగితి
వాశ్చర్యం బేమిగంటి వానతి యిమ్మా.

121


క.

నావుడు నాతఁడు నేఁ బృ
థ్వీవలయం బెల్లఁ గలయఁ దిరిగితి నుదయ
గ్రావసమీపంబున నా
నావిధమణిరమ్య మైననగరము గంటిన్.

122


క.

కనకాహ్వయ మగు నగరము
కవకాచలతట మనంగఁ గాంతిం బొలుచున్
ఘనమండల మందుచు న
ర్కునిమండల మనఁగఁ బసిఁడిగుడి గల దచటన్.

123


క.

సూర్యప్రభయను నది త
త్పర్యంతమునందునుండి పాఱఁగ నతిగాం

భీర్యంబు గలిగి నడుకొని
మర్యాదనె నీరు నిలిచి మడుఁగై యుండున్.

124


ఆ.

అచటఁ జంద్రకాంతఖచితసౌపానమై
నాల్గుదెసలఁ గాంచనంబులైన
హర్మ్యముల భజించు నఘనాశనం బనఁ
గలదు తీర్థము కడ గానరాదు.

125


మ.

విను మావింధ్యమునందుఁ బ్రొద్దున శిరోవిన్యస్తపీఠాంకమై
కనకస్తంభము పుట్టి పుట్టి యినుఁ డాకాశంబు వ్రాఁకంగఁ దా
నును చొప్పునఁ జక్కఁగాఁ బెరిఁగి భానుం జేరి మధ్యందినం
బునఁ దద్బింబము ముట్టి క్రమ్మఱు నదిం బ్రొద్దున్ దిగం జాఱఁగన్.

126


ఆ.

ఇనుఁడు గ్రుంకువేళ నిక్కడఁ దాఁ గ్రుంకుఁ
బొడుచువేళ నట్ల పొడిచి పెరుఁగుఁ
జిత్ర మిద్ది రాజశేఖర! సృష్టిలో
నలువనేర్పు చెప్ప నలవి యగునె.

127


క.

ఎన్నఁడు నిట్టి విచిత్రము
కన్నది విన్నదియు లేదు కడపట గుణసం
పన్నుని సజ్జనమిత్రు జ
గన్నుత నినుఁ గంటి ననినఁ గడుమోదమునన్.

128


శా.

తత్కాలోచితగోష్ఠి దీర్చి యతనిం దాంబూలపూర్వంబులౌ
సత్కారంబుల నాదరించి కొలువుం జాలించి యారాత్రి యు
ద్యత్కౌతూహలుఁ డౌచు ఖడ్గసహితుండై యొక్కఁడు న్భూవరుం
డుత్కోచంబున నేగె నాదెసకు నాయుగ్రాటవు ల్దూఱుచున్.

129


మ.

ఘనుఁ డట్లేగుచుఁ గాంచెఁ గాంచనమయాగారప్రకీర్ణాఘనా
శనతీర్థాంతసమున్నమన్నిజవపుస్సంభూతిహేతుప్రదా

లనలీలాకృతడఁంబరాంబరతలాలంబోష్ణరుగ్బింబచుం
బనవిస్రంభవిజృంభితాద్భుతరసప్రారంభమున్ స్తంభమున్.

130


సీ.

కని విస్మితుం డౌచుఁ జని హేమగృహముల
        రత్నగోపురముల రమ్యమైన
పురము డగ్గఱి దాని పొంత సూర్యప్రభ
        నానొప్పు నేఁటిలో స్నానమాడి
గుడిలోని యాదిత్యుఁ గడుభ క్తిఁ బూజించి
        యిష్టదైవముఁ బరమేశుఁ గొల్చి
యుపవాస ముండి సముత్సుకుఁడై దేవ
        తాయనమున నారేయి గడిపి


ఆ.

రేపకడన లేచి పాపవినాశన
తీర్థమునకు నేగి పార్థివుండు
జలకమాడి యచట సంధ్య నారాధించి
జలజమిత్రు నాత్మఁ దలఁచునపుడు.

131


ఆ.

తెలివిపడఁగ మొదలి దిక్సతి కెత్తిన
గొడుగుమీఁది పసిఁడిగుబ్బ యనఁగఁ
దూర్పుకొండమీఁదఁ దోఁచె మార్తాండుని
మండలంబు భువనమండనంబు.

132


ఆ.

తీర్థమధ్యమమున దివ్యపీఠాంకమై
జిగి దొలంక బుగ్గ లెగయుచుండ
నవ్యమైన కనకనాళంబు గల మహా
కమల మనఁగఁ బుట్టెఁ గంబ మపుడు.

133


క.

కడుచోద్య మంది యీఁదిన
దడ వగు నని యాతఁ డద్భుతస్తంభముపైఁ

బడనుఱికి పీఁటమీదను
జడియక కూర్చుండి యోగిచందము దోఁపన్.

134


క.

ధరణీశుం డెక్కిన మొగ[9]
తిరుగక కంబంబు తొంటితెఱుఁగున నాభా
స్కరుగతికొలంది జంకక
పెరిఁగెఁ గపటవామనుండు పెరిగినకరణిన్.

135


శా.

కంభం బీక్రియ నిక్కుచున్ బిఱుసుగల్గం బెద్దయు న్నిక్కఁగా
గంభీరుం డగురాజు కైకొనఁడ యాకాశంబు ముట్టంగ న
య్యంభోజాప్తుఁడు చేరనిచ్చు టది హైన్యంబంచు మధ్యాహ్నసం
రంభం బేర్చడ నెండచిచ్చు గొని పర్వంజేసె గర్వంబునన్.

136


ఉ.

చేసిన నెండపెల్లునకుఁ జిక్కక స్రుక్కక నిక్కి మిక్కిలిన్
డాసినఁ గ్రమ్మఱ న్రవి దృఢంబుగ రశ్మిసహస్రమెల్లఁ బై
నీసునఁ గప్పినంతఁ జలియింపక నిల్చినవానిఁ జూచి యు
ల్లాసముతోడ నిట్లనియె లావును దాల్మియుఁ దెంపు మెచ్చుచున్.

137


ఆ.

లక్షయోజనంబులను నిల్చి యైన నా
యెండ మానవులు సహింపలేరు
నన్నుఁ జేరనోపునా యన్యుఁ డట్లేని
గాలి నేలపాలు గాక యున్నె.

138


క.

నరనాయక నీ వీయెడఁ
బరమేశ్వరు కరుణఁ జేసి బ్రతికితి నిజసు
స్థిరభావము సాహసమును
బరికించి మనంబు హర్షభరితం బయ్యెన్.

134

క.

నీవును నేనును నొక్కటి
గావున నాకుండలములు గైకొను మివి సం
భావనతో నిత్యమును మ
హీవర సౌవర్ణభార మిచ్చుచునుండున్.

140


ఆ.

ఎన్న నాల్గుమాడలె త్తొకకర్షంబు
నాల్గుకర్ష లైన నగుఁ బలంబు
పలము లొక్కనూఱు తుల యగుఁ దుల లొక్క
యిరువది మితి భార మిది మతంబు.

141


క.

అని యిచ్చినఁ గైకొని యా
తనిపదముల కెఱఁగి మగుడుతఱిఁ గంబం బొ
య్యనఁ గ్రుంకఁగఁ దీర్థమునకు
మనుజేంద్రుఁడు చేరవచ్చె మాపటివేళన్.

142


ఆ.

కంబ మచట మునుఁగఁగా గంతుగొని తీర
భూమి నిలిచి తగిన నేమమెల్లఁ
దీర్చి భ క్తితోడ దేవతాలయములో
నుండి రేయి గడపి యొక్కరుండు.

143


శా.

ప్రాతఃకాలమునందు లేచి ధరణిపాలుండు తీర్థంబులో
స్నాతుండై నియమంబుతోడ శివపూజాకృత్యముం దీర్చి సం
ప్రీతిం గ్రమ్మఱి వచ్చుచోఁ దెరువునం బృథ్వీసురుం డొక్కరుం
డేతెంచెం గడుదీనుఁడై యతని నింపేపార దీవించుచున్.

144


క.

చేరఁ జనుదెంచి యతఁ డో
వీరోత్తమ పేదవాఁడ విప్రుఁడ నే నా
హారంబు వేఁడి వచ్చితిఁ
గారుణ్యము మెఱసి యిచటఁ గావుము నన్నున్.

145

మ.

అనినం జూచి కృపారసం బెనయ నాహారార్థి యీవిప్రుఁ డీ
తని కిచ్చో నశనంబు లే దితని చేతఃప్రీతి గావింప నే
ధనము న్లేదు ప్రదాతకుం దగిన పాత్రం బబ్బినం బ్రాణమై
నను వంచింపక యిచ్చు టొప్పు నని పుణ్యశ్లోకుఁ డుద్యుక్తుఁడై.

146


క.

మితి లేని మహిమ నీ కది
ప్రతిదివసము నొకసువర్ణభార మొసంగున్
మతిఁ జింతింపక పొమ్మని
యతిముదమునఁ గుండలమ్ము లాతని కిచ్చెన్.

147


శా.

దానం బీక్రియఁ జేసి యొక్కయెడఁ దీర్థస్వార్థము ల్సేకుఱె
న్నానాచోద్యములెల్లఁ జూచితి జగన్నాథు న్రవిం గంటి స
న్మానం బచ్చట నొందితినా ద్విజుని దైన్యం బంతయుం బాపితిన్
దీనం బుణ్యుఁడ నైతి నంచుఁ బురి కేతెంచెం బ్రమోదంబునన్.

148


ఆ.

నీకు నీగుణములు లేక యీగద్దియ
యెక్కఁదగదు మగుడనేగు మనిన
మనములోన నతనిఁ గొనియాడుచును భోజ
మనుజవిభుఁడు భవనమునకు నరిగె.

149


శా.

సంసారాంబుధిపూర్ణమగ్నజననిస్తారాంఘ్రిపంకేరుహున్
హింసావర్జితభావభవ్యమతి యోగీంద్రాత్మపద్మావళీ
హంసాకారు వికారదూరుని విమోహధ్వంసనోత్తంసునిం
గంసారాతిఁ బురారిమిత్రుఁ ద్రిజగత్కళ్యాణసంధాయకున్.

150


ఉ.

కంజభవార్చనీయపదకంజు నిరంజనునిం బురత్రయీ
భంజను సంజనాచలనిభద్విపదైత్యఘనప్రభంజనున్
సంజనితప్రమోదగిరిజాతనుమంజులవామభాగు మృ
త్యుంజయు నాంజనేయవిహితోన్నతగీతకృతాత్మరంజనున్.

151

మాలిని.

గిరివిరచితచాపా కృష్ణమేఘాభిరూపా
సురసరిదవతంసా క్షుణ్ణదైతేయహింసా
గరళగిళనదక్షా కంజపత్రాయతాక్షా
పురహరహరిరూపా పుణ్యగణ్యస్వరూపా.

152


గద్యము.

ఇది రాయగజగంధవారణ వైరిమండలీకభేకఫణీంద్ర వీరఘోట్టవిభాళ కళింగదేశనిర్దూమధామ త్యాగనాగార్జున కర్ణాటద్రవిలాంధ్రమహారాష్ట్రభూపాలరూప నూపురసుందరచరణారవింద సనదప్రోలిపురవరాధీశ్వర
వెలనాఁటిపృథివీశ్వరరాజ్యసముద్ధరణ శ్రీకొఱవి వెన్నయామాత్యపౌత్ర హరితసగోత్రపవిత్ర సకలసుకవిమిత్ర కసువరాజతనూజ గోపరాజప్రణీతం బైన సింహాసనద్వాత్రింశిక యనుకావ్యంబునందు విక్రమార్కునిదానమహోపకారసాహసౌదార్యప్రశంసనం బన్నది సప్తమాశ్వాసము.

  1. పట్టపు నేనుఁగు
  2. తొలునెట, తలవెంట
  3. వైచెగాన నిట్టివైరమయ్యె
  4. బగగలిపింపదగతని కేని నీకును
  5. చూడ నిదియు నాకుఁ బాడిగాదె
  6. ఛంగున దాటుచు రాజుకు, ముంగల
  7. వీరి జగడంబులంతరపడియె
  8. హతముగఁ బోట్లాడు పసులు నజ్ఞానకృతుల్
  9. ధరణిపుఁ డెక్కిన మగ్గక, తిరమై.పా.