సింహాసనద్వాత్రింశిక/అష్టమాశ్వాసము

శ్రీరస్తు

సింహాసన ద్వాత్రింశిక

అష్టమాశ్వాసము

క.

శ్రీలలనాతనురుచిశం
పాలతికాచిరవిలాసపరికీర్ణవపు
ర్లీలాతిశయవిడంబిత
నీలాంబుదవర్ణుఁ ద్రిభువనీపరిపూర్ణున్.

1


పందొమ్మిదవ బొమ్మకథ

మ.

మతిలో నిల్సి యతండు సజ్జనుల సంభావించి దైవజ్ఞస
మ్మతమౌ వేళఁ గడంగి యెక్కజఁనుచో మాన్పించి యేకోనవిం
శతిమద్వారముపొంతబొమ్మ వలికెన్ క్ష్మాపాలకా మూర్ఖు భా
రతపర్వంబు పఠింపఁబూనుట చుమీ రాగిల్లు నీయత్నముల్.

2


క.

ధారానాయక ధారుణి,
నారూఢుం డైన విక్రమార్కునికరణిన్
శూరుండును ధీరుండు ను
దారుండును గాక యెక్కఁదగ దెవ్వరికిన్.

3


మ.

అది యెట్లన్న నెఱుంగఁజెప్పెదఁ దదీయం బైనచారిత్ర ము
న్మదవైరీద్విపసింహ మర్థిజనతామందార మాభూవరుం
డుదయాస్తాచలమధ్యభూమి దనకై నాప్పారు నుజ్జేని సం
పదలం బొంపిరివోవ రాజ్యము నయప్రాజ్యంబుగా నేలఁగన్.

4


ఉ.

ఆజననాథుఁ గొల్చి కనకాభరణంబులఁ దేజరిల్లు కాం
తాజనుల న్విచిత్రవసనంబుల బంటుల నందలంబులం

దేజులఁ జామరంబులను [1]దెల్లని యెల్లుల నేపు సూపుచున్
రాజును మంత్రులు న్సుకవిరాజులు నుండుదు రొక్కకైవడిన్.

5


ఆ.

అట్టిదివసముల సమస్తభూపాలురు
భటులుఁ గవులు హితులు బలసి కొలువ
సురగణంబులోని సురరాజుభంగి న
య్యవనిపాలుఁ డున్నయవసరమున.

6


క.

ముకుళితకరుఁడై దౌవా
రికుఁ డెదుర న్నిలువఁబడి ధరిత్రీశ్వర! కా
నికగా సాళువముం గొని
యొకనల్లనిచెంచు వచ్చియున్నాఁ డనుడున్.

7


క.

తత్కారణంబు దెలియ స
ముత్కంఠుండై[2] నిజాభిముఖమానవసం
పత్కరదర్శనుఁ డగు డూ
భృత్కులతిలకుండు వానిఁ బిలువం బంచెన్.

8


మత్తకోకిల.

నెమ్మిఁ బచ్చని కుప్పసంబును నీలిచీరయుఁ బీలియుం
దమ్మిపూసలపేరు నెఱ్ఱనిధాతుబొట్టును జూడ నం
గమ్ముపైఁ దగు సొమ్ముగాఁ బిడికత్తి కాసె నమర్చి పా
ఱమ్ముల న్విలుఁ గేలఁ బూన్కొని యంతఁ జెం చరుదెంచుచున్.

9


క.

దూరంబున నుడుగణపరి
వారుండై వెలుఁగు రజనివల్లభుక్రియ ను
ర్వీరమణులలో నొప్పెడు
నారాజుం జూచి మ్రొక్కి యతివినయమునన్.

10

ఆ.

నీవు దాడివెట్టి నెగడిన నఱుమక
యీఁక విరిగి గొందు లీఁగునృపుల
పగిదిఁ బులుఁగులెల్లఁ బఱవ వేఁటాడు నీ
సాళువంబు గొనుము మాళవేంద్ర.

11


క.

అని చూపి కొలువులోపలఁ
దనచేతివిహంగమమును ధరణీశుని కొ
ప్పన చేసి తాను వచ్చిన
పనిఁ జెప్పఁ గడంగి యతఁడు పతి కిట్లనియెన్.

12


ఆ.

నృపులు గానలేని నీమహావసరంబు
నేఁడు గంటి దొడ్డవాఁడ నైతి
మానవేంద్ర యేను మందరగిరినుండి
యరుగుదెంచినాఁడ నవధరింపు.

13


శా.

ఓ రాజన్యకులావతంసక తదీయోపాంతభాగమ్మునన్
భేరుండాదిమహామృగేంద్రనివహాభివ్యాప్తమై యున్నత
స్ఫారానేకమహీరుహప్రకరవిస్తారావరుద్ధార్కసం
చారం బైనయరణ్య మున్నది తమస్సందోహసందష్టమై.

14


సీ.

ఆదివరాహ మాయడవి యేకలములు
        మన్నించి విడిచిన గున్నయొక్కొ
దిక్కరు లక్కడ నక్కు నేనుఁగుల చేఁ
        దోలుడువడి చెన్న దున్నలొక్కొ
చండికసింహ మచటఁ బేర్చుసింగంపుఁ
        గదుపులోఁ దప్పిన కొదమయొక్కొ
కాలునిపో తందుఁ గల కారుపోతులఁ
        గూడిరాలేకున్న దూడయొక్కొ

ఆ.

మారకమ్మపులి యచట మలయుచున్న
పెద్దమెకములు పెంచిన పిల్లయొక్కొ
యనఁగ వాలుమృగంబుల కదియ యెపుడు
నాటపట్టగుజాడలు తేటపడఁగ.

15


సీ.

అందులపందుల దందంబు క్రందున
        లీలావరాహంబు నేలఁగలసె
నచ్చోటిమదలులాయములతో బెనగి యా
        యెనుపోతు యమలోకముకుఁ జనియె
నక్కడి కృష్ణమృగౌఘంబుచేఁ జాల
        దూలి సారంగంబు గాలిఁబోయె
నట కొండగొఱియల యదుటుననొచ్చి
        మహామేష మగ్ని పాలయ్యె ననఁగ


ఆ.

నొప్పు నితరజంతువులను జెప్పనేల
[3]దువ్వు లెలుఁగులుఁ దోడేళ్ళు దుప్పు లిర్లు
[4]కొరనువులు మెడినాగులు గుజ్జుఁబిళ్లుఁ
గణఁజు లేదులుఁ గుందేళ్ళుఁ గలవు పెక్కు.

16


ఉ.

అయ్యెడ నొక్కయేకల మహంకృతితో గుహనుండి నిచ్చలున్
దయ్యము కైవడి న్వెడలి దౌడలు గొట్టుచు బెట్టు రొప్పుచుం
జయ్యనఁ జొచ్చి యేర్చిన గజంబులు మున్నుగ నమ్మృగంబులన్
వ్రయ్యలుగాఁ బడం బొడిచి వారకచంపుచు నుండు గండునన్.

17


గీ.

ఎదిరిపందులు దానిపైఁ గదిసిపొలియుఁ
బందెగాఁ డొక్కవ్రేటుగఁ బంతమాడి

యోలి నిలిపి యడిదమునఁ ద్రోలివ్రేయ
ఖండితములగు గుమ్మడికాయలట్లు.

18


క.

ఆకొమ్ముకాఁడు తొల్లిటి
యేకలమో కాక యముఁడొ యిట్టివిచిత్రం
బేకడఁ గానము విను మది
నీ కెఱిఁగింపంగఁ బూని నేఁ బనివింటిన్.

19


మ.

వసుధానాయక వేటకుం గదలు సత్త్వం బెక్కు మేనంతకున్
సుసరంబౌ లఘువౌ జయం బగు రిపుక్షోభం బగు న్సద్గుణ
ప్రసరం బేర్పడుఁ జేతి సూటి మెఱయింపం జో టగు న్వేఁట దు
ర్వ్యసనం బండ్రు ధరిత్రి నిట్టిగతి సౌఖ్యం బొండుచోఁ గల్గునే.

20


క.

అంచుం జెప్పినఁ బ్రియపడి
చెంచుం గనకాంబరముల జాలువారఁగ మ
న్నించి వరాహముఁ ద్రుంపఁద
లంచి మృగవ్యప్రయాణలాలసమతియై.

21


సీ.

దీమంపువేఁటలు దామెనవేఁటలు
        తెర వేఁటలును నేర్పు తెరలికలును
బందెమాడినభంగిఁ బందుల నొప్పింప
        బూటకాం డ్రనఁదగు వేఁటకాండ్రు
సారమేయంబులౌ సారమేయంబుల
        పట్టెడగొలుసులు పట్టినడువ
భేరుండగండగంభీరత్వ ముడిగించు
        భేరీరవంబులు బోరుకొనఁగ


ఆ.

వారువము నెక్కి మితపరివారుఁ డగుచుఁ
బోటుకాండ్రును వడిగలయేటుకాండ్రు

వాటపడ వెన్క నరుదేర వేఁట గదలె
మందరంబున కవనిపురందరుండు.

22


వ.

అట్లు గదలి కతిపయదినంబులకు దుశ్చరంబగు నగ్గిరిపశ్చిమతటంబున గండభేరుండాది ప్రచండమృగాండజప్రకాండపరిగణ్యం బగునరణ్యంబు దరియంజొచ్చి యచ్చటి శిలోచ్చయంబులం బ్రతిధ్వనులను సముదంచితంబుగం బెంచు చెంచులయార్పులును శునకకోలాహలంబులుఁ గాహళాదివాద్యరవంబులు దిక్కులు చెవుడుపడ సమీపించి.

23


క.

మెలకువ లగుచోటుల మను
కులకందువులను జలంబు గొనునెడలను మేఁ
తలపట్లను మృగములకును
వల లొడ్డుచు వేఁటకాండ్రు వలఁకులఁ జనఁగన్.

24


క.

పులి యొదిఁగి యెగసి యశ్వము
తల దొడుకఁగ నృపుఁడు సురియఁ దలద్రెంచిన మే
నిలఁబడఁగఁ బడక యాతల
లలితాశ్వంబునకుఁ బులితలాటము చేసెన్.

25


చ.

అటఁ జనునంతలోపల నవాంబుధరౌఘము భంగి ముందటం
గిటకిటఁ గోఱలన్ ధరణి గీఱుచు రొప్పుచుఁ గొప్పరించుచుం
గిటిగణ మేగుదేరఁ గని క్రేవలఁబట్టిన వేఁటకుక్క లొ
క్కట గొలుసు ల్వడి న్విడువఁగాఁ బఱచెం బవమానవేగులై.

26


చ.

పఱచుచుఁ గొంకులుం దొడలుఁ బట్టి విదుర్చుచు మాలెగట్టిన
న్మొఱుగుచుఁ గ్రమ్మఱం దొడికి మోఱలఁ ద్రిప్పినఁ జోటు దప్పఁ గ్రే
ళ్ళుఱుకుచు సింగము ల్గరుల నొక్కటఁ బట్టెడు భంగి దాఁటుచుం
గఱచుచుఁ జాగనీక యరికట్టుచు బెట్టుగ నేచెఁ బందులన్.

27

క.

కినిసి వరాహము వొడిచిన
శునకముతల ద్రెళ్ళి యెగసి చొప్పేర్పడ నొం
డునెలవునఁ బడియెఁ గవ్వడి
తునుమాడిన యా జయద్రథునితలవోలెన్.

28


వ.

అంతట వేఁటకాండ్రును నొండొరువులఁ గడవం బాఱి గంటిలేని కుఱుగంట్లం గలిగి మెఱుఁగారెడి సూటిగల పందిపోట్ల దృఢంబుగా నత్తుకొని యొత్తిలి పోయి మొగము దప్పుమాటున బలుమాటునం గదిసి పెద్దగున్నలను, జిఱుగున్నలను, బిడిపందులను, నెడమల్లరంబులను, గొమ్ముకాండ్రను నొక్కుమ్మడిం గ్రమ్మునప్పుడు.

29


క.

గంధగజలీలఁ బంది మ
దాంధంబై యొకని జీరినట్లుగఁ బొదువ
న్సంధింపం బడిన జరా
సంధుని క్రియ వ్రయ్య లొక్కసరసం బడియెన్.

30


ఆ.

అట్టివేళ నృపుఁడు కట్టెదురను
[5]నారి బెట్టుపొడను, నమ్ము వెట్టి తిగిచి
బొట్టు వెట్టినగతిఁ బట్టెలసం దేసెఁ
దిట్టినట్లు పంది మిట్టి పడఁగ.

31


వ.

ఆసమయంబున బెబ్బులిం గని పఱచుపశువులపగిది నవ్వనమదగజంబులు మొదలుగాఁగల మృగంబులును వేఁటకాండ్రును నొక్కదిక్కునకుం బఱతెంచిన నంతం దత్పశ్చిమభాగంబున.

32


సీ.

పాతాళ మీఁగినపందిఁ బోరికిఁ బిల్చు
కైవడి నందంద కాలు ద్రవ్వుఁ

గనుసన్నఁ బ్రాణులఁ గాల్పఁబూనినమాడ్కిఁ
        గన్నుల మిణుఁగుఱు ల్గ్రమ్మఁజూచు
దిగ్గజంబులు మది బెగ్గిలి మ్రగ్గఁగా
        జంకించుగతి వెక్కసముగ రొప్పు
నర్కునిహయముల నరికట్టఁ జనురీతిఁ
        గొనవెండ్రుకలు నిక్క గొప్పరించుఁ


ఆ.

దిరుగుచో నడ్డమగు కులగిరులఁ దునుమ
వాఁడియిడుభంగిఁ గోఱలు తీఁడికొంచుఁ
గాలమృత్యువు రేఁగిన కరణి లోక
మాకులంబుగఁ గవిసె నయ్యేకలంబు.

33


వ.

అట్లు దవ్వుల మలయుచున్నం జూచి యచ్చెరువంది యిచ్చ మెచ్చుచుఁ జిత్తంబున నుత్తలపడక యత్తలం బందుఁకొని.

34


ఉ.

వాహముఁ దోలి రాజకులవర్యుఁడు చేరెఁ గృతోల్లసన్మృగ
ద్రోహము నిత్యవీరరసదోహము సంజనితాంజనాద్రిసం
దేహము నత్యుదగ్రఘనదేహము నుద్ధతకాననాంబుధి
గ్రాహము సర్వభీతికరగర్వనిరాహము నవ్వరాహమున్.

35


క.

చేరిన నది మది బెదరక
యీరసమునఁ గడచి యతని నెదిరించె సుభ
ద్రారమణుని జెనయఁగ భూ
దారాకృతివచ్చు మూకదానవుమాడ్కిన్.

36


క.

అత్తఱిఁ దనచిత్తంబునఁ
దత్తఱపా టొండు లేక ధరణీరమణుం
డతలము వైవ నది గని
తుత్తుమురుగఁ బొడిచె లేతతుందిలముక్రియన్.

37

క.

పొడిచినఁ దడయక పిడికిట
నడిదము బెడిదముగ నెగడ నతఁ డశ్వము న
య్యెడ కడరించినఁ గ్రోధము
వడి మగుడఁగ మగిడెఁ బుడమి వడవడ వడఁకన్.

38


ఆ.

అట్లు దిరిగి చనిన నయ్యేకలమువెంట
హయముఁ దోలుకొనుచు నరిగె నృపుఁడు
పందిరూప మైన పాతాళ కేతువు
నంటనెయిదు కువలయాశ్వు పగిది.

39


ఆ.

తిన్నక్రొవ్వులోన నున్నది నీరుగాఁ
గన్ను లగ్గిమెఱుపుగములు గాఁగ
రొప్పుటుఱుము గాఁగఁ గప్పుచొప్పడఁ బంది
గాలిఁబఱచు మొగులుకరణిఁ బాఱె.

40


వ.

ఇట్లు పాఱిన ఘోరం బగు కాఱడవిలో దూరంబగు నీరంబులం దూఱి.

41


క.

పందివెనువెంటఁ నరుగుచు
ముందట నరలోకపాలముఖ్యుఁడు గనియెన్
మందరముఁ బురందరరిపు
మందిరకందరము నిందుమణిసుందరమున్.

42


క.

కని డగ్గఱునెడ సూకర
మనువుగ గుహ సొచ్చె నంత నచటితిమిర మా
తని దృష్టిఁ గప్పె భయపడి
తనుఁజొచ్చిన వానిఁ గావఁ దగు ననుకరణిన్.

43


ఆ.

ధరణిపాలుఁ డంతఁ దురగంబు నచ్చోటఁ
గట్టి వాలుఁ గేలఁ బట్టికొనుచు

లొంక సొచ్చె నాత్మఁ గొంకక కాలుండు
కదిసి దివియ వట్టి వెదకుపగిది.

44


ఉ.

చొచ్చి మహామృగం బరుగుచొ ప్పటఁ గానక కందరాంతని
ర్యచ్చటులాంశకూట మగు రత్నకవాటము గాంచి యిచ్చలో
నచ్చెరువంది యందుఁ జని యావల నిండిన చిమ్మచీఁకటిం
గ్రొచ్చుచు నేగె వాలు కడక్రొమ్మెఱుఁగు ల్నిగుడంగఁ గ్రిందికిన్.

45


ఉ.

ఆదెసఁ గొంతదవ్వుల మహారజతాంచితసాలమండల
శ్రీ దనరార రత్నకలశీపరిచిహ్నితతుంగశృంగసౌ
ధాదినికేతనప్రసర మైన మహానగరంబు దోఁచెఁ జం
ద్రోదయలీలఁ గన్నులకు నుత్సవమై దిమిరం బడంచుచున్.

46


ఉ.

అందుల పణ్యవీథుల నహర్నిశముం దిమిరంబు లీను సం
క్రందనరత్నగేహముల కాంతుల నేగఁగరా దటంచు న
మ్మందరసీమలందు గరిమంబున దాఁచిన పద్మరాగముల్
క్రందుకొనుం బ్రదీపములకైవడి దివ్వెలపండుగో యనన్.

47


క.

అందు బలిచక్రవర్తి ము
కుందుఁడు దనద్వారపాలకుఁడుగా రక్షో
బృందములు గొలువఁగా నా
నందంబున నుండు నురగనాథులతోడన్.

48


క.

అందుల ఫణికుల ముపవన
చందనసంవేష్టనిజభుజంగీవదనా
నందనసుండరతరమగు
మందానిల మానుచుండు మ్రాన్గ న్నిడుచున్.

49


క.

చెలువారెడు నాపురిలో
పలి రక్కసు లొండుగడల భయ మెఱుఁగక తీ

పులవింటికి జడియుచు మరు
నిలువేలుపుగా భజింతు రింతులుఁ దారున్.

50


ఉ.

ఆపురిఁ గాంచి సమ్మదము నచ్చెరువు న్మదిఁ బిచ్చలింపఁగా
భూపవరుండు పంది యెటువోయె బలం బెటు వోయె దివ్యమౌ
నీపుర మెట్లు తోఁచె నది యెవ్వనిరాజ్యమొ చూత మంచు ని
చ్ఛాపరతంత్రుఁడై గవనిచక్కటి దగ్గఱ వచ్చె నయ్యెడన్.

51


ఉ.

చేతఁ బసిండిబ్రద్ద విలసిల్లఁగ నొక్కఁడు వచ్చి మ్రొక్కి పృ
థ్వీతలనాథ నాథుఁ డగు విష్ణునిచే సెలవంది దానవ
త్రాత బలీంద్రుఁ డిప్పు డనురాగమున న్నినుఁ బిల్వఁ బంచె ర
మ్మా తడయంగ నేల యనుమానము సేయక నీవు నావుడున్.

52


సీ.

ఘనుని సందర్శింపఁ గలిగె నిక్కడ నని
        యానంద మందుచు వానిఁ జూచి
పురిచొచ్చి రత్నమందిరములసొం పెల్ల
        గోరి చూచుచుఁ బైఁడికోట దాఁటి
చని యవ్వటారుమోసలఁ దూఱి మణిమండ
        పంబులో దైత్యులు బలసికొలువ
గంకణంబులమ్రోఁత గల్లనఁగాఁ బాఁప
        జోటులు పసిఁడి వీచోపు లిడఁగ


ఆ.

మెఱుఁగుముత్తియములపేరు లఱుత మెఱయ
నలరుచుక్కలలోని రేవెలుఁగువోలె
మానికంబులగద్దియపైని దీర్చి
యున్న బలిఁ జూచి మ్రొక్కె నమ్మన్నుఱేఁడు.

53


క.

అతనిఁ గనుంగొని దానవ
పతి ప్రియమునఁ గౌఁగిలించి భద్రాసనసు

స్థితుఁ జేసి మిత్రకృత్యో
చితసత్కారము లొనర్చి సేమం బడిగెన్.

54


శా.

ధర్మం బెల్లెడఁ జెల్లునా ద్విజులవిద్యాగోష్ఠి రాజిల్లునా
దుర్మార్గంబు లడంగునా ప్రజలు సంతోషింతురా సత్క్రియా
మర్మం బేర్పడ జన్నముల్ జరుగునా మర్యాద వర్తిల్లునా
నిర్మూలంబుగ శత్రులం గెడపుదా నీలక్ష్మి సొంపెక్కఁగాన్.

55


శా.

హర్షం బొంది పురందరుండు ధరపై నందందుఁ గాలంబుల
న్వర్షంబు ల్గురియించునా తగిలి విద్వాంసుల్ ప్రశంసింతురా
ఘర్షింపంగల రీతి నీతి దెలియంగా విందురా కీర్తియు
త్కర్షం బందునె దీనులం గడపుదే దానం బనూనంబుగన్.

56


వ.

అనినం గృతాంజలియై మానవేంద్రుండు దానవేంద్ర నే నెంతవాఁడ న న్నింతకుశలం బడిగితివి నీవు మహానుభావుండవు.

57


సీ.

కశ్యపసుతుఁడు రక్కసులమేటి హి
        రణ్యకశిపుండు నీవంశకర్త యనఁగఁ
బరమవైష్ణవుఁడైన ప్రహ్లాదుఁ డద్భుత
        ఖ్యాతచరిత్రుండు తాత యనఁగ
వీరమాహేశ్వరుండై రూఢి కెక్కిన
        బాణాసురుఁడు కూర్మి పట్టి యనఁగ
దానవరక్షణజ్ఞానవిజ్ఞానాది
        గురుఁ డైనశుక్రుండు గురు వనంగ


ఆ.

నమరలోక మేలుట పరాక్రమ మనంగ
భువనమంతయు వితరణాభోగ మనఁగ
దేవదేవుండు హరి యిష్టదైవ మనఁగ
నీమహత్త్వంబు నాకు వర్ణింపఁదరమె.

58

మ.

ఘనుఁడౌ విష్ణుఁడు జన్నిదంబు శిఖయున్ గాయత్రిపల్కుల్ మృగా
జినము న్గోచియు దర్భలు న్గొడుగు మౌంజీబంధము న్గోపిచం
దనము న్వేలిమిబొట్టు గుండలములున్ దండంబు నందంబుగా
నిను వంచింపఁ గడంగి తాఁ గుఱుచయై నీచేత వర్ధిల్లఁడే.

59


క.

వెడమాయలవడు గడిగినఁ
దడయక మూఁడడుగు లిచ్చి ధర్మం బిల నా
ల్గడుగులుగా నిల్పిన నీ
కడిమి వొగడ నలవి యౌనె కమలజుకైనన్.

60


క.

ఆలాగు కపటియైనను
వేలుపె యని యొసఁగు నీదు వితరణగుణముం
దాలిమియు మెచ్చి (త్రిభువన
పాలకుఁ డచ్యుతుఁడు ద్వారపాలకుఁ డయ్యెన్.

61


క.

పాత్రత్యాగి యనంగ జ
గత్రయమునఁ బరగునట్టి ఘనుఁడవు నను నీ
మిత్రునిక్రియఁ గనుగొంటి ప
విత్రచరిత్రుండ నైతి విశ్వములోనన్.

62


సీ.

అనవుడు దనుజేంద్రుఁ డతిసమ్మదంబున
        నుర్వీశ యీ కలియుగమునందు
వీరుండు శూరుం డుదారుండు మఱి లేఁడు
        నీవే కా కని యని నిన్నుఁ జూడ
వేడుకపడి యేను విష్ణుని యాజ్ఞచే
        వెడలి రాలేక యీవెరపు పూని
ని న్నిటు రప్పించి కన్నులారఁగఁ గంటి
        నధికలాభం బయ్యె నంచుఁ బలికి

ఆ.

యిది సువర్ణదాయి యిది జరామృత్యుని
ర్హరణ మనుచు రసరసాయనములు
పేర్మి నిచ్చి యనిపె బిలమార్గ మెఱిఁగింప
నవ్వరాహమైనయసురఁ బనిచె.

63


ఉ.

పంచిన, వాఁడు చేరి జనపాలక యీమొగసాల గాచి న
క్తంచరవైరి యన్యులకుఁ గానఁగరాక వసించు, నట్టిరా
త్రించరనాయకుండు నినుఁ దెమ్మని పుచ్చిన నేకలంబనై
వంచనఁ దెచ్చి యిన్ని దురవస్థలఁ బెట్టితిఁ దప్పుసైఁపుమీ.

64


ఉ.

దానవనాథుఁ జూచితి సనాతనమౌ రససిద్ధిఁ గంటి వో
మానవనాథ నాపని క్రమంబున నీహిత మయ్యె నంచు స
న్మానముతోడఁ గొల్చి బిలమార్గము సూపఁగ వచ్చి వెల్వడ
న్వాని నతండు వీడ్కొలిపి వార్వము నెక్కె నుదాత్తచిత్తుఁడై.

65


చ.

మగిడి మహామృగౌఘము నమానుషభూములు నిర్ఝరంబులు
న్నగములుఁ గంటకద్రుమనంబులు దాఁటుచు వచ్చి యాత్మభృ
త్యగణము రోయుచున్ జనపదంబును గానక కానలోన నా
మృగయునిఁ గాంచి యొయ్యన సమీపముఁ జేరఁగ వాఁడు మెచ్చుచున్.

66


క.

మనుజేంద్ర నీవు క్రోడము
వెనువెంటం జనిన నిన్ను వెదక బలంబుల్
గనుకని చనియె న్నే నొక
యనువునఁ దురగంబుజాడ యరసెద నిచటన్.

67


క.

కంటిఁ బని చెల్లె ననుచుం
గంటకములుఁ గండ్లు దప్పఁగాఁ దోడ్కొని రా
జొంటిపడకుండ మృగయుఁడు
బంటుతనము మెఱసి యొక్కబయలికి దెచ్చెన్.

68

ఆ.

అచట నృపుఁడు నిల్చి యసహాయశూరుండఁ
దోడు వలదు హయముఁ దోలువాఁ
డ! నీవు గూడ లేవు నిలువు నీపని చెల్లె
ననుచు వేఁటకాని నాదరించి.

69


క.

రసఘుటికలుగట్టిన మృదు
వసనంబులు వారువంబు వాలుం దక్కం
బసదనము రత్నపథకా
దిసమస్తవిభూషణములు దిగ్గన నిచ్చెన్.

70


వ.

ఇట్లిచ్చి యనిపి తదనంతరంబున జోడనడయు, జంగనడకయుఁ, దురికినడయు, రవగాలునడయుం గల వారువము నదలించి వాగె వదలి రాగసంజ్ఞం గదలించి త్రోలిన.

71


క.

వలకుం జల్లెడె లాదిం
గలఱెక్కలకరణి నెగయఁగా నశ్వము ని
శ్చలగతి నాదిత్యునిహయ
ములనుం దనకాలిధూళి బోవంబాఱెన్.

72


వ.

తదనంతరంబ ఫేనిలరక్తరక్తాననం బై ఖలీనచర్వణంబగు గంధర్వంబు నాఁగి నాగంబుల నమలునాగాంతకుపై నున్న ముకుందునిచందంబునఁ గంద మప్పళించుచుఁ గలంకదీర్చునప్పుడు.

73


మ.

ధరణినిర్జరుఁ డొక్కఁ డాత్మసుతుఁడుం దానుం బుభుక్షాజరా
పరితాపంబున మేను దూలి పడఁగాఁ బ్రాణంబు లుద్వేగముం
బొరయంగాఁ జనుదెంచి మూడుదినము ల్వోయె న్నిరాహారతా
పరిఖిన్నాత్ముల మేము నేఁడు దయతోఁ బాలింపవే నావుడున్.

74


ఆ.

అన్న మిచటఁ బట్టెఁడైనను దొరకదు
తనియ నిత్తు నన్న ధనము లేదు

మేనితొడవులెల్ల మృగయుని కిచ్చితి
నిప్పు డిద్దఱికిని నేమి యిత్తు.

75


క.

ఆతురుఁడు దానపాత్రము
చేతం గలయదియె దానసిద్ధి యగుట ధా
త్రీతలపతి దలఁచి కృపా
న్వీతుండై యొక్క ఘటిక నిచ్చెద ననుచున్.

76


వ.

రెండు ఘుటికలు రెండుచేతుల నిడ కొని రస మిది సర్వలోహకాంచనీకరణంబు రసాయనం బిది జరామృత్యుహరణంబు వీనిలో నొకటి మీ రిద్దఱం బుచ్చుకొనుం డనినం దండ్రి జరాజీర్ణుం డగుటం జేసి రసాయనం బిమ్మనిన.

77


ఆ.

ఇతనిమాట పొసఁగ దెల్లలోహంబుల
నూనినంతఁ బసిఁడిగా నొనర్చు
రసమె యిమ్ము నాకు రాజ నయ్యెద నన్న
దండ్రి వచ్చి కొడుకుఁ దలఁగఁద్రోచె.

78


వ.

ఇట్లు పరస్పరభిన్నమనోరథం బగు దుర్వాదంబున శిఖ లూడ దోవతులు వదలఁ దమఛాందసోక్తుల నేన ము న్నాశ్రయించినవాఁడ నింక నీ వడుగకు మనుచుం ద్రోపుత్రోపులాడంగ నెడసొచ్చి.

79


క.

ఇటు మీలోపల నూరక
చిటిపొటి వల దైన మీకుఁ జిత్తప్రియసం
ఘటనము సేసెద నని రస
ఘుటికలు నృపుఁ డిద్దఱకును గొంకక యిచ్చెన్.

80


శా.

ఇష్టార్థప్రతిపాదనన్ ద్విజులఁ దా నీరీతి నత్యంతసం
తుష్టస్వాంతులఁ జేసి వీడుకొని ప్రత్యుద్యోతమౌ సేన సం

దష్టంబై నలుదిక్కులం గొలువఁగాఁ దా నేకసిద్ధక్రియా
హృష్టాత్ముం డగుచు న్మహీవరపరుం డేతెంచె నుజ్జేనికిన్.

81


ఉ.

వింటివె భోజరాజ పలువెంటలఁ బూనియు వాని బోలలే
వంటిఁ బ్రయత్నము ల్వలవదంటి విచారము లుజ్జగించి నీ
కింటికిఁ బోవు టొప్పు నన నిట్టి గుణశ్రవణోత్సవంబునం
గంటకితాంగుఁడై యతఁడు క్రమ్మఱ నేగె గృహాంతసీమకున్.

82


వ.

తదనంతరంబ కొన్ని దివసంబు లరిగిన నిరువదియగువాకిట నెక్కం బూనుకొని.

83


ఇరువదియవబొమ్మకథ

క.

నాగారిగమనమిత్రుని
నాగాననజనకు ననఘు నాగాభరణున్
నాగాసురహరుని సువ
ర్ణాగధనుర్ధరుని నందనాగవిహారిన్.

84


ఉ.

నిష్ఠఁ దలంచి సర్వదరణీసురసమ్మత మైనవేళ భూ
యిష్ఠము లైన వాద్యము లనేకవిధంబుల మ్రోయ నాసన
శ్రేష్ఠము పొంతఁ జేరఁగఁ బసిండి నొనర్చిన బొమ్మ న్యాయవా
ఙ్నిష్ఠురవృత్తి దోఁపఁ బలికెం బృథివీపతి నడ్డపెట్టుచున్.

85


ఉ.

పొందొకయిం తెఱుంగక ప్రభుత్వము సూపెద నష్టభోగసం
క్రందనుఁ డౌ నవంతిపతికైవడి నీగియుఁ దెంపు లేక యె
క్కం దర మౌనె నీవు నినుఁ గానవు గాక తలంచి చూడఁగా
నందని మ్రానిపండులకు నఱ్ఱులు సాఁచుట గాదె భూవరా.

86


ఉ.

ఆతనివర్తనంబు దెలియ న్వినుకోరికి వచ్చినాఁడ వౌ
నీతలఁ పిఫ్డు గంటి ధరణీశ్వర! చెప్పెద నాఁటదాన నా

చాతురి లెక్క కెక్కదు ప్రసాదము పెంపున నాదరింపు సం
ప్రీతి యొనర్చుదాన నిఁక మిన్నక మాటలు వేయునేటికిన్.

87


ఆ.

అయ్యవంతినాథుఁ డష్టదిక్కులఁ గీర్తి
నిక్క నచటనచట నేర్పుమెఱసి
యాఱునెలలు రాజ్య మర్ధవర్షము ప్రవా
సంబు నియతి గాఁగ జరపుచుండు.

88


మ.

దిననాథప్రతిమానరూపుఁ డెలమిన్ దేశాంతరాసక్తిమైఁ
జని యాశ్చర్యకరంబుగాఁ బురములున్ శైలంబులు న్వాఁగులు
న్వనమధ్యంబులుఁ జూచుచుం దిరిగి దివ్యస్ఫూర్తిఁ బద్మాలయం
బన సార్థం బగుపట్టణంబు గనియెన్ హర్షంబు రెట్టింపఁగన్.

89


చ.

అట చని పణ్యవీథిఁ గలయం బరికించుచు నొక్కచోట ను
త్కటశశిదీధితిప్రకరదౌతములైన గతి న్విశంకట
స్పటికమయంబు లైనగృహపంక్తులలోపల హేమరత్నసం
ఘటనమునం దనర్చు గుడిఁ గన్గొని డగ్గఱ నేఁగు నయ్యెడన్.

90


ఉ.

అర్కుఁడు గ్రుంకెఁ జీఁకటి దిగంతముల న్నిగిడెం బ్రియాంగసం
పర్కము లేని మానినులమానము దూల మరుండు మిక్కిలిం
గర్కశుఁడై చెలంగె నిలఁ గల్వలచెల్వము చూచి వానితోఁ
దర్కము పెట్టఁబూనినవిధంబున నెక్కువ నిక్కెఁ జుక్కలున్.

91


క.

ఆసమయంబునఁ బతి సం
ధ్యాసముచితవిధులు దీర్చి యాగుడిలోఁ గై
లాసనివాసునిఁ గోరి సు
ఖాసీనుండైన నలువు రటఁ దమలోనఁన్.

92


సీ.

మనము నేర్పున నిన్నిదినములు భూలోక
        మంతయుఁ దిరుగుట వ్యర్థమయ్యె

సిద్ధయోగీంద్రప్రసిద్ధచారిత్రుని
        గాలవంచకునిఁ ద్రికాలనాథుఁ
జూడలేమైతిమి చూడంగఁ గన్నులు
        గలిగియు నిచట నిష్ఫలములయ్యె
బ్రాలేయగిరిపొంతఁ బన్నగాటవి నాతఁ
        డున్నతతపమున నున్నవాఁడు


ఆ.

తెరువు లహికులాధీనదుస్తరము లనుచుఁ
బోవలేమైతిమని తలపోసికొనఁగ
విని మనంబున నతనిదర్శనము గోరి
రాజశేఖరుఁ డచట నారాత్రి గడపి.

93


క.

అరుణుం డుదయింపఁగ స
త్వరగతి నుత్తరము గదలి తఱచైనమహా
తరులును గిరులును దాఁటుచుఁ
దెరు వేడలక నడిచి కొన్నిదివసంబులకున్.

94


క.

దుర్వారశరభగండక
దర్వీకరసింహదంతిదంష్ట్రులనెల వై
శర్వాణిజనకుఁ డగు నా
పర్వతపతి పొంతఁ జేరె భయరహితుండై.

95


మ.

హిమవత్ప్రాంతము చేరి శీతలములౌ నీరంబులు న్సిద్ధసం
యమిసద్మంబులు దేవదారుమయదివ్యశ్రీకుటీరంబులున్
భ్రమరానందమరందబిందువిలసత్పద్మాకరశ్రేణులుం
గుముదప్రోజ్జ్వలకుంజకుంజరమహాకుంజంబులం జూచుచున్.

96


క.

చల్లనికొండ నయంబున
నల్లున కింపయినయట్టి యాభరణగణం

బెల్ల సమకూర్చి దాఁచిన
యిల్లనఁ దగు సర్పవనము నెదురం గనియెన్.

97


సీ.

కన్నుల మిణుఁగుఱుల్ గ్రమ్మంగ మ్రొగ్గుచు
        బుస్సనుచో వేఁడిపొగలు నిగుడఁ
బ్రల్లఁదంబున మళ్ళు నల్లనాగులు నాగ
        పెంజెరలును బెంటిపెంజెరలును
శంఖపాలకులును జాతినాగులు నుర్లుఁ
        బెంజెరలును నెఱ్ఱబెంజెరలును
గూఁకవేటులుఁ జిల్ముగులియలుఁ ద్రాఁచులుఁ
        బెరజులు గుఱ్ఱపుబెరజు లచటఁ


ఆ.

గలవు తక్కినజెఱ్ఱిపోతులును దుంప
నాగులును గొంటిగాఁడులు నరియకొక్కు
లేనవాలము ల్జెడుగులు? నిరుమొగముల
పాములును బెక్కు తద్వనభూమి నుండు.

98


క.

ఇవ్విధమున ఘోరంబగు
నవ్విపినాంతంబు సొచ్చి యరుగఁగఁ బాముల్
క్రొవ్వున మ్రోగుచు నాతని
నెవ్వెంటలం దామె యగుచు [6]నెగురుచుఁ బట్టెన్.

99


గీ.

పట్టి వరుణనాగపాశంబు లట్లు మై
జుట్టుకొనిన నతఁడు పట్టువడక
యట్టివేళ జలగ లంటినకరి వోలె
దిట్టతనము మెఱిసి తిరుగఁ డయ్యె.

100

వ.

అట్లు దిరుగక యురగభూషణుండునుంబోలె మృత్యువుకడ నిశ్శంకుండై ముందఱఁ జని.

101


సీ.

పులితోలు కచ్చడంబుగ మొలఁ గాసించి
        సర్వాంగములను భస్మంబు పూసి
శిరమునఁ గెంజెడ వెరవార బిగియించి
        విమలాక్షమాల హస్తమునఁ దాల్చి
యాసనశక్తికి నాధార మగుయోగ
        దండంబు పైఁ బాణితలము సేర్చి
పట్టు గల్గిన యోగపట్టె పూనిన మేను
        స్వస్తికాసనమునఁ జక్కనిలిపి


ఆ.

కంధరము వంచి నాసికాగ్రమున దృష్టి
గదియఁ గదలక ముక్కన్ను గానరాని
శూలిపోలిక నున్న త్రికాలనాథుఁ
జూచి సాష్టాంగ మెరఁగె నాక్షోణివరుఁడు.

102


వ.

ఇట్లు సాష్టాంగ దండంబు గావించిన.

103


క.

అప్పరమయోగి యోగం
బప్పుడు వారించి లేచి యాతనిఁ గరుణం
దప్పక చూచిన మేను
గప్పినసర్పములు విడిచి కనుకనిఁబఱచెన్.

104


శా.

దృష్టిం బాములఁ ద్రోలి యాతఁడు ధరిత్రీనాథు మన్నించి సం
తుష్టుండై పలికెన్ జనోత్తమ జగద్ధుర్వారదర్వీకరా
శ్లిష్టప్రాంతరమౌ మహాటవి మది న్లెక్కింప కీమంచులో
నిష్టోద్యోగము పూని వచ్చితివి నీయీ డెవ్వరిం జెప్పుదున్.

105

ఆ.

ధరణిలోనఁ బాముతలగాము లుండునం
ద్రిట్టిపాములు మెయిఁ జుట్టుకొనఁగ
నీవు శంక లేక నేనున్న చోటికి
వచ్చినాఁడ వెద్ది వాంఛితంబు.

106


క.

వినిపింపుము సురలకునై
నను బడయఁగరాని ప్రార్థనలు నీ కిత్తున్
ఘనుఁ డని చేరినచోఁ గై
కొని యతనికి నొక్కమేలు గూర్పం దగదే.

107


మ.

అనిన న్సంతసమంది సాంజలిపుటుండై విక్రమాదిత్యుఁ డి
ట్లనియె న్సిద్ధయతీంద్ర విష్ణుక్రియ నిత్యానందవారాశిఁ జొ
క్కినచిత్తంబున నాత్మయోగవశముక్తి శ్రీసమేతుండ వై
యనువేలంబుగఁ దేలియాడు నిను డాయంగంటి నేఁ జాలదే.

108


క.

నినుఁ జూచినయవి కన్నులు
నినుఁ బొగడినయదియ జిహ్వ నీగుణగణము
ల్వినినయవి చెవులు నీకుం
బనిచేసినయవియ పాణిపద్మము లనఘా.

109


శా.

నిత్యానందపదప్రతీతచరితా! నీదర్శనం బైనచో
బత్యక్షంబుగ మేననున్న ఫణభృద్బృందంబు లి ట్లూడె న
ప్రత్యక్షంబుగ గర్మబంధములు నిభంగి న్వెసం బాసె నా
దిత్యోగ్రద్యుతి పర్వినం దిమిరమున్ దిగ్భూముల న్నిల్చునే.

110


చ.

కమలవనైకమిత్రుని ప్రకాశ మొకించుక పర్వి సూర్యకాం
తమునకు దీప్తు లిచ్చినవిధంబున నీకరుణార్ద్రదృష్టి సం
యమివర నాపయిం బొలసినంతనె పాపమువాసి యెల్ల పు
ణ్యములును గల్లె వేఱె నినుఁ బ్రార్థన చేయఁగ నేల నాకిఁకన్.

111

క.

అనినఁ దనయిచ్చ నిష్టం
బొనరింపఁ గడంగి యోగి యొక నిడుబలపం
బును లాతము బొంతయు గ్ర
క్కున నాతని కిచ్చి వాని గుణములు చెప్పెన్.

112


వ.

ఈ బలపపుఁగొడుపున వలసినయన్ని లెక్క లొడ్డి వ్రాసి యీలాతపుఁగోల సవ్యహస్తంబునఁ బట్టి ముట్టించిన నన్నియు నీవు దలంచిన ప్రాణులై నిల్చి నీవు సెప్పిన పని సేయు; నవి యుడుపవలసిన నెడమచేత నావ్రాఁతలు క్రమంబునం దుడిచిన నడంగు; నెచట నైన నీబొంత దులిపినఁ గోరినయంతధనంబు నీ కిచ్చు నరుగు మని వీడుకొల్పిన.

113


ఉ.

మ్రొక్కి వినీతుఁడై మగిడి ముందట ఘోరము లైన పాములం
ద్రొక్కుచుఁ గంప లీరములుఁ దూఱుచుఁ గాఱడవి న్మనంబులో
స్రుక్కక మార్గము ల్గడచుచుం గడుదూరము వచ్చి భూవరుం
డొక్కెడఁ గాష్ఠము ల్విఱుచుచున్న మనుష్యుని గాంచె ఖిన్నునిన్.

114


ఆ.

వానిఁ జూచి యేల వగచెదు కట్టెల
కింతదవ్వు రాఁగ నేమికతము
నావుఁ డేను హూణనరపతిబంటఁ ద
త్పుత్రుతోడఁ జావఁ బూనినాఁడ.

115


ఆ.

ఆకుమారుఁ డగ్ని నదె పడుచున్నాఁడు
చూడు మనినఁ గెలన సొద యొనర్చి
చిచ్చు వెట్టి కూల నిచ్చగించెడువానిఁ
జేర నేగి రాజశేఖరుండు.

116


క.

నరవరసుత! నీ కీదు
ర్మరణమునకుఁ బూననేల మదిలోపల నే

పరిఖేదము గల దది యె
వ్వరిమూలము చెప్పు మనిన వాఁ డనుమతుఁడై.

117


సీ.

ఏ మని చెప్పుదు నిటక్రింద హూణదే
        శాధీశుఁడైన మాయయ్య తీఱె
నాయెడరున వచ్చి దాయాదు లందఱు
        రాజ్యంబు చేకొని ప్రాభవమున
వెడలఁ దోపించినఁ గడుదుఃఖితుండనై
        యొక హితుం డైన సేవకుని గూడి
యేతెంచి యిచట నాజ్ఞాతులచేనైన
        యభిషంగ మోర్వంగ నలవి గాక


ఆ.

యొంటి నడవి నిట్టిమంటఁ జాఁ గడఁగితిఁ
బరిభవంబునొంది బ్రదుకుకంటె
నిదియ మేలు గాఁగ మది నిశ్చయించితి
ననిన నాతఁ డతిదయాళుడగుచు.

118


క.

పగవా రొ త్తినయప్పుడు
జగ మెఱుఁగం దెగుట మొండె సైరణ యొండెం
దగుఁ గాక మిగుల నొగులుచు
మగవాఁడై మగువపగిది మడియుట తగునే.

119


చ.

ఇటు విను చేటులేని బ్రతు కే నొనరించెద నీకు వైరిసం
కట మడఁగుం బదాతితురగద్విరదంబులు గల్గు నర్థము
క్కట మగు వీని గొమ్మని విధానము లేర్పడఁ జెప్పి చేతియా
ఖటికయు యోగడండమును గంథయు వానికి నిచ్చెఁ జెచ్చెరన్.

120


శా.

తత్సామర్థ్యమునం బదాతితురగస్తంబేరమౌఘంబు న
త్యుత్సేథంబగు సర్వముం గలిగినన్ హూణక్షితీశాత్మజుం

డుత్సేకంబు మనంబునం బొదలఁగా నుత్సాహసంపన్నుఁడై
మాత్సర్యంబున భూమిఁ గొన్నరిపుల న్మర్దింప నేగె న్వెసన్.

121


వ.

అట్లక్కుమారుం డరిగిన యనంతరంబున నిజాయుధధైర్యసహాయుండును నసహాయశూరుండును నగు విక్రమార్కుండు.

122


ఉ.

సజ్జనదర్శనంబును బ్రసాదముఁ గల్లెఁ బరాభవవ్యథా
లజ్జల నగ్నిలోఁ బడఁదలంచిన చక్కనిరాజపుత్రునిన్
బుజ్జవ మేర్పడం గరుణఁ బ్రోవఁగఁ జేకుఱె నంచుఁ బ్రీతుఁడై
యజ్జయినీజనాధిపతి యొయ్యన వచ్చె నవంతిభూమికిన్.

123


వ.

ఇట్టి గుణాఢ్యుండు గావున.

124


క.

అవ్విక్రమార్కుసరి గా
కెవ్విధముల నింటి కేగు డిది తగ వనిన
న్నవ్వుచు నందుల కోర్కులు
దవ్వులుగా మగిడె భోజధరణీపతియున్.

125


వ.

మఱియుఁ గతిపయదినంబు లరిగిన.

126


ఇరువదియొకటవ బొమ్మకథ

క.

సింధుపతివైరిహితు సుర
సింధుప్రభవాదిచరణు సింధువిహారిన్
సింధురరూపాసురహరు
సింధుతనూజాత్మబంధు సింధురవరదున్.

127


మ.

హృదయాంభోజములోపలం దలఁచి భోజేంద్రుండు ధర్మార్థకో
విదులున్ జ్యోతిషు లాగమజ్ఞులును సేవింపంగ సొంపారు సం
పద పెంపొంద శుభగ్రహోద్ధరణలబ్ధం బైన లగ్నంబునం
ద్రిదివేంద్రాసన మెక్కవచ్చినఁ బ్రియోక్తిన్ బొమ్మ వల్కెం దగన్.

128

చ.

విను మిటు భోజరాజ యొకవిన్నప మే నొనరింతు విక్రమా
ర్కునిక్రియఁ బెంపు నీగియును రూఢికి నెక్కక యెక్కఁ జెల్ల దే
మనఁ దగు నిన్ను నిచ్చలుఁ బ్రియంబున వచ్చెదు వచ్చి క్రమ్మఱం
జనియెద వాశ మానవు యశంబును నేర్పును దీనఁ గల్గునే.

129


క.

అతని చరిత్రము వినఁగో
రితివేని నృపాల యవధరింపుము నా కే
చతురతయు లేదు తెంపున
నతివకు నృపుసభల మాటలాడం దరమే.

130


శా.

నామాట ల్విన నిచ్చగింపు మతఁ డానాకేశుఁ డిష్టుండుగా
సామంతార్చితపాదపీఠుఁ డగుచున్ సామ్రాజ్యలక్ష్మీకళా
సీమంబౌ భుజసార మొప్పఁగ నయశ్రీమంతుఁ డాభట్టి ము
ఖ్యామాత్యుండుగ నేలె నుజ్జయిని నిత్యం బైనసత్కీర్తితోన్.

131


ఉ.

ఆదివసంబులందుఁ బ్రజలందఱు సంతతుల న్సమృద్ధుల
న్మోదము నంది సత్రములు మున్నుగ ధర్మము లాచరించుచు
న్వేదన లేవియుం గనక వేడ్క మనంబుల నిండి యుండఁగాఁ
బేదలు మూర్ఖు లల్పులను పేరును లేదు పురంబులోపలన్.

132


క.

నిలువు గలనీతి భట్టికి
జెలికాఁ డనఁ బొలిచి బుద్ధిసింధు వనంగా
వెలసినయమాత్యుఁడొక్కఁడు
గలఁ డతనికి సుతుఁ డొకండు గ్రహిలుఁ డనంగన్.

133


ఉ.

ఆగ్రహిలుండు బుద్ధియు నయంబును శీలముఁ దప్పఁగాఁ బిశా
చగ్రహదష్టుఁ డైన క్రియ సభ్యవిచారము పొందు మాని మి
థ్యాగ్రహవృత్తిఁ ద్రిమ్మరుచు నాడఁగఁ జూడఁగ లేక యాత్మలో
నిగ్రహ మంది తండ్రి సుతునిం దెగి తిట్టుచుఁ జాల దూఱుచున్.

134

ఆ.

ఓరి పాపకర్మయున్న [7]మంత్రికుమారు
లవనిపాలు కొలిచి యచట నచటఁ
బనులు సేయఁగఁ జడుఁ డనుచు నాకును దల
వంపు సేసితి సరివారిలోన.

135


క.

అను వగుతనయుఁడు పుట్టిన
జనకుని కిహపరసుఖములు సమకూరు నన్న
న్మును వింటి నేను నినుఁ గని
[8]మని మని నేఁ డిట్లు నరకమగ్నుఁడ నైతిన్.

136


క.

ఒడ్డును బొడవును రూపును
దొడ్డతనము గలిగి ప్రజ్ఞతోఁ బొదలనియా
బిడ్డని గనుకంటెను సతి
గొడ్డయినను మే లనంగఁ గుందుటగలిగెన్.

137


ఆ.

ఎట్టకేనియుఁ దగు పుట్టువు గల్గియు
గట్టియైన యెఱుకపట్టు లేక
యిట్టిభంగి వ్యథలఁ బెట్టుటకంటెను
బుట్టినపుడె యేల గిట్టవైతి.

138


చ.

గృహమున నుండి నన్నుఁ గలఁగింపక యొండెడ కేగు మన్న నా
గ్రహిలుఁడు సిగ్గుదాల్చి యధికం బగు మానము వూని లేచి యా
గ్రహమున శాస్త్రము ల్సదివికా నిఁక నింటికి రానటంచు సో
త్మహితము గోరుచు న్వెడలి దక్షిణభూమికి నేగె నొక్కఁడున్.

139

వ.

అ ట్లేగుచు నొక్కనాఁడు [9]భువనగిరియొద్ద నొక్కయగ్రహారంబు డగ్గఱి యందుఁ గొందఱు సభ్యులు పురాణశ్రవణంబు సేయుడున్న నట తానును జేరి వినునెడ నప్పౌరాణికుండు తీర్థఫలంబు లెఱింగించుచు.

140


ఆ.

ఏకభుక్తములు ననేకదానములు న
యాచితములు జపము లనశనములు
[10]జరపి వెచ్చుకంటె సరగునఁ గాశిలో
బొంది విడిచి ముక్తిఁ బొందవచ్చు.

141


క.

మెట్టక పెట్టక పట్టక
గిట్టక తీర్థముల ముక్తికిం జనరా దే
తొట్టును బొరయక మెయిమెయి
కట్టెదురన్ శ్రీనగంబు గనినం జాలున్.

142


క.

తనువు దొఱంగక యిది యె
క్కనలవి గాదంచు శివుఁడు గైలాసము గ్ర
క్కన విడిచి బొందితో( జనఁ
దనభక్తులకొఱుకు నందుఁ దరలక యుండున్.

143


క.

శిలలెల్లను లింగంబులు
సలిలంబులు దివ్యసింధుసారంబులు తీఁ
గలు సంజీవను లౌ ద్రుమ
ములు మందారములు చఱులు ముక్తిపదంబుల్.

144


మ.

అని చెప్ప న్విని చిత్తకల్మషము వాయంజేయ శ్రీపర్వతం
బునకే పోవుట మే లటంచు నతఁడా పుణ్యాత్ములం బాసి చ

య్యన నాదిక్కున కేగుచున్ హృదయభృంగాఖ్యన్జగత్పూతమై[11]
న నగం బల్లన దాఁటి తీర్థసలిలస్నానార్థియై ముందఱన్.

145


మహాస్రగ్ధర.

కనియెం గ్రీడద్విహంగన్ ఘనజలరవజాగ్రద్భుజంగన్మహాపూ
రనిరూడవ్యూఢదుర్వారభృతరుచితటీరంగభంగత్తరంగన్[12]
జనితశ్రేయానుషంగన్ జలధిహితపరిష్వంగనార్ద్రాంతరంగన్
జననిర్ధూతాభిషంగన్ క్షతగిరికటకోత్సంగఁ బాతాళగంగన్.

146


వ.

కని యందుఁ గల దక్షిణావర్తంబునఁ గృతస్నానుండై మల్లికాకుండంబును, ఘటికేశ్వరంబును, భ్రమరికాశ్రయంబును, గాలహ్రదంబును, దేవహ్రదంబును, సంధ్యామౌనంబును, జారుకేశ్వరంబును, నందిమండలంబును మున్నుగాఁ ద్రింశద్యోజనాయతంబును ద్రింశద్యోజనవిస్తీర్ణంబును నగుటం జేసి బహుకోటితీర్థమయంబు నగు నారమాక్షమాధరంబుమీఁదికిం జని కనకమయప్రాసాదంబు సొత్తెంచి.

147


క.

ఆర్జవమున నచ్చటఁ బూ
ర్వార్జిత మగు పుణ్యసముదయమునం గనియె
న్నిర్జరగణసంసేవితు
నర్జునకిరణాంకు మల్లికార్జునదేవున్.

148


వ.

కని సాష్టాంగం బెరంగి.

149


క.

గోపతివాహనునకు నల
కాపతిమిత్రునకుఁ ద్రిపురఖండనసమయా
రోపితగిరిచాపునకును
శ్రీపర్వతవిభున కార్తచింతామణికిన్.

150

వ.

అర్చన లిచ్చి తనఫాలంబునఁ గేలుదోయి గీలించి.

151


సీ.

పెద్దమెకముతోలు నిద్దంబుగాఁ గట్టి
        గాలిగ్రోలెడుసొమ్ము లీలఁ దాల్చి
చలికొండకూఁతుకై సామేన నిమ్మిడి
        చదలేఱు నెలయును జడలఁ జెరివి
యేనికమోముతో నెలుకనెక్కిన చిన్ని
        బొజ్జపాపఁడు నీదుపజ్జ నడువ
ముజ్జోడుమొగముల ముద్దులకొమరుండు
        పురిగలపులుఁగుపై నరుగుదేర


ఆ.

వెన్నుఁడును నలువయును బల్వేలుపులును
గొలువ [13]గుబ్బలికొమ్ములగుజ్జు నెక్కి
కలిమికొండకు నేతెంచి నిలిచి తనుచు
వింటి ముక్కంటి నినుఁ గనుఁగొంటి మంటి.

152


క.

అనుచు ననేకవిధంబులం
దననేర్చినకొలఁది నతఁడు తప్పనిభక్తిన్
వినుతించి పాపముల వీ
డ్కొని మగిడెం జిత్తశుద్ధి కొనసాఁగంగన్.

153


ఉ.

ఆదెసనుండి సర్వజగదాశ్రయు వేదపురాణవేద్యుఁ బ్ర
హ్లాదమనోవిధేయు నసురాంతకు శ్రీ నరసింహమూర్తిఁ గా
కోదరరాజతల్పుని నహోబలనాథునిఁ జూడనేగి త
త్పాదసరోరుహంబులకు భ క్తిఁ దగం బ్రణమిల్లి ధన్యుఁడై.

154


చ.

హరిహరసేవనాసుమతు లైన జను ల్విలసింప సంపదా
కరమగుసొంపుపెంపు గల కన్నడభూమికి నేగి యొక్కభూ

సురవరు నాశ్రయించి తగు సుస్థితి నక్కడనుండి యాస్థతో
సురగురునీతిశాస్త్రమును శుక్రు నయక్రమముం బఠించుచున్.

155


ఉ.

ఆకడ నీతిశాస్త్రవిదుఁడై గురు వీడ్కొని యేగె వేడ్కతోఁ
గాకితమూలశక్తి గనిగా నొనరించిన పైఁటిచట్టునా[14]
నేకశిలాభిధానమున నెన్నిక కెక్కి ధరిత్రిలోన నే
పోకలఁ బోనియట్టి సిరిపుట్టినయింటికి నోరుగంటికిన్.

156


క.

పసిఁడియు రత్నము మున్నుగ
నిసుముక్రియం బెక్కుధనము లీనఁగ నిలకు
న్వసుమతియు రత్నగర్భయు
వసుధయు ననుపేళ్ళు నిక్కువము లౌనచటన్.

157


ఉ.

చందనగంధులు న్విటులు జాణలు దానవినోదులుం బ్రభా
సుందరమూర్తులుం గవులు శూరులుఁ బెద్దలు నుల్లసిల్ల సం
క్రందనవైభవాఢ్యుఁ డగు కాకతిభూపతి రాజ్యలక్ష్మిఁ బెం
పొందెడు నప్పురంబున మహోత్సవలీలల నుండె నేర్పునన్.

158


వ.

అట్లు కొన్నిదినంబు లుండి తత్పురజనపరిచయంబున సకలకళాప్రవీణుండై మగుడం గడంగి మహాతీర్థవిలోకనార్థియై యట చని దూరంబున.

159


క.

ఆతఁడు త్యంబకశిఖరో
ద్భూతను విఖ్యాతఁ బరమపూతఁ ద్రిలోకీ
మాత మహాపాతకసం
ఘాత విఘాతానుయాతఁ గనియెన్ గంగన్.

160


క.

ఆనదికి మ్రొక్కి ముఖ్య
స్నానం బొనరింప డిగ్గి చని యుదకం బా

లోనం దెకతెక నుడుకం
గా నద్భుతమైన మడుఁగుఁ గని వెరఁగందెన్.

161


క.

పిట్టలు దివిఁ బాఱఁగ నా
కట్టావుల నెఱక నెల్లఁ గమరిన నచటన్
మట్టుపడి కూలుఁ దొడిమల
ప ట్టూడినయట్టి మేడిపండులభంగిన్.

162


ఆ.

అట్లు ఘోరమైన యయ్యుష్ణతీర్థంబు
చేర వెఱచి శిశిరవారిలోన
గెలన జలక మాడి వెలి కేగి యట గుడి
లోన నున్నశివునిఁ గానఁబోయి.

163


వ.

అద్దేవు నుచితోపచారంబుల నారాధించి యచట నొకరాత్రి గడపం గడంగి యుండె.

164


క.

ఆయెడ నాకాశంబున
నాయుష్ణాంబువుల యాపు లంటినఁ దప్తుం
డై యపరాంబుధి మునుఁగం
బోయెనొకో యీతఁ డన నభోమణి గ్రుంకెన్.

165


మ.

చదలం జుక్కలు పిక్కటిల్లగఁ దమస్సందోహము ల్బూమిఖా
గదిగంతంబుల నిండ రేయి నిగుడంగా నుష్ణతీర్థంబులో
నుదకం బుబ్బఁగ గొబ్బున న్వెడలి సాంగోపాంగసంగీతులం[15]
జదురాండ్రౌ నెనమండ్రు వచ్చి రట కాసర్వేశ్వరుం గొల్వఁగన్.

166


ఉ.

మోహనదివ్యమూర్తు లగుముద్దియ లాశశిమౌళికి న్మహో
త్సాహముతోడ హేమజలజంబులఁ బూజ లొనర్చి నాట్యస

న్నాహము సేయుచో నొకతె నాదవిశోధన[16] చేయుచుండె నాఁ
గాహళ వట్టె గానగమకశ్రుతితానవిధాన మానఁగన్.

167


ఆ.

గానభిక్ష వేఁడ హీనస్వరంబున
వదరుకాయ లంది వచ్చినట్టి
వీణియలకు లయలు విప్పిచెప్పెడు భంగి
నందు ముగురు పాడి రందముగను.

168


క.

[17]సూళాదిగీతములును సు
తాళము ధ్రువ గురువు లఘుయుతంబులుఁ దమలో
మేళనమునఁ జెడకుండఁగఁ
దాళము వాయించె నొకతె తద్గతికొలఁదిన్.

169


ఆ.

గళరవంబు లమర గమకంబుతోఁ బేర్చు
రాగమున మనంబు రంజిలంగఁ
బ్రియుఁడు వోలె నధరబింబంబు చుంబించు
వాసెగ్రోలు వట్టె వనితయోర్తు.

170


ఆ.

మూఢునైన బట్టి ముఖరునిఁ జేయుదు
ననినభంగి సతి మృదంగ మంది
కంకణములు తాళగతి మ్రోయ వాయించెఁ
[18]దొయ్యలులకు నెద్ది దుష్కరంబు.

171


చ.

తతఘనమర్దళాదినినదంబులు నర్వదినాల్గు హస్తని
ర్గతులును దృగ్విలాసములుఁ గన్నులపండుగ గాఁగఁ దాళసం

గతులు చెలంగఁ బాదకటకంబులు మ్రోయఁగ నాట్యమాడె నొ
క్కతె తొలుకారుక్రొమ్మెఱుఁగు కైవడిఁ దద్రసభావపుష్టిగన్.[19]

172


క.

ఎలనాఁగలు మఱి తమలో
పల నృత్తాంగములు వీడువడ నాడుచుఁ గ్రొ
న్నెలతాల్పువేల్పు నీక్రియఁ
గొలిచి మగిడి యేగునపుడు గుడిలో మూలన్.

173


శా.

విస్మేరాకృతినున్న మంత్రితనయు న్వీక్షించి ప్రోయాండ్రు మం
దస్మేరానన లౌచు నీకు సుఖమందం గోరుకు ల్గల్గెనే
నస్మద్భూమికి రమ్మటంచుఁ జనఁగా నయ్యుష్ణతీర్థోష్మల
న్భస్మం బయ్యెద నంచు భీతి నతఁ డాప్రాంతంబున న్నిల్చినన్.

174


క.

పాతాళంబున కేగిన
యాతరుణులదీప్తి భూతలాంతంబున ను
ద్యోతించునొ యనఁ దూర్పున
నాతతమగు కెంపుదోఁప నరుణుఁడు వొడచెన్.

175


మ.

దిననాథుం డుదయింపఁగా వెడలి భక్తిన్ గౌతమీతీరకా
ననము ల్దూఱుచు నొక్కనాఁడు కడుఁ బుణ్యంబైనకాళేశ్వరం
బున కేతెంచి మహోపచారపరుఁడై ముక్తీశ్వరుం గొల్చి నె
మ్మన ముప్పొంగఁగ ధన్యుఁడై మగుడఁ దన్మార్గంబున న్వచ్చుచున్.

176


క.

హరిహరు లేకం బనియెడు
పురాణవచనంబు దృష్టముగ నొకచోటన్
నరసింహుండును రామే
శ్వరుఁడును గలధర్మపురికి వచ్చెఁ గడంకన్.

177

చ.

అట చని గంగలో జలకమాడుచుఁ గొందఱచే నెఱింగి మి
క్కుటముగ నింపుతో యముని కుండము దూఱి కడంక బ్రహ్మ[20]కూఁ
కటియును ముట్టి వెల్వడి జగత్పతి యౌ నరసింహమూర్తి ముం
దటి కరుదెంచి మ్రొక్కి యుచితంబుగఁ బూజ యొనర్చి భక్తితోన్.

178


ఉ.

నర్మద తుంగభద యమునానది జాహ్నవి కృష్ణ గౌతమిం
గర్మము వాయ నెన్ని జలకంబులు దీర్చితినో దయామతీ
ధర్మము లెన్ని చేసితినొ దానము లెన్ని యొనర్చినాఁడనో
ధర్మపురీనృసింహ నిజదైవమనోవిభు నిన్నుఁ జూచితిన్.

179


వ.

అనుచుఁ బునఃపునఃప్రణతుండై వెడలి తదాసన్నం బగు దేవాలయంబునకుం జనుచు నద్దేవు నుద్దేశించి.

180


ఉ.

శాశ్వత మౌకృపారసముచాడ్పున ముందఱ గంగ వాఱఁగా
విశ్వజనీనవృత్తిఁ బృథివిం దగురూపున నిల్చి సంతతా
నశ్వరభుక్తిముక్తిసదనం బగు ధర్మపురీశుఁ డైన గా
మేశ్వరుఁ డెల్లకాలమును నీవుత మాకు నభీష్టసంపదల్.

181


చ.

అని గుడి సొచ్చి యీశ్వరున కర్చన లెల్ల నొనర్చి మ్రొక్కి యిం
పున మగుడం గడంగి భువి బుణ్యపదంబులు చూచుచుం గ్రమం
బున నొకయేఁడు వుచ్చి తలఁపు ల్సమకూడిన నిర్వికారుఁడై
జనకునిఁ జూడవచ్చె నయశాస్త్రవిశారదుఁ డయ్యవంతికిన్.

182


సీ.

వచ్చి తండ్రికి గౌరవము దోఁప మ్రొక్కుచుఁ
        బ్రియవాక్యములఁ గడునయము సూప
బుద్ధిసింధువుఁ దనపుత్రుఁ గౌఁగిటఁ జేర్చి
        న న్నుద్ధరించితే యన్న యనుచు

సంతసం బందుచు జననాథు దర్శింప
        జని వాఁడు పోయి వచ్చిన తెఱంగు
చెప్పి మ్రొక్కించిన క్షితిపాలకుండును
        మోదంబుతో వాని నాదరించి


ఆ.

రాజనీతులు మంత్రి కార్యక్రమంబు
లడుగుచును గొంతతడవున కట విదేశ
మేగి చోద్యంబు లచ్చట నేమి గంటి
చెప్పు మనవుడు గ్రహిలుండు చెప్పె నదియు.

183


ఆ.

కడిమి నంధ్రభూమి గౌతమిలో జల
ముడుకుచుండ నుండు నొక్కమడువు
లోననుండి రాత్రి లోలాక్షు[21] లెనమండ్రు
వెడలి వత్తు రచటి మృడుని గొలువ.

184


క.

వచ్చి తమయాటపాటల
నచ్చంద్రాభరణుఁ గొలిచి యరుగుచు నను వా
రచ్చటికిఁ బిలువ నుదకపుఁ
జిచ్చు సొర న్వెఱచి పోక చిక్కితి గుడిలోన్.

185


చ.

అనవుడు వేడ్క వానిఁ గనకాభరణాదుల నాదరించి వీ
డ్కొని నృపుఁ డొక్కఁడు న్వెడలి కొన్నిదినంబుల కంధ్రభూమి కా
ననములు దాఁటి పాపహిమనాశనసార్థము నుష్ణతీర్థముం
గని వెఱ గంది పొంత నుదకంబులఁ గ్రుంకి శివార్చనామతిన్.

186


క.

ఆగుడికిం జని హరు నను
రాగంబునఁ గొలుచు నంత రవి గ్రుంకె నను

ద్వేగంబునఁ జీఁకటి ది
గ్భాగంబుల నిండె మేఘపటలము భంగిన్.

187


క.

గుడగుడ నుడికెడి యుదకము
ముడివడ గర్జితములట్లు మ్రోయగ దెసల
న్వెడఁ గడర మెఱపుఁదీవల
వడుపున నమ్మడువు వెడలి వచ్చిరి పడఁతుల్.

188


ఆ.

అట్లు వచ్చి పంచమాదిస్వరంబుల
శ్రుతుల లయలఁ దాళగతుల యతుల
గానగేయగీతగాంధర్వభేదంబు
లలవరించి పాడి యాడునపుడు.

189


క.

నరలోకము నహిలోకము
సురలోకముఁ జూచినాఁడఁ జూచినసతు లె
వ్వరుఁ గారు వీర లని భూ
వరుఁ డచ్చెరువంది యుత్సవముతో నుండెన్.

190


క.

ఆలోన నాటపాటలు
సాలించ యొకింత మగిడి జనపతిఁ గని నీ
వాలోకమునకు రమ్మని
లోలాక్షులు పిలిచి మడుఁగులోనికిఁ జనినన్.

191


క.

కడుఁదెంపరియై భూవరుఁ
డుడికెడు వెడమడుగునడుమ నుఱికెను మును గ్రాఁ
గెడునూనియకొప్పెరలోఁ
బడి వెడలినవాఁడు [22]నీళ్ళఁ బడు టచ్చెరువే.

192

క.

ఉఱికి తదభ్యంతరమున
నెఱమంటలు దాటి వెనుక నేతేరఁగ న
త్తెఱఁ గెఱిఁగి నిలిచి ప్రియమున
దెఱవలు చెయివట్టి భూపతిం దోకొనుచున్.

193


ఆ.

రజతసౌధములును రత్నగేహంబులుఁ
గనకమండపములుఁ గలుగుపురము
సొచ్చి వైభవములు సూపుచు మౌక్తికా
సనముమీఁద నతని నునిచి రంత.

194


క.

కనకకలశోదకంబుల
జనపతిచరణములు తొడసి సత్కారము లిం
పునఁ జేసి సఖులు లోచన
వనజంబుల దీపముల నివాళింపంగన్.

195


వ.

అందు నొకసఖీశిరోమణి నృపశిఖామణికి నయ్యెనమండ్రను జూపుచు.

196


సీ.

అవనీంద్ర యష్టమహాసిద్ధు లీరామ
        లాఖ్యానగుణము లిం దమరియుండు
నతిసూక్ష్మరూప మీయణిమచేఁ జేకుఱు
        మహిఁ బెద్దగాత్ర మీమహిమ నొదవు
[23]జలమున మింటను జులక నయ్యెడునట్టి
        లాఘవం బొనరు నీలఘిమచేత
బరు వైనభావ మీగరిమచే నగపడు
        నీప్రాప్తిచే నగు నిష్టగతులు


ఆ.

నెనయు దలఁపు లీప్రాకామ్యమున ఫలించు
మనుపఁ జెఱుప నీయీశత్వమునన కల్గు

[24]నమరవరులైన నీవశిత్వమునఁ జిక్కి
మాఱువల్కరు కైకొమ్ము మమ్ముఁగూడ.

197


వ.

ఈయష్టసిద్ధులకు మేము పరకాయప్రవేశాద్యుపసిద్ధులము. తత్పరిచారికాసహస్రసహితంబుగా నీరాజ్యంబు గైకొని యందఱు నేలుకొ మ్మనిన నతివిస్మితుండై యతండు నయవినయంబుల నిట్లనియె.

198


క.

మీరలు దేవత లన్యులఁ
గోరం దగ దేను దీర్థగుణ మెఱుఁగఁగ నా
నీరంబుల మునిఁగితి మీ
కారుణ్యవిలోకనంబు గలిగినఁ జాలున్[25].

199


క.

అని మ్రొక్కి లేచి చనఁజూ
చిన నాతలఁ పెఱిఁగి యష్టసిద్ధులు నగుఁ గై
కొను మని యెనిమిదిరత్నము
లనిమిషసతు లిచ్చి వెడల ననిపిరి నృపతిన్.

200


మ.

అకలంకుం డగు నమ్మహీవరవరుం డానందసంస్ఫూర్తిచే
వికసన్మానసుఁ డై ప్రసిద్ధవనము ల్వీక్షించుచు న్వింధ్యభూ
మికి గోదావరి దాఁట కాఱడవిఁ బేర్మిం బోవుచో నొక్కవి
ప్రకుమారుం గనియె న్నిరంతరగళద్బాష్పాకులప్రేక్షణున్.

201


చ.

కని యిది యేల యేడ్చెదవు కానలఁ గ్రుమ్మర నేటికన్న నో
మనుజవరేణ్య నాజనని మజ్జనకుం గడు దూఱె దూఱిన
న్మనమునఁ గంది యాతఁ డభిమానముతో వనభూమి కేగె నా
తని నరయంగఁ ద్రిమ్మరుచు దవ్వుగ వచ్చితిఁ గాన నావుడున్.

202

క.

మాతకడ నుండు పొ మ్మిదె
నీతండ్రిం బంపునాఁడ నిజమని [26]యతిదుః
ఖాతురుని మగుడ ననిపి మ
హీతలపతి రత్నగుణము లెరుఁగం దలఁచెన్.

203


ఆ.

ఇతనితండ్రి యున్నయెడకు నిప్పుడ యేగ
వలయు నతనిఁ బ్రోవవలయు ననుచు
రత్నసిద్ధి నంబరంబునఁ జుల్కనై
యర్కు మాడ్కి విక్రమార్కుఁ డేగె.

204


క.

అవ్విప్రు జేరి తెలియఁగ
నెవ్వఁడ వీ వనుఁడు నాతఁ డిట్లనియె ధనం
బెవ్వెంట లేక బ్రతుకుట
నెవ్వ యనుచు నింటితరులు నీఁగినవాఁడన్.

205


ఉ.

కాశ్యపిలోఁ బ్రసిద్ధమగు కంచిని నుండుదు విష్ణుశర్ముఁడం
గశ్యపగోత్రజాతుఁడ వికార విదూరమనస్కుఁడన్ జగ
ద్వశ్యకళావిశారదుఁడ దైవము చెయ్ది దరిద్రభావనా
కార్యము నొంది భార్య గడుఁ గష్టపుఁబల్కులు వల్క నోర్చితిన్.

206


క.

పడఁ గుక్కి లేదు నేలం
బడి పొరలఁగ [27]రొండలూఁడఁ బడితిని దల దా
జడగట్టెఁ గట్టఁ గోకయుఁ
గుడువం గూడును నెఱుంగఁ గుందుట దక్కన్.

207


సీ.

కుండలముందఱఁ[28] గూర్చుండి పడుచులు
        [29]గంజికి నేడ్చుచుఁ గదలలేరు

మోకాళ్ళఁ దల లిడి ముడిఁగి నిద్రింతు రే
        కాలంబునను మేనఁ గప్పు లేక
యతిదరిద్రునకు నిల్లా లౌటకంటెను
        జచ్చుట గడుమేలు సతుల కెల్లఁ
బాపకర్మునిఁ జెట్టవట్టుట మొదలుగా
        నిడుమలేకాని యొం డెఱుఁగననుచు


ఆ.

మగువ తెగిపల్క నవ్వగ మాన్పలేక
జీర్ణదేహుండ ధనము లార్జింపలేక
యూఁతకోలయుఁ దోడుగా నొయ్య వెడలి
దూర మరుదెంచి [30]యడవిలోఁ జేరినాఁడ.

208


చ.

అనవుడుఁ జింత నొంద కది యట్టిద యెమ్ములు బూదిపూఁత దు
న్నని పసరంబుఁ దోలు మసనంబుల యున్కియుఁ జూచి నిర్ధనుం
డని శివుఁ బాసి రత్ననిధి యైన సముద్రునిఁ గూడె గంగ భా
మినులు ధనంబు లేనిపతి మెచ్చరు లేమియె కీడు గావునన్.

209


క.

ధన మొకటి యేల తలఁచిన
పను లన్నియు వీనిచేత ఫలియించుం గై
కొను మని మహిమలు చెప్పుచు
నెనిమిదిరత్నములు నతని కిచ్చెం గరుణన్.

210


శా.

ఆవిప్రుండు మణిప్రభావమున దివ్యంబైనదేహంబు స
ద్భావంబున్ ధనలబ్ధియుం బడసి యుత్సాహంబుతోఁ గంచికిం
బోవం గోరి నభోగతిం జనియె, నాభూపాలుడున్ దానవి
ద్యావైచిత్రి ఘటించి వచ్చె నతిమోదం బైన యుజ్జేనికిన్.

211

శా.

తత్సామాన్యగుణంబు లిట్లొదవినన్ ధారాపురాధీశ నీ
యుత్సాహంబు ఫలించు నిట్టిగతి నీ వూహింపుమా నావుడు
న్మాత్సర్యంబున నెక్కఁజెల్లదని యాత్మం జూచి భోజుండు వి
ద్వత్సంఘంబులు గొల్వఁగా మగిడె నాధాత్రీశు నగ్గించుచున్.

212


శా.

దుర్గాంభోనిధికన్యకారమణు నస్తోకప్రభామండల
స్నిగ్ధశ్యామలదివ్యదేహు నుచితశ్రీగోపవేషక్రియా
ముగ్ధస్త్రీహృదయాపహారిఁ గరుణాంభోరాశిఁ దేజఃకళా
దగ్ధానేకమహాసురున్ సురహితుం ద్రైలోక్యరక్షామణిన్.

213


శా.

గీర్వాణాచలరూపచాపశిఖరాంగీకారదీర్ఘోరుస
న్మౌర్వీభూతఫణీంద్రసంయుతమహానారాయణాస్త్రున్ జగ
దుర్వారాకృతికాలకూటగిళనాస్తోకాసితగ్రీవు గం
ధర్వేంద్రార్చితపాదపీఠు నిజభక్తవ్రాతచింతామణిన్.

214


మాలిని.

దివిజసరిదు పేతా దేవ దేవానుజాతా
ప్రవిమలనిజగోత్రా పాండుపుత్రైకమిత్రా
వివిధకుధరదారీ విశ్వరక్షావిహారీ
శివమధురిపురూపా సిద్ధబుద్ధస్వరూపా.

215


గద్యము.

ఇది రాయగజగంధవారణ వైరిమండలీకభేకఫణీంద్ర వీరఘోట్టవిభాళ కళింగదేశనిర్దూమధామ త్యాగనాగార్జున కర్ణాటద్రవిళాంధ్రమహారాష్ట్రభూపాలరూపనూపురసుందరచరణారవింద సనదప్రోలిపురవరాధీశ్వర
వెలనాఁటిపృథివీశ్వరరాజ్యసముద్ధరణ శ్రీ కొఱవి వెన్నయామాత్యపౌత్ర హరితసగోత్రపవిత్ర సకలసుకవిమిత్ర కసువరాజతనూజ గోపరాజప్రణీతం బైన సింహాసనద్వాత్రింశిక యనుకావ్యంబునందు సాహసాంకువీరసాహసమహోదారత్వప్రశంసనం బన్నది యష్టమాశ్వాసము.

  1. దేటయి నీటయి నేటు జూపుచున్
  2. ముత్కలికుండై
  3. దుప్పు లెలుఁగులు వ్యాఘ్రంబు లుప్పతిల్ల
  4. వరలు దురువాతులు న్నరపతులు గల్గి
    కొఱనువులు మరినాగులు గుజ్జుశిండ్లు
  5. నారి, జిట్టబొడమికమ్ము వెట్టినగతి పందివాట్లగృచ్ఛి పట్టెత్తిదద్దెనం-
  6. నెగడుచు
  7. మంత్రికుమార
    వరులకాలిగోరు సరియుగావు
    చెడుగుఁ బనులు సేయఁగడఁగి నాకిట దల
  8. మనుకడ లేనట్టి నరక
  9. శ్రీమహాజననంబున నొక్కయగ్రహారంబు, మహాఘనగిరియొద్ద గొందఱుసభ్యులు
  10. జరపి చచ్చు కంటె
  11. హృదయభంగాఖ్యన్ జగత్ఖ్యాతమై
  12. రంగదుత్కూలరంగన్ -రంగనృత్యత్కురంగన్
  13. గద్దరికొమ్ముల
  14. పైఁడిపట్టునన్
  15. సంగీతలై
  16. నాదవినోదము
  17. సాళాదిగీత
  18. దొయ్యలులకు వేడ్క తొంగలింప
  19. ఈ చంపకమాలకు ప్రత్యంతరములో
    గీ. కంకణములు తాళగతి చెలంగఁగఁబాద
    కటకములును మ్రోయ నటనచూపెఁ
    దరుణి యొకతె క్రొత్తమెఱపుకైవడి నిండి
    రసము భావపుష్టిఁ బొసఁగుచుండ.
  20. కూకటియను వేల్పు గొల్చుచు
  21. మీనాక్షు
  22. దీనఁ బడు టచ్చెరువే
  23. జలముల మునుఁగఁగఁ జులక గానయ్యెడు
  24. అమరవరు లౌదు రీవశిత్వమునఁ గాన, మాఱువల్కక కైకొమ్ము మమ్ముఁ గూడ
  25. గలిగెం జాలున్
  26. యాయ్యన్ ద్యోతతకుని మగుడ ననిపి
  27. లొండులూడ, కన్ను లూడఁబడవెండ్రుకలు
  28. గుంటలముందఱ
  29. గంజి కేడ్చుచునది గానలేరు
  30. చావంగఁ గోరినాఁడ