సింహాసనద్వాత్రింశిక/ద్వితీయాశ్వాసము



శ్రీరస్తు

సింహాసన ద్వాత్రింశిక

ద్వితీయాశ్వాసము

క. శ్రీరామాకుచశైలవి
హారుని మునిహృదయగహ్వరాశ్రయుని మహా
దారుణనఖదారితరిపు
వారణనరసింహు నిగమవనసంచారిన్. 1

క. మనమునఁ దలఁచుచు విద్వ
జ్జనదైవజ్ఞాది సర్వజనసమ్మత మౌ
దినమున భోజుఁడు సింహా
సన మెక్కం గడఁగె రాజ్యసంపద మెఱయన్. 2

సీ. ధారాపురంబులోఁ దారాపథమువోలు
రత్నమండపములో యత్న మమర
నిమ్మైన పసిఁడికంబమ్ములమేడలో
దివ్యసింహాసనస్థితి యొనర్చి
యవరోచనాజ్యదూర్వామ్రపల్లవపుష్ప
సిద్ధార్థదధిఫలక్షీరములును
నాదిగాఁ బెక్కు పుణ్యద్రవ్యములు గూర్చి
పుణ్యాహమున భూమిపొలుపుదీర్చి[1]

ఆ. దేవతరువుమాడ్కిఁ దెల్లనిగొడుగుతోఁ
గూడఁ బసిఁడికామకుంచె లచట
నిలిపి పొంతఁ గైదువులు సేర్చి యర్చన
లిచ్చె నుత్సవంబు పిచ్చలింప. 3

వ. తదనంతరంబ నానాపురాణేతిహాసశ్రవణంబులను బంచమహావాద్యప్రపంచంబులను సంగీతసాహిత్యసంగతనాట్యప్రసంగంబులను బ్రతియామదీయమానధూపదీపాదినైవేద్యమహోపచారంబులను దత్పరివారదేవతలకు నుపబృంహణంబుగా సమం బగునేమంబున నారాముండునుంబోలె నాయామినిం గడపి మఱునాఁడు కృతమంగళస్నానుండై ప్రత్యూషనిత్యకృత్యంబులు నిర్వర్తించి యప్పుడు మకరతోరణంబులునుం దెలిముత్తియంబుల తోరణంబులునుం గలువడంబులు, బరికూటంబులు మేలుకట్లునుం జీరగుండ్లును మృగనాభిలేపనంబును, ముక్తాఫలరంగవల్లికలును వెల్లివిరియ నుల్లంబుల నుల్లసిల్లుపౌరులును నాసదిగంతాగతవిద్వజ్జనజ్యోతిషికశాకునికస్వరవేదులును వందిమాగధబృందంబులును బసిండిపళ్లెంబుల మాణిక్యదీపంబులతో నివాళింపుచున్న పుణ్యాంగనలును హితరాజలోకబంధువర్గంబునుం దలకొన జయ జీవ వర్ధస్వ సుఖీభవాది శుభసూచకశబ్దంబులును బహువిధవాద్యరవంబులును, నొక్కటై దిక్కులు పిక్కటిల్ల మిక్కుటంబుగా సుముహూర్తంబున సర్వతోముఖంబగు మహాసింహాసనంబు డగ్గఱి ప్రదక్షిణంబుగాఁ దిరిగి చూచి తత్త్వద్వారంబులకడల నున్న బొమ్మల తలకడల నున్న పిన్నగద్దియలలో నెందేని నడుగిడి పెద్దగద్దియ యెక్కుట భావ్యం బని వారశూలరహితంబుగా నొక్కదిక్కున నిలిచి సకలజనకలకలంబు నుడిపి మౌహూర్తికసావధానశబ్దంబు లొలయ నిష్టదేవతలం దలంచి ప్రశస్తఖడ్గహస్తుండై పూర్ణఘటికోచితనాదావసరంబు నెదురు చూచుచుండ. 4

మొదటిబొమ్మ కథ

క. మును గడియారంబునఁ గ
ట్టిన పెనుజేగంటరవము ఠేయనునెడ గ్ర
క్కున భోజుం డడుగెత్తినఁ
గని నిలునిలు మనుచు బొమ్మ కలకలఁ బలికెన్. 5

చ. పలికిన భోజుఁ డద్భుత మపారముగా మది నిండి పాఱఁగా
నిలిచి గతజ్ఞ తద్జ్ఞ ధరణీసుర మాగధవందిగాయకా
కలకల మెల్ల మాన్చి శుభకాలములో నిది యెక్కఁ బూనఁగా
వల దన నేల యిందుల నివారణకారణ మేమి నావుడున్. 6

మ. తనవాక్యంబులు తత్సభాజనుల కుత్సాహంబు నాశ్చర్యముల్
పెనఁగొల్పంగఁ బసిండిబొమ్మ నగి గంభీరంబుగాఁ బల్కె నో
జననాథా విను చంద్రగుప్తనృపసంజాతుండు కంజాతమి
త్రనిభుం డుజ్జయినీపురిం బరఁగె నేతత్కర్త సత్కీర్తితోన్. 7

వ. ఆయనఘనత యెట్టి దంటేని. 8

క. సిద్ధులకు నసాధ్యము లగు
సిద్ధులు నెనిమిదియుఁ దనకు సిద్ధంబులుగా
నిద్ధరణిఁ బౌరుషమునఁ బ్ర
సిద్ధుం డగు సాహసాంకుఁ జెప్పం దరమే. 9

శా. సంభూతాన్యవిడంబడంబరమిథఃసంరంభగర్వోర్వశీ
రంభానాట్యవిజృంభమాణమతివిస్రంభాదిశుంభన్మనో
జంభారిప్రియసంభృతానకమహాసంభావనాసంభవా
స్తంభోదర్కుఁడుఁ విక్రమార్కుఁ డతఁ డేతన్మాత్రుఁడే చూడఁగఁన్. 10

క. అతిశయవితరణగుణమున
నతనికి సరిరాక యెక్క నలవియె నీకుం

గ్రతువులు నూఱును జేయక
నితరుల కమరేంద్రపీఠ మెక్కం దరమే[2]. 11

క. అనవుడు భోజుఁడు విస్మయ
మును సిగ్గు నహంకృతియును ముప్పిరిగొన ని
ట్లనియె నొక యర్థి వేఁడినఁ
దనియఁగ సహపాదలక్షధన మే నిత్తున్. 12

క. నావితరణ మిది యల్పమె
నావుడు నది నవ్వి తనగుణం బన్యులకుం
దా వినిపించుట కొఱఁత గ
దా వివరము తప్పి తీవు ధరణీనాథా! 13

క. ఇది మొదలు కొఱఁత యయ్యెం
దుదిఁ బుణ్యము హానిఁబొందె దొడ్డతనంబుం
జెదరెం దనుఁదాఁ బేర్కొను
టిది కష్టము తొంటినీతి యెఱుఁగవు చుమ్మీ. 14

ఉ. ఆయువు మంత్ర మౌషధము నర్థము దానము మానభంగ మ
న్యాయము నర్థనాశము గృహవ్యసనంబును దాఁపురంబుగాఁ
జేయుట నీతియుక్త మటు సేయక తా నయి దానధర్మముల్
చేయుదునంచుఁ జెప్పినను సీయని నవ్వరె ధర్మ మెంచరే. 15

సుదర్శనుని కథ

క. ఈ సమయమునకుఁ దగ నితి
హాసము గలదొకటి వినుము హరిదశ్వకులో

ల్లాసకరుఁ డయోధ్యాపుర
వాసి సుదర్శనుఁ డనంగ వసుమతి నేలెన్. 16

చ. అతఁడు సపాదలక్షవసుధామరపంక్తికి భోజనంబు సు
వ్రతముగఁ బెట్టుచుం దివిజవర్గము మిక్కిలిఁ దుష్టిఁ బొందఁగాఁ
గ్రతువులు పెక్కు సేయుచు జగన్నుతుఁడై సరయూతటంబునం
గతిపయవాసరంబు లధికం బగుసత్ర మొనర్చుచుండఁగన్. 17

క. శారద వీణావాద్యవి
శారద తగురూప మైనచందము మెఱయన్
శారదనీరదనిభుఁ డగు
నారదముని చేరవచ్చె నరపతిఁ జూడన్[3]. 18

క. వచ్చినమునిఁ గనుఁగొని యిటు
విచ్చేయుం డనుచు మ్రొక్కి విభుఁడు చితార్ఘ్యం
బిచ్చి కృతాంజలియై నే
సచ్చరితుఁడ నైతి మీ ప్రసాదము కలిమిన్. 19

ఆ. ఎచటినుండి యిటకు నేతెంచితిరి నన్ను
ధన్యుఁ జేయ నన్నఁ దపసి వలికె
బరమధర్మశీల బ్రహ్మలోకమున నీ
దానధర్మవార్తఁ దడవ వింటి. 20

చ. విని నినుఁ జూడ వచ్చితి భువిం గడుఁ బుణ్యుఁడ వంచు నన్న నో
మునివర శిష్యుఁగాఁ దలఁచి ముద్దునఁ బల్కెద వెంతవాఁడ నే
ననుచు వినీతుఁడైనఁ గొనియాడి గుణాఢ్యుఁడ వీవు నీయశం
బనఘచరిత్ర బ్రహ్మభువనాంతము ముట్టిన దింత చాలదే. 21



క. విశదమగు కీర్తివసనము
కృశరక్షక! సప్తతంతుకృత మయ్యుఁ జతు
ర్దశభువనంబులఁ గప్పెను
వశమే నినుఁ బొగడ శేషవాణీశులకున్. 22

వ. కావున నీ కసాధ్యంబు లే దెట్లన్న. 23

క. ధాత్రీశ పుణ్యనిర్మల
గాత్రులకును జగములో నగమ్యము గలదే
క్షత్రియపుత్రుఁడు విశ్వా
మిత్రుఁడు బ్రహ్మత్వపదవి మేరల మీఱెన్. 24

క. స్వకులోచితధర్మముఁ ద
ప్పక మనువారలకు వలయుపని దుర్ఘటమే?
ప్రకటంబుగ ఋషిపత్నులు
సికతాకలశముల జలము చేరుపుగొనరే. 25

వ. దీనికి దృష్టాంతంబుగ నీవును దీనం గుండఁ జేసి నీరు నించిన నిలుచు నని యిసుక చేతి కిచ్చిన నృపాలుం డందుకొని. 26

క. ఆటు చేసినఁ జిత్రము మి
క్కుటముగ నా దానధర్మగుణసిద్ధునిచే
ఘటితరస మైనసికతా
ఘటి యొప్పెను రసము ఘుటికగట్టినభంగిన్.27

[4]

క. కృతిఁ గుండలు నిలిచిన స
త్కృతి గనుఁగొని నారదుండు దినమును నీ వీ
గతిఁ బుణ్యకీర్తి వెలయిం
పు తపోనిష్ఠలను వెలసి పుణ్యవిచారా. 28

వ. ఆని యుపదేశించి చనిన. 29

ఆ. ఇట సుదర్శనుండు నీ మట్టికుండల
నిచ్చ వండిపెట్ట మెచ్చుగాదు
మంటఁ జేసి మొదలి వంటనే కఱిగొన్న
దానఁ దొలుత వండఁ దగుట యెట్లు. 30

మ. అని మృద్భాండము లెల్లమాని సికతాయత్తంబు లౌ కుండలన్
ఘనుఁ డాపాయసశాకసూపముల పాకం బెప్పుడుం జేయుచుం
దనియన్ బ్రాహ్మణభోజనంబు లిడుచుం దానొక్కనాఁ డప్పదా
ర్థనికాయంబులు వండుచోటఁ జని తత్సామగ్రి వీక్షింపఁగాన్. 30

క. వెస లుడుకం గని నృపుఁ డు
బ్బసమున నే నిట్టిఘనత వడసితి ననఁగా
నిసుమునఁ జేసినకుండలు
విసవిసలై విరిసెఁ బుణ్యవిపరీతగతిన్. 32

క. ఉలికి యతం డప్పుడు మదిఁ
గలఁగుచు నిటఁ గల్మషంబు గలసెనొ తగు వి
ప్రులయెన్నిక గూడదొ హో
తలు మంత్రముఁ దప్పిరొక్కొ ధర గదలెనొకో. 33

మ. అని యుత్సాహవిహీనుఁ డౌచు నతిచింతాక్రాంతుఁడై యుండగా
దనయిచ్ఛన్ముని తొంటిచాడ్పున వియద్భాగంబు శోభిల్ల వ

చ్చినఁ బూజించి మునీంద్ర నామహిమకుం జేటయ్యెఁబో నీవు చె
ప్పినమర్యాదయు నెట్లు దప్పె ననినం బృథ్వీశు బోధించుచున్. 34

క. మర్యాదఁ దప్పెఁ జిత్తవి
పర్యాసాహంకృతులను బార్థివ “గర్వా
త్కార్యం వినశ్యతి" యనుచు
నార్యులు మును చెప్పునీతి యదితప్పగునే. 35

క. పర్వతపథమున రథమును
బర్వస్త్రీసంగమమున బ్రాహ్మ్యవ్రతమున్
గర్వము నధర్మకార్యము
నుర్వీభాగమున నావయు న్నడవ దనా. 36

క. ఇంతమహిమ వడసితి నని
సంతసమున నీవు రాజసము గైకొన్నన్
సంతతముఁ జేయు సుకృతం
బింతయు నిట్లింకె నింక నే మనవచ్చున్. 37

ఉ. నావుడు భూవరుండు మునినాయక నే నపరాధి నైతి నేఁ
డావిధ మేక్రియం గలుగు నానతి యి మ్మని మ్రొక్కినంత నా
దేవమునీంద్రుఁ డి ట్లనియె ధీరుఁడ వై మది నుబ్బు లేక భూ
దేవసపాదలక్షఁ బరితృప్తి యొనర్పుము భుక్తిముక్తులన్. 38

క. బహుదినములు జరపఁగఁ ద
న్మహిమయుఁ జేకూరు నింక మనమున గర్వా
గ్రహము వల దనుచు శుభ మెం
దుహితంబుగఁ జెప్పి నారదుఁడు సనినంతన్. 39

క. తాఁకిన మఱి వంగినక్రియ
నాఁకొని వడిపండుకొన్న యనువున నృపుఁడుం



దేఁకువసెడి తొల్లిటివ్రత
మాకౌలఁదినె నిత్యసత్ర[5] మచ్చట జరిపెన్. 40

ఉ. కావున నేన దాత నని గర్వము గైకొని పల్కి నీ వస
ద్భావుఁడ వైతి దానమును బౌరుషముం బరు లెన్నకుండఁగాఁ
దా వినిపించెనేనియు నతండుఁ దృణంబును నొక్కయెత్తగున్
క్ష్మావర గంజిలో మెతుకు గల్గినఁ గ్రొవ్వుట నీమహత్త్వముల్. 41

ఆ. అనుడు ఘనుఁడు భోజుఁడును మనంబున స్రుక్కి
బమ్మరిల్లి పసిఁడిబొమ్మ ! నాదు
దానమల్ప మన్నదానవు మీరాజు
దానమెంత చెప్పు దాన నిలుతు[6]. 42

వ. అనిన సాలభంజిక యి ట్లనియె నతం డిట్టి మహావదాన్యుండు. 43

క. పొడగన్నంతనె వేయును
నొడివినఁ బదివేలు నగిన నూఱ్వేలు మనం
బొడఁబడి మెచ్చినఁ గోటియు
నడిగెడువారలకు నిచ్చు హాటకమయముల్. 44

చతురంగ తజ్ఞుని కథ


మ. అది యెట్లన్న నతండు కీర్తి దిశలన్ వ్యాపింప భూమండలం
బుదధు ల్మేరగ నేలుచుండి యొక నాఁ డుర్వీశులు న్మంత్రులున్
సుదతీరత్నములు రసజ్ఞులుఁ గవిస్తోమంబులుం గొల్వ న
త్యుదయశ్రీఁ గొలువిచ్చి యుండఁగఁ గవీంద్రుం డొక్కఁ డేతెంచుచున్. 45

సీ. దందశూకాధిపోద్దండభుజాదండ
భూరివిశ్వంభరాభారధుర్య



జంభారీపరికీర్తితాంభోజినీమిత్ర[7]
సూణుసమాహియదాణరాయ[8]
అక్కిణహృదయ దండొక్కకేళఃక్కేళి
పతివఃకణీవళఃపక్కడక్క
అంకక్కరిక్క మహాలదసాందన
లవలవప్పహిత తులఃకధీర
ఆ. ధీరసంపదస్తు దేవబంధకహిమ[9]
దఃకసొక్కు మోరిదర్శనిచయ
యనుచు నాల్గుభాషలను రాజు దీవించి
నయనసంజ్ఞ నాసనమున నుండి. 46

సీ. రాజేంద్ర యాఱక్షరముల పేరిటివాఁడ
నాద్యక్షరము మాన నశ్వవేది
రెండక్షరములఁ బరిత్యజించిన నాట్య
కర్త మూఁ డుడిపిన గతవిదుండ
నాలుగు నుడిగింపఁ జాలనేర్పరి నైదు
విడిచిన బుధుఁడ నీవిధము గాక
సర్వాక్షరంబులుఁ జదివిచూచిన బుద్ధి
బలముగాఁగల యట్టి ప్రౌఢుఁ డనఁగ
ఆ. నేతిబీఱకాయనీతి గాకుండంగ
నిన్ని విద్యలందు నెన్నఁబడ్డ
సార్థనాముఁ డైనయర్థిగా నెఱుఁగుము
విబుధపంకజార్క విక్రమార్క. 47

తే. అనినఁ గ్రమ్మఱఁ జదివించి యల్లనవ్వి
ధరణిలో నీవు “చతురంగ తద్జ్ఞ" సంజ్ఞ
బరఁగినాఁడవ యనుఁడు భూపాలుఁ బొగడి
యెలమిఁ జతురంగతద్జ్ఞ కవీశ్వరుండు. 48

క. ఇది తగుఁదగ దనక కళా
విదులకు నీసమ్ముఖమున విద్యలయెఱుకం
బొద పెట్టుట హనుమంతుని
యెదుర వెసం గుప్పిగంతు లెగయుటచుమ్మీ[10]. 49

ఉ. అంబుజమిత్రతేజ భవదగ్రకరప్రసృతంబు లైన దా
నాంబువులందుఁ బుట్టె భువనాంతము నిండుచుఁ గీర్తిపుండరీ
కంబు ప్రతాపసూర్యుఁడు వికాస మొనర్పఁగ నాకసంబు భృం
గంబుగ లోనఁ బూని యధికం బగువాసన నొప్పు నెప్పుడున్. 50

క. అని చెప్పిన పద్యములోఁ
దనకీర్తివ్యాప్తియుం[11] బ్రతాపస్ఫురణం
బును గని భాండాగారికుఁ
గనుసన్నం బిలిచి మెచ్చుగా నాతనికిన్. 51

క. ధనమిప్పించె విలోకన
మునకుం బలుకునకు హసితమునకుఁ గవికి వే
యును బదివేలును లక్షం
బును గోటియుఁ బసిఁడిటంకములు చొప్పులుగాన్. 52

క. ఘనుఁడు కవి వీడుకొని యొ
య్యన భాండాగారిఁ బిలిచి యర్థి ననుం జూ

చినఁ బలికించిన నవ్విం
చిన మెచ్చినను నిట్ల చెప్పక యిమ్మా[12]. 53

చ. అని సెలవిచ్చిన ధనగృహస్థితుఁ డౌ తనలెంక యిట్టిచొ
ప్పున నొసఁగంగ యాచకులు భూజనకల్పమహీజ మంచు నిం
పునఁ బొగడంగ దానగుణభూషణుఁ డంచు నవంతినాయకుం
డనుదినము యశంబు దిశలం దలర న్మహి యేలె నెంతయున్. 54

క. అది కారణముగ నతనికి
సదృశం బగుగుణము నీకుఁ జాలదుఁ భువిలో
బొదలని పెద్దఱికంబులు
పొద పెట్టక[13] మగిడి పొమ్ము భోజనృపాలా. 55

వ. అనుడు ననంతరంబ. 56

శా. లగ్నం బీక్రియ విఘ్న మొందిన నిరాలాపంబుగా విస్మయో
ద్విగ్నస్వాంతనృపాలపౌరహితవందివ్రాత మీక్షింపఁగా
భగ్నోత్సాహమనోరథుం డగుచు భూపాలుండు లజ్జాభరా
భుగ్నోస్యాంబుజుఁ డౌచు నింటి కరిగెం బుణ్యం బగణ్యంబుగన్. 57

వ. అంతఁ గొంతకాలంబున. 58

రెండవ బొమ్మ కథ

క. మొలఁ బులితోలును మేనం
బలుచని వెలిపూఁత యఱుతఁ బాములపేరుం
దల మిన్నేఱును జడలను
జలివెలుఁగుం గలుగు మేటిజంగముఁ గొలుతున్. 59

సీ. అనుచుఁ గడంకతో నా భోజతిలకుండు
దివ్యాసనంబెక్కఁ దివిరి మఱియు
ఫలకుసుమాదిశుభద్రవ్యములు గూర్చి
సర్వపూజలుఁ దొంటిజాడఁ జేసి
కవిరాజభూసుర గాయకపాఠక
నర్తకులును దనకీర్తి పొగడఁ
బసిఁడిగిన్నియలు చేపట్టి పుణ్యస్త్రీలు
శిరమున మౌక్తికశేష లిడఁగ
ఆ. ఖడ్గహస్తుఁ డగుచుఁ గదలి నృపాసన
ప్రాంతభూమి చేరె గ్రహబలంబు
గలుగు వేళఁ బూర్ణఘటికాంతనాదంబు
చెవుల సోఁకినంత శీఘ్రగతిని. 60

క. శింజాయితమంజీర
వ్యంజితనీలాంశుభృంగ మగు పదకంజం
బంజక యిడఁగా వేళా
భంజిక[14] యై యచట సాలభంజిక పలికెన్. 61

క. ఓహూ భూవర వలవని
హాహూలివి[15] యేల విక్రమార్కునిసరిగా
సాహసమును గంభీరో
త్సాహంబును లేక యెక్కఁ దరమే నీకున్. 62

ఆ. అనుడు నిలిచి భోజుఁ డాత్మగుణంబులు
చెప్పఁ జూచి మొదలితప్పు దలఁచి



మాని నాఁటిబొమ్మపూనిక నీవును
దప్పకుండఁ జెప్పు తద్గుణములు. 63

క. అనవుడు నది యిట్లను నీ
గొనములు గలనృపులఁ బేరుకొని చెప్పం జూ
చిన జగమున నుజ్జయినీ
మనుజేంద్రుఁడుగాక యితర మనుజుఁడు గలఁడే. 64

క. శుభలక్షణుఁడు వదాన్యుం
డభయుం డిఁకఁ గలుగ నేర్చునయ్య “నభూతో
నభవిష్యతి" యనుపలు కా
ప్రభువునకు సరిచెప్పుచోటఁ బలుకఁగవచ్చున్. 65

శా. ధారానాథ యనాథసస్యములకున్ ధారాజధారాధరా
కారుం డై కరుణామృతంబు గురియంగాఁ బ్రాజ్యసామ్రాజ్యల
క్ష్మీరూఢిం జగ మెల్ల నుల్లసిలఁగా శ్రీవిక్రమార్కాఖ్యుఁ డు
ర్వీరామారమణుండు కీర్తిఁ బరఁగెన్ వీరుం డుదారుం డనన్. 66

మత్తకోకిల. అమ్మహీశుఁడు నాఁడునాఁటికి నాత్మభూముల నన్యదే
మ్ములందుల వార్తలం బరిచారకు ల్వినిపింపఁగా
నిమ్ముతోడ నవంతిపట్టణ మేలుచుండఁగ దూరదే
శమ్మువార్త లెఱుంగఁబోయినచారు లిద్దఱు వచ్చినన్. 67

ఉ. అచ్చటివార్త లెల్లఁ దెలియ న్విని వారల నాదరించి మీ
రిచ్చటి కేగుదెంచునెడ నీనడుమన్ గిరులందుఁ గానలం
దచ్చెరు వేమి గంటి రని యానతి యిచ్చిన నందులోన న .
య్యిచ్చ యెఱింగి యొక్కఁడు నరేంద్రున కిట్లనియె న్వినీతుఁడై. 68

సీ. చిత్రకూటాద్రిపైఁ జిత్రంబు గనుఁగొంటి
నచటి బిల్వద్రుమప్రచుర మైన



పుణ్యతపోవనంబున రత్నకాంచన
మయమైన దేవతాలయము గలదు
లోకైకవంద్య మందాకినీజలధార
తోరమై ముందటఁ దొరఁగుచుండు
నానీరు శుద్ధున కమృతమై పొలుపారుఁ
బాపికిఁ గాటుక భంగిఁ దోఁచు[16]
ఆ. దానిపొంత నొకఁడు మౌనియై జపముతోఁ
బాయకుండ వేల్మి సేయుచుండు
నతని కెన్ని యేఁడు లరిగెనో యొలికిన
హోమధూళి హిమనగోన్నతంబు. 69

మ. అని చోద్యంబుగఁ జెప్పిన న్విని తదీయాలోకనోత్సాహియై
మనుజేంద్రుండును దిగ్గనం గదలి రమ్మా చూత మామౌని పా[17]
వనతీర్థం బని వానిఁ దోడుకోని భాస్వత్ఖడ్గసాహాయ్యుఁ డై
చనియెం గ్రూరమృగప్రచారతరువిస్తారంబులం దూఱుచున్. 70

వ. ఇట్టి దుర్గమమార్గంబునం జనుదెంచుచు నొక్క యెడ. 71

ఉ. భూరమణుండు గాంచె నతిభూరిపయోధరఝాట మాత్మవి
సారపునఃప్రరూఢపటుశాఖమహావటజూట మంచితో
ర్వీరుహసంభృతైకమునివీరకృతోటజవాటము న్సునా
సీరమణిప్రభాపటలచిత్రితకూటముఁ[18] జిత్రకూటమున్. 72

సీ. అందులతీఁగె లింద్రాంగణాగములతోఁ
జెలిమి సేయుచు మిన్ను గలయఁబ్రాఁకు



నందుల మ్రాకులు నందనవనకల్ప
తరువులతోఁ గూడి పెరుఁగుచుండు
నందుల క్రొవ్విరు లన్నదమ్ముల మాడ్కిఁ
జుక్కలవాసన కిక్కసేయు
నందుల సెలయేఱు లాకాశగంగతో
నటనలు సలుపుచు నాడుచుండు
ఆ. నందుల మెలఁగు కరు లైరావతముఁ దాము
గదుపుగట్టిమేసి మదము గురియు
నందుఁ గలుగు మౌను లాసప్తమునులతో
నిత్యసత్యగోష్ఠి నిలుతు రచట. 73

ఉ. అందుల నొక్కచో జలకమాడుచునుండఁగఁ దొల్లి మేదినీ
నందనవక్త్రవేణినయనస్తనకాంతులు జాతిరూపులై
యిం దుదయించె నాఁగ నుతి కెక్కుచుఁ బెక్కుదినంబు లంబుజేం[19]
దిందిర మీనచక్రములు దేలుచునుండు సరోవరంబులన్. 74

క. వివిధద్వాదశరాసులు
దవిలి తిరిగి పాళ్లసంపదలు చేకుఱమి
న్నవరత్నరాసులకునై
నవగ్రహంబులుం దదంగణంబులఁ బొలయున్. 75

క. వింతలుగా నగ్గిరిపొడ
వింతం తనిచెప్ప నలవి యే వెన్నెలఁ ద
తాంతంబునఁ గరఁగిన శశి
కాంతంబులు చంద్రుకందు గడుగుచునుండున్. 76

సీ. శిరమున విమలపుష్కరవతి యగుమాల్య
వతి రత్నమాలికావతి యనంగ
మృగపాదఘట్టన మృదులమౌజేగుఱు
ధూళి శేఖరితసిందూర మనఁగఁ
బ్రబలసమీరణోత్పతితంబు లైన పు
ష్పంబులు కరశీకరంబు లనఁగ
సర్వతోముఖసముచ్చాలనవారి[20] ని
ర్ఝరములు మదజలస్రావ మనఁగఁ
తే. దన్నుఁ జేరినమేఘముల్ మన్ననంగ[21]
సాలతరువులు బర్హధ్వజము లనంగ
నేచిస్వారాజ్యపట్టగజేంద్రులీల[22]
నిలిచిపొలుచు నయ్యచలంబు నృపతి యెక్కె.[23] 77

శా. లంకేశారిపదాంకితంబులు ఝరాలంకారకూలంకషల్
పంకేజాకరసంకులాంతరములం బ్రవ్యక్తదివ్యాంగనా
సంకేతంబులు మీనకేతనధనుష్టంకారశంకావహా
ఝంకారాళికులంబులుం గల మహాశైలస్థలుల్ చూచుచున్. 78

క. ధారాధరమార్గాగత
ధారాళం బగుచు ధరణీధరమధ్యకృతా
ధారం బై ధరఁ బరఁగిన
ధారాతీర్థంబు గనియె ధారాధీశా. 79

వ. కనిన నితని మనఃప్రసాదంబు దట్టం బై నిలిచె. 78

క. దుర్మార్గునకైన మహా
ధర్మస్థలి నాత్మశుద్ది దలకొను ననఁగా
ధర్మంబుల కాకరమౌ
నిర్మలునకుఁ జిత్తశుద్ది నిలుచుట యరుదే. 81

భుజంగ ప్రయాతము.
అతం డంత సుస్నాతుఁ డై రత్నహేమాం
చితం బై సువర్ణాద్రి చెల్వొంది దేవా
న్వితం బైన హర్మ్యంబు వే సొచ్చి యాదే
వతం గాంచి పూజించి వచ్చె న్నతుండై. 82

ఆ. అచటిహోమశాల కరిగి మౌనంబునఁ
ఘనతపోవిభూతి కలిమి మెఱసి[24]
మధురయుతములైన మారేడుఁబండుల
వేల్మి సేయుచున్న విప్రుఁ జూచి. 83

ఆ. అన్నపుష్పఫలజలాక్షతాదులు చేత
నున్నవాఁడును[25] జపహోమములను
జేయువాఁడు బ్రణతి సేయఁదగరుగాన[26]
మనుజవిభుఁడు మ్రొక్కు మానిపలికె. 84

క. ఓవిప్రోత్తమ హవనం
[27]బీవెరవున జరుగ వెన్ని యేఁడులు చనియె
న్నావుడు నుబ్బస పుచ్చుచు
నావిధిచేఁతలకు నేమి యనఁగల దధిపా. 8

ఉ. ఇచ్చట నేండ్లు నూఱు సనియెన్ జగదంబిక నాయవస్థకు
న్మెచ్చదు కూడు మాని రవి మీఁదఁ దపింపగఁ వేల్మి సేసి ము
చ్చిచ్చున వెచ్చుచుండి తెగఁ జిక్కితి నన్నఁ, గృపానువృత్తిఁ దా
నచ్చటివాని లేపి విహితాసనుఁడై నృపుఁ డాత్మనిష్ఠతో. 86

క. వ్యాలోలకరాళకజి
హ్వాలం బగు సప్తజిహ్వువదనంబున భూ
పాలుఁడు మధుమిశ్రిత మగు
మాలూరఫలంబు వేల్చె మంత్రము కొలఁదిన్. 87

వ, అట్లు హోమంబు గావించిన నయ్యుమ నెమ్మనంబున నమ్మిక పొడమి పొడసూపకున్నం గడచూపునం గెంపుగదుర మదిం బదరి దొరకొన్నకర్జం బుజ్జగించుట యిజ్జగంబున నొజ్జల లజ్జలుడు పురజ్జులను నుజ్జయినిఱేఁడు మారేడుఁబండు మాని తన మెడం జూచి. 88

తే. పలుకుఁదేనియ గలతలపండు వేల్వఁ
దలఁచి తలచిక్కు చెక్కు మీఁదటికిఁ[28] జెరివి
యెడమకేలఁ దెమల్చుచు నడిద మెత్తి
మెఱుఁగుమిడుఁగుఱు లెగయగా మెడకుఁ బూనె. 89

వ. ఇట్లు పూని యుంకించిన. 90

క. ఓహూ నృప నీధర్మో
త్సాహములకు మెచ్చితిని నిజం బిది యిఁక నీ
సాహసము విడువు మని త
ద్బాహాఖడ్గంబు వట్టెఁ బరమేశ్వరియున్. 91

క. పట్టి నిలుచుండి నృప నీ
కెట్టిహితం బైన వేఁడు మిచ్చెద నని చే

పట్టిన మ్రొక్కి మహీవరుఁ
డిట్టనియెం దల్లి మెచ్చి తెట్టులు నన్నున్. 92

మ. ఇతఁడు న్మౌనము సంధ్యయున్ జపము ని ట్లేకాలముం జేయఁగా
శతవర్షంబులు పోయె నీద్విజుని మెచ్చం జెల్లదో మెచ్చుసం
గతి గాదో గుణ మానతి మ్మనిన నోక్ష్మాపాల యీదుస్తర
వ్రతము ల్గల్గియుఁ జంచలంబు మతి భావం బల్ప మెప్పట్టునన్. 93

ఆ. మేరుశైలధీర పేరులంఘితమున
నాఁగు నీవ్రతంబు నగణితంబు[29]
చంచలాత్మకృతము సంకల్పరహితంబు
నైన జపము లెల్ల హానిఁ బొందు. 94

క. దేవర భువిఁ గాష్ఠంబున
గ్రావంబునఁ గాంచనమునఁ గలుగఁడు శుచియౌ
భావమునఁ గలుగ నేర్చును
భావజ్ఞా! భావశుద్ధి పరమార్థ మనన్[30]. 95

క. డెందంబున సందేహము
నొందక ప్రహ్లాదుతండ్రి నొడఁబఱిచెడుచో
నిందుఁ గలఁ డనినఁ గంబము
నం దుదయింపండె విష్ణుఁ డసురులు బెదరన్. 96

క. దేవద్విజమంత్రౌషధ
దైవజ్ఞాచార్యతీర్థధర్మముల యెడన్
భావన యేవిధమున నౌ
నా వెరవున నచటి సిద్ధి యగునిద్దగతిన్[31]. 97



ఆ. భావ మస్తిరంబు గావున వీనివ్ర
తంబులెల్ల నిష్ఫలంబు లయ్యె
నీవు నిష్ఠ నిట్లు గావించితివి గాన
గడియలోన మెచ్చు గలిగె నీకు. 98

క. ధన్యుఁడ వనవుడు విని స
త్కన్యాదానమును దేవతావరమును రా
జన్యవరాజ్ఞయుఁ దిరుగుట
యన్యాయము గానఁ దిరుగ కంబిక వినుమా. 99

ఉ. ఇష్టములెల్ల నాకుఁ దగ నిచ్చెద నంటివి సర్వమున్ వ్రత
భ్రష్టుఁడు నాక వీనికిఁ గృపామతి నిమ్మని మ్రొక్కినంత సం
తుష్టి వహించి దేవత చతుశ్శతవత్సరభోగ్యమైన యు
త్కృష్టమహీపతిత్వమును దివ్యపదంబును నిచ్చె వానికిన్. 100

క. వానికి ని ట్లిచ్చి ధరి
త్రీనాయకుఁ బరిణమించి దేవియు నంత
ర్ధానమ్మునొందె విప్రుఁడు
నానృపు వెఱఁగంది పొగడి యరిగే నిజేచ్ఛన్. 101

శా. తత్సేవాఫలదర్శనంబున మహాప్రస్థానవిశ్రాంతిగా[32]
నుత్సాహంబును సాహసంబును బ్రతాపోదారభావంబు న[33]
త్యుత్సేకంబును భూషణాకృతులతో నొప్పారఁగా భూపతీ
వాత్సల్యంబున వచ్చె విక్రమయశోవర్ధిష్ణుఁ డుజ్జేనికిన్. 102

వ. కావున నీ కిట్టి గుణంబులు సమకూరకునికి నెక్కంజనదు పొమ్మనిన విని భోజుండును మనంబున నతనిం గొనియాడుచు నుద్విగ్నితాలగ్నుండై[34] సిగ్గుపడుచుఁ బూర్వద్వారగమనంబు మాని యపరద్వారగమనోత్సుకుం డగుచు నాఁటి కద్దివ్యాసనం బెక్కరాకుండుట తెల్లంబుగా మొగంబు తెల్లంబడఁ దిరిగి చని మఱి యొక్కనాఁడు. 103

మూఁడవబొమ్మ కథ

క. ఉల్లోలదుగ్ధసాగర
కల్లోలకరాగ్రమందకంపితఫణభృ
ద్వల్లభమణిమయడోలా
వేల్లనసుఖలోలుఁ డైన వేల్పుం దలఁతున్. 104

క. అని నియమంబున హితశా
కునికస్వరశాస్త్రవేదకోవిదయుతుఁ డై
యను వగుదినమున సింహా
సన మెక్కఁదలఁచి భోజజనపతి చేరెన్. 105

క. చేసిన నచ్చటిపుత్రిక
యారాజుం బలికె వాసవాసన మెక్కం
గోరుట జగ మెఱుఁగ మహా
దారిద్ర్యుఁడు క్రతువు సేయఁ దలఁచుటచుమ్మీ. 106

ఉ. ఆర్యులఁ గూర్చి నేఁడు శుభమైన ముహూర్తము చూచి వట్టిగాం
భీర్యము దోఁపఁగాఁ దగని పెద్దఱికం బిదియేల సన్నపుం
గార్యమె విక్రమార్కనృపుగద్దియయెక్కుట వానిఁబోల నౌ
దార్యము నీకుఁ గల్గినఁ బదం బిడు మోజగభోజభూవరా. 107

వ. అనుడు విస్మయమానమానసుండై మానవేంద్రుం డాసింహాసనయానంబు మాని యనుమానించి మీనరపతివితరణంబు లేతెఱం గెఱింగింపు మనిన నది యిట్లనియె. 108

సీ. బలమున నిజమునఁ బ్రాణరక్షణమున
భీము భీమాగ్రజు భీమగురునిఁ
జెలువున సంకల్పసిద్ధిఁ దేజంబునఁ
బద్మారిఁ బద్మజుఁ బద్మమిత్రు
శివభక్తి గీర్తి విశిష్టదానంబున
బాణు బాణారాతి బాణజనకు
నైశ్వర్యమున రతి నఖిలోత్సవస్పూర్తిఁ[35]
గామసంహరుఁ గాముఁ గామసఖుని
ఆ. నష్టభోగముల రణాటోపమున బుద్ధి
నింద్రు నింద్రతనయు నింద్రమంత్రి
గ్రేణి సేయు ననుచు జాణలు వొగడంగ
నవని యేలె విక్రమార్కవిభుఁడు. 109

క. సాహసము జయము బల ము
త్సాహంబుఁ బరాక్రమంబు ధైర్యముఁ గల ని
ర్మోహకుని దొరయునెడ సం
దేహించుచునుండు నాదిదేవుం డైనన్. 110

క. నరుఁడు మగతనము నేర్పునఁ
బరఁగించెడుచోటఁ దోడుపడుదురు సురలున్
ధర గౌళికునకుఁ దోడ్పడ
గరుడఁడు జక్రంబు హరియుఁ గలిగినభంగిన్. 110

గౌళికుని కథ

క. అనవుడు భోజుఁడు గౌళికుఁ
డనువానికి నెచట విష్ణుఁ డాయుధఘును వా

హనమును దోడ్పడియెను నే
వినవలతుంజెప్పు మనిన వెస నిట్లనియెన్. 112

ఆ. తుంగసౌధశృంగసంగతాంబర మౌచుఁ
బూర్వభూమి నొక్కపురవరంబు
భజన కెక్కి మున్ను నిజమైనపేరిట
వెలసెఁ భువిఁ బ్రతాపవిషయ మనఁగ. 113

వ. అట్టిపురంబున. 114

క. సేనానికి నెన యనఁ బర
సేనాభంజకుఁడు గలిగె క్షితిపతి విష్వ
క్సేనారాధకుఁడు బృహ
త్సేనాఖ్యుండు బల్మి భీమసేనుఁడు వోలెన్. 115

వ. ఆనరేంద్రునకు నానందిని యనుసుందరియందు నయనానందంబుగా నొక్కనందన యుదయించె. 116

క. ఆరాజతనూభవ క
న్యారత్నము మరుని మోహనాస్త్రముక్రియ నా
కారంబున నొప్పుచు ధర
లో రూఢికి నెక్కు నది సులోచన యనఁగన్. 117

క. భూవలయంబున నుపమా
జీవన మగు వస్తు వేర్చి చెప్పెద మనఁగా
నావెలఁది యవయవములకు
నేవియు సరిగాక యునికి నేమనవచ్చున్. 118

సీ. మృదుపల్లంబులు ముదురకయుండినఁ
బదసరోజములసంపదలఁ బోలుఁ

గరికరంబులమేనఁ గర్కశభావంబు
లేకయుండిన నూరులీలఁ బోలుఁ
జక్రవాకంబులు సడిసన్న రేయెల్ల
బాయకుండినఁ జనుదోయిఁ బోలుఁ
జుక్కలఱేఁడు దా స్రుక్కక పొంగక
కందకుండిన ముఖకళలఁ బోలుఁ
ఆ. జంచరీకచయము సంచలింపక కూడి
నిలిచెనేని కురుల చెలువుదాల్చుఁ
బువ్వు దీఁగె మొదలిమవ్వంబు దప్పక
ననిచెనేని మేనియనువుఁబడయు. 119

మ. తనలావణ్య మగణ్యదర్పమయమై తారుణ్యపూర్ణంబుగా
ననవద్యద్యుతితోడ నానృపతికన్యారత్న మేరాజనం
దనుల న్మెచ్చక మీఁది మేడకడ గంధర్వాంగనావిభ్రమం
బున నుండెన్ మృదువస్త్రగంధసుమనోభూషాదిభోగంబులన్. 120

సీ. తరుణి యీక్రియ మేడఁ దరలకుండుటయును
దెలిసి గౌళికుఁ డనుధీరవిటుఁడు
చాయలయుక్కునఁ జక్రంబు గావించి
కాష్ఠయంత్రంబున గరుడిఁ జేసి
తా విష్ణుఁడై మన్మథప్రథనమునకు
మెఱపుగాఁ గస్తూరి మిగుల నలఁది
పసపువన్నియ పట్టువసనంబు గావించి
తిరునామ మొప్పఁగాఁ దీర్చి కడఁక
తే. నెక్కి కీలున వాహన మెగయఁజేసి
పవనపథమునఁ జనుదెంచి బాలమ్రోల

నిలిచి నేనిదె కృష్ణుఁడ నిన్నుఁ గూర్చి
వచ్చితిని నన్ను వరియింపు లచ్చికరణి. 121

చ. అనవుడు బాల విస్మయము హర్షము లజ్జయు నగ్గలింప నా
తని నట నుంచి యేగి తనతండ్రికి నట్టితెఱం గెఱుంగఁ జె
ప్పిన నతఁడు గ్రయంబున నభీష్టము నేఁ డొనఁగూడఁబోలు నే
కని చనుదెంచి యచ్చట గవాక్షముఖంబునఁ జూచి యుబ్బుచున్. 122

క. చల్లనికొండకు గిరిజా
వల్లభుఁ డల్లుఁ డగునట్టివడువునఁ దల్లీ
నల్లనిదేవర నీచే
నల్లుఁ డనఁగఁ గలిగె నేఁ గృతార్థుఁడనైతిన్. 123

క. ఆమ్మా తడయక కైకొను
పొమ్మా యని యనుప నేగి పొలఁతుక యచటన్
నెమ్మి దళుకొత్తఁగాఁ దన
నెమ్మన మలరంగ నాతని న్వరియించెన్. 124

ఉ. గౌళికుఁ డయ్యెడ న్మది వికాసము హాసముఁ గూడియాడఁగా
బాలిక నంతనంత మృదుభాషణభూషణతోషణంబులం
గేలికిఁ జేర్చి లజ్జ కడకీ లెడలించుచు బుజ్జగించి పాం
చాలుని పోలిక న్సురతసౌఖ్యము తీపులు చూపె నేర్పునన్. 125

ఉ. అజ్ఞలజాక్షియున్ హృదయమందునఁబుట్టినవాని పోరుచే
బుజ్జవ మియ్యకోలు గొనుపొందునఁ గూడిన నింపుగైకొనున్
సజ్జకుఁ దాన చేరు రతిచేష్ట లెఱుంగఁగడంగు చెయ్వులన్
లజ్జయొకింత చేడ్పడఁ జెలంగుఁ బెనంగు ననంగకేలిమై. 126

క. ఇటు నానాఁటికి నొయ్యనం
గుటిలాలక యులుకు దీర్చుకొనుచుం దనకౌఁ

గిట నాదటఁ జెలగఁగ న
వ్విటుఁడు న్సమరతుల గారవించుచుఁ దివుటన్. 127

సీ. అంగుష్ట మడుగు గుల్ఫాంతంబుఁ జిఱుదొడ
జఘనంబు నాభి వక్షంబుఁ గుచము
భుజమూలములు గళంబును జెక్కుమోవియు
నయనము ల్నుదురు ముందలయు ననఁగఁ
గలుగుచోటులఁ జంద్రకళలఁబెంపునఁ జెక్కు
నారోహణావరోహణము లెఱిఁగి
బీజమంత్రాక్షతవ్యాజదృగ్బాణముల్[36]
హృదయాదిమర్మంబు లెక్కఁజేయు
తే. సుఖముఖాంకనఖరచుంబనభూషణ
గ్రహణతాడనములఁ గదలఁబొడిచి
చిత్తశయనుదెలిపి యుత్తానశాయిత
ముఖ్యసురతతంత్రములఁ గలంచె. 128

క. మనసిజమర్మజ్ఞునితో
మన మలరఁగఁ బెనఁగి కరఁగె మానిని రతిసం
జనితసుఖంబున నెలపొడు
పునఁ గరఁగెడు చంద్రకాంతపుత్రికఁ బోలెన్. 129

శా. ఆజాడం గుచచక్రవాకరుచి పెంపారం దదీయాననాం
భోజాతప్రభ లుల్లసిల్లంగ సముత్ఫుల్లాక్షి[37] మీనద్యుతుల్
రాజిల్లంగ సులోచనాసరసిలో రాయంచభంగిం గళా
భ్రాజిష్ణుం డగు గోళికుండు హరిరూపం బొంది క్రీడించుచున్. 130

ఉ. ఇమ్ములఁ గొన్ని యేండ్లు సుఖియింపగఁ దక్కినరాజులెల్లఁ జో
ద్యమ్ముగ నిట్టివార్త విని యచ్యుతుఁ డీతని యల్లుఁ డయ్యె[38]
ర్వమ్ములు మాని వీనిఁ గొలువం దగునంచు భయమ్ముతోఁ దురం
గమ్ములఁ గుంజరమ్ములను గన్యలఁ గప్పము లిచ్చి పంపఁగాన్. 131

క. చేకొనుచు బృహత్సేనుఁడు
చేకొలఁదుల లోఁగు టెఱిఁగి, క్షితిపాలకులం
జీకాకుపఱిచి భూములు
చేకొనఁగా నలఁగి తలఁగి సిగ్గున నొకచోన్[39]. 132

వ. అందఱుం గూడుకొని విచారించుచుం దమలోన. 133

క. సమముగ దేశము లేలుచు
నమరిన మగకూడు గుడిచి యధమాధమభా
వములోఁ బెక్కం డొక్కని
సమరమునకుఁ బోకయునికి[40] చచ్చుట గాదే. 134

క. గణుతింప మానభంగ
వ్రణ మాజన్మంబు నెడ్డ వ్రయ్యలు సేయున్
రణమరణము శూరులకును
క్షణదుఃఖము మీఁద నధికసౌఖ్య మొనర్చున్. 135

ఆ. మానహాని యైన మనత్రోవకంటెను[41]
బ్రాణహీన మైన పదము లేదు
వీనిచేత బాధ వెచ్చుటకంటెను
జక్రధరునిచేతఁ జచ్చుఁ టొప్పు. 136

క. రావణకంసాదికర
క్షోవీరులఁ జంపి తన్నుఁ గూడఁగనిచ్చెం
గావున సమములు నల్లని
దేవరకోపములు నట్టిదేవరవరముల్. 137

సీ. మున్నీటిపాపయు మున్నీటితేపయు
నిల్లాలు నిల్లునై యెసఁగువానిఁ
బాములపగవాఁడుఁ బాములవగవాఁడుఁ
దేరును బాన్సునై తేరువానిఁ
గలువలచుట్టంబుఁ గలువలపెట్టంబుఁ
దనరెండుకన్నులై తనరువానిఁ
బూవింటివాఁడును బూవింటివాఁడును
గారాపుబట్టులై[42] గలుగువాని
ఆ. జోడులేనికంటిజోగికి జోడుగా
నున్నవానిఁ బెక్కు మన్నవాని
దల్లి దండ్రియైన నల్లనివేల్పును
గంట చెడనిముక్తిపంట గాదె. 138

క. చొత్తము చత్త మనుచు ను
ద్వృత్తు లగుచుఁ దేగి ప్రతాపవిషయముపై దం
డెత్తి చనుదెంచినం గని
యత్తఱిఁ దా వెడలె నాబృహత్సేనుండున్. 139

చ. వెడలి నిజాప్తసైన్యపరివేష్టితుఁడై చని గర్వపాటవం
బడరఁగఁ బోరిపోరి బల మంతయుఁ జచ్చినఁ జిచ్చులోపలం

బడి వడిఁ దూలివచ్చు శలభంబుతెఱంగున నోహటించి లో
పడక పురంబు సొచ్చి సుతపాలికి నాపద చెప్పి పుచ్చినన్. 140

మ. ఆది యాత్మప్రియుఁ జేరి, దేవ! మును ప్రహ్లాదుం గృపం గాచి యు
న్మదుఁ డౌ దైత్యునిఁ ద్రుంచి తీవు మొసలి న్మర్దించి యాయేన్గు నె
మ్మది రక్షించితి నేఁడు నీ న్గొలువగా మాతండ్రి కిట్లీ మహా
పద వచ్చెన్ రిపుసంఘముం దునిమి నీభక్తు న్భువి న్నిల్పవే. 141

క. వేడుకొనిన వాఁడును
మనమున నిటు దలఁచెఁ దొల్లి మగతనమునఁ బూ
నినపూనిక విడిచిన నిఁక
వినువారలుఁ జూచువారు వికవిక నగరే. 142

తే. నాఁటిసాహసమున నిట్టిబోటి గలిగె
నేఁటితెంపున కొకవేల్పు నిల్వఁబడఁడె
యనుచుఁ జక్రంబు గైకొని యంత్రగరుడి
నెక్కి సూత్రంబు గదలించి యెగసి వచ్చె. 143

వ. అట్టి వేళ నయ్యాదివిష్ణుండు. 144

ఉ. గౌళికుఁ డిీల్గెనేనియు జగంబు జనార్లనుఁ డీల్గె నంచు న
న్నాలము సేయుచుండుఁ దన యల్లుఁడ నే నని నమ్మియున్న భూ
పాలుఁడు చిక్కు భక్తిఁ దమప్రాణము లొప్పనసేయ నున్న మ
న్నీలతలంపులుం బొలియు నే నటు పోవకయుండఁ బాడియే. 145

క. అని చక్రము చేవెలుఁగఁగ
వినతాసుతు నెక్కి వచ్చి విథుఁ డొప్పె సువ
ర్ణనగంబుమీద సౌదా
మినితోఁ జెలువొందు నీలమేఘము పోలెన్. 146

మ. తనదివ్యప్రభ లీక్రియ[43] న్వెలుఁగఁగాఁ దార్క్ష్యుండు పక్షాగ్రచా
లనవాతాహతితోన మేఘములు డొల్ల న్మిన్ను ముట్టంగ నే
పున దీపించుట లీలఁ గోపమును రూపుం జూపి చక్రాహతి
న్వనజాక్షుండు నృపాలపంక్తి ననిపెన్ వైకుంఠసంప్రాప్తికిన్. 147

వ. ఇట్లు చేసి తదనంతరంబ తజ్జయంబు విదితంబు సేయం బూని. 148

ఉ. ధన్యజనానుకూలుఁ డగు దానవసంహరుఁ డొత్తె నటమూ
ర్ధన్యము భక్తసద్గతివదాన్యము నిర్జితగర్జితోగ్రప
ర్జన్యము ఛిన్నభిన్నపరసైన్యము దిక్కరికర్ణకీర్ణకా
తిన్యము గౌళికావనదృఢీకృతజన్యముఁ బాంచజన్యమున్. 149

క. ఇటు వానిపేరుగా ను
త్కట మగు జయ మిచ్చి చక్రధరుఁ డేగిన ను
ద్భటవృత్తి గౌళికుఁడు న
చ్చట చని రణమండలమునఁ జచ్చిననృపులన్. 150

చ. కనుఁగొని మామఁ బిల్చి ననుఁ గంటివె వచ్చిన యీనృపాలురం
దునిమితి వీరి సంపదలు దొద్దులుగాఁ గొనికమ్ము నీపురం
బున కని చెప్పి తొంటిగతిఁ బోయి సులోచనఁ గూడి దాని కిం
పొనర విహారము ల్సలుపుచుండె ననేకదినమ్ము లిమ్ములన్. 151

క. కావునఁ దెం పెఱిఁగి యస
ద్భావున కచ్యుతుఁడు తోడుపడియె ననంగా
నావిక్రమార్కునకు నతి
పావనునకు సురలు తోడుపడు టచ్చెరువే. 152

ఉ. ఉల్లసితక్షమాభరణుఁ డుజ్జయినీపతిఁ బోలవచ్చునే[44]
యెల్లముఖంబుల న్విష మనేకవిధంబుల నొల్కుచుండఁగా

నుల్లము వ్రయ్య బు స్సనుచు నూరక మోగెడి పాముతోడి పొ
త్తొల్లక తద్భుజాగ్రమున నుర్వి సుఖస్థితి నుండు నెప్పుడున్. 158

వ. అట్టి యాతనితలంపు సంపదలందు నయవినయాదిగుణంబులం బొదలు. 159

క. ఓలం బగుసంపద నయ
శీలంబునఁగాక దుష్టచేష్టలఁ గలదే
యాలరిమొదవులకును దల
కోల యిడక చేరి పిదుకుకొనఁ[45] దర మగునే. 155

క. ఎక్కడనుండియు కూడును
నిక్కము లై తోఁచు నొక్కనిముసంబునఁ దా
మెక్కడికొ విరిసిపోవును
దక్కవు సంపదలు మేఘడంబరము క్రియన్. 156

క. కలిమికిని దగినకొలఁదిని
నెలగల వెలి విడువకున్న[46] నిలు పెక్కడి దౌ
కలయఁగ నిండిన చెఱువున
కలుఁగించుక విడువకున్న నాఁగనిభంగిన్. 157

సీ. అని యిట్టితలఁపున నశ్వమేధము సేయఁ
బూని భూసురబంధుభూమిపతుల
రప్పించి శుభముహూర్తమున దీక్షావిధి
గైకొని చేయుచో నాకవిభుఁడు
గరుడగంధర్వయక్షవ్రాతములతోడ
నరుదెంచి తోడ్పడి యాదరింప

సురల నందఱఁ జూచి ధరణీశుఁ డందులో
రత్నాకరుం డటు రామి యెఱిఁగి
ఆ. యతనిఁ దోడితేర హితుఁబురోనాతు నంపెఁ
బ్రియము గూర్చి మైత్రినయము మెఱయ
విప్రవర్యుఁ డంత క్షిప్రయానంబునఁ
దెరువునడిచి కొన్ని దివసములకు. 158

మహాస్రగ్ధర. కనియెన్ దుర్వారదర్వీకరమకరఝుషగ్రాహరక్షావినిద్రున్
ఘనివీచీసద్భుజాభ్రంకషగుణసమతిక్రాంతకాలాంతరుద్రున్
జనకాధీశాత్మజాధీశ్వరధనురతివిస్తారితావర్తభద్రున్
స్వనదంభోదాతిరౌద్రు న్వరతటవిహితోచ్ఛ్వాసముద్రున్ సముద్రుఁన్. 159

సీ. అనిమిషరక్షణాయత్తజీవనముల
గుహబృహస్పతుల సన్మహిమఁ దాల్చి
యధికనాగేంద్రసమారూఢమహిమల
హరిశచీనాథుల ననుకరించి
రాశీభవన్మకరప్రాభవంబుల
సౌరికుబేరుల సాటి నొప్పి
కమలావృతాయతాకారవైభవముల
బ్రహ్మవిష్ణులతోడిపాటి మించి
ఆ. సంతతప్రవాళకాంతివసంతక
బాలసూర్యులసరి లీలఁ గ్రాలి
భూమి సర్వదేవతామయుం డనఁ జెల్లి
యెలమి నేఱులెల్ల నేలువాని. 160

సీ. మిన్నంటఁ బొంగియు మేర దప్పక పెక్కు
భంగము ల్లలిగియుఁ బాఱులేక

సుళ్ళెన్ని గలిగిన సుఱ్ఱున స్రుక్కక
యనుకయ్యుఁ బరులకు ననువుగాక
సరివారిలోపల నురువులు గ్రమ్మఁగా
నేలపైఁ బొరలియు బేలుగాక
తనలోన బడబాగ్ని దరికొని మండియు
వడగాలి మీలపై సుడియనీక
ఆ.బయలుపడియును దనలోతు బయలుపడక
దిగులుపఱిచియు నొండెడ దిగులుపడక
యిసుముకంటెను గుణమణు లెసక మెసఁగ
నసమరసమయమైన వెక్కసమువాని. 161

వ. మఱియు గంగాతరంగిణీసంగతంబై హరజటాజూటంబునుంబోలె శంఖాలంకృతంబై విష్ణుభుజంబునుంబోలె వజ్రసముజ్జ్వలంబై పురందరుకరంబునుంబోలె ముక్తామయంబై ముక్తిపథంబునుంబోలె నీలసమగ్రంబై సుగ్రీవసైన్యంబునుంబోలె విజృంభితపద్మరాగంబై శరత్సమయంబునుంబోలెఁ బుష్పితపుష్యరాగంబై శిశిరంబునుంబోలెఁ బ్రసరత్తుషారంబై
హేమంతంబునుంబోలెఁ బటువిద్రుమచ్ఛాయంబై వసంతంబునుంబోలె నుద్దండరాజీవంబై గ్రీష్మంబునుంబోలె నాభీలకూలంకషంబై వర్షాగమంబునుంబోలె మీనమిథునకర్కటమకరాదిసంచారంబై గ్రహమండలంబునుంబోలెఁ బరభీతసపక్షభూభృత్కులాశ్రితంబై మహాదుర్గంబునుంబోలె నొప్పు నప్పూరంబుగలవాని. 162

క. ఆనీరధి నెల వింతనఁ
గానేరము తేలగిలు మకరములమీఁదన్
మైనాకాదులు ఱెక్కల
తో నిలుచుం గరులమీఁది దోమలకరణిన్. 163



ఆ. అట్టిజలధిఁ జేరి యవనీసురుఁడు పలు
మాఱుఁ బిలిచి పిలిచి మదిఁ గలంగి
యుత్తరంబు లేని యుదకంబు నచటికిఁ
బిలువ వచ్చి నేను బేలనైతి. 164

క. సరసత్వము సన్మానముఁ
బొరయనిచోఁ బ్రియము నెఱపఁ బూనుట ధరలోఁ
దెరువాటుకాండ్రకడ ము
ష్కరుఁడై[47] తనకలిమి చూపఁగడఁగుట చుమ్మీ. 165

మ. అని చింతించి పురోహితుండు నిజరాజాజ్ఞవిధి న్వారిధీ
నీను నేఁ బిల్చితి రమ్ము నిల్వనిడికో నీబుద్ధి యంచున్ ఘన
ధ్వనిగాఁ జెప్పి చనంగ నర్ణవుఁడు దివ్యంబైన రూపంబునం
దనరత్నంబులు నాల్గుగొంచుఁ జని పొంత న్నిల్చి యవ్విప్రుతోన్. 166

వ. నీ కింత వేగిరపడనేల నే నిదె వచ్చుచున్నవాఁడ మీరాజునకు మాకునుం బరమసఖ్యం బగు నే మెఱుంగుదుము గావున మమ్ముఁ బిలువం బంపె మే మచ్చటికి వచ్చినవారమ యని ప్రియో క్తి నిట్లనుము. 167

క. కడపటనుండియు నే మ
క్కడ నుండుదు మనుచుఁ జెలిమిగతిఁ దప్పకు మీ
యెడ దవ్వన వలవదు సం
గడ మనఁగాఁ దలఁపులోనఁ గలుగుట చుమ్మీ. 168

క. నెమిలి గిరి నంబుదము గగ
నముపై రవి లక్షయోజనంబులఁ గొలనం
గమలము లక్షద్వయమున
హిమకరుఁ డిలఁ దొగలునుండు నెక్కవె చెలుముల్. 169

వ. అని విన్నవించి యీశోభనమునకుం గట్నంబుగా నిద్దివ్యరత్నమ్ము లిమ్ము, కోరిన నివి సైన్యసంపాదకంబును, బహుధనప్రదంబును, మృదుచిత్రవర్ణవస్త్రాభరణదాయకంబును, బక్వాన్నప్రతిపాదకంబును నౌ నని చెప్పి వీడుకొలిపిన నతం డతనివచ్చినపని సఫలం బగుటకు హర్షించి. 170

క. సుముఖుండై చనుదెంచుచుఁ
దమమాళవభూమి కొచ్చి ధరణీశ్వరు యా
గము సంపూర్తియుఁ దాన
క్రమమును విని యచటఁ దనదురాకకు వగచెన్. 171

చ. పొసఁగిన పప్పు మండెఁగలుఁ బుక్కిటిబంటిగ మెక్కి మంచి వె
క్కసపుఁ బదార్థము ల్నమలి గఱ్ఱునఁ ద్రేపఁగఁ గల్గు భూరిదా
నసమయమైన మాడ ధరణం బటు వచ్చు, విశిష్టపూజతోఁ
బసనగు పచ్చడంబు నౌకపళ్లియరంబును గల్గుఁ దప్పితిన్[48]. 172

క. చేరేడు నూకలుఁ బిడికెడు
కూరయుఁ గొని యొక్కపూఁటకూటికి దొరయై
యూరికిఁ బంచినఁ బోఁబడు
పౌరోహిత్యంబు బుద్ధి బంటఱికముగా. 178

క. అప్పటి కమికెఁడుకూటికి
నొప్పెడిదియుఁ[49] బోషణంబు, హోమము దొరకై
యొప్పించి వేల్వఁగా గతి[50]
దప్పెడు తత్త్వము పురోహితత్వము జగతిన్. 174

ఆ. అనుచు బహువిధములఁ దనపని నిందించి
కొనుచు నాత్మనగరమునకు వచ్చి

మనుజవిభునిఁ గాంచి వనరాశి చెప్పిన
వినయభాషణంబు లెనయఁజెప్పి. 175

క. నాలుగురత్నాకరముల
మూలద్రవ్యములబీజములొ[51] యనఁదగు నా
నాలుగురత్నంబులు నా
నాలుగుమహిమలును జెప్పి నరపతి కిచ్చెన్. 176

వ. ఇచ్చిన నమూల్యంబు లగువానిం జూచి యిందొకటి నీ వేఱుకొమ్మ నిన నతండు నాయింట నాలిం గొడుకుం గోడలిని విచారించి వచ్చి పుచ్చుకొనియెద నని సంభ్రమంబునం జని మువ్వురం బిలిచి యారత్నంబు లిట్టిట్టి సంపద లిచ్చు వీనిలో నేది పుచ్చుకొంద మని తలపోయుచున్నపుడు. 177

సీ. సైన్యంబు గలిగిన జగమెల్లఁ జేపడుఁ
గొను డిది యౌ నని కొడుకు పలికె
ధర “ధనమూల మిదం జగ” త్తనుమాట
తగు నిది గొన నని తండ్రి పలికె
నిష్టాన్నములు మదిఁ దుష్టిగాఁ గుడుతుము
మే లిది గొను మని యాలు చెప్పె
భూషణాంబరములభోగంబు లిది గొంట
వెర వని కోడలు విన్నవించె
ఆ. నిట్లు వేఱువేఱు నిచ్చలఁ దమలోన
జగడ మైన నతఁడు మగిడి వచ్చి
యింటివారికలహ మెఱిఁగించి వీనిలో
నీవ యొకటి యిమ్ము దేవ యనుడు. 178

క. ఈ నలువుర[52] కిం దొక్కటి
యీనేల తలంపుకొలది నిట మీజగడం
బే నుడిపెద నని యొడయం
డానాలుగుమానికములు నాతని కిచ్చెన్.[53] 179

క. ఈ జాడ యీగి నీకడ
నీజన్మమునందుఁ గలుగ దిఁకఁ గలుగ దిఁకఁ బొమ్మనినన్
భోజుండు నమ్రవదనాం
భోజుండై తాను నంతిపురమున కరిగెన్. 180

శా. ప్రహ్లాదస్థిరభక్తిభాగ్యవిభవప్రత్యక్షరూపు, న్నభోం
తహ్లాదిన్యుదయాదిమూలచరణున్, దైత్యాంతకు, న్విప్రవే
షాహ్లాదాకృతికృత్యవంచితబలిం, జక్షుఃశ్రవస్తల్పు, న
ల్పహ్లాముద్రమనోనురాగవిహరల్లక్ష్మీకవక్షస్థలున్. 181

శా. ఇంద్రాదిస్తుతయోగ్యవైభవుని బర్హీభూత[54]భూతావళీ
సాంద్రానందకరప్రసంగనిజలాస్యప్రస్ఫుటీకారు, ని
స్తంద్రానేకమునీంద్రవంద్యచరణద్వంద్వున్ ముకుందప్రియుం
జంద్రాలంకరణాంకు నద్రితనయాసంసక్తచిత్తాంబుజున్. 182

మాలిని. ఉరగశయనశాయీ యోగ్యవిద్యానపాయీ
గరుడవిహితయానా క్ష్మారకోర్వీశయనా
ధరణిభరణదక్షా దండితోద్దండరక్షా
మురహరహరరూపా ముఖ్యసౌఖ్యస్వరూపా. 183

గద్యము. ఇది రాయగజగంధవారణ వైరిమండలికభేకఫణీంద్ర వీరఘోట్టవిభాళాది బిరుదప్రకటచారిత్ర కళింగదేశనిర్దూమధామ త్యాగనాగార్జున కర్ణాటద్రవిళాంధ్రమహారాష్ట్రభూపాలరూపనూపురసుందరచరణారవింద సనదప్రోలిపురవరాధీశ్వర వెలనాఁటిపృథ్వీశ్వర రాజ్యసముద్ధరణ శ్రీకొఱవి వెన్నయామాత్యపౌత్ర హరితసగోత్రపవిత్ర సకలసుకవిమిత్ర కసవరాజతనూజ గోపరాజవిరచితంబైన సింహాసనద్వాత్రింశిక యను కావ్యంబునందు సుదర్శనోపాఖ్యానంబును, విక్రమార్కుని మహౌదార్యంబును, దదీయసత్త్వసాహసమహత్త్వంబులును, గౌళికోపాఖ్యానంబును, సాహసాంకదాతృత్వంబును నన్నది ద్వితీయాశ్వాసము.
  1. పులితోలు పైభూతి చెలువుదీర్చి
  2. మెక్కుట గలదే
  3. వచ్చె నపుడు నరపతిఁ జూడన్
  4. ఉ. ఆగతి గుండ నిల్చిన ధరాధిపుఁ గన్గొ‌ని నారదుండు నీ
    వీగతిఁ బుణ్యకీర్తి వెలయించుచు నిచ్చలుఁ దీర్పు సత్ర ము
    ద్వేగములేక చేయుమని తెల్పి వియద్గతి నేగె నంతలోఁ
    ద్యాగము భోగముం దగుసుదర్శనుఁ డచ్చటఁ దాను మెచ్చుచున్.

    గీ. క్రొత్తకడవ తెచ్చుకొని వండి మఱి దాని
    మీఁద వండిపెట్ట మెచ్చు గాదు
    మంటఁ జేసి మొదల మంటనే కఱిగొన్న
    దానఁ దొలుత వండఁ దగుట యెట్లు.
    (ఒక తాళపత్ర ప్రతిలో ఈ పద్యములున్నవి.)
  5. మాకొలఁదినె నిత్యసత్ర మచ్చట—చిన్నయసూరిగారి పాఠము.
    మాకలసత్రంబుభంగినచ్చట—ఇతర ప్రతులలో.
  6. దాన మెంత నీవు దానిఁ దెలుపు. చి. సూరిగారు, దానమెంతనేర్పు—
  7. యంభోఝణీమిత్ర
  8. ఈ పద్యములోని ప్రాకృతశబ్దములు తెలియుట లేదు. ఇందు చతుర్విధ ప్రాకృత భేదములున్నట్లు చెప్పఁబడినది.
  9. దేవబంధకహోదు
  10. గుప్పిగంతులేయుట చుమ్మీ
  11. దనకీర్తియు వ్యాప్తియు
  12. చినఁ బలికించిన మెచ్చించిన నిట్లని నీవు నాకుఁ జెప్పకయిమ్మా
  13. పొదవెట్టక-శర
  14. భంజని
  15. వలదుసుమాహూలివి. యాహూలివి- చిన్నయసూరి
  16. ఆనీరు పుణ్యుల కమృతంబువలెనుండు - చిన్నయసూరి
  17. చూత మాదివ్యపావన
  18. చిత్రవనాటము
  19. నుతికెక్కుదినంబులయందు నంబుజేం
  20. చ్చాలనలోలి
  21. పన్ననంగ
  22. ఉజ్జయిని రాజుపట్టగజేంద్రలీల-ఈ పాఠము యతిచెడినది
  23. యిక్కడ వ. "అచటఁ దెరువుఁజూపుచు మావంతు క్రియాహరుండు చూపమున్నుగా నతండు చని" అని యొకదానిలోఁగలదు.
  24. దపము కలిమి దోఁప జపముతోడ
  25. నున్నతనికిని
  26. జేయునతనికి నతి చేయఁదగదుగాన
  27. సహనం బీవెరవున ......నావుడునుబుస్సగొట్టుచు- చిన్నయసూరి
  28. చక్క మీఁదటికి
  29. మేరుసమానమౌ ఘనతపంబులౌ నగణితమైన
  30. పరతత్త్వ మనన్
  31. నీదుక్రియన్
  32. దదధ్వశ్రాంతిగాఁ జిత్తమందుత్సా
  33. గర్వోత్సేకంబున
  34. విఘ్నితాలంఘితకాలజ్ఞుండై
  35. నఖిలలోకస్ఫూర్తి
  36. హృద్భషల హృదయాదిమర్మవాహికులఁ జొనిపి
  37. పెంపారంగ శుంభన్ముఖాంభోజంబు ల్వికసింపుచుంజెలఁగ నుత్ఫుల్లాక్షి
  38. డీతని కల్లుఁడంచుగర్వ
  39. కైకొనుచు...క్షితిపాలురఁ జీ
    కాకుపడ నడిచి భూములు
    చేకొనఁదలఁచుడు నడచి
  40. జొరకయునికి
  41. అవని మానహాని యగుత్రోవ
  42. గారాపుసుతులుగా గట్టియై పట్టియై కలుగువాఁడు - చిన్నయసూరి
  43. దనుజారాతియు నీక్రియన్
  44. నెన్నఁబోలునే
  45. నిలిచిపిండుకొన
  46. వలసినకొలఁదిని నెలగల వెలి వెడలకున్న
    నెలగ=ధనము (నెలగలు)
  47. నొక్కరుఁడై
  48. పళ్లెరముం గలదప్పు దప్పితిన్ - చిన్నయసూరి
  49. సుప్పిణియును
  50. యెప్పించు కొచునులువగతి?
  51. మూలధనములయినవి నిజముల
  52. ఈనలకువ
  53. క. ఏనే తలంపుకొలఁదిని
    మీనలువుర(లోని) జగడ మెడపెదననియుం
    దా నాలుగుమానికములుఁ
    బూనికతో నతనికిచ్చి పుచ్చెం బెలుచన్.
    “ఈనలకువ" యనియే చిన్నయసూరియును.
  54. బహ్వీభూత