సింహాసనద్వాత్రింశిక/తృతీయాశ్వాసము

సింహాసన ద్వాత్రింశిక

తృతీయాశ్వాసము

నాలుగవబొమ్మ కథ

క. శ్రీరమణీరమణపదాం
భోరుహజాతాపగాంబు[1]పూరసితడిం
డీరశకలానుకారా
కారామృతకిరణధారిఁ గందర్పారిన్. 1

మ. తనచిత్తాబ్జములోఁ దలంచి మఱియున్ ధారావిభుం డిష్టశా
కునికజ్యోతిషికాగమజ్ఞుల హితక్షోణీశులం గూర్చి శో
భనలగ్నంబున నెక్కఁబూనికొని తత్ప్రాంతంబు చేరంగ నా
సనపాఁంచాలిక నిల్వు నిల్వు మని యాశ్చర్యంబుగా నిట్లనున్. 2

క. పఱతెంచెద విచ్చోటికి[2]
నెఱయంగా విక్రమార్కనృపతికి సరిగా
నెఱిఁ జేసిన యుపకారం
బెఱిఁగెడు సద్గుణము లేక యెక్కం దరమే. 3

క. అనవుడు భోజుఁడు విస్మయ
మును లజ్జయుఁ బెనఁగొనంగ ముద మెడలఁగ మీ
జనపతియుపకారజ్ఞత
యనువొందఁగఁ జెప్పు మనుడు నది ఇట్లనియెన్. 4



ఉ. ఆతఁడు కీర్తిపూరభరితాఖిలదిగ్విజయుండు సర్వధా
త్రీతలనాథసేవ్యుఁడు సుధీజనపాలనకేలిశీలసం
జాతమనోనురాగుఁ[3] డిల సాహసభూషణుఁ డేలుచుండఁగా
నాతనివీట నొక్కవసుధామరుఁ డుండు విలోచనుం డనన్. 5

వ. ఆవిప్రుం డొకనాఁడు తనపత్ని విలోచన పుత్రలాభము లేమికి వగచి దీనికిం గారణంబేమి నీవు సర్వజ్ఞండ వనియడిగిన నూహించి ధనధాన్యంబు లుద్యోగంబునం బడయవచ్చు విద్యాలాభంబు గురుశుశ్రూషల నచ్చుపడు వంశాభివృద్ధియుం గీర్తియు నీశ్వరకృపం గాక పడయవచ్చునే. 6

క. ఏగురుపురుషులఁ గోరిన
యాగొంతియు ద్రౌపదియు మహాపుణ్యవతుల్
వేగురు బంధులఁ జంపిన
గురుపాండవులు ధన్యు లీశ్వరకరుణయేన్. 7

క. కావున మన మిఁక నెట్టి య
పావనజీవనుల మైనఁ బరమేశ్వరు సం
భావనఁ బుత్రుని బడయం
గావచ్చు నిజోద్యచుంబు గలిగినఁ బడఁతీ. 8

క. అన విని యాసతి వినయం
బెనయం దనయుండు గలుగు నీశ్వరు నారా
ధన మొనరింపుద మనవుడు
దనలో స్త్రీబుద్ధి యనక తా నుత్సుకుఁ డై. 9

తే. పెద్ద యొసఁగెడుమాట యప్రియముకంటెఁ
బడుచుచే నీతివాక్యంబు వడయఁజొప్పు

శాస్త్రవేదిచేనున్న విషంబుకంటె
గొల్లవానిచే నమృతంబు గొనుట మేలు. 10

మ. అని తద్వాక్యము లాదరించి పరమేశారాధనం బావిలో
చనయుం దానును జేయుచుండఁగ సుఖస్వప్నంబులో నాత్రిలో
చనుఁ డేతెంచి భవత్ప్రయాసము విశిష్టం బయ్యె నీసువ్రతం
జనుకూలించె శనిత్రయోదశులఁ జేయం బుత్రలాభం బగున్. 11
 
క. అని శంకరుఁ డానతి యి
చ్చిన నతఁడు శనిత్రయోదశీవ్రత మత్యం
తనియతి జరపుచుఁ బుణ్య
మ్మునఁ గొన్నిదినముల కొక్కపుత్రుని బడసెన్. 12

క. ఆపాపనికిం బుణ్య
వ్యాపారుఁడు దేవదత్తుఁ డనుపే రిడి గౌ
రీపతిపదభక్తుని వి
ద్యాపరిచితుఁ జేయుచును ముదంబునఁ బెంచెన్. 13

చ. క్రమమున బ్రహ్మకర్మములు గైకొనఁజేసి యెదుంగుచో[4] వివా
హముఁ దగఁజేసి కాశికిఁ బ్రయాణము చేకొని పుత్రుఁ బిల్చి కా
లము శుభవృత్తుల బ్రదుకు లాగు విచారము సద్గృహస్థధ
ర్మములను మంత్రతంత్రముల మర్మము లెల్లను జెప్పి వెండియున్. 14

క. పరపీడయుఁ బరనిందయుఁ
బరసతియుం బరధనంబుఁ బరులుం గలచోఁ
దిరుగకు పరోపకారము
పొరయంగలచోటఁ బుద్ధిపురికొల్పవనా. 15

క. తరుణులతోడి రహస్యము
వెరవరివగ సైరణయును వేషాఢ్యుని స
చ్చరితము దుర్జను సఖ్యము
నరపతికరుణయును నీవు నమ్మకు మదిలోన్. 16

క, సారాచార విచారత
నారూఢుం డగుచుఁ దను నిజావసరములం
జేసినవారికి హితుఁ డై
సైరణ గల ప్రభుపుఁ గొలుపు సజ్జనవృత్తిన్. 17

వ. అని పెక్కునీతులు చెప్పి. 18

క. భూసురుఁడు సకలవిద్యా
భాసురుఁ డటు తోడఁగూడి పడఁతుక నియమో
ల్లాసినిగా శివమూర్తివి
కాసిని యననొప్పుచున్న కాశికిఁ జనియెన్. 19

మ. జనకుం డేగిన దేవదత్తుఁ డిటు లాచారంబు రెట్టింప స
జ్జనత్కారము లింటఁ జెల్లగ విశిష్టప్రాప్తకాలంబు చొ
ప్పున నిధ్మంబులుఁ బత్రము ల్ఫలములుం బుష్పంబులుం గాననం
బునఁదాఁ బంచయజ్ఞముల నెప్డుం జేయుచు న్నిల్వఁగన్. 20

మ. ఒకనాఁ డుజ్జయినీశుఁ డుత్సవమిషోద్యోగంబున న్వేఁటకై
వికసన్మానసుఁడై బలంబులు తను న్వేష్టింపఁగ బాణకా
ర్ముకహస్తుం డయి వాజినెక్కి పటహంబుల్ మ్రోయఁగా నేగె గం
డకశార్దూలవరాహసింహకరిగణ్యం బౌ నరణ్యానికిన్. 21

ఉ. అక్కడ వేఁట లాడుచు హయంబు రయంబునఁ దోలుకొంచుఁ దా
గ్రక్కున నొక్కపందివెనుకం జని మార్గము దప్పి క్రంపలం

జిక్కి మది న్వితాకు పడి చింత మునుంగుచుఁ బండ్లుగోయఁగా
నొక్కెడ దేవదత్తుఁ గని యూరికి నేగెడుత్రోవ వేఁడినన్. 22

ఆ. హయమువాగె వట్టి యల్లన ముందట
ముండ్లు దప్పఁ దిగిచి గండ్లు గడపి
దేవదత్తుఁ డిట్లు తెరువునఁ గూర్చిన
సేన గలసె రాజశేఖరుండు. 23

క. తన యెక్కినతురగము నా
తని కిచ్చి సువర్ణనిర్మితం బగు వరవా
హనమున నొయ్యనఁ బురికిం
జనుదెంచెను బంచవాద్యశబ్దము లులియన్. 24

వ. ఇట్లు చనుదెంచి నగరు ప్రవేశించి మహావిభవంబు మెఱయం గొలువునం
గూర్చుండి. 25

ఆ. అచటి విప్రునిపని యత్యుపకారంబు
గాఁ దలంచి యొక్కగ్రామ మిచ్చి
వరుసతోడ నెల్లవారల వీడ్కొల్పి
యంతిపురము సొచ్చె నవనివిభుఁడు. 26

క. అన్నెలఁతలతో రతిసం
పన్నుండై వరుసతోడ భావజుకేళిం
గొన్నిదినంబులు సలుపుచు
నున్నంతం ఖిన్నయాలి కొకనెల మసలెన్. 27

ఉ. చెక్కులు వెల్లఁబాఱె[5] గడుఁ జిట్టుము లయ్యె మొగంబు వాడెఁ జ
న్ముక్కులు నల్పుగూడె నడుముం దరులుం జాలువారె నారు సొం

పెక్కెఁ గనుంగవ న్మెఱపు లేర్పడె నప్డు మనంబుకోరుకుల్
పెక్కుఁవిధంబులం బరఁగెఁ బ్రీతిగ నాతికిఁ జీర చిక్కినన్. 28

క. పొత్తికడుపు మెఱుఁగెక్కెం
జిత్తంబున జడను దోఁచెఁ జెలికత్తెలతో
నొత్తిలిపలుకఁగ మ్రాన్పడు
మెత్తనిమై నడుఁచుని[6] నిదుర మేకొను విసువున్. 29

క. కొమ్మకుఁ బులు సింపయ్యెను
గమ్మని మ న్నంతకంటెఁ[7] గడుఁ జవికెక్కెం
దమ్మిమొనమొగ్గ లెక్కిన
తుమ్మెద లనఁ జన్నుదోయితుద కప్పారెన్. 30

ఆ. చెలువ బయఁకలైన జెవ్పవేటికి నన్న
సిగ్గుపడుచుఁ జెలువచెంత దలఁగుఁ
జెప్పంబూను గొన్ని చిహ్నంబు లెఱిఁగించు
నగవుచేసి మీఁదనొగులుచేయ[8]. 31

క. విశదముగ నడిగి యారా
జశిఖామణి కెఱుఁగఁ జెప్పి సఖులిం పగుస
ర్వశుభంబులు గూరిచి త
చ్ఛిశువునకు న్మీఁదఁ జీకుచెవి[9] గాకుండన్. 32

తే. మూఁడునెలలఁ జెలులు ముద్దలు[10] వెట్టిరి
యలరుఁగుడుము లైదునెలలఁ బెట్టి
రేడునెలల మ్రొక్కి రెఱ్ఱపోలమ్మకు
సతికిఁ జూలువెళ్ళ జరుపుకొనుచు. 33

క. నెలకొనినచూలువేళల
దలకొని మెయిదీఁగ మెఱుఁగు దనరం గనకో
జ్జ్వల మగు వేషంబున సతి
పులుకడిగినముత్తియందు పోలిక నొప్పెన్. 34

ఆ. [11]ఇంతి మదిఁ దలఁకుచు నెడమప్రక్క నిదిగొ
మెదలె ననుచుఁ జెప్ప సుదతులంతఁ
జంటిజిగురు గోర సంధించి చిరజీవి
యైనసుతుఁడు పుట్టు ననఁగఁ బొంగు. 35

క. ఆసతి కానృపు డష్టమ
మాసంబున గెంటలం బమరఁబెట్టి[12] మహో
ల్లాసంబున నుండఁగ నవ
మాసంబులు నిండె గర్భమహిమయు నలరన్. 36

తే. చన్ను లురియఁ[13] బొదలె జఘనంబు ఘనమయ్యె
బలకవెన్నుదనరె మలుగువట్టె
రాజయోగ్యమైన రత్నంబు దాఁచిన
పసిఁడిపెట్టె యనగా నెసఁగె నపుడు. 37

క. నెలఁత శిశువునకుఁ బ్రొద్దుల
నెల నమృతమునించు నింద్రనీలపుమూఁకు
ళ్ళలరించిన బంగారపుఁ
గలశము లనఁ గుచయుగంబు కప్పున నొప్పెన్. 38

ఆ. నాభి నెఱయవిరిసె నడుము నొవ్వఁదొడంగె
దాదు లంత నాయితంబు చేసి
కూడిమెలఁగ దండికుట్టులం బొదలక
నాతి యటు సుఖప్రసూతి యయ్యె. 39

క. క్రూరగ్రహవిరహితుఁడగు
తారాపతిబలము గలుగు తత్కాలమునన్
మారునికెనయనఁదగినకు
మారుం డుదయించె హితులమది ముదమొందన్. 40

వ. అప్పుడు దాదులు. 41

ఆ. నిసువుబొడ్డుమీదఁ బసిఁడిటంకం బిడి
యొయ్య నాభినాళ ముత్తరించి
ముత్తియములఁ జేట ముంచి యందిడి కను
దమ్ములందు సమ్మదమ్ము నిగుడ. 42

క. [14]కలిఁదోఁచి నూనెవ్రేలిడి
తలపుఱ్ఱియయందు నేతితైలంబును జొ
త్తిల రాచి మెత్తగాఁ బొదు
గలరించి[15] కుమారు నునిచి రాదాదు లటన్. 43

శా. క్షోణీనాయకుఁ డిట్టిమేలు విని సుస్నాతుఁడై యాదిక
ళ్యాణం బైన మహోత్సవంబున సముల్లాసంబుతో దానపా
రీణుండై నిజబంధులోకగురుధాత్రీదేవసంసేవన
త్రాణం బొప్పఁగఁ బెట్టె గోధరణిరత్నద్రవ్యమాద్యంబుగన్. 44

సీ. క్రమమున దాదు లక్కడను ముప్పటిలిన[16]
జలకంబు దేర్చి యాచెలువసుతుని

కొనరఁగాఁ గాటుకయును జుక్కబొట్టును
బాటించి యాగడపకు వెలుపటఁ[17]
బొదికిళ్ళఁ దవుడు నిప్పులుఁ బ్రత్తిగింజలు
నిడి యడ్డముగఁ జిట్టు బడిసివైచి[18]
వేఁపరెమ్మలు నీళ్ళ వెసలలోపల సించి
కాపులు పురిటింట గట్టి చేసి
ఆ. వాయనములకెల్ల వనితల రప్పించి
వారు దెచ్చినయవి వరుస నంది
పచ్చకప్పురంపుఁ బలుకులు పట్టి వి
డియము లిచ్చి రింపు నయము గలుగ. 45

క. వెడలం బడితివి చక్కని
కొడుకు బడసితివి రాజుకూరిమి బలిసెం
బడఁతీ నీ భాగ్యమునకు
గడలే దని పొగడి రెల్ల కాంతలు నింతిన్. 46

ఉ. మండలనాయకుండును గ్రమంబున నాపురుడైన యంతఁ బం
డ్రెండవనాఁడు పాపనికి రేవతి గావున మీనరాశి చం
ద్రుం డని పేరు పెట్టి యతిరూఢిగఁ బెంపఁగ వాఁడు బాలచం
ద్రుండును బోలె నిచ్చలును దుష్టియుఁ బుష్టియుఁ గాంచుఁ గాంతితోన్. 47

సీ. వెలఁదులు వీని నవ్వింప నోయని నవ్వు
వేడుక మూతియు విఱుచుచుండు[19]

నూకరలిచ్చు[20] నయ్యుయ్యాలఁ జేరిన
నడు మెత్తివైచు ముందలయు నెత్తు
జోవలు వాడిన[21] భావించు నాలించు
చుండు నేడుపు మాను నుగ్గు లడుగుఁ
గోరి డగ్గఱఁగ నంగుష్ఠంబు[22] నోరిలో
నిడుకొనుదాఁ జన్ను గుడుచుభంగిఁ
ఆ. జిన్నిపాదములును జేతులు జాడించు
జవనగతిని మొరయ రవళి దన్ను[23]
బోరగలి ఫణీంద్రు పోలికఁ దలయెత్తి
యాడు బలుక నందునందుఁ జూచు. 48

క. కూర్చుండు నురమునం జన
నేర్చును విద్ధాంబు సేయనేర్చును భీతిం
దార్చుచుఁ దప్పుటడుగు లొడఁ
గూర్చు జనని చెట్టపట్టుకొని నడపాడున్. 49

క. విందులు విందు లనుచు వే
డ్కందనుఁ బిల్వంగ నగుమొగం బలరంగా
నందియలు మొరయఁగా గురు
లుం దూలఁగ[24] వచ్ఛి యంతలోఁ గప్పుకొనున్. 50

క. నిలువెల్లను గనకం బై
పలు కంతయు నమృత మగుచుఁ బార్థివునకు ము

ద్దులు చూపుచు నానాఁటికి
బలుదెఱఁగులఁ బెరిఁగె నతనిప్రాణపదంబై. 51

వ. అంత నతండు తచ్చూడాకరణంబునాఁడు నానావిధంబు లగుదానంబుల దీనుల విప్రులం బరితుష్టులం జేసి యాదేవదత్తునకు మఱియు నొకసర్వసమృద్ధగ్రామం బిచ్చి కుమారునిం బరీక్షాధికారం గావించిన బహుమానితుండై బహుదినంబులు తత్కార్యవిచక్షణత్వంబువలన విశిష్టపూజల నొందుచు విలోచనసుతుఁడు త్రిలోచనసుతుండునుం బోలెఁ ద్యాగభోగానురాగంబులం జెలంగుచుండునంత. 52

క. నృపతి యొకనాఁడు గని ని
ష్కపటాత్మ! పరీక్షణాధికారివి నీయ
త్యుపకారమునకుఁ దగఁ బ్ర
త్యుపకారము చాల దనియె నుర్వీసురుతోన్. 53

చ. అనవుడు దేవడత్తుఁడు ధరాధిప యిట్లన కేను నీకుఁ జే[25]
సిన యుపకార మింత నుతిచేసెద వేటికి నంచుఁ దత్ప్రియం
బొనరఁగఁబల్కి కొంతతడ వుండి గృహంబున కేగువేళ నా
తని సుతుఁ జంకఁ బెట్టుకొని తత్తఱ మందుచు వచ్చెఁ జెచ్చెరన్. 54

ఉ. అయ్యెడ వాని డాఁచి కనకాభరణంబులు పుచ్చి బంటుచేఁ
జయ్యన నిచ్చి యమ్ము మని సంతకుఁ బంపిన యంతలోన నేఁ
డెయ్యెడ కేగెనో శిశువు నెవ్వరు చంపిరొ యంచు నేడ్వఁగా
దయ్య మెఱుంగుఱంతు వసుధాపతిగేహము నిండెఁ బెల్లుగన్. 55

క. అమ్మొఱ విని తలవరులు ర
యమ్మున నలుగడల జాడ లరయుచు నొకచో

నమ్మంగ బంటుగని[26] యా
సొమ్ములతోఁ బట్టి తెచ్చి చూపిరి పతికిన్. 56

వ. చూపిన నమ్మహీనాథుండును నీసొమ్ములు నీ కెవ్వరు తెచ్చియిచ్చి యమ్ముమనిన నీ వమ్ముచున్నవాఁడ వని యడిగిన దేవదత్తుండను బ్రాహ్మణుండు తెచ్చియిచ్చెనని యాతఁ డెఱిగించిన. 57

ఆ. బంటువలన నెఱిఁగి బ్రాహ్మణు రప్పించి
నిలువఁబెట్టి తప్పుఁ దెలియ నడుగ
నతఁడు మోము వాంచి యపరాధియునుఁ బోలె
నుత్తరంబు లేక యూరకుండె. 58

క. చనువా రటు ధట్టింపఁగ[27]
నసుమానించుచును దైన్య మడరఁగ వెడఁగై
ధనలోభంబునఁ గొనిచని
జననాథా నీతనూజుఁ జంపితి ననియెన్. 59

సీ. అనుడు నారాయణా యని వీనిఁ బట్టి తి
త్తొలిపింపఁ దగు నని పలుకువారుఁ
గాళ్ళును జేతులు గనియలుగాఁ బట్టి
చిదిమింపఁ దగు నని పదరువారుఁ
గాయంబు నుగ్గుగా గలుగానుఁగలఁ బెట్టి
త్రిప్పుట తగు నని తెలుపువారు
మేన వెంటులు చుట్టి పైనగ్గితగిలించి
మిడికింపఁ దగు నని నొడువువారు
ఆ.వె నగుచు జనులు దుర్వధార్హుండు వీఁడగు
ననుచు విన్నవింప నవనివిభుఁడు[28]

తనయదుఃఖవహ్ని దనలోనఁ గ్రాఁగుచు
జంపఁబూని తనదు తెంపు దలఁచి[29]. 60

వ. అద్దేవదత్తునితోడ. 61

క. ఆపకారము గా దిది నా
యుపకారము వాసె భూసురోత్తమ విను నీ
యుపకారమునకు నిది ప్ర
త్యుపకారం బయ్యె నింక నోడక పొమ్మీ. 62

ఆ. అనుచు విడిచి మఱియు ధన మిచ్చి యనిపిన
హితులు దూఱి శిశువు మృతికి నోర్చి
యింత దెరువుచూపు టేయుపకారంబు[30]
గాఁదలంచి యేల కావ ననుడు. 63

క. వినుఁ డిట నేఁ గలిగిన నా
తనయుండును గల్గెఁగాక తప్పిన యెడఁ గా
ననమున నితఁడు తలఁగిపో
యిన భేరుండములలోన నే మగుడుదునే[31]. 64

వ. ఇట్లు గాకుండం జేసిన నీరాజ్యంబును సంతతియును నగపడె నాప్రాణంబులు గాచి నన్ను నిలిపినవానికి సెలవు సేయుట యెంత పని[32] నామీఁది యప్పు కొంతదీర్చుకొనం గలిగె నూరకుండుం డనిన. 65

క. పౌరుల్ హితులు దొర ల్పరి
వారంబును రాజు వెఱ్ఱివాఁ డయ్యెఁ గదే
మూరెఁడు త్రోవయుఁ జూపుట
గారాపుంబట్టి చావుగనియుం గాచెన్[33]. 66

వ. అని చెడనాడుచున్న యెడను. 67

ఆ. దేవదత్తుఁడు నరదేవుని సద్గుణం
బెఱింగి సంతసించి యింటి కేగి
చందమామకూనచందంబుతో నున్న
శిశువుఁ దెచ్చి రాజుచేతి కిచ్చె. 68

వ. ఇట్లిచ్చిన పాపనిం జుచి. 69

క. విస్మయహర్షంబుల మం
దస్మితవదనాబ్జుఁ డగుచు ధరణీవరుఁ డా
కస్మికదురితము లడఁచెడి
యస్మత్కులదైవ మనుచు నతనికి మ్రొక్కెన్. 70

ఉ. మ్రొక్కిన దేవదత్తుఁ డతిమోదము నొంది నరేంద్ర నీమనం
బిక్కడఁ జూడవేఁడి యలయించి మహావ్యథఁ దూలపుచ్చితిన్
మిక్కిలి తప్పుచేసి కడమీఱి భవద్గుణరత్నముల్ మెఱుం
గెక్క నొనర్చితిం బరుల కీకథ మంచితనంబు నొజ్జఁగాన్. 71

శా. అంచుం జెప్పిన నయ్యవంతివరుఁడున్ హర్షించుచు న్సంపదం
గంచిం బోలినయట్టి పట్టణము సత్కారంబుగా నిచ్చి మ
న్నించెం బాత్రుఁ డటంచు ధర్మసభకు న్నిర్ణేతగాఁ బ్రీతిఁ గా
వించెం గావున నీకు నట్టిగుణ మన్వేషించినం గల్గునే. 72

క. మగుడుము గద్దియ యెక్కుట
యగపడ దిఁక ననిన విక్రమార్కుగుణంబుల్
పొగడుచు బిగిచెడి ధారా
జగతీపతి చనియె నాత్మసదనంబునకున్. 73

వ. మఱియు నొక్కనాఁడు. 74

ఐదవబొమ్మ కథ

క. తెల్లని యమృతాంబుధిలో
నల్లని తిరుమేను ధవళనలినములోనం
ద్రుళ్ళెడు తుమ్మెదక్రియ రా
జిల్లఁగ విహరించుచున్న సిరివరుఁ కొలుతున్. 75

మ. అని చిత్తాబ్దములోఁ దలంచి సమయజ్ఞామోదితం బౌ దినం
బున సౌమ్యగ్రహదృష్టలగ్నమున నాభోజుడు వేడ్క న్మహా
సన మెక్కంజని పాదపద్మ మిడఁ జాల్చాలంచు నచ్చోటు కాం
చనపాంచాలిక వల్కె సర్వజనతాశ్చర్యం బవార్యంబుగన్[34]. 76

క. కార్యం బెఱుఁగవు దానా
చార్యుండగు విక్రమర్కు సరిపూనఁగ గాం
భీర్యముతోఁ గూడిన యౌ
వాక్యము లే కేల యెక్కఁ దర మగు నీకున్. 77

క. అనవుడు విస్మితుఁ డై మీ
జనపతి గాంభీర్యదానచాతుర్యము లే
పనిపట్టులఁ గనుపట్టిన
వని యడిగిన భోజనృపతి కది యి ట్లనియెన్. 78

శా. ధారానాయక యాచకార్తజనతాదారిద్ర్యవిద్రావణుం
డారూఢస్థిరకీర్తివల్లివిభవవ్యాప్తాఖిలాశాంతవి
స్తారుం డూర్జితవిక్రమక్రమనిరస్తక్షోణిపాలాగ్రసం
భారోత్సాహుఁడు సాహసాభరణుఁ డొప్పం జేసే రాజ్యం బిలన్. 79

క. భూతలమునఁ బుణ్యగుణ
ఖ్యాతుం డగు నతని చేతి కౌక్షేయకధా

రాతీర్థంబున మునిఁగి య
రాతులు విహరింతు రమరరమణీయుతులై. 80

వ. అట్లేలుచుండు నతనిరాజ్యంబున నెలకు మూఁడువానలు దళంబుగాఁ గురియ జనులెల్ల నుల్లంబుల నుల్లాసంబు వెల్లివిరియ ధనధాన్యసమృద్ధులై యున్న యెడల రత్నగర్భాతలంబున రత్నాకరగుణప్రఖ్యాపనాపరుండునుంబోలె వణీశ్వరుం డగునొక్కరత్నవ్యవహారి దూరదేశంబుననుండి యుజ్జయిని కరుడెంచి. 81

క. అంబుధి పుత్తెంచిన క
ప్పం బన రేఖాంకబిందుభంగాదికదో
షంబులఁ బొరయని పదిర
త్నంబులు గుది గుచ్చి తెచ్చి నరపతి కిచ్చెన్. 82

ఆ. వానిఁ జూచి కొలువువార లద్భుతమంద
మానవేంద్రుఁ డాత్మలోన మెచ్చి
విలువ నిశ్చయించి చులుకగా నతనికిఁ
దేటపడఁగ ధనము కోటి యిచ్చె. 83

ఆ. కోటిధనముఁ బుచ్చుకొని యగస్త్యునియుక్తి
నమరునాల్గుసాగరములయందు
నుత్తమంబు సింహళోద్భవం బటుగాన
దీనిఁ గొనుము మనుజుదేవ యనుచు. 84

వ. ఇచ్చిన నదియును బ్రభాపటలవిభాసితసభామండపంబై యంబరమణిబింబవిడంబకం బగుచున్న మానికంబు గైకొని మానవేంద్రుండు విస్మయమానమానసుండై తన్మూల్యంబు కోటి ధనం బిచ్చి యిట్టివి మఱియునుం గలవే యని యడిగిన నావర్తకుండు. 85

ఆ. దీనికంటె నొప్పు[35] దివ్యరత్నంబులు
గలవు మద్గృహమునఁ గొలుఁదిమీఱి[36]
ధరణినాథ నాకు దశకోటి ధన మిచ్చి
భటుని బంపు పదియు బంపువాఁడ. 86

క. అని చెప్పిన నాతని కా
ధన మిచ్చి భటాళిఁ జూచి తఱిదప్పకవే[37]
చనిరత్నంబులు గొని తె
చ్చినవానికి మెచ్చు గలదు చేకొనుఁ డనియెన్. 87

వ. అనిన నసహాయుశూరుండును నలఘుతరాంఘ్రితలలంఘనుండు నగు నొక్కజాంఘికుండు లేచి. 88

క. అచ్చట నారత్నంబులు
పుచ్చుకొనుచు నేడుదివసములు పో మఱునాఁ[38]
డిచ్చటికి నిన్నుఁ గొలువఁగ
వచ్చెద నీయడుగు లాన వసుధాధీశా. 89

సీ. అని పంతమాడిన హర్షించి తాంబూల
మిప్పించి వ్యయమున కేడుమాడ
లొసఁగి వర్తకుఁ గూడి మసలకుమీ యని
యనిపిన వానిఁ దోడ్కొనుచు సెట్టి
యశ్వరత్నమునెక్కి యతివేగమున రేలుఁ
బగళులు నెచ్చోటఁ దగులువడక
నాలుగుదినముల నలువదియామడ
ల్చని వీడు సొత్తెంచి తనగృహమునఁ

ఆ. దేజరిల్లుచున్న దివ్యరత్నంబులుఁ
బదియు నిచ్చి రాచబంటు నంత
గవని వెడల ననిపి క్రమ్మఱ నేగిన
వాఁడు నటకు నడచి వచ్చె నట్ల. 90

క. లంఘితనగనగరసరి
త్సంఘాతుం డగుచు దినము దప్పక వడి ని
స్సంఘర్షాధ్వగుఁడై యా
జాంఘికుఁ డరుదెంచెఁ బురికి సంధ్యావేళన్. 91

క. కాలూఁదక యట చని భూ
పాలుం గని మొక్కి తనదు పంతంబునఁ ద
త్కాలోచితదివసకర[39]
జ్వాలాకృతి వెలుఁగు నైదు సన్మణు లిచ్చెన్. 92

ఉ. ఇచ్చిన వానిఁ బుచ్చుకొని యేలిక యల్లనఁ జల్లచూపులం
దెచ్చినబంటుఁ జూచి మఱి తెమ్మిఁక నైదును నాకు నిప్పుడే
మిచ్చితి తోడి మానికము లేగతిఁ జిక్కిన వన్న[40] నాభటుం
డిచ్చఁ దలంకియుం దలఁక కిట్లనియెం గరము ల్మొగుడ్చుచున్. 93

ఆ. మొదల సెట్టిచేతఁ బదిరత్నములుఁ గొని
మగిడి వచ్చుచోఁ గ్రమక్రమమునఁ
బార్థివేంద్ర నాకు భాగ్య మింకినభంగిఁ
బెద్దయడవిలోనఁ బ్రొద్దుగ్రుంకె. 84

వ. అక్కడ మఱియు నొక్క చిక్కుగలిగె. 95

సీ. ధూళి పర్వఁగఁ వడిఁ దూర్పువాఱెడుగాడ్పు
సారతురంగప్రసార మనఁగ
సంపూర్ణజలమదశ్యామలాకృతు లైన
యంబుదంబులు కుంజరంబు లనఁగ
భూరిగర్జితములు భేరిరవము లన
మెఱుపు లాయుధముల మెఱుఁగు లనఁగఁ
గేకినాదములు మహాకాహళము లనఁ
జాతకంబులు భృత్యసంఘ మనఁగ
తే. శక్రచాపము[41] విజయధ్వజం బనంగ
నొప్పి భూతవిహిత[42] జీవనోదయమున
నవనినాయక నీదువాహ్యాళిఢాక
ననుకరించుచుఁ దోఁచె వర్షాగమంబు. 96

సీ. తొలితొలి సన్నంపుఁదుంపురు లొలుకఁగా
వెసఁ దిమితిమి యని[43] ముసురువట్టె
బిసబిస యని గాలి బెట్టుగాఁ బెటపెట
గణికలంతంతలు చినుకు లురిలెఁ
బిడుగు పెఠిల్లునఁ బడియెనో యనఁగను
గడిఁదియుర్ములు బెడబెడ యనంగఁ
గ్రొక్కారుమెఱుఁగు తళుక్కని మెఱయఁగాఁ
హాసియుఁజీఁకు చూపఱఁ బెనంగ
తే. నించి కడవలు వడిఁ గ్రుమ్మరించినట్లు
పాము వ్రేలాడఁగట్టినభంగి దోఁప

వాన బోరునఁ గురియంగ వఱదనుండి
మిఱ్ఱుఁ బల్లంబు నొక్కటై మేరమీఱె. 97

ఉ. దందడి దందశూకసమధారలు తోరము లై పడంగ మ
ధ్యందినవేళ యైన నభ మంతయుఁ జేకొని చీఁకుపర్వ న
క్తందినచిహ్నము ల్మఱవఁగా నటు బోరన వాన నట్టి దై
నందినకల్పమో యిది యనన్ జలపూరము నిండె ధారుణిన్. 98

వ. అట్టి వర్షోత్కర్షంబున మార్గంబు జలదుర్గమం బైన. 99

క. తత్కాలమ్మున నిలువక
యుత్కోచము చేసి తప్పియును భవదాజ్ఞా
సత్కారముఁ దలఁపుచుఁ[44] జని
యుత్కూలజలాఢ్య[45] మైన యొకనదిఁ గంటిన్. 100

ఆ. అచట నిలుచునంత నవ్వాన వెలియఁగ
నొకఁడు వచ్చె వాని యొద్ధి కేగి
దైన్యమొంది యేఱు దాఁటించు మని వేఁడు
కొనిన నాతం డీయకొనక పలికె. 101

క. వినుము మహానది దాఁటుట
యును గురువిప్రార్యనిందయును ధర్మసభా
జనవైరము దైవతలం
ఘనమును బరికింప హానికార్యములు సుమీ. 102

క. నారీహృదయంబును వ్యవ
హారినిజంబును నదీజలాపూరంబుం
జోరుని ధర్మస్థితియును
వైరుల చెలిమియును నమ్మవల దెవ్వరికిన్.[46]103

క. అనలము! బన్నగమును దు
ర్జనుఁ డుదకముఁ గపియు[47] బ్రహ్మచారియు వారాం
గనయును నృపుఁ డగసాలెయుఁ
దనవా రని నమ్మవలదు తత్త్వజ్ఞునకున్. 114

క. అనవుడు నివి నీతులు గా
వన వచ్చునె విభునితోడ నాడినపంతం
బున నీపదిరత్నంబులు
గొని చని దర్శించి రాజు గొలువఁగవలయున్. 105

క. తలకొను మని ప్రార్థించిన
వలనుగ నాకార్యగౌరవ మ్మెఱిఁగి యతం
డలయక యిది సం దనుచును
వలనొప్పఁగఁ బుంటిచేయి పట్టినభంగిన్. 106

ఆ. అవనిపాలుఁ గొల్వ నవసరం బైనచోఁ
జాలు నింతవడి విచార మేల
యైదుమానికంబు లందు నా కిచ్చిన
నిట్టె యవలిదరిని బెట్టువాడ. 107

వ. అనిన. 108

సీ. అడిగిన రత్నంబు లన్నియు నిచ్చితి
నేని రాజద్రవ్యహాని పుట్టు
నీఁజెల్ల దని యున్న నీదినం బిచ్చోటఁ
దప్పెనా రాజాజ్ఞ దప్పఁ గలుగు
నిలలోనిధనికుల యిండ్ల హయంబులు
ధనధాన్యములును గాంచనము మణులు

మృదులాంబరములు మృగమదకర్పూర
చందనంబులుఁ బరిచారగణము
ఆ. ధానధర్మములు సమానమై యుండును
వానికంటె భూమివరుని కలిమి
యెక్కుడగుచుఁ జెల్లు నెల్లదేశంబుల
రాజ్యమనఁగ నాజ్ఞ పూజ్య మగుట[48]. 109

వ. అని విచారించు నెడలఁ దొల్లింటి నీతి తలంపునం బడియె. 110

క. ధనమునకు దానమును దప
మున కాచారమును రాజ్యమున కాజ్ఞయు జీ
వనమునకు యశము విద్యకు
వినయంబును నీతులకు వివేకము ఫలముల్[49]. 111

క. ధరఁ దగువారలకుఁ దిర
స్కరణంబును సతుల కొండు శయ్యయు నుర్వీ
వరులకు నాజ్ఞాభంగము
సరి నివి యాయుధము లేని చావులు గావే. 112

మ. అని చింతించి ధరాతలేంద్ర భవదీయాజ్ఞాసముల్లంఘనం
బున కే నోర్వక యేనుమానికము లాపూర్ణాపగాతోయలం
ఘనపణ్యంబుగ నిచ్చినం గొని లతాగ్రగ్రంథిచే నన్ను నే
పున బంధించి రయంబుతో నతఁడు తత్పూరంబు దాఁటించినన్. 113

ఆ. అరుగుదెంచి నీపదాంబుజంబులు గనుఁ
గొంటి నాజ్ఞఁ నడప[50] గంటి నేఁడు

రాజు సెలవు[51] లేక రత్నంబు లిచ్చిన
తప్పునకును శిక్ష దలఁపు నాకు. 114

క. అనవుడు నృపుఁ డుత్తమమణి
ధన మిచ్చియు విఘ్న మైనతఱి నాజ్ఞాలం
ఘన మొనరింపక వచ్చితి
వని మెచ్చుగఁ జేతి మణులు వానికి నిచ్చెన్. 115

ఉ. కావున విక్రమార్కు సరిగావు నృపాలక చాలు నింటికిం[52]
బోవుట మేలు నాఁగ విని భోజుఁడు ఖిన్నముఖారవిందుఁడై[53]
భావములోన నాతని ప్రభావము నీగియు మెచ్చుచున్ సుహృ
ద్భూవరయుక్తుఁడై మగిడి పోయెను నెంతయు వింతచొప్పునన్.[54] 116

వ. ఇట్లు పంచమద్వారంబున నుండి మగిడి మఱియు నుత్సుకుండై. 117

ఆఱవబొమ్మకథ

క. లక్ష్మీనాయకసాయకుఁ
బక్ష్మలనయనాంకవామభాగుని ఘనునిన్
లక్ష్మాహిమకరధరు రజ
తక్ష్మాధరసదను మదనదమనుం గొలుతున్. 118

ఆ. అనుచుఁ గడఁగి భోజుఁ డట గొన్నిదినములు
చనిన విబుధవందిజనులఁ గూడి
యింద్రభద్రపీఠ మెక్కులగ్నంబుతోఁ
బొంతఁ జేరునంత బొమ్మ పలికె. 119

క. నిలు నిలువు విక్రమార్కుని
కొలఁదిని నిర్వ్యాజదానగుణ మటు నీకుం

గలుగక యెక్కం బూనుట
చెలఁగి నపుంసకుఁడు బోటిఁ జేరుట చుమ్మీ. 120

క. నావుడు భోజనృపాలుఁడు
భావంబున సిగ్గు గదురఁ, బాంచాలిక! నీ
వావిక్రమార్కువితరణ
మేవెరవున నొదవెఁ జెప్పు మేర్పడ నాకున్. 121

క. అనవుడు నాపుత్రిక యి
ట్లనియెం జిఱునవ్వుతోడ నవనీనాథా
విను మొప్పుగఁ జెప్పెద నా
జననాయకు దానగుణము సామాన్యంబే. 122

క. సమరస్థలిఁ గపికేతుఁడు
విమతపురోన్మూలనమున వృషకేతుఁడు మా
నమున నహికేతుఁ డాకృతి
సమతను ఝషకేతుఁ డనఁగ జగతిం బరఁగెన్. 123

చ. అట్టి గుణంబులుం గల ధరాధిపుఁ డందఱఁ దండ్రి భంగిఁ జే
పట్టి వినిద్రబుద్ధిఁ బరిపాలన చేయుచు నుండఁగాఁ బ్రజల్
దట్టము లైన సంపదలఁ దారు కుబేరుని పెంపు మీఱి యే
పట్టున దానధర్మములుఁ బాడియుఁ దప్పక యొప్పి రప్పురిన్. 124

వ. ఇట్లు రాజ్యం బఖిలజనమనోరంజకం బగుచుండ. 125

సీ. కనికని మానినీజనమనోధనములు
తొలితొలి గిలుబాడు దొద్దకాఁడు
పువ్వురెమ్మలకు లేమవ్వ మెక్కించుచు
నంగజుతో నాడు సంగడీఁడు

రాచిల్కగములకు వాచవిఁ జుబ్బన
చూఱగా[55] నొనరించు సొంపుకాఁడు
కోకిలంబుల కెల్ల మూకభావంబులు
విడిపింప నడరెడు వెజ్జుఱేఁడు
ఆ. తేఁటికదుపులకును దేనెతోఁ బుప్పొడి
మేపిమరపనేర్చు తీపులాఁడు
మ్రాఁకులకు ముదంబుఁ బ్రాయంబు వాటిల్ల
వింతఁ దోఁచె భువి వసంతుఁ డంత. 126

వ. అప్పు డామలయాచలంబు నుండి. 127

క. వే చని చని ఫణిసతులకు
వాచవి పుట్టించి[56] రత్నవతి యనునదిలో
వీచికలఁ దోఁగి[57] మెల్లన
వీచెం దెమ్మెరలు మరునివీచోపులనన్. 128

క. మరుఁ డరుదేరఁగ ముందఱఁ
దిరువీథులు దుడుచుకరణిఁ దిరుగుచుఁ బవనుం
డిరవుచెడ వీవ జడియఁగఁ
దరువులఁ గారాకు ధరణిఁ దఱచై రాలన్. 129

క. బలిమియుఁ గలిమియుఁ జెలిమియు
నలవడ వచ్చిన వసంతుఁ డనుచుట్టముతోఁ
గలసిన నెలకొను పులకల
మొలకల క్రియఁ దరుల మొత్తముగఁ జిగురొత్తెన్. 130

క. చెలరేఁగి మరుఁడు విరహులు
దలఁకంగా దండుగదలు తఱి నతనికి మా

వులు మొదలుగఁ దలకొను బహు
దళములను వసంతుఁ డపుడు దగ మొనదీర్చెన్. 131

క. దీపంబుల క్రియఁ బువ్వులు
దీపింపఁగ మోదుగులు మది న్విరహులకుం
దాపంబు లినుమడింపఁగ
రూపించిన మన్మథాగ్నిరూపము దాల్చెన్. 132

క. శ్రీరమణీయవసంతో
దారవ్యాకోచకుసుమతతి వనలక్ష్మీ
భూరివిభూషణభాండా
గారంబులకరణిఁ గర్ణికారము లొప్పెన్. 133

క. బహుకిసలయఫలసుమనో
విహితోత్సవపికశుకాళివిహరణసౌఖ్యా
వహమహనీయగృహ శ్రీ
సహజములై చూడ నొప్పె సహకారంబుల్. 134

సీ. ఫలరసంబులఁ గూడి యలుఁగులు వాఱెడి
పూఁదేనియలు వారిపూర మనఁగ
సాంధమధూళికాస్యందమందానిల
స్ఫురణంబు తరగల పొం దనంగ
శుకతుండసదృశకింశుకముకుళంబుల
కాంతులు విద్రుమౌఘంబు లనఁగ
మవ్వమెక్కిన వెలిక్రొవ్విరు లెల్లను
శంఖమౌక్తికఫేనసంఘ మనఁగఁ
ఆ. దత్పరాగధూసరోత్పతద్భ్రమరాళి
శీకరంబు లనఁగఁ జెలువు మీఱి

యుదధిభంగిఁ దత్పురోద్యానవనభూమి
మాధవాశ్రయమగుమహిమఁ దాల్చె. 135

ఉ. గంధవహుండు వేగరి పికంబులు గాయకపంక్తి మత్తపు
ష్పంధయము ల్బలంబు శుకసంఘము మంగళపాఠకుల్ మహా
బంధురకార్యవాది నిజబంధుఁడు చంద్రుడు మంత్రిగాఁగ గ
ర్వాంధుఁడు మన్మథుండు దనయాజ్ఞ దలంబుగ నేలెఁ దత్పురిన్. 136

క. తత్సమయంబున భూవరుఁ
డుత్సాహము రాజవృద్ధియును మెఱయ వసం
తోత్సవ మొనరింపుద మని
యుత్సుకుఁ డై కదలె వైభవోద్రేకమునన్[58]. 137

వ. తదనంతరంబున. 138

సి. మంజులమంజీరశింజారవంబులు
వీనుల కందంద విందు లొసఁగఁ
గాంచనకాంచీప్రకాశవిలాసముల్
వలపుల పసిఁడివన్నియ నిగుడ్పఁ
దారహారోజ్జ్వలస్తనకుంభదీప్తులు
ముఖచంద్రకళలతో ముచ్చటాడఁ
దాటంకరోచులం దఱిమిన కన్సోఁగ
మెలఁకువ లిరుదెస మెఱుఁగులీన
ఆ. జల్లిముత్తియములు మొల్లపూదండలు
దల్లితోడుభంగిఁ దడఁబడంగ
వలయరత్నరుచులు కెలఁకులఁ బొలయంగఁ
దలిరుఁబోఁడు లెదుర నిలిచి రిట్లు. 139

వ. మఱియుం దదనురూపసఖీజనంబులును, భవసుగంధద్రవ్యహస్తంబు లగు పరిచారికాగణంబులును, విటనటపీఠమర్ధవిదూషకవైతాళికవందిబృందంబులును, భూషావిశేషభూషితదేహంబు లగు నుత్సవసందర్శనాగతోత్సుకసందోహంబులును జేరి యక్కడక్కడ నిరుపక్కియల నిలుచునప్పుడు. 140

క. ఒనరించిననీలని నడ
గని బొల్లనిఁ, గత్తలాని, గైరని, సారం
గని, జారని, జన్నని నిమ
వని మొదలుగఁ దెచ్చినిలిపె వాహకుఁ డెదురన్. 141

క. అక్కడ నొయ్యనఁ బచ్చల
పక్కెరతురగంబు నెక్కి పతి గదలుచు సొం
పెక్కెఁ దనచిలుకవారువ
మెక్కి వసంతునకు మారుఁ డెదురేగుక్రియన్. 142

శా. రాజశ్రేష్ఠుఁడు వాగె సన్నల గతు ల్రాజిల్ల రేవంతు న
ట్లాజాడం బురుకొల్పునట్టి గతితో నమ్మేరగా మెల్పఁ దా
నాజాడం బురికొంచు నట్టి వడితో నామేరఁ దానిల్చుచున్
వాజీంద్రంబు మనోజవం బనఁగ నిర్వ్యాజోద్ధతిం దేలఁగన్. 148

క. విద్యుల్లతలకు నెనయగు
హృద్యాకృతులైన వనిత లేతేర మహా
వాద్యంబులు మ్రోయఁగ నృపుఁ
డుద్యానవనాంతభూమి కొయ్యనఁ జనియెన్. 144

మ. చని యచ్చోట విభుండు చేరె సుమనోజాలప్రవాళావళీ[59]
జనితానేకసకామపంచశరచంచచ్చాపవల్లీగుణ

ధ్వనిశంకావహఝంకృతిప్రవిలసత్సంగీతభృంగాంగనా
ఘనసంతోషవిశేషకల్పలతికాకందంబు మాకందమున్. 145

వ. తత్ప్రదేశంబున శంబరభేదివేదికాకృత్యంబులు నివర్తించునంతకుం గతవాహనారోహుండై
యంకురితకోరకితఫలితఫలినంబుణ నవలోకించుచున్నయెడ విదూషకుం డొక్కచోఁ జోద్యభేద్యంబుగాఁ బద్యంబు చెప్పి మామిడి సిరి వడయ వ్రాసితిఁ బత్రిక యందుకొన ననక యవధరింపు మిది తగు ననుచు నాశ్రయించినవారికి మామిడి కాముని గెలుపుంగలిమికి దుంప యగునను నర్థంబుగలుగ నొకయాకున వ్రాసి చేతి కిచ్చె నది యెట్లనిన. 146

క. మాకంద మలర వ్రాసితి
మాకంద మనాక చూడు మాకందమిటన్
మాకంద మనుచుఁ జేరిన
మాకందము మదన జయరమాకంద మగున్. 147

వ. ఇట్లున్న నది చదివి చిరునవ్వుతో నవ్విభుండు జాణ వవుదు వని పరిణమించిన నతండు చందనాశ్రితవృక్షసౌరభంబుగతి మాకు నిది నీ ప్రభావంబున నయ్యె నని కొనియాడి మఱియును. 148

క. నీ కెన యగు నాశ్రితర
క్షాకుశలత్వమునఁ దన్నుఁ గలసినపుణ్య
శ్లోకపికమధుకరముల న
శోకంబులఁ జేయు నిది యశోకంబు చుమీ. 149

క. వికలంబుగ నీవాసన
సకలంబును బువ్వులందు సంపూర్ణముగా
వకుళంబులందు రోలం
బకులం బిది దీనిఁ జూడు పార్థివముఖ్యా. 150

క. భిన్నాగమ బలశంబర
భిన్నాగ మనంగ మిగులఁ బెంపొందిన యా
పున్నాగ మవధరింపుము
పున్నాగమనోజ్ఞకీర్తి పుణ్యాగణ్యా. 151

క. కంబూపమహంసలనిల
యం బూర్జితమూలబంధ మంభోనిధిగా
జంబూవృక్షముఁ జూచితె
జంబూద్వీపంబుసరి నిజం బూహింపన్. 152

క. సంచితపింఛసమంచిత
పంచాయుధమరకతాతపత్రం బన ని
శ్చంచలశాఖాంచిత మగు
చించావృక్షంబుఁ జూడు చిత్తజరూపా. 153

వ. దీని ప్రభావం బే మని వర్ణింపంబోలు. 154

క. చింత మది లేక మనుజులు
చింతించినకొలదిఁ జవులు చేకూర్చుచు ని
శ్చింతులఁగా నొనరించెడు
చింతకు సరి గలదె లోకచింతామణికిన్. 155

క. ఈచింతపంటిసరిగా
నోచెల యమృతంబుఁ జెప్ప నొప్పునె దానిన్
వాచవి గొని తమజిహ్వల
నేచవులును లేక చెడరె యింద్రాదిసురల్. 156

క. భ్రాంతి వడి కల్పవృక్ష
ప్రాంతంబునఁ గూడుఁ గుర్కుఁ బట్టక సురల

శ్రాంతంబు దీనికై మదిఁ
జింతించుటఁ జేసి పరఁగెఁ జింత యనంగన్. 157

క. మును జిగురునఁ బువ్వున నో
మనగాయల దోరపండ్ల మఱి యారఁగఁబం
డినపండ్ల నెల్లకాలముఁ
దనియఁగఁ జవు లొసఁగ నొండు తరువులు గలవే[60]. 158

క. ఉడుపతి తనలో నమృతము
గడలుకొనియుఁ బెక్కుచవులు గానక కృశుఁడై
విడిచినకళ లన్నియు నీ
గొడిసెల రూపమునఁ జింత గొలువఁగఁబోలున్. 159

క. వెస నిర్మించిన బ్రహ్మకు
రసికుఁడు మ్రొక్కిడుచు ఫలము రంజిల్లఁగ ష[61]
డ్రసములలో నిది నమలెడు
దెసఁ గని నోరూరు నాదిదేవునికైనన్. 180

ఆ. గరిత లేని యిల్లు దొర లేని తగవును
జింతపండు లేని వింతచవియుఁ
జనవు లేని కొలువు శశి లేని రాత్రియు
ముక్కు లేని మొగము నొక్క రూపు. 161

మ. అని యిబ్భంగి విదూషకుండు చనవున్ హాస్యోచితం బైన చొ
ప్పునఁ దద్జ్ఞత్వము నేర్పడం బలుకుచు స్భూభర్తకు న్వాగ్వినో
దనసౌఖ్యంబులఁ బ్రొద్దుపుచ్చునెడ నుత్సాహంబుతోఁ గామిను
ల్వనసౌందర్యవిలోకలోలమతులై వర్తించి రయ్యైయెడన్. 162

క. అడుగులుఁ గెందలిరాకులుఁ
దొడవులుఁ గ్రొవ్విరులుఁ గురులుఁ దుమ్మెదగుములుం
దడఁబడ బడఁతులు బెడఁగడ
రెడు నడగల తీవెలనఁ జరించిరి కవఁకన్. 163

సీ. ఎలమావిజొంపంబు లివె చూడుమనుచు నొం
డొరులకు జూపుచుఁ దిరుగువారుఁ
గరములుఁ బల్లవోత్కరములుఁ దడఁబడ
డాయుచుఁ బువ్వులు గోయువారుఁ
బొలుపారఁ దనువులు పుష్పవల్లులతోడఁ
గూడ డాఁగురుమూత లాడువారు,
దిన్నని యేలలఁ దీపులు రెట్టింపఁ
దీఁగె యుయ్యల లెక్కి తూఁగువారుఁ
తే. బువ్వు దేనియఁ గురియంగఁ బొన్న లెక్కి
మెఱపుల ట్లందు విరులకు మెలఁగువారు
నగుచు బాలికలు వనవిహారలీల
లెనయఁ జెలఁగిరి వనలక్ష్ము లనఁగ నచట. 164

ఉ. వెన్నలి వ్రేలఁగాఁ బిఱిఁదివ్రేఁకట మొయ్యనఁ గ్రింది కీడ్వఁగాఁ
జన్నులమీఁదఁ గ్రిక్కిఱిసి సందెటిదండలు పొంతనిక్కఁగా
సన్నపుఁగౌనుదీఁగఁ గడుసన్నముగా మునివ్రేళ్ళ నిల్పి తాఁ
బొన్నలు గోసెఁ జేతులను బుప్పొడి యొప్పెడుకొమ్మ కొమ్మలన్. 165

ఉ. అత్తతి నత్తలోదరుల కందఱ కందుల కందరాని పూ
గుత్తులఁ జూపి చేకొలఁదిఁ గోయుడు మీరని గ్రుచ్చి వానికై
యెత్తుచుఁ జేయి దప్పె నని యించుక జాఱఁగనిచ్చి యక్కుల..
హత్తుచు నంగసంగసుఖ మందిరి కొందఱు ప్రేమఁ గాముకుల్. 166

ఉ. దేహము లాకుఁదీఁగెలకుఁ దేఁకువ సూప నవీనగుచ్ఛక
గ్రాహక లైనకాంతలకు ఘర్మజలం బుదయించుచుం బ్రియ
స్నేహరసాకృతిం జెలువు చేకొనఁగా మకరందబిందుసం
దోహసమావృతంబు లనఁ దోఁచెఁ దదీయముఖారవిందముల్. 167

ఉ. కాంతుఁడు వోలె సోలి యలకంబులుఁ బయ్యెద లొత్తుచు న్వన
శ్రాంతులు దీర్చుచు న్మిగులఁ జల్లనివాసన నావనస్థలో
పాంతనిదాఘవారికణహారివిహారి యనంగ నింతుల
న్సంతస మందఁజేయుచు వసంతసమీరుఁడు వీచె నయ్యేడన్. 168

ఆ. పువ్వుఁబోఁడు లంతఁ బుష్పాపచయకేళి
చాలు ననుచు నాత్మసఖులఁ గూడి
భూతలేంద్రుఁ డొక్కచూతతరుచ్ఛాయ
నుంట దెలిసి వేడ్క నొయ్య మగిడి. 169

క. మనసిజునకుఁ బొడసూపెడు
వనదేవత లనఁగ వచ్చి వనజానన లా
జననాయకునిం బువ్వులు
కనుకనిఁ గానుకలు చేసి కనుఁగొని రచటన్. 170

క. క్రొక్కారు మెఱపుగములను
లెక్కింపను సోయగముల లీలలుగల యా
చక్కనివనితలలోఁ బతి
చుక్కలలోఁ జంద్రు భంగిఁ జూడఁగ నొప్పెన్. 171

వ. ఇట్లు తరుణీగణపరివృతుండై యచ్చటు వాసి చని పురోభాగంబున రంభాస్తంభశోభితంబును మృగనాభిలిప్తంబును ఘనసారరంగవల్లీతరంగితంబును బూర్ణకలశాలంకృతంబును మరువకావృతపర్యంతంబును నగువేదీమధ్యంబున నరపతి రతిరాజానువర్తియైన ఋతుచక్రవర్తి నర్ఘ్యపాద్య ధుూపదీపాదిషోడశోపచారంబుల నారాధించి పంచమహావాద్యప్రపంచంబుల నృత్తగీతాదిమహోత్సవంబులు మెఱయఁ గర్పూరాదిసుగంధద్రవ్యంబులతో నింతులతో వసంతఖేలనం బొనర్చె. 172

క. వ్యక్తంబుగ సతిపై ను
న్ముక్తం బగు కప్పురంబు ముద్దర లల్పా
సక్తం బై యలకలపై
ముక్తాజాలకముచందమునఁ జెన్నొందెన్. 173

క. చెలఁగుచుఁ బతి చల్లినఁ దొ
య్యలుల ముఖాబ్దములఁ గొంత యంటి సుగంధం
బలవడియె మెఱుఁగుటద్దం
బుల నంటిన మెఱుఁగుఱాతిపొడియును బోలెన్. 174

క. సురభితహరిదంతరనవ
పరిమళసంకీర్ణపూర్ణపరిమళమునఁ ద
త్తరుణులముఖముకురంబులు
సరజస్సరసీరుహముల చందము నొందెన్. 175

క. సుందరులఁ గూడి వైభవ
బృందారకపతి వసంతపీతాంబరుఁ డై
బృందావనమున గోపీ
బృందాన్వితుఁ డైనకృష్ణువిధమున నొప్పెన్. 176

మతకోకిల. కుంభినీనికరంబుతో నొనగూడి యాడుమహాటవీ
కుంభిచందము దోఁపగా నతిగుంభితప్రమదంబునం
గుంభీనీపతి మందయానలఁ గూడి వేడుకతోడుతన్
జృంభితాంబర మౌ సరోవరసీమఁ జేరెఁ గ్రమంబునన్. 177

మత్తకోకిల. అందుఁ జొచ్చి చెలంగి సుందరు లందఱు న్ముదమందుచుం
గ్రందుకొంచుఁ బరస్పరం బుదకంబు మోములఁ జల్లుచు
న్ముందలం దను ముట్టుకొమ్మని మున్గి దవ్వులఁ దేలుచుం
జందనంబు గరంగ లీలలు సల్పి రోలలు వాడుచున్. 178

సీ. వదనదర్పణములు వారిరుహంబులు
నలకజాలకములు నలికులములు
లోలనేత్రంబులు నీలోత్పలంబులుఁ
గుచకుంభయుగములు గోకములును
బాహువులును బిసప్రకరంబులును లోఁతు
గలనాభిమండలములును సుళ్ళుఁ
దమలోన సరి యనఁ దారతమ్యము చూడ
నిన్నియు నొక్కచో నితఁడు గూర్చె
తే. ననఁగ నంగనాసహితుఁడై యవనివిభుఁడు
చటుమునఁ గ్రీడించుగోపికారమణుకరణి
దివ్యనదిలోన నప్పరఃస్త్రీసమేతుఁ
డైన వజ్రినాఁ జెలఁగెఁ బద్మాకరమున. 179

కి. వెలికిలఁబడి యీఁదెడునెడ
జలసంవృతగాత్రి యైనసతివదనముతో
నలవడఁగఁ జన్ను లొప్పెను
జలజాతము పొంతనున్న జక్కవ లనఁగన్. 180

క. ఓలోల యనఁగ నెచ్చెలి
యాలోఁ దను ముట్టవచ్చు టది గని పెలుచన్
లోలాక్షి మునిగి యీఁదెను
మీలకడను నయనరుచులు మెఱయించుక్రియన్. 181

క. కామినులు చేరి మెలఁగం
గా మును నిర్మలము నధికగంభీరము నౌ
నామడుఁగు గలఁగె ననఁగాఁ
గాముకచిత్తములు దానఁ గలఁగుట యరుదే. 182

క. పొలఁతులతనువుల జాఱిన
మలయజమును విరులు నెరయ మడుఁగొప్పె సము
జ్జ్వల మగువెన్నెలఁ జుక్కలు
గలయంగొని నిండియున్న గగనము భంగిన్. 183

వ. అంత జలకేళి చాలించి. 184

ఉ. కన్నులఁ గెంపు దోఁప నలికంబుల మౌక్తికజాలకాకృతిన్
సన్నపుబిందువు ల్మెఱయ జాఱిన కేశభరంబు లొప్పఁగాఁ
జన్నులనంటి పయ్యెదలు చందనపంకముచంద మందఁగా
నన్నరనాథుతో వెడలి రంబురుహాకర మంబుజాననల్. 185

వ. అంతం దదీయతటప్రదేశంబున ముక్తసిక్తవసనుం డగుచు వసుంధరారమణుండు మెత్తనిపొత్తులం దనమేని తడియెత్తిన యనంతరంబ. 186

ఆ. మలయజంబు నలఁది మౌక్తికహారంబు
లమర నుజ్జ్వలాంబరములు గట్టి
యమృతవీచి మిశ్రమై విశ్రమించిన
మందరాద్రిఁ బోలె మనుజవిభుఁడు.187

వ. అట్టిచందంబున నాచందనగంధులును జందనకావులును బట్టెడకాపులును జెంగావులును గదంబకావులును గరకంచులును బొమ్మంచులును ముడుగుబొమ్మంచులును ముయ్యంచులును జిలుకచాళ్ళును వేఁటచాళ్ళును నిండువన్నెలును నుఱుతచాఱలవన్నెలును గంటకివన్నెలును బుప్పొడివన్నెలును రుద్రాక్షవన్నెలును నాగబంధంబులును బూజాబుధంబులును జలపంజరంబులును గామవరంబులును సూరవరంబులును దారామండ లంబులును హంసావళులును హరిణావళులును దురగావళులును గజావళులును సింహావళులును ద్రౌపదీస్వయంవరంబులును లక్ష్మీవిలాసంబులును మదనవిలాసంబులును వసంతవిలాసంబులును రత్నకీలితంబులును రాయశృంగారంబులును గనకదంచేలును గచ్చిలంబులును గర్పూరగంథులును బారువంపుగంధులును శ్రీతోఁపులును శ్రీరామతోఁపులును శ్రీకృష్ణవిలాసంబులును జీబులును సుగిపట్టంబులును సన్నవలిపంబులును వెలిపట్టులును హొంబట్టును బులిగోరుపట్టును నుదయరాగపట్టును నేత్రపట్టును ననుపేళ్ళు గలపుట్టంబులు గట్టుకొని పాదముద్రికలును మంజీరంబులును హంసకంబులును మణిరశనాగుణంబులును ముక్తాఫలావళులును బదకంబులును నంగదంబులును నంగుళీయకంబులును గ్రైవేయకంబులును రత్నతాటంకంబులును భ్రమరకంబులును లాలాటికంబులును మౌక్తికజాలకంబులును శేఖరంబులును నాదిగాఁగల యలంకరణంబులు ధరియించి యగరు చందన హరిచందన ఘనసారోదయ భాస్కరమృగమద ప్రముఖనిఖిల వాసనల నాశావకాశంబులు వాసించుచు నృపరత్నంబుం జేరునంత. 188

క. అంగీకృతశృంగారకు
రంగీనయనాంతరంగరంజకరంగ
ద్భృంగీరవహృదయంగమ
భంగీసంగీతుఁ డగుచుఁ బవనుఁడు వీచెన్. 189

వ. అట్టి యుల్లాససమయంబున. 190

క. రూపముగల యానందము
రూపించిన మన్మథుండు రుచిరాకృతితో
దీపించెడి శృంగారము
భూపతి యని కొలిచి రెలమిఁ బొలఁతుక లెల్లన్. 191

క. ఆవేళ భూమివల్లభుఁ
డావెలఁదులు గొలువ నొప్పె యక్షవధూబృం

దావృతుఁ డగు ధనదునిగతి
దేవస్త్రీసహితుఁ డైన దేవేంద్రుక్రియన్. 192

వ. ఇట్లనల్పకాలంబు విశ్రమించుచున్న యెడల ననతిదూర మాకందవనంబున నుండి యొక్కభూసురుండు చనుదెంచి తన్మహోత్సవం బవలోకించుచు భూలోకస్వర్గలోకం బిది గదా యితఁడు గదా మహాభాగ్యవంతుం డని కొనియాడుచు మున్ను దా నధికదారిద్ర్యపీడితుం డగుటం జేసి తన్ను నిందించుకొనుచుఁ దనలోన. 193

క. ధాత్రి దరిద్రుఁడు సభల న
పాత్రుఁడు కడుమ్రుచ్చు మిత్రబాంధవులయెడం
బుత్రకళత్రంబులయెడ
శత్రుం డఁట వాని బ్రదుకు చౌకౌఁ గాదే. 194

క. ఇలలో నెవ్వని కర్థము
గల దాతఁడు మాన్యుఁ డుచితకార్యజ్ఞుఁడు ని
ర్మలుఁడు బలవంతుఁ డార్యుఁడు
కులతిలకుఁడు సభ్యుఁ డధికగుణగణ్యుండున్. 195

మ. అని చింతించి మహీసురుం డొకయుపాయం బాత్మనూహించి ము
న్నొనరం జేసిన చండికాచరణపాదోపాస్తి చాలించి యా
జనపాలాగ్రణిపాలికిం జని మహాసంపత్తి యర్థించి కై
కొన నిం దొప్పు నటంచు వచ్చె మదిఁ గోర్కుల్ తీఁగలై సొఁగఁగన్. 196

వ. అతనిం జూచి యి ట్లని దీవించె. 197

క. “భూయాత్తే సంప ద్దీ
ర్ఘాయు ర్భవతే" యటంచు నాశీర్వాదో
పాయనములతో నృపుఁ గని
డాయం జని నేర్పు చొప్పడరఁగాఁ బలికెన్. 198

ఉ. అంబుజబంధుతేజ మధురామ్రవణంబున నుండి సర్వలో
కాంబిక యైనచండికఁ బ్రియంబునఁ గొల్వఁగ నాకు నూఱువ
ర్షంబులు వోయె నంతటఁ బ్రసన్నత దేవత నిన్న నర్ధరా
త్రంబున దంతపంక్తి విశదద్యుతిచంద్రిక పర్వ నిట్లనెన్. 199

క. నీచేసినతపమునకు య
థోచితముగ విక్రమార్కుఁ డొసఁగెడు నతనిన్
వే చని వేఁడుము నావుడు
నీ చక్కటి నిన్నుఁ గొల్వ నేఁ బనివింటిన్. 200

వ. అని విన్నవించిన నవ్వసుంధరాపురందరుండు చండికయే యిట్లానతిచ్చెనో కాక యీవిప్రుండే నెపంబున న్నుబ్బించి ధనంబు వడయం జూచెనో యెట్లైన నన్నంతటివానింగాఁ దలంచి వచ్చుటంజేసి యీతని యాశాపరిపూర్తి చేసెద నని నిశ్చయించి. 201

ఆ. దేవిమాట కల్ల గావింపఁగా రాదు
నిన్ను రిత్త పంప నీతి గాదు
నీతపోమహత్త్వనియతికిఁ దగునంత
యనఘ యిష్ట మెద్ది యడుగు మనిన. 202

క. మాకందవనములో ని
చ్చాకీర్తులు వెలయునట్లు చండికపేరన్
నాకొకనగరము వలయును
జేకొని నిర్మింపు రాజశేఖర యనినన్. 203

సీ. సంతోషమున మహీకాంతుఁ డచ్చటి కేగి
సర్వసామగ్రియుఁ జాలఁ గూర్చి
మహనీయగృహములు మండపంబులు సోమ
సూర్యవీథులుఁ గోటచుట్టుపరిఖ

లనువొందఁ జండికాయతనంబు నాపురిఁ .
గట్టించి కాఁపులఁ బట్టు కొలిపి
నియుతసంఖ్యములుగ హయముల బంట్లను
నాఱునూఱేన్గుల నతని కిచ్చి
ఆ. రాజుఁ జేసి పిడప రాజుకట్నంబున
కనుచు మూడుకోటు లర్థ మొసఁగి
పటహపటునినాదభంగి దిక్కులఁ గీర్తి
పిచ్చలింప మగిడి వచ్చెఁ బురికి. 204

క. కావున నాతని సరిగా
నీ వీగతీ భూమి కీర్తి నెఱపిన నెక్కం
గావచ్చు నిట్టి వితరణ
మేవెరవున దొరకదేని నింటికిఁ జనుమా. 205

వ. అని పల్కుటయు. 206

క. ఉల్లంబున భోజమహీ
వల్లభుఁ డాశ్చర్య మంది వదనాబ్జమున
న్వెల్లఁదనము వాటిల్లఁగ
నల్లనఁ దాఁ దిరిగి చనియె నంతఃపురికిన్. 207

శా. చక్రీభూతకఠోరశార్ఙ్గనితతజ్యావల్లరీముక్తబా
ణక్రూరోగ్రసమానసంస్ఫురణకీర్ణజాలపుంభీభవ
చ్ఛక్రాస్రద్యుతిమాత్రనిర్థశితరక్షఃపక్షపాతద్విష
చ్చక్రాటోపతమఃప్రసారుని మహాచక్రీశపర్యంకునిన్. 208

శా. ఆలోలాలకజాలభృంగయుతవక్తాంభోరుహోజ్జృంభిత
ప్రాలేయాద్రితనూభవాకృతిమతిప్రాప్తాంధకచ్ఛేదనో

త్తాలాభీలకరాళశూలధరణత్రాతామరవ్రాతపూ
జాలక్ష్మీయుతపాదపద్మయుగళుం జంద్రార్ధచూడామణిన్. 209

మాలిని. ఉరగనికరవేషీ యోగనిద్రాభిలాషీ
గిరిధరవరదాయీ క్షీరవారాశిశాయీ
పురవిదళనదక్షా పుండరీకాయతాక్షా
స్మరహరహరిరూపా సత్యనిత్యస్వరూపా. 210

గద్యము. ఇది రాయగజగంధవారణ వైరిమండలికభేకఫణీంద్ర వీరఘోట్టవిభాళాది బిరుదప్రకటచారిత్ర కళింగదేశనిర్దూమధామ త్యాగనాగార్జున కర్ణాటద్రవిళాంధ్రమహారాష్ట్రభూపాలరూపనూపురసుందరచరణారవింద సనదప్రోలిపురవరాధీశ్వర వెలనాఁటి పృథ్వీశ్వరరాజ్యసముద్ధరణ శ్రీకొఱవి వెన్నయామాత్యపుత్ర హరితసగోత్రపవిత్ర సకలసుకవిమిత్ర కసవరాజతనూజగోపరాజ విరచితంబైన సింహాసనద్వాత్రింశిక యను కావ్యంబు నందు విక్రమార్కు కృతజ్ఞత్వదాతృత్వప్రశంసనం బన్నది తృతీయాశ్వాసము.

  1. జాతామలాంబు
  2. విచటికి విను
  3. మనోహరాంగుఁడు
  4. యెఱుంగుచో
  5. పల్కఁబాఱె
  6. మెత్తనినడమెలఁగు
  7. గమ్మఁదనంబంతకంటె
  8. నగము చేసి మీఁద నొగులు దెలియు
  9. చీడచెవి-జీపుచెవి, చీద చెవి
  10. ముద్దాలు
  11. తొలుతచూలున మది దలఁకు నెడమ ప్రక్క...చంటిజేలు గోరనంటి...సుదతి వుట్టుననిన సుదతి పొంగు (చంటిజిలుగు)
  12. గెంట్లమమర
  13. విరియ
  14. కలిగడిగి
  15. పొదుగుపొత్తులు
  16. ముప్పటములైన, చిన్నయసూరి
  17. పచ్చనికూటఁబడిసి
  18. నిడియందముగ జుట్టువడసి వేసి-చిన్నయసూరి
  19. వెలదుకుల్ వినఁగ నవ్వించ ననంగ
    నొయ్యనవ్వుచు మూతులల్ల విరుచు
  20. నూదరలిచ్చు
  21. జోలలు వాడిన నాలించు
  22. కాలియంగుళము డగ్గఱబట్టి నోటిలో
  23. జన్నుగడియ మొరయ దన్ను చూచు
  24. మొరయ గున్నాలుం దూలగ—వచ్చునింతలో నెత్తుకొనన్
  25. దేవదత్తుఁడు ధరాధిపరత్నమ యేను నీకుఁ జే
  26. నమ్మంగఁ బట్టుకొని
  27. దండింపఁగ
  28. నైనజనులు వీఁ డర్హుఁడు వధకని
    విన్నవింపఁగఁ బృథివీశ్వరుండు
  29. పెం పెఱింగి
  30. టిది యుపకారంబ
  31. కాననమున నితఁడెడఁగల బో,
    యిన నీకాననములోన నేమగుదునొకో
  32. నిలిపిన వాని కిది యెంతపని
  33. గాలిం బుచ్చెన్
  34. ఆశ్చర్యంబు కార్యంబుగన్
  35. మిగులు
  36. విలువమీఱి
  37. జనపతియా
    తనికాధనమిచ్చి భటులఁ దప్పకపంచెం
  38. నేడుదివసములమఱునాఁ
    డేనిచ్చటికి
  39. దీపవర
  40. మఱి తెమ్మిఁక నైదునుగాక నాకు నై దిచ్చితి--ఐదును
    నాకు నిప్పు డీ విచ్చితి
  41. చక్రవాకము
  42. నొప్పు భూగోళహితజీవ
  43. నెసనిదేమిటియని
  44. సలుపుచు
  45. ఉత్కల్లోలాఢ్య
  46. నారుల, వ్యవహారుల, చోరుల, వైరుల యని చిన్నయసూరిగారి పాఠము
  47. బాచికలును దుర్జనుండును గన్యకయు- దుర్జనుఁడు జలంబులును
  48. యెక్కుడై చెలంగు నొక్కరాజ్యంబున
    రాజునాజ్ఞ చాలఁ బూజ్య మగుట
  49. బలముల్ - చిన్నయసూరి
  50. దిరుగ
  51. రాచసెలవు
  52. విక్రమార్కునికిఁ గల్గు గుణంబులు చాల వింటికిం
  53. ఖిన్నముఖాబ్జతేజుఁడై
  54. భోజుఁడు పోయెను దొంటి చొప్పునన్
  55. గుబ్బునచూర-చిన్నయసూరి
  56. రత్నవతి యగునదిలో
  57. దూఁగి
  58. వైభవోత్సకము
  59. జాలాప్తలీలావనీ
  60. జవు లొసఁగుచుండుతరువులు గలవే-నిట్టితరువులు గలవే
  61. రసికుఁడు “హణ్నుళ నున్నరె, నొసవి" యనుచుఁ గన్నఁడీఁడు నుడువఁడె