సాక్షి మొదటి సంపుటం/సాక్షిసంఘ నిర్మాణము

1. సాక్షి సంఘనిర్మాణము

ఎందుకీ సాక్షి సంఘం?

ప్రత్యేక రాజకీయ దండనం మాత్రమే నేరాన్ని అణగదొక్క జాలదు. దానికి తోడుగా "సంఘశిక్ష " కూడా ఉండాలి. అంటే నేరగాడితో ఎవరూ జోక్యం పెట్టుకోక పోవడం. అటువంటి వాణ్ణి సభలోకి రానీయకపోవడం. గౌరవించకుండా ఉండడం. పదిసంవత్సరాల కఠిన శిక్ష కంటె పదిమంది సంఘంవల్ల నేరగాడికి చేసిన అనాదరణ నేరాన్ని ఆపడంలో బలవత్తరం. రాజకీయ దండనానికి అందని నేరాలను గురించి వెల్లడించడం సాక్షిసంఘం ఉద్దేశం. వాటి స్వభావాల్ని వివరించడం, వాటివల్ల సంఘానికి కలిగే చెడును స్పష్టంచెయ్యడం, వాటిమీద ప్రజలకి అసహ్యం కలిగించడం, ఈ సంఘం ఉద్దేశం. నేరాలనే నిందించడం ఉద్దేశంగాని, అటువంటి నేరాలకులోనైన వారిని నిందించదీ సాక్షి సంఘం.

ఈ సాక్షిలో మత విషయాలగురించీ, ఆరోగ్య విషయాలగురించీ, కవిత్వంపట్ల అభిరుచికి సంబంధించిన శాస్త్రాలగురించీ, సంఘ దురాచారాల గురించీ, విద్యాభివృద్ధి సాధనాలగురించీ, చరిత్ర మొదలైన విషయాల గురించీ రాజభక్తివంటి వాటిగురించీ అవసరమనిపించిన మరికొన్ని విషయాల గురించీ వ్రాస్తూంటారు.

ఈ సాక్షి సంఘ సభ్యులు అయిదుగురు. వీరు-

సాక్షి, జంఘాలశాస్త్రి, వాణీదాసు, కాలాచార్యులు, బొర్రయ్యశెట్టి.

వీరు. ప్రతిరాత్రి ఒక అద్దె ఇంట్లోచేరి ప్రసంగిస్తూంటారు. వీరందరి ఊరు సత్యపురం. సాక్షి సంఘం ఆఫీసు పోస్టాఫీసుకి ఎదుట -

ప్రాపంచిక చర్యలు చిత్ర విచి త్రాతివిచిత్ర మహావిచిత్రములై యున్నవని మీరెఱిఁగినయంశమే. ఇది మీరు క్రొత్తగఁ జూచినది కాదు. మేము క్రొత్తగఁ గనిపెట్టినది కాదు. కాని దిగువఁజెప్పబోవు కారణముచే మేమనవలసి వచ్చినది. మాయుద్యమసాఫల్యమునకై మీరు వినవలసి, వచ్చినది. సృష్టిలో మనుష్యులెందఱో మనుష్యప్రకృతులన్నియై యున్నవి. ఏ రెండును సమములు గావు. సర్వశక్తిమంతుఁడును జ్ఞాన స్వరూపుఁడు నగు భగవంతుఁడు తన బుద్ధిబలముచే నిన్ని వేఱువేఱు స్వభావములు సృష్టింపఁగ మనుజుఁడు తన కియఁబడిన, యొక్క టైన ప్రకృతిని - మాఱఁగూడని యొక్క టైన ప్రకృతిని- సమయనుగుణముగ, సందర్భానుసారముగ, సన్నిహిత వ్యాపార సముచితముగ, స్వప్రయోజనప్రద మగునట్లుగఁ బదునాలుగు ప్రకృతుల క్రింద మార్చి, లేక మాఱున ట్లితరుల కగపఱచి తన్ను సృజించుటయందు భగవంతుడు వెల్లడిచేసిన నైపుణ్యమును-దన్ను దన్నుఁగానివానిఁగా నితరులకుఁ గనఁబఱచుటయందు వెల్లడి చేయుచున్న తన మాయా సృష్టి నైపుణ్యము-నెదుట సిగ్గుపడునట్లు వెలవెలఁబోవునట్లు - తలవంచు కొనునట్లు మొగము మాడ్చుకొనునట్లు సేయుచున్నాఁడు. తాను చేసిన యీ బొమ్మలు మాయా జగన్నాటక సూత్రధారుఁ డయిన తనకంటె మహామాయావిశేషాన్వితములై చిత్రచిత్రము నేత్రాభినయములచే హస్తాభినయములచే నవనవ పాదాభినయముల నాట్యములచే నొంటి కాలిభరతములచే వింతవింతలుగ తెయితక్కలాడుచున్న వని లోన సంతోషించుచు యున్నాఁడో లేక వేయఁగూడని వేషములు వేసినందులకుఁ, బూసికొనఁగూడనిపూఁతలు పూసికొనినందులకు, ధరియింపఁగూడని దుస్తులు ధరించినందులకు, వేయఁగూడని గంతులు వేసినందులకుఁ బాడఁగూడనిపాటలు పాడినందులకు, నాటకాంతమునఁ బాత్రములను శిక్షింపఁదలఁచియేయున్నాఁడో, యెట్టివాఁడో, యెక్కడ నున్నాఁడో, యేమి చేయుచున్నాఁడో, యేకాకి యగువానికీ విఱుగుతఱుగులేని జంజాట మెందులకో యెవ్వడెఱుఁగని యీశ్వరునిఁగూర్చి యెట్లు చెప్పఁగలము? నవ్వు సంతోషమునకు, నేడ్పు దుఃఖమునకు సూచకములని వెఱ్ఱి భగవంతుఁడు స్థూలవిభాగ మేర్పఱచియుండ . బుద్ధి నిధులైన మన వారెట్టియెట్టి సూక్ష్మసూక్ష్మతర సూక్ష్మతమ విభేదములఁ గల్పించి వెల్లుల్లిపారను వేయివిధములుగా నెట్లు చీల్చినారో చూడుఁడు!

“ఉహుఉ" అని పండ్లు గనఁబడని పెదవులు విడని మూతిగదలని మొగమున వికాసము లేని నవ్వు-పై పెదవి మాత్రము కొంచెముగదలి పై రెండుపండ్లు మాత్రమే కనఁబఱచి ధ్వని యెంతమాత్రమును లేకుండ నవ్విన నవ్వు - అడుగు పెదవి పై పెదవి కొంచెము గదల్చి పై రెండుపం డ్లడుగు రెండుపండ్లును గనఁబఱచి “హు హు హు" అని యిగిలింపు గలుగునట్లు నవ్విననవ్వు-పై పం డ్లడుగుపండ్లతో గట్టిగఁ జచ్చువానికివలె దాకొల్పి పెదవులు మాత్రమే కదల్చి కిలకిలగ నవ్విననవ్వు-నోరు బాగుగఁ దెఱచి “హాహాహా యని నవ్విన వెఱ్ఱి నవ్వు-మొగ మేడ్చునట్లు చేసి హే హే హే లతోఁగూడి నవ్విన నవ్వు-ఇట్లనేక విధములుగ వీని బాహ్యచిహ్నము లుండును. వీనికి మొలకనవ్వు- మొద్దునవ్వు కిచకిచ నవ్వు-కిలకిల నవ్వు - ఇగిలింపు నవ్వు-సకిలింపునవ్వు-అని వివిధ నామములు గలవు. వీనిలో నేనవ్వు కూడఁ బ్రీతి సూచకమైనది కాదు. ఒక నవ్వున కర్థము రోఁత. ఒక నవ్వు తిరస్కార సూచకము. కుండలోపలి యభిప్రాయము పై కగపడకుండ మూసిసమూకుఁ డొకనవ్వు-ప్రత్యుత్తరము చెప్పనిష్టములేక వేసినకప్పదాటొకనవ్వు - కోప మడఁచుకొనుటకై తెచ్చుకొన్న నన్వొకటి. “ ఓరీ! చచ్చుముండకొడుకా! " యను నిరక్షర మైన తిట్టొకనవ్వు. ఇట్లే కోపమునకు రూప భేదములు, నామ భేదములు, నర్థ భేదములు, నభిప్రాయ భేదములు గలవు. ఇప్పటి నవనాగరకుఁడు తన శత్రువును జూచిన తోడనే. ఏమి యుత్సాహము! ఏమి శిరఃకంపములు! ఏమి కరసంచాలనములు! ఏమి తియ్యమాటలు! ఏమి కౌఁగిలింతలు! ఏమి పరకష్టాసహిష్ణుతాసూచక విలాపములు! ఓహో! లోపలి యగ్నికిఁ బై కెంతచల్లదనము! లోని విషముష్టికిఁ బై కెంతమాధుర్యము! లోని పిశాచమునకుఁ బై నెన్ని తులసిపూసలపేరులు! ఆహా! మనుష్యచర్య లెంత విరుద్ధముగ మాఱియున్నవి! ముద్దులో ముక్కూడఁబీఁకుట. కౌఁగిలింతలో గొంతుకోఁత, సాలగ్రామతీర్థములో సౌవీరపాషాణముగ నున్నవికదా? ప్రకృతి యెంత తలక్రిందయినట్లున్నది! అమృతమేదో, హాలాహలమేదో, పూలబంతి యేదో, తుపాకిగుండేదో, నమస్కార మేదో, నెత్తిపెట్టేదో, మంచి యేదో, చెడ్డ యేదో, మిత్రుఁ డెవఁడో, శత్రుఁ డెవఁడో, స్వర్గ మేదో, నరక మేదో, పరమేశ్వరుఁ డెవఁడో, బ్రహ్మరాక్షసుఁ డెవ్వడో - భేదమంతయు నశించినది కదా!

తమకు బహుస్వల్పలాభమే కాని యితరుల కెంతమాత్రమును నష్టము లేని సామాన్యజీవయాత్రా వ్యాపారములలో మాత్రమే మనుష్యులిట్లు సత్యానుభవాచ్చాదనము, మిథ్యానుభవ సంధానము స్వప్రకృతి సంఛాదనము, పరప్రకృతి స్వీకారము సేయుచున్నా రేమో యనఁగ నట్లు కాదు.

మాన న్యాయ్య ధన ప్రాణాదివిషయములగు వ్యాపారములఁ గూడ నిట్టిమహేంద్రజాలవిద్యనే కనఁబఱచుచున్నారు! మనసును దిగంబరముగఁ జేయువాఁడు మందుఁడు. సత్య మసత్య మను నూఁతకోల లేక నడువ లేదని మనవారు నమ్మియున్నారు. పతిప్రక్కలో మాయ! భ్రాతలపాలిలో మాయ! న్యాయాధికారి కలములో మాయ! న్యాయవాది నాలుకకొనను మాయ! వణిజుని త్రాసులో మాయ! వసుధాకర్షకుని నాగేటిలో మాయ! ఎక్కడఁ జూచిన మాయ!! ప్రపంచమున నెవ్వరు సత్యవంతులు? యోగ్యులు లేరా? ఉన్నారు. కొలఁదిగ పరకపాటుగ, ఆఫ్రికాయెడారిలో ఫలవంతములగు ప్రదేశములవలె నున్నారు. ప్రతి వ్యాపారములోను మహానుభావు లుత్తమోత్తము లున్నారు. ఇట్టివా రుండుటచేతనే యింక ప్రపంచ ముల్లోలకల్లోల మొందకయున్నది. ఒక్క రావణాసురుని వధించుటకుఁ బరమాత్మ యంత వాఁడు, రామునియంతవాని యవతార మొంది పడరాని కష్టములఁ బడి తుదకుఁ గృతార్థుఁ డయ్యెను! అందఱు రావణాసురు లయినయెడల నతని యవతారపుటాట సాగునా? ఇంక - నట్టిదురవస్థ రాలేదు. పరమార్థ వంతులు కొంద ఱున్నారు. వారే లేకుండునెడల ద్వాదశార్కు లుదయింప వలసినదే! పుష్కలావర్త మేఘములు తెగిపడి వర్షింపవలసినదే! బ్రహ్మ పునస్సృష్టికై తిరుగ నడుసుఁ ద్రొక్కవలసినదే!-

ఇఁక మనుష్యు లొనర్చు నేరములు మొదలగువానిఁగూర్చి కొంత విచారింతము. పెట్టిన న్యాయస్థానములను బెట్టుచునేయున్నారు. వేసిన న్యాయాధిపతులను వేయుచునే యున్నారు. చేర్చుకొనిన న్యాయవాదులను జేర్చుకొనుచునే యున్నారు. పెరుగుచున్న వ్యాజ్యెములు పెరుగుచునే యున్నవి. పెంచుచున్న శిక్షాశాసన శాస్త్రములను బెంచుచునే యున్నారు. పెంచుచున్న రక్షకభట సంఖ్యను బెంచుచునే యున్నారు. పెరుగుచున్న నేరములు పెరుగుచునేయున్నవి. కట్టించుచున్న కారాగృహములు గట్టించుచునేయున్నారు. ఎదుగుచున్న కారాబద్ధుల సంఖ్య యెదుగుచునే యున్నది. నరహత్య చేసిన వారిని జంపుటకు నానా విధ యంత్రములు కల్పించుచునేయున్నారు. హత్యలు వృద్ధియగుచునే యున్నవి. నేరము శిక్షనొందినకొలఁది వృద్ధినొందుచున్నట్లున్నది. నేరమొనర్చుటవలన బీదల కన్నము దొరకుచున్నది.

అయినను బ్రత్యేక రాజకీయదండనము మాత్రమే నేరము నణగఁద్రొక్కఁజాలదు. దానికిఁ దోడు సంఘశిక్ష యుండవలయును. సంఘశిక్ష యనఁగ నేరగానితో నెవ్వరు జోక్యము కలుగజేసికొనకుండుట. అతనిని సంఘము నుండి యొకవిధముగ బహిష్కరించి యాతనిని సంఘాగ్రహపాత్రునిఁ జేయుట. పది సంవత్సరముల కఠిన శిక్ష కంటెఁ బదిమంది సంఘమువలన నేరగానిఁగూర్చి చేయఁబడిన యనాదరణము నేరము నాపుటలో బలవత్తరమైనది.

రాజకీయదండనము గల యీ నేరములకే సంఘ దూషణము నేరము నడఁగించుటకుఁ గావలసివచ్చినప్పుడు రాజకీయదండనములేని మొదటఁజెప్పిననేరములకు - మనుజుల మాయాప్రచారములకు - సంఘదూషణ (Social Odium) మావశ్యకమైయుండదా? ముఖ్యముగ నుండును. ఉండక తప్పదు. ఇట్టి నేరములఁగూర్చియే మే మిఁక వ్రాయుచుందుము. నేరముల వెల్లడింతుము. వాని స్వభావముల విశదపఱతుము. వానివలన సంఘమునకుఁ గల్గు హానిని స్పష్టపఱతుము. వానియందు జనుల కసహ్యము గల్గునట్లు సేయుటకై ప్రయత్నింతుము. నేరములనే మేము నిందింతుము. కాని యట్టి నేరములకు లోనయిన వారిని నిందింపము. వారినిఁ దలపెట్టనైనఁ దలపెట్టము. మాకు వారితో లేశమును బనిలేదు. ఇంతియేగాక మత విషయములను గూర్చియు, నారోగ్య విషయములను గూర్చియుఁ, గవితాద్యభిరుచిప్రధానశాస్త్రములఁ గూర్చియు, సంఘదురాచారములఁ గూర్చియు, విద్యాభివృద్ధి సాధనముల గూర్చియు, జరిత్రాద్యంశముల గూర్చియు, రాజభక్త్యాదులఁ గూర్చియు, నావశ్యకములని మాకుఁ దోఁచిన యింకఁ గొన్ని యితరాంశములను గూర్చియు వ్రాయుచుందుము.

నేను, మఱినలుగురుఁ గలసి యొక చిన్న సంఘముగఁ జేరినాము. మీ రైదుగురుఁ జేరి, యిట్టి మహా కార్యము సేయఁగలరా? యని మీరడుగుదురేమో? ఉడుత లుదధిని బూడ్చినట్లు చేసెదము. తరువాత మాతో నెన్నికోఁతులు చేరునో, యెన్ని కొండమ్రుచ్చులు, నెలుగుబంట్లు కూడునో! ప్రయత్నమే మనుజునియధీనము. ఫలము దైవాధీనము కాదా?

మేము ప్రతిరాత్రియు నొకచోఁ జేరుదుము. ఇప్పటి వఱకు మాకు సొంత భవనము లేకుండుటచే నద్దెయింటిలోఁ జేరుదుము. మే మీదిగువ నుదాహరించిన నిబంధనలను జేసికొంటిమి.

1. సభ చేరఁగానే మన చక్రవర్తి గారికిఁ జక్రవర్తి గారికి వారి కుటుంబమునకు దీర్ఘాయురారోగ్యైశ్వర్యముల నిమ్మనియుఁ, బ్రజలకు వారియెడల నిరంతర రాజభక్తిని బ్రసాదింపవలయుననియు, మా సంఘము చిరకాలము జనోపయోగప్రదముగ నుండునట్లు కటాక్షింపు మనియు దైవమును బ్రార్థింపవలయును.

2. రాజకీయ విషయములను గూర్చి యెన్నఁడును ముచ్చటింపఁగూడదు వ్రాయఁగూడదు.

3. తప్పులనేగాని మనుష్యుల నిందింపఁదగదు. తప్పులను విశదీకరించుటయందు బాత్రము లావశ్యకము లగునెడల నట్టివి కల్పితములై యుండవలయును.

4. సభ జరుగుచున్నంత సేపు మత్తుద్రవ్యములను ముక్కునుండి గాని నోటి నుండి గాని లోనికిఁ జప్పుడగునటుల పోనీయఁగూడదు. 5. వాదములలోఁ దిట్టుకొనఁగూడదు. చేయిచేయి కలుపుకొనఁగూడదు. కలుపుకొనుట యనివార్యమైనప్పుడు న్యాయసభల కెక్కఁగూడదు.

మాసంఘములోని సభ్యులెవరో వారి స్వభావము లెట్టివో మీకుఁ దెలిసికొనఁ గుతూహల ముండునెడల నీ దిగువ -జదువుకొనుఁడు.

మాలో మొదటివాఁడు కాలాచార్యులు. ఇతఁడు శ్రీవైష్ణవుఁడు. సపాదుఁడయ్యు నిష్పాదుఁడు. ఈతనితల పెద్దది. గుండ్రని కన్నులుండుటచే, ముక్కు కొంచెము వెనుకాడుటచే, మొగము గుండ్రముగ నుండుటచే నీతఁడు నరులలో 'Bull Dog' జాతీలోనివాఁడు. ఈతఁడు మాటలాడిన మొఱిగినట్లుండును. ఈతఁడు పొట్టివాఁడు. లంబోదరుఁడు. తారుకంటె నల్లనివాఁడు. ప్రాణమందలి తీపిచే నేకాంతయు నీతని వలచుటకు సాహసింపకపోవుటచేతఁ గాఁబోలు బ్రహ్మచారిగ నున్నాఁడు. సత్ప్రవర్తనము కలవాఁడు. ఈతఁడు వేదవేదాంగములను, ద్రిమత శ్రీభాష్యములను, గీతా భాష్యములను జదివినాఁడు. మతసంప్రదాయములన్నియు బాగుగ నెఱుఁగును. కుండలముల ధరింపవలయు నను కుతూహలము గలవాఁడు. అఖండ ధారణాశక్తి కలవాఁడు. వాక్చాకచక్యము లేనివాఁడు. ధారాళమయిన యంతఃకరణము కలవాఁడు. పొడుము, పొత్తిలోఁ జేర్చి రొండిలోఁ బెట్టిన యెడల నలవాటగునేమో యనుభయము గలవాఁడు. తనకుఁ దెలిసిన యేయంశమును గూర్చియైనఁ బట్టుదలగ వాదించువాఁడు. యథార్థవాది. కోపరహితుఁడు. ఈతఁడు ప్రవేశపురుసు మీయలేని హేతువున వెట్టిసభ్యుఁడుగఁ జేరినవాఁడు.

రెండవవాఁడు జంఘాలశాస్త్రి. ఈతఁ. డారడుగుల యెత్తుగలవాఁడు. విశాలమైన నుదురు, దీర్ఘనేత్రములు, లొడితెఁడు ముక్కును గలవాఁడు. కాలినడకనే యాసేతుహిమాచలపర్యంత దేశ మంతయుఁ దిరిగినవాఁడు. అనేక సంస్థానములఁ జూచినవాఁడు. జమీందారుల యాచించి వా రీయకుండునెడలఁ జెడమడ దిట్టినవాఁడు. ఏ సంస్థాన పూర్వ చరిత్రయేమో, యేప్రభువున కేయే లోపములున్నవో యెఱిఁగినవాడు. దేవస్థానములన్నిటిని సేవించి వానివాని పూర్వోత్తరములన్నియుఁ దెలిసిన వాఁడు. వినువాఁడుండు నెడల గథలఁజెప్పుటలో విసుగువిరామములేని వాఁడు. వాచాలుఁడు. వాదములలోఁ గఱ్ఱజారిపోయినఁ గలియఁబడఁగలిగినవాఁడు. గార్దభగాత్రము కలవాఁడేకాని గానకళానుభవ మెక్కువ గలవాఁడు, అనేక జాతీయములఁ జెప్పఁగలవాఁడు. అర్థ మెవ్వడైనఁ జెప్పినయెడల నెట్టిపద్యములోఁగాని, యెట్టిశ్లోకములోఁగాని యౌచిత్యవిషయమునఁ దప్పుఁబట్టగలవాఁడు. చీపురుకట్టయే యాయుధముగఁ గలవాఁడై హ్రీం హ్రాం కార సహితుఁడై యనేక కాంతల గడగడ లాడించినవాఁడు. అన్ని యంశముల నింతయో యంతయో తెలిసినవాఁడు. ఈతనితలలో, విప్రవినోదిగాని సంచిలోవలె నొకసాలగ్రామము, నొక యుల్లిపాయ, యొకచిలుకబుఱ్ఱ, యొకతేలు, నొకరాధాకృష్ణుని విగ్రహము, నొక బొమ్మజెముఁడుమట్ట, యొకపుస్తకము, నొక పొగాకు చుట్ట మొదలగునవి చేర్చినవాఁడు. ఈతఁడు ప్రవేశపురుసు మిచ్చినాఁడు.

మూఁడవవాఁడు వాణీదాసుఁడు. ఇతఁడు కవి. ఎడమచేయి వాటము గలవాఁడు. అడ్డతలవాఁడు. సంతపశువువలె నెఱ్ఱబట్టఁ జూచి బెదరువాఁడు. అంటురోగము కలవానివలె నెవ్వరిదరిఁ జేరఁడు. గ్రుడ్ల గూబవలెఁ జీఁకటి నపేక్షించును. ఎక్కడఁగూర్చుండిన నక్కడనే పొమ్మను వఱకుఁ బరధ్యానముగఁ గూర్చుండియుండును; మిగుల సోమరి. పొట్టివాఁడు. ఆపాదశిరఃపర్యంత మసూయఁ గలవాడు. ఆదికవియైన నన్నయభట్టు మొదలు కొని యాధునిక కవియగు నన్నాసాహేబువఱకందఱను దూషించును. శ్లేషకవిత్వమందె రస మెక్కువ కలదని నమ్మకము కలవాఁడు. అన్ని విధముల కవిత్వములు చెప్పఁగలవాడు. ఇతఁడు నువ్వుగింజమీఁద నూఱుపద్యములు చెప్పినాఁడు. మూఁడు సంవత్సరములనుండి కంకణబంధ మొకటి వ్రాయుచున్నాఁడు. పెదవులు నల్లగ నుండుటచే నీతఁడు చుట్టగాలుచు నలవాటు కలవాఁడై యుండును. ఈతఁడు శూద్రుఁడు. ఈతఁ డాధునిక పద్ధతి ననుసరించి కవిత్వముఁ జెప్పుటకు బ్రయత్నించుచున్నాఁడు.

నాల్గవవాఁడు కోమటి. ఈతఁడు వాణిజ్యరహస్యము లెఱిఁగిన వాఁడు. కొంతకాలము క్రిందట వర్తకము బాహుళ్యముగఁ జేసిన వాఁడు. విశేషధన మార్జించినవాఁడు. ఇతఁడు మహైశ్వర్య దినములలో నున్నప్పుడు బయలుదేఱిన తామరతప్ప నిప్పు డీతనికి వెనుకట ధన మేమియు మిగులలేదు. డోకడా లవలీలగఁ గట్టఁగలవాఁడు. ఈతఁ డెక్కడకు బోయినను మూఁడు చేతులతోఁ బోవును. (తనకై రెండు చేతులు, తామరకైయిత్తడిచేయి) ఈతఁ డటికయంత తల గలవాఁడు. ఈతని పేరు బొఱ్ఱయ్య; ఈతఁడు మాయింటిగుమ్మమునఁ బట్టఁడు. తెలిసినయంశములు వ్రాఁతరూపకముగ మాకుఁ దెలియపఱచుచుండును. ఈతఁడు ప్రవేశపురుసుము నిచ్చెను.

నే నయిదవవాఁడను, నేనెవఁడనో నాకుఁ గొంత తెలియునుగాని నేనెవఁడనో మీకు స్పష్టీకరించుటకుఁ దగిన యాత్మజ్ఞానము కలవాఁడను గాను. నాసంగతి మీరు ముందు నావ్రాఁతలఁబట్టియే కనిపెట్టఁగలరు. నే నారామద్రావిడుఁడను. నాపేరు సాక్షి. మేము ప్రచురించు పత్రికకు నా పేరే యుంచితిని. వారమున కొకటి రెండు దళములఁ బంపెదము మీరు మీ పత్రికలో వాని నచ్చువేయింపఁ గోరెదము. ఎల్లకాలము మీకీశ్రమ మిచ్చువారము కాము. మా జంఘాలశాస్త్రి యెక్కడ నుండియో యెటులో యొక ముద్రాయంత్రమును, దాని పరికరములను నొడివేసి లాగుకొని వచ్చెదనని కోఁతలు గోయుచున్నాఁడు. అంతవఱకు మీపత్రికకుఁ బంపుదుము. మీకు మావలని ప్రతిఫల మేమియును లేదు. సరేకదా, మీ పత్రికా వ్యాపారము తిన్నగ నుండకుండునెడల మిమ్ములనుగూడ మాపత్రికలో నధిక్షేపించుచుందుము. పరీధావి సంవత్సర మాఖబహుళ చతుర్దశీ శివరాత్రి గురువారమునాఁడు లింగోద్భవ కాలమున నీసభ పుట్టినది.

మాది సత్యపురము. మా సాక్షి స్థానము తపాలకచేరి కెదురుగ.

ఇట్లు విన్నవించు

సభ్యులందఱిబదులు

సాక్షి.