సాక్షి మొదటి సంపుటం/విమర్శక స్వభావము
3. విమర్శక స్వభావము
కవి వాణీదాసుడు, సాక్షి సంఘం ఉపన్యాసకుడు జంఘాల శాస్త్రీ, జుట్టూ జుట్టూ పట్టుకోవడానికి సిద్ధపడ్డారు. వాగ్యుద్ధం తీవ్రమైంది. అసలు కారణం ఏమంటే - వాణీదాసు కవే కాడనీ, తనకి కవిత్వం అంటే ఏమిటో తెలియదనీ జంఘాలశాస్త్రి ఉడికించినట్టు, వాణీదాసు ఆరోపణ. అతనిది ఆసమ్మ ఓసమ్మ అరిగచొప్పి అలుకు గుడ్డకవిత్వమని జంఘాలశాస్త్రి నిందించక పోలేదు. ఆ మీదట వారిద్దరికీ రవరవలు పెరిగి, కవిత్వ సంబంధమునకు మించిన విమర్శ పేరిట మాటలు పెరిగాయి. చివరికి వ్యవహారం తన్నులాటల వరకు వెళ్లింది. అదికూడా అయ్యాక వాణీదాసూ, జంఘాలశాస్త్రీ, సిగ్గుపడి తలలు వంచుకు కూర్చున్నారు.
ఆమీదట సాక్షి కలగజేసుకుని కవిత్వం అంటే ఏమిటో, అది ఏం చేయవలసి ఉంటుందో, కవిత్వవిమర్శ ఎలా సాగాలో విపులంగా వివరించాడు.
నే నీరాత్రి మా సభాకుటీరమునకుఁ బోవుసరికి మాకవి యగు వాణీదాసుఁడు, జంఘాలశాస్త్రీయుఁ గోడిపుంజులవలెఁ గాళ్లు దువ్వుచు గొఱ్ఱెపొట్టేళ్లవలెఁ దలలువంచి బుసకొట్టుచు నాఁబోతులవలె ఱంకెలు వేయుచు మల్లులవలెఁ దొడలు దండలు చఱచుచుఁ బంజాబీ మైసూరీ పద్ధతుల పదవిన్యాసపు గమనికలతోఁ జేయి చేయి గలుపుకొనుటకు సిద్ధమై యుండిరి. కలహకారణము గోచరింపలేదు. కాని వారిని శాంతిపఱచుటకుఁ బ్రయత్నించితిని. ఎందుల కీ కచాకచి కదనోత్కంఠత యనియడుగ వారెవ్వరును నామాటను వినిపించుకొనలేదు. కాని, కవి నిష్కారణకఠిన ముష్టిప్రహారము నోరులేని నడుమనున్న బల్ల కొక్కటి ప్రసాదించి యిట్లు గద్దఱించెను.
వాణీ-ఏ మంటివి? నాకుఁ గవిత్వమే తెలియదా? అది లోకజ్ఞానమునఁగాని రాదా? దానికి దేశాటన మావశ్యకమా? ఆ! ఆ సేతు హిమాచలపర్యంతము నీ వల్లల్లాడని స్థలమున్నదా? కాలి దురదయే తీరినది కాని కవితాలేశమైన నంటినదా? కాఱులఱచుట కవిత్వ మనుకొంటివా? తిట్టినతిట్టు తిట్టకుండఁ దెంపులేక తిట్టు దిట్టరితనము నిరవశేష శబ్దజాల నిరాఘాటప్రయోగనిపుణత యనుకొంటివా? ఇదిగో! నీ కబ్బినవి గండ్రతనము, పెంకితనము, తెగనీలుగుఁదనము, నుడుకుఁబోతుతనము, వెక్కిరింపుఁదనము, గయ్యాళితనము, గల లగల భేద మెఱిఁగి నీవు కవిత్వము చెప్పఁగలిగినప్పుడు నన్నది క్షేపింపుము. అది నీకుఁ బదునాల్గు భువనములు దిరిగిన రాదు. జంఘా - (వికటముగ నవ్వి) నీ వేడ్చుచున్న తెలివితక్కువ నిర్భాగ్యపు టల్లరిచిల్లరి యవకతవక యాసమ్మ యోసమ్మ యారిగ చొప్ప యలుకుగుడ్డకవిత్వము నేఁ జెప్పలేక మానివేయలేదు. గడియసేపు ఛందోగ్రంథ మేదైనఁ జూచితినేని నీపేలపిండి వట్టిగడ్డి కల్లబొల్లి కాకి కూఁత కవిత్వము నాకవిత్వము చుట్టు ముమ్మారు త్రిప్పిత్రిప్పి దిగదుడుచుటకైనను బనికి రాకుండఁ జేయఁగలను. ఆl ఆ సమర్థత లేక యూరకుండ లేదు. గడియకుఁ గావడిగ్రంథములు చెప్పగలను. నాకవితాధారముందు గంగాధారను బిల్లకాల్వ క్రిందఁ జేయఁగలను. ఆకాశము తూటుపడినట్లు-
వాణీ-ఏది! మగవాఁడ వైనయెడల నొక్కమత్తేభముఁ జెప్పుము. ఒక్కచచ్చుతేటగీతి చెప్పుము. అంతవఱ కెందులకు? మూఁడు ముక్కలు గద్యము చెప్పుము. ముచ్చెమటలు పట్టి చావునకు సిద్ధమయ్యెదవో లేదో! ఆ! కుక్కకూఁత నక్కకూఁత యనుకొంటివేమి? దూరపుఁ గల్లవార్తల సోదు లనుకొంటివేమి? డబ్బిచ్చువారియెదుట డుర్రుమని డమరుకము వాయించుట యనుకొంటివేమి? ఒట్టపెట్టనివారిపై నెనిమిదవ యట్టపుఁ బారాయణ మనుకొంటివేమి? లోకువపందలయొద్ద లొట్టాబట్టీయ" మనుకొంటివేమి? చెప్పుము. చెప్పకపోయినయెడల బ్రాహ్మణుఁడవు కావు.
జంఘా-నేనే కవిత్వము చెప్పునెడల నీదేవీస్తోత్రపుఁ గాగితములు, నీపాడునాటకములు చిల్లర దుకాణములలోఁ బొట్లముల క్రింద, దీపావళిఁ బువ్వత్తుల గొట్టములక్రింద, నాసుపత్రిలోఁ “బలాస్త్రి" పట్టులక్రింద నుపయోగపడునట్లు చేయనా? నేను గవిని గాను. కాఁదలఁచుకొనలేదు. నేను విమర్శకుఁడను. నన్నేమని చూచుచున్నావో? కవుల గ్రంథముల కగ్గిపుల్లను. కవులముంగిటి మొండిచేయిని. కవులపాలిటి తుపాకిపిక్కను. నోరు మెదుపుసరికి నోటిమీఁద నీడ్చికొట్టెదను. కవికి విమర్శకుఁ డెట్టివాడో యెఱుఁగుదువా? హె, హె, హె?'
వాణీ-అప్రతిష్ఠ నాచంద్రతారకముగ సాఁగఁదీయుటలోఁ గవి కందినవాఁ డిఁకఁ బుట్టవలయును. నీవు చత్తువు. నేను జత్తును. కాని “ జంఘాలజలదఝంఝామారుత మని జంఘాలకంఠనాళకృంతన ' మని నేను జెప్పఁబోవు గ్రంథములు బ్రహ్మపునస్సృష్టివఱకు నిల్చియుండవా?
జంఘా- వాణీదాసవదన ధూధూకార!" మనియు "వాణీదాసవల్లకాడీయ" మనియు వానిపై నేను జేయు విమర్శనములు పునస్సృష్టిలోఁ గూడ నిల్చునని నమ్ముము. నీవు నానెత్తిమీఁది కెగిరిన యెడల నీ పితామహ ప్రపితామహుల నెత్తిమీఁదికి నే నెగురఁగలను. జాగ్రత్త.
వాణీ-నీవు మాతండ్రిని, మా తాతను దలపెట్టిన నే నూరకుందునా? మీ మేనత్త - తురకవాని యుపాఖ్యానము లోకవిదిత మయినది కాదా?
జంఘా-నీయక్క బంకోలుకంటెనా?
అని లేచి యిద్దఱుఁ కలియఁబడిరి. కాల్చి కుండలోఁ బడవేసిన సీమటపాకాయ పెట్టెవలె టప టప ఢమఢమాంతర్గత చుర చుర తుసు తుసు విరావారభటీ సంప్రదాయమునఁ దుదకు బల్లక్రిందకుఁ బడిన వీరు చిత్రవిచిత్ర శబ్దప్రతిసృష్టి నైపుణ్యమునఁ బ్రకాశించిరి. నేనును, నన్యభిక్షాదీక్షాపరిపూర్తి చేసికొని యప్పుడే వేంచేసిన కాలాచార్యులుఁ గలసి యాబల్లనెత్తి వారిరువురకుఁ గదనరంగమును విశాల మొనర్చితిమి. కొంతసేపటికి వారే సిగ్గుపడి లేచి తలలు వంచుకొని కూరుచుండిరి. అప్పుడు నేను వారితో నిటు లంటిని.
కవీ! నీ వెఱ్ఱపంచెఁ జూచి బెదరువాఁ డవనియు, నుచితమగు లజ్జగలవాఁడ వనియు, జంఘాలశాస్త్రీ! పద్యముల కర్థము తెలిపిన యెడలఁ గవితావిమర్శనమున నీకుఁ దగుమాత్రపు నైపుణ్యము గల దనియు, మీయిద్దఱుఁగూర్చి నేను సువర్ణలేఖాపత్రికకు వ్రాసినమాట మీరిప్పుడు కల్ల యొనర్చితిరి. నీవు కవివి కావు. అతఁడు విమర్శకుఁడు కాఁడు. కవితావిమర్శ శాస్త్ర విమర్శవాదములో మీ రేడుతరముల వఱకుఁ బైకిఁ బంపిన శాపబాణములఘాతములు దగిలి “యిట్టి తుచ్చు, లిట్టి వంశనాశకులు మనకులమున నేల దాపరించిరో?" యని మీ పితామహ ప్రపితామహాదులు విగతజీవులెట్టు లేడ్వఁదగునో యట్టు లేడ్చుచుందురు. "ఏ పొరపాటుచేతనో, యే పని తొందరచేతనో, యేశ్రమముచేఁ గలిగిన విసుఁగుదలచేతనో, యేముదిమితనపు బద్ధకముచేతనో యిట్టి కవివిమర్శకుల సృష్టించి మానవజాతి కంతకు నపయశస్సును గూర్చినవాఁడ నయితిగదా? " యని బ్రహ్మదేవు నెనిమిది కన్నుల నేకధారగ నేడ్చునట్లు చేయుటకు మీరు చాలియున్నారు. కుక్కలు పులివిస్తరాకుల పాఁతఱయొద్ద రసోపేతవస్తుపరిశీలనవాదమునఁ దమ్ము దాము గఱచుకొని పీఁకుకొనునుగాని చచ్చిన తమ తాత ముత్తాతల తోఁక వెండ్రుకల నెక్కలాఁగఁగలవా? కవీ! నీకుఁ గవిత్వము లేకపోయిన నేమి మునిఁగిపోయెను! సృష్టికిఁ బరమాసహ్యకరమై బహు లజ్జాకరమైన మీ బ్రదుకువలనఁ బ్రయోజన మేమి? వాణీదాసా! ఈ నడుమ “సువర్ణలేఖా" పత్రికలో ముద్రింపఁబడిన " కవి” యను వ్యాసము నామూలాగ్రముగఁ జదువుకొని తదంతర్వర్ణితములగు శక్తులలో దేనినైన నీవు కలిగియుండునెడల నీవు కవి వనుకొనుము. జంఘాల శాస్త్రి! విమర్శకుఁ డెట్లుండవలయునో సంగ్రహముగఁ జెప్పెద వినుము.
కవి, తన్నుఁదా నెట్లు కవితా వ్యాపారమున మఱచునో విమర్శన వ్యాపారమున నిన్ను నీ వట్లు మఱవవలయును. అనఁగ గవిగాని కవి వారు కాని-నీకుఁ గాని నీసంబంధులకుఁ గాని తత్సంబంధులకుఁ గాని యొనర్చిన యుపకారాపకారములను నీమనస్సునుండి తుడిచి వేయవలయును. నేర్చుకొనఁ దలఁచినది నేర్చుకొనుటకంటె మఱవఁదలఁచినది మఱచుట మనుజునకు సర్వధా కష్టతర మని యెంచఁదగును. కవి ప్రవర్తనములోని దోషాదోషములను గూర్చి నీవు విశేషముగఁ దలపెట్టఁ దగిన యావశ్యకత లేదు. ఆతని ప్రవర్తన మాతనికవిత్వమున కెట్టిమార్పు లెట్టివిలక్షణ విలాసములు కలిగించెనో యవిమాత్రమే నీవు చెప్పవలయును గాని తత్కవితాసాధుతాసాధుతా నిర్ణయ కార్యమునఁ దత్ర్పవర్తనము నీకే మాత్రము తోడుపడఁగూడదు. అడ్డు రాఁగూడదు.
అందఱహృదయములఁ దూఱువాఁడు కవియైయుండ నీవు కవి హృదయమునఁ దూఱువాఁడవు. ఒకచో నన్నవస్త్రములకుఁ గఱవై వట్టి ముష్టిచిప్ప చేతఁ బుచ్చుకొని పైయాకు లెగిరిన కుటీరమునొద్ద నతఁడు కూలఁబడి యేడ్చుచుండును. ఉత్తరక్షణమున దాసదాసీజన పరివృతుఁడై రత్నఖచిత కిరీటాంగదధారియై బంగారు సింహాసనమున గూరుచుండి ప్రజాపాలన మొనర్చుచుండును. తదుత్తరనిమేషమునఁ బొత్తులలో మూత్రాద్యవలిప్తగాత్రుఁడై వ్రేలు నోటఁబడక వెక్కి వెక్కి యేడ్చుచుండును. తరువాత నంతలోఁ బరమదుర్నిరీక్ష్యబ్రహ్మతేజః ప్రాంచితుఁడైన పరమహంసయై జగన్మిథ్యాతత్త్వమును బోధిం చును. ఒకప్పుడు శక్రధనుస్సౌందర్యముననో, కలకంఠ పంచమారావసౌభాగ్యముననో, ప్రభాతవాతపోతస్ఫుటిత పారిజాతసౌరభముననో చొక్కి, మఱిఁగి, కరఁగి, మైమఱచి మాయ మగును; అట్టి వేగుళ్లపూజరిని, అట్టి సర్వజగద్వ్యాప్తవ్యాపారపారీణునిఁ బట్టి కట్టిపెట్టి నీ వాతని హృదయమునఁ దూఱవలయును. అతని హృదయమున నున్న యనేక హృదయములఁ గాంచి బెదరక యాతని హృదయ మేదో కనుఁగొని పరిశీలింపవలయును. ఒకప్పుడాతని హృదయమేదో యాతఁ డెఱుఁగ కుండుచో దానిని నీవు కనిపెట్టఁగలిగినయెడల నోవిమర్శకుఁడా! నీవు కవికంటె ఘనుఁడవు కదా?
పరమార్థముగఁ గవిత్వ మనఁగ బహిరంతఃప్రకృతులను వాగ్దర్పణమునఁ జూపుట. అట్టిచో నోవిమర్శకుఁడా! నీకు బహిరంతఃప్రకృతి జ్ఞానము యథోచితముగ నుండనక్కఱ లేదా? సర్వదా తెఱచియున్నను జనసామాన్యమున కర్దము గాని చదువనయినరాని-యీబాహ్య ప్రకృతిమహోద్గ్రంథమును నీవు చదువకుండనే కవిగ్రంథవిమర్శనమునకుఁ బూనుకొనుట నీకు దోషము కాదా? సర్వదా మూసియున్న మఱియొకపుస్తక మింతకంటెఁ బెద్దదియుఁ జిత్ర మగునదియు నున్నది. దానిలోని యుపోద్ఘాతమయినఁ జూడకుండ నీవు కవితావిమర్శన మారంభించినచో నీవు మెదడుకలవాఁడ వనిపించుకొనఁగలవా? ఉభయ ప్రకృతిచిత్రపటమగు, కవితాపత్రమును నీవుఁ చేఁబూని యది మాతృకకు సరిపోయియున్నదో లేదో చూచి తీర్మానించు గొప్పపని నీదైయున్నదే? మనుజునిఁ జూచి యాతనిఁ బోలిన బొమ్మను వ్రాయవచ్చును గాని యాబొమ్మ యేవంకలో మాతృకకంటె భిన్నమైయున్నదో కనిపెట్టుట కష్టము గదా? విమర్శకుఁడా! నీపని కష్టయుక్తమే కాక ప్రమాద యుక్తమైనది గూడనగును. కవితాపటమును బ్రకృతితో సరిచూచునపుడు నీవు పొరపాటుచేఁ గాని తప్పుటూహచేఁ గాని బుద్ధిపూర్వకముగఁ గాని తప్పు నొప్పుగా, నొప్పు తప్పుగాఁ జేసినయెడల దైవముఖమును జూచి పలుకవలసిన నీకు- సరస్వతినిఁ జేత ధరించి సత్య మాడవలసిన నీకు- జనులకు యథార్థకవితాభిరుచిని గఱపవలసిన నీకు నెట్టి మహా దోషము సిద్ధించునో కొంచెమైన నాలోచించుకొంటివా? ప్రకృతి జ్ఞానము కలిగిన విమర్శకునికే యిట్టి ప్రమాద ముండఁగ నది లేని నీగతి యేదో యెవ్వఁడైనఁ జెప్పఁగలఁడా! కవి గట్టిన దేదో విడఁగొట్టుట విమర్శకునిపని యని చెప్పుదురు. “చచ్చు తేటగీతమైనఁ జెప్పుము. నేను జెప్పునఁ గొట్టించుకొందును” అని కవి విమర్శకుని నధిక్షేపించుట కలదు. ఇది తప్పు. విమర్శకునికిఁ గవితాశక్తి యుండవలసిన యావశ్యకత యెంతమాత్రమును లేదు, పప్పులో నుప్పెక్కుప" యని చెప్పఁగలవాఁడు పాచకుఁడు గావలయునా? రుచిగ్రహణ పారీణుఁడు భోజనప్రియుఁడైనఁ జాలదా? పడుకగదికి దొడ్డిగుమ్మములేని హేతువునను, పంచపాళిచూరు తలకుఁ దగులుటచేతను, దక్షిణపుఁ దెఱపి మూసియుండుట చేతను, గృహము సదుపాయముగ లేదని చెప్పఁగలవాఁడు, తాపి మూలమట్టము చేతఁబూని తా . నిల్లుగట్టువాఁడై యుండవలయునా? ఆరోగ్యాద్యంగనుఖపరిజ్ఞాని యయినఁజాలదా? గాయకునిపాటలో నపస్వరమును గని పెట్టఁగలవాఁడు ఖరహరప్రియరాగ మాలాపింపఁగలవాఁడై యుండవలయునా? గానానుభవరసికుఁడైనఁ జాలదా? అటులే అటులే-అదేమి! కొంపలు సమీపమునఁ గాలుచున్నవి. లెండు చెప్పవలసిన దింకఁ జాలగా నున్నది. మఱి యొకప్పుడు మాటలాడుకొనవచ్చును.
మేము తొందరగ లేచి తలుపు తాళమువేసి యాతావునకుఁ బరుగెత్తితిమి.