సాక్షి మూడవ సంపుటం/సాక్షి
1. సాక్షి
1922లో సాక్షి సంఘము మూతపడిన తరువాత, - ఈసారి మళ్లీ తెరిచారు. జంఘాలశాస్త్రి ఈ విషయం ప్రకటిస్తూ, ఆంధ్రపత్రికలో ఇందుకు సంబంధించిన ప్రకటన శ్రోతలు చూసి వుండరనీ, మళ్లీ సర్వపురంలోనే, పోస్టాఫీసు ఎదుట ఇట్లే సాక్షి ఆఫీసనీ తెలిసి వుండదనీ అన్నాడు.
జంఘాలశాస్త్రి వీథి అరుగుమీద ఒంటరిగా కూర్చున్నాడు. ఇంతలో ఒక అపరిచిత వ్యక్తి వచ్చి ఎదుట నిలబడ్డాడు. అతన్ని 'శనివారపు సంతకు వచ్చావా?" అని అడిగాడు. నిజానికి అతను ఉపన్యాసం వినడానికి వచ్చాడనే శాస్త్రి అనుకున్నా, బాగుండదని మాటమార్చి అడిగాడు. దాని మీదట తను అవలంబించిన 'దొంగ మాటల పద్దతి తనకే అసహ్యం వేసి - ఉపన్యాసం వినడానికి వచ్చావా! అని అడిగాడు. ఆ మనిషి తనకు సాక్షి సంఘమేమో, ఉపన్యాసమేమో ఏమీ తెలియదనీ, తమ కరణం గారికి మందు తప్పుగా ఇచ్చి చంపిన వైద్యుడవు కాదా? అని అడిగాడు. దానికి జంఘాలశాస్తి తను ఎందుకక్కడ కూర్చున్నదీ చెప్పాడు. “అవసరం నీది గనుక, ఇలా ఇక్కడ కూర్చోవడం ఏం బాగాలేదు. శనివారపు పశువుల సంతలోకి వెళ్లయినా ప్రసంగించు" - అని చెప్పి వెళ్లిపోయాడు.
జంఘాలశాస్త్రి ఈ ఉదంతం ఎందుకు చెప్పాడంటే, సాక్షి సంఘం మళ్లీ మొదలైంది శ్రోతల్లారా గమనించండి అని చెప్పడానికే —.
జంఘాలశాస్త్రి యిట్లు వ్రాసెను.
"సోదరులారా" యని సంబోధించి యుపన్యాన మిచ్చుటకు సభలో నేనుదక్క మఱి యెవ్వఁడును లేఁడే సాక్ష్యుపన్యాసములు తిరుగ నారంభ మగు నని యాంధ్రపత్రికారాజములోఁ బ్రకటించిన ప్రకటన నెవ్వరు చూచియుండలేదు కాఁబోలు! చూచి యుపేక్షించిరి కాఁబోలు! ఎటులైన నేమి? సభలో వినువాఁడు లేఁడు. సభలో నిది గొప్పలోపము కాదా?
గాయకుఁడగువాఁడు వినువారు లేకుండినను దనలోఁ దానుపాడుకొని యొకప్పుడు సంతోషింపవచ్చును. కవి యగువాఁ డొకపద్యమును వ్రాసి, దానిని భైరవితో నొకసారి చదివి, మారువాతో మఱియొకసారి చదవి తనలోఁ దా నానందింపఁ గలఁడు. చిత్రలేఖకుఁడగువాఁ డొంటె కుచ్చుతో సృష్టించిన తన యుంచుకొన్నదాని మొగమునెగ దిగఁ జూచి తనలోఁ దాను మురిసిపోఁగలఁడు. కాని వినువాఁడు లేకుండ “ననగననగ’ నని కథ నెవఁడైన నారంభింపఁ గలఁడా? పీటలపై వధూవరులైన లేకుండఁ బురోహితుఁడు విఘ్నేశ్వరపూజ నారంభించుట యెక్కడనైన నున్నదా? తలుపులకు, గోడలకు, నటుకమీఁది గబ్బిలాలకు నుపన్యసించువాఁ డున్మత్తశాల కర్హుడు కాడా? ప్రబల వక్తృప్రవరుఁడైన ‘‘బర్కు' దొర గారు వట్టిబల్లలకుఁ గుర్చీలకు నుపన్యసించెనని వినియున్న మాట సత్యమే. కాని, వారికిఁ గలిగిన పరిస్థితియే నాకుఁ గూడఁ గలిగిన దని సంతసించుట బుద్దిహీనతకంటె భిన్నమా? అనేక సహస్రశ్రోతలయెదుట నుపన్యాసము లారంభించిన యాదొరగారి కుపన్యాసావసానసమ యమున నుపన్యాస ద్రాఘిష్టతాదికారణముల చేత శ్రోతలు లేకుండిన లేకుందురు గాక! మాకు మొదటి నుండియుఁ బూర్ణానుస్వారముగ నున్నదే. ఆజన్మదరిద్రుఁడు మృణ్మయపాత్రతో నీరు ద్రాగినాఁడు: అర్కవంశ్యమహారాజు త్రాగినాఁడు. అభావస్థితినిబట్టి సామ్యమును నర్ణియించుట తప్ప కాదా? మాచకమ్మకు ఋతుకర్మము లేదు. వార్దకాక్రాంతయైన వవితకును లేదు.
ఒంటరిగ నుపన్యాసశాలలోఁ గూరుచుండుట యెందుల కని వీథియరఁగుమీఁదఁ గూరుచుచుంటిని. ఎవ్వరైన వచ్చుచున్నారేమో యని యటునిటు చూచుచుంటిని. ఇంతలో నెవ్వఁడో వచ్చి నన్నుఁ గొంచెమెఱిఁగినవాఁడువలె నాయెదుట నిలువబడినాఁడు. ఇతడుపన్యాసము వినుటకే వచ్చినవాఁడనియే నానమ్మకము. శ్రోతలు లేకపోవుటచేతవారికై యెదురుచూచుచు వీథిలోఁ గూరుచుంటి నని యాతని కేమాత్రమైనఁ దెలియునెడల నపహసించువేమో యనభయముచేత 'శనివారపు సంతలోనికి వచ్చితివా" యని యెఱుఁగనివాఁడువలె యాధాలాభముగ నడిగితిని. ఆహాహా ఇంతలో మనస్సెంత దొంగతన మునకు సాహసించినదో ఇంతనటన కిప్పు డేమంతపుట్టి మునిఁగినది? ఈతండెవండో క్రొత్తవాఁడు గదా! ఈతఁడు నన్నుఁగూర్చి యేమనుకొన్న నాకేమి? ఆతనిఁ జూచుటతో డనే మనస్సట్టె యట్టె ముడుఁచుకొనియపోయినదే సత్యమడుగంటినదే. మోసమునకు ముందడుగుపడినదే. కల్లపలుకు నోటివెంట వెడలినదే మనస్సున కింత పిఱికితన మేల యుండవలయును. ఇప్పడంత యవసర మేమి వచ్చినది? ఉపన్యాసప్రారంభదినమున శ్రోతలు లేకుండట తప్పా? ఆసంగతి యీ క్రొత్తవానికిఁ దెలిసినంతమాత్రమున హానియా, అప్రతిష్టయా? ఇంతమాత్రమునకే మర్యాద మట్టిగలసిపోవునా? మర్యాదను గూర్చి పనికి మాలిన భ్రమములకు లోనైయెన్నియో నటన లొనర్చుచుంటిమి గదా? పైమనుజునిఁ గూర్చి మనకున్నలక్ష్యములో, భయములోఁ బదునాల్గవ వంతులక్ష్యము, భయము మనకు భగవంతునిపైనుండునెడల నెంతబాగుగా నుండును! ఈయిగిలింపులు-ఈ సకిలింపులు-ఈకల్లలు -ఈ గారడులు-ఈహస్తలాఘవములు-ఈయభివయిములు నుండవుగదా. స్వచ్చమై, తేజ న్వంతమై, నివాతమైన దీపకళికవలె మనస్సు నిరుపహతముగఁ బ్రకాశించుచుండునుగదా.
ఇట్లు మనస్సులో నూహించుకొని నటించిన నటనకు వెగటుపడి, యడిగిన ప్రశ్నమునకు బిడియపడి "అయ్యో! నీ వుపవ్యాసమును వినుటకే వచ్చితివి కాదా" యని బహిరంగముగ నడిగితివి. "నీపేరేదయ్యా' యనియతఁడు నన్నడుగఁ గొంత నిరుత్సాహ మొందినవాడ నయ్యును వెంటనే మనస్సు నిర్మల మొనర్చుకొని జంఘాలశాస్త్రియని చెప్పితిని. ఆతఁ డట్టె నన్నుఁ దేరిపాలఁ జూచి, “నిన్నెచ్చటనో చూచిన ట్లున్నదయ్యా" యని మొగము రవంత నాలోచనభావసూచనముగఁ బైకెత్తెను. 'ఔను నీవే కాదు. అనేకాంధ్రులు దైవకటాక్షమున నాపేరు వినియుందురు. సాక్షిసంఘమని, సాక్ష్యుపన్యాసములని యాంధ్రలోకమునఁ గొంతసంచలనము కొన్ని సంవత్సరముల క్రిందఁ గలిగినది. ఆసందర్భముననే నీవు నాపేరు విని యుందువు. అటులైన నీవు నాకు మిత్రుడవే' యని కొంత కలుపుగోలుతనమునఁ బలికితిని. ‘సంవత్సరా లెక్కడనయ్యా, నాల్గుమాసములైనఁ బూర్తిగ నైనదా? సాక్షియేమో, సంఘమేమో, నాకాగొడవ యేమియుఁ దెలియదయ్యా. సన్నిపాతబైరవిలో శుద్దిచేయని నాభి వేసి మాకరణముగారిని టారునఁ జంపినవాండవు నీవే కాదంటయ్యా! యని యాతండు కఠినముగ బలికెను. 'నాయనా నేను వైద్య మెఱుఁగ నని యింక నేమేమో చెప్పఁబోవుచుండంగా, “నెఱుంగక పోవుటచేతనేనయ్యా ఇంత కొంపతీసినా" వని యాతండు తొందరతో నడ్డుగ బలికెను. 'నేను సారస్వత సాంఘికాద్యుపన్యాసముల నిచ్చినవాఁడనే కాని సన్నిపాతభైరవ్యాదు లిచ్చినవాఁడను గానయ్యా' యని నే నంటిని. 'నీయుపన్యాసములవలన నిదివఱ కెవరు చావలేదుగద' యని యతడు నిష్కల్మషముగ నడిగెను. లేదంటని. ఇప్పుడిక్కడ నెందుల కుంటివని యాతండడుగ, "ఉపన్యాసమీయఁ దలఁచి వినువారికైనిరీక్షించుచుంటి"నని నే నంటిని. “సరే కాని నీవు నీ యావశ్యకతకొఱ కుపన్యాసముల నిచ్చుచుంటివా' యని న న్నాతఁడు ప్రశ్నించెను. ప్రత్యుత్తర మిచ్చుట కేమియుఁదోపక కొంత సేపూరకుండి, “నాయనా! సాక్ష్యుపన్యాసములు తిరుగసాగింపవలసిన దని యనేకసోదరులు కోరినారు. ఈరీతిగ భాషా సేవ చేఁతనైనంత వఱకుఁ జేయుటకు నేనును సంకల్పించుకొంటిని. ఉభయపక్షములందుగూడ నావశ్యకత యున్నట్టూహింప వచ్చు' నని నేనంటిని. 'నాకు నచ్చలేదు. నీయావశ్యకతయే ప్రధానము కావున శ్రోతలు లేరని నీ విచ్చట గూరుచుండక యిప్పడు సాగచున్న శనివారపుఁ బశవుల సంతలోనికిఁ బోయి యక్కడ నుపన్యసింపు'మని పలికి యాతండు పోయెను.
సాక్షిసంఘము తిరుగ స్థాపింపఁబడినది. వెనుకటిసత్యపురమే సాక్షిసంఘస్థానము. లేఖాలయమున కెదుటియిల్లే సాక్షిసంఘకార్యాలయము. వెనుక సాక్షిసంఘ సభ్యులే యిప్పటిసభ్యులు. వెనుకటివలెనే సాక్షి యనుశీర్షిక క్రింద నుపన్యాసము లీపత్రికలోఁ బ్రచురింపబడును. నెలకు నాలుగే పడునో, యంతకంటెఁ దక్కువయే పడునో చెప్పఁజాలము. శుక్రవారపత్రిక కొఱకు నిరీక్షింపవలయును నని సోదరులను బ్రార్థించుచున్నాను.