సాక్షి మూడవ సంపుటం/సభావ్యాపారములు

11. సభావ్యాపారములు

సాక్షి సంఘానికి వచ్చే ఉత్తరాలు చదివి వినిపించడంగాని లేక తమ సంఘానికి సంబంధించిన లెక్కడొక్కలు, సాధక బాధకాలు చర్చించు కోవడం రెండు నెల్లకో మూడు నెల్లకో ఒకసారి అలవాటే.

ఈసారి రెండు ఉత్తరాలు చర్చకు వచ్చాయి. మొదట ఉత్తరం బళ్లారి జిల్లా ఆనెగొంది నుంచి-సి. బాలనాగమ్మ అనే స్త్రీ సాక్షిసంఘంలో సభ్యత్వం కోరుతూ రాసినది. చేర్చుకోతగునా? తగదా? అని వాణీదాసు, కాలాచా ర్యులు, జంఘాలశాస్త్రి చర్చించారు. చివరికి సాక్షి నిర్ణయానుసారం ఆమెను సభ్యురాలిగా జేర్చుకోవడానికే నిర్ణయించారు. స్త్రీ అనేక రంగాలలో పురోగమిస్తున్న దృష్ట్యా ఈనిర్ణయాన్ని జంఘాలశాస్తి సమర్ధించాడు.

రెండో ఉత్తరం గంజాం జిల్లా ఉర్లాం గ్రామం నుంచి ఒక 'సత్యవాది' వ్రాశాడు.

చిత్రలేఖనంలో కొందరు లేఖకులు స్త్రీలను అవమానపరిచే విధంగా రచిస్తున్నారనే విమర్శను ప్రస్తావించాడు. పురుష చిత్రకారులే కాక, మహిళా చిత్రకారులు కూడా కొందరు ఈదారినే నడుస్తున్నారని హెచ్చరించాడు. ఆపైన కవుల వర్ణనల ప్రస్తావన తెచ్చి-వారు ఎలాగ తమ కావ్యాలలో స్త్రీల అంగాగ వర్ణనలు చేశారోచెప్పి, వారు చిత్రకారులకంటె ఘోరమైన దండనకు అర్హులని గర్హించాడు. అటువంటి వారు తెలుగు కవులలోనే కాదు; సంస్కృత కవులలో కూడా వున్నారని జ్ఞాపకం చేశాడు. ఇంగ్లీషు భాషలో కూడా ఈధోరణి రచనల్ని ఉటంకించాడు.

జంఘాలశాస్త్రీ ఈవిమర్శకు జవాబు చెపుతూ-కవుల ప్రస్తావన చేసిన ప్పడు చెపుదామనుకున్నాననీ ఈలేఖకుడు తన పని తేలిక చేశాడనీ అభినందించాడు.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను.

సోదరులారా! సభావ్యాపారములు రెండుమాసముల నుండి చూచుకొనుటయే లేదు. సాక్షిసంఘము పేర నిదివరకు వచ్చిన లేఖలలో ముఖ్యములైన వానినిఁ జదివెదను. సాక్షికి-నమస్కారములు-మీసంఘమున నిదివఱ కైదుగురుండెడివారు. ఇప్పడు మీతో నల్వురే యున్నారు. అయిదవవారి నెవ్వరి నైనఁ జేర్చుకొనుట కుద్దేశ మున్నదా? అట్ టియుద్దేశము మీ కుండునెడల స్త్రీని జేర్చుకొందురా? ఆస్త్రీ సత్యపుర గ్రామవాసినియే యైయుండ వలయునా? అక్కఱలేదా? ఈసంగతులు నాకుదెలుపగోరెదను.

చిత్తగింపవలయును, విధేయురాలు, సి. బాలనాగమ్మ, ఆనెగొంది, కమలాపురము పోష్టు, బళ్లారి జిల్లా.

సోదరులారా! ఈలేఖను వింటిరా? ఈసోదరీమణి మన యుపన్యాసములను విని సంతోషించుటయే కాక, మనసంఘములో నొక సభ్యురాలై మనసంఘోద్దేశ నిర్వహణకార్య మునందు మనకు సహాయయై శ్రమపడు చుండుట కుత్సహించుచున్నట్లు తోఁచుచున్నది. బళ్లారి జిల్లాలోనున్న హేతువుచేత నెప్పడో కాని మన కామె దర్శనమిచ్చుట కవకాశము లేనిదైనను, దనయభి ప్రాయములను దఱచుగ మన కామె పంపవచ్చును. అందుచేత నామెను జేర్చుకొనుటయే నాయభిప్రాయము, వాణీదాసా! నీ వే మందువు?

వాణీ- స్త్రీని సభ్యురాలిఁగఁ జేసికొనవచ్చునని మనసంఘ శాసనములలో నున్నదా?

జంఘా-చేర్చుకొనఁగూడ దని లేదు.

వాణీ- స్త్రీని గూర్చిన ప్రసక్తియే లేనప్పడు స్త్రీనిఁ జేర్చుకొనుటకవకాశముండదు.

జంఘా-సభాశాసనములకు విరుద్దము కాని పనిని జేయుట తప్పకాదు.

వాణీ-సభాశాసనములు చెప్పనిపని చేయుట తప్ప.

జంఘా-కవీ! మొండివాదము చేయకుము. మనసోదరీమణు లిప్పడు మిగుల నున్నతదశలలోనికి వచ్చుచున్నారు. విదుషీమణు లగుచున్నారు; గాయనీమణు లగుచు న్నారు; కవయిత్రు లగుచున్నారు; చిత్రలేఖిక లగుచున్నారు. వక్తృత్వమున వారిని మించిన వారు లేరనిపించుకొను చున్నారు. శాసనసభలలో, సంఘసంస్కరణసభలలో, మతవిషయక సభలలో, న్యాయసభలలో, రాజకీయసభలలో సభ్యురాండై లోలాక్షీమణు లెందఱు లోకక ల్యాణమునకుఁ దోడుపడుచున్నారో నీవెఱుఁగుదువా? స్త్రీలు సర్వసభలలో సభ్యురాం డ్రుగ నుండుట సభలకే కాక దేశమునకుఁగూడ నలంకారము. అందుచే నామె కోరునెడలం జేర్చుకొనుటయే నాయభిప్రాయము.

వాణీ- నాయభిప్రాయమేదో చెప్పితిని. మార్చుకొనవలసిన కారణము నాకగపడలేదు.

జంఘా-కాలాచారీ! నీయభిప్రాయ మేమి?

కాలా- నాయభిప్రాయమున కేమున్నది? నాకు స్త్రీయైన నొకటే, పురుషుఁడైన నొక్కటే, ఆరెంటిలో భేదమేదో నామనన్సున కెక్కలేదు. వేదాంతశాస్త్ర మాత్మకు లింగము లేదని చెప్పచున్నది. పైస్వరూపమువలననే యీ వ్యక్తి యాఁడుది, యీవ్యక్తి పురుషు డని పామరులు గ్రహించుచున్నారు. కాని పరమార్ధ మాలోచింపఁగ స్త్రీ పురుష భేదము లేనే లేదు. అందుచేత జంఘా- కాలాచారీ! ఇఁకఁ జాలించు. స్త్రీపురుషభేదము నీ మనస్సున కెక్కలే దని చెప్పితివి కదా! నాలుగేండ్లక్రిందట వివాహమాడుటకు దక్షిణదేశయాత్ర పోయి యక్కడ నీయలౌకికచర్యలచేఁ గారాగృహప్రవేశ మంది చావునకు సిద్దమయితివే. జ్ఞప్తి లేదా?

కాలా- అప్పడు నేను బుద్దిపూర్వకముగఁ బోయితి ననుకొంటివా? ఏదో యితరుల ప్రోత్సాహముచే నట్టు జరిగినది?

జంఘా- సరే. నీయభిప్రాయ మేమని నిర్ణయించెదవు?

కాలా- నాకుఁ బ్రత్యేకాభిప్రాయ మేమియు లేదు. పెద్దల యభిప్రాయమే నాయభిప్రా యము.

జంఘా- అది యేదో స్పష్టముగఁ జెప్పము.

కాలా- వాణీదాసుఁడు చెప్పినట్లు స్త్రీని జేర్చుకొనకుండిన మంచిది. నీవు చెప్పినట్టు చేర్చుకొనినను మంచిదే.

జంఘా- సరే నీయభిప్రాయము నపుంసకము కావున నది గణింపబడదు. వాణీదాసా! స్త్రీని జేర్చుకొనవచ్చుననియే సాక్షి యభిప్రాయము. ఆయభిప్రాయ మీలేఖమీఁదనే వ్రాయఁబడియున్నది. హెచ్చుసంఖ్యగల సభ్యులచే నామోదింపఁబడుటచేత స్త్రీని జేర్చుకొ నుటకే నిర్ణయింపఁబడినది.

వాణీ- సాక్షియభిప్రాయ మట్టున్నదని మొదటనే ఏల చెప్పలేదు.

జంఘా-ఇదిగో మeటియొక లేఖ-గంజాము జిల్లా-నరసన్నపేట పోస్టు-ఉర్ధాము గ్రామము నుండి యీలేఖ వచ్చినది. దీనిని జదివెదను.

సాక్షికి నమస్కారములు.

అయ్యా! మీరు చిత్రలేఖకుల దిగంబరవిగ్రహములఁ గూర్చి యిచ్చిన యుపన్యాసము లోని సంగతు లన్నియు బాగుగాఁ దెలిసికొంటిని. ఉపన్యాసము బాగుగనే యున్నది. అట్టిదోష మెంతశీఘ్రముగఁ బరిహరింపఁబడునో చిత్రకళ కంత క్షేమము. కొందరు స్త్రీలు కూడ నట్టివిగ్రహములను జిత్రించుచున్నారని తెలియు చున్నది. ఇది మరింత ఘోరము. ఇప్పటి చిత్రలేఖకు లేవో పిచ్చియూహలు పెట్టుకొని, చిత్రించుచున్న కన్నులనుగూర్చి యుపన్యసించెద నని చెప్పియున్నారు. ఆయుపన్యాసము కొఱకు వేచియున్నాము. తప్పకుండ నట్టి యుపన్యాసము త్వరలో వెడలవలయును. వారు చిత్రించుచున్న కన్నులను జూడ నెంత రోఁతయైనఁ గలుగుచున్నది. మీరు ముఖ్యముగా విమర్శింపవలయును. అదిగాక వంగీయకళ తప్పకుండ మీవిమర్శనమునకు గుఱి కావలసియున్నది. కాని యొకసంగతి. అనడుమను: గొంతకాల మెండి మొండైన చిత్రకళ నూతనముగ నిప్పడే యుజ్జీవింపబడు చున్నది. లేలేఁతరెమ్మలు వైచుచుఁ జిగుర్చుచు మొగ్గదొడుగుచు నెదుగుచున్నది. మీవిమర్శనము కేవలము ఖండకముగా నుండక, కొంత పరిపోషకముగా నుండవలయు నని చెప్పచు న్నాను. వెఱ్ఱిరవెఱ్ఱి తలలను గఱకు కత్తితోఁ దెగనఱకగూడ దని నాయభిప్రాయము కాదు. అట్టినఱకు వలన, మిగిలిన చెట్టు మునుపటికంటె బలముగలదియై, మునుపటికంటె వ్యాప్తికలదియై, మునుపటికంటె హెచ్చుచిగుళ్లు, హెచ్చు మొగ్గలు కలదియై యుండునట్టు మాత్రము చూడవలయును. అది నాకోరిక.

మరియొకసంగతి-ఆడుదాని మర్యాదకు భంగకరములైన పటములను జిత్రించు చిత్రలేఖకులను భారతమాత చేతికొరడా వ్రేటున నట్టిశిక్ష కర్హతరులైన కవుల నుపేక్షించి, చిత్రలేఖకులమీఁదనే మీరు దాడివెడలుట తగదు. ఆడువారి యవయవరహస్యముల బయటబెట్టుటలోఁ గవులకుఁ జిత్రలేఖకు లందుదురా? ఒక్కొక్క యవయవమున కెన్నేసి పద్యములను జెప్పినారు. వారు వర్ణింపని యవయవమున్నదా? చిత్రలేఖకుల పటములలో నాభి కానబడుచున్నదని మీరు వారి సంతతీవ్రముగ విమర్శించితిరే! నాభిపై నొక్కొక్కకవి యెన్ని యెన్ని శ్లోకముల నెన్నెన్ని పద్యములఁ జెప్పియుండలేదు? చెలమలని, దిగుడుబావు లని, కొండబిలము లని మఱి యేమో యని యెన్ని వర్ణనములు కవులగు వారొనరించి యుండలేదు? అంతట నాగిరా? నాభిపై నున్ననూగారు, దిగువనున్న నూగారుగూడ వర్ణింపలేదా? “నూగారు గూఢపదమా చెలికిన్" అన్న వా రెవ్వరు? ఇంకఁ బయోధర వర్ణనములకు హద్దుపద్దున్నదా? మనసులోని యుబలాటము తీఱునట్లు, నోటికసితీఱు నట్టు, చేతిదురద తీఱునట్టు పయోధరవర్ణనము లెంతబహుళముగా గ్రంథములందు వ్రాసినారు? ఎంత పెద్దవి యని చెప్పినను హృదయమున కింక సంతుష్టి లేక, అబ తీజక, తాటకాయ లని, కుండ లని, కొండ లని, వారిమొగ మని మొఱపెట్టినవా రెవరు? కవులు కారా? పిరుదులను వర్ణింప కుండిన కవి యొక్కడైన నుండెనా? అవి పెద్దదిబ్బ లని, యిసుకతిప్పలని, మెట్టులని, గుట్టులని వర్ణించి వర్ణించి, యంతటితో దయ్యపు టాకలి శాంతింపక పోవుటచే, భూవలయముతో వాని నంట గట్టలేదా? కాంతల రహస్యావయవము లను వర్ణించుటలోఁ గవుల కున్న రాక్షసవాంఛ చిత్రలేఖకుల కున్నదా? పిరుదులవర్ణనలతో సరిపుచ్చిరా? ఎందులకు సరిపుత్తురు? సరిపుచ్చి యూరకుండఁగలరా? సరిపుచ్చి బ్రదుకగ లరా? సరిపుచ్చి కవు లనిపించు కొనఁగలరా? ఆకారముకాదు, రంగుగాదు, మఱియేదో కాదు, ఇంకేదో కాదు-ఎన్నెన్ని వివరములతో నోపికగా, శ్రద్దగా, భల్లూకపుబట్టుతోఁ దలఁపఁగూడని యవయవములను, గానరాని యనయవములను మనయదుటఁ బెట్టలేదు; పోనిమ్ము. అంతటితో నాగిరా? ఆగుటే? హాహాకారమెత్తి నప్ప డాగుటే-స్మరింపరాని సంభోగవర్ణనములను సంతనగ సాపుగ సముజ్జృంభణముగ సాగింపలేదా? అంతటితో నయిన శాంతిపడి మిన్నక పడియుండిరా? ఊహుఁ “పునారతికౌతుకంబుతో లేచి గంటములు చేతఁ బుచ్చుకొని బింకముగఁ గూరుచుండిన ముసలికవు లెందరు? ఈ ఘోరచర్యలోఁ దిరుగవేసి మఱుఁగవేసి, ఉల్టాసీదాల సౌభాగ్యము జూపినవారెందరు? చీ చీ! ఏచిత్ర లేఖకుఁడయిన నిట్టిసన్నివేశమును జిత్రించి సంతలోఁ బెట్టినాఁడా? ఈమోట మొండివ్యాపా రమునఁ గవులకంటెఁ జిత్రలేఖకు లెంతతక్కువ? చిత్రలేఖకులు కొరడా వ్రేటుల కర్హులయి నప్పడు కవులు కొఱత మేకుల కర్హులు కారా?

ఆంధ్రకవిత్వములో మాత్రమే యిట్టున్నదా? సంస్కృతములో నింతకంటె బా గేమైన నేడ్చిన దేమో యని చూడఁగ, నది యింత కంటె నధ్వాన్నముగ నున్నదే. జగన్మాతల స్తవరాజములలో గుహ్యాంగకములకుఁ బ్రత్యేక మొక్కొక్కస్తబకమా? తల్లిదండ్రు లగుపార్వతీ పరమేశ్వరుల సంభోగమును వర్ణించుటకు సాహసించినవారు సంస్కృత భాషామహాకవులే కాదా? బ్రహ్మచారులు, వేదాంతులు, సన్న్యాసులు సయితము దేవీస్తవరాజ ములలో నెంతలజ్ఞాకరము లయిన విగ్రహములను నిర్మించినారు.

ఇంత నాంగ్లేయభాష యీసన్నివేశమున నేభాషకు దీసిపోవునది కాదు. సమస్తభాషల లోనున్న యుద్గ్రంథములుగూడ నాభాషలో బరివర్తన మొందియున్నవి. కావున సమస్తజా తులవారి కీపిచ్చి యెంతగాడముగ నున్నదో తెలియవచ్చును. Shakespeare రచించిన Sonnets , Venus and Adonis , The Rape of Lucrece లో స్త్రీల గుహ్యవయవము లెంత ప్రీడాకరముగ, నెంత జుగుప్సాకరముగ వర్ణింపఁ బడియున్నవి? Aristophanes వ్రాసిన హాస్యరసరూపకముల నవలోకించితిరా? పూర్వపువా రట్టు రచియించిరి కాని యిప్పటివారు భద్రముగనే యున్నారని యనుకొనకుడు. ఇటీవలి గ్రంథమైన ‘Leaves of Grass”éo, “The love that awaits me” eos పద్యమాలికను జూచితిరా? ఎంతరోఁత కలిగించుచున్నదో చెప్పఁబోవున దేమనగ– చిత్రలేఖకు లెట్టిదోష మొనర్చిరని మీరు చెప్పినారో, కవు లంతకంటే నెక్కువదోషముల నొనర్చినారు. వారిని దూషించి వీరి ను పేక్షించుట ధర్మము కాదు.

చిత్తగింపుఁడు.

సత్యవాది


జంఘూ- ఈలేఖను వింటిరా! కవులందు బాక్షికముచే నేను వారిని విడువలేదు; చిత్రలేఖకులందు గోపముచే వారిని దూషింప లేదు. కవుల యీవెఱ్ఱినిగూర్చి చెప్పఁ దలఁచియే యున్నాను. చిత్రలేఖకుల గూర్చి నేను జెప్పినప్పడది సమంజసముగ నున్నదో లేదో చూడవలయును గాని కవులనుగూర్చి చెప్పలే దని యధిక్షేపింపవచ్చునా? నే నింకఁ జెప్పనివేళ యేది? ఉన్న దొక్క చిన్ననోరు: ఉపన్యాస విషయములు లక్షలు ‘కవినిగూర్చి యీనడుమ నుపన్యసించితిని. కవి భేదములు మొదలగు నంశముల గూర్చియుపన్యసించున ప్పడు కవుల యీపిచ్చినిగూర్చి సోదాహరణముగ సవిస్తరముగఁ జెప్పఁదలచితిని. కాని యుత్తమవిమర్శకుఁ డగు మన ఉర్లాముపండితుఁ డీవిషయమును గూర్చి వ్రాసి నాకు శ్రమలేకుండఁ జేసినందుల కాయన కనేకనమస్కారము లర్పించుచున్నాను. ఇంక జదువదగిన యుత్తరము లున్నవికాని యిప్పటి కివి చాలును.

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః.