సాక్షి మూడవ సంపుటం/పానుగంటి లక్ష్మీనరసింహారావుగారికి బహిరంగలేఖ

33. పానుగంటి లక్ష్మీనరసింహారావుగారికి బహిరంగలేఖ

సు.స.గారు వ్రాసినది

రైలుబండిలో దొరికిన తన ఉపన్యాసానికి పానుగంటి వారిచ్చిన సమాధానం ఏమి అర్ధవంతంగా, శాస్త్రీయంగా లేదని ఖండిస్తూ శ్రీమతి సు.స.గారు బహిరంగ లేఖ వ్రాశారు.

ఇందులో, పానుగంటివారు పురుష పక్షాన కలిగించుకొని సమర్దిస్తూ మాట్లాడినట్టు సు. స. గారు భావించారు.

ఆడది అణిగిమణిగి అణుకువతో అడ్డమైన బానిసతనం చేసినంతసేపు మగవాళ్ళు చేస్తే స్త్రీ స్తోత్రానికి హద్దు లేదు. ఎన్నో అర్హతల్ని, గొప్పతనాన్ని ఆమెకు కట్టబెడుతూ మాట్లాడడం అలవాటే. నేను శాపాలాప శారదావతారమైతే, మీరు వాదాలాప వాచస్పతులో- ఆడదాని నోట వెలువడిందల్లా తిట్టా? మగవాడు పలికినవన్నీ హేతుకల్పనలా? నావంటి ఆడది గ్రామగ్రామానికీ ఒక్కతె వుంటే, ఆర్యావర్త దేశాన్నంతనీ మూడేళ్లలో ఆడ మళయాళం చేసేయమా?-అని సు.స. గారు పానుగంటి వారిని ఈసడించారు. ముందు మిమ్మల్ని మీరు విమర్శించుకుని, తరవాత మమ్మల్ని విమర్శించండి - అని హెచ్చరించారు. చివరకి HEREDITY విషయం గురించి పానుగంట వారి వివరణల్ని ఎత్తుకొని దాన్నొక్కదాన్నే విపులంగా విమర్శించాడు. పిల్లల లక్షణాల నిర్ణయంలో తల్లివైపు వారివీ, తండ్రివైపువారివీ గుణగణాలు పరిగణనలోకి వస్తాయన్నారు. ఒక కుటుంబంలో కలిగిన బొమ్మ తల్లిదండ్రులు మాత్రమే చేసింది కాదు, అన్నారు. ఇదే విధంగా HEREDITY విషయంలో శాస్త్రీయమైన ఉదాహరణలతో పానుగంటివారి జవాబును ఖండించి జంఘాలశాస్త్రి దీనికి జవాబు చెప్పాలని కోరుతూ ముగించారు.

య్యా!

మీకు రైలుబండిలో దొరకిన నాయుపన్యాసమునకు ఖండనముగా వ్రాసి ప్రచురించిన మీ బహిరంగలేఖను శ్రీభారతిలోఁ జాచి యానందించితిని. ప్రత్యేకముగ నాఁడువారి కొకయాడుది వ్రాసిన యుపన్యాసముపై మీ రంతయాగ్రహించి యస్రశస్త్రములను సమకూర్చుకొని యాహవరంగమునకు దుమికి తెఱపిలేకుండ దీవ్రబాణ పరంపరలను గ్రుమ్మరించితిరే! ఎందుల కీ వీరావేశము! ఈ పట్టుదల! ఈ వాద విజృంభణము! ఈ శివశక్తిగంతులు! ఆడుదానిమాట రవంతయైనఁ బైనుండ గూడదు కాబోలు! అంతమాత్ర మునకే మగవాని పుట్టియంతయు మునిగిపోవును గాంబోలు! మగవాని గోడంతయు గోడగడ్డ లగును కాంబోలు! మగవాని 'సృష్టిప్రభుత్వ మంతయు మాసిపోవును గాబోలు! అనక యనక, యాఱు మాసములకో, సంవత్సరమునకో, కాక యర్ధోదయమునకో, యాడు దొక్కమాటయన్నయెడల దానిని వెంటనే ఖండించి తీఱవలయును గాంబోలు! అంత వఱకు మీకు మతులుండవు కాబోలు! ఓస్! మీసతీగౌరవము చట్టుబండలుగాను! మీపాండిత్యప్రభావము పదటగలియను! అడుది యడంగిమడంగి యడకువతో నడ్డమైన బానిసతనము నొనర్చునంతసేపు నాడుదానిని మీరు చేయుస్తోత్రములకు హద్దున్నదా? ఆడుదియే సంసారసముద్రమునకు నావ యనియు, నాడుదానివలననే మగవాఁడు గౌరవపాత్రుఁడై సత్యవంతుడై స్వార్డపరిత్యాగియై పుణ్యమూర్తియై ప్రకాశించు చున్నాడనియు, నాడుది యేదేశమున నేజాతివలన గౌరవింపఁబడి పూజింపఁబడునో యూదేశమే దేశమనియు, నాజాతియే జాతియనియు, దేశసౌభాగ్యమేమి, జాతి పరిశుద్దియేమి, యాడుదానివలననే నిలువఁ బడునుగాని మగవానివలన నిలువబడనేరదనియు, మగవానికి మోక్షలక్ష్మి నిచ్చుట కుగూడ నాడుదియే యర్హురాలనియు, నిట్టిమాటలు-మఱి యింక నిట్టిమాటలు, కాంతలకుఁ గర్ణరసాయనములుగల జిత్తరంజకములుగ మీరు పలుకుచుందురే. ఆడుది రవంత ప్రతివాక్యమాడినయెడల నసూయావిష్ణులై యాగ్రహాతిరేకులై యహంభావపూర్ణులై యాడుదానిని నిరసించి, విమర్శించి, ఖండించి పరాభవించిన దాఁక నెత్తినేల గొట్టుకొను చుందురే! ఇదియేనా మీ సహనము! మీ శాంతి! మీ సమభావము! మీ సౌజన్యము! మీ దొంగమొగము లెవతె నమ్మును? మీ గుల్లమాట లెవతె విశ్వసించును? మీ లక్క ప్రేమ కెవతె కరంగును? మీ మొసలి యేడ్పుల కెవతే మోసపడును?

ఇట్టిజాతిని దిట్టవలసినదా? రూపుమాపవలసినదా నా యుపన్యాసములలో మొదటి యాశ్వాసమునఁ దిట్టా? రెండవ యాశ్వాసమునఁ దిట్గా ఊ ఓహో హో! ఏమి యుక్తిపరుఁడవు! ఏమి చతురవచన రచనాచణుడవు! ఈమాత్రపు మీయుక్తికై మీవారు కులుకు చున్నారు కాబోలు! ఏమీ! ఏమీ! నాకు శాపాలాపశారదావతార మని బిరుదు కటాక్షించి తివా? పండితుడవు కాబోలు! ఎంతమాట కల్పించితివయ్యా హే హే! కవివికూడనంటే! నేను శాపాలాప శారదావతారము నైతినా? మీరు! మీరు! వాదాలాపవాచస్పతులు కాంబోలు! మీవ్యత్యస్తబుద్ది యెంత స్పష్టముగ, నెంత బహిరంగముగ వెల్లడించితిరయ్యా! ఆడుదానినో టనుండి వెడలినవెల్ల దిట్లా? మగవాఁడు పలికినవెల్ల హేతు కల్పనలా? ఆఁడుది బుద్దిహీ నయా? మగవాడు బుద్దిమంతుడా? ఆడుది దుష్టయా? మగవాడు శిష్టుడా? నావంటి యాడుది గ్రామగ్రామమునం కొక్కతె యున్నయెడల నార్యావర్తదేశమంతయు మూఁడు సంవత్సరములలో నాఁడుమళయాళము చేయలేకుందుమా? అప్ప డాడుది బుద్దిమంతు రాలో, మగవాఁడు బుద్దిమంతుడో ప్రపంచమునకు వెల్లడియై తీఱును. ఏదీ? మీకింక మంచిదినములు రవంత మిగిలియున్నవి. కానిండు. కానిండు. అయ్యా! నాయుపన్యాసముపై విమర్శనము జంఘాలశాస్త్రీ పక్షమున మీరు వ్రాసినట్టు వ్రాసితిరే! ఆయన బదరీనారాయణము నుండి వచ్చి యీప్రాంతముల నేదోసంఘము స్థాపించి యుపన్యాసము లారంభించుదనుక వేచియుండక యింతలోఁ ద్వరపడి మీ రాతనిపక్షమున నేల వ్రాయ వలసివచ్చినది. ఇంతలో లోకములు ముంచుకొని పోవునని మీరు భయపడితిరా? నేను తొందరపడుట తప్పని మీ రెఱిఁగి నప్పడు మీరేల తొందరపడ వలయునయ్యా! కాక, జంఘాలశాస్త్రి సాంఘిక విమర్శనము కంటె మీవిమర్శన మెక్కువ సందర్భముగా, సొగసుగా నుండునని వ్రాసితిరా? పాపము! నాయుపన్యాసమును బాగుగా ఖండించితినని యను కొనుచున్నారు. కాబోలు! ఆనందించు చున్నారు కాబోలు! అన్యోన్యమభినందించు కొనుచున్నారు కాబోలు! అల్పసంతుష్ఠులైన మిమ్ముఁ గాంచ మాకు జాలియగుచున్నదే! మీ విమర్శన మెంత నీరసముగ, నెంత పేలవముగ, నెంత యుక్తి శూన్యముగ, నెంత యశాస్త్రీయముగ నున్నదో మీరు గ్రహించు కొనలేకుండ నున్నారు. అవును! మా తప్పలు గ్రహించుటలో మీరు మహావిద్వాంసులు కాని మీ తప్పలు గ్రహించుకొనుటలో మీరు మందబుద్దులే కాదా? తప్పలు లేనిచోటుల నైనను జిలువలకుఁ బలవలు, పలవలకుఁ గొమ్మలు, కొమ్మలకు గుత్తులు కల్పించి వేయితప్పలు మాలోఁ జూపగలరు కాని లక్షలకొలది తప్పలున్న మీవారి వ్రాతలకుఁ గనులుమూసికొవని, నోరుమూసికొవని పడియుండువారే కాదా? ఆడుదాని యణువంత తప్ప హిమవత్పర్వతముగా మీదయ్యపుఁ గంటికిఁ గనబడునే అట్టి మీకన్ను మీకెంత మాత్రమును వినియోగింప కుండ నున్నదే! మీ పాండిత్యము మమ్మల్లరిపెట్టుటకే కాని మిమ్ము బాగుపఱచు కొనుట కేమాత్రము తోడుపడకుండ నున్నదే! మీ విమర్శన జ్ఞానము మా వ్రాఁతలలోని కలుపుతీఁతకే మీ మనస్సులలోని గర్వోపశాంతికి వినియోగపడకుండ నున్నదే! ఇంతటి నుండియైనఁ దెలివి తెచ్చుకొని మిమ్ము మీరు మొదట విమర్శించుకొని పిమ్మట మమ్ము విమర్శింప మొదలిడుడు. మిమ్ము మీరు విమర్శించుకొన్న యెడల మా జోలికెన్నడు మీరు వచ్చుటయే సిద్దించియుండదు. కురూపుండు తన రూపదేశాష్ట్ర్య మెఱింగినపిమ్మట సామాన్యస్వరూపమును వెక్కిరించునా? మొగముమీద మొటిమలుగల మగువను గుష్టరోగి యధిక్షేపించప గలడా?

అయ్యా! ఎంతయో యుత్సాహపడి, యెంతయో తొందర జెంది, యెంతయో కష్టపడి మీరు వ్రాసిన విమర్శనము, నిస్సారమై యున్నదన్న హేతువుచేత దానిని విమర్శింపక, నిరాదరణ మొనర్చి యావలఁ బారవైచినచో, మీవాక్యములే సిద్ధాంతములని మీవారనుకొ నిపోవుదురేమో యని, మమ్ము మీరు గెల్చినారని బుజము లెగుర వైచి గంతులు వేసెదరేమో యని మీ విమర్శనకుఁ బ్రతి విమర్శనము వ్రాయ వలసివచ్చినది. మీవిమర్శనమున విమర్శింప వలసిన దొక్క యంశమే యున్నది. అందుగూడ నొక్క వాక్యము మాత్రమే విమర్శింపదగి యున్నది. అది యేదన:- -

"Heredity యనుదానివలనఁ దండ్రిసంబంధమైన ముక్కు పొడుగో, తల్లిసంబంధ మైన కంటిసోగయో, మేనమామ సంబంధమైన మూఁతివంకరయో సంతానమందుఁ గాదాచిత్కముగ సంక్రమింపవచ్చునుగాని జగత్తు నేలుటకు సామర్ద్యము గలయట్టియు జగత్తునకు బానిసయగునంతటి తుచ్చముగల యట్టియు మనస్సులోని శౌర్యము, గాంభీర్యము, త్యాగము, నాపత్సహనము, భూతదయ, దైవభక్తి బ్రహ్మజ్ఞానము మొదలగు సుగుణ పరంపరకాని, కాతరత, లాఘనము, లోభము, శాంతి రాహిత్యము, తామసము, నాస్తికత మొదలగు దుర్గుణ పరంపరకాని Heredity వలనఁ గలుగుట కవకాశములేదు."

ఇది మీ ప్రధాన వాక్యము. ఈవాక్యమువలన మీప్రపంచజ్ఞానము మిక్కిలి యల్పమని స్పష్టపడుచున్నది. వాక్యము బారెడేగాని పసగలది కాదు. 'తండ్రి సంబంధమైన ముక్కుపొడుగో సంతానమందు సంక్రమింపవచ్చునని మీరు వ్రాసినారు. సంక్రమింపవచ్చుననియే కాని సంక్రమించునని మీరు స్పష్టముగ వ్రాయలేదు. అంతేకాక, దానికి వెనుక'గాదాచిత్కముగ’ నని యొక్కబంధ మంటగట్టినారు. ఇందువలన మీకు Heredity యందు విశ్వాసము లేనట్టు స్పష్టమగుచున్నది. ఈవిషయమున మీకుఁ బూర్వజన్మమే శరణ్యముగ నున్నది. “పూర్వజన్మమునందు నాకుగల విశ్వాసమువలన నార్యమతమునకు బలము కాని, యవిశ్వాసమువలన నీరసతకాని లేదనీ మీరు నన్నధిక్షేపించి తిరికాదా? Heredity యందు మీకుఁగల విశ్వాసమువలన సృష్టి శాస్త్రమునకు బలముకాని యవిశ్వాసమువలన నీరసత కాని లేదని మిమ్ము నేను దిరుగ నధిక్షేపించవచ్చును గదా! మీ యధిక్షేపణమునకుఁ బ్రత్యధిక్షేపణమును మీకప్పఁజెప్పితినిగదా! ఇంక మాటలాడ కూరకుండుడు. విడిచినవాద మును దిరుగ నందుకొని సాగింతము.

కాంకరగింజ నాటినయెడలఁ గాకరతీఁగయే పుట్టుచున్నది కదా? "కాదాచిత్కముగ గాఁకరతీగ పుట్టవచ్చునని మీరనరు కదా! తరులతాజాతియందు సహజమైన, సత్యమైన ధర్మము పరిణామని శ్రేణికలో మొదటి మెట్టుపైనున్న మనుష్య సంతానమునకేల సత్యము కాదు? మనుజ దంపతులకుఁ బుట్టిన సంతానము గూర్చి యింక ననేక విచిత్ర పరిస్థితులు, చిరకాల సంప్రదాయములు, ననేక వ్యక్తిలక్షణ సముదాయములు, ననేక లక్షణముల యన్యోన్య సమ్మేళనమువలనఁ గలిగిన లక్షణము లెన్నో పరిశీలింపవలయునుగాని తరులతాదిజాతియందుం బరమార్దముగ జరుగుచున్న సామాన్యధర్మమే యిచ్చటగూడ జరుగుచున్నది కదా? అంతకంటె భేద మేమియు లేదే? కాని యిక్కడ నల్లిక లెక్కువ యున్నవి. చికిబికు లెక్కువయున్నవి. క్రొత్తకూర్పులున్నవి. దూరమాలోచింప వలసియు న్నది.

బిడ్డలక్షణములు పరిశీలింపవలసివచ్చినప్పడు తల్లిదండ్రుల లక్షణములు మాత్రమే పరిశీలించి యూరకుండ జనదు. ఆబిడ్డని పితామహి లక్షణములు, పితామహిలక్షణములు, వారి యితర సంతానలక్షణములు గూడఁ బరిశీలింప వలయును. అంతేకాదు, మాతామహ లక్షణములు, మాతామహిలక్షణములు, వారి యితరసంతానలక్షణములు గూడ బరిశీలింపవల యును. ఇట్టింక బై రెండుమూఁడు తరములవఱకైనఁ జూడఁ దగినది. బిడ్డలోని యనేక లక్షణములు తల్లిదండ్రుల లక్షణముల బట్టియే నిర్ణయింపదగును. తల్లిదండ్రులలో లేని లక్షణములేవైన బిడ్డయందుఁ గానఁబడినయెడల వానికొఱకు వంశవృక్షములోని పైకొమ్మల నెక్కీ పరీక్షించినయడల వానికిఁ గారణము లగపడితీఱును.

ఒకయాడుపిల్ల పుట్టిననిముసము మొదలుకొని ముసలిది యగు వఱకు నడుమ జరుగు ప్రధాన చేష్టలను బరిశీలింతము. పిల్లచేఁటలోఁ బడగనే కేరుకేరున నేడువవలయును గదా! అటు లీ పిల్ల యేడువలే దనుకొనుము. ఎందుచేత? ఆపిల్లతల్లియో, తండ్రియో భూపతనమగుటతోడనే యేడువకపోయి యుండ వలయును. ఆసంగతి వారితల్లితండ్రుల వలన సులభముగఁ దెలిసికొనవచ్చును. జనులు నిదురించునపుడు కుడి ప్రక్కనో యెడమప్ర క్కనో పండుకొను నలవాటు కలవారై యుందురు కాని రెండు ప్రక్కలను సమాన సౌలభ్యముతోఁ బండుకొననేరరు. ఒకవేళ నిద్రలో నలవాటు లేని ప్రక్క కొత్తిగిల్లుట తటస్టించినను రెండుమూడు నిముసములలోనే మేల్కొంచి యలవాటైన ప్రక్కకు దిరుగుదురు. మనము పరీక్షింపదలచిన పిల్లతండ్రికో, తల్లికో యెడమవైపునఁ బండుకొనునలవా టున్నదనుకొనుము. ఈపిల్లగూడ నెడమప్రక్కనే పండుకొనును. తెలియక తల్లి యాపిల్లను గుడిప్రక్కను బండుకొనఁ బెట్టిన యెడల బిల్ల యిల్లెగిరిపోవ నేడ్చును. ఎడమప్రక్కగాఁ బండుకొనఁ బెట్టిన వెంటనే కిక్కురుమనకుండ నిద్రించును. బాల్యమునఁ దల్లికో తండ్రికో యెడమ చేతివ్రేల్లో కుడిచేతివ్రేల్లో నోటఁ బెట్టుకొను నలవాటున్న యెడలఁ బిల్ల యాచేతివ్రేళ్లే యావయస్సులోనే నోటఁబెట్టుకొనును. పిల్లతల్లికిఁ దండ్రికిఁగూడ నత్యంత మధుర పదార్ధ మిష్ట మనుకొనుము. ఈపిల్లకేమో కాని తీపి యిష్టము లేదుసరేక దాపులు పనగ మహాప్రీతి! ఈవ్యత్యాసమునకుఁ గారణమేమో యని దూరాలోచన చేయకుండం బూర్వజన్మమే కారణమని తొందరపడి సిద్దాంత మొనర్పకుము. అంత దూరాలోచన కూడ నేల? వంశవృక్షమున నీపిల్ల తండ్రి ప్రక్కనేయున్న యామె యొవతెయో యెఱుఁగుదువా? ఆమెయే యిపిల్ల పెద్దమేనత్త. ఈమె దినమున కొకపదలము చింతపండుపులుసు ద్రాగునప్పడు మేనగోడలికిఁ బులు సిష్టమనగ నాశ్చర్యమేమి? తల్లికాని, మేనత్తకాని యెన్నవయేఁట నెన్నవ మాసమునఁ బ్రథమరజస్వలయగునో యన్నవయేటనే మాసమైన బీరుపోకుండ బిల్ల రజస్వలయగును. కాని తల్లి మేనత్తల సాంప్రదాయము ననుసరించి యీపిల్ల పండ్రెండవయేట రజస్వల కాక, పదియవ యేటనే రజస్వల యయ్యెనేమి చెప్పమా? ఈమాత్రమునకై తొందరపడి వెనుక జన్మమువఱకుఁ బోక, ముందువసారాలోఁ గూర్చొండి చిమ్మిలి దంపించుచున్న పిల్లపితామహియొద్ద కేగి యడుగుము. ఈవిషయమున నామనుమ రాలికి నాపోలికవచ్చినదయ్యా యని యామె పైకి విసుఁగుజెందిన ట్లగపడుచున్నను లోన మరియచుఁ దనచరిత్రము లోని విచిత్రాంశమును బహిరంగపఱచును. ప్రథమ రజస్వలా దినములలో నీపిల్ల కావునేయి, పులగము, ప్రాంతబెల్లముఁ దక్క మఱియేదియు నీయకుండ నెంతకఠిక పథ్యమునుఁ జేయించినను దల్లికిఁ గాని, మేనయత్తకుఁ గాని ఋతుశూల యున్నయెడల నీపిల్లకుఁగూడ నేకాలదిగనో యది సంక్రమించును గాని విడువదు. ఇంక గర్భవతిగా నుండునప్పడు ప్రక్క శూలంగాని, పక్కనొప్పిగాని వంశములోని పూర్వ స్త్రీల యాచారము ననుసరించి కలుగును. సంతానక్రమము కూడ సంసార సంప్రదాయము ననుస రించియే యుండును. రజోదోష నివృత్తికూడఁ దల్లినిబట్టియో, తల్లితల్లినిబట్టియో, తండ్రి సోదరినిబట్టియో, యామెతల్లిని బట్టియో యుండును. వేయేల? తల్లిదండ్రుల సామాన్యము లైన యభ్యాసములు కూడ బిల్లలకు సంక్రమించునుగాని వదలవు. మాటలాడు చున్నప్పడు ఆండ్రి చేతు లెట్లాడించునో, తల యెట్టు విసరునో బిడ్డ కూడ నటులే చేయును. తల్లికాని తండ్రికాని గొంతుకూరుచుండి భుజించుటయే యలవాటు కలిగియుండునెడలఁ బిల్లగూడ నటులే కూరుచుండి భుజించును. బలాత్కారమునఁ బద్మాసనమునఁ గూరుచుండం బెట్టి యాపిల్లను భుజింపఁ జేయునెడల నోటనిడుకొన్న కబళము దిగక పోవుటచేఁ గెక్కు కెక్కు మనును. సాధారణముగా జనులు నాలుగైదు నిముసములకంటె నెక్కువకాలము నిలువఁ బడవలసివచ్చునప్పడు రెండు కాళులపై సరిగ నిలువఁబడరు. కుడికాలి పైనో యెడమకాలి పైనో బరువెల్ల మోపి మిగిలిన కాలికిఁ బనియేమియు నీయరు. కుడికాలిపై నిలువ నలవాటుగగల తల్లిదండ్రులకుఁ బుట్టినపిల్ల ప్రధానముగఁ గుడికాలిపైనే నిలువంబడును. మన మప్పడప్పడు కుడి చేతివ్రేళ్లసందులలో నెడమచేతివ్రేళ్లిముడ్చుకొని కొంతసేపట్టే యుంచుకొనుట తటస్టించుచ్నునది. అట్టి హస్తపుటమునకు మొట్టమొదటి వ్రేలు కుడిబొట నవ్రేలైనఁ గానవచ్చును. ఎడమ బొట్టనవ్రేలైన గానవచ్చును. దక్షిణాంగుష్టమే మొదటిది యగునట్టుగా హస్తములు ముడుచుకొను నలవాటు తల్లికో తండ్రికో యున్నయెడలం బిల్లకూడ నటులే హస్తయుగ్మమును ముడుచుకొనును. నడుచునపుడు ముందువేయు కాలుకూడ ననూచానస్థితి ననుసరించి యుండుననుట యతిశయోక్తి కాదు.

అయ్యా! Herediry కల్లయని నిర్ధారణ మొనర్చుటకు మీరు కొన్ని యుదాహరణ ములు నిచ్చినారు. అవి సమంజసముగ లేవు. పండితాగ్రగణ్యునకు శుంఠ జన్మించుచున్నాఁ డని చెప్పినారు. తండ్రి షట్చాస్త్ర పాండిత్యమునే మీరు పరిశీలించినారు. కాని మేనమామ శుంఠత్వ సామ్రాజ్యమును మీరు పరీక్షింపలేదు. ఈ తప్ప మీదికాని Heredityది కాదు. మహావదాన్యుఁడైనవానికి లుబ్దాధమాధముండైన నిర్భాగ్యు డుదయించుచున్నాఁడని మీరు చెప్పినారు. ఈలుద్దాధమాధముని పితామహుడు శ్రాద్దములు చేసి, శవములు మోసి, శల్యపరమాన్నమును దిని, చౌర్యము లొనర్చి స్వామిద్రోహకృత్యము లొనర్చి తాను తినక యొకనికిఁ బెట్టక కూడఁబెట్టిన ధనమంతయుఁ దనకొడుకు తాను జచ్చిన పిమ్మట దానధర్మములకై తగులఁబెట్టుచున్నాఁ డని కడుపుమంటచే గాలిపోవుచుఁ దనధనము నెటులైనఁ గాపాడు కొనవలయునను దయ్యపుఁ బట్టుదల కలిగి, ద్విగుణీకృత లుబ్ధత్వముతోఁ దానే తనకు మనుమడై పుట్టెనని మీరు గ్రహింపలేకపోవుటచేత మీకు వ్యత్యా సముగాఁ గనంబడుచున్నది. కాంతాలంపటుడై, కాతరుఁడైన దశరథునకు శ్రీరామచంద్రు నివంటి యేకపత్నీవ్రతుఁడు, జగదేకవీరుడు జన్మించినప్ప డింక Heredity ని నమ్మవలసిన పనియేమున్నదని మీరు పలికినారు. అట్టనుట తప్ప. అందుచేతనే మఱింత నమ్మవలసియు న్నది. దశరథుని కాంతా లోలత్వమే మీరు గణించితిరి కాని హోమాగ్నిజ్వాలాతుల్యయగు కౌసల్యాదేవిపరిశుద్దిని మీరు గణించితిరి కారే! దశరథుని భయస్వభామునే మీరు గణించితిరి కాని రఘుదిలీపాదిమహారాజుల పౌరుషసంఘాత మంతయు శ్రీరామచంద్రపరబ్రహ్మము లోని కాకర్షింపఁబడినదని మీరు గ్రహింపలేకపోయితిరే! మీరిచ్చిన యుదాహరణము లన్నియు నిట్లే యసంబద్దములై యవిచారపూర్వకములై యున్నవనుట నిశ్చయము.

ఇంక వంశానుక్రమముగ వచ్చు రోగములను గూర్చి రవంత చెప్పవలసియున్నది. ఉబ్బసము, మూలవ్యాధి, క్షయము, కుష్టము నీతరగతి లోని ప్రధానవ్యాధులు Intermittence of the Heart (నాడి నాలుగైదు దెబ్బలు కొట్టినతరువాత నొక దెబ్బకాలము నిలిచిపోవుట) అనునదికూడ మూఁడు తరములనుండి యొక కుటుంబములో నున్నట్లు కనిపెట్టం బడినది. Hysteria యనునది కూడ నట్టి వ్యాధియే యని కొందఱు చెపుచున్నారు. అంధత్వముకూడ నీ తరగతిలోనిదే యని కొందఱ యభిప్రాయము. తాతగారి యంధత్వము మనుమనికి వచ్చుట కలదు. అది జనుషాంధత్వమైన సరే. చెప్పరాని వ్యాధులలో నొవకదానివిసము వంశములో నాల్గుతరములవఱకు నిలిచియుండునని కొందఱు చెప్పచు న్నారు. పిల్లనిచ్చుటకుఁ గాని తెచ్చుకొనుటకుఁ గాని మనవారు కుటుంబ సంప్రదాయమును విశేషముగాఁ బరిశీలించుచున్నారు. ఒక్కవంశములోని వ్యాధులు మఱియొక్క వంశములో నికి సంక్రమించుట కవకాశము కలుగకుండుటకే మనవారు పరిణయ నిర్ణయపూర్వమునం దింత పరిశోధన చేయుచున్నారు. ఇట్టి పరిశోధనము రోగవ్యాప్తి నివారణమునకే కాక, దుష్ప్రవర్తన వ్యాప్తి నివారణమునకుఁగూడ నైయున్నది. అందుచేఁ బిడ్డలప్రవర్తనము కూడ వంశానుక్రమ సూత్రమున కధీనమై యున్న దనియే స్పష్టపడుచున్నది.

అయ్యా! దేహసంబంధములగు కొన్ని లక్షణములు బిడ్డలయందు గానబడవచ్చును గాని జగత్తునేల గలట్టియు, జగత్తునకు బానిసయగు నంతటి తుచృత్వము గలయట్టియు మనస్సులోని సుగుణ పరంపర గాని దుర్గుణపరంపర కాని Herediry వలన రాదని మీరు స్పష్టముగఁ జెప్పినారు. మీకుఁ గోపమువచ్చినను సరే కాని యిది వట్టి తెలివితక్కువ మాటయని చెపుచున్నాను. ప్రవర్తనము (Character) దేహముతోఁ జేరినదా మనస్సుతోఁ జేరినదా? దేహముతోఁ జేరినదని మీ రనుటకు సాహసింపలేరుకదా! మనస్సుతోఁ జేరినదని యొుప్పకొనక తప్పదు కదా! Heredity వలననే మనస్సు సత్ర్పవర్తనము గలదిగాని దుప్ర్పవర్తనము కలది కాని యగుచున్నదని యిప్పడే నిర్ణయింప బడినదా కాదా? ఆ నిర్ణయము నేను జేసినదగుటచే మీకు నచ్చ లేదందురా? పోనిండు. Heredity మనస్సుపై బనిచేయునని మహాశాస్త్రవేత్తలు చేసిచూపిన నిర్ణయమును విందురా? (Idiocy) జన్మమందత్వము, (Insanity) పిచ్చి యివి మనస్సుతో, జేరినవా? దేహముతోఁ జేరినవా? దేహముతోఁ జేరినవని మీ రనునెడల మి మ్మేమనవలయునో మాకుఁ దెలియదు. ఇదివఱ కైదుతరముల నుండి Idiocy తీగ సాగుచున్న వంశములు రెండు Franceలో నున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పినారు. తాతకుఁ బిచ్చి, తండ్రికి బిచ్చి, యన్నకుఁ బిచ్చి, చెల్లెలికిఁ బిచ్చి, తనకుఁ బిచ్చిమైన కుటుంబములు తఱచుగ లేకున్న విరళముగ నున్నట్టు వినుచున్నాము. తండ్రికిఁ బిచ్చిలేదు కాని తీవ్రమైన కోపము, పెద్దకొడుకునకు సామాన్యపుబిచ్చి, రెండవకొ డుకున కంతకంటె నెక్కువపిచ్చి, మూడవకొడుకునకుఁ బూర్తిగా బిచ్చిగల యొక్క కుటుంబము గోదావరీ తీరమందుండుట నే నెఱుఁగుదును. ఇప్ప డేమందురయ్యా! ఇంకను మనస్సునకు Heredity కి సంబంధము లేదని యందురా? అటులైన నొక మనశ్శాస్త్ర పరిశోధకుఁ డగు మహావైద్యుడు చెప్పినమాటలను విందురా? “The heredity Transmission of a liability to mental disease must be reckoned as the most important among all predisposing causes of insanity” & “oëo, Heredity & Cooges కారణములలోఁ బ్రబలతమమైన దని తెలిసినదా? మఱి యింకను వినుఁడు. “It probably well within the mark to say that at least 50 percent of the insance have a direct or collateral heredity tendency towards insanity” ఇక్కడకు బిచ్చివారిలో నధమము నూటి కేంబదుగురవఱకీ తరగతిలోనివారే యని స్పష్టపడినదా?

మూర్చ వంశానుక్రమమగు వ్యాధి యగుటచేతను, మూర్చ ముదిరి పిచ్చికావచ్చును గావునను, మూర్చయున్న కుటుంబములో నుండి పిల్టను దెచ్చుకొనగూడదు. ఆకుటుంబ ములోనికిఁ బిల్ల నీయగూడదు. చెడద్రాగెడు వారికుటుంబముతో నెన్నఁడును సంబంధము చేయ దగదు. ఆసంబంధమువలన నున్మాదము మఱియొక్క కుటుంబములోనికి రాగలదు. ఏదో యొక్క విషయముననే యత్యద్భుతప్రజ్ఞ కలవాఁడును హద్దుమీఱిన చుఱుకుదనమును గలవాఁడున్న కుటుంబముతో సంబంధము చేయఁగూడదు. అట్టి ప్రజ్ఞావంతుని తరువాత రూపాయకుఁ బదణాలవఆకుఁ బిచ్చివారు కలుగవచ్చును. మేన మామ కూతునకు మేనత్తకొడుకునకు, మేనమామ మేనకోడలికి, మేనత్తకూతునకు మేనమామకొడుకునకు వివాహసంబంధము లొనర్చి లొడితెడైన యావరణములో గుడుగుడుగుంచము లాడుచు ముళ్లపై ముళ్లు దగుల్చుకొనువారి కుటుంబములలోఁ దఱచుగాఁ బిచ్చివారు పట్టుదురని చెప్పదురు.

Heredity వలననే దేహలక్షణములన్నియు గలుగుచున్నవి. మనోలక్షణము లన్నియుఁ గలుగుచున్నవి. ఇట్టిలక్షణములు సంక్రమింపఁ జేయుటలో తల్లి దండ్రులతరమువారి కెంతశక్తియున్నదో, వారి పైతరములవారి కెంతశక్తియున్నదో వారిపై పైతరములవారి కెంతశక్తియున్నదో యను నంశములు కూడ శాస్త్రవేత్తలు సంతతపరిశోధ నమువలనఁ గనిపట్టినారు. తల్లికాని తండ్రికాని (0.5); పితామహుడు కాని మాతామహుడు కాని (0.5); యేడవతరములోని పురుషుఁడు (0.5)'*; x తరములోని పురుషుఁడు (0.5)* గా, దైహిక మానసికలక్షణములు పిల్లలకు సంక్రమింపజేయుదురని వారు చెప్పినారు. కాని యీసూత్రము మాత్రము ప్రత్యేకవ్యక్తిపరముగా గాక, సాంఘికసాముదాయిక పరముగా సత్యమని వారు చెప్పినారు.

కావుననేమి తేలిన దనంగా; ఒక కుటుంబములోఁ గలిగిన బొమ్మతల్లిదండ్రులు మాత్రమే చేసినని కాదు. వారు, వారిపై వారు, వారి పైవారు నేబదుగురో యఱువదుగురో చేసిన బొమ్మయని తెలియ దగినది. దేహలక్షణములు సంతానమునందుఁ 'గాదాచిత్క ముగ గానబడుననియు, మనోలక్షణములు మొదలే కానబడవనియు మీరు చెప్పిన మాట యాచారవిరుద్దమైనదియు, నశాస్త్రీయమైనదియు, నసత్యమైనదియునైయున్నది. తల్లిదండ్రుల లక్షణములే కాదు; వారి పూర్వుల లక్షణములే కాదు; మనుష్యజాతికి బూర్వులైన యన్ని ప్రాణుల లక్షణములు గూడ మనలో నున్నవి. ఇలకోడికూఁత యెఱుఁగుదువా? దాని కెదురు పడిన ప్రేయసిని సంతసింపజేయుట కది కూయుచున్నది. కప్పయు నందుకొఱకే కూయుచున్నది. మగవాఁడు తన కిష్టమైన కాంతను జూచి యట్టే కూనురాగ మీడ్చుచున్నాడు. మగనెమిలి యాడునెమిలి సంతసము కొఱకుఁ బురివిప్పి తాండవించును. మగవాఁడు దనకిష్టమైన మగువ ప్రీతికై తల యెగురవైచుకొని యొడలు విరుచుకొని యొయ్యారమునఁ దిరుగులాడి మిడికిమిడికి మొత్తుకొనుచున్నాడు. క్రూరజంతువుల హింసా సాధనములు మననోటఁ గోరలుగ నిల్చియున్నవి. కోఁతితోఁక మన వెన్నుపాము చివర Coccyx రూపమున నిల్చియున్నది. కోఁతి కిచకిచలే మననవ్వులైనవి. కోతి వెక్కిరింపులే మన యధిక్షేపణములు. కోఁతి చాంచల్యమే మన మనస్సులో శాశ్వతముగ నిల్చియున్నది. అయ్యా! ఇక జాలు. నామాటలు నచ్చినవానికి నిఁకఁ జెప్పనక్కఱలేదు. నచ్చనివానికి నిఁకఁ జెప్పనక్కఱలేదు. అందుచే విరమించుచున్నాను.

కాని మఱియొక్కమాట. మునుపటివలెనే యీసారికూడ దొందరపడి జంఘాలశా స్త్రీపక్షమున మీరు ప్రత్యుత్తర మీయవలదు. రాదలఁచిన జంఘాలశాస్త్రీ వచ్చి, స్థాపింపదలచిన సంఘమేదో స్థాపించిన తరువాత, నీయవలసిన యుపన్యాసములలోఁ బ్రథమసాంఘికోప న్యాసమే నాకుఁ బ్రత్యుత్తరముగా జంఘాలశాస్త్రి యీయవలయును. అది నాకోరిక. ఆతని యుపన్యాసములు విని యెంతకాలమో యైనది. ఆతఁడు మమ్మెంత యధిక్షేపించినను మా కెవ్వరికి నాతనిపై నిసుమంత యైనఁ గోపము రాలేదు. ఆతనిని మా సోదరునివలెఁ జూచుకొనుచున్నాము. ఆతడు బదరీనారాయణము నుండి వచ్చి నూతన సంఘమును స్థాపించి యాంధ్రదేశము నందు సమంజసమైన సంచలనము, సంతోషము నెప్పడు సమకూర్చునో యని సముత్కంఠచే నిరీక్షించుచున్నాము.

(భారతినుండి పునర్ముద్రితము)