సాక్షి మూడవ సంపుటం/దొరకిన యుపన్యాసము

31. దొరకిన యుపన్యాసము

కసారి పానుగంటివారు తణుకు నుంచి పిఠాపురం వెడుతూ, నిడదవోలులో రైలులో ఎక్కారు. రైలు కదిలిన కొంతసేపటికి, బెర్తును ఉత్తరీయంతో దులిపి, నడుం వాలుద్దామనుకుంటూండగా ఒక కాగితాల బొత్తి కనిపించింది. అది ఒక మహిళ వ్రాసిన ప్రసంగ పాఠం. ఆ మహిళ, ఆ ప్రసంగాన్ని ప్రకటించడమే ఉత్తమమని ఎంచి, దానికొక ప్రతిని రాసి - భారతి పత్రికాధిపతికి పంపాడు. సు.స. అనే పొడి అక్షరాలో వున్న ఆ ప్రసంగ పాఠం సారాంశం ఇది:-

పురుషుడు మొట్టమొదటి నుంచి స్త్రీ అభివృద్దికి ఆటంకాలు కల్పిస్తూనే వున్నాడు. కొద్దికాలం క్రితం వరకూ కూడా మగవాడు ఆడదానిని వీధి గుమ్మం వరకు కూడా రానివ్వలేదు. నారీ సంఘం అంతా ఈ అనారీ సంఘాన్ని ఎందుకు అణగద్రొక్కకూడదు? ఆడది మగవాణ్ణి అనుకరిస్తోందని మగవాడి వుద్దేశం. నిజానికి స్త్రీ పురుషుణ్ణి అనుకరించడమంత రోత మరొకటి లేదు. ఆ మాటకొస్తే పురుషుడే నాటకాలలో స్త్రీవేషం వేసి అనుకరిస్తూ స్త్రీ జాతినే అవమానిస్తున్నాడు. ఎంత ప్రయత్నించినా స్త్రీ సహజమైన హావభావాలను పురుషుడు అనుకరించలేడు. చేసే, ఆంగికమైన అనుకరణ అతనిలో, “స్త్రీత్వ సౌకుమార్యాన్ని తీసుకురాకపోగా, ఉన్న పురుషత్వ లక్షణాలను దూరం చేస్తోంది. ఎందరినో ఆక్షేపించే జంఘాలశాస్త్రి మగవాడు ఆడవేషం వెయ్యడాన్ని ఎందుకాక్షేపించాడు. కేవలం, తను మగవాడు గనుకనే, మగతత్త్వం, ఆడతత్త్వం మౌలికంగా భిన్నమైనవి. పురుషుడు స్త్రీని అనుకరించడం మానాలి. ఆంధ్రదేశంలో వున్న నాటక సంఘాధిపతులకి ఒక ఆజ్ఞాపత్రం పంపాలి. ఏమనంటే మగవాళ్లు ఆడవేషం వెయ్యరాదు. స్త్రీలకే పాత్రలిచ్చి పోషించాలి అని. అందుకు ఒప్పని స్రీ వేషాలేసే భర్తల్ని, వారి భార్యలు త్యజించడానికి సంశయించకూడదు. దీనిని ప్రచురణకు పంపుతూనే, దాని జాబు వ్రాస్తామని పానుగంటివారు భారతీ పాఠకులకు ఒక లేఖ కూడా జత చేశాడు.

శ్రీ భారతీ పత్రికాధిపతీ! నమస్కారములు.

ఈనడుమ నా సాంతపనిమీఁద నేను దణుకు వెళ్లియచ్చట నొక్కదిన ముండి తిరుగఁ బీఠికాపురమును జేరుటకై నిడుదవోలునొద్దరైలుబండిలో నెక్కబోవుచుండఁగఁ, గొందఱు స్త్రీలు పురుషు లొకగదినుండి దిగబోవుచుండిరి. వారు వారిసామగ్రితో దిగినపిమ్మట నేను గదిలోనికిఁ బోయి కూరుచుంటిని. రైలు నడవనారంభించెను. కొంతసేపు కునికిపా టులు పడిపడి పండుకొనుటకై యెంచి లేచి బల్లపైనున్న మెత్తనుత్తరీయముతో దులుపుచుండ గ్రింది మెత్తకును, వెనుకనున్న మరియొక మెత్తకును నడుమనున్న యవకాశ మున నొక కాగితములబొత్తి నాకంటఁ బడినది. దానిని గ్రహించి చూచితిని. అదియొక కాంతారత్నము వ్రాసిన వ్రాఁతవలె నాకు దోచినది. ఈ కాగితములు పోవుటచే నాకాంత యెంత పరితపించుచుండునో యని కొంతసేపు విచారించితిని. ఆ వనితామతల్లి ప్రకటింపనెం చిన యభిప్రాయములను బ్రకటించుటయే మంచిదని నేనూహించుకొని యాకాగితములకుఁ బ్రతివ్రాసి దానిని మీయొద్దకుఁ బంపితిని. మీరు ప్రకటించినయెడల దానిని వ్రాసిన నారీమణి సంతోషించునని నావిశ్వాసము. ఈ క్రిందిదియే దాని ప్రతి.

చిత్తగింపవలయును. పానుగంటి లక్ష్మీనరసింహారావు.

ప్రారంభోపన్యాసము

“సోదరీమణులారా! మీ యందఱతో నొక ముఖ్యాంశమును ముచ్చటింప నెంచి మి మ్మిట కాహ్వానించితిని. ఆయంశము మీతో నెంతకాలము నుండియో చెప్పందలచితిని మీ మనస్సులకు స్పురింపని యంశము నామనస్సున కేల తట్టెనో యని నాకే సందేహముగా నుండుటచే మానివైచితిని. ఇప్ప డన్నిసందేహములను మించిన యాతురత నన్నుఁ బ్రేరేప, నా యభిప్రాయమును మీకు వెల్లడించి హృద్భారమును బాపుకొన నిశ్చయించుకొంటని."

"కాంతలస్థితిగతులు కొంతకాలమునుండి యభివృద్ది దశలో నేయున్నవి. ఇట్టి మనయభివృద్దికి మనమే కారణముకాని మగవాఁడు కాడని లోకమెఱిఁగియే యున్నది. మగవానివలన మేలు జరుగునని మన మెన్నడనుకొనియుండలేదు. ఆతఁడు మనసందర్భమునఁ గేవల నిరుపయోగుఁ డనియే నిశ్చయపఱచితిమి. ఆతఁడు నిరుపయోగుడైన నంతమాత్రమున మనము విచారింపవలసిన పని లేదు. సమర్థతాశూన్యత కంతవ్యము కాని యాతండు మనయభివృద్దికి మొట్టమొదటి నుండియుం బ్రతిబంధకారుఁడై పరమశత్రుఁడై ప్రత్యక్షమారకుండై ప్రవర్తించుటచేతనే మన మాతనిని నిందింపవలసివచ్చినది. ఆతనిపాపమున నాతడే పోవునని మన మూరకుండక మన బానిసతనమునకుఁ బరితపించి, మన విద్యాశూన్యతకు విచారించి, మనవ్యక్తిరాహిత్యమునకు వ్యసనపడి యాతని లక్ష్యపెట్టక, యవసరానుసారముగ నాతని కెదురుతిరిగి, స్వయంకృషిని నమ్మియాత్మ విశ్వాసమును గల్గి, మన పురోభివృద్దికి మన పాటులేవో పడుట చేతనేకదా ప్రొయ్యియొద్ద గుల పొగనడుమ గూల బడవలసిన మన ముపన్యాసపీఠములపై గరతాళముల నడుమ నిలువబ డుచున్నాము! పేఁడనీళ్లతో నట్టిండ్లలికిన మనము నవరసములతో నాటకములను సృష్టించు చున్నాము! పిల్లల తొట్టెలయొద్ద జోలపాటలు పాడిన మనము న్యాయసభలందు ధర్మవాదుము లొనర్చుచున్నాము! లొడితెడు సంసారములో గుడుగుడు గుంచము లాడవలసిన మనము లోకోపకారమునకై భారతదేశమం దంతట బర్యటన మొనర్చుచున్నాము! మగవాఁ డనువాఁ డాడుదానిని వీధిగుమ్మమువద్దకుఁ గొలది కాలము క్రిందటివ ఱకు రానిచ్చినాడా? చీపురుకట్ట వదలి Briefbag ను బట్టనిచ్చినాడా? తన సేవ మఱచి దేశసేవమాట నెన్నఁడైనఁ దలంప నిచ్చినాడా? ఎంతసేపు తాను, తనవిద్య, తనసుఖము, తనకీర్తి, తన వృద్దియే కాని సృష్టిలోఁ దనసాటిదైన యాడు దున్నదనియైన మనసునఁ బెట్టినాడా? ఇతర దేశ స్త్రీల యభివృద్ది వినియైనను రవంత దయ, కాసంత దాక్షిణ్యము, నిసుమంత సమభావము మనయోడల గనబఱచి నాడా? తరతరములనుండి యుగయుగ ములనుండి కార్కొని ఘనీభవించిన యజ్ఞానాంధకారమునుండి స్వప్రయత్నముచేత నతిశీఘ్ర కాలములో జ్ఞానతేజః ప్రపంచమున కుబ్బెత్తుగ నుబికిన జాతి సర్వప్రపంచ చరిత్రమం దొక్క యార్యనారీజాతి తక్క మఱియొకటియున్నదా? బ్రాహ్మణులేమో తమ్మజ్ఞానమునఁ బడద్రోచిరని యబ్రాహ్మణులు వారి కెదురు తిరిగిరి. కాని నారీసంఘ మంతయు నీ యనారీసంఘము నేల యెదుర్కొని తొక్కివేయగూడదో నాకు బోధ పడుటలేదు. మగవాడంత స్వార్డలోలుడు, నసూయాపరుడు, నధర్మశీలుఁడు నహంకారదూషితుఁడు ప్రపంచమున లేఁడని మనచరిత్రవలన స్పష్టపడినదా? పాపము పండిపండి బ్రద్దలు కాకమా నునా? చౌటిసడియలని తా ననుకొనినవే కాదా అప్పడు సుక్షేత్రఖండిక లైనవి? రాక్షసిబొగ్గుదిబ్బలని తా ననుకొనిననే కాదా యిప్పడు రత్నాలగను లైనవి! ఎండి, మెలికలు పడి, పిట్టతలలు వైచి కంపతొడుగైన తీఁగలే కాదా యిప్పడు ప్రసవఫలబంధుర పరిమళప్రాంచిత ములైనవి! వంటయింటి పడుకటింటి బానిసలే కదా యిప్పడు భారతదేశ సౌభాగ్య దేవతలై ప్రకాశించుచున్నారు! చిరకాలనాగరికత, చిరకాలవిద్య, చిరకాలాభ్యాసము, చిరకాలాహంభా వము కలిగిన మనవాఁ డిప్పడు మనకు వెనుకఁబడినాఁడా లేదా? భారతదేశ సమస్తకార్యభార వహనక్రియాకలనయందు ముందుబుజము మనదా యాతనిదా? మనము పాడినపాటను బట్టి తనయుడు గిప్పడు సర్దుకొనుచున్నాఁడు. మార్గదర్శకవ్యాపారమున మగువ నిల్చి మగవానిని వెంటఁద్రిప్పకొనుచున్నప్పడేకదా నాగరకత శిరోనక్షత్రమంటిన ఫెంచవలసి యున్నది!

ఇట్టిస్థితిలో మన ముండుటచేత భగవంతు నెంతయైనఁ బ్రార్డింపవలసియున్నది. మనము మనల నెంతయైన నభినందించు కొనవలసియున్నది. మగవాని నెంతయైన నిందింపవ లసియున్నది. కాని యింతసంతోషమందుఁ గూడ నొకటి రెండు విచారహేతువులున్నవి కాని లేకపోలేదు. ఒక దానిని గూర్చియే యిప్పడు చెప్పెదను. నేను జెప్పఁబోవు నంశము మీ రెఱుఁగనిది కాదు. మీరేల యింతకాల ముపేక్షచేసి యూరకుంటిరోయని నాకాశ్చర్య ముగా నున్నది. ఈయంశము కూడ మగవాని దుష్టవ్యాపారముతో సంబంధించినదే. ఈదోష మేదో వెల్లడించి దీనిని దిద్దుబాటు చేయుటకుఁ బ్రథమావకాశము భగవంతుడు నాకు గటాక్షించి నాఁడు కదా యని నేను సహేతుకమైన గర్వమొందుటలోఁ దప్పలేదని యనుకొందును.

సోదరీమణులారా! మనము కంటికి జోడుపెట్టుకున్నప్పడు కొలఁది కాలము క్రిందట. దానెంత వెక్కిరించినాడో మీకు జ్ఞప్తి లేదా? అక్షిరోగమునకేకాక యాస్యసౌభాగ్య మునకుఁగూడ నద్దములను దాను ధరించునప్పడు వానిని మన మేల ధరింపఁగూడదో? అది తన యనుకరణమట. మనము కంటితోఁ జూచుటకూడ దన యనుకరణమే యగును గావున మనము కన్నులు మూసికొనవలసి దని యభిప్రాయము కాబోలు! అరుంధతినాడో ఆదిశక్తినాడో కల్పింపబడిన యంద మాకారములేని యాప్రాంతయెుడ్డాణమే మనము ధరింపవలయును గాని నడుమునకుఁ బటకా పెట్టుకొనఁగూడదదట! ఈయధిక్షేపణములో హేతువున్నదా? నీతి యున్నదా? మనుష్యధర్మమైన యున్నదా? షరాయి తొడిగికొని చర్మపాదరక్షలు మనము ధరించినపుడు తానెంత వెకవెకలాడెనో మీ రెఱుఁగనిదా? అంత వెకవెక లెందులకు? అదేమి హానియా, అపకీర్తియా? తన్ను మన మెంతమాత్ర మనుకరింప గూడదంట! ఆ ప్రధాన రోగమునకు బాహ్యలక్షణములే యీతలయూపులు, నీవెకవెకలు, నీ సకిలింపులు, నీ కటకటలు, ఎన్ని నవ్వులు నవ్వినసరే యెన్ని యేడ్పు లేడ్చినసరే మనము మానదలఁచుకొన్నప్పడే కదా యాతండు విధిలేని వైరాగ్యమును వహించి యూరకుండినాఁడు. మనము సైకి లెక్కగూడదని సంఘమర్యాద, వ్యాకరణమునం గ్రియాపరిచ్చేదమునఁ బ్రథమసూత్రము వ్రాయుటకు దా నెవడు? ఇది మన వారి పంచమహా పాతకములలో నొక్కటా? ఏసుక్రీస్తువారి పది యాజ్ఞలలో నొక్కటా? ఇది కాక మన డబ్బిలోనిది ముక్కుపొడి, తనడబ్బిలోనిది శ్రీపాదరేణువునా? ముక్కు భగవంతుఁడు తనకే ఇచ్చినాఁడా? ఇంతతేగనీలు గెందైన న్నునదా? మనజేబులోనివి సిగరెట్టా? తన జేబులోనివి తులసికట్టలా? ఇంతకు నో సోదరీమణులారా! కారణము చెప్పియే యుంటని. ఆడుది మగవాని ననుకరించుటకంటె మగవానికి రోత వేఱొక్కటి లేదు. మన కుచితమైనదియు, నుపయోగకరమైనదియు, నర్హమైనదియు, నవసరమైనదియు మనము చేయుచున్నాము కాని తన్ననుకరించు నుద్దేశ మెంతమాత్రము మనకు లేదని తా నేల యెఱుంగడు? తా నెవరి ననుకరించి యిన్ని వేషములు తెచ్చుకొనినాఁడు? ఆమాత్రపు టూహ తనకేల యుండగూడదు? అతనికి మొదటినుండియు మనయోడల సదూహయే యున్న యెడల మనకిన్ని పాటులెందులకు? తనకిన్ని తిట్లెందులకు? మనము తన్నెంత మాత్ర మనుకరింపఁగూడదు. కాని తాను మనలఁ బూర్తిగా ననుకరింపవచ్చును గాఁబోలు! అది తప్పలేదు కాఁబోలు! అందులకు మన మాతని నేమియు ననఁగూడదు కాబోలు! నాటకములలో స్త్రీపాత్రములను ధరించి తాను మనల నేల యనుకరించుచున్నాఁడో చెవిపట్టుకొని జాకాయించి నిలువబెట్టి యేల యడుగరాదు? మంగురులు వింతయైన సొగసుగా నుండునని మన మీ చెంప నా చెంప నొక్క యంగుళముమాత్రపు వెడల్పున వెండ్రుకలు కత్తిరించుకొన్నప్పడు తానెంత యల్లరి పెట్టినాడో తలవెండ్రుకలు పూర్తిగా తీయించుకొనినట్టుగా నింటిపెంకు లెగిరిపోవున ట్లెంత హంగామా చేసినాఁడో అయూత డిప్పడు మీసములు పూర్తిగా గొరిగించుకొని సవరములు నెత్తికిఁ గట్టుకొని నాటకరంగమునఁబోఁతు పేరంటాలై నిలువంబడినప్పడు 'నీకిదియెవఁడుచెప్పినాడు రా! యని మన మాతని మూతిపై నేల యీడ్చికొట్టరాదు? కోటులాగున నుండునెడలం గ్రమ్ముదలకుఁ గ్రమ్ముదల, సొగసునకు సొగసుగా నుండునని రైకకు బొత్తాము లంటించి చేతులు రవంత పొడుగుచేసి ధరించి సహజమైన సిగ్గుతో నూత్నమైన శోభతో మనము ప్రకాశించుచుండ దన కన్నులలోఁ జీలలు కొట్టుకొనినాఁడే అవా డిప్పడు మనరైక తొడిగికొని దానిలో మఱేవో తగులఁబెట్టుకొని సిగ్గులేక, యుభయభ్రష్టత్వపుఁ బాడురూప ములతో రంగమున మగముతైదువై నిలువబడి మనల బరాభవించుచున్నప్ప డాతని నేమి చేసిననైనఁ బాపమున్నదా? కఱ్ఱపడి యొడలిపై నడ్డుకట్టుకోకతో, నడ్డుచీలల ముంజే తుల కదికింపుగాజులతోఁ గండలపై జేరుబొందులవంటి నరములుబికిన మొఱకు కంఠమున గాజుపూసలతోఁ, జుట్టపొగచేఁ బొక్కి మాడి చచ్చిన పెదవులపై లత్తుకతో, గూటితీయుటచేఁ గాయలుగాచి గీఁతలుపడిన దౌడలపై బూడిదెతో, వేంకటేశ్వర పాదములపై దుమ్మకాయ గొలుసులతో, నాడుదాని తలకంటె సహజముగఁ బెద్దదైన తలపై సవరముల జవునుకూర్పుచే భయంకరముగ నగపడు రాకాసితలతో, రంగముమీద సంకర స్వరూపమున నవతరించిన యీ జగన్మోహినీ దేవతను జూడగ నార్యావర్తదేశమంతయు నొక్కపెట్టున నేడువ వలసియున్నట్లున్నదే తా నాడుదానిని బూర్తిగ ననుకరించినట్లు లోలోపల నుత్సాహమున నుబికి యుబికిపోవుచున్నాఁడు. కాఁబోలు! తానా? ఆడుదాని ననుకరించుటా? తనతరమా? సహజలావణ్యముగల యాడుదానిని గనులకు సూటిగ నొక్కజేనెడు చూచి టంగున (Tangeal) కు మఱలిన చూపుగల యాడుదానిని-నెగడు దిగుడుగ దరంగ ఫక్కిగఁ జూడఁగల యాడుదాని-నెగడు దిగుడుగ దరంగ ఫక్కిగ జూడఁగల యాడుఁదానినినింద్రధనుస్సు వలె లోకమునకంత నొక్కసారి మంగళపుటారతి నీయంగల యాడు దానిని పాము మెలికల జిగజిగలతో మెఱపు గప్పన మెఱసి చప్పన మాయమైనట్టు చూడఁగల యాడుదానిని దానా? అనుకరించుటా? మతి యుండియే యీపని చేయుచున్నాడా? పెదవులపై లక్ష చందమామల పండు వెన్నెలల కలకలతో గానబడవలసిన మందహాసమును బెదవులపై మాటుపఱచి దానిని గంటికొసలో నొక (Geometrical point) లోఁ గేంద్రీకరణ మొనర్చుట కొక్కనిజమైన యాడుదియే తగును కాని యీ కొజ్ఞాస్వరూపమే-అందులకుఁ దగుటే! చచ్చియాడుదియై పుట్టినప్పటిమాట కాని యిప్పటిమాటయా?

సోదరీమణులారా! ఇంత యసాధ్యకార్య మాతనివలవం గాదు, పోనిండు! ఆది నిలువబడినట్టయిన దాను నిలులవబడలేనప్పడు తన మొగము, తనమోర, యిఁక, ననుక రణ మెందులకు? చనవు, ప్రేమ, రవంతమోతాదుమించిన వాల్లభ్యము గనబఱుపవలసిన భర్త యెదుట నాడుది యెట్టు నిలువంబడునో, కాసంత మాత్రమే గౌరవము గానం బఱుపవలసిన పెద్దబావగారి యెదుట నెట్టు నిలువబడునో, యధికభయ గౌరవములు గనబఱుపవలసిన మామగారి యెదుట నెట్లు నిలువఁబడునో, యీ భేదములలో నొక్క భేదమైన దాను గనబఱుపగలఁడా? నా భర్త యీ నడుమ నాటకము లోనికి వెళ్లేదని చెప్పటచేఁ బొమ్మంటివి. 'నీ భర్తకీరాత్రి నాటకములలో వేసమున్న దని మాయింటిపొరు గమ్మలక్కలలో నొక్కతె నాచెవి నూడెను. నా భర్త వెడలిపోయిన కొంత సేపటికి నేను నాటకశాలకుఁ బోయితిని. అభిజ్ఞానశాకుంతలమున నాభర్త ప్రియంవద వేసము కాంబోలు వేసినాఁడు. కణ్వమున్యాశ్రమములోని మొక్కలకు నీళ్లుపోయుటకై శకుంతలతోఁగూడఁ జేతిలో నొకయిత్తడి చెంబును బుచ్చుకొని నా భర్త రంగమునకు వేంచేసినాఁడు. నేనప్పడు కొంతసేపు డిల్లపడి కొయ్యనైపోయితిని. నాకప్పడు మనస్సునఁ గోపమే కలిగెనో, రోఁతయే పుస్టెనో, నవ్వే కలిగెనో యేడుపే వచ్చెనో నే నేమియుఁ జెప్పఁజాలను. ఒక్కనిమున మట్టున్నపిమ్మట నాభర్త నిట్టిస్థితిలోఁ జూచుటకంటెఁ జచ్చిపోవుటయే మంచిదని ప్రపంచ వాంఛా నిస్పృహతను జెందితిని. అంతలో సున్నపు గుల్లపొంగువలె రోస మెక్కడ నుండియో గుబగుబలాడుచు నుబికి నన్నుఁ గంపితురాలిఁగఁ జేసెను. రంగస్థలమునకుబోయి యాతని యెదుటబడి నెత్తిపైనున్న సవరపుబుట్ట లాగి “నీకువచ్చిన యేండ్లెవనికి వచ్చినవి? నీ కీ దిక్కుమాలిన సంకరపువాలకమేల?" యని యాబుట్టతో నెత్తిపై నాల్గు వాయింపవలయు నని బుద్ది పుట్టినది. కాని యారోసమును గష్టపడి శాంతిపఱచుకొని, పండ్లు గొఱుకుకొనుచు లోలోపల నెన్ని తిట్టయినఁ దిట్టుకొనుచుఁ గూరుచుంటిని. రంగమున నాభర్త యెట్లు నిలువఁబడెనో చెప్పనా? అయ్యయ్యో ఇంక నా భర్తయేమి? నాసవతియో నాయాఁడుబిడ్డయో యైన యాపురుష సువాసినీ స్వరూపము నిలువ బడినఠీవి యెట్టున్నదో చెప్పనా? ఎడమ చేయి నడుము మీఁదికి జారిపోయినది. కుడిచేత నిత్తడిచెంబు పట్టుకొని ప్రక్కనుండి పాఠము చెప్పవానివంక జూచుచున్నాఁడు. అప్పడు నా కాతం డెట్టుండినట్టుతోచెనో చెప్పనా? లెట్రీనులో నెవండో యుండుట చేత గుమ్మమువంకఁ జూచుచు నాతురతతోఁ గనిపెట్టు కొన్న వాడువలె నాకుఁ గానంబడినాండు. చీ! చీ! నడుముమీఁదఁ జేయివైచుకొన్న యెడల నాడుదాని ననుకరించిన ట్లే! బుగ్గమీఁద వ్రేలు పెట్టుకున్న యెడల నాఁడుదాని ననుకరించి నట్లేటే! పైట మాటమాటికి సవరించుకొన్నయెడల నాఁడుదాని ననుకరించినట్లేటే. వెఱ్ఱి వెఱ్ఱ ప్రక్కచూపులు చూచి ముసిముసి నవ్వులు నల్లి ముడుచుకొనిపోయినట్టయిన నాఁడుదియై పోయినట్టే! ఇంతయే యాతని యనుకరణము. కాంతల బాహ్యలక్షణములనే యనుక రింపలేని మగవా డింక నంతరంగలక్షణముల ననుకరింపగలడా? కల్గ నాటకర్తలే యాండువారిని జిత్రింపనెంచి మగతనముచెడిన మగవారిని సృష్టించుచున్నారే. అట్టిచో నాటకకర్తల మాటల ననుసరించి మిడుకవలసిన నటకులా యాడువారి ననుకరించుట? అసాధ్యము.

కాని, దమయంతి దమయంతియే యైపోయెననియు జంద్రమతిచంద్రమతిని గూడ దాటనదనియు బండితుల ప్రచురములకు లోపము లేదు. పాత్రధారుల బంగారుపతకము లకు లోపములేదు. మగవారు మగవారిని స్తుతింపక మానుదురా? ఏదీ జంఘాలశాస్త్రి యెందఱనో యధిక్షేపించినాఁడు కదా! కాంతల నధిక్షేపించుటలో నేమి, వారిచేఁ దిట్లు తినుటలో నేమి గట్టివాఁడేకదా! నిష్పక్షపాతముగ విమర్శింతు నని యనేక పర్యాయములు చెప్పిన యాతడు సైతము-మగవా డాడు వేసము వేసి జాతికంత కప్రతిష్ట తెచ్చుచున్నాఁ డన్న యంశమును విమర్శించినాడా? ఆతరడు మగవాడు. అట్లేలచేయును?

పక్షపాతన్వభావముచే బుద్దిపూర్వకముగ నాతండు విడిచిపెట్టిన యీయంశమును నేను విమర్శింపనెంచితిని. మగవాడు మగువ ననుకరింప లేఁడని నా సిద్దాంతము. అనుకరింపఁగలవాఁడైనను ననుకరింపలేని వాడైనను ననుకరించుటకుఁ బ్రయత్నించువా రెల్లజాతికి ద్రోహులని చెప్పకతప్పదు. అందులోఁ గొలఁదిగా ననుకరించవానికంటె బాగుగా ననుకరించువాఁడే జాతికిఁ బరమ ద్రోహి, మగతత్త్వము నాడుతత్త్వము నొక్కమందడినే యంటియున్నవైనను దానికి దీనికి నత్యంత భేదమున్నది. ఒకటి కఠినము, రెండవది మార్దవము. ఒకటి హేతుబద్దము, రెండవది రసస్థుతము. ఒకటి సంచలనము, రెండవది స్థిరము. ఒకటి బలీయము, రెండవది దుర్బలము. ఒకటి మలీమసము, రెండవది పరిశు ద్దము. ఇంకను మఱీ యెంతయోభేద మారెంటి కున్నది. ఈ రెండుతత్త్వములు నింత భిన్నములుగ సృష్టిలో నుండుట చేతనే స్త్రీపురుషుల కన్యోన్యాకర్షణము నన్యోన్యానురాగము లున్నవి. విజాతీయ విద్యుచ్చక్తి యుక్తములగు వస్తువుల కన్యోన్యాకర్షణము కాని సజాతీయ శక్తియుక్తమ్లులగు వానికిఁ బరిపూర్ణమైన ప్రాతికూల్యమేకదా! కావునఁ బురుషుడు. పొలఁతి ననుక రించునెడల నన్యోన్యానురాగము లిఁక ననుస్వారములు; సంసారములును చట్టుబండలు; బ్రతుకులు వ్యర్దములు. ఇదికాక, కప్పకూత నిత్యము కూయువానికిఁ గప్పకున్న గొంతు వంటి గొంతు రాకున్నను బురుషునికుండవలసిన తన గొంతులో మాత్రము కాసంతమార్పు కలుగక తప్పదు. ఆడుదానివలె జూడదలచి చూడఁ దలంచి పట్టుదలతోఁ బ్రయత్నించిన మగవాని కాడుదానిచూ వలవడకున్నను మగచూపులో మార్పుకల్గుట సిద్ధాంతము. ఆడుదాని కంఠరవము ననుకరింపఁదలఁచి విశాలమైన గంభీరమైన తన గొంతును సన్నపఱచుకొని కుదించుకొనిన మగవానికి సహజలలిత మధురమృదులమగు స్త్రీకంఠము రాకున్నను మగగొంతు చెడుట నిశ్చయము. అట్లేసిగ్గుపడిన యాడుదానిబుగ్గ యెఱుపులు, కంటి వ్రాలుటలు, తలయోరలు, మొగపుఁ దళుకులు, నొడలి ముడుపులు సంతతము ననుకరింపఁదలఁచి ప్రయత్నించిన మగవానికి లలనాజన సహజిలజ్ఞా సౌభాగ్య లీలాకలాపము పట్టుపడదు. కాని మగయొడలిపొంకములు థ్వస్తములగుట తప్పదు.

మనసే సర్వసృష్టికిఁ గారణమని పెద్దలనిన మాటలో సత్యము లేకపోలేదు. చూడవల యును జూడవలయున నని మనస్సు వాంఛించుట చేతనే కదా శరీరమునకుఁ గన్నులు కలిగినవి! తినవలయును తినవలయునవి సంతతవాంఛ కలుగటచేతనే కదా శరీరమునకు నోరు వచ్చినది! ప్రాతిపదికమగు జంతువున కివి యేమియు లేవుకదా! తరువాత మనస్సు లోని సంచలనములవలననే కదా దేహమున కవయవవైవిధ్యము కలిగినది. మనఃప్రవృత్తులు శరీరమందలి మార్పుల కెట్లు కారణములో, సంతతాభ్యాసమున దేహమునందు కలిగించు కొన్ని మార్పులు మనస్సులో మార్పుల నెందులకుఁ గలుగఁజేయఁగూడదు? నుదుట బూసికొన్న విభూతిరేఖ శివదర్శనమునకై బుద్దిపుట్టించు చున్నది. ఒడలిపై ధరించిన మల్లెదండ బోగమువీధికై మనస్సును లాగుచున్నది. యోగశాస్తానుసారము దేహమున కిన్ని ముద్రలు, నాసనలు, కఠినములగు గరిడీపద్దతులు నేల కలిగినవి? మనశ్చాంచల్యనివృత్తికే కదా! ఐహికతుచ్చ వాంఛాలంపటతను వీడి వైరాగ్య జ్ఞానసంపత్తిని మనన్సు గ్రహించుటకే కదా! దేహపరిణామ భేదములు చిత్తవృత్తులలో మార్పులు కలుగఁజేయకుండు నెడలం బాతంజల యోగశాస్త్ర మంతయు బారిశుద్ద్యసంఘమువారి బండితుక్కువలె బరశురామ ప్రీతి కర్దమేకాదా? దేహములోని మార్పులు మనన్సులో మార్పులు కలుగఁజేయక యెట్టుండ గలవు? తా నాడు దాననని యనుకొని యనుకొని, పరపాత్రచే నాడుదివలె సంబోధింపఁ జేసికొని, యూడుదాని పోడుములు తెచ్చిపెట్టుకొని, యాండుదానివలెఁ జూచి, మాటలాడి, తక్కి, తారి, యిగిలించి, త్రిప్పకొని యేడ్చిన మగవాని దేహములో సంతతాభ్యాసమువలనం గలిగిన మార్పు లాతని మనస్సులోఁ దదనుగుణములగు మార్పులను గలుగఁ జేయక తప్పదు. అందుచేత నాడుదాని మనస్తత్త్వ మాతనికి రాదుకాని మగవాని మనస్తత్త్వము మట్టిలోఁగలసినదనుట నిశ్చయము.

నాయనుభవములోనున్న యొకచిన్నయంశమును జెప్పెదను. నేనొకరోజున వీథిగు మ్మములో నిలువబడితిని. ఆవీథి నప్ప డొక్క స్త్రీపాత్రధారి బజాలులోఁ గొనినకూర లంగవస్త్రమున మూటగట్టు కొని యామూటఁ జేతితోఁ బట్టుకొని, యొడలిపైఁ జొక్కాలేకుండ గట్టుకొన్న బట్టతో మాత్రమే యింటికిఁ బోవుచుండెను. ఆతని నే నెఱుఁగుదును. ఆతడు జన్మమున నాడారివాఁడు కాని పది సంవత్సరములనుండి స్త్రీ పాత్రముల ధరించుచున్నాడు. ఇంతలో నాతని కెదురుగ నొక పెద్దమనుష్యుడు వచ్చుచుం డెను ఆతడొకనాటక సంఘమున కధికారి. ఆతనిఁ జూచుటతోడనే యీమందభాగ్యు డట్లెసిగ్గుపడి, యట్టెముడుచుకొని, మూటగట్టిగా మిగిలినయంగవస్త్రపుఁ గొసను రవంత సైటగ వేసికొనబోయి యది చాలకపోవుటచేఁ తహతహపడి రెండుచేతులను గత్తెరమాదిరిగ ఱొమ్ముపై వైచుకొని తలవంచుకొని నిలువంబడినాఁడు. ఆహా! అత డెంతలో మగరూపమును మన్నుచేసి కొవనినాడో యని నా కెంతయైన జాలికలిగినది.

ఎంతకాల మలవలచుకొన్నను స్త్రీపాత్రధారి కాడుదానిబహిరంత స్తత్త్వములు రావు కాని మగతత్త్వము భగ్నమగుట నిస్సందేహము. అందుచే నిప్ప డాంతం డెట్టివాఁడు? మగతనము చెడినవాడు. ఆడుది కానివాడు. ఆతడు పూర్తిగా నాడుదియే యైనయడల నేమో మనతోపాటు తానుగూడ నుండియే యుండును. ఇంటిలో వంటకుఁ బెంటుకు మనకుఁ జేదోడుగ నుండియే యుండును. అటుకాక యిటుకాక యిప్పడాతడు నడుమ నూగులొడుటచేత గిజగిజ లాడుచున్నాము. ఆతం డాండుది కాని హేతువుచేఁ జేపట్టునా? మగతనము మాసిపోవుటచే వదలిపెట్టనా? అడుగంటిన యనురాగము లడుగంటనే యంటడినవి. పోనీ! ఏలాగుననో సృష్టితంత్రమే జరుగుటకైయే యెడమొగము పెడమొగముగనో సంసారములో శేషభాగ మీడ్చివేయుదమని సిద్దపడిన యెడల మాకింకఁ బుట్టందలంచిన పిల్లలమాటు యేమి? మగవాఁడు కాకుండ నాడుది కాకుండ నడుమనున్న సంకరస్వరూపములను గనివారి నేడ్పించి మే మేడ్చుటకంటెఁ బడుగకది కొక్కనమస్కార మర్పించి వంటయింటన్లోఁ బ్రత్తిబుట్టముందో, సీతానగరములో నుపన్యాసపీఠమందో తనువు వెడలబుచ్చుకొనుట సర్వశ్రేయము కాదా? ఇప్పటి పరిస్థితులలో భారతదేశ మెట్టి కొడుకులను గనవలయునో యొవ రెఱుఁగరు? ఇనుపకండలవారిని, దేశభక్తులైనవారిని, విద్యాశాలులైనవారిని మన మిప్పడు కనవలసియున్నది కాని లంగా కట్టుకొని నాట్యమాడు మగరంభను, గోవులపంచెక ట్టుకొను పోతువితంతువును మన మిప్పడు కనవచ్చునా? ఇప్పడున్న స్త్రీపాత్రధారులు చాలరా? అదిగాక జన్మముచే నాడారిపెద్దమ్మ లెందఱున్నారో? వీరుచాలక, యిఁక నిట్టి యర్దపురుషసృష్టికి మనము పూనుకొనుట బుద్దిహీనత కదా? దేహద్రోహము కాదా?

"నీ వాఁడువేసము వేసితిని కావున నీతో నేను గాఁపుర మొనర్చ • నని స్పష్టముగ నేను నాభర్తతో-అదే అర్దభర్తతో-ఆడుమగనితోఁ జెప్పితిని–'నేనిప్పడే వైచితినా? ఆఱుమా సములనుండి వేయుచున్నా" నని యాతండు వెకవెకలాడెను. సోదరీమణులారా! చూచితిరా! ఆతని దుర్నయము! ఆతని దురాగతము! తాను జెడనే చెడినాఁడు; జాతిని సంకరపఱచుటకుగూడ సంకల్పించుకొనినాడు. ఇది నీకు నీతిగాదని మనము మందలింపబోగ మనలను బరాభవించుచున్నాడు. ఇంతకంటె నాడుదానికి విచారణ కారణమేమి యుండగలదు? ఇది మనము సహించి, నోరుమూసికొవని పడియుండవలసిన దేనా? నే నట్టినీచత కంగీకరింపను. విద్యావతులు, మానవతులు, దేశభక్తి యుక్తలైన నా సోదరీమణులందఱు నాయభిప్రాయముతో నేకీభవింతురని నమ్మియున్నాను. ముందు జరిగింప వలసిన పని యొకటి యున్నది. ఆంధ్రదేశమున నున్న నాటకసంఘాధికారుల కందఱకు మన మొక్క యాజ్ఞాత్ర మంపవలసియున్నది. దానిలోని యంశము లిట్టుండవల యును.

‘‘మీరు మాభర్తలచే మీ నాటకములలో నాడువేసములను వేయించు చున్నారు. మగవాని కనర్హమైన స్త్రీపాత్ర ధారణము వలన వారు చెడిపోవుచున్నారు. వారట్టుపాడై జాతినిగూడ భ్రష్టసఆచుటకు సంకల్పించు కొనియున్నారు. వ్యక్తివినాశకమైన, జాతివినాశక మైన యీ కృత్యమును మీరు ప్రోత్సహింపఁ దగదు. కావున మా భర్తలను మీసంఘముల నుండి బహిష్కరింప వలయును. ఇంతటినుండి పురుషులచే స్త్రీవేషములను వేయింపమని మీరు శాసన మొసర్చు కొనవలయును. నాట్యకళాభివృద్ది మా కిష్టమే. స్త్రీలకే స్త్రీపాత్రము లిప్పించి మీ రాకళను బరిపోషించి, పరిపూర్ణకీర్తి నొందవలయును, నాగరికతగల యన్నిదే శము లందుఁగూడ నదియే పద్దతి. మీరు దానికి విరుద్దముగ నడువఁదగదు. సహేతుకమైన మా యాజ్ఞాపత్రమును మీరు సన్మానింప వలయును.”

ఇట్లు వ్రాసి స్త్రీలందఱుచే సంతకములు చేయించి వారికిఁ బంపవలయును. అటుపిమ్మటఁగూడ మనభర్తలు చీర రైక సొగసు చిత్తగించుట మానకపోవునెడల నింక నంతే-వారికి వారే, మనకు మనమే వారితో మనము పూర్తిగ విడిపోవలసినదే. రాజకీయ ప్రపంచమున Non-Co-operation యెట్టు పుట్టినదో శృంగార ప్రపంచమున నిప్పడు Non-Co-operation అట్టు పుట్టవలసియున్నది. మనకు జాతిపరిశుద్ది ప్రధానము కాని సంసారవృద్దికాదు. దేశసేవ ప్రధానము కాని భర్తసేవ కాదు. భారతదేశ సేవ ముందుఁబతిసేవ యెంత? మనకుఁ బతులు శాశ్వతులు కారు. వారికిష్టత తప్పినను బోవుదురు. మన కిష్టత తప్పినను బోవుదురు. కాక మృత్యువున కధీనులైపోవచ్చును కాని భారతదేశము శాశ్వతము! ఆమె యిప్పడు పుత్రపుత్రి కాసేవ నపేక్షించుచున్నది. పూర్వసౌభాగ్యము, నాగరకత, విజ్ఞానము, సంపత్తు, స్వాతంత్ర్యము, గౌరవము నశించుటచే దీనమై, శోభారహితమై, దాస్యశృంఖలానిబద్దమై పరితపించుచున్నది. శీతజ్వర మారికాది మహావ్యాధులచేతను, గూటికి గుడ్డకుకూడఁ గఆవైన దారిద్ర్యములచేతను, రక్తపాతములకుఁ గారణము లగు చున్న వర్ణవైషమ్యములచేతను జాతియంత యథాయధ లగుటవలన, నాకంటికొలికినీరు బంగాళాఖాతముగనా కంటికొలికినీరు పశ్చిమసముద్రముగ మహాసంక్షోభ మొందు భారతదే శమును సేవించి పూజించి మనతనువులు కృతార్ధము లగునట్టు చేసికొనవలయును-సు.స.

"భారతీపత్రికాధిపతీ! ఈకాంత వ్రాసిన సాహసపు వ్రాంతలలో నొకటి రెండశములు నేను విమర్శింపవలసియున్నది. ఆవిమర్శనము త్వరలోఁ బంపెదను. ఆశ్వయుజమాసమునఁ బ్రకటింపఁబడు భారతిలో దానివి బ్రకటింపఁగోరుచున్నాను.

చిత్తగింపుఁడు,

పా. ల. నరసింహారావు.

('భారతి" నుండి పునర్ముద్రితము).