సాక్షి మూడవ సంపుటం/ఉన్మత్తుని యుపన్యాసము

7. ఉన్మత్తుని యుపన్యాసము

జంఘాలశాస్త్రి విశాఖపట్నం వెళ్లి పిచ్చి ఆసుపత్రికి వెళ్లాడు. పిచ్చివాళ్ల మాటల ధోరణి వినడం అతనికి ఇష్టం. పూర్వం స్త్రీపురుష సౌందర్యం గురించి, పరిణామక్రమం గురించీ తనతో మాట్లాడిన పిచ్చిమనిషి వుంటాడేమోనని అతనుంచిన కొట్టు దగ్గరకు వెళ్లాడు. అతను లేడుగాని మరొకాయన వున్నాడు. ఆయన తను కూర్చుండే తాటాకు చాపలో ఆకుల్ని చీలుస్తున్నాడు. జంఘాలశాస్త్రి ఎందుకలా చేస్తున్నారని ప్రశ్నించాడు.

‘సృష్టిలో ఉన్న ఒక్కొక్కడి ఆకు ఇలా చింపుతున్నానని-ఉపన్యాసం ప్రారంభించాడు. సృష్టి పనికిమాలినదనీ, అర్థంలేనిదనీ, నశించడమే మంచి దనీ ప్రకటంచాడు. సృష్టికర్తను గురించి తెలియకపోవడమే జ్ఞానమని నిర్వచిం చాడు. ఇక్కడ పాతవిభేదాల స్థానంలో కొత్తతరహా మానవ విభేదాలు తలెత్తడం ఒక్కటే విశేషమన్నాడు. మనుషుల రెండు నాల్కల ధోరణిని విమర్శించాడు. ప్రతివారూ ప్రేమతత్త్వాన్ని, సామరస్యాన్నీ వేదికలెక్కి ప్రబోధించేవారే -క్రియకు వచ్చేసరికి అంతాదోంగలే, దేశభక్తుల పేరిట చెలామణీ అయిపోతున్న వారి రంగుల్ని ఎండగట్టాడు. నిజమైన దేశభక్తి అంటే దేశీయ దేవతల్ని ఆరాధించడం, దేశీయ ఋషులు బోధించిన వేదాలననుసరించి కర్మ చేయడం దేశీయ జనాన్నేకాదు, సర్వభూతాలను తనతో సమానంగా చూసేవాడే దేశభక్తుడని నిర్వచించాడు. శాంతి, సహనం లేకుండా ఎవడికి వాడే నాయకుడనుకునే వాడే కద! అని ఈసడించాడు-

జంఘాలశాస్త్రి ఆయన మాటల తీరుచూసి ఆశ్చర్యపోయాడు. ఆయన, తనుపిచ్చివాణ్ణి కాదనీ, మేనబావను చూడ్డానికి ఇక్కడకువచ్చి -అతను తప్పించుకుపోగా, గత పద్దెనిమిది నెలలుగా ఇక్కడే వుంటున్నానని చెప్పాడు. వీలైతే ఈ 'చెర’ నుంచి విడిపించ మన్నాడు.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను.

నాయనలారా! మొన్న విశాఖపట్టణమునకుఁ బోయి యచ్చటి పిచ్చి యాసుపత్రిలోని కేగితిని. నాకుఁ బిచ్చివారిమాటలను వినుట కెంతయో కుతూహలమగుటచే నచ్చటికిఁ బోయితిని. పూర్వమునఁ బురుష సౌందర్యమునుగూర్చి, సృష్టిపరిణామ క్రమమునుగూర్చి యుపన్యసించిన యున్మత్తునిఁ జూచుటకై యాతని కొట్టునొద్దకుఁ బోయితిని. ఆత డేమయ్యెనోకాని కానఁబడలేదు. కాని యాతనివంటివాఁడే యొక్కఁడా కొట్టులోఁగూరు చుండి యాస్తరణముగ నున్న తాటియాకు చాప యాకులను దీసి చీల్చుచున్నాడు. అయ్యా! యని యాతనిఁ బిలిచితిని. తన పైకెత్తి నాల్క రవంత కఱచికొని తిరుగఁ దల వంచుకొని యాకులను జీల్చుచుండెను. అయ్యా! యని మరియొకసారి పిలిచితిని. ఇంతలో నొకభటుఁ డేమూలనుండియో వచ్చి “ఎవ రక్కడ పిచ్చివానితో మాటలాడుచుంటివా? పో! ఆవలికిఁ బొమ్మని నన్ను గద్దించెను. ఆతనిచేతిలో నాలుగణా లుంచి, "రవంతసేపు వినోదమునం గాలక్షేపము చేయుదును క్షమింపు" మని యాతని వేడుకొంటిని. “సరే. అట్టేసే పుండుటకు వీలులే" దని చెప్పి యాతం డావలికిఁ బోయెను. "అయ్యా" యని పిచ్చివానిని బిల్చితిని. ఆతఁడు మాటలాడలేదు. సరికాదా, ఈసారి తలయెత్తనైన లేదు. “అయ్యా! తాటియాకు లట్టు చీల్చుచుంటి వెందుల" కని నే నంటిని.

పిచ్చివాని సంభాషణము

“సృష్టిలోనున్న యొక్కొక్కనియా కిట్టు చింపుచున్నాను. ఈ సృష్టినంత నాశమొన ర్చుటయే మంచిది. సృష్టి పనికిమాలిన సృష్టి, అర్ధము లేనిసృష్టి, నశించుటయే సమంజ సము. దీనిలో నొక యుద్దేశమున్నదా? నీతి యున్నదా? శాసనమున్నదా? ప్రేమయు న్నదా? ఒక క్రమమైన నున్నదా? మనఋషు లే మని చెప్పిరో వింటివా? సత్తులేదు, అసత్తులేదు. చావులేదు, శాశ్వతత్వము లేదు. పగలు లేదు, రాత్రిలేదు, ఒక్కటియే యున్నది. అది తనంత తానే యున్నది. దానికంటె వేరు లేదు. ఉన్న దనున దేదో దానినుండియే వచ్చినది. ఇట్లెందులకు వచ్చెనో దానికే తెలయును. అదికూడ నెఱుంగు నని చెప్పవలనుపడదు. ఇక్కడకు సృష్టికర్తస్థితి యెట్టున్నది? జ్ఞానమున్నది, లేదు. Will ఉన్నది, లేదు. ఉనికి యున్నది, లేదు. తననుండి సృష్టికలిగిన దనుసంగతి యని యెఱుఁగును, ఎఱుఁగదు. ఇట్టి తత్త్వమని మనఋషులు స్థిరపఱచినారు. ఇది తెలియుటా, తెలియకపోవుటా? తెలియుట కాదు, తెలియకపోవుట కాదు. తెలియకపోవుట, తెలియుట యనంగా నిదియే. సృష్టికర్తను గూర్చి యెఱుఁగకపోవుటయే జ్ఞానము. ఎఱుఁగుట యజ్ఞా నము. ఇవి మహావాక్యము లని మనవా రెల్ల రంగీకరించినారు. సృష్టిప్రారంభము నుండి యిప్పటివఱ కిట్టి మహోత్కృష్ట వాక్యములు పుట్టలేదు. ప్రథమ కారణమునుగూర్చి పాశ్చాత్యప్రకృత్యాది శాస్త్రములన్నియు దప్పులుచేసి దిద్దుకొని, తిరుగఁ దప్పులుచేసి మరల దిద్దుకొని, తుట్టతుద కీమహావాక్యములే సత్యము లని యంగీకరించు చున్నవి. అవి యంగీక రించుటచే మనకు ఘనత యున్న దని నేను జెప్పుటలేదు. కాని మనమహావాక్యముల ననుసరించియే మనవారిలో నూటికిఁ దొంబదుగురవఱకు నడచుచుండుటచే మనకు మహాఘనత వచ్చుచున్న దని చెప్పవలసి వచ్చినది.

మన కాప్రథమకారణమువలెనే జ్ఞానమున్నది, లేదు. ఉద్దేశమున్నది, లేదు. బుద్దియున్నది, లేదు. Will ఉన్నది, లేదు. పనిచేయుచున్నాము, చేయుచుండుట లేదు.

వర్ణవిభాగ మంత పనికిమాలిన యేర్పాటు లే దనియు, భారతీయుల బానిసతనమునకుఁ బ్రధానకారణ మదియే యనియు, నిట్టి యసందర్భమైన, యసహజ మైన, యపకారమైన బంధము లేని యితర దేశీయులు స్వతంత్రులై, జ్ఞానసంపన్నులై, సౌఖ్యవంతులై సర్వజనసములై కాలక్షేపము చేయుచున్నారనియు, నిది మనచేతి కరదండ ములుగ, గాళ్ళకు సంకెలగ, గంటికి గంతలుగ, మనస్సునకు దిగపీకుడుగ నుండుటచే మన మొదుగు బొదుగులేక, శరీరమున నల్పులమై, జ్ఞానమున నంధులమై, కార్యమునఁ గాతరులమై, చిత్తమున బానిసలమై యున్నామనియు, నీపిశాచమునుండి యెంతత్వరగ విముక్తినొందుదుమో యంతత్వరలో మనకు సమస్తజనసోదరత్వమే కాక, సర్వజీవసోదరత్వ మును గ్రహింపఁ గల్గుదు మనియు, నట్టాచరించుటకుఁ దగిన వీర్యము, వెన్నెముక, విదగ్ధత కలవారమగుదుమనియు, మనదేశమునకు, మనజాతికీ యథార్థముగ మనుజజన్మమునకుఁ గూడ లాఘవకరమైన, లజ్ఞాకరమైన యీ “నన్ను ముట్టుకొనకుఁదనపు", బుద్ధిహీనపుపశు ప్రాయపు టేర్పాటెప్పుడు పరశురామప్రీతి యగునో యప్పడే మనకు జాత్యైక్యము సంభవిం చుననియు, జాత్యైక్యముతో శరీరపాటవము; శరీరపాటవముతో సౌఖ్యసంపదయు; సౌఖ్యసంపదతోఁ జిత్తవికాసము; చిత్తవికాసముతో బుద్ది స్థైర్యము; బుద్ది స్థైర్యముతో నాత్మస్వాతం త్ర్యము సిద్దించు ననియు మన ముపన్యాస పీఠములపై సింహగర్జనము లొనరించుచుండుట లేదా? ఇట్లు జాత్యైక్యసమారిజనసంరంభ మొకవంక జరుగుచునే యున్నది. వేరొకవంక, తూర్పు మంగళ్లకొక్క కాన్పరెన్సు, పడమటి మంగళ్ల కొక్క కాన్పరెన్సు, వ్యాసరాయమఠ స్థుల కొక్కటి, కాసలనాటి వారికొక్కటి, వేంగినాటివారి కొక్కటి, మెరవీథి తెలగాల కొకటి, పల్లపువీథి తెలగాల కొకటి, సపాదవైష్ణవుల కొక్కటి, నిష్పాదవైష్ణవుల కొక్కటి, పెదమాలపల్లి యాదిద్రావిడుల కొకటి, చినమాలపల్లి యాదిద్రావిడుల కొక్కటి జరుగుచునే యున్నవి. ఒక తెకవారి కట్టుపాటులు వేరొక్క తెగవారి కనిష్టములు పరిపూర్తిగ ననిష్టములు.

గీ.

తెల్లరసుద్దకు మరి విభూతికి బడదు
సుద్దముక్కల రెంటికిఁ జుక్కయెదురు
పగిలిన విభూతిపండులోఁ బ్రబలతమము
లైనతెగల రెంటికిని షష్ఠాష్టకంబు
బొగ్గుదారి బొగ్గుది సుద్దబూడిదలకు
దాని కెప్పడు నైధనతారవరుస
అరవలకు నాంధ్రులకు గ్రుద్దులాటధాటి
పైఁగ బ్రాహ్మణాబ్రాహ్మణభండనంబు.

సభావేదికలపై సామరస్యము, గృహాంతరముల గ్రుద్దులాట, పలుకులలో మిత్రత, పనిలో శత్రుత, బోధనములో భూతదయ, ఆచరణలోఁ గత్తికోఁత.

(ఆతఁడొక్క త్రుటికాల మాఁగి గొంతు సవరించుకొని నావంకఁ జూచెను. ఈతఁడు పిచ్చివాఁడువలె మాటలాడుట లేదే యని నేను మనస్సున ననుకొంటని. ఆంతలో నాతండు తిరుగ నారంభించినాఁడు.)

ఇంతటితో సరిపోయినదా: ఊహుఁ మరియొకచోట నె ట్లుపన్యసించుచున్నారు? 'బెడ్డవ్రేట్లను సహించి రేగుచెట్టు మనకుఁ దీయని ఫలము లిచ్చుచున్నవి. పట్టులేక గాలిలో సర్వశ్రమములం బొంది యల్లాడుచు మేఘములు మనకు సుధాసన్నిభము లైననీరము లిచ్చుచున్నవి. కత్తికోఁతను సహించుచు మేకలు మన కాహార మిచ్చుచున్నది. తమగడ్డి తాము దినుచు గోవులు మనకు గుంభవృష్టిగ మధుమధుర క్షీరముల నిచ్చుచున్నవి. పేడచేఁ బెంటచే సంతుష్టినొంది సమస్తధాన్యసమృద్దిని సర్వం సహాదేవి సమకూర్చుచున్నది. పశువులు సైతము ప్రాణహీనములగువస్తువులు సైతము స్వార్ధపరిత్యాగ మాచరించి పదార్ధసంవిధాన మొనర్చుచున్నవి. ప్రేమతత్త్వమే సృష్టికి మూలాధారమైయున్నది. ఎక్కడఁ జూచిన బ్రేమ. ఎక్కడఁజూచినఁ బ్రేమ. గ్రహములందుఁ బ్రేమ. నక్షత్రములందు బ్రేమ. అంతరి క్షమునఁ బ్రేమ. గాలిలోఁ బ్రేమ. నీళ్లలో బ్రేమ. భూమిలోఁ బ్రేమ. ప్రపంచమునందలి ప్రతిపరమాణువునందునఁ బ్రేమ. పరమేశ్వరుఁడు ప్రేమస్వరూపుఁడు. ఆతని స్వరూప మున సృష్టినందిన మనుజుఁడు ప్రేమస్వరూపుఁడనుట కేమైన సందేహమా? బుద్దుఁ డెట్టివాఁడు? ఏసుక్రీసైట్టివాఁడు? రామానుజుఁ డెట్టివాఁడు? చైతన్యఁ డెట్టివాఁడు? ఇట్టి ప్రేమైకనిధానములైన మహానుభావు లవతరించిన భారతభూమి ప్రేమరససిక్తమై, ప్రేమరసా ద్రమై, ప్రేమరసైకనిధానమై ప్రకాశించుచున్న దనంగా నాశ్చర్యమేమి? ప్రేమరసవాహినులచే భారతదేశ మంతయుఁ జల్లనై యున్నదనఁగ వింత యేమున్నది? పైనిమంచు కొండల బారువలనఁ గలిగిన చలువ, మూఁడు ప్రక్కలగూడ నావరించినమున్నీటి చలువ, గంగతల్లి మొదలు కావేరమ్మవరకు నడుమనున్న పవిత్రనదుల చలువ, శ్రీకృష్టవిరహమున గౌరాంగుండు వర్షించినయశ్రుధారల చలువ, బుద్దదేవుని ప్రేమమతపుఁ జలువ, పుట్టతేనెతోఁ గలిపిన శ్రీరామనామామృతపుఁ జలువ, మహర్షులదయాదృష్టులచలువయుఁ గలిగిన భారత దేశమునఁ దీవ్రత కెక్కడనైనఁ దావున్నదా? కఠినత్వమున కెక్కడనైన నవకాశమున్నదా? క్రూరత్వమున కేమైన నెడమున్నదా? హింస కెక్కడనైనఁ జోటున్నదా? మనకాలిక్రింద నడగిపోవు పురుగునకు మనకుఁ దత్త్వమున భేదమేమైన నున్నదా? నిన్ను నీవెట్టుప్రేమించు కొనుచున్నావో, నీతో డిమానవులనందఱ నట్టు ప్రేమింప వలయును గాదా? మానవులకంటె భిన్నములైన జంతువులగూడ నీవట్లే ప్రేమింపవలయును గాదా? పరుడని నీవనుకొను చున్న ప్రతి ప్రాణియుం గూడ యథార్థముగ నీవే. కావునఁ దలంపులోఁగాని, మాటలోగాని, చర్యలోఁగాని యెవ్వరికిఁ గూడ నీవలన నపకారము జరుగఁగూడదు. పరకష్టమాత్మకష్టము. పరదుఃఖ మాత్మదుఃఖము. పరహింస యాత్మహింస. పరత్వ మనునది యథార్థముగ నాత్మత్వమే కాని వేరు కాదే? సూర్యుఁడు దాను గర్భానలజ్వాలాజాలముచే మండి పోవుచుఁ బ్రపంచమున కారోగ్యమును బ్రాసాదించునట్టు సర్వకష్టనిష్ఠుర తల కోర్చి జనోపకార మాచరింపుము.

ఇట్టిమాటలు సభావేదికలపై బలుకువా రొకరా, యిద్దరా? కాదు, వేలు. ఆమోదించు వారు శిరఃకంపనమొనర్చువారు, నెట్టి యాచరణమునకైన శపథము లొనర్చువారు లక్షలు. ఏదీ, తుదకు ఫలమేమి? ఏమున్నది? ఆలుమగల తిట్లు; తన్నులు; తండ్రికొడుకుల త్రోపులాటలు, తాపులాటలు; అన్నదమ్ముల యర్ధచంద్రప్రయోగములు, విషప్రయోగములు; అత్తకోడండ్ర గ్రుద్దులాటలు, కూపపతనములు; తోడికోడండ్ర యట్లకర్ర వ్రేటులు, రోఁకలిపోటులు; శ్వశురజామాతలచీకొట్టుటలు, చెంప పెట్టులు. ఒక్కకుటుంబములోని వారిప్రేమమే యిట్లు వెలిఁగిపోవుచుండఁగ నింకఁ బరులపై ప్రేమ మెట్టులున్నదో వేఱు చెప్పవలయునా? కన్నపుదొంగతనములు, కొంపలఁ గాల్చుటలు, తలఁగొట్టుటలు, స్త్రీలం జెఱపుటలు, న్యాయసభలో వ్యాజ్యెములు, చార్టీలు, కారాగృహవాసములు, ఉరిశిక్షలు -ఇవిగాక భూమిమీఁద యుద్ధములు, నీటిలో యుద్ధములు, గాలిలో యుద్ధములు. పరుని యెడ నొక కఠినవాక్యమైనఁబలుకదగదని నోటఁ బలుకుచున్నాము. పరరాష్ట్రమునకైఫిరంగి చెవుల నిప్పంటించుచున్నాము. పరులసుఖములో మన సుఖ మున్నదని బోధించుచు న్నాము. పరప్రాణములు పొట్టం బెట్టుకొని సుఖించు చున్నాము. అనేక పుణ్యనదులచేఁ జలువయెక్కిన మనదేశమందు దీవ్రత కవకాశము లేదని నోటఁ బలుకుచున్నాము. జాతివైషమ్యములచేఁ బరులకొంపల గాల్చి పరుల వేడినెత్తుటిచే మాతృభూమినిఁ దడిపి మహానదుల నపవిత్ర మొనర్చుచున్నాము. మనకు బుద్దియున్నదా, లేదా? ఉన్నది-లేదు. ఆలాపములలో బుద్ది, ఉద్యోగరంగమున బుద్దిహీనత. కూపములేని కుగ్రామ మున్నది. కోమటిదుకారణము లేని కుగ్రామ మున్నది. బ్రాహ్మణ బ్రువుఁడైనలేని కుగ్రామమున్నది. దేశభక్తులులేని కుగ్రామమున్నదా? లేదు. లేనేలేదు. గతించిన దుష్టకాలములో నాలుగుశతాబ్ద ములకో, పదిశతాబ్దములకో యెవ్వండో యొక దేశభక్తుఁడు కాలానుసరణముగ నుదయించుట, కొంతకాలము నిశ్శబ్దముగ నిరాడంబరముగ నిశ్చలముగ నిరుపద్రవదీక్షతో వ్యత్యస్త పరిస్థితులను సరిచేయుట, ప్రజాహిత మాచరించుట, దేవసేవామార్గమును గానంబఱచుట, తిరోధానమగుట జరుగుచుండెడిది. ఇప్పడటులా? ఏమి విచిత్రకాలము? ఎనిమిదిసంవత్స రములలోపల నీ భారతవర్షమున బయలుదేరిన దేశభక్తులసంఖ్య మిగిలిన సర్వప్రపంచమందు నెనిమిది వేలసంవత్సరకాలములోఁ గలిగిన దేశభక్తుల సంఖ్యకంటె నెన్నిమడుగులో హెచ్చని భావింపవలసినట్టున్నది. అసాధారణమైన, యాశ్చర్యకరమైన, యద్వితీయమైన యీయభి వృద్ది యారోగ్యలక్షణమా, యామయలక్షణమా? కండల పెటపెటయా, క్రొవ్వు తవత వయా? నరములసౌరా, నంజునీరా? ఓయేమియు పన్యాసముల ఝాంకారములు! యేమి యుద్బోధనలయహంకారములు! సర్వభూత సమత్వమునుగూర్చి, స్వార్థపరిత్యాగమును గూర్చి, శాంతినిగూర్చి, నిర్మలాంతఃకరణమును గూర్చి, నియతేంద్రియత్వమునుగూర్చి, దేశభక్తిని గూర్చి దేవభక్తిని గూర్చి యేమి వావదూకతావైభవము. తిట్టు దీవనచే నడఁగుననియుఁ, గొట్టు పెట్టుచే శాంతించుననియుఁ, గత్తివ్రేటు కౌఁగిలిచేఁ బోవుననియు, శత్రుత్వము మిత్రత్వముచే సడలు ననియుం, నెట్టియెట్టిమాట లాడుచున్నారు? ఆహాహా! బుద్దదేవుం డాడదగినమాటలే? రామానుజ డాడదగినమాటలే? దేశోద్దరణమును సంకల్పించుకొనిన మీరు వట్టిమాటలతోఁ గృతార్డులు కాఁగలరా? మాటల కనుగుణమైన తత్త్వము మీలో నున్నదో లేదో పరిశీలించుకొంటిరా? ఆధ్యాత్మికవిద్యలో నేమంతఁ గృషిచేసినారని మీరు దేశభక్తులని పించుకొనుచున్నారు? ఆధ్యాత్మిక విద్యదాఁక నెందులకు? ఐహికవిద్యలో మీరేమంత పరిచితి కలవారో యోజించుకొనరాదా? నాల్గవతరగతి పరీక్షలోఁ గృతార్థులు గాలేక దేశభక్తిలోఁబడినవారు కొందరు, పంచకావ్యపఠనములో సందుగొట్టుటచే దేశభక్తిలోఁబడినవారు కొందరు; పదిజమీందారీయాస్థానములను దిబ్బలుచేసి, నిలువఁజేసిన ధనము లక్షలకొద్ది మూల్గుచుండ నకస్మాత్తుగా స్వార్డపరిత్యాగులై దేశభక్తిలోఁ బడినవారు కొందరు, నేవిధముగాఁగూడఁ గీర్తి రాకుండ నున్నదని యేరక్షకభట నిర్భాగ్యునో పనిలేక కొట్టి శ్రీకృష్ణజన్మస్థానముఁ జేరి దేశభక్తిలోఁ బడినవారు కొందరు, నిట్టివారే కదా నూటికీ దొంబదుగురు దేశభక్తులు! పూర్వ మొనర్చిన జాతి ద్రోహములు, మిత్రద్రోహములు, దేశద్రోహములు, మతద్రోహములు, దైవద్రోహములు, ఖద్దరుటోపితో సమూలముగ నెగిరి పోయినవా? ఇంకను నిల్చియున్నవేమో? లోనికి దృష్టిని గాఢముగఁ బఱపి పరిశీలించుకొ నరా? మిమ్ము దేశభక్తులను జేసినది దేశీయవస్త్రధారణమేనా? అంతకంటె నేమైన నున్నదా? పంగనామములచే భాగవతోత్తముండవు కాగలవా? ఆనపకాయచే సన్న్యాసివి కాగలవా? ఖద్దరు నీయొడలిమీదనా యుండవలసినది? నీమనస్సులో నుండవలయును. నీమనశ్శాటిలోని పడుగు పేక స్వదీశీయ భావతంతువులతో నెప్పడు చేయబడినదో యప్పుడు నీవు దేశభక్తుఁడవగుదువు. తెఱచాపగుడ్డ మొలకు బిగించుట గాదు. వేదివిహిత కర్మములచే మనస్సును బిగింపవలెను. స్నానములేక, సంధ్యావందనము లేక కట్టుకొనిన బట్టయైన మార్పకుండ, బదునాల్గుసార్లు మూత్రము విడిచినగుడ్డతో నేడుగంటలైనఁగా కుండ నేగూడురులోనో, యేయేలూరులోనో యాకలి రవంతయైననాపలేక యాంగ్లేయ భోజనమందిరములలోని కల్లురొట్టితో కాఫీతోఁ గడుపు నిండించుకొనుచున్ననీవు దేశభక్తుఁ డవేనా? దేశభక్తున కుండవలసిన నియతేంద్రియత్వముమాట దేవుఁ డెరుంగును. ప్రప్రథమ సోపానమైన యాహారనియమమే నీకులేదే? తాటిపాకనవారు తలపాగబరువును మోయఁగలి గిన నీవు రవంతవ్యతిరేకపుమాట సహింపలేనపుడు తుల్యనిందా స్తుతుండగు దేశభక్తుడ వగుదువా? వదినెగారికి మనువృత్తి నీయవలసివచ్చు నని యెంచి యామె వ్యభిచరించిన దని యపవాదము కల్పించితివే. దేశభక్తుని కుండవలసిన సర్వప్రాణిసమత్వము మాట యటుంపుము. స్వబంధుభక్తియైన నీకున్నదా? ఇంతయేల? కల్లుపాకలనుండి కులటల గుడిసెలనుండి పవిత్రములగు రాట్నపుజెండాలతో వెలువడిన దేశభక్తు లెంద రున్నారో యెరుఁగుదురా? అట్టి వారిని జూచుటతోడనే దేహముచచ్చినది. దేశము చచ్చినది, భక్తి చచ్చిన దనవలయునుగాదా? దేశభక్తి యని తెగసాగెద రెందులకు? స్వార్థపరిత్యాగి దేశ భక్తుఁడు, మీరు చేయుచున్న పనులందు వేనిలో స్వార్థపరిత్యాగమున్నదో చెప్పుడు. తాడికాయ నిచ్చి తాటికాయలాగఁ జూచుచున్న మీకు స్వార్థపరిత్యాగమా? స్వార్థపరిత్యాగ మెంత వైరాగ్యము గలవానికి కలుగవలెను? ఒక్క వైరాగ్యమే కాదు. ఎంత యధ్యాత్మికజ్ఞాన మున్నవానికి కలుగవలయును? తనకుఁ బరునకుఁ దత్త్వమున భేదము లేదనియు, భేదము మిథ్య, యేకత్వము సత్యమనియు నెఱంగి యనుభవములోనికిఁ దెచ్చుకొని యాచరించు వానికిఁ గాని స్వార్ధపరిత్యాగముకలుగునా? అట్టి మనస్స్థితి నీకు లభించువఱకు పరోపకార మని భ్రమపడి నీవు చేయుచున్నపను లన్నియు డాంబికములు డబ్బుదండుగలు.

దేశభక్తి దేశభక్తి యని యందువుకద, దేశమునకు ముక్కా, నోరా? తలయా? తోఁకయా? దేశము నారాధించుట ఎట్టు యెఱుఁగుదువా? దేశీయదేవతల నారాధిం చువాఁడు దేశభక్తుఁడు. దేశీయుల ఋషులనుండి యుద్బుద్దములైన వేదముల ననుసరించి కర్మముల నాచరించువాఁడు దేశభక్తుఁడు. దేశీయజనులనే గాక సర్వభూతములను తనతో సమానముగఁ జూచుకొనువాఁడు దేశభక్తుఁడు. తాను తన విద్య, తనబుద్ది, తనసర్వస్వము దేశీయజనసేవ కని త్రికరణశుద్దిగ నమ్మి ప్రతిఫలవాంఛాశూన్యండై ప్రజాసేవ యొున ర్చువాఁడు దేశభక్తుఁడు. అంతేకాని వచ్చినధనముతో సంతుష్టి లేక, సంభవించిన యాపద లలో శాంతి లేక, తెచ్చినబుణము లెగఁబెట్టుటకు జంకు లేక, సంభాపీఠమున నిలువఁ బడి యసత్యమును బలుకుటకు బిడియములేక, కర్మానుష్ఠానమున కోపిక లేక, త్యాగ మొనర్చుటకు బుద్ధిలేక, యధమాధమ వృత్తులు చేసికొని జీవించునయ్యలు, నమ్మలు మనఃపూర్వకముగ మృతమహానుభావుల నిధులకై యర్పించినధనముతో రైలుఖర్చులు, ఫలాహారపుఖర్చులుఁ బెట్టుకొని యీమూలనుండి యూమూలకు, నామూల నుండి మరి యొక మూలకుఁ బనిలేక తిరుగుటకు విసుగువిరామములేక యల్లలాడు నద్భుతతరపురుషు లగు మీరు దేశభక్తులగుదురా? మీరు బోధించుచున్న జాత్యైక్యముమాట ముందు చూచుకొనవచ్చును గాని మీలో మీ కేమాత్ర మైక్యమున్నదో సెలవిండు. ఒక్క తెగగా బయలుదేరిన దారుమాసములైనం గాకుండ రెండు తెలైనవిగదా? అవి యిప్పటికిఁ బదునాలుగైనవికదా? ఇంకొక పదునాల్గు చీలికలు పై సంవత్సరములోఁ గావని యెవరు చెప్పగలరు? క్రిందఁబడిన పాదరసపుబుడ్డివలె నిన్నిముక్కలైన మీరు వర్ణవిభాగమును మాన్పనుపన్యసించుచున్నారా? ముక్కలైన త్రాటితోఁ గట్టెలమోపుఁ గట్టవచ్చునా? మొన్న మొన్న విడిపోయిన తెగలను సవరించుకొన లేక యెన్ని వేల సంవత్సరములనుండియోయున్న వర్ణవిభేదములను మాన్పఁ బ్రయత్నించు చున్నారా? తలకుఁ దగని తలఁపులా? నోటికిఁ దగని మాటలా? చేతికిందగనిపనులా? చెప్పినమాటవినక నిల్లు విడనాడిపోయిన చంచలాక్షిమగఁడు ఆంధ్రపత్రికలో స్త్రీ వశ్యపుమందుఁ బ్రకటించునెడల మీరు వెకవెక లాడరా? అట్లే మిమ్ముఁ గాంచి పరులు వెకవెక లాడుదు రనుబుద్ధి మీకేల యుండక పోవలయును?

అదిగాక మీలో నెవ్వరైన సరే యొకని యగ్రయాయిత్వమున కంగీకరింతురా? ఏవ్యక్తికావ్యక్తియేగజ్జెకట్టి కలాపము వినిపింపవలయు ననుకుతూహలతతో నుండుటయే కాని యాతఁడు మననాయకుఁడు, ఆతని ననుసరించి మనము పోవుద మను శాంతిచిత్తత, సహనశీలత, మీలో నెవ్వని కున్నదో యొక్క నివ్రేలు మడఁచి చెప్పుఁడు? మీయేలుబడిలో ముందు దేశీయజనుల నుంచుకొనఁ దలఁచినవారు కదా? మీలో నొక్కఁడైన నొక్కనికి విధేయుఁడై ప్రవర్తింప లేకుండు నప్పుడు మీవలన మేము నేర్చుకొనవలసిన దేది? మీకు విధేయత లేనప్పుడు మావలన విధేయత మీ రెట్ల పేక్షింపఁగలరు? ఏలఁబడువాఁడే యేలికయ గుట కర్హుఁడు. విధేయతఁ జూపఁగలిగినవాఁడే యాజ్ఞనిచ్చుటకుం దగినవాఁడు. వినదఁదగినవాఁడే చెప్పఁదగినవాఁడు.

“ జంఘాలశాస్త్రి! నిన్నునే నెఱుఁగుదును. సాక్షి సంఘమున నీయుపన్యాసములు కొన్నిసార్లు నేను వింటిని ఇంత సేపటినుండి మాటలాడుచుంటిని గదా, నాయభిప్రాయము లతో నీవేకీభవింపక పోవచ్చును. కాని, నే నేమైన నున్మత్తుఁడు మాటలాడినట్లు మాటలాడి తినా” యని నన్నడిగెను. “నేను నందులకే యాశ్చర్యపడుచున్నాను. నీవిచ్చటికేల వచ్చితి" వని యాతని నడిగితిని. ఆతఁ డిట్లు చెప్పెను; “ఈ కొట్టులోఁ గొంతకాల ముండిన పిచ్చివాఁడు మామేనత్త కొడుకు వచ్చితిని. ఆతఁడు నన్నుఁ జూచి నాతోఁ గొన్ని యసందర్భపుమాటలాడి ' నీవిచ్చట! గొంత సేపు గూరుచుండుము. నేను జలస్పర్శమునకుఁ బోయివచ్చెద'నని పోయెను. ఒకగంట సేపు కూరుచుంటిని. ఆతఁడు రాలేదు. ఇంతలోఁ గారాగృహాధిపతి వచ్చి 'యింతరాత్రియైనను నీ వింక నిటనే కూరుచుంటి వేల' యని నా పైఁ దీండ్రించెను. 'అయ్యా! పిచ్చివాఁడు జలస్పర్శమునకుఁ బోయినాఁడు. నే నాతనిబావను. ఆతనికొఱకే చూచుచున్నా'నని కారాధీశునితోఁ జెప్పితిని. చేతిలోనున్న లాంతరు పైకెత్తి నామొగముఁ బరిశీలించి పిచ్చివాఁడు నా మేనత్త కొడు కగుటచేత నాతనిరూ పమునకు, నారూపమునకు భేద మెంతమాత్రమును లేకున్న కారణమున కొరడాతో నొక్క దెబ్బకొట్టి నన్నీ కొట్టులోనికిఁ ద్రోచి తలుపువైచినాఁడు. పదునెనిమిది మాసములనుండి యిచ్చటఁ బడియున్నాను. నే నెవ్వరితో నేమి చెప్పుకొన్నను లేశమైన వినియోగింపలేదు. వా కింతవఱకుఁ బిచ్చియెత్తలే దనుకొందును. ముం దేమగునో తెలియదు కాని మనుష్య జాతిమీఁద నాకుఁ గలిగిన యసహ్యత యింత యంత కాదు. గుణ గ్రహణమును మానివైచి యెంత సేపు దోషగ్రహణమే చేయుచు, మనుష్యులనెల్లఁ దిట్టుచుఁ గాలక్షేపముఁ జేయుచున్నాను. నీకుఁ జేతనగునెడల నాస్థితిని వెల్లడించి నన్నీ చెఱనుండి విడిపింపుము " అని చెప్పి యాతఁ డూరకుండెను.

హరిహరీ! పిచ్చివాఁ డైనమఱఁదిని జూచుట కితఁడు వచ్చుట యేమి, పిచ్చివాఁడు పారిపోవుట యేమి, పిచ్చిలేనివాని కీ కారాబంధన మేమి! ఏమిచిత్రము! కర్మమార్గము దుర్గ్రహము కదా?

ఓం శాంతిః శ్శాంతిః శ్శాంతిః