సాక్షి మూడవ సంపుటం/అస్పృశ్యత
14. అస్పృశ్యత
అంటరాని తనాన్ని గురించి ఎవరో పంపిన ఒక వ్యాసాన్ని సాక్షిసంఘానికి పంపారు. దానిని జంఘాలశాస్తి చదివి వినిపిస్తున్నాడు.
అస్పృశ్యత, చెప్పరానితనం-అనే రెండు లక్షణాలు ప్రపంచంలో ఏదేశంలోనూ లేవు. ఒక్క భారతదేశంలోనే వున్నాయి. భారతీయుల మనస్సులో వున్న రెండుకళ్లలోనూ రెండు పువ్వుల్లాగ వున్నాయి.
బ్రాహ్మణుడైనాసరే, అంటరానివాడైనా సరే, జ్ఞానసంపన్నుడైనవాడే తనకు గురువని శంకరాచార్యులవారు చెప్పారు. పూర్వ మహానుభావులందరుకూడా పంచముల్ని ముట్టుకుని, ముట్టుకున్నాడని సంతోషించి కృతార్డులయ్యారు. అంటరానితనం అనేది చండాలత్వంలో లేదు, భగవద్భక్తి విద్య, వున్న చండాలుడు పూజ్యుడే. పరమార్థజ్ఞానంలేని బ్రాహ్మణుడే అంటరాని వాడు.
అటువంటి పూజ్యులు ఇప్పడెక్కడ వున్నారనే ప్రశ్నవద్దు. అలాంటి చండాలురూ లేరు; బ్రాహ్మణులూ లేరు. అయితే, మీమొగాలకు తగిన చండాలురు ఇప్పడున్నారు. వారికి మీరేం చేస్తున్నారు? చండాలుర్ని అస్పృశ్యులుగా మనపూర్వులు భావించలేదు. బ్రాహ్మణుడెవరో చండాలుడెవరో, బుద్దుడు విభాగంచేసి చూపించాడు.
సహగమనం, వైధవ్యపాలనం, రజస్వవలానంతర వివాహం, సీమవెళ్లిన వారిని బహిష్కరించడం, దేవరన్యాయం - వంటి అన్యవసర ఆచారాలు పోయి నట్టే, అంటరాని తనం కూడా పోవాలి. పోయినవన్నీ బాహ్యాచారాలు. మతానికి ప్రధానాలు దయా, సత్య, శౌచాలు, స్వార్థ రాహిత్యం అనేవి. పంచములుచేసే చాకిరీ, వారుచేసే ఉత్పత్తులు పనికివచ్చి వారిని ముట్టుకో వడం పనికి రాదా! ఈ అస్పృశ్యత అవశ్యం నశించాలి-అని ఆ ఉత్తర సారాంశం.
జంఘాలశాస్త్రి యిట్లుపలికెను.
నాయనలారా! అంటరానితనమును గూర్చి యెవఁడో యొక యనామకుఁ డొక వ్యాసము వ్రాసి సాక్షిసభలోఁ జదువు మని పంపినాడు. దానిని జదువుట కనుమతి నీయవలయును. నేను శుత్రు లెఱింగిన వాఁడను కాను. స్మృతు లెఱుంగను. శాస్త్రములు చదువలేదు. (ఏమియుఁ జేతకాని వాడవుకదా, నీ కుపన్యాస మేల నోరు మూసికొని యుండలేకపోయి నావా అని సభలో గేకలు) ఈకాలమున నస్పృశ్యతను గూర్చి యందఱు చెప్పచుండఁగా నాకుగూడ బుద్ది పుట్టినది. (అంటరానితన మంటురోగమటయ్యా అని సభలో గేకలు) ప్రపంచమున నితరజాతు లన్నియు వారివారి వర్తక వ్యాపారములు, వ్యావహారికధర్మములు, రాజకీయ తంత్రములు, కళాభివృద్దిమార్గములు, ధనసంపాదనతంత్రములు నిర్వహించుకొ నుచుండఁగా మన మేమి చేయుచున్నాము? మన విద్యలను బైవారి కంటగట్టి, మన ధనమును బరులయొడిలోఁ బోసి, మన యాధిక్యమును మన్ను చేసికొని, మన ప్రభుత్వ మును బానిసతనము క్రింద మార్చుకొని, మనుష్య స్వరూపములతో మాత్రమే చచ్చినకంటె నెక్కువ హీనపు బ్రదుకును బ్రదుకుచు నీ యధమత్వములో నీయధమాధమత్వములో నీకంటె నే నెక్కువ యని నేను మడి యని నిన్ను మట్టుకొనిన నేనొడలు గోయించు కొనవలె వని, నేను మోక్షార్హుండ నని నీవు చెప్పరానివాడ వనియు, నితరజాతులు వినిపోదురేమో యని సిగ్గుబిడియములులేక, మానాభిమానములు మంటబెట్టి సభలలో వాదించుకొనుచున్నాము. పత్రికలలోఁ బ్రచురించుకొను చున్నాము. అన్నియుఁ బేండలోని పురుగులే యైనప్పడు, ప్రక్కనున్న పురుగుకంటె బైనున్న పురుగు ఘనత, గౌరవము, ప్రశస్త్యము, పరమయోగ్యత, యధికము లనవచ్చునా? అజ్ఞతములైన యర్చకులు సైతము నిట్టి యవాచ్య చర్యల కధీను లగుదురా?
అప్పృశ్యత, చెప్పరానితనము-ఈస్టితిమాత్రము ప్రపంచమందున్న దేశములలో నొక్క భారతదేశమునందు మాత్ర మున్నది. అమెరికాదేశస్థులుఁ నీగ్రోల నిట్లు హీనముగాఁ జూచుచున్నారని చెప్పదురు. కాని యింత పాపము, యింత ఘోరత, యింత మూర్బత, యింత క్రౌర్యము మనదేశమందే తక్క మఱి యొచ్చటను లేవు. అంటరాని తనము చెప్పరానితనము నను నీ రెండు మాటలు నొక్క భారతదేశ సారస్వతమునందే యున్నవి. ప్రబలమైన మన యజ్ఞానమున కివి ప్రచండ నిదర్శనములై యున్నవి. భారతీయుల మనస్సులలో నున్న రెండు కన్నులలోను నివియే రెండు పూవులైయున్నవి.
మనపూర్వు లెట్టివారో, మనదేశ మెట్టిదో యీ సందర్భమున రవంత చూచు కొనవల సియున్నది కాదా? లోకమున కంతకును జ్ఞానతేజస్సును ప్రసాదించినవారు మనపూర్వులు. తత్త్వజ్ఞానని శ్రేణికపై మనవా రెక్కిన యెత్తువఱకుఁ దల లెత్తిచూడలేక కన్నులు దిరిగిపోవం బాశ్చాత్యతాత్త్విక విద్వాంసులా నిచ్చెన యడుగు మెట్టదగ్గఱఁ గూల బడియున్నారు. ఒక్కకళయందు గాదు, ఒక్కశాస్త్రమందుఁ గాదు. అన్నిటియందు గూడ మన పూర్వులు పరమావధియైన పరమార్ధమును గనుఁగొనివారు. అత్యంత తపోనిష్టాగరిష్టతచే మనపూర్వు లగ్ని తేజస్సుతోఁ బ్రకాశించెడివా రగుటచేత వారంటరాని వారని చెప్పవ చ్చును. వారియోగ్యతను గూర్చి చెప్పినతరువాత, నానోటితోడనే యితర జాతులను గూర్చి చెప్పఁగూడదు. కావున వారు చెప్పరానివారైరి. అంటరాని చెప్పరాని మాటల కర్ణ మిది కాని మeటియొకటి కాదు.
అట్టివారి సంతతివార మైన మన మిప్ప డెట్లున్నాము? ఒకరు చెప్పనేల? మనకే తెలియును? లోకమున కంతకంటెఁ దెలియును. ‘విద్యావినయసంపన్నే బ్రాహ్మణేగని హస్తిని" అని శ్రీకృష్ణదేవులానతిచ్చినారు. బ్రహ్మజ్ఞానసంపన్నుఁడైన బ్రాహ్మణునికిని, నీచజంతు వైన కుక్కకును, దానిని దినుజండాలునకును బరమార్ధమున భేదము లేదని చెప్పినారు. అట్టిభేదముఁ జేయువాఁడు కుక్కకంటె నధముడు కాఁడా? కాలిక్రింద బ్రాఁకు చీమకును, గగనమున వెలుఁగొందు సూర్యునకును దత్త్వమున నెంతమాత్రము భేదము లేదని బుద్దదేవుఁ డానతిచ్చినాఁడు. ద్విజడైన సరే, చండాలుడైనను సరే యెవ్వఁడు జ్ఞానసంపన్నుఁడో వాఁడే నాకు గురుఁడని శంకరాచార్యులు సెలవిచ్చినారు.
ఇక చిత్రమైన సంగతి చెప్పెదను. పెరియనంబియు మార్నేరు నంబియు నను నిద్దఱు యామునాచార్యుల వారియొద్ద జదువుకొనినారు. మార్నేరునంబి పంచముఁడు- పెరియ నంబి బ్రాహ్మణుఁడు. ఇట్లుండఁ గొంతకాలమునకు మార్నేరునంబి కవసాన సమయము సిద్దించినది. అప్పడాయన పెరియనంబిగారి కిట్టు వార్తనంపినారు. యామునాచార్యభగవా నునక శేషత్వ మొందిన యీతనువును బ్రాకృతులు మట్టిలోగలుపుటకు నేనిష్టపడను. దేవరవారు నన్నుఁ గరుణించి నా యంత్య సంస్కారముల లాచరింపవలయు నని కోరు చున్నా నని వార్త నంపెను. ఆహాహా! ఇది యెంత యాశ్చర్యకరమైన విషయమో! వైష్ణవో త్తముడై బ్రహ్మజ్ఞానసంపన్నుఁ డైన యామునాచార్యశిఖామణి యేమి! ఒక పాదమునొద్ద బ్రాహ్మణుని, నొకపాదమువద్ద బంచముని గూరుచుండ బెట్టుకొని విద్యను బోధించుట యేమి! ఆహా! ఇది యిప్పడెంత విశేషాంశము! పొట్టపిందెవలె వంకరటింకరలు వోయినమన బుద్దులకు దేశమహాప్రారబ్దముచేత దిగజాఱి దిగజాఱి నేలములగ చెట్టునకు నిచ్చెన వేయవల సివచ్చిన మనబుద్దులకు-సర్వజాతి సామ్యము సర్వజనసోదరత్వము, స్వార్థపరతాశూన్యత, భూతదయయు జిరకాలపు బానిసతనముచేత నంతరించిపోయిన మనబుద్దులకు ఈయం శము విశేషాంశముగఁగనబడదా! యామునాచార్యులవారు మార్నేరునంబిగారికి బాలబో ధము చెప్పినారా? బ్రహ్మసూత్రభాష్యము బోధించినారు. ఆనంద వాచకపుస్తకము చెప్పి నారా! ఆత్మజిజ్ఞాసాశాస్త్ర ముపదేశించినారే. ఇది యప్పటిదినములలో సామాన్యవిషయమే.
అప్పటిస్థితికి నిప్పటిస్థితికి నెంత యేతపుబెట్టుగా నున్నదో చెప్పవలయునా? మహాగౌరవముతో వంశపారంపర్యముగఁ బోషింపబడుచున్న వైదిక విద్యాంసుఁడు తన మహారాజునొద్దసైత మొక్క వేదవాక్యమైన వచింపఁడే జపతపములులేని చదువు సందెలులేని మంచిచెడ్డలులేని ముండమోపి మిండడైన యేబాపనశుంఠ నైనను దగ్గఱఁ బెట్టుకొని యానిర్భాగ్యుని మొగము చూచుచు మహారాజు నొద్దవేదము వచించునే! ఆహా! ఇది యెంతదారుణము. వీని వైదికపాండిత్యము మండిపోను! శూద్రుడు వేదము వినఁగూడదా? ఆతడు తరింపఁదగదా? ఇతడేనా పండితుడు. ఇతడేనా ప్రాజ్ఞఁడు. " ఓ బ్రాహ్మణుఁడా నీవే యపండితుడవు. నీవే పనికిమాలినవాడవు. నీవే తరింపఁదగినవాడవు. నీవే శాశ్వత శిక్షార్హుడవు. నీలో నున్న వేదజ్ఞానమందలి గౌరవముచేత నిన్నుఁ బోషించుచున్న మహారాజే బ్రాహ్మణుఁడు. అతఁడే వైదికవిద్వాంసుఁడు. అతడే తరించువాఁడు" అని యనఁదగదా?
మార్నేరునంబి కోరికపై బెరియనంబి వచ్చి యాతనికి నమస్కరించెను. అప్పడు పంచముఁ డిట్టు పలికెను. “నేను దైవనామస్మరణ మొనర్చుకొనుచు మరణించునెడల నీవు నాకు బదిదినములు మైలపట్టి యుత్తరక్రియ ల్నర్పవలయును. ఆచార్యవర్యుని స్మరించుకొనుచు మరణించునెడల నొక్కదినము మాత్రమే మైలపట్టవలయును. నే నెవరిని స్మరింప కుండ, నేతలఁపు లేకుండ, నిర్మనస్కముగ మరణించునెడల నీవు నాకొఱకు మైలపట్టు నక్కఱలేదు. అగ్నిసంస్కారము మాత్ర మొనర్చిపొమ్ము' అని చెప్పెను. బ్రాహ్మణుడేమి? పంచమునకేమి అశుచి పట్టుట యేమి? ఔర్డ్వదైహికక్రియ లాచరించుట యేమి? ఆహా! ఎంతవింత! తల్లిదండ్రులకు సోదులకుఁ జేసినట్టే పంచమునకు బ్రాహ్మణుడంత్యక్రి యలు చేయుటయే! సర్వజనభ్రాతృత్వ మనుసంగతి మనకుదెలియును. వారికిఁ దెలి యును. వారి కాచరణములో నున్నది. మనకు లేదు అదియే భేదము. తెలిసినవాఁడు విద్వాంసుడు కాడు. తెలిసి నట్టాచరించువాఁడే ఘనుఁడు. పెరియనంబి మార్నేరునంబికి బ్రహ్మమేధ సంస్కార మొనర్చి స్నానమైనఁ జేయకుండ, బట్టలైన మార్పకుండ, తిర్వారా ధాన కానిచ్చుకొని భుజించినాడు. ఏశవమునైనను ముట్టుకొన్న పిమ్మట స్నానము చేయవలసి యుండంగా పంచమశవమును దాకియాతండు స్నానము చేయలేదు. ఆశ్చర్యకరము! భగవద్భక్తునియం దున్నమహిమము! -
ఇందువలన నేమి తెలియదగిన దనంగా:- పూర్వమహానుభావు లందఱుకూడ బంచ ములను స్పృశించి స్పృశించితి మని సంతోషించి కృతార్డులైనారు. అందుచే నస్పృశ్యత మనునది చండాలత్వములో లేదు. భగవద్భక్తుఁడైన చండాలుడు పూజ్యండే. విద్య గలచండాలుడు పూజ్యడే. పరమార్థజ్ఞానాభావుఁడైన బ్రాహ్మణుడే యస్పృశ్యుడు.
అట్టి పూజ్యులైన చండాలు రిప్ప డెక్కడ నున్నారని బుద్దిహీనమైన ప్రశ్నము వలదు. అట్టి చండాలురు లేరు. పెరియనంబి వంకరాచార్యులవంటి బ్రాహ్మణులు లేరు. కాని మీ మొగములకుఁ దగిన చండాలు రిప్పడున్నారు కాదా. మీరు వారి కే మొనర్చినారు?
అదిగాక బుద్దుని జంపుటు కలవకుఁడు, నంగినమూలు డని యిద్దలస్పృశ్యలు వచ్చినారు. ఒకడు నరఘాతకుఁడు. ఒకడు నరమాంస భక్షకుడు. ఇద్దలు కలసి బుద్దదేవు రూపుమాపుటకు వచ్చినారు. దేవతాతేజస్సుతోఁ బ్రకాశించుచున్న దివ్యమంగళవిగ్రహ మును గాంచి తెల్లబోయినారు. ప్రేమావతార మగు బుద్దదేవుఁడు వారిని గౌగిలించుకొని చెఱియొక తోడపైఁ గూరుచుండం బెట్టుకొని నీతిని బోధించి వారిని బుద్దమతావలంబకులుగఁ జేసినాఁడు. పన్నిద్దలాళ్వారులలో నొకండు పంచముఁడు. ఇందువ లన యోగ్యతయే ప్రధానము కాని మఱియొకటి కాదు. చండాలు నస్పృశ్యునిగా మనపూర్వులు భావింపలేదు. బ్రాహ్మణుఁడెవండో చండాలుఁ డెవండో బుద్దుడు చేసినవిభాగమును గూర్చిన పద్యములు నాల్గు వినదగినవి.
కాని యవి బుద్దనాటకములో నుండుటచే నిట వ్రాయలేదు.
ఇప్పడు మనల మనము గాఢముగాఁ బరిశీలించుకొన్నయెడల మనకున్న బ్రాహ్మ ణత్వమేమో మనకుఁ దెలియును. మనకు వేదాధ్యయన మున్నదా? స్మృతులను శాస్త్రము లను జదివితిమా? పురాణములు బూతులని మానివైచిన వారెవరు? పూర్వ బ్రాహ్మణాచార ములైనఁ జేయుచుంటిమా? ఏకారణముచేత మనము ఘనుల మని చండాలురు నీచు లని మనము చెప్పఁగలము? యథార్థ మాలోచింపఁగ జ్ఞానశూన్యుల మైన మనమే యస్పృశ్యుల మేల కాము?
మన పూర్వాచారము లెన్ని నశించిపోయినవి? సహగమన మిప్పడున్నదా? పుణ్యాత్ముఁ డైనరాజా రామ మోహనరాయలు దీని నివారించుటకుఁ బ్రయత్నింపంగా నాకాశ మంత నోరు పెట్టుకొని మనవారు వాదించియుండలేదా? మతము పోవు నని మొఱపెట్ట లేదా? మహజర్లు చేయలేదా, మామగలతో మేము చితి నెక్కినఁగాని మాకు మోక్షము లేదు లేదని స్త్రీలచేత సంఘవిజ్ఞాపనములు చేయింపలేదా? మత మిప్ప డేమాత్రము పోయినది?
వితంతువివాహము పనికిరాదని మనము ఘోషింపలేదా? అందును గూర్చి యెన్ని తగవులైనవి? ఎన్నివ్యాజ్యెములు పడినవి? ఎన్ని చార్జీలు జరిగినవి? మతము పోవునని యెంత యల్లరి ప్రబలినది? సంస్కర్తల కెన్నితిట్టయినవి? చిట్టచివర కవి బాహాటముగ జరుగుచుండుట లేదా? అసలు పెండ్లికూఁతు మొగములో కంటె విధవపెండ్లికూఁతు మొగములో నెక్కువ పెండ్లికళను మనవారు చూచుచుండుట లేదా? పెద్ద లంద అట్టి పెండ్లిండ్లకు సంఘసంఘముల క్రింద నుత్సాహమున చేరుటలేదా? ప్రస్తుతపు మగడు పరమపదించినపి మ్మట మనమతని వితంతువును జేసికొంద మని కొంద రుఱ్ఱూటలూరుచుఁ గనుపెట్టికొని యుండుటలేదా? ఇప్పడు తమమత మేమైనట్లు? ఏమాత్రము పోయినదయ్య!
రజస్వలావివాహమునుగూర్చి యెంత గందరగోళమైనది? ఆచట్టమువచ్చినతర్వాత నోరు మూసికొని పడియుండిరా? లేదా? సీమవెళ్లినవారి నేమాత్రము బహిష్కరించు చున్నాము? అట్టివారే వెళ్లనివారిని బహిష్కరించుటకు సిద్దమై యున్నారుకాదా? పలపైతృకము మానిన తరువాత తమ మత మేమైనఁ బోయినదా? పూర్వపు దేవరన్యాయము మాటయేమి?
అదిగాక స్త్రీవిద్యయే కూడదని యెంత యజ్ఞలమై వాదించితిమి. ఇట్టి మన యప్రతిష్ట యస్వాభావికత యనౌచిత్యము హిమాలయపర్వత ముండదగినంతకాల ముండదగినది . కాదా? మన యానాంటి యవకతవక మాటలు భారతకాంత కొడలిమీది వ్రాతలుగా నిల్చి యుండును గాని పోవునా? వేదాధ్యయనము లేదు. బ్రహ్మచర్యము లేదు. పోని గూడక ట్టయిన నున్నదా? యజ్ఞోపవీత మున్నదో లేదో తడిమి చూచుకొనుడు. త్రిమతస్థులలోని వైదికులకుగూడ కొందఱు సన్న్యాసులకు గూడ నుల్లిపాయల పెసరట్టు లేకుండ కాఫీ గడచుచ్నుదా? ఇది గాక ఆంగ్లేయ భోజనమఠములలో మనము దినుచున్న మాంసజాతులకు హద్దున్నదా? ఏలయుండును? పప్పునియమ మెప్పడు దాఁటితిమో పందిమాంస మైన నేమి, నందిమాంస మైన నేమి, సవర్ణు లుపయోగించుచున్న మాంసమును బ్రాందిని నేపంచము లుపయోగింపఁగలరు? మతమో మతమో యని యిఁక నేమొగము పెట్టుకొని దేవులాడుచున్నారు? తమ మిదివఱకే పోయినదా? ఇకం బోదు. ఇదివఱకుబోలేదా ఇంకబోదు.
పోయిన వన్నియుఁ గూడ బాహ్యాచారములు, మతమునకు బహిర్లాంఛనములు. మతము విభూతిపండుతోఁగాని చిట్టిగారెతోఁగాని గోపీచందనముతోఁగాని నిల్చునది కాదు. రాజునకుఁ గిరీట మెట్టిదో భటునకు డవాలి యెట్టిదో మతమున కాచార మంత కంటె నెక్కువది కాదు. నవనాగరకనారీశిరోమణీ చీకటులఁ జిమ్ము జట్టు కత్తిరించుకొని మోంకాళ్ల వఱకు మాత్రము లాగుతొడిగికొని సైకిలెక్కి వీథులవెంట స్వారిచేసినంత మాత్రమున నామె స్త్రీత్వమేమైన దగ్గినదా? మతమునకుఁ బ్రధానము లైనవి కొన్నియున్నవి. అవి పోయినయె డల మతము పోవును. అవి యేవన, దయ సత్యము శౌచము స్వార్దశూన్యత వైరాగ్యము భక్తి జ్ఞానము మొదలగునవి. వీనిలోఁ గొన్నియైన మనకుండునెడల మత మెన్నఁటికిని బోదు. మనము తిరుగ నాంతరంగిక పరీక్ష చేసికొందము.
మనజాతి భూతదయకుఁ బ్రసిద్ది కెక్కినది. ఈదేశములో జరుగుచున్న యన్నదాన మెచ్చటను జరుగటలేదు. ఇన్ని దేవాలయము లెచ్చట నున్నవి. ఇన్ని చలిపందిళు లెచ్చటనున్నవి? చెదల కాహారములే, చీమలకు చిందబెల్లములే, పాములకు క్షీరాభిషేకములే. తుదకు దోమలు కుట్టిన పశువులొడలు రాచుకొనుటకు రాతికంబములే. అట్టి మనము వితంతు స్త్రీలను భర్తలతోఁ గాల్చినప్ప డెంతదయ గనబఱచితిమో చెప్పవలయునా? వితంతువులకు వివాహము లేకుండ వారికి భోజనమైనఁ దిన్నఁగ లేకుండ వారితలలపై గృహకృత్యభారం ముంచి వారిని బాధించునప్పడు మనదయ యెట్టిదో లోకమునకుఁ దెలియుట లేదా? తోడిమానవులైన పంచములను, మన కెన్నివిధములుగానో యుపకరించు చున్న పంచములను నధమస్థితిలోనుంచి వారిని మనుష్యుల వలె జూడకున్నప్పడు తెలియలేదా? వారివ్యవసాయము మనకుం బనికివచ్చు నేమో? వా రిచ్చిన ధాన్యము మనకుఁబనికివచ్చునేమి? వారుమేపిన పశువుల పాలు మనము త్రాగవచ్చునేమి? వారుచేసిన శ్రమ యంతయు మనకుఁ బనికివచ్చునేమి? అట్టిచో నింత యుపకారకుల నేల యస్పృశ్యు లగా నుంచవలెను? కుక్క ప్రవేశించిన యిల్లు మైలపడలేదో? గాడిద లోనికివచ్చిన మైలపడలేదో? పంచముడు వచ్చిన యెడల మైలపడునా? మనము వారియెడల మనుష్యులవలెఁ బ్రవర్తించుటలేదు. ఆమనుష్యులను నీచజంతువులకంటె నీచముగాఁ జూచిన ప్పడు మనము మనుష్యులమే కామని పైవా రనుకొనినఁ దప్పేమున్నది?
ఇక సత్యమునుగూర్చి చెప్పెదను. సత్యము సృష్టి కాధారమై యున్నది. అట్టి సత్యము మనలో నెట్టున్నదో చూతము. ఏమి చెప్పవలయును. ఎవడెఱుఁగఁడు. అసత్యముకొఱకే కానియెడల నిన్నికోర్డులెందులకు? ఇందరు న్యాయమూర్తు లెందులకు? ఇందరు న్యాయవాదు లెందులకు? ఇందరు కక్షిదారు లెందులకు? ఇంతబిళ్ల కర్చెందులకు? ఇందరు సాక్షు లెందులకు?
పూర్వమున నివి యేవియైన నుండునా? తాటాకుపాయమే పత్రము - సూర్యచంద్రులే సాక్షులు–ఇప్పడల్లా పత్రము వ్రాయుబోవునప్పడే, యెగబెట్టుటకు సాధన మెట్టో స్థిరపఱచు కొనుటకుఁ గట్టుదిట్టములైన యాలోచనలు చెప్పటకు కల్పవృక మైన ప్లీడరు మన కున్నప్పడు చిక్కేమున్నది? అతడే లేనియెడల వితంతువైన వదినెగారు వ్యభిచారిణి కావున మనోవృత్తి వ్యాజ్యెము చెల్లగూడ దన్న చల్లనియూహ మనకుఁ జెప్పినవా రెవరు? భార్యను జంపిన పాపాత్మునికిఁ దాత్కాలికోన్మాద మని రుజువు పఱచి యురినుండి తప్పించిన బుద్దిమంతుఁ డెవరు? ఎట్టి ఘోరాపరాధ మొనర్చిన వానికైనఁ బెరుమాళ్లకంటె ప్లీడరే యొక్కువ రక్షకుండు కాదా? వారిలో నసత్య ప్రోత్సాహకులు కొందరైన నుండుటచేతనే యిట్టు ప్రపంచ మింత దొరలిపోవుచున్నది.
ఇంకబాతివ్రత్యమును గూర్చి చెప్పెదను. భారతదేశమందుండిన ధనమంతయు బడమటికిఁ బోయినప్పటికిని భారతదేశ సౌభాగ్యమంతయుఁ బరశురామప్రీతి యైనప్పటికిని, భరతదేశ స్వాతంత్ర్యమంతయు భగ్నమైనప్పటికిని, మనకింక మిగిలిన తఱుగులేని విఱుఁగులేని విలువలేని ధన మొక్క స్త్రీల పాతివ్రత్యమే కాదా? సత్యము, ధర్మము, దయయుం, బాతివ్రత్యము ననునవి Barbaric Virtues అనియును, నవి యనాగరకులయొద్ద నుండఁదగినవి కాని దమయొద్ద నుండఁదగినవి కావనియు గొందఱ యభిప్రాయము. మనవారు సత్యము ధర్మము దయము Virtues నుండి తీసివైచినారు. ఇంక బాతివ్రత్యమునుగూడ నట్టు తీసివేయుదురేమో తెలియదు. చంచలబుద్దులగు మగవారట్టు తీసివైచినను బూర్వమహాపతివ్రతల చలువ చేత నట్టి దుర్దశ రానేరదు.
వంక దాటులలో మగవారు ఘనులు
వంశమర్యాద యెన్నఁడు వదల దబల
యింట పరిశుద్ది యెల్లప్ప డింతి వలన
నిలబడును గాని మగవాని వలన
గాదు ఆడుదాని యాచార మాహాత్మ్యమునను
బురుష కానికూళ్లును దొంగపోకడలును
బైగనే కాని యింటిలోపలికిరావు
కాన నిప్పటికిని జాతి ఘనతదక్కె
కట్టు విడఁదైంపి చెలరేఁగ కాంత నడవ
దేశదుస్థితి సంజ్ఞగాఁ దెలియవలయు
నిట్టిదుర్దశ మనకు లే దింతవఆకు
భావిగతి యేదొ యెవ్వరు పలుకఁ గలరు?
ఎంత చెడినను మన స్త్రీలె యిలను గలుగు
నబలలం దుత్తమోత్తమ లనుట తగును
దేశసుభగత మగవాని తెలివింబట్టి
నిలువ దబలయోగ్యతం బట్టి నిలుచుఁగాదె?
తండ్రియిచ్చిన యవకతవక యాజ్ఞల నన్నియు నంత బుద్దిహీనముగా వినుటయేనా? తన కామాత్రపు judgment అక్కఆలేదా? అందుచే రాముఁడు వట్టి Blockhead అనుచు న్నారు. హరిశ్చంద్రు నంతటవానిని భార్యావిక్రయ సందర్భమున Inhuman brute అనుచున్నారు. అతని సత్యరక్షణమును గూడ నెంతమాత్ర మిప్పటివారు మెచ్చకుండ నున్నారు. భార్య నొకనికి దాన మిచ్చిన రఘు మహా రాజును At once an Emperor and go-between అనుచు డాఫరుజాతిలోని కీడ్చివేసినారు. సత్యవైరాగ్యస్వార్ధరాహిత్యద్యనేక గుణములు మోక సాధనము లైనవి పోయినను మత మింక నిల్చియున్నదా? ఇట్టి మనస్థితిలో నొక్కమాట నడిగెదను. యథార్థముగ నస్పృశ్యులు మనమా పంచములా? వారికి మనవిద్య లేదు. అందుచేత మనకున్న యింద్రజాలమహేంద్రజాలములు వా రెరుంగరు. వారికి మనకున్న నాగరకతలేదు. అందుచేత మనకున్న కానికూళ్లు తప్పతిరుగుడులు వారికి లేవు. అందుచేత మనమే మస్పృశ్యులము. మనయుద్దరణము మాట యేమి? ముందు సృష్టిలోనో యీపై సృష్టిలోనో జరుగునో లేదో యను నంశమునుగూర్చి యిప్పడు చింత యేల?
బ్రాహ్మణ స్త్రీకి శూద్రునివలన గలిగినబిడ్డలు పంచములని చెప్పినారు. ఇది సత్యమో యసత్యమో యెవరు చెప్పగలరు? ఎటులైనను తలక్రిందు పెండ్లిండ్గు తగవని, యందువలనఁ గలిగినసంతానములు బహిష్కారయోగ్యము లని యిందువలన నిర్ణయించుట కవకాశము న్నది. అయినను వారిదోషమువలన వారట్లుకాలేదు. మనదోషము వలన నైరి. ఎన్ని వందల సంవత్సరముల క్రిందటనోయైరి. అట్టనిర్దోషులను- అది గాక మనదోషముల వలననే యట్లు కావలసి వచ్చినవారిని సంఘములోనికి విద్యాబుద్దులు చెప్పించుచుఁ దీసికొనుట మంచిది. ఎప్పడో జరిగిన యీతప్పను గూర్చి యేల?
ఇప్ప డిట్టి తలక్రిందు పెండ్లిండ్లు ఎన్ని యగుచుండుట లేదు? ప్రత్యకముగ బాహా టముగ బ్రచ్చన్నముగ నరచాటుగ నెన్ని జరుగుటలేదు? అందువలన మన సంఘమం దెన్ని సంతానములు కలుగుటలేదు. దినమున కట్టి సంతానములు భారతదేశమందు వేలకొలదిఁ గలుగుచుండుట నిస్సందేహము. అవి మన మెఱుఁగుదుము. ఎఱుఁగము. ఎఱిఁగియు నెఱుఁగక యున్నాము. ఎఱుంగకుండ నెఱిగియున్నాము. అట్టివారిని మన సంఘమందుఁ బ్రాణప్రదముగ నుంచుకొను చుండుట లేదా? వారి సంతానములను కర్ణులైన ప్పడు-ఎన్నివేల సంవత్సరముల క్రిందటనో మన దోషమువలననే బహిష్కృతులైన వారిని సంఘమున కేల తీసికొనఁగూడదు? సంఘములో నింత దొంగతనము -నింతపాపము- నింత క్రుళ్లుదాఁచుకొని దాఁచుకొని సహించు చున్నప్పడు నిర్దోషులైన వారి నేల తీసికోగూడదు?
భారతీయ పూర్వాచారము లన్నియు నశించినవి. వానివలెనే యీ యస్పృశ్యత కూడ నశింపఁ దగినది. అది మనకు బాధ నిచ్చుట లేదు. కావున దీని నింక యల్లై యుంచినాము. ఇది మరింత పాపము.
మీకు మతము పోవునప్పటికి బ్రదుకు పోవునప్పటికి మోక్షము పోవునప్పటికి రామానుజులు గోపుర మెక్కి తిరుమంత్ర ముపదేశించినట్టు మీరు వారి నుద్దరించుట మహాకార్యము. మీరట్టు చేయలేరా? ఇప్పడే కాకపోయిన మరి యింక కొలఁది కాలమునకైన వారె మన స్థాన మాక్రమింతురు. ఇప్పడే యట్టు చేసి మాట దక్కించుకొనునటు మంచిది.
ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః.