సర్వలక్షణసారసంగ్రహము/సంధిప్రకరణము

సంధిప్రకరణము

సీ.

ఆనతిచ్చుటయు మేనత్త యేమయ్యెను
                  మగనాలు పురటాలు మగువలిండ్లు!
బండెద్దుడు పెండ్లాడి వెండుంగరంబు పై
                  డందెలు చనకుంట యఱువదాఱు
నూటొక్కటియుఁ దొమ్మనూటాఱు పాలిండ్లు,
                  తండ్రేడి యొంటొల్లె దాసరయ్య
యింకేమిటికిఁ బుట్టినిల్లు రావాకు మ
                  ఱేమి వెల్లేనుఁగు కోమటక్క


గీ.

యనఁగఁ బరగెడు నుడువులయందు సంధు
లడఁగుఁబొడముచునుండు ని ట్లాంధ్రకవుల
యనుమతంబున శైలకన్యాహృదీశ
దురితభయనాశ పీఠికాపురనివేశ.

1

1 ఆనతిచ్చుట. ఇకారవికల్పసంధి.

సీ.గీ.

తమ్మి కేలుండఁ బెరకేలు దండయిచ్చు
లేము లుడిపెడు లేఁజూపు లేముతోడఁ
దొలుకు దయఁదల్సు చిఱునవ్వుతోడఁ గల త
దాంధ్రజలజాక్షుఁ డిట్లని యానతిచ్చె.

ఆముక్తమాల్యద

క.

ఆదిత్యమరుద్వసురు
ద్రాదిసురలు మునులు నంబుజాసనుఁ గని మా

కేది కరణీయ మీశ ద
యాదృష్టిని మమ్ముఁ జూచి యానతి యీవే.

3

శాంతిపర్వము

2 మేనత్త యనుట. అకారవికల్పసంధి.

సీ.గీ.

గరగరనివాఁడు నవ్వుమొగంబువాఁడు
చూడఁగలవాఁడు మేలైనసొబగువాఁడు
వావి మేనత్తకొడుకు గావలయు నాకు
నర్జునుండు పరాక్రమోపార్జనుండు.

4

విజయవిలాసము

3 మేనయత్త యనుట

.
ఉ.

మంచిగ మేనయత్తలు సమాదరణం బడరంగఁ బెట్టిపు
త్తించిన మంచికజ్జములు తేనియ నేతనుఁ దోఁచి తోఁచి

5

హరవిలాసము

4 ఏమయ్యె ననుట. ఇకారవికల్పసంధి.

గీ.

అగ్ను లేమయ్యెనొక్కొ నిత్యంబులైన
కృత్యములఁ బాపి దైవంబు కినుక నిట్లు

6

మనుచరిత్ర

5 ఏమియయ్యె ననుట

చ.

హరిహయుఁ డేమియయ్యె నొకదామదనానలతాపవేదనఃన్.

7

నైషధము

6 మగనా లనుట. ఇకారవికల్పసంధి.

సీ.

ఓర్మి మై నుప్పిడి యుపవాసముల నుండి
                  మగనాలి సరిఁబోల్పఁదగదు విధవ.

8

కాశీఖండము

7 మగనియా లనుట

.
ఉ.

ఆసమయంబున న్మగనియాండ్రును గన్యలు నాక సొచ్చి ధా
త్రీసురరాజవైశ్యులను దేకువసేయక యెట్లచోట్లనున్

9

ఉత్తర రామాయణము

8 పురటా లనుట. ఇకారవికల్పసంధి.

క.

పురు డీబోఁటికి నిందిర
పురు డంబిక గాక యొరులు పురుడే యనుచున్
బురుటాలికిఁ బదిదినములు
పురుడు ప్రపర్తించి రెలమిఁ బుణ్యపుగరితల్.

10

భాగవతము

9 పురిటియా లనుట

సీ.

పొదివితేఁ గానక పొత్తులలో పట్లఁ
                  బోనాడుకొనిన లేఁబురిటియాండ్రు

11

రామాభ్యుదయము

10 మగువలిం డ్లనుట, అకారవికల్పసంధి

సీ.గీ.

వారికన్నను నీమహత్వంబు ఘనమె
పవనపర్ణాంబుభక్షులై నవసి యినుప

కచ్చడా ల్గట్టుకొను మునిముచ్చులెల్లఁ
దామరసనేత్రలిండ్ల బందాలుగారె

12

మనుచరిత్ర

11 పెండ్లాడి యనుట

.
గీ.

పారుఁడొక్కఁడు పెం డ్లైనబాల దాను
బాల్యమున నీ మనను బెల్లుబడిని బుచ్చు
కొనిన తద్విధ మెఱిఁగి తజ్జనకుఁ డలిగి
తిట్టి వెడలిపొమ్మనుఁడు బార్థివసుతుండు.

13

హరివంశము

12 'పెండ్లియాడి యనుట

.
ఉ.

కోమలచారుమూర్తి పురు-కుత్సుఁడు నర్మదఁ బెండ్లియాఁడడే

14

విజయవిలాసము

13 వెండుంగరం బనుట

సీ.

పంచాంగముష్టియుఁ బాణిపవిత్రంబు
                  నొకజుఱ్ఱవ్రేలివెండుంగరంబు!

15

శ్రీనాథునిహరివిలాసము

11 రావియా కనుట. నిత్యసంధ్యనిత్యత్వము

సీ.

అలరులు ఫణివీచు లభ్రంబు సుడిరావి
                  యాకుసైకతములు నంట్లు దొనలు

16

రుక్మాంగచచరిత్ర

15 వెల్లేనుఁ గనుట. అకారవికల్పసంధి

ఉ.

సైనికు లంత నంత రణసన్నహనం బెడలించి పాఱిన
న్నానయు నచ్చలంబు మది నాటుకొనంగఁ గపోలమండలీ
దాన మిళ ద్విరేఫనినదంబుల ఘీంకృతు లుల్లసిల్ల వె
లేనుఁగుమీఁద డీకొలిపి యింద్రుఁ డుపేంద్రుఁనిఁ దాఁకె నుద్ధతిన్.

17

పారిజాతాపహరణము

వ.

ఇటువలెనే కడమయన్నిఁటికినిఁ దెలిసికొనునది.

లక్షణము

క.

ఇమ్ముగ శబ్దముతుది వ
ర్ణమ్ము దరి న్వచ్చునచ్చునకు యా యొదవుం
గొమ్ము గలహల్లు ప్రథమాం
తమ్మైన నడంగు నచ్చు ధవళశరీరా.

18


ఉదా. చ.

హయరథదంతిసంతతి నిరంతరదుర్దమలీలఁ బేర్చి నే
ల యవిసి మూఁగిన ట్లగుబలంబులతోడఁ ద్రిగర్తు లెంతయున్‌
రయమున గోవులం బొదివి రక్షకు లొక్కట నార్చి తాఁకినన్‌
భయదమహాస్త్రశస్త్రపటుపాతపరంపరఁ దున్మి యుద్ధతిన్‌.

19

విరాటపర్వము

వ.

కడమ సులభము.

లక్షణము

క.

ధరఁ బ్రథమమధ్యమోత్తమ
పురుషల బహువచనములను బొదలెడునచ్చుల్
బెరయుచు నెడయుచు నుండుం

గురుతరకరుణాంతరంగ కుక్కుటలింగా.

20

నిత్యమనుత్తమపురుషక్రియాస్వితః

అని శబ్దానుశాసనుఁడు సూత్రమును జెప్పినాఁడుగనుక నుత్తమపురుష గాక ప్రధమమధ్యమపురుషక్రియలమీఁది యచ్చులు శ్లిష్టమౌట సిద్ధమే.

16 విడియుండుటకు బ్రథమపురుషకు

సీ.గీ.

చంద్రమౌళిభరద్వాజసంయములును
హంసపదియను నొకకిన్నరాంగనయును
నాప్రవాళోష్ఠిమగఁడు వేణీప్రియుండు
సిద్ధిబొందిరి యవిముక్తసీమయందు.

21

కాశీఖండము

మ.

బలభిడ్వహ్నిపరేతరాజవరుణుల్ పర్యుత్సుకత్వంబు సం
ధిలఁ గూర్చుండిరి యొండొరుం గదిసి యర్థిం దత్ప్రదేశంబుల
న్నలనాళీకమృణాలనాళలతికానవ్యప్రణాళీమిళ
ల్లలనాలాపకథాసుధానుభవలీలాలోలచేతస్కులై.

22

నైషధము

ఉ.

కూడిరి యొండొరు ల్దొరసి కుంతలకాంతు లొసంగి వీడుజో
డాడిరి క్రేళ్ళు దాటిడుచునాళులతో వెలిదమ్మిధూళిగా

23

రామాభ్యుదయము

క.

మనుజులలోపలఁ గర్మం
బొనరుచువా రెల్ల దండ్యులో వారలలోఁ
గనుఁగొనఁ గొందఱె దండ్యులొ
యనవుడు హరిభటుల కనిరి యప్పార్శ్వచరుల్.

24

కవులషష్ఠము

మ.

గురుభీష్మాదులు చూచుచుండ సభ మీకుం గీడు నాడట్లు ము
ష్కరులై చేసిరి యంత చేసియును బశ్చాత్తాపముం బొందనో
పరు వా రెన్నఁడు నట్టిచోటఁ గృపయున్ బంధుత్వముం దక్కు మె
వ్వరు గోపింపరె యాదురాత్మకులగర్వక్రౌర్యము ల్చూచినన్.

25

ఉద్యోగ పర్వము

ఉ.

కొంచెముగా నిజాంగకము గుంచి ధరిత్రికి నెంతయెంత లం
ఘించిన లేదు దంతిఁ బరికించుజనంబులుగొంద రాత్మ భా
వించిర సంధ్య వింధ్య పృథివీధరఘోరతరోదయంబుగా!
వించిరి యందుఁ గొందఱు త్రివిక్రమవిక్రమవిస్మయస్మృతిన్.

26

కవికర్ణరసాయనము

17 మధ్యమపురుషేకారమునకు వికల్పసంధి

చ.

అదలిచినిల్వ వారిఁ గని యంతకకింకరు లెవ్వరయ్య మీ
రిదె యమునాజ్ఞఁ ద్రోచితిరి యెచ్చటనుం డిట వచ్చినార లె
య్యెది గత మడ్డుపెట్టుటకు నెవ్వరవార లెఱుంగఁజెప్పు డా
యదితితనూజులో సురలొ యక్షులో సిద్ధులొ కాక సాధ్యులో.

27

కవులషష్ఠము

18 ఉత్తమపురుషకు వికల్పసంధి

క.

విలువిద్య నొరులు నీ క
గ్గలముగ లేకుండ నిన్నుఁ గఱపుదునని ము
న్వలికితిరి నాక కాదీ
త్రిలోకముల కధికుఁ జూచితిమి యొకయెఱుకున్.

28

ఆదిపర్వము

క.

తలఁపఁగ రిపులకు నిమ్మగు
కొలఁది గడచివచ్చితిమి యకుంఠితబాహా
బలము నెరపఁదరియయ్యెం
జలింపవలవ దింక మనకు శత్రులవలనన్.

29

విరాటపర్వము

లక్షణము

గీ.

కృతులఁ దద్ధర్మములఁ జెప్పుక్రియలమీఁది
యచ్చునకు సంధి లేకుండు నిచ్చలముగ
మనుచు నీశ్వరుఁడని పల్క నొనరుఁగాని
తగదు మనుచీశ్వరుండన నగనివేశ.


ఉదా.క.

గంగానది గంగానది
గంగానది యనుచు భక్తిఁ గడలుకొనంగా
గంగఁ గొనియాడునాతఁడు
భంగించు ననంతఘోరపాతకచయమున్.

30

కాశీఖండము

వ.

కొనియాడు నాతఁ డని యనవలెఁగాని కొనియా డాతం డని యనరాదు.

31

20 లక్షణము

గీ.

వర్తమానార్థవిహితచు వర్ణమునకుఁ
గలిగియుండును లేకుండు నలర సంధి
నగు చరిగె నగుచు నరిగె నాఁగ నిచ్చు
చలరె నిచ్చుచు నలరె నా జలధితూణ.

32

ఉదాహరణ

గీ.

అనుచు దొలినుడి యభిలాష మెనయమూఁగి
పలుక దరహాసనర్మగర్భంబు గాఁగ
నుత్తరము పల్లవశ్రేణి కొసఁగు చలరు
లమ్ముదురు పుష్పలావిక లప్పురమున.

33

ఆముక్తమాల్యద

గీ.

హరునితోడ విరోధించి యంధకుండు
యుద్ధ మొనరించు చొక్కనాఁ డోహటించి
యజగవోన్ముక్తఘననిశితార్ధచంద్ర
బాణనిర్భిన్నవక్షఃప్రపాతుఁ డగుచు.

34

కాశీఖండము

క.

విమలస్ఫాటికహాటక
రమణీయదరీనిరంతరస్ఫీతనగేం
ద్రము మాల్యవంతమును ను
త్తమచరితులు చూచు చరిగి తద్విపినమునన్.

35

ఆరణ్యపర్వము

సీ.

కానలోఁ దారు మృగంబులకైవడి
                  గైకొని యసమాస్త్రకర్మకలనఁ
దనరు చొక్కపురాణమునిదంపతులు

36

రాఘవపాండవీయము

21 లక్షణము

క.

అది యనుశబ్దముపై న
చ్చొదవెడుచోఁ గలయు నెడయుచుండును గృతులం
దది యేటి కదేటి కనన్
విదితంబుగ సంధి నిఖిలవిశ్వాధీశా.

37


ఉ.

దక్కెను రాజ్య మంచు నకటా యిట సోదరరాజ్యభాగ్య మీ
వెక్కటి మ్రింగఁజూచె దిది యేటికి దక్కును మీనులోలతన్
గ్రక్కున నామిషంబు చవిఁ గాలముమ్రింగినచాడ్పుసువ్వె యి
ట్లుక్కివుఁడైన నీకొడుకు నుల్లమునం దిటు లోరయుండినన్.

38

ఉద్యోగపర్వము

ఇదేటి కనుటకు

ఉ.

కొండగ నొండుచోటఁ బలెఁ గొంకక బింకముతో నరుండు భీ
ముం డని మాటిమాటికి సమున్నతి నెన్నఁడు కర్ణభీష్మకో
దండగురుప్రతాపవితతప్రధనోద్ధతి నొప్పుమద్భుజో
ద్దండత యించుకైన మది దార్ప విదేమిటి నేర్పు చెప్పుమా.

39

రాఘవపాండవీయము

22 లక్షణము

ఆ.

అనుచు వినుచు కనుచు ననువర్తమానార్ధ
పదనువర్ణమునకు బరగు లోప
మొదవి నిండుసున్న లొదవు నొక్కొకయెడ
నంచు వించు కంచు నన మహేశా.

40

అనుచు ననుటకు

గీ.

అనుచుఁ దొలినుడి యభిలాష మెనయమూఁగి
పలుక దరహాసనహాసనర్మగర్భంబు గాఁగ

41

ఆముక్తమాల్యద

అంచు కంచు లనుటకు

శా.

అంచు న్వేలుపుమించుబోఁడులు శుభోదర్కంబు గాన్పించ దీ
వించ న్వారిఁబ్రియానులాపములతో వీడ్కొల్పి గోకర్ణభూ
ప్రాంచద్ధూర్జటిఁ గొల్చి పశ్చిమసముద్రప్రాంతపుణ్యస్థలుల్
గంచు న్బోయి ప్రభాసతీర్థమున వేడ్కం గ్రీడి గ్రీడింపుచున్.

42

విజయవిలాసము

క.

కాంచనపక్షంబగు రా
యంచం గనుఁగొని నృపాలుఁ డనురాగముతో
వంచించి పట్టికొనియెద
నంచుఁ దలఁచె దైవఘటన కనుకూలముగన్.

43

నైషధము

23 లక్షణము

గీ.

ఒనర నపు డిప్పు డనుజప్పు డనెడు నుడుల

నుండెడు పువర్ణశృంగంబు లుడుపఁబడును
సరవి నప్డును నిప్డును జప్డు ననఁగఁ
గోటికోటీందుసంకాశ కుక్కుటేశ.

44

అప్డనుటకు

ఉ.

తుమ్మినయప్పు డుంబురముత్రోవఁ జరించినయప్డు వారిపా
న మ్మొనరించినప్పు డశనంబు భుజించినయప్డు నవ్యవ
స్త్రమ్మున ధరించినప్డు దురితములు చూచినయప్డు పుణ్యకా
ర్యమ్ములయప్డు హేయముల నంటినయప్పుడు వారువందగున్.

45

చప్డనుటకు

గీ.

మోసమోక ముశాసమ్మ ముద్దరాలు
తారె సడిసప్డు లేక పాతాళమునకు
దాను కొడుకులు నొకకొంత దడసెనేని
గుటిలపఱుపరె నృపుబంట్లు గుదెలవారు.

46

కాశీఖండము

24 లక్షణము

గీ.

పదముమీఁదటి యదియనుపదము మొదలి
యత్వ మఁడగుచు బొడముచు నలర సంధి
నమ్మ యదియున్న యదికాప-యదియనంగ
నమ్మయది యున్న దన కాపదన నుమేశ.

47


ఉదా. ఆ.

కర్ణు పలుకు లోకగర్హితుఁ డగుద
నేను చెయిదికంటె శిఖియపోలె

నడరి నామనంబు నతిదారు క్రియ
నేర్చుచున్నయది మహీధరుండ.

48

అరణ్యపర్వము

ఉ.

హాలహలద్వయంబు కలశాంబుధి పుట్టి వినీలపాండుర
జ్వాలలతోడ నం దొకవిషం బొకవేలుపు మ్రింగి నెందరే
వేలుపు లోలిమై ననుభవించిన రెండవయీవిషంబు ని
ర్మూలము గాకయున్నయది ముద్దియ పాంథులపాప మెట్టిదో.

49

నెషధము

25 లక్షణము

గీ.

ఇమ్ము మీర భవిష్యదర్థమ్ముఁ జెప్పు
పదము నూమీఁదనేని యన్పదము నిలుపు
నపుడు సంధుల నగునేని యగునయేని
యనఁగ నొప్పు నగేంద్రకన్యాధినాథ.

50


ఉదా.గీ.

అనలసంబంధవాంఛ నా కగునయేని
యనలసంబంధవాంఛ నా కగునుజువ్వె
చాలు సందేహవక్రభాషణము లింకఁ
దరుణచక్రాంగపాధఃపతంగశక్ర.

51

నైషధము

'

26 లక్షణము

ఆ.

పడియెన న్పదంబు పరమునఁగల ప్రథ
మాంతశబ్దములకు నగు ముకార
మడఁగుఁ బూర్ణబిందు వగు భయపడి భయం
పడి యనంగఁ గృతుల ఫాలనేత్ర.

52

ఉదా.చ.

వనజభవప్రభావుఁ డగువాని వసిష్ఠు నపత్యశోకము
న్వననిధిలోన ముంచినయవారితవీర్యుఁడు నిన్నుఁ దొట్టి య
య్యనిమిషు లెల్ల వానిక భయంపడుచుండుదు రట్టియుగ్రకో
పనుకడ కేఁగు మిప్పు డని పాడియె యిప్పని నన్నుఁ బంపఁగన్.

53

ఆదిపర్వము

ఉ.

క్రచ్చర నొక్కరక్కసుఁడ కాఁడు సురాసురులెల్ల నడ్డమై
వచ్చిన నీవ చూడఁగ నవార్యబలోన్నతిఁ జేసి వారలన్
వ్రచ్చి వధింతుగాక యిట వచ్చి శ్రమంపడియున్న వీరల
న్నిచ్చగ వీరిదైన సుఖనిద్రకు భంగము సేయనేర్తునే.

54


క.

ప్రజ యేన కాను నన్నుం
బ్రజ సంరక్షించునని భరంపడి కోరం
బ్రజ విడిచెద నాయం దది
యజేయమును నవ్యయంబు నగుపద మిచ్చున్.

55

శాంతిపర్వము

చ.

అనుటయు మంత్రిమాటకు బ్రియంపడి యాతని నాదరించి య
మ్మనుజకులేంద్రుడు

56

ఎఱ్ఱాప్రగడ రామాయణము

భయపడి శ్రమపడి యనుట సులభము.

27 లక్షణము

గీ.

తగ నుకారాంతముల కర్మధారయమున
షష్ఠి యగుచో బైనచ్చు సంఘటిల్లె
నేని సంధులయెఁడ న న్నిలుచు గొన్ని
యెడలఁ గలుగకయుండు మహీశతాంగ.

57

కర్మధారయమునఁ డకారము వచ్చుటకు

గీ.

అగ్నిశిఖయపోలె నంటను డాయను
జూడగానియట్టి శుభచరిత్ర
నెఱుకలేని కరకుటెఱు కపేక్షించెఁ గా
దనక తనకు నాయు వల్పమైన.

58

అరణ్యపర్వము

మ.

కమనీయద్యుతయోగ్యకీర్తనముల న్గన్పట్టు నాశ్యామ యా
సుమబాణింబకమాయమూల్యమణి యాచొక్కంపుఁబూబంతి యా
సుమనోవల్లరి యాసుధాసరసి యాసొంపొప్పుడాల్దీవి యా
కొమరుంబ్రాయపురంభ యాచిగురుటాకుంబోఁడి నీకే తగున్.

59

వసుచరిత్రము

క.

జననాథ నాడు మొదలుగ
ననయము బురరక్షణంబు నాహవసమయం
బున నస్తమునై యతనికి
ననలుం డిల్లటపుటల్లుఁడై వర్తించున్.

60

జైమినీభారతము

టకారము రాకుండుటకు

క.

ఈనెలఁతుక గని మన్మథుఁ
డైనను జిగురాకుబువ్వుటమ్ములపొదలున్
లోనుగ సెజ్జలు సేయం
దా నియమింపండె విరహతాపము పేర్మిన్.

61

విరాటపర్వము

ఉ.

ఎయ్యది గారణంబుగ మహీపతి యంచితధైర్యకంచుకం
బయ్యత నుండు సించెనలరమ్ములచే నది గారణంబుగాఁ
దొయ్యలి రాజనందనునితో గెడగూర్పఁదలంచియున్నయా
దయ్యమునెత్తికోలు తుదిదాఁకుటగానఁగ నయ్యె నయ్యెడన్.

62

నైషధము

సీ.

చిగురాకుబోఁడి మైచెమటపన్నీటిలో
                  నానుట త్రిషవణస్నానమయ్యె

63

కవులషష్ఠము

ఉ.

తెల్లనిదీవితమ్మి నెలదేటివలెం దళుకొత్తువాగిడిన్
నల్లనివాని లచ్చి రతనంబును మచ్చ యెదం దలిర్ప రం
జిల్లెడువాని చుట్టలగుచిందము నంటినవాని నింపుసొం
పెల్లెడఁ గల్గుపాల్కడలి యిల్లటపల్లునిఁ గాంచి రయ్యెడన్.

64

రామాభ్యుదయము

షష్ఠికి నకారము వచ్చుటకు

గీ.

చెంచునింటికిఁ బోయి చెంచితకుఁ బ్రియము
చెప్పి నమ్మించి తలమీఁదఁ జెయ్యి వెట్టి

65

కాశీఖండము

నకారము రాకుండుట

గీ.

తరుణి వైదర్భినీ వెట్టిధన్యవొక్కొ
భావహావవిలాసవిభ్రమనిరూఢి
గౌముదీలక్ష్మి యప్పాలకడలివోలె
నలరజేసితి నిషధరా జంతవాని.

66

నైషధము

ఉ.

అల్లుఁడు రామరా జనుఁగుటల్లుఁడు గొబ్బురి యౌభళేశుఁ డా
హల్లకహారిఁగన్నఘను నల్లుఁడు పోషణబుద్ధి గట్టురా
జల్లుఁడు వింటినేర్పున సమంచితరూపమునందుఁ జందమా
మల్లుఁడు దేవకీరమణునల్లుడు శత్రుసమిజ్జయంబునన్

67

రామాభ్యుదయము

క.

అన్నన్న మొగము వెన్నుని
యన్నన్న జయించుకన్ను లన్నన్నలినా
సన్నములు నడుము మిక్కిలి
సన్నము మాటలు సుధా ప్రసన్నము లెన్నన్.

68

విజయవిలాసము

28 లక్షణము

ఆ.

రెండుమారు లుచ్చరించుశబ్దమునకు
నంత్యపదము మొదలియ చ్చడంగు
నన్న యన్న యనక యన్నన్న యేమేమి
యనఁగవలయుఁ గృతుల నగనివేశ.

69

అన్నన్న యనుటకు

,
క.

అన్నగరిచిరుతయేనుఁగు
గున్నలపై నెక్కి నిక్కి కోయఁగ వచ్చున్
మిన్నేటిపసిడితామర
లన్నన్న మరేమి చెప్ప నందలికరులన్.

70

మాదయగారిమల్లన రాజశేఖరచరిత్ర

ఏమేమి యనుటకు

శా.

ఏమేమీ యను విన్నమాటయ వినున్ వీక్షించు నెమ్మోము సాం
ద్రామోదంబునఁ బక్షముల్ నివురు హస్తాంభోజయుగ్మంబునన్

71

నైషధము

వ.

అమ్మమ్మ అబ్బబ్బ మొదలయినవి యిటువలెనె తెలియునది.

29 లక్షణము

క.

అహమనుచోఁగి మనునెడన్
విహితంబుగ నంత్యహల్లు ద్విత్వముఁ జెందున్
మహితప్రబంధములలో
నహమ్మనియుఁ గిమ్మనియును నంగజదమనా.

72

కిమ్మనుటకు

ఉ.

కమ్మనికుందనంబు కసుగందనిమే నెలదేఁటిదాఁటులన్
బమ్మెర బోవఁదోలుఁ దెగబారెడు వెండ్రుక లిందుబింబముం
గిమ్మన నీదుమోము గిరిక్రేవులు మూవులు కౌను గానరా
దమ్మక చెల్ల వానివికచాంబకముల్ శతపత్రజైత్రముల్.

73

మనుచరిత్ర

శా.

ఆతన్వంగి యనంగఝాంకరణపజ్జ్యాముక్తచూతాస్త్రని
ర్ఘాతం బోర్వక తమ్ములంచు తటినీగర్భైకసంజాతకం
జాతవ్రాతముమాటుఁ జెంద నవి యెంచంజొచ్చె మున్నున్నుగా
జ్ఞాతిశ్చేదన లేవకిమ్మనెడి వాచారూఢి సత్యమ్ముగన్.

74

వసుచరిత్ర

వ.

కడమ యీలాగే తెలిసికొనునది.

30 లక్షణము

క.

తొడరిన మశ్శబ్దాదుల
యెడ నచ్చుగ నచ్చు గదిసెనేని విసర్గల్
చెడు నచ్చు యకారంబగు
మృడపీఠపురవిహార మృత్యువిదూరా.

75

నమశ్శబ్దమునకు

సీ.గీ.

మానమథనాయ మదనాయ మధుసఖాయ
మనసిజాయ నమోనమ యనుచు మ్రొక్కి

76

వసు చరిత్ర

వ.

నమోనమో యనియుఁ గలదు.


ఉ.

పాయక దైత్యు లిట్లు బహుభంగుల బాధ లొనర్ప విష్ణుదే
వాయ నమో నిరంతవిభవాయ నమో జలజాలయాకళ
త్రాయ నమో నిశాచరహరాయ నమో యనుగాని క్రవ్యభు
ఙ్నాయకనందనుండు చలనంబును బొందఁ డొకించుకేనియున్.

77

వరాహపురాణము

గీ.

కనమె కార్యార్థినః కుతో గర్వ యనఁగ

78

చంద్రభానుచరిత్ర

ఉ.

నవ్యవిలాసరమ్యనలినంబని బాలముఖాబ్జసౌరభా
భివ్యసనంబునం బరచు భృంగికులోత్తమ తద్వియోగతా
పవ్యథఁ బ్రాణి నిల్వదు కృపాగుణ మేర్పడ బ్రాహ్మణో న హం
తవ్య యనంగ నొప్పు వచనస్థితి కుంద కెఱుంగఁజేయుమా.

79

భీమకవి చాటుధార

31 లక్షణము

క.

పొల్లులగు హల్లు లెల్లను
దెల్లమిగా వచ్చు బెరసి ద్విత్వము జెందుం
బెల్లుగ ననుకరణంబుల
హల్లకహత సుప్రకాశ హర పరమేశా.

80


శా.

అత్మార్థం పృథివీం త్యజే త్తనెడు వాక్యం బశ్రుతంబే నృపా

81

కాశీఖండము

న.

కడమ నన్నియు నీలాగే తెలిసికొనునది.

32 లక్షణము

గీ.

నాంతపదములపై సక్తమగు పదముల
కచటతప లైదు నగుచుండు గజడదబలు
పిఱిదిసా ల్సున్నలగు నినుఁ బిలచె నన ని
నుం గొలిచె నాఁగ దివిజసన్నుత మహేశ.

82

కకారమునకు

శా.

సింగం బాకటితో గుహాంతరమునం జేట్సాటుమై నుండి మా
తంగస్ఫూర్జితయూథదర్శనసముద్యత్క్రోధమై వచ్చునో
జంగాంతారనివాసఖిన్నమతి నస్మత్సేనపై వీడె న
చ్చం గుంతీసుతమధ్యముండు సమరస్తేమాభిరామాకృతిన్.

83

విరాటపర్వము

చకారమునకు

ఉ.

అంజసమానవాయుగుణ మంతయు ఖంజతఁ జిక్క నజ్జవో
ష్మం జని యుబ్బు చిక్కనిసమానపువాయువులో నొకండు...

84

ఆముక్తమాల్యద

తకారమునకు

క.

అందులకు ధరణిఁగలనృపు
నందమలందఱు ముదంబునం బోయెడు వే
డ్కందమలోఁ గలహంబును
గ్రందును లేకున్న వారు గడునెయ్యమునన్.

85

అరణ్యపర్వము

పకారమునకు

క.

అంబాలికకును గుణర
త్నాంబుధి పాండురవిరాజితాంగుఁడు ప్రభవిం
చెం బాండురాజు కురువం
శంబు ప్రణమిల్ల ధర్మసత్యవ్రతుఁడై.

86

ఆదిపర్వము

33 లక్షణము

క.

తెల్లమిగ గజడదబమలు
పొల్లనకారంబుతోడఁ బొదలినయెడలం
బొల్లులె నిల్చును నొకచోఁ
జెల్లును నెఱసున్న లగుచు శ్రీగౌరీశా.

87

పొల్లునకారము నిల్చుటకు

శా.

భారద్వాజపవిత్రగోత్రు విమలాపస్తంబసత్సూత్రు వి
ద్యారాజీవభవుండు మారయకుఁ బుణ్యాచారభీమాంబకున్
గారామైనతనూజు న న్ననఘు శ్రీనాథాఖ్యుఁ బిల్పించి స

త్కారం బొప్పఁగ గారవించి పలికెన్ గంభీరవాక్ర్పౌఢిమన్.

88

నైషధము

క.

త్వరితముగఁ జనుము సఖుఁడు
న్గురుఁడుఁగదా నీకు నర్జునుఁడు ప్రకృతిత
త్పరుఁడై నెగడుట నుత్తమ
పురుషులు వేచుతరి వచ్చె భుజశౌర్యనిధీ.

89

ద్రోణపర్వము

వ.

కడమవన్నిఁటికి నీలాగే తెలిసికొనునది.

పొల్లు చెడి బిందు వగుటకు

గకారమునకు

క.

తుంగమడువునఁ జెలగుమా
తంగమునకు మిగిలి యడవి దరికొను కార్చి
చ్చుం గడచి యచటిబలముల
భంగించె నరుండు ఘోరబహువిధగతులన్.

90

ద్రోణపర్వము

జకారమునకు

ఉ.

అంజసమానవాయుగుణ మంతయు ఖంజతఁ జిక్క నజ్జవో
ష్మం జని యుబ్బు చిక్కనిసమానపువాయువులో నొకండు క
ల్మిం జనియించు దుర్యశము మేల్కని లేహనవేళ వాజులూ
ర్చం జెడు మాణిమంధనికరంబుల కాళిమపేరఁ దార్కొనన్.

91

ఆముక్తమాల్యద

క.

అంజదవు గాక నను చెం
తం జేరఁగనీక యెంత తగ్గిన మిరియా
లుం జొన్నలు సరిగావే
లంజతనములందు కొమరులం గెలువనొకో

92

నాచనసోముని వసంతవిలాసము

డకారమునకు

శా.

చండాంశుప్రభ చిక్కతిమ్మయతనూజా తిమ్మవిధ్వస్తపా
షండంబైన త్రిలింగభాగవతషష్ఠస్కంధకావ్యంబు నీ
కుం డక్కెం జతురాననత్వగుణయుక్తుల్ మీర వాణీమనో
భండారోద్ధతచూరకారబిరుదప్రఖ్యాతి సార్ధంబుగన్.

93

కవులపష్ఠము

దకారమునకు

స్రగ్ధర.

తల పి ట్లుత్సాహమందం దనయజనపరిత్రాణ మర్ధించి యక్కం
దళితాపత్యానురక్తి న్మహిపు ననుగతిం దాను రాబూనకుండన్.

94

రాఘవపాండవీయము

మకారమునకు

లయగ్రాహి.

కమ్మనిలతాంతములకు మ్మొనసివచ్చుమధు
                  పమ్ముల సుగీతనినదమ్ము లెసఁగం జూ
తమ్ములసుగంధముల

95

ఆదిపర్వము

లయగ్రాహి.

అమ్మహిసురోత్తముఁడు నమ్మనుజభోజియును
                  నమ్ములను గ్రోధ మధిక మ్మగుచు మీఱన్

హుమ్మనుచు డాయుచు శరమ్ము లరిఁబోయుచు ర
                  య మ్మెసగనేయుచు జలమ్మొదవఁగా నొ
క్కుమ్మడిఁ బరాక్రమముల మ్మెరసి రక్తములు
                  గ్రమ్ముకొని మేను లగరమ్ము దిగజారన్
రమ్మనుచుఁ జీరుచు జవ మ్మెసఁగ నుగ్రసమ
                  ర మ్మపుడు చేసిరి బలమ్ములు చెలంగన్.

96

ప్రౌఢకవిమల్లన రుక్మాంగదచరిత్ర

మత్తకోకిల.

అమ్మునీశనివాసశక్తి దదంగరాజ్యమునందు మే
ఘమ్ములెల్ల కెలంకులం గడుగ్రమ్మి సర్వజనప్రమో
దమ్ముగాఁ బ్రపతద్బృహజ్జలధార లొప్పఁగ వృష్టి చే
సె మ్మహానదులు న్మహాసరసీవసమ్ములు నిండఁగాన్.

97

అరణ్యపర్వము

34 లక్షణము

క.

అమరఁ గృతులందుఁ బ్రథమాం
తములపయిన్ నిలుచు కచటతపలకు నాదే
శము గసడదవ లగు న్ని
క్కమ యాత్మాస్మత్పదములు గాక మహేశా!

98


గీ.

కాకు సంబోధనావ్యయకర్మధార
యంబులన చేతనంబుల నగు వికల్ప
మనియె మును ముద్దరాజు రామనసులక్ష్య
ములు వినము కాకు సంబోధనలకు భర్గ.

99

అవ్యయమున కాదేశము రానందునకు

మ.

ధృతరాష్ట్రుండును బుత్రులున్ ననము కుంతీనందను ల్సింహము
ల్మతినూహింప నసింహమైనవనమున్ మర్దింతు రెందు న్వనా
వృతవృత్తంబులు గాని సింహములకు న్వేగంబ చేటొందుఁ గా
నతగం బొందుట కార్య మీయుభయము న్సంతుష్టమైయున్కికిన్.

100

ఉద్యోగపర్వము

ఉ.

ఏచిన యాపురత్రయము నేకశరంబున రూపుమాపఁగాఁ
జూచినఁ బోవుఁగాని పెఱచొప్పునఁ బోవదు సంగరోన్ముఖుం
డై చనుదెంచెనేని మదనాంతకుచే నది చెల్లు నొర్లకుం
గోచర మెట్లగుం జనుఁడు గొబ్బున మీరు మహాత్ముపాలికిన్.

101

కర్ణపర్వము

ఆదేశము వచ్చుటకు

క.

ప్రదర ప్రవాహమున న
మ్మదవద్విరదంబు పటుగమన ముడిపి ముదం
బొదవిన సాత్యకివిలుబి
ట్టు దునిమె నమ్మగధనాథుఁడు మహోగ్రుండై.

102

ద్రోణపర్వము

క.

ఆసభ నమ్మెయి నీదు
శ్శాసనుఁ డప్పాండుపుత్రసతిఁ గ్రూరాత్ముం
డై సీరలోలిచి పెద్దయు
గాసిం బెట్టంగ నెఱిఁగి కలఁగినమదితోన్.

103

స్త్రీపర్వము

చ.

అసమునమీ దెఱుంగక మహాగ్రహవృత్తిఁ గడంగి చెచ్చరం
బసులకుఁ గూయిగాఁ జనియెఁ బాపఁడు కౌరవసేన యేడ నొం
టి సనుట యేడ నా కిది కడిందివిచారము పుట్టె సైన్యముల్
వెసఁ జని తోడు గావలయు వేగము పంపుఁడు చాలినట్లుగన్.

104

విరాటపర్వము

కర్మధారయమునకు నాదేశము రానందుకు

చ.

అకుటిలుఁ డార్యవర్తనుఁ డహంకృతిదూరుఁడు నీతినిర్మలా
త్మకుఁ డనవద్యశీలుఁడు సుధర్ముఁడు భీముఁడు కుంతి ముద్దుసే
యుకొడుకు మేను లేఁత తనయుల్లము మెత్తన యిట్టియీతఁ డె
ట్లొకొ యొరు నాశ్రయించు విధి యోపఁడె యెవ్వరి నిట్లు సేయఁగన్.

105

విరాటపర్వము

ఆదేశము వచ్చినందుకు

చ.

తెగి మన కగ్గమై యలుఁగు దెంచినవాఁ డితఁ డల్క నింక నొం
డుగడకుఁ బోవకుండఁగఁ గడున్వెస డగ్గరి యేకపాలముం
బగులుతునో గదానిహతి బార్థవత్ప్రకటప్రతిజ్ఞకై
తగదని మాచె దీని నిశితప్రదరంబులఁ ద్రుంపు కంఠమున్.

106

కర్ణపర్వము

క.

వేసేతులు నిడుపగు బా
ణాసనము గుణస్వనోగ్ర మగునట్లుగ ను
ల్లాసంబునఁ ద్రిప్పుచు ఘో
రాసురుఁడు వరాహుఁ డొప్పె నఖిలధ్వజినిన్.

107

ఎఱ్ఱాప్రగడ హరివంశము

క.

నగరులలోపలిమాటలు
తగునే వెలి నుగ్గడింపఁ దన కేర్పడ నొం
డుగడ న్బుట్టినపతి విన
నగుపని చెప్పెడిది గాక యాతనితోడన్.

108

విరాటపర్వము

అచేతనమునకు ఆదేశము రానందుకు

క.

నాపతులగు గంధర్వుల
చే పడి మృతిఁ బొందె వీఁడె సింహబలుం డీ
పాపాత్మునిఁ జూడుఁడు దు
ర్వ్యా పారఫలంబుఁ గాంచె నని పలుకుటయున్.

109

విరాటపర్వము

ఆదేశము వచ్చినందుకు

క.

కావలియై సురరాజ్య
శ్రీవాలింపంగఁ దగువిశేషంబున సం
భావితుఁడు నహుషుఁ డనఁ జని
యావిభుఁ గని తారు వారు నధికప్రీతిన్.

110

ఉద్యోగపర్వము

క.

పిదపఁ గలికాళచోళుం
డుదయంబై జలధిపరిమితోర్వీవలయం
బు దనకుఁ బంటపొలమ్ముగ
నెదు రెందును లేక పేర్మి నెసఁగన్ బెసఁగన్.

111

ఉత్తరరామాయణము

క.

కైసేసి మదవికారో
ల్లాసంబున మేనుపొంగ లఘుగతి నుత్కం
ఠాసవపానవిధాన
వ్యాసంగతరంగితాంతరంగుం డగుచున్.

112

విరాటపర్వము

వ.

ఒకానొకచోఁ గ్రియాపదములకు నాదేశము వచ్చును. అందుకు,


చ.

కుదురు సమస్తధర్మములకు న్విను సత్యము యోగమోక్షస
తృదములు సత్యకార్యములు పాప మసత్యముకంటె నొండు లే
దు దలఁప నశ్వమేధములు తొమ్మిదినూరులు వెండినూరునై
యొదవిన నీడు గాదు భరతోత్తమ సత్యముతోడ నారయన్.

113

శాంతిపర్వము

వ.

చేతనములకు వికల్పము లేదు.

ఆదేశము వచ్చుటకు

చ.

డిగకుఁడు వాహనంబులు కడిందిమగంటిమి గోలుపోవ మీ
రు గడఁక దక్కిపెట్టకుఁడు రూపర నాయుధముల్ మహాస్త్రశ
క్తి గెలుతు సంపతత్కులిశతీవ్రశరంబుల ధీరబుద్ధిబా
రి గను విహారభంగుల నరిప్రకరంబులు పిచ్చలింపఁగన్.

114

ద్రోణపర్వము

నవికృతశబ్దాత్పరతస్సాంస్కృతికానాం భవంతి గసడదవాః॥

అని శబ్దశాసనసూత్రము.

35 లక్షణము

ఆ.

శబ్దశాసనుండు సంస్కృతశబ్దంబుఁ
దెలుఁగుపదముమీఁద నిలుపునప్పు

డరయ ప్రథమలందు నాదేశ మొదవఁద
టంచు సూత్రమున విధించియుంచె.

115

అందుకు సంస్కృతపదము తెనుఁగుపదముమీఁద నాదేశము వచ్చుటకు

క.

అవిముక్తం బవిముక్తం
బవిముక్తం బనుచుఁ బ్రాతరారంభములం
దనధానపరత నెవ్వం
డు పఠించును వాఁడు ధన్యుఁడు మునిప్రవరా.

116

శ్రీనాథుని కాశీఖండము

క.

అది మొదలుగాఁగ విష్ణుని
మది నిల్పి యతండు నాకు మగఁ డగునని యి
ట్లు దపంబు సేయుచుండెద
నిది నా తెరఁ గనిన దానవేశ్వరుఁ డనియెన్.

117

తిక్కన యుత్తరరామాయణము

మ.

వివిధోర్వీపతులం జగన్నుతుల ము న్వీక్షింపమో వారిపెం
పు వరీక్షింపమొ నింపమో చెలిమి యేభూపాలురందైన నీ
భువనత్రాణపరాయణోద్భటభుజాభూరిప్రతాపంబు నీ
జవనాక్షీణబలంబు గంటిమె వసుక్ష్మామండలాఖండలా.

118

వసుచరిత్ర

36 లక్షణము

క.

విదితముగఁ దాను నేనను
పదములు ప్రథములయి నాంతపదము లగుటఁ దాఁ

జదివెను నేఁ జదివితినని
వదలక యిరుదెరఁగుఁ బలుకవచ్చు మహేశా.

119

ఆదేశము రానందుకు

క.

నీ చెప్పిన పెద్దలు ద్రో
ణాచార్యులు మొదలుగాఁ గవని కొల్లనివా
రై చన్న వారలంగొని
యేచక్కంబెట్టువాఁడ నేపాండవులన్.

120

ఉద్యోగపర్వము

ఆదేశము వచ్చుటకు

క.

ఏఁగోరిన చెలువుఁ డెనను
దాఁ గవలెనంచు వచ్చి డగ్గరి వేఁడన్
గౌఁగిలి యియ్యక వచ్చితి
నౌఁ గాదని పెనఁగి యెంతయవివేకమయో.

121

విజయవిలాసము

37 లక్షణము

క.

తెనుఁగుఁగృతిఁ గొన్నియెడలం
దనరఁగ వాక్యాంతగతపదముల నకారం
బునకు లోపంబొదవును
ఘనతరఘోరాట్తురంగ కలుషవిభంగా.

122

నకారము లోపించుటకు

,
గీ.

మత్పితామహు ధీపితామహునిఁ దలఁతుఁ
గలితకావ్యకళాలాభుఁ గమలనాభుఁ
జంద్రచందనమందారసదృశకీర్తి

సరససాహిత్యసామ్రాజ్యచక్రవర్తి

123

కాశీఖండము

38 లక్షణము

.
ఆ.

ఏఁడునూ రనంగ మూఁడునా ళ్ళనఁగ ను
బాడును య్యనంగఁ బరగుశబ్ద
ముల నకారములును వలనొప్పడూలతో
శ్లిష్టమగుచునుండు శ్రీమహేశ.

124


సీ.

కాశికానగరోపకంఠదేశము డాసి
                  యేణ్నూరుముఖముల నేగె జలధి.

125

కాశీఖండము

గీ.

ఇంక రెణ్నాళ్ళు జూచి నీవంకఁ దెగువ
గలుగకుండిన బ్రజయూళ్ళు దలఁగిపోవు
మౌనివగుటొండె యొండె విహీనసంధి
నతనిఁ గనుఁగొంటగా కొండుమతము గలదె.

126

ఆముక్తమాల్యద

39 లక్షణము

గీ.

సంస్కృతపదంబుఁ దగ విశేషణము జేసి
సంధిఁ గూర్పంగ నాలనుశబ్దమునకు
మొదల రేఫము గదియును సదయురాలు
పుణ్యురా ల్ధన్యురా లన భుజగభూష.

127


గీ.

ప్రియము గల్గిన నంగీకరింపవలదు
ముండదీవెన రేపాడి మొగముఁ జూచి

బైసిమాలిన పరమనిర్భాగ్యురాలు
విధవ దా నిచ్చునాయువు విషసమంబు.

128

కాశీఖండము

సీ.

ఒక్కింతశంకింపకున్న సాహసురాల
                  వేటికి వెరపు నీ కిత్తెఱఁగున

129

హరిశ్చంద్రోపాఖ్యానము

వ.

కడమవానికి యీలాగే తెలుసుకొనునది.

40 లక్షణము

గీ.

ఉందు రందురు కందురు కొందు రనఁగ
నుంతు రెంతురు తగ భుజియింతు రనఁగ
దగుఁ గ్రియలమీఁది రేఫలు దాపలిదెస
యక్కరముతోడ శ్లిష్టమై యలరు నభవ.

130

ఉందు రనుటకు

గీ.

మమ్ము రక్షించి తనియేల మాటిమాటి
కభినుతింపంగ దక్షవాటాధినాథ
తల్లిదండ్రులు రక్షింపఁదలఁపకుండ్రి
ప్రజల భీమేశ బహువిధోపద్రవముల.

131

భీమఖండము

అందు రనుటకు

సీ.

వట మండ్రు గొందఱు వటమేని యూడలు
                  వారిమండల మెల్లఁ ప్రబలవలదె

132

కవికర్ణసాయనము

అనుభవింతురనుటకు

ఆ.

తగిలి రుజయు జరయు దైవవశంబున
నయ్యె నేని దాని ననుభవింత్రు
గాక యెఱిఁగి యెఱిఁగి కడఁగి యారెంటిఁ జే
కొందురయ్య యెట్టికుమతులైన.

133

ఆదిపర్వము

గీ.

బలముగలవానిఁ బలువురు బలవిహీను
లొక్కటై కూడి నిర్జింప నుత్సహింత్రు
మధువుఁ గొననుత్సహించినమనుజూఁ బట్టి
కుట్టి నిర్జించుమధుమక్షికులమునట్లు.

134

ఆరణ్యపర్వము

41 లక్షణము

క.

బాలులు నరపాలులు గుణ
శీలులు నను లులకు రూలు జెందుం గరుణా
శాలులు దృఢతాలులు నన
గాలిలులకు రూలు రావు కాయజదమనా.

135


గీ.

దేవతాభర్త శంభుప్రతిష్ఠఁ జేసి
సురగణంబుల లోకపాలురను జూచి
యనియె మీరును భీమనాయకునివీట
సిద్దశివలింగములఁ బ్రతిష్ఠింపవలయు.

136

భీమఖండము

మ.

మరుదంభోరుహనేత్ర లంబరధునీమధ్యంబున న్నిల్వ ని
ష్ఠురతత్పీనపయోధరాహతిజలస్తోమంబు నల్వంకలం

దెరల న్నాభిచయంబు లోఁగొనియె వానిం జాలగాంభీర్యశీ
లురు సంక్షోభమునొందువారి నెచటన్ లోఁగొంచు వర్తింపరే.

137

పారిజాతాపహరణము

క.

ఇరువదియేవురుపాంచా
లురు నూర్వురుకేకయులును లూనాంగకులై
ధర దొరిగి వీరరక్తము
కరినికరము రొంపిఁబడినగతి నుండె నృపా

138

ద్రోణపర్వము

42 లక్షణము

క.

మల్లులనుశబ్దమునకున్
మల్లులు మల్లురని కృతుల మానుగఁ బలుకం
జెల్లును గవియనుమతి నహి
వల్లభకేయూరదురితవారవిదూరా.

139

మల్లు లనుటకు

చ.

వలసిన నేలు మేను బలవంతుఁడఁగారెనుబోతు దంతి బె
బ్బులి మృగనాథునిం దొడరి పోరుదు శూరత యుల్లసిల్లగా
దలమును లావు విద్య మెయి దర్పము బేర్చి పెనంగు జెట్టిమ
ల్లుల విరుతున్ మఱిన్ గడియలో నన చూడ్కికి వేడ్క సేయుచున్.

140

విరాటపర్వము

మల్లు రనుటకు

మ.

అరరే యయ్యలురామరాజు పెదతిమ్మాధీశు బాహాభయం
కరకౌక్షేయకధార భోరనఁ గడంకం ద్రెవ్వు వీరారిమ

ల్లురకున్ మట్టియ గుందదీయ బళధూళు ల్సంగడాలౌ వియ
చ్చరకాంతాస్తనపాళివిన్గరడి కాశ్చర్యంబు చర్చింపఁగన్.

141

రామాభ్యుదయము

43 లక్షణము

క.

విన్నారరు కన్నారరు
నున్నారరు ననుచుఁ బలుక నొప్పుం గృతులం
జెన్నగు మధ్యమపురుషకుఁ
బన్నగకులరాజహార భవభయదూరా.

142

ఉన్నార రనుటకు

క.

గురుఁడును నీవును మద్రే
శ్వరుఁడును గర్ణుండు గృపుఁడు సౌబలుఁడున్ నన్
ధర యేలింపఁగ నున్నా
రరు నీకుం జనునె సంగరములోఁ గలఁగన్.

143

ద్రోణపర్వము

44 లక్షణము

క.

నులుడులునడుమంగలపద
ములయుత్వము లడఁగుఁ గావ్యములఁ జిల్క యనం
జిలుక యనఁ గిన్క కిను కన
నలి గా డ్పన గాడు పనఁగ నందితురంగా.

144

చిల్క యనుటకు

ఉ.

చంపకగంధి మోవి సరసంబగుబింబ మటంచుఁ బట్టి తే
లింపుటెలుంగుతోఁ దమిఁ దలిర్పఁగఁ బల్కినఁ జెక్కు గీటినన్

న్నింపున ముద్దు వెట్టుకొని యెప్పుడు మన్నన చేయనున్నదో
పెంపుడుజిల్క నిన్ను మరపింతుఁ జుమీ చెలి నన్ను నేలినన్.

155

విజయవిలాసము

గాడ్పనుటకు

క.

చిచ్చునకు గాడ్పు తోడై
వచ్చినగతి మరున కబ్జవైరియుఁ దోడై
వచ్చె నడియాస వలదిఁక
మచ్చికఁ దలపోసి నన్ను మది మరువకుమీ.

156

కవికర్ణరసాయనము

45 లక్షణము

ఆ.

కలికి కొలికి ములికి కడిగి యడిగి యనంగఁ
కలిమి బలిమి చెలిమి తెలివి యనఁగ
నునికి మనికి వినికి యనుపదంబులకడ
యక్కరములు శ్లిష్ట మగు మహేశ.

147

కల్కి యనుటకు

సీ.

గరళాంజనము కల్కి క్రాలుగన్నులఁ దీర్చి
                  మధుపానమున నుబ్బు మదికి నొసఁగి

148

కాశీఖండము

కొల్కి యనుటకు

చ.

చిలుకలకొల్కి కంధర భజింపఁగఁ జెల్లదె కంధరాంకమున్

149

వసుచరిత్ర

ముల్కి యనుటకు

ఉ.

మంపెసఁగన్ గటాక్షలవమాత్రముచేతనె ముజ్జగంబు మో
హింపఁగఁజేయు భార మిఁక నీవు వహించితి గాక కేళినీ
చంపకగంధి బిత్తరపుఁజన్నులమీఁద సుఖించుకొంచు నా
సంపెంగమొగ్గముల్కి గడుసా మరి సోమరి గాక యుండునే.

150

విజయవిలాసము

కడ్గి యనుటకు

చ.

అడుగులు గడ్గి ప్రీతి యసలారగఁ దద్దయు నెమ్మబల్కి ర
ప్పుడు మది పల్లవింప మునిపుంగవుఁ డాతని కాత్మభాగ మె
క్కుడగువిభూతిఁ జూపి

151

శల్యపర్వము

వ.

కడమ అన్నీ యీలాగే తెలియునది.

46 లక్షణము

గీ.

యుష్మ దస్మ త్పదంబులం దొనర ఘనుఁడ
వైన నీవును నధికుఁడనైన నేను
ననెడుచో ఘనుఁడైన నీ వధికుఁడైన
నే ననంగ వునుల్ వాయు నీలకంఠ.

152

యుష్మత్పదంబునకు

శా.

శీఘ్రం బేటికి వచ్చి సంసృతిభవశ్రీసౌఖ్యగంధంబు దాఁ
నాఘ్రాణింప నిమిత్తనూజుల దురాత్మాభిక్షులం జేసినన్
శుఘ్రదివ్యవమగ్నుఁ జేసితి కృపాశూన్యుండవై గోముఖ!
వ్యాఘ్రం బింతియగాక నీవు ఋషివే యాహా వితర్కింపఁగన్.

153

కవులషష్ఠము

మ.

జయలక్ష్మీధవుఁ డైననీవు దగ మత్సామ్రాజ్యభోగంబుల
న్నియు నర్సించితి నీ కృపారతి శరన్నీరేజపత్రాయతా
క్షు యదూత్తంసు మునీంద్రమానసరిరంసుం గంసవిధ్వంసు న
వ్యయు నద్వైతు భజించి యవ్విభుని సేవం గాంతు నిష్టార్థముల్.

154

జైమినీ భారతము

మ.

జననంబొందితి దుగ్ధవారినిధి నాసర్వేశుజూటంబుపై
జను లేప్రొద్దుఁ బ్రశంస సేయ నవతంసంబైతి నీ ప్రాభవం
బునకుం బాంధజనాపకారియగు నాపూవిల్తునిం గూడి వా
రనిదుష్కీర్తిగ తిట్టునం బడకు చంద్రా రోహిణీవల్లభా.

155

పిల్లలమఱ్ఱి వీరన్న శకుంతలాపరిణయము

చ.

అరుదుగ నీవిమానము బ్రజాధిపుడుం బురుషోత్తముండు శం
కరుఁడును దక్క నన్యులకు గా దధిరోహ మొనర్ప వారిసు
స్థిరకరుణావిశేషమున జిష్ణుఁడనైఁ గయికొంటి దీని నే
నరవర సర్వసద్గుణగణంబులప్రోవగునీ కొసంగితిన్.

156

వసుచరిత్ర

క.

ఏ నీకు నొకటి చెప్పెద
దానవకులముఖ్య దేవతలకు నవధ్యుం
డైన నినుబోఁటివాఁ డీ
మానవుల జయింప విక్రమమునుం గలదే.

157

ఉత్తరరామాయణము

అస్మత్పదంబునకు

గీ.

అధికతాపపరీతాత్ముఁడైన నాకు
నెట్లు వచ్చితి చలిగాడ్పునట్లు నీవు

పూర్వజన్మమహాతపస్ఫురణ నాకు
నీదుసన్నిధి సమకూరె నిధియపోలె

158

నైషధము

."
సీ.గీ.

రండు నను గూడి యోపరివ్రాట్టులార
వత్సలత మీఱఁ మీ రేల వత్తురయ్య
పరమనిర్భాగ్యుఁడైన నాపజ్జ దగిలి
కటకటా సౌఖ్యజలరాశిఁ గాశిఁ బాసి.

159

కాశీఖండము

చ.

హరిహరపద్మగర్భులను నాదికవీంద్రుల నూత్నసత్కవీ
శ్వరులను భ క్తిఁ గొల్చి తగ వారికృపం గవితావిలాసవి
స్తరమహనియ్యుఁ డైననను సర్వగుణోత్తరమూర్తి మన్మభూ
వరుఁడు దగంగ రాఁబిలిచి వారనిమన్నన నాదరింపుచున్.

160

ఉత్తరరామాయణము

చ.

వరమునఁ బుట్టితి న్భరతవంశముఁ జొచ్చితి నందు పాండుభూ
వరునకుఁ గోడ లైతి జనవంద్యులఁ బొందితి నీతివిక్రమ
స్థిరులగు పుత్రులం బడసితి న్సహజనులప్రాపుఁ గాంచితిన్
సరసిజనాభ యిన్నిటఁ బ్రశస్తికి నెక్కినదాన నెంతయున్.

161

ఉద్యోగపర్వము

47 లక్షణము

గీ.

యుష్మదర్థంబు బహువచనోక్తిఁ బలుకు
నపుడు ఘనులు బ్రసిద్ధులు ననుపదముల
కలర ఘనులరు కడుఁబ్రసిద్దులరు మీ ర
నంగఁ జను గావ్యములయం దనంగదమన.

162

చ.

భరతకులప్రసిద్ధులరు భాసురశస్త్రమహాస్త్రవిద్యలం
గరము బ్రసిద్ధుఁడై పరగు గౌతముశిష్యుల రిట్టిమీరు దు
ష్కరముగ నూతిలోఁ బడిన కాంచనపీడఁ గొనంగనేర కొం
డొరులమొగంబు జూచి నగుచుండఁగ జన్నె యుపాయహీనతన్.

163

ఆదిపర్వము

క.

మీరును గుంతియు సహపరి
వారమహామాత్యభృత్యవర్గులరై నా
నారాజ్యలీలతోఁ జని
సారమతిం జేయుఁ డందు సతతోత్సవముల్.

164

ఉద్యోగపర్వము

సీ.

వడముడియును నీవు వాయు వాసవు లశ
                  క్తులు ధరియించిన దుర్జయులరు

165

శాంతిపర్వము

48 లక్షణము

క.

నురులుఱులు పొల్లు లగుచుం
దిరముగఁ బైహల్లు గదిసి ద్విత్వముఁ జెందు
న్సరవి నవి వేఱె యుండున్
గరిదైత్యవినాశ శైలకన్యాధీశా.

166


వ.

నులులకు సులభమే కనక దురులకుఁ జెప్పుచున్నాము.


ఉ.

త్యాగులు బాతకేతరులునై నుతి కెక్కఁగ నాకలోకలీ
లాగరిమంబు నంబురము లాగు దనర్చిన సంస్కృతోల్లస
ద్వాగభియుక్తి నాత్మవిభుధత్వము సిద్ధత నొందఁగా సుధా
యోగము నొందుదు ర్శ్రుతిపయోధి మధించి రసజ్ఞులై కవుల్.

167

ఎఱ్ఱప్రెగడ హరివంశము

క.

వినుము రిచివునకు తనయుం
డనఘా యతితారనైజుఁ డతనికి మువ్వు
ర్తనయులు సుమతియు ధృఢుడును
ఘనుడు ప్రతిరథుఁడు ననఁ బ్రకాశితతేజుల్.

168

ఎఱ్ఱప్రెగడ హరివంశము

సీ.

శాకపాకములతో సంభారములతోడఁ
                  బరిపక్వమగు పెసర్పప్పుతోడ

169

భీమఖండము

క.

భూతప్రేతపిశాచ
వ్రాతములుం దోడుగాఁగఁ బ్రమథులు పగలున్
రాతిరియును నష్టాదశ
జాతిప్రజలకును దుర్దశలు సంధింతున్.

170

శ్రీనాథుని హరవిలాసము

మ.

పరిహాసంబునఁ దేలి భృత్యులయెడన్ బ్రహ్లాదము న్బొందుభూ
వరునాజ్ఞం జన రీగి మెచ్చరు పని న్వంచింతు రెగ్గాడజొ
త్తురు కౌతూహలవేషభాషణములుం దుల్యత్వముం బొంది యే
తురు వారెల్లపదంబు వేడుదు రుసింతు ర్భూమిమారొండునన్.

171

శాంతిపర్వము

శకటరేఫకు

సీ.

మగడు ద న్మొత్తుచో మాఱ్మొత్తునలివేణి
                  వ్యాఘ్రియై చరియించు వనములోన

172

కాశీఖండము

49 లక్షణము

ఆ.

లేవనెత్తుటయును చావకయుండుట
వెఱవకుండుటయును మఱువకుంట
నొవ్వనేయుట నెడు నుడువులఁ గలవకా
రమ్ము లోప మొందు రాజమకుట.

173

లేనె త్తనుటకు

మ.

తనతో నల్గినవాణిపాదములమీఁదన్ వ్రాల లేనెత్త నొ
య్యన పాశ్చాత్యనిజాస్యతన్ముఖములం దన్యోన్య మొక్కప్డు చుం
బన మబ్బంగ జతుర్ముఖత్వము ఫలింపం జొక్కు పద్మాసనుం
డనవద్యాయురుదీర్ణుఁ జేయు చికతిమ్మాధీశు తిమ్మాధిపున్.

174

కవులషష్ఠము

చాకుం డనుటకు

శా.

ఆకేశధ్వజుఁ డంత నానృపునిరాజ్యంబెల్ల జేరన్ ఫలం
బాకాంక్షింపఁగ గెల్తు మృత్యువు నవిద్యం బుట్టకుండం దుదం
జాకుండన్వలెనంచు యోగనిరతిన్ జ్ఞానాశ్రయుండై మహా
నీకంబున్ రచియించుచుం డొకటికిన్ దీక్షించి తానున్నచోన్.

175

ఆముక్తమాల్యద

క.

చాకున్న నీదుముక్తులు
శ్రీకాశీక్షేత్ర మెవ్వరికి నిది నిక్కం
బీరుధరమిచ్చు శిఖరా
లోకనమాత్రమున ముక్తులు కురంగాక్షీ.

176

కాశీఖండము

క.

నాలుగుదిశలను దాప
జ్వాలావలి గదిసె మ్రంది చానోపఁ గృపా

లోలా నన్నొక్కసరి
త్కూలముఁ జేరంగ నెత్తికొనిపొమ్ము దయన్.

177

ఆరణ్యపర్వము

వెఱకుండుటకు

గీ.

చెంచునింటికిఁ బోయి చెంచెతకుఁ బ్రియము
చెప్పి నమ్మించిత తలమీఁదఁ జేయి వెట్టి
వెఱకుమని తన్ముఖంబున నెఱుకుఱేనిఁ
గాంచియాతనితోడ సఖ్యంబుఁ జేసి.

178

కాశీఖండము

నోనేయుటకు

సీ.

అర్జునుపైఁ గూర్మి నతని నోనేయఁడు
                  సచరాచరంబైన జగము నెల్ల

179

ఉద్యోగపర్వము

గీ.

బలము నచ్చెరువందున ట్లలవు మెరయ
నీసుతుం డనిలజుఁ దాకి నిశితిసాయ
కముల నొప్పించి రథతురంగముల నొంచి
నూతు నోనేయఁ గ్రోధవిస్ఫూర్తి నతఁడు.

180

ద్రోణపర్వము

50 లక్షణము

గీ.

మూఁడులింగంబులకును సముచ్చయార్ధ
ములఁ దెనుంగునఁ గలపదములకు నెల్ల
యునులు వచ్చు నికారాంతమున కొకొక్క
తరినిఁ బొల్లనకారంబు దొరియు నభవ.

181

చ.

అనలుఁడు రెండుమూడు యముఁ డాసురనాథుఁడు నాలుగైదు తో
యనిధిపుఁ డాఱు గంధవహుఁ డర్ధపుఁ డేడు మహేశుఁ డెన్మిదిన్
ఘనవిశిఖంబు లేయ మురఘస్మరుఁ డన్నియుఁ ద్రుంచి శార్ఙసం
జనితమహోగ్రభల్లముఖజర్ఝరితాంగులఁ జేసె నందఱన్.

182

పారిజాతాపహరణము

చ.

ఎఱుఁగవు గాక యొక్కపు డొకించుకమాఱ్మొగ మిడ్డకూర్మికిం
గొఱతయె యెంత చెప్పినను గోమలి నేరవయల్కఁ దెచ్చుకో
నెఱియ నధీన మౌ టెఱిఁగి నేడిది గైగయికోమి మిక్కిలి
న్పెఱపె నతండు నీవు విననేర్చెదె మాపలు కిప్పుడేనియున్.

183

కశాపూర్ణోదయము

శా.

వాలిం గీలియు వాయుపుత్రుసరియే వాఁ డాత్మశక్తిజ్ఞుఁడై

184

ఉత్తరరామాయణము

చ.

వలసిన నేలు మేను బలవంతుఁడఁ బోరుదు. . . . . . మ
ల్లుల విరతున్ మరిం గడియలో నన చూడ్కికి వేడ్కసేయుచున్

185

విరాటపర్వము

క.

అనుజులకు నడ్డపడి యే
మిని జేయఁగలేమిఁ జూచి మెచ్చితిగా నీ
వును సాదు రేగెనేని
న్వినుదలపొలమునన కాని నిలువదు సుమ్మీ.

186

ఉద్యోగ పర్వము

51 లక్షణము

క.

తివరిచి యొనరిచి యమరిచి
యనుపదముల రీలు సంధి నడఁగున్ బొడము

న్వినుము తనర్చి యొనర్చియు
ననఁగ నమర్చియు ననంగ నంగజదమనా

187


క.

బొమలు ముడివడఁగఁ బిడికిలి
యమరిచి కోపంబుతోడ నౌడు గఱచుచున్
జముచాడ్పున నాహరి ను
గ్రముగాఁ బయిఁబడుట దా మొగంబున వ్రేలున్.

188

ఎఱ్ఱప్రెగడ హరివంశము

అమర్చి యనుటకు

ఉ.

 లాలసరీగజాంకుశతలంపులసొంపులతమ్మిచూలి యీ
సేలయు నింగి దట్టముగ నిండ నమర్చిన యయ్యసంబుచే

189

యయాతిచరిత్ర

52 లక్షణము

గీ.

తాయెదయు నుయ్యెలయుఁ బయ్యెదయు ననంగఁ
గలుగ దత్వంబు మధ్యయకారమునకు
ననుచు మును ముద్దరాజు రామన వచించెఁ
గాని యత్వంబుఁ గృతులందుఁ గలదు శర్వ.

190

తాయెదయని యెత్వము వచ్చుటకు

సీ.

ఒకయింత యెరగినసికమీఁదముడి పువ్వు
                  టెత్తులవొలయ తాయెదలు జుట్టి

191

చంద్రభానుచరిత్ర

ఉయ్యెల యనుటకు

చ.

కలి దమయంతి పోప సమకట్టి పొరింబొరిఁ బాయనోపఁ డా
లలనను దీర్ణసౌహృదబలంబున నిట్టులు రెంటియందు న

న్నలుఁడు విమోహరజ్జుల బెనంగి గతాగతకాయ యయ్యె ను
య్యెలయునుబోలె నూరకయ యెంతయుఁ బ్రొద్దు వినిశ్చితాత్ముఁడై.

192

ఆరణ్యపర్వము

పయ్యెద యనుటకు

సీ.

వలఁబడ్డ జక్కవల్ బలెనున్న జిలుగుబ
                  య్యెదలోన గుబ్బపాలిండ్లు మెరయ

193

యయాతిచరిత్ర

మ.

పదముల్ దొట్రిలఁ గౌను దీన వెలయింపం గేశముల్ దూలఁ బ
య్యెద వక్షోరుహపాళి చేర కనుదోయి న్బాష్పముల్ గ్రమ్మ గ
ద్గదకంఠంబున వాక్యము ల్దడఁబడన్ దద్గేహముం జొచ్చి యా
సుదతీరత్నము గాంచెఁ బాలుని మనశ్శోకానలజ్వాలునిన్.

194

కవులషష్ఠము

ఉయ్యలయని అత్వము వచ్చుటకు

సీ.గీ.

ఆడుచున్నవి పిప్పళ్ళ నంబరమున
సేయుచున్నవి త్రిభువనాశ్లేషకంబు
లబ్జనాభునితూగుటుయ్యలలు గంటె
వేనవేలు పయోరాశి వీటిఘటలు.

195

భీమఖండము

క.

పలుమరుఁ దలయంటి తగ
న్నలుగిడి దోయిళ్ళ జలమునం బోర్కాడిం
చి లలిం జన్నిచ్చుచు ను
య్యల నూఁపుచుఁ బెనుపఁదొడఁగె నావరశిశువున్.

196

కళాపూర్ణోదయము

శా.

శ్రీలీలాత్మజికృష్ణరాయసమరోర్వి న్నీదువైరిక్షమా
పాటు ల్వీఁగి హయాధిరూఢు లగుచున్ బార న్వనీశాఖశా
ఖాలగ్నాయితకేశపాశలయి తూగం గేకిస ల్గొట్టి యు
య్యాలో జొంపము లంచుఁ బాడుదురు భిల్లాంభోజపత్రేక్షణన్.

197

పయ్యదయని అత్వము వచ్చుటకు

కదిరినవేడిబాష్పములు గ్రమ్మి పయింబయిఁ బర్వ భీతి మై
నదరుచు విన్ననైన హృదయంబునఁ బొల్పగు హారయష్టి ప
య్యద దడియంగఁ గానఁబడె నంచితనిర్మలరత్నభూస్థలిన్
దదుదితదృశ్యమానమణిదామసముజ్వలభాాతిఁ దోపఁగన్.

198

భాస్కరరామాయణము

53 లక్షణము

క.

ఇల నాయీయేలగుపద
ముల పైఁ బెర వ్రాలు గదియ మొదలవిసాగుల్
లలిగ్రుంగుఁగ్రుంగు నెడవల
పలి వ్రాలకు జడ్డ లొదవుఁ బర్వతనిలయా.

199


ఆ.

ఆకుమారి యనఁగ నక్కుమారి యనంగ
నీగయాళి యనఁగ నిగ్గయాళి
యేచెనంటి యనఁగ నెచ్చెనంటి యనంగఁ
జెల్లుఁ గృతులయందు శ్రీమహేశ.

200


క.

ఆరయఁ దచ్ఛబ్దాదుల
పై రేఫోష్మములు మొదలబడు పదము లిడన్
జేరవు హ్రస్యద్విత్వము
లారాఘవుఁ డాశరంబు లన నొప్పుశివా.

201


క.

తగఁ గృతుల గకారమునకు
నగు నొక్కొకచో వకార మాంధ్రపదములన్

నగ రనఁగ నవ రనంగాఁ
పగడము పవడం బనంగఁ బర్వతనిలయా.

202


క.

వివిధోత్పాతంబులకును
నవళ్ళలో దోఁచుకీడునకుఁ దోడ్తో శాం
తివిధానమున నిరసనం
బవును పురోహితునిచేత ననవద్యముగన్.

203

శాంతిపర్వము

క.

అవయవము లెట్లు కూర్మము
నివుడించును లోని కడఁచు నెరి నట్లన భూ
తవితతి భూతాత్ముండును
బ్రవర్తననివర్తనములఁ బాల్పడఁజేయున్.

204

54 లక్షణము

క.

కావింపుట కావించుట
భావింపుట మఱియు దీని భావించు టనన్
గా వెలయుఁ గృతులఁ దుహిన
గ్రావసుతాప్రాణనాథ ప్రమథసనాథా.

205

కావింపుట సులభమే. కావించుటకు.

ఉ.

మంచిగ మేనయత్తలు .................................పు
త్తెంచిన................................................................భ
క్షించుచుఁ దల్లిదండ్రి తనచిన్నకరాంగుళి వంచి.......యూ
ఱించుచు నాడె మిన్నగమి ఱేఁడుకుమారకుఁ డింటిముంగిటన్.

206

శ్రీనాథునిహరవిలాసము

గీ.

కమలనేత్ర యవస్థానవిముఖమైన

చంచలత్వంబు మది బ్రకాశించుచుండె
బాల యాలీల నభ్యసింపంగ బోలు
రమణదూతపతంగచం-క్రమముతోడ|.

207

నైషధము

ఉ.

చంచలనేత్ర దాల్చు జలజాతమృణాళసరంబు లేవస
ళ్ళించిన బారుతెంచి కబళించితదూష్మకు నంగలార్చు రా
యంచకు చేష్ట గాంచి యిఁకనైనను గందుమొ యంచు మోము వీ
క్షించఁగదోచు లేనగవు చేరుచు బోట్ల కొకింతప్రాణమున్.

208

ఆముక్తమాల్యద

మహాస్రగ్ధర.

పరభూభృత్ప్రాప్తి నబ్ధిం బడు రవిహరులం బ్రౌఢి వాటించ వెందున్
సరిగాఁ దద్ఘ్రీంకృతుల్ సైసకరవిహరిగా జాయకున్ రానడంచున్.

209

వసుచరిత్ర

శా.

అంచున్ రాయడివన్నెరాల్ పులుగుఱేఁ డాసీను లూత ల్గొనం
బంచాస్యంబులు గల్గు పాపదొర గ్రామ్యబ్రహ్మచారుల్ దువా
ళించన్ బచ్చనవ్రాత లూడిపడు మేల్కీల్గుఱ్ఱమన్యంబులౌ
చంచద్వాహము లుంచు మంటపముపంచం జేరి విశ్రాంతుఁడై.

210

కాకమానురాయని బహులాశ్వచరిత్ర

ఉ.

వంచన జేసి యిట్లు చెలువం గొనిపోవు బ్రలంబవైరి సై
రించునె దుర్మదాధిపవరేణ్యుల భూములు గొట్టి ధూళిగా
వించఁడె పిండిపిండిగను వీరవిరోధికిరీటరత్నముల్
దంచఁడె ఘారశీరముసలంబులు వ్యర్ధములే ధరించుటల్ .

211

విజయవిలాసము

మత్తకోకిల.

పంచసాయక సాయకంబులబారి కోర్వఁగఁజాల కే
నంచయాన వరించునప్పు డొకప్పుడున్ మిము గూడి వ
ర్తించరాదని

212

రుక్మాంగదచరిత్ర

కడమ తెలుసుకొనునది. ఇది సంధిప్రకరణం బిఁక విభక్తిప్రకరణం బెఱింగించెద.