వర్ణప్రకరణము
సీ. |
అఇఉలు ఏఓలు నవి దీర్ఘసహితంబు,
లైఔలు కగచజ లరయ టడణ
తదనలు పబమలు దగ యరలవసహ
ళఱలును దెనుఁగున వఱలుఁగాని
తక్కినవర్ణముల్ దగులవు పదముల,
మొదల వాకుత్వోత్వములు గలుగవు.
లే దెయ్యెడలను శబ్దాది యకారంబు,
వచ్చు నచ్చుల తుది యచ్చున కది
|
|
గీ. |
తుదల క్రియదక్క నేత్వ మెందులను దాని
కెనయనేరదు సత్కవు లిటు లెఱింగి
కావ్యములు గూర్పవలయు విఖ్యాతి మీఱ
నిభదనుజభంగ కుక్కుటాధీశలింగ.
| 1
|
సూ॥ వికృతిపదాదౌ ప్రథమాంతస్థతృతీయానునాసికౌ నస్తః।
కృతిరపి నస్త ఉదోతౌ దంతోష్ఠభవస్య వికృశబ్దాదౌ॥
అని శబ్దశాసనుఁడు చెప్పినాఁడు గనుక వకారమున కుత్వోత్వములును యకారమును దెనుఁగునఁ బదాదిని లేవు.
లక్షణము
|
వాలాయంబుగఁ దెనుంగువ్రా లయ్యుఁ గృతుల్
గ్రాలుచునుండును దొడ్డగు
వ్రాలై దేశ్యంబులగుట వలన మహేశా.
| 2
|
సీ. |
జాణ రాణువ రాణ గాణ విన్నాణంబు
కాణాచి యనెడుదీర్ఘములమీఁదఁ
గాని హ్రస్వముల ణా గలుగదు రవణము
రమణయతక్క నాంధ్రములయందుఁ
బడఁతుక మడఁతుక యడఁకువ యడఁచుట,
కడఁగుట తోడఁగుట పొడఁక కడఁక
పడుకులు వడఁకుట వెడఁగును మడుఁగును
దొడఁకున కడిఁదియు వెడఁద బెడఁద
|
|
గీ. |
యనఁగఁ బరగెడుపదములు నర్ధబిందు
యుతము లైన డకారము లొనరియుండు
కనకశైలేంద్రకోదండ కమలజాండ
భాండసంఘాతపూరిత పటుపిచండ!
| 3
|
లక్షణము
క. |
సిద్ధము సాధ్యము ననఁగఁ బ్ర
సిద్ధములై యిరుదెరగులఁ జెల్లును గృతులం
దిద్ధరణి ననుస్వారము!
లుధ్ధతరిపుదర్పహరణ యురగాభరణా.
| 4
|
ఆ. |
చంద మంద మనెడు సహజబిందువులు సి
ద్ధంబులగు నొయారపుంబడంతి
యన నకారమున నాదేశమై వచ్చు
నవియె సాధ్యములు సురాద్రిచాప.
| 5
|
క. |
అఱసున్న లొదవు నిడుదల
నెఱసున్నలె గద్యములను నిలుచుఁ గృతులలో
నఱసున్నలు నెఱసున్నలు
గుఱుచలపై గలిగియుండుఁ గుక్కుటలింగా.
| 6
|
సీ. |
కొంటిమి తింటిమి వింటివి కంటివి
మని రని రనెడుతిఙ్మధ్యములను
గూఱ్చియన్న ద్వితీయకును శేషషష్ఠికి
వనము ధన మ్మను ప్రథమలందు
నౌర యోహో యనునద్భుతార్ధముల న
క్కట యయో యని వగచుటల నించు
కరవంత యనియెడు కడల బళా మజ్ఝ
యను బ్రశంసనములఁ జని హరించి
|
|
గీ. |
యనెడిచో మిన్న కూరక యనెడుచోట
నప్పు డిపు డనుచో నిన్నె యనెడిచోట!
నరిగెనట యనుచో నేమి యనెడుచోట
మొదలుగాఁ బైనకారంబు లొదవ వీశ.
| 7
|
క. |
కళ లనదగు నివి మఱియు మి
గిలినపదంబులు ద్రుతప్రకృతు లనఁబరగున్
లలిఁ బొల్లు నకారముపైఁ
గలిగి వసించుటను గృతుల గౌరీరమణా.
| 8
|
ఇది సంజ్ఞాప్రకరణం బింక సంధిప్రకరణం బెఱింగించెద.