సత్యశోధన/నాల్గవభాగం/14. కూలీవాళ్ల లొకేషనా లేక పాకీవాళ్ల పల్లెయా?
14. కూలి లొకేషనా లేక పాకీవాళ్ళ పల్లెయా?
హిందూ దేశంలో మనకి అపరిమితంగా సేవ చేసే పాకీ మొదలుగాగల వారిని అసభ్యులుగా భావించి వాళ్ళను ఊరి బయట విడిగా వుంచుతాము. గుజరాతీ భాషలో వారి పల్లెను ఢేడ్‌వాడ అని అంటారు. ఈ పేరును ఉచ్చరించడానికి కూడా జనం అసహ్యించుకొంటారు. యిదేవిధంగా యూరపులో క్రైస్తవ సమాజంలో ఒకానొక కాలంలో యూదులు అస్పృశ్యులుగా భావించబడేవారు. వాళ్ళ కోసం ఏర్పాటు చేయబడిన ఢేడ్‌వాడాను ఘేటో అని అనేవారు. దుర్గుణాలకు చిహ్నంగా దాన్ని పరిగణించేవారు. దక్షిణ ఆఫ్రికాలో అదే విధంగా హిందూ దేశస్థులమంతా పాకీవారుగా పరిగణింపబడేవారం. ఎండ్రూస్ చేసిన ఆత్మ త్యాగం వల్ల, శాస్త్రిగారి మంత్రదండం వల్ల మాకు శుద్ధి జరుగుతుందో లేదో మేము పాకీవారుగా పరిగణించబడక సభ్యులుగా పరిగణింపబడతామో లేదో ముందు ముందు చూడాలి.
హిందువుల మాదిరిగా యూదులు కూడా తాము దేవునికి ప్రీతిపాత్రుల మని, యితరులంతా ప్రీతిపాత్రులు కారని భావించి ఎన్నో అపరాధాలు చేశారు. అందుకు విచిత్రమైన పద్ధతిలో క్రూరంగా వారికి శిక్ష పడింది. దరిదాపు అదే విధంగా హిందువులు కూడా తాము సభ్యులమని, సుసంస్కృతులమని లేక ఆర్యులమని భావించి తమకు సంబంధించిన అవయవాల వంటివారిని అసభ్యులని అనార్యులని పాకీవాళ్ళని భావించారు. తాము చేసిన ఆ అపరాధానికి తగిన శిక్ష విచిత్రమైన పద్ధతిన క్రూరంగా దక్షిణ ఆఫ్రికా వంటి అధినివేశ దేశాలలో అనుభవిస్తున్నారు. ఈ శిక్షను హిందువుల ఇరుగుపొరుగున ఉండే మహ్మదీయులు, పారశీకులు కూడా అనుభవిస్తున్నారని నా అభిప్రాయం.
జోహన్సుబర్గులో కూలీల లొకేషనుకు యీ ప్రకరణంలో ప్రాధాన్యం ఎందుకిస్తున్నానో పాఠకులకు బోధపడి వుంటుంది. దక్షిణ ఆఫ్రికాలో మా అందరికి “కూలీ” అని పేరు. కూలీ అనే పదం మన దేశంలో కూలీ నాలీ చేసుకొనేవారికే వర్తిస్తుంది. కాని దక్షిణ ఆఫ్రికాలో యీ పదం పాకీలు, మాదిగలు మొదలుగాగల వారి కందరికి తిరస్కార సూచకంగా వాడతారు. దక్షిణ ఆఫ్రికాలో యిట్టి కూలీలందరి కోసం కేటాయించబడ్డ చోటును కూలీ లొకేషన్ అని అంటారు. అలాంటి లొకేషన్ ఒకటి జోహాన్సుబర్గులో వున్నది. ఆ లొకేషన్‌లో గాని, యితర చోట్ల అదే విధంగా వున్న కూలీ లొకేషన్లలో గాని నివసిస్తున్న హిందూదేశస్థులకు అక్కడ యాజమాన్యం హక్కు లేదు. జోహాన్సుబర్గులో గల ఈ లొకేషన్‌కు మాత్రం 99 సంవత్సరాల పట్టా యివ్వబడింది. యిందు హిందూ దేశస్థులు కిటకటలాడుతూ వుండేవారు. జనసంఖ్య పెరిగిపోసాగిందేకాని లొకేషన్ విస్తీర్ణం మాత్రం పెరగలేదు. పాయిఖానా దొడ్లు శుభ్రం చేయించడందప్ప అంతకుమించి మునిసిపాలిటీ వాళ్ళ లొకేషనును గురించి పట్టించుకోలేదు. అక్కడ రోడ్లమీద దీపాలు ఎందుకు వుంటాయి? అసలు పాయిఖానా పరిశుభ్రతను గురించి కూడా ఏ మాత్రం పట్టించుకోని ఆ లోకేషన్‌లో యితర పారిశుధ్యాల్ని గురించి అడిగేనాధుడెవరు? అక్కడ నివసిస్తున్న హిందూ దేశస్తులు పట్టణ పారిశుధ్యం ఆరోగ్యం మొదలుగాగల వాటిని గురించి వాటి నియమాలను గురించి తెలిసిన ఆదర్శ భారతీయులు కారు. మునిసిపాలిటీ వారికి సాయం చేయాలని గాని, తమ నడవడిక, ప్రవర్తనను గురించి పట్టించుకోవడం అవసరం అని గాని భావించేవారు కాదు.
సూక్ష్మంలో మోక్షం చూపించగల, మట్టి నుంచి తిండి గింజల్ని పండించగల హిందూ దేశస్థులు అక్కడికి వెళ్ళి స్థిరపడివుంటే అక్కడి చరిత్ర మరో విధంగా మారి వుండేది. అసలు ప్రపంచంలో ఎక్కడా యీ విధంగా వేలాది, లక్షలాది మంది జనం యితర దేశాలకు వెళ్ళి స్థిరపడలేదు. సామాన్యంగా జనం డబ్బు కోసం, వృత్తి కోసం విదేశాలలో కష్టాలు పడుతూ వుంటారు. హిందూదేశంలో అధిక శాతం మంది నిరక్షర కుక్షులు, దీనులు, దుఃఖితులు, శ్రామికులు. వాళ్ళే ఆ విధంగా వెళ్ళడం జరిగింది. అడుగడుగునా వారికి రక్షణ అవసరం. వారి తరువాత అక్కడకు వెళ్ళిన వ్యాపారస్తులు, తదితర స్వతంత్ర భారతీయులు సంఖ్యలో బహుకొద్దిమందే వున్నారు.
ఈ విధంగా పారిశుధ్య కార్యక్రమాల్ని నిర్వహించవలసిన శాఖవారి క్షమించరాని నిర్లక్ష్యంవల్ల ప్రవాస భారతీయుల అజ్ఞానం వల్ల ఆరోగ్యదృష్ట్యా లొకేషస్ స్థితి నాసి అయిపోయింది. దాన్ని బాగుచేయడానికి మునిసిపాలిటీవాళ్ళు సరికాదా పై పెచ్చు యీ వంకమీద ఆ లొకేషనునంతా దగ్ధం చేసివేయాలని నిర్ణయించారు. అక్కడి భూమిని ఆధీనం చేసుకునే హక్కును కౌన్సిలు నుండి సంపాదించుకున్నారు. ఇదీ నేను జోహన్సుబర్గు చేరుకున్నప్పటి పరిస్థితి. అక్కడ నివాసం వున్నవారు భూమిమీద హక్కు కలిగి వున్నారు. అందువల్ల వాళ్ళకు నష్టపరిహారంగా ఏదో కొంత లభించాలి. పరిహారంగా ఎంతసొమ్ము చెల్లించాలో నిర్ణయించేందుకు కోర్టు ఏర్పాటు అయింది. మునిసిపాలిటీ వాళ్ళు యిస్తానన్న సొమ్ము తీసుకోకపోతే కేసు ఆ కోర్టు ముందుకు వెళుతుంది. ఆ కోర్టువారు ఎంత నిర్దారిస్తే అంత కూలీలు తీసుకోవాలి. యిదీ విధానం. మునిసిపాలిటీ వారిచ్చే దానికంటే ఎక్కువ సష్టపరిహారం కోర్టు నిర్ణయిస్తే వకీలుకు అయిన ఖర్చు మునిసిపాలిటీ వారే భరిస్తారు.
ఈ వ్యవహారంలో ఎక్కువ మంది కూలీలు తమ తమ తరుపున నన్ను వకీలుగా నియమించారు. డబ్బు చేసుకుందామనే కోరిక నాకు లేదు. “మీరు గెలిస్తే మునిసిపాలిటీ వాళ్ళు యిచ్చే సొమ్ముతో తృప్తిపడతా, మీరు గెలిచినా, ఓడినా పట్టాకు 10 పౌండ్లు చొప్పున యివ్వండి చాలు.” అని వారికి చెప్పాను. అంతేగాక ఆవిధంగా వచ్చిన సొమ్ములో సగభాగం బీదవారి కోసం ఆసుపత్రి నిర్మాణానికో లేక అలాంటిదే మరో ప్రజాసేవా కార్యానికో వినియోగిస్తానని కూడా వారికి చెప్పాను. నామాటలు విని వాళ్ళు సంతోషించారు. సుమారు 70 దావాలు జరిగాయి. నాకు ఒక్క దానిలో మాత్రం పరాజయం కలిగింది. అందువల్ల పెద్ద మొత్తం నాకు లభించింది. ఇండియన్ ఒపీనియన్ పత్రికా ఖర్చు భారం నా మీద బాగా పడటం వల్ల ఆ మొత్తంలో 1600 పౌండ్ల సొమ్ము ఆ ఖాతాకు వెళ్ళి పోయిందని గుర్తు.
ఈ దావాలకై నేను చాలా కృషిచేశాను. కక్షిదారులు గుంపులు గుంపులుగా నా దగ్గర వుండేవారు. వారిలో చాలామంది ఉత్తర బీహారుకు, దక్షిణాదికి చెందిన తమిళ, తెలుగు ప్రాంతాలనుండి గిరిమిట్లుగా వచ్చిన భారతీయులు. ఆ తరువాత వారంతా గిరిమిట్ ప్రధ నుండి విముక్తి పొంది స్వతంత్రంగా వృత్తి చేసుకోసాగారు.
వీళ్ళంతా కలిసి తమ కష్టాలు తొలగించుకొనేందుకు భారతీయ వ్యాపారస్థులకు సంబంధించిన మండలి నుండి విడివడి మరో మండలిని సొంతంగా స్థాపించుకున్నారు. నిర్మలహృదయులు, నిజాయితీపరులు, శీలవంతులు అయిన ఆ మండలి అధ్యక్షుని పేరు శ్రీ జయరాం సింహ్. అధ్యక్షుడు కాకపోయినా అధ్యక్షుని వంటి మరొకరి పేరు శ్రీ బద్రీ. ఇద్దరూ ఇప్పుడు కీర్తిశేషులే. వారిద్దరి వల్ల నాకు ఎంతో సహకారం లభించింది. శ్రీ బద్రీతో చాలా పని నాకు పడింది. ఆయన సత్యాగ్రహంలో ప్రముఖంగా పాల్గొన్నాడు. వీరివంటి వారి వల్ల దక్షిణ భారతావనికి, ఉత్తర భారతావనికి చెందిన పలువురితో నాకు దగ్గర సంబంధం ఏర్పడింది. నేను వారి వకీలునేగాక ఒక సోదరునిగా పున్నాను. వారి దుఃఖాలలో భాగస్వామిగా వున్నాను. ‘సేఠ్ అబ్దుల్లా నన్ను గాంధీ అని పిలవడానికి అంగీకరించలేదు. నన్ను దొర అని అక్కడ ఎవరు అంటారు? అన్నా అని అంగీకరించేది ఎవరు? అందువల్ల ఆయన ఎంతో ప్రీతికరమైన పదం ఒకటి వెతికి బయటికి తీశారు. భాయీ అంటే సోదరా అనేదే ఆ పదం. ఆ పదం దక్షిణ ఆఫ్రికాలో చివరిదాకా నాకు స్థిరపడిపోయింది. గిరిమిట్ ప్రధమం నుండి విముక్తులైన హిందూ దేశస్థులు నన్ను “భాయీ” అని పిలుస్తున్నప్పుడు వారి పిలుపులో నాకు తీయదనం గోచరిస్తూ వుండేది.