సత్యశోధన/నాల్గవభాగం/13. ఇండియన్ ఒపీనియన్
13. ఇండియన్ ఒపీనియన్
ఇంకా కొంతమంది యూరోపియన్లను గురించి వ్రాయవలసిన అవసరం ఉన్నది. అంతకు ముందు మరో రెండు మూడు మహత్తరమైన విషయాలను గురించి వ్రాయడం అవసరం. ఇప్పుడే ఒకరిని గురించి వ్రాస్తాను. మిస్ డిక్‌ను నియమించి నా పని పూర్తి చేయగలిగానని అనుకోవడం సరికాదు. మి.రీచ్‌ని గురించి నేను మొదటనే వ్రాశాను. ఆయనతో నాకు బాగా పరిచయం వున్నది. ఆయన ఒక వ్యాపార సంస్థ సంచాలకులు. అక్కడి నుండి తప్పుకొని నా దగ్గర ఆర్టికల్ క్లర్కుగా పని చేయమని వారిని కోరాను. నా సలహా వారికి నచ్చింది. వారు నా ఆఫీసులో చేరారు. నా పనిభారం కొంత తగ్గించారు.
ఇదే సమయంలో శ్రీ మదనజీత్ “ఇండియన్ ఒపీనియన్” అను పత్రికను వెలువరించాలని నిర్ణయించుకున్నాడు. నన్ను సలహా సహకారాలు యిమ్మని కోరాడు. ప్రెస్సు ఆయన నడుపుతూ వున్నాడు. పత్రిక వెలువరించాలనే కోరికను సమర్థించాను. 1904లో ఈ పత్రిక ప్రారంభించబడింది. మనసుఖలాల్ నాజరు ఆ పత్రికకు ఎడిటరుగా ఉన్నారు. కాని సంపాదకత్వపు నిజమైన భారమంతా నా మీద పడింది. మొదటనుండి నాకు దూరాన ఉండి పత్రికలు నడిపించే యోగం కలుగుతూ వచ్చింది.
మన సుఖలాల్ నాజరు సంపాదకులుగా లేరని కాదు. వారు దేశమందలి చాలా పత్రికలకు వ్యాసాలు వ్రాస్తూ వుండేవారు. దక్షిణ ఆఫ్రికాలోగల చిక్కులతో కూడిన పలు సమస్యలను గురించి నేనుండగా స్వతంత్రంగా వ్యాసాలు వ్రాయడానికి ఆయన సాహసించలేదు. నా యోచనా శక్తిమీద ఆయనకు అమిత విశ్వాసం. అందువల్ల ఏమైనా ప్రధాన విషయాలపై వ్రాయవలసి వస్తే ఆ భారం నా మీద మోపుతూ వుండేవాడు.
ఇండియన్ ఒపీనియన్ వారపత్రిక ప్రారంభంలో గుజరాతీ, హిందీ, తమిళం, ఇంగ్లీషుల్లో వెలువడుతూ ఉండేది. తమిళం, హిందీ శాఖలు పేరుకు మాత్రమే ఉండటం చూచాను. వాటివల్ల సమాజానికి సేవ జరిగే స్థితి కలుగకపోవడం వల్ల అందు నాకు అసత్యం గోచరించింది. వెంటనే వాటిని మూసివేయించాను. ఆ తరువాతనే నాకు శాంతి లభించింది.
ఈ పత్రిక కోసం డబ్బు నేను ఖర్చు పెట్టవలసి వస్తుందని ఊహించలేదు. కొద్ది రోజులకే డబ్బు ఖర్చు పెట్టక పోతే పత్రిక నడవదని తెలిసిపోయింది. నేను పత్రికకు సంపాదకుణ్ణి కాదు. అయినా వ్యాసాల విషయమై బాధ్యత వహించాను. ఈ విషయం హిందూ దేశస్థులు, యూరోపియన్లు కూడా గ్రహించారు. అసలు పత్రిక ప్రకటించబడిన తరువాత మూత బడితే నా దృష్టిలో జాతికే అవమానం, నష్టం కూడా,
నేను పత్రిక కోసం డబ్బు ఖర్చు పెట్టడం ప్రారంభించాను. నా దగ్గర మిగిలిందంతా దానికి ఖర్చు పెడుతూనే వున్నాను. ప్రతి మాసం 75 పౌండ్లు ఇవ్వవలసి వస్తుండేది.
ఇన్ని సంవత్సరాల తరువాత పరిశీలించి చూస్తే ఈ పత్రిక జాతికి చాలా సేవ చేసిందని చెప్పగలను. ఆ పత్రిక ద్వారా ధనం గడించాలని ఎవ్వరం అసలు అనుకోలేదు.
పత్రిక నా చేతిలో వున్నంత కాలం దానిలో జరిగిన మార్పులు నా జీవితంలో కలిగిన మార్పులకు ప్రతీకలే. నేడు యంగ్ ఇండియా, నవజీవన్ నా జీవితమందలి కొంత భాగానికి ప్రతీకలు అయినట్లే ఇండియన్ ఒపీనియన్ కూడా అయింది. దానియందు నేను ప్రతివారం నా ఆత్మను క్రుమ్మరించేవాణ్ణి. నేను దేన్ని సత్యాగ్రహం అని అనుకునే వాడినో దాన్ని గురించి తెలియజెప్పడానికి ప్రయత్నించేవాణ్ణి. నేను జైల్లో వున్నప్పుడు తప్ప మిగతా కాలం 10 సంవత్సరాల పాటు అనగా 1914 వరకు నడిచిన ఇండియన్ ఒపీనియన్ పత్రిక యొక్క ప్రతి సంచికలోను నా వ్యాసాలు ప్రచురితం అవుతూనే వున్నాయి. ఆలోచించకుండా తూకం వేసుకోకుండా వ్రాసిన ఒక్క శబ్దం కూడా ఆ పత్రికలో వెలువడలేదని చెప్పగలను. ఒకరిని సంతోష పెట్టడానికో లేక తెలిసి వుండి అతిశయోక్తులో వ్రాసినట్లు నాకు గుర్తులేదు. ఆ పత్రిక నా సంయమనానికి ఒక దృష్టాంతంగా రూపొందింది. నా భావాలకు వాహకం అయింది. నా వ్యాసాల్లో విమర్శకు ఏమీ లభించేది కాదు. ఇందు ప్రకటించబడిన వ్యాసాలు విమర్శకుల చేతుల్లో గల కలాలను చాలా వరకు అదుపులో ఉంచేవి. ఈ పత్రిక లేనిదే నత్యాగ్రహ సమరం సాగని స్థితి ఏర్పడింది. పాఠకులు ఈ పత్రికను తమదిగా భావించేవారు. సత్యాగ్రహ సంగ్రామానికి, దక్షిణ ఆఫ్రికాలో గల హిందూ దేశస్తుల పరిస్థితులకు నిజమైన చిత్తరువుగా దాన్ని భావించేవారు.
ఈ పత్రిక వల్ల రంగురంగుల మానవ స్వభావాన్ని గుర్తించేందుకు నాకు మంచి అవకాశం లభించింది. సంపాదకుడు చందాదారులు వీరిద్దరి మధ్య స్వచ్ఛమైన సంబంధం ఏర్పరచడమే మా ఉద్దేశ్యం గనుక నా దగ్గరకు హృదయం విప్పి చెప్పే పాఠకుల జాబులు కుప్పలు కుప్పలుగా వచ్చిపడేవి. తీపివి, చేదువి, కారంగా ఉండేవి, కటువుగా ఉండేవి రకరకాల జాబులు వాటిలో ఉండేవి. వాటినన్నింటినీ చదివి, వాటిలోగల భావాలను తెలుసుకొని వాటికి సమాధానాలు రాస్తూ వుండేవాణ్ణి. అది నాకు గొప్ప పాఠం అయింది. వాటిద్వారా జాతియొక్క భావాల్ని వింటున్నానా అని అనిపించేది. సంపాదకుని బాధ్యత ఏమిటో నేను బాగా తెలుసుకోసాగాను. ప్రజలమీద నాకు మంచి పట్టు లభించింది. దానివల్ల భవిష్యత్తులో ప్రారంభం కాబోతున్న పోరాటానికి శోభ చేకూరింది. శక్తి లభించింది.
ఇండియన్ ఒపీనియన్ పత్రిక వెలువడసాగిన మొదటి మాసంలోనే సమాచార పత్రిక సేవాభావంతోనే నడపబడాలని బోధపడింది. సమాచార పత్రికకు గొప్పశక్తి కలదని, స్వేచ్ఛగా, నిరంకుశంగా ప్రవహించే నీటి ప్రవాహం పొలాల్ని ముంచివేసినట్లు, పంటల్ని నాశనం చేసినట్లు కలాన్నుండి బయల్వెడలే నిరంకుశ ప్రవాహం నాశనానికి హేతువవుతుందని గ్రహించాను. ఆ అంకుశం బయటనుండి వస్తే నిరంకుశత్వం కంటే ఎక్కువ విషాక్తం అవుతుందని, లోపలి అంకుశమే లాభదాయకం అవుతుందని గ్రహించాను. నా యీ యోచనా సరళి సరియైనదైతే ప్రపంచంలో నడుస్తున్న ఈనాటి పత్రికల్లో ఎన్ని నిలుస్తాయి? అయితే పనికిమాలిన వాటిని ఆపగల వారెవ్వరు? ఏవి పనికిమాలినవో ఎలా తేల్చడం? పనికివచ్చేవి, పనికిరానివీ రెండు ప్రక్క ప్రక్కన నడుస్తూనే ఉంటాయి. అయితే మనిషి వాటిలో తనకు ఏది గ్రాహ్యమో ఏది అగ్రాహ్యమో నిర్ణయించుకోవాలి.