36. ఖిలాఫత్‌కు బదులు గోసంరక్షణా?
పంజాబ్‌లో జరిగిన మారణకాండను కొంచెం సేపు వదిలివేద్దాం. పంజాబ్‌లో డయ్యర్ నియంతృత్వ దురంతాల పరిశీలన కాంగ్రెస్ పక్షాన జరుగుతూ వున్నది. యింతలో ఒక ప్రజావేదికకు సంబంధించిన ఆహ్వానం నాకు అందింది. దాని మీద కీ.శే. హకీం సాహబ్ మరియు భాయి అసఫ్ అలీగార్ల పేర్లు వున్నాయి. శ్రద్ధానంద్‌గారు సభలో పాల్గొంటారని అందు వ్రాశారు. ఆయన ఆ సభకు అధ్యక్షుడు అని గుర్తు. ఢిల్లీలో ఖిలాఫత్ గురించి యోచించుటకు రాజీకి అంగీకరించాలా లేదా అని నిర్ణయించుటకు హిందూ ముస్లిములు కలిసి ఏర్పాటు చేసిన సమావేశం అది. నవంబరు మాసంలో ఆ సభ ఏర్పాటు చేయబడినట్లు నాకు గుర్తు. ఆ సమావేశంలో ఖిలాఫత్ విషయం మీదనే గాక గోసంరక్షణను గురించి చర్చ జరుగుతుందని, అందుకు యిది మంచి తరుణమని అందు వ్రాశారు. నాకు ఆ వాక్యం గుచ్చుకుంది. సమావేశంలో పాల్గొనుటకు ప్రయత్నిస్తానని వ్రాసి ఖిలాఫత్ సమస్యకు గోసంరక్షణ సమస్యకు ముడివేయడం బేరసారాలు సాగించడం మంచిది కాదని, ప్రతివిషయం మీద దాని గుణదోషాలను బట్టి చర్చించాలని వ్రాశాను. తరువాత సభ జరిగింది. నేను వెళ్లి అందు పాల్గొన్నాను. జనం బాగా వచ్చారు. అయితే యితర సమావేశాలవలె యిది హడావుడిగా జరగలేదు. శ్రద్ధానంద కూడా సభలో పాల్గొన్నారు. నేను యోచించిన విషయాన్ని గురించి వారితోకూడా మాట్లాడాను. నా మాట వారికి నచ్చి ఆ విషయం సమావేశంలో చెప్పమని అని ఆయన ఆ పని నాకే అప్పగించారు. డా. హకీంసాహెబ్ తోకూడా మాట్లాడాను, ఇవి రెండు వేరువేరు విషయాలు. వాటి గుణదోషాలనుబట్టి యోచించాలని నా భావం. ఖిలాఫత్ వ్యవహారం నిజమైతే గవర్నమెంట్ సరిగా వ్యవహరించక అన్యాయంచేస్తే హిందువులు మహమ్మదీయులను సమర్ధించాలి, సహకరించాలి. అయితే దానితో గోసంరక్షణను జోడించకూడదు. హిందువులు అలా కోరడం మంచిదికాదు. ఖిలాఫత్ కోసం ముస్లిములు గోవధను ఆపుతామంటే అది సరికాదు. ఒకే గడ్డ మీద ఇరుగుపొరుగున ఉండటంవల్ల గోసంరక్షణకు ముస్లింలు పూనుకొంటే అది వారికి గౌరవం. ఈ విధంగా యోచించాలని నా భావం. ఈ సభలో ఖిలాఫత్‌ను గురించే చర్చించాలని నా అభిప్రాయమని స్పష్టంగా ప్రకటించాను. సమావేశంలో అంతా అందుకు అంగీకరించారు. గోసంరక్షణను గురించి సమావేశంలో చర్చ జరుగలేదు. అయితే మౌలానా అబ్దుల్ బారీ సాహబ్ “ఖిలాఫత్‌కు హిందువులు సహకరించినా, సహకరించకపోయినా మహమ్మదీయులు గోసంరక్షణకు పూనుకోవాలి అని అన్నాడు. ముస్లింలు గోవధను నిజంగా ఆపివేస్తారని అని అనిపించింది. కొందరు పంజాబు సమస్యను ఖిలాఫత్‌తోబాటు చర్చించాలని అన్నారు. నేను వ్యతిరేకించాను. పంజాబుది స్థానిక సమస్య. పంజాబులో జరిగిన దారుణాలవల్ల బ్రిటిషు సామ్రాజ్యానికి సంబంధించిన ఉత్సవాలకు దూరంగా ఉందాము. ఖిలాఫత్‌తో బాటు పంజాబును కలిపితే మన తెలివితక్కువను వేలెత్తి చూపే అవకాశం వున్నదని చెప్పాను. అంతా నా వాదాన్ని అంగీకరించారు. యీ సభలో మౌలానా హసరత్ మొహానీ కూడా వున్నారు. వారితో నాకు పరిచయం కలిగింది. కాని ఆయన ఎలాంటి యోధుడో నాకు ఇక్కడే తెలిసింది. మాకు అభిప్రాయభేదం ప్రారంభమైంది. ఆ అభిప్రాయ భేదం ఇంకా అనేక విషయాలలో కూడా ఏర్పడింది. హిందూ మహమ్మదీయులు స్వదేశీవ్రతం పాలించాలని అందుకోసం విదేశీవస్త్రాలను బహిష్కరించాలని చర్చ జరిగింది. అప్పటికి ఇంకా ఖద్దరు యొక్క జననం కాలేదు. ఈ విషయం మౌలానా హసరత్ సాహబ్‌కు గొంతు దిగలేదు. ఖిలాఫత్ విషయంలో బ్రిటీష్ ప్రభుత్వం సహకరించకపోతే పగతీర్చుకోవాలని ఆయన తపన. అందుకై బ్రిటిషువారి వస్తువులను సాధ్యమైనంతవరకు బహిష్కరించాలని ఆయన భావం. నేను బ్రిటిషు వారి వస్తువులను వెంటనే బహిష్కరించటం ఎంత అసాధ్యమో వివరించాను. నా అభిప్రాయాల ప్రభావం సభాసదులమీద బాగా పడటం నేను గమనించాను. అయితే మౌలానా హసరత్ సాహబ్ విపరీతంగా తర్కిస్తూవుంటే ఒకటే చప్పట్లు మోగాయి. దానితో నా పని హుళక్కేనని అనుకున్నాను. తరువాత ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా నా కర్తవ్యం నేను నిర్వహించడం అవసరమని భావించి మాట్లాడేందుకు లేచాను. నా ఉపన్యాసం శ్రద్ధగా జనం విన్నారు. నా భావాలకు బాగా సమర్దన లభించింది. తరువాత నన్ను సమర్థిస్తూ చాలామంది మాట్లాడారు. బ్రిటిషు వారి వస్తువులను బహిష్కరిస్తే లాభం లేదని ఎగతాళి తప్ప ప్రయోజనం కలగదని జనం గ్రహించారు. మొత్తం సభలో వున్న జనం ఒంటిమీద ఏదో ఒక విదేశీ వస్తువు ఉన్నది. సభలో పాల్గొన్నవారే ఆదరించలేని విషయాన్ని గురించి యోచించడం అనవసరమని అంతా భావించారు. మౌలానా హసరత్ ప్రసంగిస్తూ “మీరు విదేశీ వస్త్రాలను బహిష్కరించమంటే ఎట్లా? అది మాకు ఇష్టం లేదు. మన అవసరాలకు కావలసిన బట్టి ఎప్పుడు తయారు చేసుకుంటాం? ఎప్పుడు విదేశీ వస్త్రాలను బహిష్కరిస్తాం. అందువల్ల ఆంగ్లేయుల్ని వెంటనే దెబ్బతీసే వస్తువు ఏదైనా వుంటే చెప్పండి? బహిష్కారం తప్పదు కాని వెంటనే బ్రిటిషు వారిని దెబ్బతీయగల వస్తువు ఏమైనా వుంటే త్వరగా చెప్పండి” అని తొందర పెట్టాడు. విదేశీ వస్త్రాలను బహిష్కరించమనే గాక మరేదేమైనా కొత్త వస్తువును బహిష్కరించమని చెప్పడం అవసరమని భావించాను. అవసరమైనంత ఖాదీ వస్త్రం మనం తయారు చేసుకోవచ్చునని తరువాత నాకు బోధపడింది. అప్పటికి నాకీ విషయం తెలియదు. కేవలం విదేశీ బట్టల కోసం మిల్లులమీద ఆధారపడితే అవి సమయానికి మోసం చేస్తాయని అప్పటికి నేను గ్రహించాను. మౌలానా గారి ప్రసంగం పూర్తికాగానే నేను ప్రసంగించేందుకు లేచి నిలబడ్డాను.
నాకు తగిన ఉర్దూ, హిందీ శబ్దాలు స్ఫురించలేదు. మహమ్మదీయులు ఎక్కువగా వున్న ఇట్టి సభలో యుక్తిపరంగా ఉపన్యసించవలసి రావడం నాకు యిదే ప్రథమం. కలకత్తాలో జరిగిన ముస్లింలీగ్ సభలో కొద్ది నిమిషాల సేపు మాత్రమే మాట్లాడాను. అది హృదయాల్ని స్పృశించే ఉపవ్యాసం. కాని ఇక్కడ వ్యతిరేక భావాలు గల వారి మధ్య ఉపన్యసించాలి. ఇక సంకోచం మానుకున్నాను. ఢిల్లీ ముస్లిముల ఎదుట మంచి ఉర్దూలో ప్రాసయుక్తంగా మాట్లాడవలసిన అవసరం వున్నది. కాని నా అభిప్రాయం అట్టి భాషలోకాక సూటిగా వచ్చీరాని హిందీలో తెలియచేయటమే మంచిదని భావించాను. ఆ పని బాగానే పూర్తి చేశాను. హిందీ ఉర్దూ యే దేశ భాష కాగలదనుటకు ఆ సభ ప్రత్యక్ష తార్కాణం. ఇంగ్లీషులో మాట్లాడియుంటే నా బండి ముందుకు సాగియుండేదికాదు. మౌలానాగారు సవాలు విసిరారు. అందుకు సమాధానం యిచ్చే అవకాశం నాకు సూటిగా లభించియుండేది కాదు.
ఉర్దూ లేక గుజరాతీ శబ్దాలు సమయానికి తోచనందుకు సిగ్గుపడ్డాను. అయినా సమాధానం యిచ్చాను. నాకు “నాన్ కో ఆపరేషన్” అను శబ్దం స్ఫురించింది. మౌలానా గారు ఉపన్యసిస్తున్నప్పుడు బాగా ఆలోచించాను. ఆయన స్వయంగా అనేక విషయాలలో గవర్నమెంటును సమర్ధిస్తున్నాడు. అట్టి గవర్నమెంటుకు వ్యతిరేకంగా మాట్లాడటం వ్యర్ధమని అనుకున్నాను. కత్తితో సమాధానం యివ్వదలచనప్పుడు వారికి సహకరించకపోవడమే నిజంగా వ్యతిరేకించడం అవుతుందని భావించాను. నేను “నాన్ కో ఆపరేషన్” అను శబ్దం ప్రప్రథమంగా యీ సభలోనే ప్రయోగించాను. దాన్ని సమర్ధిస్తూ నా ఉపన్యాసంలో అనేక విషయాలు పేర్కొన్నాను. ఆ సమయంలో నాన్ కో ఆపరేషన్ అను శబ్దానికి ఏఏ విషయాలు అనుకూలిస్తాయో నేను ఊహించలేదు. అందువల్ల నేను వివరాలలోకి పోలేదు. నేను ఆ సభలో చేసిన ఉపన్యాస సారాంశం యిక్కడ తెలుపుతున్నాను.
“మహమ్మదీయ సోదరులు మరొక మహత్తరమైన నిర్ణయం చేశారు. వారు చేస్తున్న ప్రయత్నానికి విధించబడే షరతులు వ్యతిరేకంగా వుంటే ప్రభుత్వానికి చేస్తున్న సహకారం వారు విరమిస్తారన్నమాట. అప్పుడు ప్రభుత్వ డిగ్రీలు స్వీకరించడం, ప్రభుత్వ పదవులు అంగీకరించడం మొదలగు పనులు చేయవలసిన అవసరం వుండదు. ప్రభుత్వం ఖిలాఫత్ వంటి ఎంతో మహత్తరమైన మత సంబంధమైన విషయాలకు నష్టం కలిగిస్తే మనం అట్టి ప్రభుత్వానికి సహాయం ఎలా చేస్తాం? అందువల్ల ఖిలాఫత్ వ్యవహారం మనకు వ్యతిరేకం అయితే ప్రభుత్వానికి చేస్తున్న సహకారాన్ని విరమించుకునే హక్కు మనకు వుంది.” ఆ విషయాన్ని గురించి ప్రచారం చేయడానికి కొన్ని నెలల కాలం పట్టింది. ఆ విషయం కొద్ది మాసాల పాటు సంస్థలోనే పడి వుంది. ఒక నెల రోజుల తరువాత అమృతసర్‌లో కాంగ్రెసు మహాసభలు జరిగాయి. అక్కడ నేను సహాయ నిరాకరణోద్యమానికి సంబంధించిన తీర్మానాన్ని సమర్ధించాను. అయితే హిందూ ముస్లిములు సహాయ నిరాకరణానికి పూనుకోవలసిన అవసరం కలుగుతుందని అప్పుడు నేను ఊహించలేదు.