34. నవజీవన్ మరియు యంగ్ ఇండియా
ఒకవైపున సహాయనిరాకరణోద్యమం (దాని నడక ఎంత సన్నగిల్లినా) నడుస్తూనే వున్నది. మరోవైపున ప్రభుత్వ పక్షాన ఆ ఉద్యమ అణచివేత కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. పంజాబులో ఈ దృశ్యం కనబడింది. అక్కడ మిలటరీ చట్టం అంటే నియంతృత్వం ప్రారంభమైంది. నాయకుల్ని నిర్భందించారు. ప్రత్యేకించిన న్యాయస్థానాలు, న్యాయస్థానాలుగా వుండక, గవర్నరు ఆర్డరును పాలించే సాధనాలుగా మారిపోయాయి. విచారణ అనేదే లేకుండా అందరికీ శిక్షలు విధించారు. నిరపరాధుల్ని పురుగుల్లా బోర్లా పడుకోబెట్టి పాకించారు. యీ దుర్మార్గం ముందు జలియన్‌వాలాబాగ్‌లో జరిగిన ఘోరకృత్యం కూడా తలవంచుకుంది. అయితే బాగ్‌లో జరిగింది నరమేధం గనుక ప్రపంచాన్ని అది బాగా ఆకర్షించింది.
ఏ విధంగానైనా సరే మీరు పంజాబు వెళ్లాలి అని నా మీద వత్తిడి ఎక్కువైంది. నేను వైస్రాయికి జాబు వ్రాశాను. తంతి పంపాను. కాని అనుమతి లభించలేదు. అనుమతి లేకుండా వెళితే లోనికి అడుగు పెట్టనీయరు కదా! చట్టాన్ని సవినయంగా ఉల్లంఘించాననే గౌరవం తప్ప వేరే ప్రయోజనం చేకూరదు. ధర్మసంకటంలో పడ్డాను. ప్రభుత్వం వారి నిషేధాజ్ఞను ఉల్లంఘించితే అది సహకార నిరాకరణోద్యమం క్రిందకు రాదు. శాంతిని గురించి ఆశించిన విశ్వాసం యింకా నాకు కలుగలేదు. పంజాబులో జరుగుతున్న దుర్మార్గపు పాలన వల్ల దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. యిట్టి స్థితిలో నేను చట్టాన్ని ఉల్లంఘించితే అగ్నిలో ఆజ్యం పోసినట్లవుతుందని అనిపించింది. అందువల్ల పంజాబులో ప్రవేశించడానికి నేను ఇష్టపడలేదు. ఇది చేదు నిర్ణయం. రోజూ పంజాబులో జరుగుతున్న ఘోరకృత్యాలు తెలుస్తున్నాయి. వాటినివింటూ పండ్లు కొరుకుతూ వుండిపోవలసిన స్థితి ఏర్పడింది.
ఇదే సమయాన క్రానికల్ పత్రికను ప్రచండశక్తిగా రూపొందించిన మిస్టర్ హార్నమెన్‌ను ప్రజలకు తెలియకుండా రహస్యంగా ప్రభుత్వం ఎత్తుకుపోయింది. ఈ దొంగతనంలో నిండివున్న దుర్వాసన యీనాటివరకు నాకు కొడుతూనేవున్నది. మి. హార్నిమెన్ అరాచకత్వాన్ని కోరలేదని నాకు తెలుసు. సత్యాగ్రహ సంస్థ సలహా తీసుకోకుండా పంజాబు ప్రభుత్వపు ఆదేశాన్ని నేను ధిక్కరించడం సరికాదని ఆయన భావించాడు. సహాయ నిరాకరణోద్యమాన్ని వాయిదా వేయడానికి ఆయన పూర్తిగా యిష్టపడ్డాడు. నేను వాయిదా వేస్తున్నానని ప్రకటించక పూర్వం వాయిదా వేయమని సలహాయిస్తూ ఆయన వ్రాసిన జాబు నాకు ఆలస్యంగా అందింది. అప్పటికి నా ప్రకటన వెలువడింది. ఆ ఆలస్యానికి కారణం అహమదాబాదుకు బొంబాయికి మధ్యన గల దూరమే. ఆయనను దేశాన్నుండి బహిష్కరించిన తీరు నాకు బాధ కలిగించింది. ఈ ఘట్టం జరిగిన తరువాత క్రానికల్ పత్రికను నడిపే బాధ్యత నాకు అప్పగించారు. మిస్టర్ బరేల్వీ అక్కడ వున్నారు. అందువల్ల నేను చేయవలసిన పని అంటూ ఏమీ మిగలలేదు. ఆ బాధ్యత కూడా ఎక్కువ రోజులు వహించవలసిన అవసరం లేకుండా పోయింది. ప్రభుత్వంవారి దయ వల్ల క్రానికల్ ప్రచురణ ఆగిపోయంది. క్రానికల్ వ్యవస్థను చూస్తున్న ఉమర్‌సుభానీ, శంకర్‌లాల్ బాంకర్‌గారలు “యంగ్ ఇండియా” వ్యవస్థ కూడా చూస్తున్నారు. వారిద్దరూ యంగ్ ఇండియా బాధ్యత వహించమని నన్ను కోరారు. క్రానికల్ లేని లోటు తీర్చడం కోసం యంగ్ ఇండియా పత్రికను వారానికి ఒకసారి గాకుండా రెండు సార్లు ప్రచురించాలని నిర్ణయించాం.
ప్రజానీకానికి సత్యాగ్రహ రహస్యాలు తెలియచేయాలనే కాంక్ష నాకు వున్నది. పంజాబును గురించి ఏమీ చేయలేకపోయాను. కనీసం విమర్శించవచ్చు కదా! దాని వెనుక సత్యాగ్రహస్ఫూర్తి వున్నదని గవర్నమెంటుకు తెలుసు. అందువల్ల ఆ మిత్రుల సలహాను అంగీకరించాను. కాని ఇంగ్లీషు ద్వారా ప్రజానీకానికి సత్యాగ్రహాన్ని గురించి శిక్షణ ఎలా గరపడం? నా కార్యక్షేత్రం ముఖ్యంగా గుజరాత్ ప్రాంతం. సోదరుడు ఇందూలాల్ యాజ్ఞిక్ అప్పుడు యీ మండలిలో ఉన్నారు. ఆయన చేతిలో మాసపత్రిక నవజీవన్ వున్నది. ఆ ఖర్చు కూడా పై మిత్రులే భరిస్తున్నారు. ఆ పత్రికను ఇందూలాల్ మరియు ఆ మిత్రులు నాకు అప్పగించారు. అయితే అందు పని చేయడానికి ఇందూలాల్ అంగీకరించారు. ఆ మాసపత్రికను మేము వారపత్రికగా మార్చాము. ఇంతలో క్రానికల్‌కి మళ్లీ ప్రాణం వచ్చింది. అందువల్ల యంగ్ ఇండియా వారపత్రికగా మారింది. దాన్ని నా సలహా ప్రకారం అహమదాబాదుకు మార్చారు. రెండు పత్రికల్ని వేరు వేరు చోట్ల నుండి వెలువరించాలంటే ఖర్చు పెరిగింది. శ్రమ కూడా హెచ్చింది. నవజీవన్ పత్రిక అహమ్మదాబాద్ నుండే వెలువడుతున్నది. అటువంటి పత్రికలు నడపాలంటే సొంత ప్రెస్సుఅవసరమను విషయం ఇండియన్ ఒపీనియన్ అను పత్రిక నడుపుతూ వున్నప్పుడు నాకు బోధపడింది. వ్యాపార దృక్పధంతో సొంత ప్రెస్సులో ముద్రించబడే పత్రికల్లో ఆయా పత్రికాధిపతులు నా అభిప్రాయాల్ని ప్రకటించడానికి భయపడుతూ వుండేవారు. ఇది కూడా సొంత ప్రెస్సు పెట్టడానికి ఒక కారణం. అహమదాబాదులోనే అది సాధ్యం గనుక యంగ్ ఇండియాను అహమదాబాదుకు మార్చారు.
ఈ పత్రికల ద్వారా సత్యాగ్రహాన్ని గురించిన వివరాలు ప్రజలకు తెలపడం ప్రారంభించాను. ప్రారంభంలో రెండు పత్రికల ప్రతులు కొద్దిగా ముద్రించబడుతూ వుండేవి. ఆ సంఖ్య పెరిగి 40 వేలకు చేరుకున్నది. నవజీవన్ పత్రిక చందాదారులు ఒక్కసారిగా పెరిగారు. యంగ్ ఇండియా చందాదారులు నెమ్మదిగా పెరిగారు. నేను జైలుకు వెళ్లిన తరువాత యీ వెల్లువ తగ్గుముఖం పట్టింది. రెండు పత్రికల్లోను విజ్ఞాపనలు ప్రకటించకూడదని మొదటి నుండి నా నిర్ణయం. దానివల్ల నష్టం కలుగలేదని నా అభిప్రాయం. పత్రికల్లో భావనా ప్రకటనకు గల స్వాతంత్ర్య రక్షణకు యీ విధానం బాగా తోడ్పడింది. ఈ పత్రికలు వెలువడటంతో నాకు శాంతి లభించింది. సహాయ నిరాకరణోద్యమం వెంటనే ప్రారంభించలేకపోయినా నా అభిప్రాయాల్ని ప్రకటించ గల అవకాశం దొరికింది. సలహాల కోసం నా వంక చూస్తున్న వారికి ధైర్యం చేకూర్చగలిగాను. ఆ రెండు పత్రికలు గడ్డుసమయంలో ప్రజలకు అధికంగా సేవ చేయగలిగాయని నా అభిప్రాయం. మిలిటరీ చట్టాల దుర్మార్గాల్ని ఎండగట్టి వాటిని తగ్గించడానికి కూడా కృషి చేశాయి.