25. ఖేడా సంగ్రామం ముగింపు
ఖేడాలో జరిగిన సంగ్రామం విచిత్రంగా ముగిసింది. దృఢదీక్షతో చివరివరకు వున్నవారు నష్టపడిపోవడం నాకు యిష్టంలేదు. సత్యాగ్రహం విజయం కోసం అన్వేషించసాగారు. ఊహించని అట్టి మార్గం ఒకటి దొరికింది. చెల్లించగల పార్టీలు పన్ను చెల్లించితే బీదవారి దగ్గర పన్నుల వసూళ్లు వాయిదా వేస్తామని నడియాద్ తహసీల్దారు కబురు పంపాడు. తహసీల్దారు తన తాలూకా వరకే బాధ్యత వహించగలడు. జిల్లా బాధ్యత కలెక్టరు వహించాలి. అందువల్ల నేను కలెక్టరును అడిగాను. తహసీల్దారు అంగీకరించిన విధంగా ఆదేశం వెలువడింది అని కలెక్టరు చెప్పాడు. నాకీ ఆదేశం విషయం తెలియదు. అటువంటి ఆదేశం ప్రభుత్వం వెలువరిస్తే ప్రతిజ్ఞలో పేర్కొనబడ్డ విశేషం అదే. అందువల్ల మేము అట్టి ఆర్డరుతో తృప్తిపడ్డాం.
అయినా ఈ విధంగా జరిగిన ముగింపు వల్ల నాకు సంతోషం కలుగలేదు. సత్యాగ్రహం సమాప్తమైనప్పుడు ఏర్పడవలసిన మధుర వాతావరణం ఏర్పడలేదు. క్రొత్త నిర్ణయం తాను చేయలేదని కలెక్టరు భావించాడు. అయితే బీదవారిని మివహాయించే విషయమై అతడు అంగీకరించవలసి వచ్చింది. బీదవాళ్లంటే ఎవరో ఎలా తేల్చడం? ఆ విధంగా నిర్ణయించగల శక్తి జనానికి లేకపోవడం విచారించ తగ్గ విషయం. ముగింపు ఉత్సవం జరిపారు. కాని నాకు అంతగా ఉత్సాహం కలుగలేదు. సత్యాగ్రహం ప్రారంభించినప్పటికంటె ముగించినప్పుడు ప్రజల్లో ఎక్కువ ఉత్సాహం తేజస్సు కనబడినప్పుడే దాన్ని విజయంగా భావించాలి. అట్టి తేజస్సు ఖేడా సంగ్రామం సమాప్తమైనప్పుడు నాకు కనపడలేదు. అయినా యీ ఉద్యమం వల్ల కలిగిన సత్ఫలితాలు అనూహ్యమైనవి. పరోక్షంగా ఆ సంగ్రామం ఎన్నో ప్రయోజనాలు చేకూర్చింది. ఖేడా సంగ్రామంవల్ల గుజరాత్‌కు చెందిన రైతుల్లో గొప్ప చైతన్యం వచ్చింది. వారికి రాజకీయంగా మంచి శిక్షణ లభించింది. విదుషీమణియగు డా. బిసెంట్ ప్రారంభించిన ఉద్యమంకంటే వారిలో నిజమైన చైతన్యం యి ఉద్యమం వల్లనే వచ్చింది. వాలంటీర్లు రైతులతో కలిసిపోయారు. తమ శక్తిని తమ హద్దును తెలుసుకొని ఎంతో త్యాగదీక్షతో పనిచేశారు. వల్లభభాయికి తనశక్తి ఏమిటో తెలుసుకునే అవకాశం ఈ సంగ్రామం వల్ల లభించింది. యిటువంటి అనుభవాలు బార్డోలీలోను, తదితర సంగ్రామాల్లోను కూడా కలిగాయి. గుజరాత్ ప్రజల్లో నూతన తేజస్సు వెల్లివిరిసింది. రైతులు తమ శక్తి ఏమిటో తెలుసుకోగలగడం విశేషం. ప్రజలకు విముక్తి లభించాలంటే అది వారి త్యాగప్రవృత్తిపై ఆధారపడి వుంటుందని అంతా తెలుసుకున్నారు. ఖేడా పోరాటం ద్వారా గుజరాత్ ప్రాంతంలో సత్యాగ్రహం స్థిరమైన స్థానం సంపాదించుకుంది. ఖేడా సంగ్రామ ముగింపు విషయమై నాకు ఉత్సాహం కలుగకపోయినా అక్కడి ప్రజల్లో మాత్రం నూతనోత్సాహం నెలకొన్నది. తాము అనుకున్నది సాధించామనే విశ్వాసం వారికి కలిగింది. భవిష్యత్తులో యిలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనే విధానం కూడా వారికి బోధపడింది. అయితే సత్యాగ్రహమంటే ఏమిటో ఖేడా ప్రజలు తెలుసుకోలేకపోయారు. అందుకు సంబంధించిన వివరాలు రాబోయే ప్రకరణాల్లో తెలియజేస్తాను.