2. గోఖలే గారితో
నేను బొంబాయి చేరగానే గోఖలేగారు “గవర్నరు మిమ్ము కలుసుకోవాలని అనుకుంటున్నారు. పూనాకు వెళ్లే ముందు మీరు వారిని కలవడం మంచిది” అని వార్త పంపారు. ఆ ప్రకారం నేను బొంబాయి గవర్నరు గారిని కలుసుకునేందుకు వెళ్లాను. మామూలు మాటల తరువాత మీరు నాకు మాట యివ్వండి. ప్రభుత్వం విషయమై మీరేదైనా అడుగు వేయాలనుకుంటే ముందుగా నాతో మాట్లాడుతూ వుండండి” అని ఆయన అన్నాడు.
“ఆవిధంగా మాట యివ్వడం నాకు సులభమే. ఎవరికైనా వ్యతిరేకంగా వ్యవహరించదలుచుకున్నప్పుడు ఆవిషయం వారికి తెలిపి వారి అభిప్రాయం తెలుసుకోవడం, సాధ్యమైనంతవరకు వారికి అనుకూలంగా వ్యవహరించడం సత్యాగ్రహి ధర్మం. దక్షిణ ఆఫ్రికాలో నేను సదా యీ నియమాన్ని పాటించాను. యిక్కడకూడా అలాగే పాటిస్తాను అని సమాధానం యిచ్చాను. లార్డ్ విల్లింగ్టన్ ధన్యవాదాలు తెలిపి మీరు అవసరమని భావించినప్పుడు నన్ను కలుసుకోవచ్చు. ప్రభుత్వం కావాలని ఏ చెడ్డ పని చేయదలచదని మీరే గ్రహిస్తారు అని అన్నాడు. “ఈ విశ్వాసమే నాకు ఆధారం” అని అన్నాను.
నేను పూనా చేరాను. అక్కడి వివరాలన్నింటిని వ్రాయడం సాధ్యంగాదు. గోఖలేగారు, వారి సొసైటీ (భారత్ సేవక్ సమాజ్) సభ్యులు అంతా ప్రేమామృతంతో నన్ను తడిపివేశారు. నాకు జ్ఞాపకం వున్నంత వరకు గోఖలేగారు తమ సొసైటీ సభ్యులనందరినీ పూనా పిలిపించారు. వారితో అనేక విషయాలను గురించి అరమరికలు లేకుండా చర్చించాను. సొసైటీలో చేరమని గోఖలేగారు నన్ను గట్టిగా కోరారు. నాకూ అట్టి కోరిక కలిగింది. కాని సాసైటీ సభ్యులకు ఒక ధర్మ సందేహం కలిగింది. సొసైటీ ఆదర్శాలకు గాంధీ ఆదర్శాలకు, యిరువురి పని చేసే తీరుకు గల వ్యత్యాసం వారు గ్రహించారు. అందువల్ల నన్ను సొసైటీలో సభ్యునిగా చేర్చుకోవచ్చా లేదా అని వారు సందేహించారు. కాని గోఖలేగారి భావం వేరుగా వుంది. నేను నా ఆదర్శాల మీద ఎంత దృఢంగా వుంటానో యితరుల ఆదర్శాలను అంత దృఢంగా గౌరవిస్తానని, యితరులతో బాగా కలిసి పోగలనని గోఖలేగారికి తెలుసు. మా సభ్యులు యింకా యితరులతో కలిసి పోగల మీ స్వభావాన్ని గ్రహించలేదు. వారు తమ ఆదర్శాల విషయమై దీక్ష కలవారు. స్వతంత్ర భావాలు కలవారు. వారు మిమ్ము స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. ఒక వేళ వారు స్వీకరించకపోయినా మీ యెడ వారికి ఆదరణ, ప్రేమ లేవని మాత్రం మీరు భావించవద్దు. ఈ ప్రేమాదరణల రక్షణ కోసమే వారు ఏ విధమైన ప్రమాదాన్ని కొనితెచ్చుకునేందుకు యిష్టపడటం లేదు. మీరు నియమ ప్రకారం సొసైటీ సభ్యులైనా కాకపోయినా నేను మాత్రం మిమ్ము సొసైటీ సభ్యులుగా భావిస్తున్నాను అని అన్నారు. నా అభిప్రాయాలను స్పష్టంగా గోఖలేగారికి చెబుతూ “నేను సొసైటీ సభ్యుడనైనా, కాకపోయినా నేను ఒక ఆశ్రమం స్థాపించి అందు ఫినిక్సులో వున్న నా అనుచరులను వుంచుతాను. నేను కూడా అక్కడ వుంటాను. నేను గుజరాతీ వాణ్ణి. కనుక, గుజరాత్ ప్రాంతానికి సేవచేస్తూ తద్వారా దేశానికి అత్యధిక సేవచేయాలని భావిస్తున్నాను. అందువల్ల నేను గుజరాత్ ప్రాంతంలో ఎక్కడైనా వుంటాను” అని ప్రకటించాను. నా అభిప్రాయం గోఖలేగారికి నచ్చింది. “మీరు అలాగే చేయండి. మా సభ్యులతో జరిగిన చర్చల పరిణామం ఎలా వున్నప్పటికీ మీరు మాత్రం ఆశ్రమానికి అవసరమైన డబ్బు నావద్ద స్వీకరించాలి. మీ ఆశ్రమాన్ని మా ఆశ్రమంగా భావిస్తాను అని గోఖలే అన్నారు. నా హృదయం పొంగిపోయింది. ఆశ్రమం కోసం డబ్బు వసూలు చేయవలసిన అవసరం లేకుండా పోయినందుకు ఆనందం కలిగింది. అంతేగాక ఏ సమస్య వచ్చినా నేనొక్కడినేగాక, నాకు మార్గం చూపించగలవారు మరొకరున్నారనే భావం కూడా కలిగింది. దానితో నెత్తిమీద వున్న బరువు దిగిపోయినట్లనిపించింది. కీ.శే. డాక్టర్ దేవ్‌ను పిలిచి “గాంధీ గారి పేరిట ఖాతా ప్రారంభించండి, ఆశ్రమ స్థాపనకు ప్రజా సేవా కార్యక్రమాలకు అవసరమైన డబ్బు గాంధీ కోరినంత యివ్వండి అని గోఖలేగారు ఆదేశించారు. ఇక నేను పూనా నుండి శాంతినికేతన్ వెళ్లే ఏర్పాటులో వున్నాను. చివరిరోజు రాత్రి గోఖలే నాకు నచ్చే విధంగా విందు ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి కొందరు మిత్రులను ఆ విందుకు ఆయన ఆహ్వానించారు. నేను భుజించే పదార్ధాలు అనగా ఎండు ద్రాక్ష వగైరా మరియు తాజా పండ్లు మాత్రమే వడ్డన చేయించారు. విందు ఏర్పాటు చేసిన చోటు వారి గది అతి సమీపంలో వుంది. వారి ఆరోగ్యం సరిగాలేదు. వారు విందులో పాల్గొనుటకు వీలులేని స్థితి. అయినా నాయందుగల ప్రేమ వారిని ఆగనిస్తుందా? ఏదో విధంగా వారు వచ్చి విందులో పాల్గొన్నారు. యింతలో మూర్ఛవచ్చి సొమ్మసిల్లిపోయారు. వారిని గదిలోకి చేర్చారు. ఆప్పుడప్పుడు వారు యీ విధంగా మూర్ఛపోతూ వుండటం జరుగుతూ వుంటుందట. విందు సాగించమని సందేశం పంపారు. సొసైటీ అనే ఆశ్రమం ముంగిట అతిథులు, ఇంటివాళ్లు, దగ్గరివాళ్లు అంతా కలిసి పెద్ద జంబుఖానా పరిచి దాని మీద కూర్చొని వేరు సెనగపప్పు, ఖర్జూరం మొదలగు వాటిని తింటూ ప్రేమతో చర్చలు జరుపుతూ, ఒకరి హృదయాలను మరొకరు తెలుసుకొనేందుకు ప్రయత్నించడం ఆ విందు యొక్క లక్ష్యం. అయితే గోఖలే గారికి వచ్చిన యీ మూర్ఛ మాత్రం నా జీవితంలో అసాధారణమైన ఘట్టంగా చోటుచేసుకున్నది.