19. ఉజ్వల పక్షం
గత ప్రకరణంలో నేను వివరించినట్లు ఒక వైపు సమాజ సేవ సాగుతూ వున్నది. రెండోవైపున బాధితుల కష్టగాధలు వ్రాయడం జరుగుతున్నది. రోజురోజుకు అలా పని పెరిగిపోతున్నది. వేలాదిమంది చెప్పిన కధలు లిపిబద్ధం చేయబడ్డాయి. తెల్లదొరల కోపం కట్టలు తెంచుకున్నది. దానితో నా పరిశీలనా కార్యక్రమం ఆపివేయించుటకు ప్రయత్నం చేశారు.
ఒక రోజున బీహారు ప్రభుత్వం నుండి నాకు ఒక జాబు వచ్చింది. “మీ పరిశీలన కార్యక్రమం చాలాకాలం పాటు సాగింది. యిక ఆ కార్యక్రమం విరమించి బీహారు వదలి వెళ్లిపోండి” అని ఆ జాబులో వున్నది. జాబు మెత్తగా వున్నా భావం స్పష్టంగా వున్నది. అందుకు సమాధానం యిస్తూ “నా పరిశీలనా కార్యo పూర్తికాలేదు. యింకా చేయవలసి వున్నది. ఆ పని పూర్తి అయిన తరువాత కూడా ప్రజల కష్టాలు తొలగనంతవరకు నేను బీహారు వదలి వెళ్లను” అని స్పష్టంగా వ్రాశాను.
నా నిరీక్షణ కార్యక్రమాన్ని ఆపాలంటే ప్రభుత్వం ప్రజల కష్టాల్ని తొలగించాలి. కమిటీని నియమించాలి. గవర్నరు సర్ ఎడ్వర్డ్ గేట్ నన్ను పిలిచి, తామే విచారణ కమిటీ వేస్తానని, అందు మెంబరుగా వుండమని కోరాడు. మిగతా కమిటీ మెంబర్ల పేర్లు చూచి, సహచరులతో చర్చించి కొన్ని షరతుల మీద అంగీకారం తెలిపాను. కమిటీలో చేరినా, నా అనుచరులతో చర్చలు జరిపేందుకు స్వాతంత్ర్యం నాకు వుండాలని, కమిటీలో మెంబరుగా వుంటూ రైతుల్ని సమర్ధించడం మానుకోమని నాకు చెప్పకూడదని, విచారణ జరిగాక రైతులికి న్యాయం జరగలేదని తోస్తే నేను రైతుల పక్షం వహించే స్వాతంత్ర్యం వుండాలని కోరాను.
నర్ ఎడ్వర్డ్ గేట్ నా షరతులు న్యాయమైనవని భావించి అంగీకరించాడు. కీ.శే సర్ ఫ్రేంక్ స్లై యీ కమిటీ అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. విచారణ కమిటీ, రైతులు చేసిన ఆరోపణలన్నీ నిజమేనని ప్రకటించింది. అన్యాయంగా తెల్లదొరలు తీసుకున్న సొమ్ము నుండి కొంత భాగం రైతులకు చెల్లించాలని, తిన్‌కఠియా రివాజును రద్దు చేయాలని సిఫారసు చేస్తూ తీర్మానించింది. యీ రిపోర్టు అంగీకరింపబడటానికి, ఆ ప్రకారం చట్టం ప్యాసు చేయటానికి సర్ ఎడ్వర్డ్ గేట్ మహత్తరమైన కృషి చేశాడు. ఆయన గట్టిగా వ్యవహరించి యుండకపోతే మా రిపోర్టు ఏకగ్రీవంగా వుండేదికాదు. చట్టం కూడా ప్యాసు అయి వుండేది కాదు. తెల్లదొరలు చాలా శక్తివంతులు. రిపోర్టు వెల్లడించబడిన తరువాత కూడా చట్టం కానీయకుండా నిరోధించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కాని సర్ ఎడ్వర్డ్ గేట్ ధైర్యంగా వ్యవహరించి చట్టం చేయించాడు. దాన్ని అమలులోకి తెచ్చాడు కూడా. ఈ విధంగా 100 సంవత్సరాల నుండి అమల్లో వున్న తిన్‌కఠియా విధానం రద్దు అయింది. తెల్లదొరల రాజ్యం కూడా అస్తమించింది. అణగిపోయి పడివున్న రైతులు తమ శక్తిని గుర్తించారు. నీలిమందు మచ్చ కడిగినా పోదు అను భ్రమ తొలగిపోయింది.