సంపూర్ణ నీతిచంద్రిక/దూరాలోచన లేక ముంగిసను జంపి విచారించిన బ్రాహ్మణుని కథ
దూరాలోచన లేక ముంగిసను జంపి విచారించిన బ్రాహ్మణుని కథ
గౌడదేశమునం దొక యగ్రహారమున దేవశర్మ యను బ్రాహ్మణుడు గలడు. అతని భార్య యజ్ఞ సేన. సంతానము లేక లేక కొంతకాలమున కామె గర్భవతి యయ్యెను. దాని కాబ్రాహ్మణుడు మిగుల సంతోషించి కోరిక లీరికలెత్తగా "ఓప్రియురాలా! నీగర్భమునందున్న కుమారుడు మన కులమెల్ల నుద్ధరింపగలడు. మహాభాగ్యవంతుడు కాగలడు." అని పలుకగా విని యజ్ఞసేన, "నాథా యిటువంటికోరికలు గోరుట మంచిదిగాదు. అనాగతకార్యములను గుఱించి యెవడు చింతచేయునో వాడు సోమశర్మ తండ్రివలె విషాదము నొందును. మీకాకథ దెలుపుదు వినుడు.