సంపూర్ణ నీతిచంద్రిక/చిత్రాంగుని చేరిక
చిత్రాంగుని చేరిక
అనంతరము మంథరాదులు మువ్వురును హాయిగా గాలక్షేపము సేయుచుండిరి. ఇట్లుండగా నొకనాడు చిత్రాంగు డనెడి లేడి యొక వేటకానిచే దఱుమబడి యచటికి బరువెత్తుకొని వచ్చెను. అదిచూచి భయపడి మంథరుడు జలములో బ్రవేశించెను. మూషికము కలుగులోనికి బాఱిపోయెను. వాయసము చెట్టుమీది కెగిరి నలువైపులు చాలదూరము పరికించి భయమునకు గారణమేమియులేదని తెలిసికొని మంథర హిరణ్యకులకు దెలిపెను. మరల మువ్వురు గూడుకొనిరి. అపుడు వణకుచు నచటనున్న మృగముం జూచి మంథరుడు "నీ వెవడవు? ఏల యిచటికి బాఱి వచ్చితివి?" అని యడుగగా, "వేటకా డొకడు తఱుముచుండగా భయపడి తప్పించుకొని వచ్చి మీ శరణము జొచ్చితిని. మీ చెలిమి గోరుచుంటిని." అని యా హరిణము బదులు పలికెను.
అపుడు హిరణ్యకుడు "మిత్రమా! స్వాగతము. స్వేచ్ఛముగా మాతోబాటు స్వగృహమునందువలెనే సంచరింపుము" అని పలికి, యది యాహారపానీయములు దీసికొని నెమ్మదించిన తర్వాత "సఖుడా! నిర్జనమైన యీ వనమున నిన్నెవరు తఱుముకొని వచ్చిరి? వేటకాండ్రెవరైన నపుడపు డచట సంచరింతురా?" యని యడిగెను.
దానికి మృగ మిట్లు చెప్పెను. "కళింగదేశమున రుక్మాంగదు డనురాజు గలడు. ఆతడు దిగ్విజయమునుగోరి వచ్చి చంద్రభాగానదీతీరమున సేనలను విడియించెను. ప్రాత:కాలమున నాతడు కర్పూరసరస్సునొద్దకు రాగలడని వదంతి వినబడుచున్నది. ప్రాత:కాలమున నిక నిట నుండుట మంచిదిగాదు. ఏమిచేయదగునో యాలోచింపుడు."
లేడి మాటలు విని మంథరుడు భయపడి మఱియొక చెఱువునకు బోవుదు మని పలికెను. కాకియు, మృగమును "సరే" యనెను. వారి మాటలు విని హిరణ్యకుడు నవ్వి "మఱియొక జలాశయమునకు బోయినయెడల గుశల మని మంథరుడు చెప్పినది సత్యమే. కాని మెట్టదారి బయనము సేయుట ప్రమాదకరము గాదా? జలజంతువులకు నీరును,దుర్గనివాసులకు దుర్గమును, శ్వాపదాదులకు స్వస్థలమును, రాజునకు సన్మంత్రియు బలము గదా? దూరాలోచనలేని కార్యమునకు బూనుకొన్నయెడల బిమ్మట విచారింపవలసి వచ్చును. ఈ యర్థమును దెలుపు కథ యొకటి గలదు. వినిపించెదను. వినుడు" అని యిటు లా కథ చెప్పదొడగెను.