సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అమెరికను ఇండియనులు
అమెరికను ఇండియనులు :- కొలంబసు అమెరికాను కని పెట్టినప్పుడు, తాను ఆసియాలో నొక భాగమునుగాని, హిందూదేశమునుగాని చేరుకొనినట్లు విశ్వసించెను. కనుకనే 1493, ఫిబ్రవరిలో అతడు వ్రాసిన "లేఖలో ‘నాతో నున్న ఇండియనులు'అని వ్రాసియున్నాడు. ఈ విధముగా నూతన ప్రపంచమునందలి ఆదిమ నివాసులు 'ఇండియనులు' అనియు హిందూ దేశస్థులకంటె వీరు భిన్నులని తెలుపుటకై 'అమెరికను ఇండియనులు' అనియు పిలువబడుచుండిరి. 'అమెరికను ఇండియనులు' అను పదము పెద్దదిగా నుండుటచే ఒక ప్రసిద్ధ అమెరికా నిఘంటుకారుడు ‘అమెరిండ్సు' అను పదమును సూచించెను. కొందరు అమెరికా దేశస్థులును, ఐరోపాలోని మానవజాతిశాస్త్రజ్ఞులును, మధ్య అమెరికా, మెక్సికో, పెరూ మొదలగు దేశముల నాగరకతను నిర్మించిన ప్రజలను, ఇండియనులనుండి ఇప్పటికిని వేరు చేయు చున్నారు. మరికొందరు ఎస్కిమోలను భిన్న జాతివారినిగా భావించు చున్నారు, కాని, శారీరక, సాంస్కృతిక, భాషా విషయక దృష్టితో చూచినయెడల, అమెరికా దేశపు ఆదిమనివాసులను, వారి సన్నిహిత అనాగరక జాతులవారిని కలిపి, 'అమెరికాదేశపు ఇండియనులు' అను పేరుతో, పోవెలు, బ్రిస్టను అను వారు వ్యవహరించుట ఉచితముగా నే
కనబడుచున్నది. ఈ సన్నిహితజాతులను గురించి మన కేమియు విశేషాంశములు తెలియవు. భిన్నభిన్న జాతులుగా కనబడువారుకూడ వారిలో చేరిన అవాంతర శాఖలుగానే పరిగణింపబడవలెను. ఈ ఐక్యమే అమెరికను ఆదిమ ఇండియనుల చరిత్రకు సంబంధించిన మానవజాతి శాస్త్ర ముఖ్య సంఘటనము. ఇండియను జాతుల భాషా పరిశీలనము, పురావస్తు శేషములు, కళలు, పరిశ్రమలు, ఆటలు, సాంఘిక మత సంస్థలు, పౌరాణిక గాథలు, జానపద విజ్ఞానము మున్నగునవివారి మానసిక ఐక్యతనే చాటుచున్నవి. ఈ జాతులలో 'శారీరకములైన భేదములు కన్పించు చున్నను, అవి ప్రపంచమునందలి ఇతర గొప్ప జాతులలో కానిపించు భేదముల కంటే మించినవి కావు.
అమెరికను ఇండియనులు అనేకమయిన తెగలుగా విభజింపబడి యున్నారు. అలాస్కా యొక్క ఉత్తర పశ్చిమ ప్రాంతములను ఆక్రమించిన ఎస్కి మోలులను వారు వీరిలో ముఖ్యులు. 'ఏతిపాస్కన్సు' (Athepascans) అనువారు ఉత్తర కాలిఫోర్నియా, ఎరిజోనా, మెక్సికో ప్రాంతములను ఆక్రమించి యున్నారు.'ఇరాకీస్'(Iraquies) అను జాతివారితో సమ్మిశ్రితులైన 'ఆల్గోకీయన్' జాతివారు, సెంటు లారెనుసు భూములందును అంటారియో సరస్సునకు తూర్పుననున్న భాగమందును నివసించియున్నారు. ముస్కోజియన్ తెగవారు ఎప్లాచియను పర్వత ప్రాంతమునను అట్లాంటికు, మెక్సికో సింధుశాఖ, మిసిసిపి ప్రాంతములందును నివసించు చున్నారు. కడ్జోయను తెగవారు, సియోనులు, సొషోనియనులు లేక, ఉటో అజ్ టియనులు (Vio-Agteean), మాయనులు, అరవాకనులు, టుపియనులు, చిబిహానులు, క్వెచియనులు అను వివిధ జాతులవారు అమెరికాలోని వివిధ ప్రాంతము లందు నివసించియున్నారు. వీరు మంగోలియ౯ జాతీయులు. వీరు మధ్య ప్రమాణముగల పొడవును, గోదుమవన్నెగల శరీరములను, వెడల్పయిన ముక్కులను ముఖములను ఏటవాలు కండ్ల ను కలిగి యుండు మంగోలియా జాతికి జెందుదురు.
అమెరికను ఇండియనుల యొక్క కళలు వారు కనిపెట్టిన విషయములు తమ పరిసరముల యొక్క పరిమితికిని వైవిధ్యమునకును అనుగుణమైనవిగా నున్నవి. ఈ ఖండమును కనుగొనునాటికి, అచ్చటనున్న జనులు రాతియుగమునకు చెందిన వేటగాండ్రుగాను, చేపలు పట్టు వారుగాను, వ్యవసాయదారులుగాను ఉండిరి. వారిలో పెక్కుమంది కుండలు చేయుట కొంతవరకు ఎరిగినవారే. 'అల్ గోకియన్ ఎట్ చెమిన్స్' అనువారు అక్షరాల తేలిక పడవలను నడుపు మనుష్యులు. ఈ సందర్భమున సముద్రముపై తేలిక పడవలను నడుపుచు చేపలను పట్టుకొను 'అలాస్కా' తీరవాసులును, బ్రిటిష్ కొలంబియా వాసులును పేర్కొనదగినవారు. అమెరికను ఇండియనులలో ఎస్కిమోలు కుక్కలను, ఆల్గోకియనులు జారుడు బండ్లను భూమిపై బరువులను మోయుటకు ఉపయోగించెదరు. పెరూదేశస్థులు 'ఇల్మా' అను జంతువును సామానులను మోయుటకు మాత్రమే ఉపయోగించుదురు. సవారి చేయుటకు దానిని వారు వాడియుండలేదు. ఆనాటి ఇండియనులచే పెంచబడి మచ్చిక చేయబడిన గృహ జంతువులు కుక్క ఎల్మా అనునవే. ఆ ప్రజల యొక్క సాంఘిక మత జీవితములలో వాటిలో ఎక్కువ ప్రయోజన ముండెడిది. ఎల్మా అను జంతువు "పెరూ" "బొలీవియా" అను ప్రదేశములందు మాత్రమే పెంచ బడెడిది. 'నవాహో' అను వారి ప్రాథమిక పరిశ్రమలలో గొఱఱెలును, కొందరు దక్షిణ అమెరికను ఇండియనులు పరిశ్రమలలో ఆవులును,మైదానములయందలి ఇండియనులు పరిశ్రమలలో గుజ్జములును పేర్కొనదగినవి.
అమెరికను ఇండియనుల యొక్క పురాణ గాథలను మతమును గూర్చి "ముల్లరు', 'బ్రిస్ టన్', 'పోవెల్ అను వారు విపులముగా వ్రాసియున్నారు. వీరుడు, ప్రవక్త జ్ఞానప్రదాతయు అయిన ఒకానొక దివ్యపురుషుడు తన ముఖ్య క ర్తవ్యమును నెరవేర్చి, ఈప్రపంచమును వీడుట, తిరిగి భావి కాలమున వచ్చెదనని వాగ్దానము చేయుట, అను నంశములతో గూడిన వృత్తాంతము ఈ పురాణ గాథలలో అతి ప్రధాన మైనదిగా కనబడుచున్నది. ఆజిబ్వా, చెరోకు, 'అపచే అను ప్రదేశములకు చెందిన "భిషక్కు" (Medicinal men) యొక్క శక్తి మిక్కిలి గొప్పది. ఆ జనుల యొక్క తెగలను బట్టి ఈ భిషక్కుల ప్రాధాన్యము అప్రాధాన్యముగ మారుచుండును. కొన్ని తెగలలో ఈ భిషక్కునకు ఏవిధమైన ప్రాధాన్యము ఉండెడిది కాదు. మరికొన్ని తెగల యొక్క లౌకిక మత విషయములందు ఈ భిషక్కులే సర్వాధికారములు గలిగియుండిరి. ఈభిషక్కులకు గోప్యకూటములు, గోష్ఠి మందిరములు ఉండెడివి. వీటిలోనికి ప్రవేశమును గోరు ఆరంభకులు యథావిధిగా ప్రవేశ పెట్టబడుచుండిరి. కొన్ని తెగలయందు యౌవనదశ ప్రాప్తించినవారు చేయవలసిన కర్మ కలాపములను చేయించు నధికారము ఈ భిషక్కుల గుండెడిది. నొకప్పుడు వీరు వ్యవసాయ సందర్భమున వేగుచుక్కను (శుక్ర గ్రహమును) పూజించుచు, నరబలి చేయుచుండెడి వారు.
అమెరికను ఇండియనులలో ఆత్మను గురించియు, పరలోకములో దానికిగల భవిష్యత్తును గురించియు భిన్నాభిప్రాయము లుండెడివి. ఈ అభిప్రాయములకు అనుగుణముగానే వారి శవసంస్కారవిధులు కూడ ఏర్పాటు చేయబడి యుండెడివి. కొందరు శవములను పారవేసెడి వారు. కొందరు మిసిసిపి లోయయందు మట్టి దిబ్బలలో పూడ్చిపెట్టెడివారు. మరికొందరు 'పెరు' దేశములోవలె రాతిసమాధులలో పూడ్చిపెట్టెడివారు. 'కొచ్' (Koch) అని పిలువబడు దక్షిణ అమెరికను జనుల యొక్క ఆత్మవాదము, 'టోటెమ్' తెగవారియొక్క ధ్యానవాదము, 'జూనిన్' తెగవంటివారి ఫెటీషిజము, (Fetishism) 'కుషింగు' అను నాతనిచేత పరిశోధింపబడినవి.
అమెరికను ఇండియనుల విలక్షణమైన ఆటలలో పాచికలతో నాడబడు జూదము, హూపు, పోలు అను ఆటలును, సంయుక్త రాష్ట్రములలో నైరృతిభాగమునను, తూర్పుభాగమునను ప్రవర్తిల్లు బంతి ఆటలును పేర్కొన తగియున్నవి. జంటబంతులాట, నడకలో పందెములు, మంచుపాములు మొదలయిన ఆటలు స్త్రీ లాడుదురు.
అత్యున్నతమైన స్థానములను అలంకరించిన స్త్రీలు కొందరుండిరి. పరిపాలనా విధానములోను, శాంతిస్థాపనమునకై రాయబారములను నడుపుటయందును కొంతవరకు ఇవాక్వియోస్ అను స్త్రీలు పాల్గొనిరి. సుప్రసిద్ధులయిన నాయకురాండ్రుకూడ నుండిరి. దేశమాతలుగా భూషింపబడదగిన స్త్రీలుండిరి. మాయన్సులో మతాచార్యత్వమును వహించిన స్త్రీలుకలరు. స్పానియర్సుతో జరిగిన తిరుగుబాటులో కొందరు ఆ తెగలకు నాయకురాండ్రుగా వ్యవహరించిరి. ఉదా:- 'అమెరికన్ జోన్ అఫ్ ఆర్క్' అని పిలువబడు 'మేరియా సిండ్రిల్లా' అట్టి స్త్రీలలో సుప్రసిద్ధురాలు. బ్రెజిలునందలి కూటేనయా (Kootenaya) జాతివారి యొక్క సామాన్యమైన ప్రజా ప్రభుత్వము మొదలుకొని ప్రాచీన మెక్సికనుల యొక్కయు పెరూ ఇండియనులయొక్కయు సుపరిష్కృతమయిన రాష్ట్రీయ సంస్థలవరకుగల పరిపాలనా విధానములు అమెరికను ఇండియనుల యొక్కయు, వారి జాతీయ నిర్మాతల యొక్కయు ప్రభుత్వ పద్ధతిని అనుసరించెను. నాయకుల యొక్క అధికారములకుకూడ కొంత హద్దు ఉండెడిది. కొన్ని తెగలవారు శాశ్వత శాంతి నాయకుని, తాత్కాలిక యుద్ధ నాయకుని ప్రత్యేకముగ ఏర్పాటు చేసికొనుచుండిరి. సాధారణముగా నాయకులు ఆ తెగ నుండిగాని, లేక కొన్ని ప్రత్యేకమైన కుటుంబములనుండి గాని ఎన్నుకొనబడుచుండిరి. పెక్కు తెగలలో బానిసత్వము అమలులో నుండెడిది.
రా. ప్ర.
[[వర్గం:]]