సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అమృత షేర్గిల్

అమృత షేర్గిల్ (Amritha Shergil) :- అమృత షేర్గిలు బుడాపెస్టు నగరము (హంగరీ) లో క్రీ. శ.1930 సం. 30 తేది జన్మించెను. ఆమె తండ్రి పేరు ఉమ్రావ్ సింగ్, ఆతడు సిక్కు జాతీయుడు. తల్లి హంగేరియను నారీమణి. సహోదరి ఇందిర. ఉమ్రావ్ సింగు ప్రాకృతీచీవేదాంత విజ్ఞానఖని అగుటయేగాక, సంస్కృత భాషాపాండిత్యమును గూడ గడించెను. అతని భార్య కళాప్రవీణయై యుండెను. 1921 వ సంవత్సరము ఏప్రిల్ మాసములో భారత దేశమునకు ఈ కుటుంబము తరలి వచ్చెను.

సిమ్లాలో లేక గోరఖ్ పూర్ జిల్లాలోని సరాయా మొదలగు గ్రామములు వీరికి వంశానుక్రమముగ సంక్రమించిన జాగీర్లు. అచ్చటనే వీరి నివాసము. "అమృత" యొక్క బాల్యమంతయు యూరపుఖండములో నధికముగా గడచెను. ఆమె భారతదేశమునుండి విద్యాభ్యాసము కొరకై మొదట తల్లిచే ఫ్లోరెన్సు నగరమునకును, పిదప ప్యారిసు (Paris) నగరమునకును తీసికొనిపోబడెను.అప్పుడామె పందొమ్మిది సంవత్సరముల ప్రాయమును మాత్రమే కలిగియుండెను. అమృత షేర్గిల్ యొక్క చిత్ర కళాఖ్యానము నేషనల్ 'ఎకోల్ దిబూ' అను కళా కేంద్రములో జరిగెను. అచ్చటి ప్రొఫెస రొకడు ఆమె భవిష్యత్తు ఉజ్వలముగా నుండగలదని భావించి "నీవు నా శిష్యురాల వగుటకు .నే నెంత యో గర్వించుచున్నాను"అని చెప్పినట.

1933 సం. లో ఆమె వ్రాసినచిత్రము 'సంభాషణము' అనునది గొప్ప మన్ననల బడసి, ఆమెకు అమిత ప్రోత్సాహమును కలిగించెను. 'బూ ఆర్ట్సు'లో ఆమె ఆర్ద్ర భిత్తి చిత్రములు రచించుట నేర్చుకొనెను. మాతృ దేశమునకు మరలివచ్చిన పిదప అట్టిపనికి ఆమెకు అవకాశము లభించ లేదు. ఆమె రచించిన తైలవర్ణ చిత్రములలో భిత్తి చిత్రముల పోకడలు పొడచూపుచుండును. ప్యారిసు నగర ములో ఆమె ఉపయోగించిన ఆలేఖ్య పుస్తకములను (Sketch Books) తిలకించినచో అచట ఆమె కావించి యున్న చిత్రాఖ్యానమునందలి విశేష పరిశ్రమ తెల్ల మగును.

ఇట్లు ప్యారిస్ కు పిల్లగా వెళ్ళియున్న 'అమృత' చిత్ర కళయం దారితేరిన పడుచై భారతదేశమునకు 1934 సంవత్సరములో తిరిగివచ్చెను. ఇచ్చటికి రాక పూర్వము ప్యారిసునగరమందుగల భారతదేశ విషయకమైన ప్రచార ప్రభావమునుబట్టి ఆమె తన మాతృదేశమును తిలకింప నెంచి దానినిగురించియు, దాని సౌందర్యాతిశయమును గురించియు నానావిధములగు తియ్యని కలలు గాంచెడిది. కాని ఆమె భారతదేశమునకు తిరిగి వచ్చిన తరువాత ఇక్కడ ఆమెకు కనుపించిన దృశ్యములు నెత్తురులేని దేహాలు, సత్తువలేని జీవాలు. ఈ దృశ్యములే అమృత ఇచ్చట రచించిన చిత్రములలో ప్రస్ఫుటముగా ప్రతి బింబితము లయ్యెను. ఆమె జీవించియున్న కాలమందు ఆమె కళ యెంతమాత్రము మన్ననగాంచలేదు. పైగా నది అనేక విమర్శనలకును, పరిహాసములకును గురి యయ్యెను. వంగీయ కళావిమర్శకులు గూడ ఈమె శైలి పై దుమ్మెత్తి పోసిరి. ఐన నామె తన పట్టుదలను విడువక గట్టిగా తన శైలిలోనే చిత్రాలు చిత్రింపసాను. ఫ్రాన్సులో నున్నపుడు 'సిజాన్' 'గాగిన్' అను నిరుపురు ఆమెకు సమకాలికులు గాకున్నను వారి ప్రభావ మామె చిత్రములయందు ముద్రిత మయ్యెను.

షేర్ గిల్ 29 వ యేట డిసెంబరు 1941 లో మృతినొందెను. ఆమె మరణానంతరమే ఆమె చిత్రకళకు విమర్శకుల పొగడ్తలచే అధిక ప్రాశస్త్యము లభించెను. ఆమె కళ బొంబాయి మున్నగు ముఖ్యపట్టణాలలోని చిత్రకారుల ప్రశంసలకు పాత్రమయ్యెను. ఆమె భారత చిత్రకళారంగములో నొక ఉత్తమ నారీరత్నముగా వెలు గొందెను.

ఎల్లోరా అజంతా గుహల యొక్కయు, కొచ్చిన్ భిత్తి చిత్రముల యొక్కయు, తదితర ప్రాచీన భారత శిల్పముల యొక్కయు ప్రభావము షేర్ గిల్ చిత్రకళపై విశేషముగా ప్రసరించెనని కాథల్ ఖండల్వాలా అను నతడు ఆమె జీవితచరిత్రలో పేర్కొనియున్నాడు. ఆమె దాదాపు అన్ని చిత్రములను తైలవర్ణములలోనే తప్ప, టెంపరా మీడియంలో చిత్రించినట్లు తెలియుట లేదు. ఆమెయొక్క చిత్రములు వర్ణప్రాధాన్యముకలిగి ఒకానొక విధమయిన మాధుర్యమును వ్యక్తీకరించును. ఆమె వ్రాసిన అన్ని చిత్రాలలో ప్రధానముగా నామెకు ప్రఖ్యాతి తెచ్చినవి 30 చిత్రము లనవచ్చును. వాటిలో (1) విశ్రాంతి, (2) ఏనుగుల ఈత, (3) 'బ్రహ్మచారులు,(4) కథలు చెప్పుట, (5) పండ్ల నమ్మువారు, (6) ముగ్గురక్క చెల్లెండ్రు. నవవధ్వలంకరణము అనునవి ముఖ్యముగ పేర్కొనదగినవి. ఆకృతిలోని వివరములను కుంచిం చుటలో ఈమె గడించిన నేర్పు ఎన్నదగినది. అమృత షేర్ గిలు తన ప్రత్యేక శైలినిబట్టి భారత చిత్రకారశ్రేణిలో "అమృత"త్వము నొందియున్నదని ఆమెకుగల అఖండ ప్రఖ్యాతియే సాక్ష్య మిచ్చుచున్నది.

కొం.శే.

[[వర్గం:]]