సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అబిసీనియా (ఇథోపియా): చరిత్ర
అబిసీనియా (ఇథోపియా): చరిత్ర : తూర్పు ఆఫ్రికాలోని ఈ రాజ్యము ఎప్పుడు స్థాపింపబడ్డదో తెలిసికొనుటకు సరియైన ఆధారములు లేవు. కాని అచటి గాథలనుబట్టి నేటికిని అధికారములో ఉన్న రాజవంశము క్రీ. పూ. 1000 ప్రాంతము నాటిదనియు ఆ రాజవంశము వారు సాలమన్ రాజుకుమారుడైన మెనివెక్ యొక్కయు, షేబారాణి యొక్కయు వంశీయు అనియు చెప్పబడు చున్నది. షేబారాణి జ్యేష్ఠ పుత్రుడు ఈ రాజ్యమును సంపాదించినాడట ! "షేడా" అనగా ఇథోపియా అనియు, తన తల్లి పేరనే ఈ రాజ్యమునకు "ఇథోపియా" అని పేరు పెట్టినాడనియు వాడుక.
క్రీ. శ. మొదటి శతాబ్దమునాటికి ఇథోపియనులు 'పేగనులు' అనబడెడివారు. అనగా రకరకాలైన దేవతా పూజలను చేసెడివారని అర్థము. క్రీ. శ. నాల్గవ శతాబ్దములో ఇథోపియారాజు “కాపైక్” క్రైస్తవ మతమును స్వీకరించెను. కాపైక్ క్రైస్తవులు క్రైస్తవులం దొక తెగవారు. వీరెక్కువగా ఈజిప్టు, ఇథోపియా మున్నగు ఆఫ్రికా దేశములలోనే వ్యాపించి ఉండిరి. కాపైక్ చర్చికి సర్వాధికారి ఈజిప్టు రాజ్యములోని అలెగ్జాండ్రియాయం దుండువాడు. ఆరవ శతాబ్దములో ఇథోపియారాజు ఎఱ్ఱసముద్ర ప్రాంతమును స్వాధీన పరచుకొని ఆమార్గముగా అరేబియాపై దండయాత్ర సలిపి "యమన్" అనెడు సారవంతమైన రాష్ట్రమును జయించెను. నాటినుండి 50 ఏండ్లదనుక "యమన్" ఇథోపియా రాజ్యభాగముగా ఉండెను. ఈ కాలములోనే ఇథోపియా ప్రపంచములోని వివిధ దేశములతో సంబంధములు కలిగి అభివృద్ధి నొందెను.
క్రీ. శ. ఏడవ శతాబ్దములో మహమ్మదీయులు ప్రజలి ఈజిప్టును జయించిరి. ఎఱ్ఱసముద్ర తీరప్రాంతము వారి స్వాధీనమయ్యెను. ఇథోపియా తన పూర్వోన్నతిని కోల్పోయి ఏకాకియైనది. ఆతరువాత కొన్ని శతాబ్దముల వరకు ఇథోపియా కల్లోల పరిస్థితులలో నుండెను.
అది అంతఃకలహాలతో, విదేశీయుల దండయాత్రలతో విచ్ఛిన్నమయ్యెను. 16 వ శతాబ్దములో ఇథోపియారాజు మహమ్మదీయులనుండి తమ్ము రక్షింపుమని పోర్చుగల్రాజును కోరెను. కోరిన సహాయము లభించెను, ఇథొపియా మహమ్మదీయుల హస్తగతము కాకుండ రక్షింపబడెను. అదే కాలములో రోమన్ క్యాథలిక్కు ప్రచారకులు ఇథోపియాలో ప్రవేశించి ఇథోపియా రాజును క్యాథలిక్కు మతమును స్వీకరింపుమని బలవంతము చేసిరి. కాని ప్రజలు వారిని ప్రతిఘటించిరి. చివరకు కాపైక్ క్త్రెస్తవమే నిలిచిపోయెను. విదేశీయులందరు బహిష్కరింప బడిరి. అయినమ “జేమ్సు బ్రూస్" వంటి పరిశోధకులు ఇథోపియాకు వచ్చుచునే యుండిరి.
ఆపైని రెండు శతాబ్దముల దనుక దేశము అంతఃక లహములకు గురియయ్యెను. ఈ అంతర్యుధ్ధములవల్ల అనేక ప్రాచీనభవనములు నాశనమైనవి.
19 వ శతాబ్దములో కాసా' అను నొక సరదారు శత్రువులపై విజయముపొంది రెండవ థియోడోర్" అను బిరుదముతో రాజయ్యెను. క్రీ. శ. 1818-1868 మధ్య ఇథోపియా ఇతనికి స్వాధీనమయ్యెను. 2వ ధియోడోర్ ప్రాచీన ఇథోపియా సామ్రాజ్యమును పునరుద్ధరింప వలెనని ప్రయత్నము చేసెను. కాని విఫలుడయ్యెను. థియోడోర్ నిరంకుశుడు, అతనికి బ్రిటిష్ వారితో తగాదా వచ్చెను. 1864 లో ఇథోపియాలోని బ్రిటిష్ రాయగారిని, అతని అనుచరులను బంధించెను. 1867 లో బొంబాయినుండి రాబర్టు సేపియర్ ఆధిపత్యమున బ్రిటిష్ సైన్యము ఇథోపియా పైబడి రాజధానియైన మాగ్ధాలాడును 1868 లో స్వాధీనపరచు కొనెను. రెండవ థియోడోర్ ఆత్మహత్య చేసికొనెను, కొంత కాలమునకు బ్రిటిష్ సైన్యము దేశమును విడిచి పోయెను.
తరువాత టైగర్ రాష్ట్ర గవర్నరు ఇథోపియా రాజయ్యెను. కాని 'షోవా' రాష్ట్ర పాలకుడు ' మెనిలిక్ ' అనువాడు ఇటలీ సహాయముతో ఇథోపియాను ఆక్రమించుకొనెను. 1889 వరకు మెనిలిక్ కు ఇథోపియా అంతయు స్వాధీన మయ్యెను. ఇటలీకి మెనిలిక్ కు సహాయము చేయుటలో స్వార్థము లేకపోలేదు. మెనిలిక్ విజయము తరువాత ఇటలీవారు తాము ఇథోపియా (అప్పటికే అబిసీనియా అని పిలువబడు చుండెడిది అబిసీనియా అనునది అరబీ పదము) సంరక్షకులమని ఉద్ఘాటించిరి. దానితో మెనిలిక్ కు ఇటలీకిని వైరము ప్రాప్తించెను. 1895 లో ఇటాలియన్ సైన్యములు అబిసీనియా పై దాడిచేసెను. కాని అపజయమునే పొందెను. కొంతకాలము యుద్ధము జరిగిన తరువాత ఇటలీ అబిసీనియా స్వాతంత్య్రమును అంగీకరించెను. ఎఱ్ఱ సముద్ర తీరప్రాంతమును (నేడు ఎరిట్రియా అనబడు చున్నది) కోల్పోయెను.
మెనిలిక్ ప్రాన్స్, బ్రిటన్దేశాలతో స్నేహము చేసెను. ఇతని కాలములో అబిసీనియా అభివృద్ధి చెందెను. దేశములో రైలుమార్గము నిర్మింపబడెను. న్యాయశాస్త్రము రూపొందింప బడెను. మెనిలిక్ కు తర్వాత వచ్చిన 'లిజ్ యాస్' అనురాజు ఇస్లాంమత ప్రచారము చేయబూని తత్ఫలితముగా సింహాసనమును కోల్పోయెను. అతని అనంతరము మెనిలిక్ కుమార్తె 'జుడిత్ ' రాణి అయ్యెను. 'రాస్ తఫారిమాకొ నెవ్' అనునతడుసంరక్షకుడయ్యెను. దేశములో ఆధునిక జీవన పద్ధతిని ప్రవేశ పెట్టి అభ్యుదయమునకు రాస్ తఫారిమా కొనెన్ పాటుపడెను. 1928 లో ఇథోపియా నానాజాతి సమితి (League of Nations) లో సభ్యత్వమును పొందెను, జుడిత్ రాణి యొక్క మరణానంతరము 1930 లో మాకొనెన్ "హేలే సెలా షే" అను బిరుదముతో ఇథోపియా చక్రవర్తి యయ్యెను.
ఇటలీ సామ్రాజ్య తృష్ణ చేత అబిసీనియాను బెదరించ మొదలు పెట్టినది. 1934 లో ఎరిట్రియా వైవు ఎన్నో సరిహద్దు సంఘటనలు జరిగెను. అక్టోబరు 8, 1935 నాడు ఇటలీ అబిసీనియాపై దాడిచేసెను. బ్రిటిష్ వారు ఫ్రెంచి వారు చేసిన సంధి ప్రయత్నములు విఫలమయ్యెను. ఆధునిక యుద్ధ సాధనములతో, విమాన దాడులతో ఇటాలియను సేనలు అబిసీనియాను నాశనము చేసెను, అబిసీనియారాజు నానాజాతి సమితి సహాయమునుఅర్థించెను. కాని లాభము లేకపోయినది. మే 5, 1936 నాడు ఇటాలియన్ సైన్యములు ఇథోపియా రాజధాని యైన “ఆడిస్ అబాబా” లో ప్రవేశించెను. ఎరిట్రియాను, ఇటాలియన్ సోమాలి లాండును, ఇథోపియాను కలిపి "ఇటాలియన్ తూర్పు ఆఫ్రికా" అని పేరు పెట్టిరి.
ఇటాలియనులు వలస రాజ్యమును బలపరచిరి. అబిసీనియావారు గెరిల్లా యుద్దమును ప్రారంభించిరి.ఇటాలియనులు దేశములో రోడ్డులు నిర్మించి గెరిల్లా దళములను తరుముటకు ప్రారంభించిరి. 1938 లో " హే లే సెలా షే" బ్రిటనులో తలదాచుకొనెను. ఇంతలో రెండవ ప్రపంచ సంగ్రామము వచ్చెను. అబిసీనియా కూడ యుద్ధరంగమయ్యెను.అబిసీనియా రాజు 1941 లో బ్రిటిష్ వారి సహాయముతో స్వదేశము చేరుకొని ఇటాలియనులతో యుద్ధము సాగించెను. విజయము పొందెను. "హేలే నెలా షే" మరల అబిసీనియా చక్రవర్తి (మే 1941) యయ్యెను. తరువాత మిత్ర రాజ్యములతో చేరి జర్మనీ, ఇటలీ, జపాన్ దేశములపై అతడు యుద్ధమును ప్రకటించెను. యుద్ధానంతరము ఐక్య రాజ్య సమితి (U.N.O.) లో అబిసీనియా చేరిపోయెను, 1945 లో ఆసమితి ఛార్టరుపై సంతకము చేసిన 50 దేశాలలో అబిసీనియా కూడ ఒకటి.
అబిసీనియాలో విద్య ఆరోగ్యరక్షణము పరిశ్రమలు రవాణా సౌకర్యములు మున్నగువాటిని అభివృద్ధి చేయుటకై ఐక్యరాజ్య సమితి యందలి వివిధ శాఖలు, అమెరికా బ్రిటస్ దేశములు తోడ్పడుచున్నవి. దేశము అభివృద్ధి పొందుచున్నది.
డిసెంబరు 2, 1950 నాడు ఎరిట్రియా, అబిసీనియాలో చేరిపోవలెనని ఐక్యరాజ్య సమితి నిర్ణయించెను. ఆ నిర్ణయము ప్రకారము 1952 లో ఎరిట్రియా ఆంతరంగిక పరిపాలనలో సంపూర్ణ స్వపరిపాలనాధికారము గల. రాష్ట్రముగా అబిసీనియాలో అంతర్భాగమై పోయెను. ఎరిట్రియా ప్రతినిధులు అబిసీనియా పార్లమెంటు సభ్యులైరి.
ఉ. రా.
[[వర్గం:]]